ఫాసిస్టు బుల్డోజర్ బాహాటంగానే రాజకీయ హత్యాయత్నాలకు పాల్పడుతుంది. తన ఆధిపత్యానికి, రాజకీయ సమీకరణాలకు అడ్డంగా ఉన్న ఏ శక్తినీ అది భరించలేదు. దీనికి ఉత్తరప్రదేశ్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్‌పై కాల్పులు ఉదాహరణ. జూన్ 28 బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు వెళుతుండగా ఆయన వాహనానంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన శరీరంలోకి రెండు తూటాలు దూసుకెళ్లాయని వైద్యులు తెలిపారు. సహరాన్పూర్ ఆసుపత్రిలో డాక్టర్లు ఆయనకు వైద్యం చేస్తున్నారు.
ఈ ఘటనకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులను దేశ ప్రజలందరూ గుర్తుపట్టగలరు. ఉత్తరప్రదేశ్‌లోని ఫాసిస్టు రాజ్యం తీవ్రరూపాలు దేశమంతా తెలుసు. దానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజల నిరసనలు కూడా తెలుసు. యోగీ ఆదిత్యనాథ్ కాషాయ పాలన సమాజాన్ని, ప్రజాస్వామిక విలువలను, చైతన్యాన్ని ధ్వంసం చేస్తున్నది. అన్ని రకాల అసమ్మతులను తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. అందులో భాగమే భీం ఆర్మీ నేత చంద్రశేఖర్ అజాద్ మీద హత్యాయత్నం. రాజకీయ ప్రత్యర్థులను తుదముట్టించే ఫాసిస్టు వ్యూహంలో భాగంగానే సంఫ్‌ుపరివార్ శక్తులు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాయి.
చంద్రశేఖర్ ఆజాద్ అగ్రకుల బ్రాహ్మణీయ ఫాసిజానికి వ్యతిరేకంగా చాలా కాలంగా దళిత పోరాటాన్ని నిర్మిస్తున్నాడు. 2015లో ఆయన 2015లో భీమ్ ఆర్మీని స్థాపించారు. కుల పీడనకు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన పోరాటం అగ్రకుల ఎన్నికల రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసింది. దీనితో ఆయన మీద నిర్బంధం మొదలైంది. 2018లో ఆయనను రాజకీయ ఉద్దేశాలతో ప్రభుత్వం అరెస్టు చేసింది. అలహాబాద్ కోర్టు బెయిలు ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన అనేక ప్రజా పోరాటాలు చేపట్టాడు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన పోరాటాల్లో భీం ఆర్మీ పాల్గొన్నది. గ్రామ స్థాయిలో దళితులకు భీం ఆర్మీ ఆత్మవిశ్వాసం కలిగించింది. రాజ్యాంగబద్ధ హక్కులు, కుల పీడన, మతతత్వం మొదలైన వాటిపై శాంతియుత మార్గంలో భీం ఆర్మీ పోరాటాలు నడిపినా ఆ సంస్థ మీద, ముఖ్యంగా చంద్రశేఖర్ అజాద్ మీద ప్రభుత్వం చాలా అక్రమ కేసులు పెట్టింది. ఆయన మీద నిర్బంధం తీసుకొచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లో పేదల, ముస్లింల ఇండ్లను కూలగొట్టిన బుల్డోజర్ విధ్వంస విధానం మొత్తంగానే ఫాసిస్టు పాలనలో భాగం. కళ్లకు కనిపించే విధ్వంసమేగాక అత్యంత సూక్ష్మరూపాల్లో అక్కడ అడుగడుగునా ఫాసిజం నడుస్తోంది. రోడ్ల మీద ఫాసిస్టు మూకల స్వైర విహారం, గుర్తు తెలియని వ్యక్తుల హత్యాకాండ, కస్టడీలో అంతుతెలియని మరణాలు, అక్రమ కేసుల్లో అరెస్టులు, పౌర సమాజంలో బాధ్యతాయుతంగా పని చేస్తున్నవాళ్లకు బెదిరింపులు.. ఉత్తరప్రదేశ్‌లో రోజువారీ విషయాలుగా మారిపోయాయి. ఫాసిస్టు వ్యతిరేకంగా ఎక్కడ ఏ నిరసన వచ్చినా దానిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగమే అజాద్ మీద హత్యాయత్నం.
చాలా చిన్న వయసులోనే రాజకీయ, సామాజిక ఉద్యమ రంగంలోకి ప్రవేశించిన అజాద్ తనదైన ఒరవడిలో కులవ్యవస్థను, ఫాసిజాన్ని ఎదుర్కొంటున్నాడు. అందుకే ఆయన మీద ఈ దాడి జరిగింది. లౌకిక ప్రజాస్వామిక శక్తులు, ఫాసిస్టు వ్యతిరేక పోరాటకారులు చాలా తీవ్రంగా ఈ ఘటనను తీసుకోవాలి. ఇప్పటికే సాంస్కృతిక, మేధో, రాజకీయ రంగాల్లో పని చేస్తున్న ఎందరినో ఫాసిస్టు శక్తులు హత్య చేశాయి. ఈ దిశగా మరింత అమానుషంగా, రాజ్యాంగవ్యతిరేకంగా సంఫ్‌ుపరివార్ శక్తులు బరితెగించగలవని అజాద్ మీద కాల్పులు స్పష్టం చేస్తున్నాయి. దేశం ఎలా ఉన్నదో, ఎలా ఉండబోతోందో కూడా తెలుసుకోడానికి ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ. ఆ దిశగా ఫాసిజం నేరుగానే సవాల్ విసురుతోంది. దాన్ని ప్రతిఘటించడం ఇవాళ ప్రజాస్వామిక విప్లవ శక్తుల కర్తవ్యమని విప్లవ రచయితల సంఘం పిలుపు ఇస్తోంది.