నిజం వాళ్ళు అబద్ధం చెప్పారు..ఈ వీధులేమీ బంగారంతో చేయబడలేదని అరిచి అరిచీ నా గొంతు బొంగురుపోయింది.. చివరకు నాకు కఠోరమైన జీవితమే దక్కింది. వాళ్లన్నట్లు ఈ వీధులు బంగారంతో చేయబడ్డాయా ..లేదు పచ్చిఅబద్ధం ఇది ! ప్రమాదాలతో..నిండి ఉన్న వీధులు ఇవి. నాకు తెలుసు ! కానీ ..ఈ లోపల ఓ అద్భుతం జరిగిపోయింది. ఈ రాత్రి నేను కూడా వాళ్ళలా ఉండడానికి.. నాలోపల ఒక విచిత్రమైన మనోలైంగిక మానసిక స్థితి సంసిద్ధమై పోయింది ! వాళ్ళు నన్ను నా నడుము దాకా మీలో...మిమ్మల్ని నాలో చూసారు. వాళ్ళు నన్ను ... మిమ్మల్ని నేను కళ్ళతో తాగేయడం చూసారు. ఇదంతా చూసిన అమ్మ కూడా నన్ను గుర్తుపట్టేసింది ! నువ్వో దెయ్యానివి, ఇక్కడి... ఈ భూమ్మీది పవిత్రమైన యాత్రను వృధా చేశావని దుఃఖ పడింది ..అమ్మ భయపడిపోయింది. ఎంతగా అంటే.. అమ్మ ఇక నన్ను ఇంట్లోంచి వెళ్ళిపొమ్మంది. అలా అంటున్నప్పుడు నొప్పితో ఆమె ఆత్మ విరిగి ముక్కలైపోయింది. నా సామానంతా రోడ్డు మీద కకావికలంగా విసిరేసింది. ఇక నేను ఇంటి బయటే పడుకున్నాను..నా ఆత్మ మాత్రం మేలుకునే ఉంది. మీకు తెలీదు..అమ్మ అన్నట్లు.. నా ఈ జీవన యాత్ర నేనుగా నిర్మించుకుంది కాదు ! మీరంతా ఈ వీధుల్లో తిరుగుతూ..నవ్వుతూ త్రుళ్ళుతూ ఉంటారు కదా..కనీసం అలా కనిపిస్తారు ఈ లోకానికి ! కానీ నాకు మాత్రం మీరంతా నిద్రావస్థలో ఉన్నట్లు...బొద్దింకల్లా ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది...అవును నిజం కాదా ఇది చెప్పండి?? మీరంతా.. ఏ చైతన్యమూ లేకుండా మరుసటి రోజు దాకా నిద్రపోతూనే ఉంటారు..! ముష్ఠి ఘాతాలతో కొట్టు కుంటూ తిట్టుకుంటూ.. ద్వేషించుకుంటూ కూడా మీరు ఒకరినొకరి ముద్దు పెట్టు కుంటారని..తెలుసు నాకు ! అదసలెలా సాధ్యమో ఆశ్చర్యం నాకు ! సరే...మరి మీకు తెలుసా మనమంతా కలిస్తే ఒకే ప్రార్థన..ఒకే మంత్రం ..ఒకే పాటగా మారగలమని ! అలా ఒకే గానంలా మారడం లో పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చు..ఉండొచ్చు కూడా ! వాళ్లు నిర్దేశించిన స్త్రీ-పురుష సమీకరణా ల విషమ లైంగిక ఉపద్రవం ముంచుకొస్తున్నప్పటికీ..వాళ్ళు మన మీద..పైకి చెప్పని అనేక విషయాల కంటే కూడా మనం ఐక్యంగా ఉండడమే చాలా శక్తి వంతంగా ఉంటుంది. ఎంతగా అంటే.. మన పూర్వీకులు మృత శరీరాల నుంచి ఎంత శక్తివంతంగా పైకి లేచివస్తారో ..అంతే దృడంగా ఉంటాం మనం కలిసి ఉంటే ! గుర్తు పెట్టుకోండి.. మనల్ని పట్టి బంధించి ఉంచే క్షితిజ రేఖల కంటే కూడా మనమే పొడవైన వాళ్ళం...! మన హృదయాలను గుచ్చేసే సైరన్ ల కంటే కూడా మనమే పదునైన వాళ్ళం ! ఊకదంపుడు బాయ్స్ టౌన్ బార్లలో తెగ వాగే అబ్బాయిల ప్రగతి కంటే కూడా మనమే చాలా నయం ! ఆకాశంలో నక్షత్రాల దాకా మన రక్తాన్ని అన్యాయంగా ధార పోసిన వాళ్ళకంటే కూడా మనమే..మంచివారం.. గొప్పవారం ! అయితే వినండి... దాని కోసం విడి విడిగా కాకండా అందరం కలవాలి. ఒక సామూహిక గానంగా మారాలి !జాగ్రత్త..!వాళ్లు నిర్దేశించిన శుధ్ధ స్త్రీ-పురుష నమూనాల విషమ లైంగికతా ఉపద్రవం ముంచుకొస్తున్నప్పటికీమనమే..బలమైన వాళ్ళం ! మన భిన్న లైంగికత గురుంచి పైకి చెప్పబడని అనేక విషయాల., అబద్ధపు ప్రచారాల కంటే కూడా వాస్తవంలో మనం చాలా శక్తివంతమైన వాళ్ళం ! జ్ఞాపకం పెట్టుకోండి..మరోసారి వినండి ! మనం మన పూర్వీకులు మృత శరీరాల నుంచి పైకి లేచి వచ్చేంత శక్తివంతమైన వాళ్ళం ! మనకి తెలిసి నట్లుగా వాళ్ళకి అది తెలీదు మరి !
“కే ఉలాండే బారెట్ “..న్యూయార్క్ కి చెందిన ట్రాన్సజెండర్ కవయత్రి,పబ్లిషర్,జర్నలిస్ట్.
★Song for the kicked out★– kay ulan day Barret-Newyork.
★గెంటి వేయబడ్డ వారి కోసం పాట★! -కే వులాండే బారెట్ !.
అనుసృజన-గీతాంజలి