గడ్‌చిరోలిలో గనుల తవ్వకానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన నేతలు వేధింపులు, బెదిరింపులకు గురయ్యారు. వారికి మావోయిస్టులు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ పలువురు నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

తోడ్‌గట్టకు వెళ్ళే దారి సుదీర్ఘమైన, రాళ్ళు రప్పలతో, మలుపులతో వుంటుంది. ఈ గ్రామం మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లాలోని ఏటపల్లి తాలూకాలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు దగ్గరగా ఉంది.

గడ్‌చిరోలి పట్టణం నుంచి తోడ్‌గట్ట వరకు కారులో వెళ్లదగిన మార్గం గూగుల్ మ్యాప్‌లో కనిపించలేదు. ఆగష్టు 27 నాడు మధ్యాహ్నం సుమారు 150 కిలోమీటర్లు కారులో ప్రయాణించడానికి మాకు ఆరు గంటలు పట్టింది. ఏటపల్లి పట్టణం దాటిన తరువాత ఇరుకైన  రహదారి, చెదురుమదురుగా ఉన్న భవనాలు, పొలాలు, వాగులతో వున్న  ప్రకృతి దృశ్య కావ్యం అడవులోకి దారితీసింది. తాజాగా విత్తిన వరి నాట్ల లేత ఆకుపచ్చ నుంచి టేకు చెట్ల గోధుమ-ఆకుపచ్చ, ఎత్తైన తాటి చెట్ల ముదురు పచ్చదనం వరకు అనేక ఛాయలు పసిడి వర్ణపు సూర్యకాంతి వెలుగులో ప్రకాశిస్తున్నాయి. రోడ్డు మీద పశువులు, మేకలు గుంపులు గుంపులుగా నడుస్తూ, ట్రాఫిక్‌ను ఏ మాత్రం ఖాతరు చేయడంలేదు.

ఏటపల్లి నుండి 30 నిమిషాల దూరంలో లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని మోస్తున్న ట్రక్కులు వేగంగా పోతున్నప్పుడు, గాలిలో  తుప్పులాంటి వాసన నిండిపోయింది. తారు రోడ్డులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి మట్టిరోడ్డుగా మారిపోయింది. రాత్రి 9 గంటల సమయంలో, అటవీ ప్రాంతానికి పక్కన ఉన్న ఒక ఆవాసానికి చేరుకున్నాము. అక్కడ వున్న సుమారు 30 వెదురు గుడిసెల్లో మసకగా వున్న సోలార్ లైట్లు వెలుగుతున్నాయి. అది తోడ్‌గట్ట గ్రామం.

మర్నాడు ఉదయం, తోడ్‌గట్ట, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 70 మంది మార్చి 11 నుండి జరుగుతున్న నిరసనలో భాగంగా గ్రామంలోని ‘గోటుల్’ దగ్గర సమావేశమయ్యారు. గోటుల్ అనేది ఒక రకమైన సాముదాయక కేంద్రం, నిరసన వేదికగా పనిచేస్తోంది. ప్రతి ఉదయం, నిరసనకారులు తాము చేస్తున్న నిరసనకు సంబంధించిన విషయాలను చర్చించడానికి యిక్కడ సమావేశమవుతారు. వీరిలో ఎక్కువ మంది మాడియా-కోయితుర్ ఆదివాసీలు, ప్రముఖంగా వీరిని మాడియా-గోండ్ అని పిలుస్తారు, ఇది ముఖ్యంగా అణగారిన ఆదివాసీ సముదాయం, ఏటపల్లి తాలూకాలో వీరి జనాభా అత్యధికంగా ఉంది. కోయితుర్ సంస్కృతిలో, గోటుల్ సాంప్రదాయకంగా గ్రామ సామాజిక-సాంస్కృతిక, రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా పనిచేస్తుంది. ఇది “గ్రామం సమిష్టి నిర్ణయాలు తీసుకునే ప్రదేశం, ప్రజాస్వామ్యానికి దాని కేంద్ర బిందువు”  అని ఆ సముదాయానికే చెందిన నోగోటి రాశారు.

బిర్సా ముండా, రాణి దుర్గావతి, సావిత్రిబాయి ఫూలేవంటి ఆదివాసీ, బహుజన నాయకుల చిత్రాలముందు ధూపం వెలిగించడంతో సమావేశం ప్రారంభమైంది. “పర్యావరణాన్ని సంరక్షించేవారే సమాజంలో గొప్ప వ్యక్తులు”, “వాయు కాలుష్యం ఒక సమస్య – మేము నిర్మూలిస్తాం” వంటి సందేశాలతో కూడిన పోస్టర్‌లను వేలాడదీశారు. భారత రాజ్యాంగ పీఠికపై మాడియా భాషలో సామూహిక ప్రతిజ్ఞ చేశారు. దీని తరువాత సముదాయ పెద్దలు ఉపన్యాసాలిచ్చారు.

ఏటపల్లిలో గనుల తవ్వకానికి వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగింది. 2007లో, స్థానిక ఆదివాసీల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఏటపల్లి పట్టణం నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుర్జాగర్ కొండలపై 348.09 హెక్టార్ల భూమిలో మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించడానికి లాయిడ్స్ మెటల్స్‌కు అనుమతి లభించింది. నిరసనకారులు కొన్ని సంవత్సరాలుగా కంపెనీని విజయవంతంగా అడ్డుకున్నారు, కాని 2011లో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

అప్పటి నుండి, గనుల నుండి విడుదలయ్యే ఎర్రటి దుమ్ము చుట్టుపక్కల ప్రాంతాలను – రహదారులు, పొలాలు, ఇళ్లను కప్పేసింది. గని నుంచి వెలువడే వ్యర్థాలు కొండలపై నుంచి వచ్చే నీటిలో కలిసి కొండల మీదుగా ప్రవహించి, నది నీటిని, సమీప గ్రామాల పొలాలను కలుషితం చేసాయి.

2023 మార్చిలో, లాయిడ్స్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 3.00 మిలియన్ టన్నుల (ఎమ్‌టిపిఏ) నుండి 10.0 ఎమ్‌టిపిఏ కి విస్తరించడానికి పర్యావరణ అనుమతిని పొందింది. ఈ ఏడాది మే నెలలో ఓం సైరమ్ స్టీల్స్ అండ్ అల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెఎస్ డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్, సన్ ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్, యూనివర్సల్ ఇండస్ట్రియల్ ఎక్విప్ మెంట్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అనే ఐదు కంపెనీలు, నేచురల్ రిసోర్సెస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సుర్జాగర్ కొండల్లో 4,684 హెక్టార్ల విస్తీర్ణంలో ఆరు కొత్త గనుల తవ్వకాల కోసం లీజుకు తీసుకున్నాయి.

కానీ ఆదివాసీ గ్రామస్తులు ఈ భూములు తమకు పవిత్రమైనవి, గనుల తవ్వకం చేబడితే పర్యావరణ వ్యవస్థ, తమ జీవనోపాధి అయిన వ్యవసాయం నాశనం అవుతాయని అంటున్నారు. “ఆదివాసీలు తమ భూమి బతికుంటేనే బతుకుతారు” అని నోగోటి అన్నారు. “ఈ గనులు కొందరికి కొంతకాలం ఉద్యోగాలు కల్పిస్తాయి, కానీ అవి ఓ వంద సంవత్సరాలలో మూతపడతాయి. ఇక ఆ తరువాత మా భవిష్యత్ తరాలు ఏం చేస్తాయి?” అని ప్రశ్నిస్తున్నారు.

ఈ గనుల తవ్వకాన్ని మావోయిస్టులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. 2013లో, వారు లాయిడ్స్ మెటల్స్ ఉపాధ్యక్షుడిని, ఇద్దరు అధికారులను చంపారు. 2016లో కంపెనీకి చెందిన 75 పైగా ట్రక్కులను కాల్చివేసి, కార్యకలాపాలను నిలిపివేశారు. అప్పటి నుండి, మరింత దాడుల బెదిరింపుతో, భారీ పోలీసు రక్షణతో మైనింగ్ ప్రారంభమైంది, అడపాదడపా ఆగిపోయింది కూడా. 2021లో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో “వామపక్ష-తీవ్రవాదం” ఎక్కువగా ప్రభావితమైన 25 జిల్లాల్లో గడ్‌చిరోలి ఒకటి.

నిరసనలను చట్టవ్యతిరేకమైనవిగా చేసేందుకు ప్రభుత్వం ఈ హింసను ఉపయోగించుకుంది. 2022 డిసెంబర్‌లో, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గడ్‌చిరోలి సంరక్షక మంత్రి కూడా అయిన దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ, “మావోయిస్టులు ఉద్దేశపూర్వకంగా అభివృద్ధి కార్యకలాపాలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలను రెచ్చగొడుతున్నారు” అని, ఆగస్టులో మీడియాతో మాట్లాడుతూ, ఏటపల్లిలో మైనింగ్ “పర్యావరణహితంగా” జరుగుతోందని చెప్పాడు.

కానీ ఆ తాలూకాలో ప్రయాణిస్తున్నప్పుడు, గనుల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టం స్పష్టంగా కనిపించింది. ఆగష్టు 28 నాడు, నోగోటి, ఇంకా ఇద్దరు తోడురాగా, మాడియా భాషలో ఒడాల్ అని పిలిచే స్థానిక దేవత అయిన ఠాకూర్ దేవో పుణ్యక్షేత్రానికి వెళ్ళాను. విధానసభలో ఫడ్నవీస్ “మావోయిస్టులు సూర్జగఢ్ దేవతపై ప్రభావం పడుతోందని స్థానికులను తప్పుదోవ పట్టిస్తున్నారు. లోయిడ్స్ గని కొండల ఆగ్నేయ భాగంలో ఉంటే, పుణ్యక్షేత్రం కొండల దిగువన మరింత తూర్పున ఉంది” అని అన్నాడు.

లొయిడ్స్ గనుల సమీపంలో ఉన్న సూర్జగఢ్ కొండల దిగువన మల్లంపాడి గ్రామం ఉంది. ఒకప్పుడు మల్లంపాడి సమీపంలోని నది వేసవికాలమంతా చల్లగా ఉండేదని, పొరుగున ఉన్న గ్రామాల ప్రజలు స్నానం చేయడానికి అక్కడకు వచ్చేవాళ్లని నివాసితులు వివరించారు. “మేము ఈ నీటిని ప్రతి అవసరానికి  ఉపయోగించే వాళ్ళం, కానీ ఇప్పుడు పందులు కూడా ఈ నీటిని తాగవు” అని మల్లంపాడి నివాసి జగత్‌పాల్ టోప్పో చెప్పారు. మైనింగ్ ప్రారంభమైనప్పటి నుండి గ్రామస్తులు మైనింగ్ కంపెనీ తవ్విన బోరుబావులపైనే ఆధారపడాల్సి వస్తోంది.

గనుల తవ్వకం వల్ల మల్లంపాడి ప్రజల ఆరోగ్యం పాడవుతోందని స్థానికులు చెబుతున్నారు. కళ్ళ వాపు, జ్వరం, ఒళ్ళునొప్పులు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. “ప్రజలు ఈ మధ్య తరచుగా అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ మధ్యనే అందరూ గనుల యాజమాన్యం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. చాలా రోజుల నుంచి మేమందరమూ వాచిన కళ్ళతో బాధ పడుతున్నాము” అని జగత్‌పాల్ అన్నారు. మేము ఆవరణలో మాట్లాడుతున్నప్పుడు, మాతో పాటు వున్న ఒక పెంపుడు కుక్కకు ఎరుపు-గోధుమ రంగు బొచ్చు ఉంది. మల్లంపాడిలో కోళ్లు, పశువులు కూడా అనారోగ్యానికి గురవుతున్నాయని, చనిపోతున్నాయని, తన దగ్గర దాదాపు 150 కోళ్లు ఉండేవని కానీ అన్నీ అనారోగ్యంతో చనిపోయి కేవలం నాలుగు  మాత్రమే మిగిలి ఉన్నాయని జగత్‌పాల్ వివరించారు.

జగత్‌పాల్ మమ్మల్ని గనుల నుండి ఎర్రటి గోధుమ రంగు బురదతో నిండిన సమీప పొలాలకు కూడా తీసుకెళ్లాడు. “రెండు సంవత్సరాల క్రితం వరకు, మా నడుము వరకు వరి పండేది కానీ ఇప్పుడు మా నడుము వరకు మైనింగ్ బురద మాత్రమే ఉంది” అని ఒక నివాసి చెప్పారు. 2022లో చాలాసార్లు బురద మందమై పోవడంతో దారి తప్పి పొలాల్లోకి వెళ్లిన ఆవులు చిక్కుకుపోయి రక్షించాల్సి వచ్చింది. పొలంలో కొన్ని ప్రాంతాలలో కొద్దిపాటి వరి పైరును చూసి “ఈ పంట చేతికి వస్తుందని మీరు అనుకుంటున్నారా” అని జగత్‌పాల్‌ని అడిగితే “రాదు” అని నిరుత్సాహంగా బదులిచ్చాడు.

గనుల తవ్వకాన్ని సులభతరం చేయడానికి, రాజ్యం ప్రైవేట్ కార్పొరేషన్‌లతో కుమ్మక్కయ్యిందని, ఆదివాసీల నుండి ఎదురయ్యే ఏ అసమ్మతినైనా అరికట్టడానికి, వారిపై మావోయిస్టులు, దేశ ద్రోహులని ముద్రవేస్తుందని కార్యకర్తలు అంటున్నారు. మైనింగ్, ఇతర ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో ఆదివాసీలను నేరస్థులుగా పరిగణిస్తున్నారని గుర్తించిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2014 నివేదికకు అనుగుణంగా ఇది ఉంది. “ప్రాజెక్ట్‌లు ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాలలో మేము చూసిన అత్యంత ఆందోళనకరమైన లక్షణం, స్థానిక ప్రజలు, వారి మద్దతుదారులపై కేసులు నమోదు చేయడం” అని ఆ నివేదిక పేర్కొంది.

గడ్‌చిరోలిలో ప్రభుత్వ ప్రాయోజిత అణచివేతను పరిశీలించిన కోఆర్డినేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్ (CODR) విడుదల చేసిన 2018 నిజ-నిర్ధారణ నివేదిక, ఏటపల్లిలోని మైనింగ్ కంపెనీ, స్థానిక పరిపాలన, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయని “సుర్జాగఢ్‌లోని ఎర్రటి మట్టి కొండల చుట్టూ ఒక సమాంతర వ్యవస్థ ఏర్పాటవుతోంది, అది స్థానికుల జీవితాలను నాశనం చేస్తుంది. భద్రతా బలగాల శిబిరాలను నిర్మించారు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన పోలీసు, భద్రతా దళాల అదనపు బెటాలియన్లను ఈ ప్రాంతంలో మోహరించారు. ఈ ప్రాంతంలో సాయుధ ప్రతిఘటన చరిత్ర వుండడం వల్ల, నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో ఇవన్నీ జరిగాయి” అని పేర్కొంది.

1990వ దశకం ప్రారంభం నుంచి గడ్‌చిరోలిలో బూటకపు ఎన్‌కౌంటర్‌లు తరచుగా జరుగుతున్నాయని CODR నివేదిక పేర్కొంది. 2010లో, అప్పటి గడ్‌చిరోలి డిప్యూటీ కలెక్టర్ రాజేంద్ర కాన్ఫడే అంతర్గత ప్రాంతాల్లో ఒక రోజు పర్యటన చేసిన తర్వాత, మీడియాతో మాట్లాడుతూ, “రాజ్యం చట్టబద్ధంగా హింస చేస్తుంటే, మావోయిస్టులు చట్టవిరుద్ధంగా హింస చేస్తున్నారు. ఏ పార్టీ హింసను, మరీ ముఖ్యంగా మావోయిస్టుల హింసను నేను ఆమోదించను. కానీ రాజ్యం చేసే చట్టబద్ధమైన హింస చాలా విధ్వంసకరమని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను” అని అన్నారు.

గ్రామాల నివాసితులు అటువంటి రాజ్య-ప్రాయోజిత అణచివేత, హింసల వివరాలను పంచుకున్నారు. ఏటపల్లిలోని ముర్వాడ గ్రామానికి చెందిన 67 ఏళ్ల కైలాస్ ఎక్కా, 2018 ఫిబ్రవరిలో, పొరుగు గ్రామమైన కోయింద్వర్షికి చెందిన రామ్‌కుమార్ ఖేస్ అనే తన స్నేహితుడితో కలిసి అడవిలో పక్షుల వేటకు వెళ్లి నక్సల్స్ వ్యతిరేక పారామిలిటరీ దళమైన సి-60 చేతిలో మరణించాడని చెప్పారు. మరణించిన మరుసటి రోజు అతణ్ణి నక్సల్‌గా ప్రకటించారు. అతని కుటుంబం దీనిని ఖండించి, బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారని చెప్పింది.  ఇలాంటి హత్యలకు సంబంధించిన అనేక కథనాలను జర్నలిస్టులు నివేదించారు.

“ఇక్కడి ప్రతి గ్రామంలోనూ నక్సలిస్టులుగా అభియోగాలు మోపిన వారి కథలు మీకు కనిపిస్తాయి” అని నోగోటి అన్నారు. ప్రస్తుత ఆందోళనలో కీలక నాయకులలో ఒకరైన మంగేష్ నరోతి ఇటీవలి నెలల్లో తాను పోలీసులచే వేధింపులకు గురైనట్లు వివరించారు. ఫిబ్రవరి చివరలో, నరోటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 110 కింద షోకాజ్ నోటీసును అందుకున్నారు, దీని ప్రకారం పోలీసులు తాము అలవాటైన అపరాధిగా భావించే వారు క్రిమినల్ నేరానికి పాల్పడే అవకాశం ఉంది అని వారిపై నివారణ చర్య తీసుకోవచ్చు. నరోటి నక్సలైట్ మద్దతుదారు అని, సుర్జగఢ్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, ప్రజలను నిరసనలకు ప్రేరేపిస్తున్నారని ఆ నోటీసులో ఆరోపించారు.

తన స్వగ్రామమైన బేసేవాడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్జగఢ్ గని సమీపంలోని హైద్రి పోలీస్ స్టేషన్‌లోని పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద హాజరు కావాలన్నారు. అక్కడికి వెళ్ళాక పోలీసులు నక్సలైట్ల గురించి, జరగబోయే నిరసనల గురించి ప్రశ్నించారు. నక్సలైట్లకు ఆహారం ఇచ్చి, వారి పనిలో సాయం చేశాడని నిందించారు. నేను తిరస్కరించాను, కాని వారు నా మాట వినలేదు. పోలీసులు అతని అభిప్రాయాలను మార్చడానికి ప్రయత్నించారు. “ఇది జరిగేది కాదు, కాబట్టి నిరసనలకు వెళ్లవద్దు. గనుల ద్వారా అభివృద్ధి జరుగుతుంది” అని చెప్పారు.

ప్రతి వారం హైద్రీ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని నోటీసు యిస్తే నాలుగు నెలల పాటు అలా వెళ్ళాడు. “ఆ కాలంలో నేను పూర్తిగా కలత చెందాను, గంటల కొద్దీ స్టేషన్‌లో కూర్చోబెట్టేవారు. నిరసనలకు వెళ్లవద్దని తిట్టేవారు. నేను రాత్రి 8-9 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేవాడిని. జూన్ నాటికి, ఒత్తిడిని భరించలేక, వెళ్లడం మానేయాలని నిర్ణయించుకున్నాను. ఇది ప్రజలను వారి లక్ష్యాల నుండి తప్పుదారి పట్టించే వ్యూహం. అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు”అని అన్నాడు.

అదే సమయంలో, పోలీసులు తోటి కార్యకర్త మంగేష్ హోలీ, మరికొంత మందిని క్రమం తప్పకుండా తమ వద్దకు రావాలని ఆదేశించారు. విలువైన సహజ వనరుల సమీపంలో ఆదివాసీలు నివసిస్తున్న గడ్‌చిరోలి అంతటా ఈ రకమైన వేధింపులు జరుగుతున్నాయి. “వారు మమ్మల్ని పర్యవేక్షిస్తారు, గనుల అధికారులను రక్షిస్తారు.” గడ్‌చిరోలి పోలీసు సూపరింటెండెంట్ నీలోత్‌పాల్, “క్రైమ్ రికార్డ్ ఉంటే తప్ప, నిర్దిష్ట వ్యక్తిపై వేధింపులు జరగలేదు, దీని కోసం వారిని నివారణ చర్య కోసం పిలుస్తారు, ఇది సాధారణ చర్య”అన్నారు.

గత ఐదేళ్లలో గడ్‌చిరోలిలో మావోయిస్టుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని పోలీసులు అంటున్నారు. 2022 పిటిఐ నివేదిక ఒక పోలీసు అధికారిని ఉటంకిస్తూ, “గడ్‌చిరోలిలో నక్సలైట్ల రిక్రూట్‌మెంట్ సున్నాకి చేరుకుంది. రిక్రూట్‌లు ఎక్కువగా పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు ఉన్నారు. నక్సల్ కార్యకలాపాలు తగ్గాయి కానీ పూర్తిగా తగ్గలేదు. ఇప్పటికీ ఏటపల్లి, భామ్రగడ తాలూకాలో ప్రబలంగా ఉంది” అని నీలోత్పల్ అన్నారు.

నక్సల్స్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినప్పటికీ పోలీసుల కార్యకలాపాల జోరు మాత్రం తగ్గడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆగస్ట్ నుండి 28 “సాయుధ అవుట్‌పోస్టులు” పోలీసు స్టేషన్‌లుగా అప్‌గ్రేడ్ అయ్యాయని, జిల్లాలో మొత్తం స్టేషన్ల సంఖ్య 57కి చేరుకుంది అని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.

2021 అక్టోబర్‌లో, సుర్జాగర్ గనుల దగ్గర స్థానికులు నిరసన తెలిపారు, ఆ తర్వాత పోలీసులు స్థలానికి వచ్చి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్లుగా తోడ్‌గట్టలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్న పలువురు నేతలపై కేసులు పెట్టారు. గని లేదా పరిపాలనా కార్యాలయం దగ్గర నిరసన చేస్తే మమ్మల్ని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టే వాతావరణం ఇక్కడ ఉంది” అని నోగోటి అన్నారు. ఇంతకుముందు గనులలో పనిచేసిన కొంతమంది స్థానికులు నిరసనలలో పాల్గొన్న వ్యక్తులపై ఒక కన్నేసి ఉంచుతారు. ముఖ్యంగా మైనింగ్ వ్యతిరేక గళం విప్పిన వారిని గమనిస్తూంటారు. వారి కార్యకలాపాల గురించి గనుల యజమానులకు రిపోర్టు యిస్తూ వుంటారు.

జిల్లా వ్యాప్తంగా, స్థానిక ప్రజలు గనులకు మద్దతు ఇవ్వవచ్చు, లేదా వ్యతిరేకంగా నిలబడవచ్చు అనే సందేశాన్ని పరిపాలన ప్రచారం చేయడం వల్ల వారు మావోయిస్టుల అనుచరులుగా మారిపోతున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. గడ్‌చిరోలి జిల్లా కలెక్టర్ సంజయ్ మీనా జిల్లా 70 శాతానికి పైగా అటవీ ప్రాంతం ఉందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో 0.5 శాతానికి తక్కువ మైనింగ్ జరుగుతోందని, సమస్య ఏమిటంటే, వారు కేవలం గనులను మాత్రమే కాకుండా రోడ్లు, మొబైల్ టవర్లను కూడా నిరసిస్తున్నారని, ఆ ప్రాంతంలో అభివృద్ధిని వారు కోరుకోవడం లేదు” అని అన్నారు.

నక్సలైట్ల బెదిరింపుల వల్ల ఆదివాసీలు గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని పోలీసులు పత్రికా ప్రకటనలలో ఆరోపిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం మావోయిస్టులు తన గ్రామమైన బెసేవాడ, తమ తెహసిల్ లోని ఇతర ప్రాంతాలకు తరచూ వచ్చేవారు కానీ కొన్నేళ్లుగా వారి ఉనికి గణనీయంగా తగ్గింది, వారు ఇకపై గ్రామాలకు రావడం లేదు, ఎక్కువగా అడవి లోతట్టు ప్రాంతంలో ఉంటారు. ఇక్కడ పనిచేస్తున్న వారు రాష్ట్ర సరిహద్దు దాటి ఛత్తీస్ గఢ్ నుండి వచ్చారు అని నరోతి వివరించారు.

ఆగష్టు 30 న, నేను ఏటపల్లి దగ్గర ఒక టీ దుకాణానికి వెళ్ళినప్పుడు, ఇదే అవగాహనతో ప్రభావితం చేయడం లక్ష్యంగా వున్న ఒక కార్టూన్ పోస్టర్ గోడపై వేలాడుతోంది. దాన్ని తయారు చేసినవారి పేరు లేదు.  మొదటి ఫ్రేమ్‌లో, రోడ్లు, వంతెనలు, మొబైల్ టవర్ల అభివృద్ధికి నిరసన తెలియచేయాలని ఆదివాసీ గ్రామస్తులను సాయుధ మావోయిస్టులు బెదిరిస్తున్నారు; రెండవ ఫ్రేమ్‌లో, వారు అలా చేయడానికి అంగీకరిస్తున్నారు. మూడవ ఫ్రేమ్‌లో, వర్షంవల్ల  గ్రామం పక్కనే ఉన్న నదికి వరద వచ్చి, బయటి ప్రపంచంతో సంపర్కం లేకుండా చేస్తుంది. చివరగా, ఆఖరి ఫ్రేమ్‌లో, ఒక అంటువ్యాధి గ్రామాన్ని తాకి గ్రామస్తులను నిస్సహాయులుగా వదిలివేస్తుంది, వారు తమ మునుపటి నిరసనలకు చింతిస్తూ ఉంటారు.

ఆగష్టు 29 సాయంత్రం తోడ్‌గట్టలో, నిరసనకారులు తమ గుడిసెల్లో కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే, నరోటి తన గుడిసె బయట కూర్చుని  మైనింగ్ ఫలితంగా ఏర్పడిన ప్రాంతంలో ఆర్థికాభివృద్ధిపై ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ చేసిన వీడియోను ఫోన్‌లో చూపించాడు. ఆదివాసీలకు భూములు, సహజ వనరులు ఉపయోగించుకునే అధికారం కల్పించిన ఎఫ్ఆర్ఎ(అటవీ హక్కుల చట్టం), పెసా చట్టం వంటి మార్గాల ద్వారా మనం కోరుకునే అభివృద్ధిని తీసుకువద్దాం” అని అన్నారు. 

 నిజానికి, అటవీ హక్కుల చట్టం అనేది ఈ ప్రాంతాల్లో ఆదాయానికి కీలక మార్గం – చట్టం ప్రకారం దేశంలో అత్యధిక సంఖ్యలో గడ్‌చిరోలి జిల్లాలో సాముదాయిక అటవీ హక్కుల దావాలు ఉన్నాయి. 2017లో జిల్లాలో 160 గ్రామసభల్లో బీడీలు తయారు చేసి టెండు ఆకుల విక్రయం ద్వారా రూ.400 కోట్ల ఆదాయం వచ్చింది.  ఏటపల్లిలో ఆదివాసీలు కూడా రోడ్లను పూర్తిగా వ్యతిరేకించనప్పటికీ విశాలమైన నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణంపై నిరసన వ్యక్తం చేశారు. ఇది గ్రామీణ ప్రాంతం, ఇక్కడ నాలుగు లేన్ల రహదారి అవసరం ఏముంది?” అని ప్రశ్నిస్తున్నారు. గట్టా గ్రామానికి చెందిన సైను గొట్టా “మాకు రోడ్లు కావాలి, కానీ అవి మాకు ఉపయోగపడాలి, కొండలను తవ్వేయడానికి కాదు” అంటున్నారు.

 స్థానిక సముదాయాల అవసరాలు చాలా సరళంగా ఉన్నాయని, గత రెండు దశాబ్దాలుగా మాత్రమే కరెన్సీ నోట్లను ఈ ప్రాంతంలో ఉపయోగించడం ప్రారంభించారని అంటారు. “ఇక్కడ చాలా కుటుంబాలు ఇంకా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో చేరలేదు, వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు జీవనాధారంగా వున్నాయి.  ఆదాయం కోసం అదనపు ఉత్పత్తులను విక్రయిస్తారు. ఉన్నదానితో సంతృప్తి చెందుతారు. అత్యాశపరులు కాదు, లక్షాధికారులుగా కానవసరం లేదు. మాకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఉప్పు, బట్టలు మాత్రమే కొనాలి” అంటారు.

1950-60లలో ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుండి ఈ ప్రాంతానికి వలస వచ్చిన అనేక ఒరాన్ లేదా కురుఖ్, ఆదివాసీ కుటుంబాలు కూడా ఏటపల్లిలో నివసిస్తున్నాయి. తమ సొంత గ్రామాల్లో భూమి కొరతతో పాటు వివిధ కారణాలతో వారు వలస వచ్చారు. ఇక్కడికి వచ్చాక, వారు తమ సాంప్రదాయ పద్ధతిలో భూమి సాగు చేస్తూ జీవించేవారు. కానీ వారి వలస తర్వాత, చట్టపరమైన, పరిపాలనాపరమైన అడ్డంకులు వారిని అనిశ్చిత స్థితిలోకి నెట్టాయి.

మహారాష్ట్రలో ఈ గుర్తింపును చాలా మందికి నిరాకరించారు. ఏటపల్లిలోని కొంతమంది ఓరాన్ పెద్దలకు మాత్రమే తెగ సర్టిఫికేట్లు లేదా భూమి పట్టాలు ఉన్నాయి.

న్యాయవాదులు రజనీ సోరెన్, అమేయ బోకిల్‌ల ప్రకారం, వలస వచ్చిన షెడ్యూల్డ్ తెగలకు చెందాల్సిన భూమికి సంబంధించి అస్పష్టత ఉంది. 1950కి ముందు కొన్ని కుటుంబాలు వలస రావడానికి  అవకాశం ఉంది. మహారాష్ట్ర కుల ధృవీకరణ చట్టం ప్రకారం, 1950 సెప్టెంబరు 6 నుండి రాష్ట్రంలో శాశ్వతంగా నివసిస్తున్న వ్యక్తి, షెడ్యూల్డ్ తెగ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హుడు. తమ మూలాధార రాష్ట్రాలలో ప్రయోజనాలను కోరుకునే షెడ్యూల్డ్ తెగ సభ్యులకు మాత్రమే అటవీ హక్కుల చట్టం, 2006, దాని నిబంధనలు వర్తిస్తాయని పేర్కొనలేదు. అంతేకాకుండా, అటవీ హక్కుల చట్టం ప్రకారం, షెడ్యూల్డ్ తెగకు చెందిన సభ్యుడు కనీసం చట్టం కట్ ఆఫ్ తేదీ అయిన 2005 సంవత్సరం నుండి అటవీ భూమిని ఉపయోగిస్తున్నట్లయితే, ఆ భూమిపై యాజమాన్యం (టైటిల్) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కానీ ఇతర నియమాలు, తీర్పులను ఈ నిబంధనలకు విరుద్ధంగా వుండడాన్ని చూడవచ్చు. ఉదాహరణకు, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ యిచ్చిన 2018 నోటీసు ప్రకారం, షెడ్యూల్డ్ కులానికి లేదా తెగకు చెందిన వ్యక్తికి వారి మూల రాష్ట్రాలలో ఆ సమూహాలకు సంబంధించిన ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి తప్ప అతను / ఆమె వలస వచ్చిన రాష్ట్రం నుండి కాదు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వలసదారులు వారు వలస వచ్చిన రాష్ట్రంలో ప్రయోజనాలను పొందలేరని సుప్రీంకోర్టు తన 1994 తీర్పును 2022లో పునరుద్ఘాటించింది.

ఎఫ్‌ఆర్‌ఏ నిబంధనల ప్రకారం వ్యక్తులు అర్హత పొందినంత కాలం, వారు వలస వచ్చినందున వారి హక్కులను తిరస్కరించడం అన్యాయమని బోకిల్ వాదన. ఆధార్ కార్డులో ముర్వాడను ఇంటి చిరునామాగా నమోదు చేసుకున్న కైలాస్ ఎక్కా ప్రతి సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లోని తన స్వస్థలమైన జష్‌పూర్‌ వెళ్తాడు. కానీ, తాను, ఇతర ఓరాన్ వలసదారులు 50 సంవత్సరాల క్రితం ఏటపల్లిలో తమ నివాసాలను ఏర్పరచుకున్నామని, సాగు చేయడానికి అక్కడ భూమి లేకపోవడంతో ఛత్తీస్‌గఢ్‌కు తిరిగి వెళ్లలేక పోయామనీ వివరించాడు.

ఇప్పుడు, గనుల విస్తరణతో, యాజమాన్య పత్రాలు (టైటిల్స్) లేకపోవడం వల్ల తనతో పాటు సముదాయంలోని ఇతరులు తమ భూమి నుండి నిర్వాసితులయ్యే అవకాశం ఉందని ఆందోళన పడు తున్నాడు. “మా భూమిని కాపాడుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాము, మాకు నిరసన చేయడం తప్ప వేరే మార్గం లేదు. మల్లంపాడు వంటి గ్రామాలకు గనుల వల్ల భారీ నష్టం వాటిల్లింది. సుర్జాగర్ కొండల సమీపంలోని పొలాలలో రెండు అడుగుల లోతు మట్టి ఉంది. ప్రణాళికాబద్ధమైన విస్తరణల వల్ల మాకు కూడా అదే జరుగుతుందని భయపడుతున్నాము.”

ముర్వాడకు చెందిన ముప్పై ఐదేళ్ల రాజు లక్రా కూడా మైనింగ్ వల్ల తమ భూములు ధ్వంసమైతే భవిష్యత్ తరాల ఆదివాసీలు ఎలా బతుకుతారో అని ఆందోళన చెందుతున్నాడు.

“అందరికీ గనిలో ఉద్యోగం లభించదు, మేము వ్యవసాయం ద్వారా స్వయం సమృద్ధిని కలిగి ఉన్నాము. మా తరాలు ఇలాగే బతుకుతున్నాయి.” వలస వచ్చిన వారికి భూమి హక్కులు నిరాకరించడం వల్ల కొన్ని సందర్భాల్లో విషాదకరమైన పరిణామాలు కలిగాయి. 2022 ఆగస్ట్ చివరలో, అజయ్ టోప్పో అనే 38 ఏళ్ల ఓరాన్ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు, మూడు తరాల క్రితం చత్తీస్‌గఢ్ నుండి వలస వచ్చిన ఒరాన్ ఆదివాసీ సమాజం ప్రధానంగా నివసించే మల్లంపాడి నివాసి అజయ్.

న్యూస్‌లాండ్రీ నివేదిక ప్రకారం, 2022ఆగస్ట్ 31 న, అజయ్ జన్ సున్వాయి లేదా ప్రజా కోర్టుకు హాజరయ్యాడు, అక్కడ మైనింగ్ కారణంగా ఏర్పడిన మట్టితో తన పొలాలకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని స్థానిక పరిపాలనను అడిగాడు. అతను ఆదివాసీ కాదని, భూమికి పట్టా లేదని, అందువల్ల పరిహారం పొందే అర్హత లేదని అన్నారు. అదే రోజు రాత్రి అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

“ఈ గ్రామంలో 42 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 22 కుటుంబాల వ్యవసాయ భూములు గనుల శిలాజాల వల్ల నాశనమయ్యాయి” అని జగత్పాల్ అన్నారు. ఆయన సొంత పొలాలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు ఆయన 2.5 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. “గత సంవత్సరం నేను జీవించడానికి తగినంత మాత్రమే పండింది, ఈ సంవత్సరం మరింత కష్టంగా ఉంది”అని ఆయన అన్నారు.

ఆగస్టు 28న మల్లంపాడుకు వెళ్ళాను. గ్రామంలో కొందరికి ఆదివాసీ ధృవీకరణ పత్రాలు, భూమి పట్టాలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు వాటిని కొనుగోలు చేసి అందజేశారని పేరు చెప్పవద్దని కోరిన నిర్వాసితులు తెలిపారు. అయితే చాలా మందికి ఈ సర్టిఫికెట్లు లేవు. తత్ఫలితంగా, వారు భూమికి జరిగిన నష్టానికి పరిహారాన్ని అడగలేరు లేదా వ్యవసాయం, విద్య వంటి రంగాలలో షెడ్యూల్డ్ తెగల వారికీ వుండే ఎటువంటి ప్రయోజనాలను పొందలేరు. “మేము ఆదివాసీలం కాదని స్థానిక పరిపాలన చెబుతోంది” అని ఒకరు అంటే “మీకు ఏమి అనిపిస్తుంది? నువ్వు ఆదివాసీవా?”అని అడిగితే “అవును, మేము ఖచ్చితంగా ఆదివాసీలమే!” రాజ్యం మమ్మల్ని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించనంత మాత్రాన, మేం ఆదివాసీలం కాకుండా పోము” అని చెప్పారు.

మల్లంపాడిలోని కొందరు తమ పొలాలకు జరిగిన నష్టానికి లాయిడ్స్ నుండి సాధారణంగా సుమారు రూ. 8,000 పరిహారం పొందారని చెప్పారు. ఈ మొత్తాలు వారి కుటుంబాలను పోషించడానికి సరిపోక, తప్పనిసరై చాలా మంది గనులలో పని చేయవలసి వచ్చింది. “గ్రామంలో దాదాపు ప్రతి కుటుంబంలో ఒకరు ఇప్పుడు గనులలో పనిచేస్తున్నారు, ఒక నాలుగు-ఐదు కుటుంబాలు మాత్రం అక్కడ పని చేయడానికి నిరాకరించాయి” అని జగత్పాల్ చెప్పారు. నేను కలిసిన ఇద్దరు లాయిడ్స్‌లోని క్యాంటీన్‌లో రూ. 10,000 నెలవారీ జీతంతో పని చేశారు. ఇది మహారాష్ట్రలో అమలులో వున్న రోజువారీ వేతనం కంటే తక్కువ. ఆదివాసీలకు కింది స్థాయి పనిని, బయటి వారికి పై స్థాయి ఉద్యోగాలను యిచ్చారు.

ఆగష్టు 30 ఉదయాన తోడ్‌గట్టలో నేను నిద్ర లేచేటప్పటికి, ఉద్వేగభరితమైన ముఖాలు, గుసగుసలు వినిపిస్తున్నాయి. నిరసనకారులు తమ గుడిసెల్లో నిద్రిస్తున్నప్పుడు, ఛత్తీస్‌గఢ్ పోలీసుల బలగం గ్రామాన్ని చుట్టుముట్టి స్థానిక దుకాణదారుడు మిథున్ రాయ్‌ను అరెస్టు చేశారు. “అతను నిరసనలకు క్రమం తప్పకుండా హాజరవుతుంటాడు, కొన్నిసార్లు జన సమూహంతో మాట్లాడుతుంటాడు” అని నోగోటి అన్నారు. ఏమి జరుగుతోందో చెప్పమని అనేక మంది నిరసనకారులు పోలీసుల వెంబడి వెళ్లారు, మరికొందరు సురక్షితంగా లేమని భావించి గ్రామం విడిచి దూరంగా వెళ్లారు. కొన్ని గంటల తరువాత,  విచారణ చేసి వదిలేస్తే రాయ్‌ ఇంటికి తిరిగి వచ్చాడు. “చూడండి, ప్రజలను ఇలానే అదుపులోకి తీసుకుని, భయపెట్టేస్తున్నారు” అని నరోటి అన్నారు.

ఆ రోజు ఉదయం, గోటుల్ వద్ద మళ్ళీ సమావేశమై తమ నిరసన తెలియచేసారు.

ఈ నిరసనలు రాజకీయ విద్యాబోధనలో ఒక అభ్యాసం కూడా. ఈ ఆందోళన విద్యా కేంద్రం లాంటిది. ఈ దేశంలో రాజకీయాలు ఎలా పనిచేస్తాయో ప్రజలు నేర్చుకుంటున్నారు, వారి స్వంత అభిప్రాయాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ సంస్థల్లో మనం ఉండాలని ప్రజలకు చెబుతున్నాను. మనం రాజకీయ రంగంలోకి వస్తేనే మన అభిప్రాయాలను తెలియజేయగలం, ఆరోగ్యకరమైన ప్రజల రాజకీయాలు అభివృద్ధి చెందుతాయి అని నోగోటి వివరించారు.

స్క్రోల్ ఇన్ రిపోర్టర్ https://scroll.in/article/1056602/the-cost-of-protesting-against-mining-in-gadchiroli

Leave a Reply