మనం ఒకరికొకరం
నూతన సంవత్సర శుభాకాంక్షలు
చెప్పుకుంటున్న రోజు
బస్తర్లో మంగ్లీ హత్య జరిగింది

ఆ రోజు మంగ్లీ తల్లి
అడవిని కాపాడడానికి అడవి ఒళ్లోనే
హఠం వేసింది
ఆరు నెలల మంగ్లీ
తల్లి గుండెల్లో దూరి పాలు తాగుతున్నది
ఒళ్లోనే చదువుతూ చదువుతూ
‘రాజ్యానికి వ్యతిరేకంగా
యుద్ధానికి కుట్ర రచిస్తున్నది’

ఒక తూటా
తల్లి వేళ్లను చీరుకుంటూ
మంగ్లీకి తాకింది
‘ఎదురు కాల్పుల
క్రాస్ ఫైరింగ్లో మంగ్లీ చనిపోయింది’

గాజా ఆఫ్తాబ్
పుడుతూనే వాయు విమాన
బాంబుదాడిలో చనిపోయాడు
అతడు తన మొదటి స్తన్యం
కూడ తాగలేదు
ఆల్ పిఫా ఆసుపత్రిలో
హత్యకు గురయ్యాడు
గాజాలో పుట్టడమే
ఇజ్రాయిల్ రాజ్యానికి
వ్యతిరేకంగా కుట్రచేయడం

రెండు వేరు వేరు దేశాల్లో
ఇద్దరు వేరు వేరు పద్ధ్దతుల్లో
హత్యకు గురయ్యారు

బస్తర్ మంగ్లీ
గాజా ఆఫ్తాబ్`
కాని ఇద్దరి హంతకులు ఒక్కరే
హత్యలు చేసే ఆయుధాల కర్మాగారం ఒక్కటే
హత్యకు కారణం ఒక్కటే
భావజాలం ఒక్కటే

అందువల్లనే
గాజా బస్తర్ కూడ
ఒక్కటే
గాజా ప్రజల బస్తర్ ప్రజల
ప్రతిఘటనా యుద్ధం ఒక్కటే.

Leave a Reply