సూర్యుడు పడమర దిక్కున ఎరుపు రంగులోకి మారుతూ, మెల్లమెల్లగా కిందికి జారుకుంటున్నాడు. అప్పుడు సమయం 6 గంటలు. 5, 6 ఇండ్లున్న ఆదివాసీ గ్రామం చేరుకున్నాం. నేను బాబాయ్‌, మమల్ని తీసుకొచ్చిన అన్నయ్య, మేము కలవాల్సిన వారి కోసం ఎదురు చూస్తున్నాం. ఫోన్‌లో మాట్లాడక, మెసేజ్‌ చూసుకోక సరిగ్గా 48 గంటలవుతోంది. వాచ్‌ ప్రతి గంటకు శబ్దం చేయగానే, నాకేదో మెసేజ్‌ వచ్చినట్లుగా నా చూపులు సైడ్‌ బ్యాగ్‌ వైపు వెళుతున్నాయి. తీరా వాచ్‌ సౌండ్‌ అని ఓ లుక్‌ వాచ్‌పైకేసా. నేనొచ్చే ముందు డిజిటల్‌ వాచ్‌ ఐతే అక్కడి ప్రదేశానికి అనుకూలమని మా పిన్ని కొనిచ్చింది. డిజిటల్‌ వాచ్‌ కాబట్టి తదేకంగా నొక్కుతూ లైట్‌ని ఆఫ్‌ చేస్తూ, ఆన్‌ చేస్తూ, పిన్నిని గుర్తు చేసుకుంటూ, ఓ ఇంటి ముందు మంచంపై నడుంవాల్చా. 

అటు ఇటు తిరిగే మహిళలు, పురుషులు, చిన్న పిల్లలు నాకేదో కొత్త లోకంలా అనిపిస్తుంది. మహిళలైతే జాకెట్‌ వేసుకోకుండా, చీరలో సగం ముక్కని ఎడమ చేయి కింది నుండి ఒక రౌండ్‌ తిప్పి, భుజంపై ముడి వేసారు. ముక్కుకు రెండు రంద్రాల మధ్యన ముక్కుపోగు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు తప్పనిసరిగా ఉంది. ఈ ముక్కుపోగు, ఈ చీర కట్టే విధానం పెద్దవాళ్లకే అనుకుంటే పోరపాటే. 7,8 సంవత్సరాల వయస్సు మొదలుకొని ముసలివాళ్ల వరకు ఇలాంటి వేషధారణే. పురుషులు కొందరు లుంగీలు, మరికొందరు (ముసలివారు) చిన్న గుడ్డ ముక్కతో గోచి పెట్టుకున్నారు. చొక్కలు మాత్రం మెజారిటీగా కనబడటం లేదు. ఇక మరీ చిన్న పిల్లల (పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు) విషయానికొస్తే వాళ్లకి బట్టలే వేయరట. 6 సంవత్సరాల వరకు అలాగే వుంటారట. ఆ పిల్లలు పెద్ద పెద్ద కడుపులతో, కాళ్లు, చేతులు బాగా సన్నగా ఉన్నాయి. వాళ్లను చూస్తుంటే చాలా బాదేసింది. మహిళలు కూడా చాలా బక్కగా మొహాలు పాలిపోయి ఉన్నారు. ఎందుకని? బయట టీవీలలో చూసినట్లుగా ఆదివాసీలు అంటే తలపై నెమలి ఈకలు పెట్టుకుని, చేతిలో ఒక కర్ర పట్టుకుని, సంకలో ఒక బుట్ట పెట్టుకొని ‘‘సోది చెబుతానమ్మ సోది’’ అంటూ తిరిగేవాళ్లనుకున్నా. కానీ ఆదివాసీ ప్రజలను ప్రత్యక్షంగా చూస్తే పైన చెప్పినదానికి పూర్తిగా విరుద్ధం. అలా ఆలోచిస్తూ వుండిపోయా.

 ‘‘ఏంటమ్మా ఆశ్చర్యంగా వుందా! వీళ్లు అలాగే వుంటారు. అక్కలు ఐతే రక్తహీనత సమస్య, పిల్లలు పౌష్టికాహార లోపం… ఇలా వివిధ రోగాలతో బాధపడుతుంటారు’’ అని మాతో వచ్చిన అన్నయ్య నేనడక్కుండానే నేను వాళ్లను గమనించిన తీరును చూసి ఆదివాసీ ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి చిన్న పాటి ఉపన్యాసమిచ్చాడు.

 ‘హాస్పిటల్‌ సౌకర్యం లేదా’ అని అడిగా.

‘‘ఊ… ఎందుకు లేదు, ఉంది. పేరుకు మాత్రం ఉంటుంది. అది బ్లాక్‌ పరిధిలో. కానీ డాక్టర్లు ఎవరు రారు. దళం వచ్చినప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని చెక్‌ చేసి, కావాల్సిన మెడిసిన్‌ ఇస్తుంటారు’’.

 ‘చనిపోయే మనిషిని సైతం బ్రతికించే సాంకేతిక పరిజ్ఞానం వున్న ఈ రోజుల్లో, కనీసం జ్వరం మాత్ర కూడా దొరకని ఈ ప్రజలను చూస్తుంటే ప్రభుత్వానికి వీరిపై ఎంతటి ప్రేమ ఉందో అర్థమవుతుంది. మరీ వీరు ఎక్కడో సమాజానికి దూరంగా లేరుకదన్నా…’

‘‘అవును లేరనే చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం దృష్టిలో దూరమేనమ్మా. ఎందుకంటే వీరిపై సర్కారు చూపించే ప్రేమ అలాంటిది. నిత్యం వీరు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో. గర్బిణీ స్త్రీల పరిస్థితి మరీ దారుణమమ్మా. ప్రసవ సమయంలో వీరి పాట్లు చెప్పలేనివి. కావడి కట్టుకుని కొన్ని మైళ్ల దూరం నడిచి వెళ్లాలి. మార్గమధ్యంలో జరగరాని అనర్థాలు జరిగితే తల్లి బిడ్డ ఎవరో ఒకరు మరణించడం లేదా ఇద్దరు మరణించడం ఖాయం. కానీ పార్టీ వచ్చాక ఈ తిప్పలు మెజారిటీగా తప్పాయనుకో. ఆదివాసీ ప్రజలకు ప్రభుత్వాలు మేము అంతా ఇంతా కేటాయిస్తున్నామని చెప్పే రాజకీయ నాయకుల మాటలు వారి నోటికే పరిమితం. ఒకవేళ మొక్కుబడిగా కేటాయించినప్పటికీ, ఆ బడ్జెట్‌ కాస్త అధికారులు, మధ్యవర్తులు, కాంట్రాక్టర్ల చేతులు తడుప్తాయే తప్ప, వారికి చేరడం గగనమే. బయటైతే మీకు తెలుసుకదమ్మా’’

‘అక్కడ కూడా పేదవాళ్లకు అంతే అన్న. బయటవుండే మల్టి నేషనల్‌ హాస్పిటళ్ల అభివృద్ధి రెండు కళ్లతో చూసినా తక్కువే. అయినా అక్కడి పేద ప్రజలకు ఈ హాస్పిటల్‌ సౌకర్యాలు అందని ద్రాక్షే. ఆ హాస్పిటళ్లలో ఉండే లక్షలకొద్ది ఫీజులు వీరు కట్టలేరు కదా. అవి రాజకీయ నాయకులకు, భూస్వాములకు, డబ్బున్న బడా బాబులకు మాత్రమే’.

“మన దేశంలో 100 శాతానికి 7 శాతం మాత్రమే ఉన్న ఆదివాసీ బిడ్డలకు ఈ బూర్జువా పాలకవర్గాలు చూపించే ప్రేమ ఎంత బూటకమో సుస్పష్టం. అయినా వీళ్ల జీవితం గురించి మనకున్న కొద్ది టైంలో చెప్పడం కష్టమమ్మా. మరొకసారి కలిసినప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. నేను ఊరి దాదాలతో మాట్లాడుతాను” అంటూ లేచెళ్లాడు. అన్న చెప్పిన విషయాలు ఆలోచిస్తూ కూర్చున్న. అప్పుడే ఇద్దరు వ్యక్తులు రన్నింగ్‌ అని అనలేను కానీ, చాలా స్పీడ్‌గా మేమున్న చోటుకు వచ్చారు. అప్పటివరకు న్యూస్‌పేపర్‌లో మునిగిపోయిన బాబాయికి ‘‘లాల్‌సలామ్‌ ఇక మనం వెళదాం’ అని చేయి కలిపారు. మాతో పాటు వచ్చిన అన్న మాకు లాల్‌సలామ్‌ చెప్పి సెలవుతీసుకున్నాడు. వచ్చిన వాళ్లతో ఓ పది అడుగులు వేసామో లేదో, బహుశా 30 మందికి పైగా వున్నారనుకుంటా. అందరూ ఆలీవ్‌గ్రీన్‌ యూనిఫాం, 4, 5 కిలోలకిట్లు, ఆ కిట్టుకి వేలాడుతూ 5 లీటర్ల ఖాళీ డబ్బ, చెప్పులు, కుడి చేతికి తుపాకీ, ఇవి కాకుండానే మళ్లీ తలపై ఒక మూట, ఓ చేతిలో కర్ర. ఈ సన్నివేశాన్ని చూస్తూంటే ఇదంతా కలా! నిజమా! అని నాకు నేనే ప్రశ్నించుకున్న.

ఈ రూపాలను ఎక్కడ చూసానబ్బా! అని ఆలోచిస్తే ‘రెడ్‌ ఆంట్స్‌ డ్రీమ్‌’ డాక్యుమెంటరీ ఫిలిమ్‌ గుర్తుకువచ్చింది. ఆ రోజు నేను నా స్నేహితురాలు ఆ డాక్యుమెంటరీ చూస్తూ, అందులో కిట్టుకు వేలాడుతున్న చెప్పులు, చెప్పుల మధ్యలో 5 లీటర్ల క్యాను, తలపై వంట సామాగ్రి ఇవన్నీ చూసి బాగా నవ్వుకున్నాం అని గుర్తు చేసుకునే లోపే ‘‘లాల్‌సలామ్‌ కామ్రేడ్‌’’ అని చేయి కలిపి పిడికిలి పైకెత్తుతున్నారు వాళ్లు. ఈ సన్నివేశాన్ని స్వయంగా అనుభవిస్తున్న నాకు ఏదో తెలియని శక్తి, ఒక కొత్త అనుభూతి, లోలోపల సంతోషం.

 నేను విప్లవకారులంటే ఎర్రబట్ట తలకు కట్టుకొని, మెడలో ఎర్రశాలువా, భుజంపై నల్లగొంగడి వేసుకొని కనిపించే గద్దర్‌, నక్సలైట్ల సినిమాల్లో ఆవేశంగా మాట్లాడే ఆర్‌ నారాయణమూర్తి, విజయశాంతి, రోజాలే అనుకున్నాను. కానీ వాస్తవ జీవితంలోకి వచ్చేసరికి, సినిమాల్లో చూసిన దానికి ఇక్కడ చూసే దానికి ఎలాంటి సంబంధం లేదు. సినిమా కొన్ని సన్నివేశాల కల్పిత కథ అని తేలిపోయింది. ఇక ఈ మావోయిస్టుల గురించి నేను వినడం గత రెండు సంవత్సరాల ముందే. మిత్రులు వీరి గురించి చెబుతుంటే చాలా ఆసక్తిగా వినేదాన్ని. మొదట్లో ‘అసలు నిజంగా ఈ జనరేషన్‌లో, ఇంత టెక్నాలజీ డెవలప్‌ అవుతున్న ఈ సమాజంలో, ఎవరికి వారు స్వార్థంగా బ్రతుకుతున్న ఈ రోజుల్లో, పీడిత ప్రజల కోసం పని చేసే వ్యక్తులున్నారా?’ అని చాలాసార్లు మిత్రులను ప్రశ్నించేదాన్ని. పెద్ద పెద్ద డౌట్స్‌ అడిగేదాన్ని. ఎన్నెన్నో సౌకర్యాలు వున్న పట్టణ జీవితంలో సమయానికి ఏదైనా అందకపోతే సతమతమవుతాం. అలాంటిది అడవిలో వారికి కనీస, నిత్యావసరాలు ఎలా తీర్చుకుంటారని ఒక్కొసారి రాత్రివేళ్లల్లో వీళ్లకు సంబంధించిన పుస్తకాలు చదివేటప్పుడు బాగా ఆలోచించేదాన్ని. వీరి గురించి ఇంకొంత వివరంగా తెలుస్తున్న క్రమంలో వీరిని, వీరి పనులను ఇష్టపడ్డాను. ఇక నాకు సన్నిహితంగా వుండే స్నేహితురాలు అవకాశం దొరికితే చాలు, ఇద్దరం కలిసామంటే ఆ రోజు రాత్రి నిద్ర బంద్‌. తెల్లవారే వరకు పార్టీ కబుర్లే. వీరి గురించి నా ప్రశ్నల వర్షానికి తాను నవ్వుతూ చాలా వివరంగా సమాధానమిచ్చేది.

తనతో అప్పుడప్పుడు అంటుండేదాన్ని, ‘మరి అంత మంచి పార్టీ కదా! ప్రజలకోసం పని చేసే ఇంత మంచి పార్టీలోకి మనం కూడా వెళితే ఎంత బాగుంటుందో కదా’.

 ‘‘నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయ్‌ డియర్‌! ‘విప్లవం అంటే విందు భోజనం కాదు’ తెలుసా! అక్కడి పరిస్థితులు తిండి, నడక, అనారోగ్యం, శతృవు వచ్చాడంటే ఎదుర్కోవడమో, బలం సరిపోనప్పుడు తప్పుకోవడమో ఏదైనా చాలా కష్టంతో కూడుకున్న పని సుమా! ఇక్కడ మనకు ఉస్మానియా యూనివర్సిటీలో వుండే టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌, తెలంగాణ ఉద్యమంలో ర్యాలీలు, రాస్తారోకోలు, బంద్‌లు, అరెస్టులు… ఈ విధంగా అనుకుంటున్నావేమో వీటికి పూర్తి భిన్నం. పార్టీ జీవితం అంటే ఎన్ని కష్టాలొచ్చినా వాటిని ఇష్టంగా మలుచుకొని ప్రజల కోసం జరిగే ఆ దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో ప్రాణ త్యాగానికి సిద్ధపడి, ప్రజావ్యతిరేక రాజ్యంపై మరింత కసితో ధైర్యంగా ముందడుగేయాలి. అందుకోసం ముందుగా మనం రాజకీయంగా ఎదగాలి. ముఖ్యంగా ఫస్ట్‌ మనం అధ్యయనంపై దృష్టి పెట్టాల్సి ఉంది, అని మంచి వివరణే ఇచ్చింది.

 తను చెప్పిన ప్రతిసారి పార్టీ విషయాల పట్ల నా ఆలోచనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నా దగ్గరున్న అమరుల కొద్దిపాటి పుస్తకాలు చదవడం, వారి త్యాగాలు మరింత స్పిరిట్‌నివ్వడం, లోలోపల ఏదో తెలియని ఘర్షణ ప్రారంభమైంది. మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తుంది. నా రూమ్‌లో రాసుకున్న గోడలపై కొటేషన్స్‌ ‘తనకోసం తాను బ్రతకడం మరణించడం, ఇతరులకోసం మరణించడం జీవించడం’ అని నా చిన్ననాటి స్నేహితుడన్న మాటలు, ఇక డోర్‌పై వున్న ‘చాకలి ఐలమ్మ, బెల్లిలలితల వారసత్యం’ అని నేను రాసుకున్న ఆ పోరాట వీరవనితల పేర్లు ఎందుకో నన్ను ప్రశ్నిస్తున్నట్లనిపిస్తున్నాయి.

 ఎంత కష్టంతో కూడుకున్నపనైనా సరే ముందు నేను వాళ్లను చూడాలి. వాళ్ల జీవిత అనుభవాలు తెలసుకోవాలి. అడవితో, ఆదివాసీ ప్రజలతో ముడిపడి వున్న వారి జీవితాలు దగ్గరగా వుండి అడగాలి అని నాలో నేనే తపన పడేదాన్ని. వారితో నడుస్తున్న క్రమంలో ఈ విషయాలన్నీ నా మనస్సులో మెదులుతూనే ఉన్నాయి.

 ఇప్పుడు ఆకలి కూడా అవుతుంది. ఉదయం బయలుదేరే ముందు 9 గంటల సమయంలో అన్నం తిన్నాం. వస్తున్న దారిలో మధ్యలో అల్పాహారం తీసుకున్నాం కానీ, అది అన్నానికి సరి కాదు కదా! సమయం కూడా 7 గంటలనుకుంటా. కొంత చీకటి కూడా పడింది .

 ‘‘ఏం కామ్రేడ్‌ పేరేంటి’’ అని ఆ 30 మందిలో ఉన్న ఒక సీనియర్‌ కామ్రేడ్‌ అడిగాడు. వెంటనే బాబాయ్‌ నా పేరు చెప్పాడు. నేను బయట నుండి వచ్చే క్రమంలోనే ప్రజల ప్రియతమ నాయకుడు, తెలంగాణ పోరాట ఉద్యమనేతను కాంగ్రెస్‌ ప్రభుత్వం పొట్టనబెట్టుకుంది. అతను అమరుడు కావడం వల్ల అతని పేరు పెట్టుకుంటే  బాగుంటుదని కామ్రేడ్స్‌ అన్నప్పుడు మీ ఇష్టం అన్నాను. అలా ఆ జననేత, పీడిత ప్రజల గురువు, కామ్రేడ్‌ …. పేరు నాకు ఖరారు అయ్యింది. ఈ క్రమంలో ఒక ఆదివాసీ గూడెం తారసపడింది .

మా ముందు నడుస్తున్న సీనియర్‌ కామ్రేడ్‌ ‘‘మనం అన్నం తిన్నాం కదా! మరి ఈ కామ్రేడ్స్‌కి ఈ గూడెంలో తినే ఏర్పాటు చేస్తే బాగుంటుంది’’ అన్నాడు.

అక్కడే ఓ గంట ఆగాం. ఆ ఏరియాలో పని చేసే లోకల్‌ కామ్రేడ్స్‌ అడగ్గానే ఒక ఇంటి అక్క రెండు గిన్నెల నిండా అన్నం పెట్టింది. మరొక దాంట్లో కూర తెచ్చింది. కూరలో చిక్కుడు కాయల మాదిరిగా కాయలున్నాయి. కానీ వాటినేమంటారో తెలియదు. వాటిని చారులో వేసారు. చారు చిక్కగా, చప్పగా వుంది. తినడం ప్రారంభించా. కానీ తినలేకపోతున్న.

‘‘ఇక్కడి ప్రజలు ఇలాగే తింటారు, వీరి తిండికి అలవాటు పడాలి మరి, ఇంకా మనం రెండు గంటలు నడవాలి, తినకపోతే నడవలేము’’ అని బాబాయ్‌ అన్నాడు. ఇంకేముంది బలవంతంగా నమలకుండా మింగేసా. హమ్మయ్య! గండం గడిచింది అనుకున్న. నడక ప్రారంభమైంది. చీకటిగా వుండటంతో నాకు, బాబాయ్‌కి కర్రలిచ్చారు. నేను నడవగలుగుతా వద్దన్నా (ముసలివాళ్లలా కర్రెందుకు అని మనస్సులో అనుకున్నా).

కానీ మా ముందున్న సీనియర్‌ కామ్రేడ్‌ ‘‘చీకట్లో ఇబ్బందవుతుంది, తెలియని టెర్రయిన్‌ కదా పట్టుకుంటే మంచిది” అన్నాడు. కర్రపట్టుకుని నడుస్తున్న. అయినప్పటికీ 2, 3 సార్లు పడిపోయా. ఈ క్రమంలో నన్ను గమనించిన బాబాయ్‌ ‘‘ముందు కర్ర వేసి, తర్వాత నీ అడుగెయ్యి, అప్పుడుకదా మనముందు గొయ్యిగానీ, అప్‌ అండ్‌ డౌన్స్‌గాని ఉంటే అర్థమవుతుంది” అని చెప్పాడు. అప్పుడర్థమైంది కర్ర విలువేమిటో. కర్ర ముందుకు వేస్తూ నడవడం వల్ల గొయ్యిఉన్నా, నడిచే దారి డౌన్‌లో వున్నా అందుకు కర్ర శరీర బరువును బాలెన్స్‌ చేస్తుందని ఆ రెండు గంటల్లో అనుభవం కొత్త జ్ఞానాన్ని నేర్పింది.

నేను కలవాల్సిన కామ్రేడ్‌ ఎవరా అని, నేనేమైనా ఊహించగలనా అని ఆలోచిస్తూ నడుస్తున్నా. అంతలోనే ఒక కొండపైన ఆగాం. విజిల్‌ మోగింది. నాకు వెంటనే మా స్కూల్‌ పి.టి మాస్టర్‌ గుర్తొచ్చాడు. ప్లేగ్రౌండ్‌లో అతని విజిల్‌ ఫాలో కాకపోతే ఇక ఆ రోజంతా గ్రౌండ్‌ నుండి పంపించేస్తాడు. ఇంకేముంది ఆ డ్రిల్‌ క్లాస్‌ నుండి మరుసటిరోజు డ్రిల్‌ క్లాస్‌ వరకు బయటికిపంపించబడిన విద్యార్థులందరం పి.టి సార్‌ను తిట్టుకునేవాళ్లం. ఈ స్కూల్‌ జ్ఞాపకంలో నుండి బయటపడే లోపే 10 మంది చొప్పున లైన్‌లో నిలబడటం, ఆ రాత్రికి వారికి చెప్పాల్సిన విషయాలు చెప్పడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఒక సీనియర్‌ మహిళా కామ్రేడ్‌ని చూపిస్తూ, ‘‘నీవు ఆ కామ్రేడ్‌ దగ్గర పడుకో కామ్రేడ్‌” అని నాకు ఆ దళ కమాండర్‌ చెప్పారు.

మెజారిటీ కోయ కామ్రేడ్స్‌ వున్నారు. మరి నాకు భాష రాదుగా. ఎలాగా అని నాలో నేనే తర్జన పడుతున్నా. ‘‘కామ్రేడ్‌ మనం పడుకునేది ఇక్కడే” అంటూ సమతలంగా వున్న ప్లేస్‌ దగ్గర చెట్టుకింద కిట్టు దించుకుంది.

 ‘హమయ్య బతికిపోయా, తెలుగు స్పష్టంగా మాట్లాడుతోంది’ అని మనస్సులో సంతోషపడ్డా. పాలిథిన్‌ కవర్‌ పరిచి ‘‘పడుకో కామ్రేడ్‌” అంది. నాకు ఆ పాలిథిన్‌ కవర్‌ చూడగానే మా ఊరికి వేసవి సెలవు దినాలలో ఇత్తడి బిందెలు తయారీ, అల్యూమినియంతో దేవుళ్లు విగ్రహాలు తయారు చేయడానికి ఓ 5, 6 కుంటుబాలవాళ్లు వచ్చి ఇలాంటి పాలిథిన్‌ కవర్‌తోనే నెల రోజుల వరకు స్కూల్‌ గ్రౌండ్‌లోనే డేరా వేసేవాళ్లు, వీరేకాకుండా సర్కస్‌ చేయడానికి వచ్చేవారు కూడా, వారి నివాసం కోసం ఇలాంటి పాలిథిన్‌ కవర్‌నే ఉపయోగించేవారు. అప్పట్లో నాది ప్రైమరీ స్కూల్‌ జీవితం.

 ‘అసలు సర్కస్‌వాళ్లు, బిందెలవాళ్లు సెలవుల్లో ఎందుకు తాతా మన ఊరొస్తారు? వాళ్ల దగ్గర వుండే పిల్లలు కూడా ఎందుకు మాతో స్కూల్‌కు రారు, ఉదయాన్నే అందరింటికీ ఎందుకు అన్నం కోసం తిరుగుతారు? మమ్మల్ని ఎందుకు అలా పంపించవు?’ అని ఒకసారి తాతని అడిగాను.

తాత నవ్వుతూ ‘‘వాళ్లకు అన్నం వుండదు కాబట్టి అడుక్కుంటారు. వాళ్ల పిల్లలు చదువుకుంటే పనికి ఇబ్బందని వాళ్లు పంపరు. వాళ్ల బతుకుదెరువే బిందెలు చేయడం, సర్కస్‌ చేయడం. అలా అన్ని ఊర్లు తిరుగుతూ బతుకుతారు” అని జవాబిచ్చాడు.

 వాళ్ల జీవితాల గురించి పెద్ద చరిత్రే చెప్పేవాడు కానీ అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు. నేను ప్రజా రాజకీయాలకు దగ్గరైన తర్వాత నా దృష్టి కోణమే మారింది. పట్టణంలో అనేకరకాల జీవితాలను కళ్లారా చూసి, అర్థం చేసుకునే అవకాశం దొరికింది. బస్టాండ్‌ పక్కన, ఒ.యు క్యాంపస్‌ వెనకాల, రైల్వే బ్రిడ్జిల కింద అనేక బస్తీలలో పాలిథిన్‌ కవర్లతో వివిధ తెలంగాణ జిల్లాల నుండి (పాలమూరు, మెదక్‌, వరంగల్‌, నిజామాబాద్‌) వలస వచ్చినవారు నివాసముంటారు.  2013లో మున్సిపల్‌ అధికారులు వీళ్ళు ఉండే స్థలాలను అకస్మాత్తుగా ఖాళీ చేయమని పెద్ద మొత్తంలో పోలీసు బలగాలతో అక్కడి ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేసారు. వీరి గురించి తెలుసుకున్న ఒక ఫ్రంట్‌ (సమాఖ్య) వివిధ విద్యార్థి, ప్రజా సంఘాలతో కలిసి వారి కోసం పెద్ద పోరాటమే చేసారు. దానిలో విద్యార్థి సంఘం నుండి నేను కూడా పాల్గొన్నాను. ఈ విషయాలన్ని నా బుర్రలో సినిమా స్క్రిప్ట్‌లా సాగిపోతుంటే నేను మెల్లగా నిద్రలోకి జారుకున్నాను.

సడెన్‌గా మెలుకువొచ్చింది. చూస్తే సమయం ఒంటిగంటన్నర అవుతోంది.  ఆకాశంలో నక్షత్రాలు మాత్రం మెరుస్తున్నాయి. ‘ఇదేంటబ్బా! నేను హస్టల్లో గ్రౌండ్‌ హాల్లో పడుకున్నానా?’ అనుకుని పక్కకు తిరిగి చూస్తే చీకటితో కూడిన అడవి, ఏమి కనిపించడం లేదు. ఆలీవ్‌ గ్రీన్‌ డ్రస్‌లో పక్కనే సీనియర్‌ మహిళా కామ్రేడ్‌, చుట్టుపక్కలంతా చెట్లు, ఇంకొంత తేరుకొని చూసా. 7, 8 అడుగుల దూరంలో పాలిథిన్‌ కవర్లో నిద్రిస్తున్న మిగతా కామ్రేడ్స్‌. వెంటనే ‘బాబాయ్‌ ఎక్కడ?’ అని నా పక్కన కామ్రేడ్‌ని అడిగా.

 ‘‘తను పక్కనే వేరే కామ్రేడ్‌ దగ్గర పడుకున్నాడు. ఏ.. ఏమైనా కావాలా? తనతో మాట్లాడాలంటే ఉదయం మాట్లాడొచ్చు, ఇప్పుడు పడుకో’’ అని తాను పడుకుంది. నాకు మాత్రం నిద్ర రావడంలేదు. నక్షత్రాల వెలుతురు తప్ప అడివంతా చీకటి. బయటైతే తలపైకెత్తి ఆకాశం చూసే ఆలోచనే ఉండదు. సినిమాల్లో, నవలల్లో తప్ప. ఇక సిటి స్ట్రీట్‌లైట్స్‌ వెలుతురికి నక్షత్రాలే కనబడవు. అక్కడంతా 24 గంటలు వెలుగులో ఉండి చివరకు నేను పడుకునేటప్పుడు కూడా లైట్‌ వేసుకొనే పడుకునేదాన్ని. నా రూమ్‌మేట్స్‌కు నా అలవాటు నచ్చేది కాదు. ‘నాకు చీకటంటే భయం నన్ను అర్థం చేసుకొండి ప్లీజ్‌!’ అని  ఎన్నిసార్లు బ్రతిమాలేదాన్నో. నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక, నేను పడుకున్నాక ఆఫ్‌ చేసి పడుకునేవాళ్లు.

ఇంకా సంఘం మీటింగులు, తెలంగాణ మీటింగులు, తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు … ఇలాంటి సందర్భాల్లో హాస్టల్‌కి చేరుకునేసరికి రాత్రి 11, 12 అయ్యేది. అయినా భయం లేకపోయేది. ఎందుకంటే నగరమంతా లైట్లతో పట్టపగలులాగే ఉండేది. అలా సిటీలో ఏ టైంలోనైనా బయటకెళ్లేవాళ్లం. తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్ని సందర్భాల్లో పోస్టర్లు వేయడానికీ, జిల్లా, రాష్ట్ర స్థాయి సభల సందర్భాల్లో రాత్రి 1, 2 గంటల సమయంలో సైతం పట్టణంలోని ముఖ్యమైన కూడలిలలో వాల్‌రౖౖెటింగ్స్‌ రాసి, పోస్టర్స్‌ అతికించి, హస్టల్‌కి ఏ తెల్లవారుజామునో వెళ్లేవాళ్లం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నాకు చీకటంటే భయం అని చెప్పడానికే.

భయం మాత్రం తగ్గలేదు. సమయం గడుస్తున్న కొద్దీ భయం రెట్టింపవుతోంది. ఏం చేయాలి? అని ఆలోచిస్తూ కూర్చుండిపోయా. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్‌ లైఫ్‌లో నాన్నమ్మను కౌగలించుకొని కాళ్లేసి మరి పడుకునేదాన్ని. నాన్నమ్మకు నేనంటే ప్రాణం. తనంటే నాకు కూడా అంతే. కానీ పెద్దయ్యాక నా అలవాట్లు మారిపోయాయి. అందులో హాస్టల్‌ జీవితం. ఒంటరిగా పడుకోవడం అలవాటైంది. రూమ్‌లో అయితే నా కాట్‌కి, నా మిత్రుల కాట్స్‌కి మధ్య కొంతదూరం ఉండేది. ఎవరిని టచ్‌ చేసే దాన్ని కాదు. అలాంటిది మరి ఇప్పుడెందుకు భయం వేస్తుంది? ఈ కామ్రేడ్‌ని గట్టిగా పట్టుకుని పడుకోవాలి అనిపిస్తుంది. కానీ తను ఏమనుకుంటుదో అని సందేహం.

 ఇక ఆలోచనలన్నీ నిన్నటి వరకున్న ప్రపంచంలోకి వెళ్లాయి. హాస్టల్‌ రూమ్‌, రూమ్మేట్స్‌, సంఘం మిత్రులు… ఆ తర్వాత ఇంటివాళ్లు గుర్తొచ్చారు. అమ్మ, నాన్న, నాన్నమ్మ, అక్కలు, చెల్లెలు. అందులో నేను ఇంటివాళ్లందరూ పెళ్లికి ఒప్పించినా ఒప్పుకోకుండా, చెల్లిని పెళ్లికి ఒప్పించి, పెళ్లి పూర్తయ్యాక నా దారి నేను చూసుకోవడం…తప్పు చేసానా? లేదు సరైన నిర్ణయమే తీసుకున్న, కానీ నా నిర్ణయాన్ని ఇంటివాళ్లకు చెప్పకపోవడమే తప్పు. సమాజాన్ని మార్చే కృషిలో నా వంతు పాత్ర నిర్వహించాలని అనుకోవడం సరైందేనని నాకు నేను సర్ది చెప్పుకున్న. కానీ కన్నీళ్లు ఆగడం లేదు. అన్నింటికన్న చెల్లి పెళ్లి చాలా బాధకు గురి చేసింది. ఎందుకుంటే తను నన్ను ప్రశ్నించిన మాటలు, నేను తనను బుజ్జగించిన విధానం… ‘ఇన్ని రోజులు వెయిట్‌ చేసాగా చిన్నా! మొదట ఉద్యోగం, తర్వాత పెళ్లి. వేసవి సెలవుల్లో కచ్చితంగా చేసుకుంటా, ఒక 6 నెలల సమయం ఇవ్వండి. అర్థం చేసుకోవా ప్లీజ్‌ చిన్నా! ఇద్దరి పెళ్లికి పెద్ద గ్యాప్‌ ఏమి ఉండదు. అయినా నీవు చేసుకోబోయే వ్యక్తి మంచివాడు. తెలిసిన సంబంధం, ఎవరో తెలియని వాళ్లను చేసుకుంటే వాళ్లు ఎలాంటి వాళ్లో తెలియదు. ఈ రోజుల్లో మంచి వాళ్లమని చెప్పి, పెళ్లి తర్వాత మోసం చేసేవాళ్లు లెక్కలేనంత మంది. ప్రత్యేకంగా నా మిత్రుల పెళ్లిలలో, కాలేజ్‌ విద్యార్థులలో, మా సంఘం దగ్గరకు వచ్చే మహిళల సమస్యల కేసులలో ఎన్నో చూసాను. పైగా పెళ్లి తర్వాత మనమనుకున్నట్లుగా చదివిస్తానంటున్నాడు. ఉద్యోగం  చేయడానికి అభ్యంతరం లేదంటున్నాడు. మన కల కూడా అదే కదా! ఈ విషయం స్వయంగా బావను నేనే అడిగాను. మాట తప్పనన్నాడు. ఆ నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఈ సంబంధం అన్ని విధాల మంచిది’ అని నచ్చ చెప్పా. అప్పుడుగానీ చెల్లి ఒప్పుకోలేదు. నా పెళ్లి విషయానికొస్తే ఇప్పట్లో నెను పెళ్లి ఎలాగు చేసుకోను. కాబట్టి చెల్లి పెళ్లిలో చివరిసారిగా నేను ఎంతో ప్రేమించే  నా ప్రాణ స్నేహితులను, బంధువులను అందరిని కళ్లారా చూసుకోవాలనుకున్న. అనుకున్న విధంగానే అందరిని ఒప్పించి, చెల్లి పెళ్లిలో అందరిని చూసుకునే మంచి అవకాశాన్ని తనివి తీరా ఆస్వాదించాను. ఈ జ్ఞాపకాలతో భయాన్ని మర్చిపోయా. సడన్‌గా మెడికింద  చల్లగా తగిలినట్లనిపించింది. చేత్తో తడిమి చూస్తే కన్నీళ్లు.

అందరూ లేచి బ్రష్‌ చేస్తున్నారు. నా పక్క కామ్రేడ్‌ లేచి ‘‘కామ్రేడ్‌ నీళ్లు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇదిగో ఈ నీళ్లతో బ్రష్‌ చేయి’’ అని కరెక్ట్‌గా ఒక అరలీటర్‌ వుంటాయనుకుంటా, మగ్గులో నీళ్లు పోసింది. ‘అబ్బా ఈ ఇన్‌స్ట్రక్సన్స్‌ ఏంటీ?’ అని కోపమెచ్చింది. కానీ కోపాన్ని ఏ  మాత్రం బయటకు రానివ్వలేదు. మొత్తంగా ఇలా మొదటి రోజు తెల్లవారింది. సమయం 5:30ని॥లు అవుతుంది.

‘‘దొడ్లోకి వెళ్లాలి ఈ జిల్లీలో నీళ్ళు పోసుకో’’ అని వన్‌లీటర్‌ సన్‌ప్లవర్‌ ఆయిల్‌ కవర్‌ చేతికిచ్చింది. ఇదేంటీ? ఆయిల్‌ కవర్‌లో పోసుకోవడమా! నవ్వొచ్చింది. నవ్వుతూనే దొడ్లోకి బయలుదేరా. వెదురు వనంలాగా ఎటు చూసిన పచ్చని వెదురు చెట్లు. మిగతావి మెజారిటీగా నాకు తెలియని చెట్లే ఎక్కువ. ఈ చెట్లు బయట ఎప్పుడు కనబడలేదు.‘‘ఈ చెట్టు పేరు ఏంటీ? ఈ చెట్టు పేరు ఏంటి?’’ అని నాతో వచ్చిన వాళ్లు అడుగుతుంటే తెలియదు అని మాత్రం చెప్పగలిగా. మళ్లీ విజిల్‌ మోగింది. చక చక అందరు ఎవరి లైన్‌లో వాళ్లు నిలబడిపోయారు. ఆ రోజుకు సంబంధించిన విషయాలు రాత్రిలాగే చర్చించారు.

‘‘ఇలా రోజు చేస్తారా?’ అని అడిగా నా పక్కనున్న మహిళా కామ్రేడ్స్‌ని. ‘‘ఊ… రోజు చేస్తారు, దీనిని రోల్‌కాల్‌ అంటారు’’ అంది. ఈ పదం వినక 8 సంవత్సరాలు కావస్తుంది. ఈ మధ్య ఫోన్‌ కాల్‌, రాంగ్‌ కాల్‌, మిస్‌ కాల్‌ మాత్రం తప్పనిసరి. కాలేజ్‌డేస్‌లో, ఎన్‌.సి.సి గ్రౌండ్‌లో రోల్‌కాల్‌ చేసి డ్రిల్‌ చేపించేవాడు ఎన్‌.సి.సి మాస్టర్‌. ఏ మాత్రం ఆలస్యమైనా ఊరుకునేవాడుకాదు. అదే అదును చూసుకుని మేము పరార్‌ అయ్యేవాళ్లం. అయినా వదలకపోయేవాడు. ముందురోజు మిస్సైన డ్రిల్స్‌ అన్ని మరుసటిరోజు చేయించేవాడు. ‘‘అయినా ఈ పి.టి మాస్టర్‌లకి, ఎన్‌.సి.సి మాస్టర్‌లకి టైం చూడడం తప్ప ఇంకేం పనుండదా?’’ అంటూ అందరం పళ్లు కొరికేవాళ్లం. ఎస్‌.సి.సి గ్రౌండ్‌లోనుండి తేరుకుని నా పక్కనున్న కామ్రేడ్‌ని మళ్లీ అడిగా.

‘‘ రాత్రి అందరూ పడుకున్నాక ఒక కామ్రేడ్‌ మాత్రం చెట్టు దగ్గరే నిలబడివున్నాడు. ఎందుకు?’ అని అడిగా. తను నవ్వి ‘‘అతను సెంట్రీ చేస్తున్నాడు. మనందరికీ రక్షణ సెంట్రీ. ఉదయం 6 గంటల వరకు గంటన్నర చొప్పున్న ఒక్కొక్కరు చేస్తారు’’ అని వివరించింది.

‘‘ఓహో బయట అపార్ట్‌మెంట్స్‌, హాస్టల్స్‌, షాపింగ్‌మాల్స్‌, బ్యాంకులు, ఎ.టి.ఎమ్‌లు… (క్యాంపస్‌లో ఐతే ఎల్‌.హెచ్‌లో 15 మంది వరకు ఎప్పుడు హాస్టల్‌ చుట్టూ రౌండ్స్‌ వేస్తుంటారు), అయితే అక్కడ తిరుగుతూ చేస్తారు, ఇక్కడ నిలబడి చేస్తారు, అది తేడా‘‘ నేను అన్న మాటలు  తనకేమి అర్థం కాలేదు. నాలో ఇంకా సగం డౌట్‌ మిగిలిపోయింది.

 ‘‘మరి అతను బయటిలా కాకుండా చెట్టు వెనకాల ఎందుకు నిలబడ్డట్టు? అని’.

తను నవ్వి ‘‘శతృవు మన డేరా సమీపంలోకి వచ్చినప్పుడు, మనం వాడికి కనిపించకుండా దెబ్బతీయాలి. చెట్టును మనం ఆధారంగా చేసుకుని ఫైర్‌ చేయాలి’’ అంది. అప్పుడు వెలిగింది నాకు బల్బు. వెంటనే నా స్నేహితురాలు గుర్తొచ్చింది. ఎందుకంటే అడవి జీవితం గురించి ముందుగా పరిచయం చేసింది తనే కాబట్టి. ఒకానొక సందర్భంలో సెంట్రీ గురించి కూడా చెప్పింది.

నా కళ్లు ఇప్పుడు బాబాయ్‌ని వెతుకుతున్నాయి. నేను కలవాల్సిన వాళ్లు, నా గురించి మాట్లాడి నేనేంటో తెలుసుకొని, నేను చేసే పని గురించి చెప్పేవారు ఒకరైతే, నేను చేసే పని నేర్పించేవారు మరొకరు. నాకు పని నేర్పించే కామ్రేడ్‌ నా వయస్సే. ‘‘చాలా ఫ్రీగా వుంటుంది’’ అని నా సహచరి చెప్పింది. ఈ విషయాలు ఆలోచిస్తూ బాబాయ్‌ దగ్గరకు వెళ్లాను.

‘‘విజిల్‌ వేసారు కదా! అది టీ, టిఫిన్‌ కోసం, తిన్నాక మాట్లాడుకుందాం’’ అన్నాడు. బాబాయ్‌ నోటినుండి ‘టీ’ అని వినపడేసరికి చాలా హ్యాపీగా ఫీలయ్యా. బయటిలాగా పాల పాకెట్‌లు కాకపోవచ్చు. సహజంగా పశువుల నుండి పితికే పాలతో చేస్తారేమో. ఎందుకంటే ఇక్కడ ప్రజలు వ్యవసాయం చేస్తుండొచ్చు. పశువులు కూడా కనపడ్డాయి కాబట్టి, పార్టీకి ప్రజలు స్వచ్ఛమైన పాలే ఇస్తారని ఊహించా. కానీ నా ఊహకు భిన్నంగా సమాధానం వచ్చింది. అసలు పశువుల నుండి పాలే పితకరట. అలా పితకడం నేరంగా భావిస్తారట. పైగా దాని పిల్ల పశువుకు తిండి ఇబ్బందవుతుందనీ, అలా పాలు తీసి తాగడం పాపంగా భావిస్తారట. ఇక్కడి ప్రజలు పశువుల పట్ల ప్రేమను కలిగి వుంటారని కిచెన్‌ దగ్గర ఒక సీనియర్‌ కామ్రేడ్‌ చెప్పాడు. ఎందుకో ఈ మాటలు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. ‘ఆదివాసీ ప్రజలు అడవిని ప్రేమిస్తారనీ, చెట్టు, పుట్టను ఆరాదిస్తారనీ, పాలు పితకడం నేరంగా భావిస్తారని’ ఏదో పుస్తకంలో చదివా. నా చిన్నతనంలో మా తాతని నేనడిగిన ప్రశ్న గుర్తొచ్చింది.

 ‘తాత నీకు చాయ్‌ ఎలా అలవాటు అయ్యింది’

 ‘‘నేను అత్తను పండగకి తీసుకురావడానికి వెళ్లినప్పుడు, మార్కెట్‌కి కూరగాయలు అమ్మడానికి వెళ్లినప్పుడు, బ్యాంకుకు వెళ్లినప్పుడు బస్టాండ్‌లలో తాగేవాడిని. అప్పట్లో తెల్లదొరలు (బ్రిటీష్‌వాళ్లు) ఉచితంగా టీని పబ్లిక్‌ స్థలాలలో కాచీ పోసేవాళ్ళు. ఆ తర్వాత కాఫీ బిళ్ల్లలు దుకాణాల్లో అమ్మేవాళ్లు. వాటిని కొనుక్కొని తాగడం అలవాటయ్యింది’ అని అలా అప్పుడున్న పశువులన్ని ఇప్పుడు కనుమరుగయ్యాయనీ, పాలు కరువయ్యాయని తన బాధనంతా చెప్పాడు తాత. ఆ ధ్యాసలో నుండి ‘‘ఇక్కడ మనవాళ్లు మిల్క్‌ పౌడర్‌ వాడతారు’’ అని బాబాయ్‌ అన్న మాటకు తేరుకున్నాను.

మిల్క్‌పౌడర్‌ అంటేనే ఇరిటేషన్‌, కాని చిన్నప్పుడు పిన్ని తమ్ముడికి తెచ్చే మిల్క్‌ పౌడర్‌ని చెల్లెళ్లతో కలిసి దొంగతనంగా తినేవాళ్లం. అలా తినడమే కానీ, టీ చేస్తే తాగే అలవాటే లేదు. ఎందుకంటే ఇంటిదగ్గర అయితే బర్రెపాలు, హాస్టల్‌ల్లో అయితే ఎప్పుడు పాలపాకెట్స్‌ తెచ్చేవాళ్లు. పౌడర్‌ అలవాటు లేకపోవడం వల్ల దానిపై అయిష్టత ఏర్పడిరది. కానీ ఇక్కడ పెట్టిన చాయ్‌ మాత్రం నా కస్సలు పౌడర్‌లా అనిపించలేదు. ఆ ఫీలింగే రాలేదు. చాలా రుచిగా, మంచి రంగుతో ఉంది. ఇవ్వడం కూడా ఎక్కువే ఇచ్చారు కాబట్టి సంతోషంగా తాగేసా. అప్పుడనిపించింది నాకు బయట దొరకాల్సినవి ఏవి దొరకకపోయినా నా ప్రియనేస్తం చాయ్‌ మాత్రం దొరుకుతుందని. తరచు నా మిత్రులు ‘‘టీ ప్రియురాలు’’ అనే మాట గుర్తొచ్చింది. మరీ బయట రోజుకి ఎన్ని టీలు తాగేవాళ్లమో లెక్కేలేదు. ఫ్రెండ్స్‌ కలిస్తే టీ, కాలేజ్‌ క్యాంటిన్‌ కనబడితే టీ, మీటింగ్‌కి వెళితే టీ, ఇలా తెలంగాణ ఉద్యమంలో టీలకు లెక్కేలేదు. చివరికి అరెస్ట్‌ అయితే కూడా పోలీస్టేషన్‌లో ఫస్ట్‌ టీనే తెప్పించుకునేవాళ్లం. ఇక హాస్టల్‌ రూమ్‌లలోనైతే చెప్పనవసరం లేదు. ఎగ్జామ్స్‌ వుంటే వ్యసనపరులమే. సంఘం మీటింగ్‌లు జరిగితే తప్పనిసరి అందుబాటులో మిల్క్‌పాకెట్‌ లేకపోతే లెమన్‌టీ ఐనా చేసుకోవాల్సిందే. ఇలా ‘టీ’ నా జనజీవనంలో పెద్ద పాత్రే పోషించింది.

“అదిగో ఆ సీనియర్‌ కామ్రేడ్‌ నీతో మాట్లాడతాడు” అన్నాడు బాబాయ్‌. వెను దిరిగి చూసా. ఓహో మా సహచరి చెప్పింది ఈ కామ్రేడేనన్నమాట. కాకపోతే ఇంత సీనియర్‌ అని ఊహించలేదు. బహుశ 30, 35 యేళ్లు ఉండొచ్చనుకున్న. కానీ ఆ కామ్రేడ్‌ని చూస్తుంటే అచ్చంగా మా తాత గుర్తొచ్చాడు. మా తాత అదే వయస్సులో వుంటాడు. పార్టీలో ఇంత వయసు వాళ్లు కూడా ఉంటారా? అసలే ఇక్కడ నిరంతరం నడకలు. పైగా ఈ వయస్సులో బయటైతే ‘కృష్ణా రామ’ అంటూ ఎంచక్కా తమ మనవలతో, మనవరాళ్లతో గడుపుతారు. వాళ్లతో పోల్చుకుంటే ఈ సీనియర్‌ కామ్రేడ్‌ ఎంత గ్రేటో. ఈ వయస్సులో కూడా ప్రజలకోసం పని చేయలనే వీరి దృఢసంకల్పం ఎంత గొప్పదో, అయితే కచ్ఛితంగా అతను ఆర్‌.ఎస్‌.యు స్టూడెంట్‌ అయ్యింటాడనుకున్న. ఎందుకంటే మావోయిస్టు పార్టీలో మొదటి తరం ఆర్‌.ఎస్‌.యు స్టూండెట్సే అని ఓ.యులో చాలాసార్లు మిత్రులనేవాళ్లు. తనని చూసి చాలా గర్వంగా ఫీలయ్యా.                

ఓ.కె నేను మాట్లాడే కామ్రేడ్‌ని చూసా. మరి నాకు పని నేర్పించే కామ్రేడ్‌ ఇందులో ఎవరో అని మనస్సులో అనుకుంటున్నా. మధ్యాహ్నం భోజనం తర్వాత కామ్రేడ్‌ ‘శిరీష’ది సంస్మరణ సభ వుంటుద’ని కిచెన్‌ దగ్గర అనౌన్స్‌ చేసారు. నాకు పని నేర్పించే కామ్రేడ్‌, నేను కలిసే రెండో వ్యక్తి, నీ ఫ్రెండ్స్‌లాగే ఫ్రీగా వుంటుందని నా సహచరి చెప్పిన కామ్రేడ్‌ ఇక లేదనేసరికి ఒక్కసారిగా అవాక్కయ్యాను.

తనను చూడకముందే నేను ఊహించుకున్న ఊహాచిత్రం నా కళ్లముందు కదలాడుతోంది. ఇందేంటీ? వచ్చీరాగానే ఇలాంటి వార్త విన్నాను అని బాధపడ్డా. సహచర కామ్రేడ్స్‌ తన ఫోటో చూపించి తన గురించి, తన పని విధానం గురించి చెప్పుకుంటూ బాధపడుతున్నారు. చూస్తుండగానే సభ సమయం ఆసన్నమైంది. సభలో ముందుగా కామ్రేడ్‌ శిరీషకి 2 నిమిషాలు మౌనం పాటించి సభ ప్రారంభించారు. తనతో సన్నిహితంగా వున్న పలువురు కామ్రేడ్స్‌ తన గురించి మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తి కోసం తన తల్లిదండ్రులు ఎన్నుకున్న దారిని ఎన్నుకొని, తను గడిపిన 10 సంవత్సరాల విప్లవ జీవితాన్ని చాలా చక్కగా వివరించారు. తన విప్లవ కార్యాచరణపై కొందరు కామ్రేడ్స్‌ పాటలు పాడారు. చివరిగా తనకు మరోసారి జోహార్లర్పించడంతో సభ ముగిసింది.

మరుసటి రోజు నాతో మాట్లాడాల్సిన కామ్రేడ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కామ్రేడ్‌ శిరీష మరణం, ప్రజల్ల్లో ఆమె కృషి, పని విధానం గురించి చెబుతూ, ‘‘తను లేని లోటును మనం పూడ్చుకోవాల్సిన అవసరం వుంద”టూ ఉద్యమం పట్ల శిరీష దృఢ సంకల్పాన్ని వివరించాడు. ఆ తదుపరి ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కామ్రేడ్‌ శిరీష చేసే పనినే చేస్తే బాగుంటుద”నే విషయాన్ని నా ముందుంచి, తను అధ్యయనంలో లీనమయ్యారు.

దేశంలోని పీడిత ప్రజలను, పీడకుల నుండి విముక్తి చేయాలి. ప్రజలందరికీ కూడు, గుడ్డ, గూడు ఉండే సమ సమాజం కోసం తన నిండు నూరేళ్ల జీవితాన్ని త్యాగం చేసింది. ఆ కామ్రేడ్‌ ఆశయాలను ఎత్తిపట్టి, వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవసరం వుంది. అమరులు అందించిన ఆశయ సాధనలో అడుగులు వేయడానికి నేను ఓ.కె అన్నాను. ఇక ఆరోజు నుండి ప్రపంచాన్ని విముక్తి చేసే సోషలిస్టు సమాజం కోసం నా పోరాట ప్రస్థానం ప్రారంభమైంది.

                        (రచనా కాలం డిసెంబర్‌ 2014)

2 thoughts on “కొత్త బంగారు లోకం

  1. WASTING PEOPLES money ON statues — GODS //YAAGAALU – FOREIGN TOURS
    Wake up political leaders —these people needs help -MUST
    ==================
    Buchireddy gangula

  2. అవును ఇప్పుడు మనం ఓ కొత్త అడుగు వెయ్యాలి. బంగారు లోకానికి దారి తియ్యలి. వేసే ప్రతి అడుగు బంగారం కాకపోయినప్పటికి మనమే దాన్ని తీర్చిదిద్దాలి. మరో బంగారపు దండుని దించాలి.

Leave a Reply