మన దేశంలో ఒక జీవన విధానంగా చెప్పబడుతున్న హిందూమతం నిజానికి చరిత్రలో ఒక జన జీవనహనన విధానంగానే అమలవుతూ వస్తున్నది. మిగతా మతాల కంటే దుర్మార్గంగా ఇది అసమానతలను దైవ సృష్టిగా వ్యాఖ్యానించి, వాటిని ప్రజలు ప్రశ్నించడానికి వీలు లేకుండా చేసింది. ఫలితంగానే బ్రాహ్మణీయ వర్ణ వ్యవస్థ, కులాంతరాల కట్టడుల వ్యవస్థ ఉనికిలోకి వచ్చి పాలకుల చేతుల్లో అవి విభజన అస్త్రాలుగా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్రలో ప్రజల్ని విభజించి పాలించడం కొత్తేమీ కాదు గాని, వలసవాద పాలనాంతంలో 1947 లో జరిగిన దేశవిభజన విలయం మాత్రం అతిపెద్ద చారిత్రక విషాదం. ఎందుకంటే, గురజాడ అన్నట్టుగా మతాలు మాసి పోలేదు సరిగదా మరింత ముదిరిపోయి వాటి(కున్నదంటున్న) ఆధ్యాత్మికత కూడా మటుమాయమై మనుషుల పాలిట మారణకాండగా, ఆత్మిక హననంగా, మౌలిక మానవత్వ హరణంగా మానవ అనుభవంలోకి వచ్చిన మహా విషాదం అది. సామ్రాజ్యవాద నేపథ్యపు అత్యంత బీభత్సకర అసలు రూపమది.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఖాదర్ మోహియుద్దీన్ గారన్నట్టుగా, మంటో దృష్టిలో ప్రేమ, దుఃఖం అనేవి మానవ జీవితంలో వేర్వేరుగా ఉండవు. అవి జీవితం కన్న కవల పిల్లలే. ఆ రెండూ ఆయన సాహిత్యానికి జీవ ధాతువుల్లాంటివి. అందుకే ఆయన తన కాలపు జీవన వాస్తవికతని ఎటువంటి ఆచ్చాదనల్లేకుండా అత్యంత నగ్నంగా సాహిత్యీకరించాడు. ఫలితంగా అశ్లీల రచయిత అనే ముద్రను కూడా ఆయన మోయాల్సి వచ్చింది. అందుకు ఆయనెన్నడూ తనను తాను క్షమార్హుడిగా భావించుకోలేదు. సహజంగా సాగాల్సిన జీవనయానంలో దారికాచి దాడి చేస్తున్న వంచన, కపటం, దోపిడీ, పీడన, స్వార్ధ రాజకీయాలు, మతోన్మాదం లాంటి సమస్యాత్మక కాలుష్యాలను ఆమూలాగ్రం కడిగిపారేయడానికి సాహితీ కరవాలాన్నెత్తిన రాజీలేని కలం యోధుడతడు. అయితే బైటినుంచి జోక్యం చేసుకొని సానుభూతితో సమస్యను పరిష్కరించబూనుకునే సంస్కర్త వలె కాకుండా, ఇతరులతో పాటు తాను కూడా సహ భాగస్వామియై ప్రజలను సతమతం గావిస్తున్న సమస్యలను ఢీకొనే కార్యసాధకుడిగా ఆయన తన సాహితీ కృషినంతా కొనసాగించాడు. అందుకే ఆయనకు సాహిత్యం ఒక కాలయాపన కాదు, అది ఒక కార్యసాధనం.
అందుకే ఆయన ఆనాటి కుళ్ళిన సమాజం బిగించిన నైతిక(తా) చట్రాన్ని బద్దలుకొట్టి సదరు విలువలను తూచే త్రాసును సైతం తోసిరాజని, తనదైన స్కేలుతో అసలైన మానవ విలువలను అంచనా కట్టడానికి ప్రయత్నించాడు. అందుకు అట్టడుగు వర్గాల జీవితాలపై , సమాజంచే హీనంగా చూడబడే పతితులు, భ్రష్టులు, వేశ్యలు, విటులు, తాగుబోతులపై ఆయన దృష్టి సారించి, వాళ్ళ జీవన క్రమంలోని వైవిధ్యాలను వస్తువులుగా తీసుకొని ఎన్నో కథలను రాశాడు. వాళ్ల జీవితాలలోని ఆయా సమస్యల పట్ల తాను అనుభవించిన అశాంతిని, చెలరేగే తన హృదయపు కల్లోలాలను అంతే తీవ్రతతో బట్వాడా చేసి పాఠకుల హృదయాలను ఒక రకంగా పునర్ గాయపరిచి, పునరశాంతికి లోనుచేసి ఆలోచింపజేస్తాడు.
అసలు మనిషి జీవితం సీదాసాదాగా, సహజాతి సహజంగా సాగాలంటాడు మంటో. మనిషిని వికృతీకరించి ప్రకృతి సహజత్వానికి దూరం చేయరాదంటాడు. కానీ నిజజీవితంలో జరుగుతున్నదంతా అదేనని, మనిషిని దేవున్ని చేసే ప్రయత్నంలో అతన్ని/ఆమెను వికృతీకరించి అమానవీకరిస్తున్నారని వాపోతాడు. నిజానికి వర్గ సమాజంలో సజీవమైన మనిషెప్పుడూ పూర్తిగా ‘దేవుని’ గానో, ‘దానవుని’ గానో ఉండడానికి అవకాశం ఉండదు. ప్రజల్లో అన్నీ కలగలసిన సమాహారపు లక్షణాలే సహజంగా ఉంటాయి. కానీ దోపిడీ పీడనల వర్గ(రాజ్య) వ్యవస్థ ఎప్పుడూ పై రెండు ద్వంద్వాల ఆఖరి అంచుల వైపు ప్రజలను నెట్టేస్తూ ఉంటుంది. ఆ క్రమమే అంతిమంగా అమానవీకరణ క్రమంగా పర్యవసించి మనుషులను అసహజమైన, అత్యున్మాద వికృత జీవులుగా మారుస్తుంది. ఈ మొత్తం క్రమంలోని పరిణామాలను ఆయన రాసిన అనేక కథల చిత్రణలో మనం చూడవచ్చు. ఒక్కొక్కసారి చరిత్రకారులు పట్టుకోలేని సూక్ష్మాంశాలను సైతం కొందరు సాహిత్యకారులు పట్టుకుంటారు. అలా చలనంలోని చరిత్రను సూక్ష్మస్థాయిలో రికార్డు చేసే అవకాశం మంటోలాంటి సారభూత(organic) రచయితలకు మాత్రమే ఉంటుంది.
మంటో సాహిత్యంలోని రచనా శైలిని చూస్తే, అది ఏక సమయంలో అసంప్రదాయికం, ఆశ్చర్యజనకం. ఎందుకంటే అప్పటి దాకా రచయితలు అనుసరిస్తున్న సాంప్రదాయిక భాషా సంకెళ్ళను ఛేదించి తానెంచుకున్న వస్తువుకు తగిన వాడి వేడి అయిన శైలిని అతడు ఉపయోగించాడు.తన వస్తువు ఎంత శక్తివంతమైనదో శిల్పం కూడా అంతే శక్తివంతమైంది. వస్తు శిల్పాల మిశ్రమాన్ని అతడు అద్భుతంగా పండించాడు. అలా అనేకంటే వస్తుశిల్పాల అద్భుత సమన్వయంతో పాఠకుల గుండెల్లో పెను మంటల్ని సృష్టించాడనడం సరైనదవుతుంది. అయితే రచయితగా ఎక్కడా నైతిక బోధ చేయలేదు. అత్యంత చేదైన జీవన వాస్తవికతను ఎటువంటి నగిషీల్లేకుండా దిగంబరం చేసి కొట్టొచ్చినట్టుగా తన కథల్లో చిత్రించాడు. అవి చదివిన పాఠకులచే అదే వాస్తవికతను పునర్ జీవింపజేస్తాడు. తత్ఫలితంగా పాఠకులు ఉద్వేగం చెంది తమకు తామే ఏదో ఒక కార్యాచరణకు దిగేలా ఉద్యుక్తుల్ని చేస్తాడు. ఈ ప్రత్యేక లక్షణం వల్లే మంటో తన కాలానికంటే ముందు నడిచాడు. మరోలా చెప్పాలంటే అతడు కాలానికంటే ముందుండి జీవించాడు. పట్టుమని ఐదు పదుల ఏళ్లు కూడా జీవించకుండా మరణించినప్పటికీ అతడు పాఠకుల మనస్సుల్లో నేటికీ అమర రచయితగా వెలుగొందుతూనే ఉన్నాడు.
దేశ విభజన సమయంలో మతపు విష బిందువులు రక్తంలో ఇంకిన మనుషుల మధ్య అవి హఠాత్తుగా అడ్డుగోడలై ఎలా లేస్తాయో మంటో గమనిస్తాడు. ఒకవేళ పాకిస్థాన్లో ఎవరైనా హిందువులను ముస్లింలు చంపేస్తే, ఇక్కడ తన హిందూ ప్రాణమిత్రుడు కూడా తనను చంపడానికి సంసిద్ధుడైన వైనాన్ని చూసి చలించిపోతాడు. అటువంటి అభద్రతా జీవన పరిస్థితుల్లో, తన కుటుంబం అప్పటికే పాకిస్థాన్ కి వెళ్లిపోవడం వల్ల మంటో కూడా పాకిస్తాన్ కు వెళ్లిపోతాడు. అక్కడ కూడా అతడు నీటి నుంచి బయటపడ్డ చేపపిల్ల వలె తండ్లాడుతాడు. అతని తండ్లాట, పోట్లాట అంతా జీవితాన్ని అస్థిరపరచే, కలుషితపరచే (అ)వ్యవస్థ పైనే అన్నది తేటతెల్లం. అతనికి దేశాల సరిహద్దులపై, రాజ్యాల పొలిమేరలపై ఏమాత్రం గురి లేదు. అతడు అన్ని దేశాలకు చెందిన ప్రజా ప్రేమికుడైన ప్రపంచ రచయిత. సహజంగా సాగాల్సిన జీవితం పైనే ఆయన ఏకైక గురి. సహజ ప్రాకృతిక జీవితమే అతని సరిహద్దు. ప్రత్యక్ష మానవ జీవితమే అతనికి పరమ ప్రమాణం. సహజ జీవిత క్రమానికి భిన్నమైన ప్రతి దానిపైనే అతని పోరాటం. అదే అతని సాహిత్య రహస్యం.
ఇలా చరిత్రలో విభజనల ‘పాపం’ ఎప్పుడూ పాలకులదే. కాని ఆ ‘పాప’ భారాన్ని మాత్రం విభజితులైన, శోషితులైన ప్రజలే మోస్తారు. మోస్తూ మోస్తూ వారు ఊరకేం పడివుండకుండా పాలకులపై పోరాటాన్ని ఎక్కుపెడుతూనే ఉంటారు. ఆ ‘పాప పరిహారాన్ని’ పాలకులచే చెల్లింపజేసే రోజు కోసం వేచిచూస్తూనే ఉంటారు.
మొత్తంమీద మతోన్మాద రాజకీయాలకు దేశం మొత్తం ప్రయోగశాలగా ఉండిన దశ నుండి ఇప్పుడు ప్రమాదకర స్థలంగా మారిన దశకు చేరుకున్న నేటి సందర్భంలో సాదత్ హసన్ మంటో కథలకు చాలా ప్రాసంగికత ఉన్నదని నిస్సందేహంగా చెప్పవచ్చు.