ఉద‌యం లేచింది మొదలు లింగన్న మనసంతా కకావికలమైపోతోంది.

వర్షాకాలం, అడవి పచ్చగా వుంది, రాత్రి కురిసిన వర్షానికి నేలంతా బురదబురదగా వుంది. కురిసి కురిసి లింగన్న గుడిసె చెమ్మగా వుంది. ఏడేళ్ళ కూతురు ఆకలితో ఏడుస్తోంది. పదేళ్ళ కొడుకు ఆకలిగా మూలుగుతున్నాడు. లింగన్న భార్య లచ్చిమి బాలింత జ్వరం యింకా తగ్గినట్టులేదు. లింగన్న తల్లి ఎల్లవ్వ కాలుకున్న మానని గాయంతో వెక్కి వెక్కి ఏడుస్తోంది. పొయ్యిమీద అంబలి కుండ ఎక్కించడానికెవరూ లేనట్టుగా వుంది. అందరూ నిస్సత్తువగా వున్నారు. లింగన్న లేవడంతోనే కన్పించిన దృశ్యాలివి. ఇక ఎక్కువసేపు ఆ గుడిసెలో వుండలేకపోయాడు. అలవాటుగా బయటకు నడిచాడు. మబ్బులచాటునుండి సూర్యుడిరకా బయట పడలేదు. తెల్లని వెలుతురు వెన్నెల్లా వుంది. అది బతుకు పోరాటంలో ఓడిపోయి తెల్లజెండా వూపుతున్నట్టుగా వుంది. కాస్త ఎత్తుగావున్న ఆ మైదానంకేసి నడిచాడు. తనకూ నిస్సత్తువగా వుంది. మొదలు నరికిన మద్దిమానుకాడ కూలబడ్డాడు. చుట్టూ విరక్తిగా చూశాడు లింగన్న.

ఇపుడు అతని కుడివైపున ఆ వూరుంది. ఆ వూళ్ళో అయిదారు పెంకుటిళ్ళు, మిగిలినవి పూరి గుడిసెలు. పదిహేను రోజుల క్రితందాకా ఆ వూళ్ళో నలభై కడపలే వుండేవి. ఇపుడా వూరుని ఆనుకొన్న చెలకల్లో మరో పాతిక పూరిగుడిసెలు కన్పిస్తున్నాయి.

‘పెంబి’ అనే రేంజిలో రిజర్వు ఫారెస్టుగా ప్రకటించిన గుమ్మన్‌ ఎగ్లాస్‌పూర్‌ నుండి తరలించబడ్డ గుడిసెలవి. వాళ్ళల్లో లింగన్న ఒకడు. తరలింపబడ్డ రెండు పల్లెల్లో దాదాపు అందరూ నాయకపోళ్ళుండేవాళ్ళు. లింగన్న కూడా నాయకపోళ్ళే.

లింగన్నకు దాదాపు నలభై ఏళ్ళుంటాయి. తల అప్పుడే కొద్దిగా నెరుస్తోంది. వెడల్పు ముఖం. కాస్త ముందుకు పొడుచుకొచ్చిన దవడపై చర్మం పలచ బడుతోంది. నల్లని శరీరంపై ముసలితనపు ముడతలు అప్పుడే వచ్చేస్తున్నాయి. లింగన్న కళ్ళు బాగా పీక్కుపోయాయి.

నలుగురున్న కుటుంబమే అతనికి భారమవుతోంది. ఇక్కడికొచ్చిన పదిహేను రోజుల్నించీ గంజితో సరిపెట్టుకోవాల్సివస్తోంది. ఇక్కడకు రావడం మొదలుకొని అన్నీ దుశ్శకునాలే ఎదురవుతున్నాయి. అసలు ఇక్కడికి తరలించబడ్డమే ఓ పీడకలలా యిప్పటికీ భయపెడుతోంది. ఆ భయం నించి, బాధనించి యింకా ఎవ్వరూ కోలుకోలేదు.

సరిగ్గా పదిహేను రోజుల క్రితం పట్టపగలు, ఎండ చిటపటలాడుతోంది. ఒక జీపు, దాని వెనక రెండు వ్యాన్లు – మబ్బులేని ఉరుముల్లా వూరుమీద పడ్డాయి. వచ్చీరావడంతో మాటపలుకూ లేకుండా వూరిని ఎన్‌సర్కిల్‌ చేశారు. అందినవారిని అందినట్టుగా పిల్లా పాపలు, స్త్రీలు, వృద్ధులు అనే విచక్షణలేకుండా లాఠీలతో బాదారు. ఏం జరుగుతుందో అర్థంకాలేదు. బిక్కచచ్చిపోయి ఒకటే పరుగు, ఏడుపులు పెడబబ్బలు, ఎంతో బీభత్సం క్షణాలమీద జరిగిపోయింది. అడవి జంతువుల్ని వేటాడినట్టు వేటాడారు. అందర్నీ వ్యాన్‌లోకి తోసేసారు. ఆ వెంటనే భగభగ మంటలు లేచాయి. వాళ్ళ హృదయాల్లా వాళ్ళ గుడిసెలూ, సామాగ్రీ మండిపోయాయి. వాళ్ళ ఆశలు కన్నీరై కరిగిపోయాయి. వాళ్ళకు ఆ బూడిదయినా మిగలలేదు.

అప్పటికి లచ్చిమి ఎనిమిది రోజుల బాలింత. ఇక్కడికి తెచ్చి పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కాదు, వెళ్ళిపోకుండా కాపలా కాస్తున్నారు. ఇక్కడ రెండు రోజులదాకా పచ్చి మంచినీళ్ళయినా దొరకలేదు. దానికి తోడు ముందుగా వుండటానికి నీడ కావాలి. బాలింతకు కొంత విశ్రాంతి కావాలి. ఇవేవీ లభించలేదు. గుడిసెకు గుంజలు పాతారు. ఆ రాత్రే దాహంతో, ఆకలితో తొమ్మిది రోజుల పసిగుడ్డు ప్రాణం విడిచింది. ఆ కన్నీటి తడి ఆరనేలేదు, గుడిసెపై పొరక కప్పిన రోజున పొరక కుచ్చుకుపోయి తల్లిగాయాన్ని కర్రతో పొడిచి నిప్పులు రాజేసినట్టయిపోయింది.

ఒంటిమీది గుడ్డతప్ప ఏమీలేని స్థితి. వర్షాలు చలి. అన్నిటికన్నా ఆకలి… అది బాలెంతపులిలా విరుచుకుపడిరది. అది తమ పొలాల్లో తమనే కూలీలుగా మార్చింది. ప్లాంటేషన్‌ కూలీలుగా మారినా అర్థాకలితోనే పడుకోవాల్సివస్తోంది. లింగన్నకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఎడంవైపు కాస్త ఎడంగా వున్న బంగళాకేసి చూశాడు అతడు. అది ఫారెస్టు బంగళా. అందులో ఒకవైపు పోలీసు అవుట్‌పోస్టు. మరోవైపు ఫారెస్టు వాళ్ళు. పోలీసులకు నిద్రమత్తు యింకా వదిలినట్టులేదు. మత్తుగా అటూయిటూ జోగుతూ తిరుగుతున్నారు. పోలీసుసెంట్రీ తుపాకీ కాళ్ళ సందున పెట్టుకుని, బెంచీలా పాతివున్న చెక్కకు నడుం ఆన్చి వొరిగి నిల్చున్నాడు. అటు చూస్తున్న కొద్దీ అతడికి అసహ్యంగా వుంది. దృష్టి మరల్చి ఆకాశంకేసి నిర్వేదంగా చూశాడు. సూర్యుడు మబ్బుల చాటున దోబూచులాడుతున్నాడు. ఎందుకో చప్పున తమ్ముడు భీమన్న గుర్తుకొచ్చాడు.

ఏడాదికింద భీమన్న వూరొదిలి స్క్వాడులో చేరినపుడు లింగన్న నిర్లిప్తంగానే వుండిపోయాడు. రెక్కలు వచ్చిన పక్షి, వాడి యిష్టానుసారం బతకనీ అనుకున్నాడు. పెద్దగా అడ్డుచెప్పనూలేదు, ఇష్టంగా పంపించనూలేదు. కాని పోలీసులు తమ పల్లెని తగలబెట్టిన తర్వాత భీమన్న పదేపదే గుర్తొస్తున్నాడు. వారం క్రితం కలిసిన తమ్ముడ్ని చూడగానే ద్ణుఖం ఆగిందికాదు. వాడు చెప్పినమాటలు పదేపదే గుర్తొస్తున్నాయి. ‘ఏడ్వకు అన్నా! ధైర్యంగా వుండాలి. మన రాజ్యం తప్పక వస్తుంది.’

లింగన్న ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఆ మైదానంలో జనం చేరుతున్నారు. అపుడే డ్యూటీ టైమైపోయిందా అని ఆశ్చర్యపోయాడు.

ఊరికి ఆనుకొనివున్న పంటచేలలో మూరెడంత ఎదిగిన మొక్కజన్న పెరడు పచ్చగా నవ్వుతోంది. వాటిని చూస్తుంటే లింగన్న మనసు భారమైపోయింది. ‘అక్కడే ఉండగలిగితే ఈ పాటికి తన చేనుకూడా ఇలా పచ్చగా నవ్వేది. ఇపుడు కూలిబతుకు అయిపోయింది. ఆ కూలి కూడా ఎప్పుడు దొరుకుతుందో ఎపుడు దొరకదో తెలియని స్థితి’ నిట్టార్చాడు.

కాళ్ళుచేతులు ఆడిరచగలిగి, పనిచేయగలిగిన వాళ్ళంతా ఆ మైదానంలోకి చేరుకున్నారు. పదకొండు, పన్నెండు ఏళ్ళ పిల్లల్నించి, ముడతల్తో వడలిపోయిన ముసలివాళ్ళదాకా అందరూ చేరుకున్నారు. వాళ్ళంతా తరలించబడ్డ కుటుంబాలవాళ్ళే, వాళ్ళకు ఆ కూలికిమించిన జీవనోపాధి ఏదీలేదు. ప్రస్తుతానికి ఏదో అదృశ్యశక్తి వాళ్ళనోళ్ళు నొక్కినట్టుగా బిక్కుబిక్కుమంటున్నారు.

వారితోపాటే ఫారెస్ట్‌ బంగళాలోని పోలీసుల, ఫారెస్ట్‌ వాళ్ళ కదలికలు కూడా ఎక్కువవుతున్నాయి. లింగన్న మాటపలుకు లేకుండా అలాగే కూర్చుండిపోయాడు. అతని ఆలోచనలు ఎక్కడెక్కడికో సుదూరంగా సాగుతున్నాయి.

చుట్టు దట్టమైన అడవి, అడవి మధ్యగా మెలికలుతిరిగి సాగేవాగు. ఆ వాగు ఒడ్డున గుమ్మన్‌ ఎగ్లాస్‌పూర్‌ గ్రామాలు… తనపుట్టుక, బాల్యము, ఆటాపాటా అన్నీ అక్కడే సాగాయి. తన జీవితం అనుభవాలు అన్న అక్కలు పల్లెల్తో పెనవేసుకున్నాయి. గుమ్మన్‌ ఎగ్లాస్‌పూర్‌లో పుట్టిన తన జీవితం లచ్చిమితో ఒక సంసారంగా ఎదిగింది.

ఒకప్పుడు తమ గ్రామాల చుట్టూ అడవి వుండేది. లెక్కలేనన్ని పొదలుండేవి. ఇప్పుడా అడవంతా పలుచబడిపోయింది. పొదలన్నీ మాయమైపోయాయి. ఒకప్పుడు లెక్కలేనన్ని అడవి జంతువులు ‘కో’ అంటే ‘కో’ అంటూ రాత్రీపగలు అనకుండా కనపడేవి… అవికూడా పలుచబడిపోయాయి.

ఆ అడవంతా ఏమైపోయిందనే ఆలోచన లింగన్నకు అప్పుడప్పుడు కలిగేది. చాలారోజుల తర్వాతగానీ ఆ ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు. అది అర్థం కావడం సరిగ్గా ఏడేళ్ళ క్రితం మొదలైంది. తాము యిదివరలో ఎన్నడూచూడని ఆలీవ్‌ గ్రీన్‌ యూనిఫారాలు, భుజమ్మీద నాటుతుపాకులు, చెరగని చిరునవ్వు, నూనూగుమీసాల పిల్లలు గూడేల్లోకి రావడంతో మొదలైంది. ఆ తర్వాత సముద్రం కదలబారింది. ఎన్ని ఆటుపోట్లు… ఎన్ని త్యాగాలు… ఎంత నెత్తురు…

లింగన్నకు కోపంతో దవడలు బిగుసుకున్నాయి. అంతలో కచ్చా రోడ్డుమీద మోటారు వాహనాల చప్పుడు విన్పించింది. జనంలో కదలిక మొదలైంది. ఒకలారీ ఒక జీపు వచ్చి ఫారెస్టు బంగళాముందు ఆగాయి. అక్కడ గుమిగూడిన వారిని వరుసల్లోకి సర్దుతున్నారు.

జీపు నుండి దిగిన ‘పెంబి’ ఫారెస్టు రేంజర్‌, ఎప్పుడూ అతన్ని అంటి పెట్టుకొని తిరిగే ఫారెస్టరు వెంటరాగా ఆఫీసు గదిలోకి వెళ్ళాడు. కాసేపు కోపంతో కూడిన రేంజర్‌ అరుపులు వినబడ్డాయి. మరి కాసేపట్లో ముఖం మాడ్చుకుని వచ్చిన ఫారెస్టరు కన్పించాడు. అతను వస్తూనే గార్డులమీద అదేస్థాయిలో కేకలు వేసాడు. ఇక్కడేం చోద్యం జరగడంలేదు, వెళ్ళి త్వరగా కూలీలను లారీలకు ఎక్కించండి.

దాంతో అక్కడికి కూలికోసం వచ్చినవాళ్ళు ఒకరిని తోసుకుంటూ ఒకరు ముందుకు రాసాగారు. గబగబా లింగన్న కూడా అటుకేసి నడిచాడు.

ఆ రోజు అక్కడికి కూలి పనికి వచ్చిన వాళ్ళు డెబ్బయిమంది దాకా వుంటారు. కూలి దొరికేది అందులో సగం మందికే. ఇంట్లో ఒక్కరికైనా కూలి దొరక్కపోతే ఆరోజు అందరూ పస్తులే. ఆ కఠోర సత్యం వాళ్ళల్లో వారినే తోసుకునేలా చేస్తోంది.

‘‘అరేయి పోరడా! నువ్వెక్కడికి వత్తన్నవ్‌? నిన్నెవడు పనికి తీసుకుంటానని చెప్పిండురా?’’ ఫారెస్టు గార్డొకడు బక్కపలుచని పదేళ్ళ పిల్లవాణ్ణి పట్టుకుని వెనక్కి తోసేశాడు. పట్టుజారిపోయి శోషవచ్చి పడిపోయాడా పిల్లవాడు. లింగన్న అటుకేసి చూశాడు. వాడు ఎంకులు తన కొడుకే. అతని మనస్సు విలవిల్లాడిపోయింది. వాడి దగ్గరకు వెళ్ళాలనిపించింది. కాని ఆగిపోయాడు. అటువెళ్తే యిక్కడ తనకైనా పనిదొరక్కపోవచ్చు. కోటా నిండిరదని వాపసు పంపవచ్చు.

ఎంకులు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. ‘‘లేద్దొరా నేను పెద్దోల్ల తీరు పనిజేస్త… చెయ్యకపోతే పైసలియ్యకు దొర’’ దీనంగా వేడుకున్నాడు.

‘‘చల్‌ హఠ్‌ రే’’ గార్డు కోపంగా ఎంకుల్ని వెనక్కి తోసేశాడు.

అప్పటికి శోషవస్తున్న ఎంకులు వెల్లకిలాపడిపోయాడు. అయ్యో కొడుకా! అంటూ లచ్చిమి వాడి దగ్గరకు చేరింది. లచ్చిమి ఈ స్థితిలో జ్వరంతో కూలికి రావడానికి తయారౌతుందని ఊహించనట్టున్నాడు. లింగన్న భార్యని అక్కడ చూసి అవాక్కయిపోయాడు. పిల్లవాణ్ణి తీసుకొని గార్డుకాళ్ళమీద పడిపోయింది లచ్చిమి.

‘‘నీ బాంచెన్‌ దొర పని లేకుంటే ఆకలికి చచ్చిపోతాం దొరా! మీరు ఎంతిస్తే అంత తీసుకుంటం దొరా. మా యిద్దరికి కలిపి ఒక్క కూలీ అన్నా యిస్తే సాలు దొరా …కాదనకు దొరా నీ కాల్మక్త’’!

అప్పటికే లారీ ఎక్కిన లింగన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కడుపులో చేయిపెట్టి తిప్పినట్టుగావుంది. తాను దిగలేడు. దిగితే మళ్ళీ జాగా దొరక్క తన కూలీ కూడా పోవచ్చు.

‘‘నేనేమి చెప్పాలమ్మా! మాకు కేటాయించిన డబ్బులతో పని జరగాలి. ఎక్కువమందిని తోలుకపోదామంటే తక్కువ కూలీ యిచ్చి మిగిలింది మేం తిన్నమని అటు ఆఫీసర్ల తోటి, ఇటు మీ అన్నలతోటి గొడవ – ఏం జెయ్యమంటవ్‌? వద్దు’’ అంటూ మరో గార్డు కాస్త సౌమ్యంగానే తన నిస్సహాయతను వెళ్ళగక్కాడు. పదిహేనురోజులుగా యిలాంటి సంఘటనలు మామూలైపోయాయి. ఈ రోజు తన భార్యా, తన కొడుకూ కావడంతో బాగా చలించిపోయాడు లింగన్న. అంతలో మరొకరు కాళ్ళపై పడ్డారు. గార్డులు కసురుతున్నారు. చివరకు కాస్తో కూస్తో కండపుష్టి కలిగిన ముప్ఫై అయిదు మందిని ఏరుకొని లారీలోకి ఎక్కించారు. మిగతావాళ్ళు నిస్సహాయంగా చూస్తూవుండి పోయారు. అంతదాకా మౌనంగా ఉన్న పోలీసులు లాఠీలు ఊపుకుంటూవచ్చి వారిని వెళ్ళగొట్టసాగారు. మూర్తీభవించిన శోకదేవతలా వున్న లచ్చిమి ముడతలుపడిన ముఖం, రేగినజుట్టు, ఏ ఆచ్ఛాదన లేని ఛాతీ – పాలు గడ్డలుకట్టి సలుపుతున్నాయి. నిస్సహాయంగా జ్వరంతో వణుకుతూ కొడుకుని అదుముకొని కూలబడిపోయింది. అప్పుడే పరుగెత్తుకొచ్చిన కూతురు ఏడుస్తోంది. ఆ వెనక మెల్లిమెల్లిగా లింగన్న తల్లి ఎల్లవ్వ వస్తోంది. 

లారీ కదిలింది. లింగన్న వాళ్ళవైపు చూడలేక తల అటువైపు తిప్పుకున్నాడు. గతుకుల మట్టిరోడ్డుమీద లారీ కుదుపులతో ముందుకు పోతోంది. అలా సాగిసాగి గుట్టబోరు, పులిమడుగు, చీకటివోర్రె దాటి పెద్ద వాగును సమీపించింది. వంతెన దాటి ఆపైన మిట్టను దాటింది. మిట్ట వంపున్న ఖాళీ స్థలమే పదిహేను రోజుల క్రితం గుమ్మన్‌, ఎగ్లాస్‌పూర్‌ గ్రామాలు.

ఎటు రెండు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి వున్న మైదానం – అడవి మధ్యలో రేగిన గాయంలా వుంది. కాలి బూడిదైపోయిన గూడేలు ఇంకా పూడ్చని చేదబావి. అక్కడక్కడ బగ్గుల కుప్పలు ఊడ్చినందుకు గుర్తులుగా. లింగన్న నలభైఏళ్ళ జీవితము కష్టసుఖాలు, బాల్యం ఆ బగ్గుల కుప్పవున్నకాడ వుండే గుడిసెలోనే…

లారీ ఆగింది. ఆడ, మగ కూలీలందరూ బిలబిలమంటూ కిందికి దిగారు. ఫారెస్టు గార్డులు ‘‘పదపద’’ అంటూ తొందర చేశారు. నీలగిరి (యూకలిప్టస్‌) మొక్కలున్న సంచుల్ని మోశారు కూలీలు. ఎస్కార్టు కోసం వచ్చిన పోలీసులు నేరేడుచెట్టు కింద తీరిగ్గా కూర్చున్నారు.

‘‘ఇదిగో మీరు ఈ వైపున ఇక్కడ మార్కు చేసిన వరుసలో నాటాలి. మధ్యాహ్నం వరకు పని పూర్తయిపోవాలి’’ ఇంఛార్జి ఫారెస్టర్‌ అందరికి హెచ్చరికలు చేస్తూ మార్కేషన్‌ చూపిస్తూ వెళ్ళాడు.

గార్డులు కూలీల వెంట ఉండిపోయారు. తొందరగా కానివ్వండి అనే అరుపులతో కేకలతో పని మొదలైంది. మొక్కలు నాటుతుంటే లింగన్న మనసంతా ఏదోలా అవుతోంది.

ఒకప్పుడు యిదంతా తమ చేన్లు చెలకలు, గూడేలు, పంటలు పండిరచుకునే భూముల్లో యిప్పుడు పిచ్చి మొక్కలు నాటాల్సివస్తోంది.

ఒకప్పుడు యిదే అడవిలో కిక్కిరిసివుండే వెదురునూ, పెద్దపెద్ద చెట్లనూ తన లాభాలకోసం కొల్లగొట్టుకుపోయిన వాడు, అడవిని అలాగే వదిలేసి పోయాడు. కాని తాము అడవిని నరికింది పచ్చని పంటలు పండిరచడానికి, పట్టెడు మెతుకులు కోసం. అటువంటి వాళ్ళే నేరస్తులైపోయి చివరకు తమ చేతులమీదుగానే మళ్ళీ ఆ నేరస్తుల కోసమే తమ భూముల్లో ప్లాంటేషన్‌ పేరుమీద మొక్కలు నాటిస్తోంది ప్రభుత్వం.

దాదాపు పదకొండు గంటల సుమారుకు రేంజరు తన అనుచరులతో స్పాట్‌ మీదికి యిన్స్‌పెక్షన్‌ కొచ్చాడు. ఫారెస్టరు, ఫారెస్ట్‌ గార్డులు ఆ అధికారిముందు తాము మరింత సమర్థులుగా కన్పించడంకోసం కాబోలు, కూలీలపై అజమాయిషీ ఎక్కువ చేస్తూకూడా విడిపడ్తున్నారు. 

రెంజరు కాసేపు ప్లాంటేషన్‌ వర్కుస్పాట్‌ చుట్టూ అటు ఇటూ తిరిగాడు. వెంటే వున్న ఫారెస్టర్‌తో ఏవోకొన్ని సూచనలు చేశాడు. చివరికి అలిసిపోయినట్లుగా కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పందిరి నీడకు చేరుకున్నాడు.

క్షణం తీరికలేని గార్డుల అరుపులు, బూతుల మధ్య లింగన్నకు నడుంకాస్త యిట్లా తిప్పడానికైనా వీల్లేకపోయింది. ఆకలిగా వుంది. శోషవస్తున్నట్టుంది. చెమటలు కక్కుతూ వున్నాడు. అయినా ఏదో ఆలోచన. అది పక్కనున్న వాగులా సాగుతూనే వుంది. గెరిల్లా స్క్వాడులు గూడేలవాళ్ళు కలిసి ఇలాంటి ప్లాంటేషన్లను పీకేసిన ఐదారు సంఘటనలు విని వున్నాడు లింగన్న. వాటిలో రెండు తనకు తెల్సిన గూడేల్లోనే జరిగాయి. ఇవన్నీ పీకేసి యిక్కడే మళ్ళీ గుడిసెలు వేసుకొని మళ్ళీ యిదంతా తిరిగి అందరం దున్నుకోగలిగితే ఎంత బావుండేది… నిరుటిలా! ఈ యేడూ ఉంటే ఈపాటికి ఈ ప్రదేశమంతా జన్న, మొక్కజన్న చేన్లతో ఎంత కళకళలాడేదో…

తమ్ముడు భీమన్న, స్క్వాడు అన్నలు అనేదాన్లో ఎంతో వుంది. తిండికోసం చేసే యుద్ధంలో తిండి కూడా వదులుకునే యుద్ధం సైతం చేయాల్సివస్తుందట! ఈ ప్లాంటేషన్‌ పీకేస్తే ఈ భూమి మళ్ళీ తమ చేతికొస్తుందా? అంతదాకా ఎలా గడపడం? ఏం తిని బతకడం?

మధ్యాహ్నం రెండవుతోంది. ఎండ చురుక్కుమంటోంది. లింగన్నకు బాగా నీరసంగా వుంది. అయినా చేతులు తమపని చేసుకుపోతూనేవున్నాయి. కాని ఆ పాదుల కాడికి రాగానే ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. వారంక్రితం యిక్కడే… మొక్కలకు పాదులు తీస్తుంటే ఎవరిదో… పసి పిల్లాడి శవం… కడుపులోకి గడ్డపార కస్సున దిగింది. మురిగిపోతున్న శవం వాసన బుస్సున పొంగింది… భయంతో కేకవేశాడు. ఎవరో ఆ శవాన్ని తవ్వి తీశారు. మరోచోట పాతిపెట్టారు. అది పోషవ్వ తొమ్మిది నెలల కొడుకు శవం… అది యిదే… యిదే ప్రదేశంలో వుండిరది. శవానికి సైతం స్థలం నోచుకోని బతుకు… తమ శవాలపై వాళ్ళు మొక్కలు నాటుతున్న ప్రభుత్వం… ఆ మర్నాడు…

చనిపోయిన ఎనిమిదిరోజుల కొడుకు గుర్తొచ్చాడు లింగన్నకు. పాతిపెట్టిన మూడోరోజే నక్కలు వాడి శరీరాన్ని తవ్వి తీశాయి. తను చూసేసరికి అవి పీక్కుతినగా పొట్టలోని పేగులు, ముఖం, కాళ్ళు చేతులు ఆకారం కనిపించకుండా నెత్తురు గుడ్డుగా మారిపోయింది… దాన్ని పట్టుకోవటానికే హృదయం జల్లుమంది. అయినా తప్పలేదు. మళ్ళీ బంద తవ్వి పాతిపెట్టాడు…

ఇప్పటికి అన్నలు వచ్చి ఈ ప్లాంటేషన్‌ పీకేద్దామంటే ఎంత బాగుండు… ఒరేయ్‌ తమ్ముడూ… భీమన్నా… ఎక్కడున్నావ్‌రా? 

ఏదో అస్పష్టంగా కేకలేస్తూ, భయంతోనో, ఆకలితోనో, అలసటతోనో శోషవచ్చి పడిపోయాడు లింగన్న. ఎవరో గార్డు పక్కకు ఈడ్చి పారేశాడు. 

‘‘లంజాకొడుకులకు రోజూ యిదే యిదైపోయింది. ఇకనుండి యిలాంటోళ్ళకు కూలి అసలే యివ్వొద్దు. అలా అవుతే యిక ఎవడూ యిలా నఖరాల్‌ చెయ్యడు’’ – రేంజరు ఏదో అరుస్తూనే ఉన్నాడు.

(ఈ సంఘటన జరిగిన నెలకే ఆ ప్లాంటేషన్‌ని ఆ చేతుల్తోనే పీకేశారని, ఆ రేంజరుకు ఆ చేతుల్తోనే దేహశుద్ధి చేశారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మరో నెలకు 250 మంది గిరిజనులు పెంబి ఫారెస్టు ఆఫీసుపైనా, బ్యాంకుపైనా, ధాన్య గిడ్డంగులపైనా దాడిచేసి అందినకాడికి తీసుకుపోయారని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. ఈ క్రమం ఇంకా సాగుతూనే వుంది. అలా జోడెన్‌ఘాట్‌ నించి జోహాన్‌బర్గ్‌ దాకా కొమురం భీములుగా, నెల్సన్‌ మండేలాలుగా, ఇంద్రవెల్లి అమరవీరులుగా పోరాడుతూనే ఉన్నారు. 

అరుణతార – సంచిక: 114, అక్టోబరు-నవంబరు 1989

Leave a Reply