గణేష్ నారాయణ్ దేవి జ్ఞానానికి, శక్తికి మధ్య వుండే సంబంధం గురించి పరిశోధిస్తూ అనేక పుస్తకాలు, వ్యాసాలు రచించారు. మానవ చరిత్రలో శిష్టవర్గాలు, జ్ఞానాన్ని నిర్వచిస్తూ దానిపై గుత్తాధిపత్యాన్ని ఎలా సాధించారో ఆయన వివరించారు. ఆయన గుజరాత్‌లోని వడోదరా (బరోడా)లో ‘‘భాషా రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ సెంటర్’’ను, తేజ్‌ఘర్‌లో ‘‘ఆదివాసీ అకాడమీ’’ని స్థాపించారు. 2010లో ఆయన నాయకత్వంలో జరిగిన ‘‘భారతదేశంలో ప్రజల భాషల సర్వే’’ నేటికీ సజీవంగా వున్న 780 భారతీయ భాషలను రికార్డు చేసింది. ఆయనకు సాహిత్య అకాడమీ అవార్టు, సార్క్ దేశాల సాహిత్య అవార్డు, ప్రిన్స్ క్లాస్ (Prince
Claus)1 అవార్డు, అంతర్జాతీయ లింగ్వాపాక్స్ బహుమతి ( Linguapa Award) ప్రమాదంలో పడిన భాషలను పరిరక్షించే కృషికి ఇచ్చే అవార్డు లభించాయి.
కర్ణాటకలో రచయిత, హేతువాది అయిన యం.యం. కల్బుర్గీని హత్యచేసిన సందర్భంలో సాహిత్య అకాడమీ మౌనంగా వుండినందుకు నిరసనగా దేవి 2015లో ఆ అకాడమీ అవార్డును వాపస్ చేశారు. దేవితో సహా సుమారు 80మంది మేధావులు ప్రపంచ వ్యాప్తంగా సంఘటితమై 2022 అక్టోబర్‌లో ‘‘హోలోసెన్ (Holocene) నుండి భారతదేశం : 12వేల సంవత్సరాల నుండి పర్యావరణం, ప్రజలు, జీవితం, ఆలోచనలు, వ్యక్తీకరణ, ఉద్యమాలు, సాంప్రదాయాలు, పరిణామాలు’’ అనే 600పేజీల హోలోసెన్ నివేదికను2 విడుదల చేశారు. ఇందులో 12వేల సంవత్సరాల భారతదేశ చరిత్ర రికార్డు అయింది. ‘కారవాన్’ పత్రికలో మల్టీమీడియా రిపోర్టర్ షహీద్ తంత్రాయ్ ఆ నివేదిక గురించి, ఆర్.యస్.యస్. ఆధ్వర్యంలో భారతదేశ చరిత్రను తిరగరాయడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి, ప్రత్యమ్నాయ జ్ఞాన వ్యవస్థల గురించి, మితవాదం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను సంలీనం చేసుకోవడం గురించి, భారతీయ భాషల గురించి, హిందీకి అగ్రస్థానాన్ని ఇవ్వడం గురించి ఇంటర్య్వూ చేశారు. ఆ ఇంటర్య్వూ సంక్షిప్త పాఠం ఇది
– అనువాదకుడు
షహీద్ తంత్రాయ్ : భారతదేశం అనే భావన సాపేక్షికంగా చూస్తే ఈ మధ్య కాలందే కదా! అలాంటప్పుడు ఉపఖండానికి సంబంధించిన గత 12వేల సంవత్సరాల చరిత్రకు ప్రాధాన్యత ఎందుకు వుంది?
గణేష్ నారాయణ్ దేవి : ఐరోపాలో 19వ శతాబ్దంలోనూ, మనదేశంలో 19వ శతాబ్దపు ఉత్తర భాగంలోనూ చరిత్ర అధ్యయనం ప్రారంభమైనప్పుడు, భారతదేశపు గతాన్ని ఆధునిక, మధ్యయుగాల, ప్రాచీన చరిత్రగా వర్గీకరించే ధోరణి ఆవిర్భవించింది. ఐరోపా చరిత్ర ఎక్కడ ఆగిపోయిందో ఆ కాల అవధి వద్దనే ప్రాచీన భారత చరిత్ర కూడా ఆగిపోయింది. మనం గతం గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి మనకు లభ్యమయ్యే తొలి మౌఖిక సాక్ష్యాధారాలు వేదాలు అని మాక్స్‌ముల్లర్ వంటి పరిశోధకుల భావన. ఇది కూడా అక్కడే ఆగిపోయింది. అదే కాలంలో 1830లలో పురాతత్వ శాస్త్రం ఆవిర్భవిస్తూ వుంది. ఆ శాస్త్రవేత్తలు వేదాలకు పూర్వం వున్న గతాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు. మన దేశంలో చరిత్ర అధ్యయనం ఉపఖండంలో మానవ ఆవాసంతో సంబంధం లేకుండా జరిగింది. అది కాలాన్ని మేధోపరంగా మాత్రమే చూసింది.
ఇది పూర్తిగా సరైందే. అయితే గత 20సంవత్సరాలుగా ప్రాచీన జన్యు సంబంధమైన అధ్యయనాలు పురోగామి వైఖరిని తీసుకున్నాయి. సింధు నాగరికత పురాతత్వ గతానికి, వేద నాగరికత చారిత్రక గతానికి మధ్య గొప్ప కొనసాగింపు వుందని మితవాద చరిత్రకారులు దీని కారణంగానే గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే భాషా శాస్త్ర పరంగా చూస్తే ఈ కొనసాగింపుకు అవకాశం లేదు. మధ్యలో ఖచ్చితమైన ఖాళీ వుంది. సింధూ నాగరికత క్రీ.పూ 1900లలో ముగిసింది. తదనంతరం క్రీ.పూ. 1400లలో వేద నాగరికత క్రమంగా ఆవిష్కృతమైంది. క్రీ.పూ. 7వ శతాబ్దానికల్లా అది సంపూర్ణంగా వికసించింది. ఆ తరవాత బౌద్ధం వచ్చింది. అంటే 500 సంవత్సరాల ఖాళీ వుందన్నమాట. కొనసాగింపు వుందని రుజువు చేయడానికి ఏ ఆధారమూ లేదు.
చరిత్ర అంటే కొనసాగింపుల కథ మాత్రమే కాదు. అందులో ఖాళీలు కూడా వుంటాయి. సింధు నాగరికత అధ్యయనాన్ని భారతదేశపు చరిత్ర పూర్వ లేదా భారతదేశపు గతానికి సంబంధించిన ప్రారంభంగా చూడడానికి వీలులేదు. సింధు నాగరికత పట్టణ నాగరికత. వ్యవసాయం అభివృద్ధి చెంది సంపద పోగుబడడానికి అవకాశం లేకుంటే అది సాధ్యం కాదు. క్రీ.పూ. 5వేల కాలంలో ఇరాన్ నుండి భారతదేశంలోకి వ్యవసాయం ప్రవేశించింది. అంటే ఎవరైనా 7వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళక తప్పదు. అయితే, వేట, ఆహార సేకరణ దశలో వున్న ప్రజలు అకస్మాత్తుగా వ్యవసాయంలోకి ఎలా మారారు? జవాబు చెప్పాల్సిన మరొక ప్రశ్న ఇది. ఇందుకోసం మరొక 15వందల సంవత్సరాల వెనక్కు వెళ్ళక తప్పదు. అంటే సంచార జీవులుగా, వేటమీద ఆధారపడిన సమూహాలుగా ప్రజలు జీవించిన కాలం. ఇది మనల్ని ఒక గొప్ప చారిత్రక అసాధారణ సంఘటనకు దగ్గరగా తీసుకువస్తుంది.
అది వాతావరణంలో అత్యంత గణనీయమైన మార్పు. శీతల వాతావరణం మారి వాతావరణంలో వేడి పెరిగింది. దీని కారణంగా భారత భూభాగంలోని దాదాపు 2/3వ వంతు ప్రాంతంలో ఘనీభవించిన మంచు కరగడం ప్రారంభమైంది. ఆ కాలాన్ని ‘హోలోసెన్’ అంటారు. ఇది 12,000 సంవత్సరాల క్రితం క్రీ.పూ. 9,500 కాలం నాటి సంగతి. అది వివిధ కాలాలలో దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరంతర వలసలు, మార్పులు, విచ్ఛిన్నతల, కొనసాగింపుల కథ. పంజాబ్‌లో ఏమి జరిగిందో, అదే సమయంలో అది ఒరిస్సాలోనూ కేరళలోనూ జరగలేదు. అందుచేత భారతదేశంలో నాగరికతలను, వాటి తదనంతర శాఖలను తప్పక పరిశీలించాల్సిన అవసరం వున్నది. అంటే భారతదేశానికి అనేక చరిత్రలు వున్నాయి. ఇది విద్యా సంబంధమైన అంశం.
గత 12వేల సంవత్సరాల భారతీయ గతాన్ని సమీక్షించడానికి భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో అందరూ ఉత్తర భారతీయులే వున్నారు. దక్షిణ భారతదేశం నుండి, ఈశాన్య భారతదేశం నుండి ఎవరూ లేరు. అంతేకాదు, మహిళలకు, క్రైస్తవులకు, ముస్లింలకు, దళితులకు, ఆదివాసీలకు కూడా అందులో ప్రాతినిధ్యం లేదు. అలాంటి కమిటీ ఎందుకు ఏర్పాటు చేయబడిరది అనే దానిమీద అందరికీ సహజంగానే అనుమానాలు వుంటాయి. ఎన్.సి.ఈ.ఆర్.టి. పుస్తకాల ద్వారా పిల్లల మీద ఏమి రుద్దాలనుకున్నదో, అది భారతదేశంలో భవిష్యత్ తరాలను ఎలా నాశనం చేస్తుందో అందరికీ అనుమానంగానే వుంది. 12వేల సంవత్సరాల భారతదేశపు చరిత్రలో అనేక యుద్ధాలు, ఘర్షణలు, విషాదాలు, హింసాత్మకమైన ఉద్రేకపూరితమైన ఆవేశకావేశాలు వున్నాయి. అయినప్పటికీ మన గతం మనకు సహనాన్ని, కరుణను, మానవత్వాన్ని, ఇతరులపట్ల ప్రేమను, స్వీయకట్టడిని నేర్పింది. ఇవి దాని మూలధాతువులు. ఈ రకమైన విద్యేతర కారణంగా కూడా భారతదేశ గతాన్ని 12వేల సంవత్సరాలు లేదా అంతకంటే ముందునుంచే మనం చూడగలగాలి.
తంత్రాయ్ : హోలోసెన్ నివేదికను విడుదల చేసిన సందర్భంలో చేసిన ప్రసంగంలో మీరు ప్రధాని నరేంద్రమోడీ చరిత్రను తిరిగి రాయడానికి 2018లో కమిటీని ఏర్పాటు చేయడం వెనుక, భారత చరిత్రకు సంబంధించిన కొన్ని అంశాలను తిరగదోడే పెద్ద ప్రణాళిక వుందని అన్నారు. ‘‘ఆ పెద్ద ప్రణాళిక’’, ‘‘కొన్ని అంశాలు’’ అనడంలో మీ ఉద్దేశం ఏమిటి?
దేవి : తమ పాలన వీరోచితమైన పాలనగా చిత్రించుకోవడం పెద్ద ప్రణాళిక. ఒకదాన్ని వీరోచితమైనదిగా చిత్రీకరించాలంటే ముందు ఒక అన్యాయం జరిగిందన్న గ్రహింపు కలిగించాలి. హీరో ఎప్పుడూ అన్యాయానికీ, దానిమూలంగా జరిగిన తప్పులకు ప్రతీకారం తీర్చుకుంటాడు. ‘మనం గతంలో స్వర్ణయుగంలో జీవించాం. తదనంతరం ఇతరులు మన దేశంలోకి ప్రవేశించి మన సుఖసంతోషాలని నాశనం చేశారు. శాస్త్ర సంబంధమైన విషయాలలో మనం అందుకున్న గొప్పదనాన్ని దొంగిలించారు. మన ఆలోచనల్లో వుండే గొప్పదనాన్ని కొల్లగొట్టారు. మనలో విదేశీభావాలను చొప్పించారు. మనల్ని ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చారు’ అని చిత్రీకరించే చరిత్రను ముందు సృష్టించాలి. అప్పుడు ‘నేను తెరమీదకు వచ్చాను. గతంలో జరిగిన అన్యాయాలపట్ల ప్రతీకారం తీర్చుకుంటున్నా’ను. భారతదేశాన్ని పవిత్రం చేస్తున్నాను. మన సమాజాన్ని కలుషితం చేసిన విదేశీయుల్ని, విదేశీ భావాలను వదిలిస్తున్నానని అని ఒక వ్యక్తి ప్రకటించుకోవడానికి అవకాశం వుంటుంది. అప్పుడు అతను ఒక హీరోగా ఆవిర్భవిస్తాడు. అందుకోసమే చరిత్రను వక్రీకరించాల్సిన అవసరం ఏర్పడింది.
ఆ కమిటీ, నిర్ధారిత చారిత్రక సత్యాలతో సంబంధంలేని వాస్తవాలలాంటివి ప్రతిపాదిస్తూ చరిత్ర పాఠ్యగ్రంథాలు తయారు చేయవచ్చు. పాలకుడు ముస్లిం అయి వుండవచ్చు కాని అతడి సేనాపతి హిందువు అయివుండవచ్చు. అలానే పాలకుడు హిందువు అయి వుండవచ్చు అతని సేనాని ముస్లిం అయి వుండవచ్చు. ఇది సత్యం. ఒకే ప్రార్థనా స్థలం వద్ద హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రార్థనలు చేసారన్నది సత్యం. ఒకే పద్యంలో పర్షియా, సంస్కృత భాషలకు చెందిన పదాలు వుండేవన్నది సత్యం. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు తమ ప్రాంతానికి వస్తే దక్షిణాసియా వాళ్ళను ఆహ్వానించింది. అందరినీ కలుపుకుపోయే గుణం ఆ ప్రాంతానిది. అయితే ఇప్పుడు తయారవుతున్న కొత్త చరిత్ర ఈ దక్షిణాసియా ప్రాంతం అందరిదీ కాదని చిత్రీకరిస్తే అది రాజ్యాంగ స్ఫూర్తికీ, భారతీయ నాగరికతా స్ఫూర్తికీ కూడా వ్యతిరేకమైనది.
తంత్రాయ్ : భారతదేశంలో అలా జరుగుతుందని మీరు భయపడుతున్నారా?
దేవి : ఈ రకమైన చరిత్ర వక్రీకరణను ఎవరూ ప్రశ్నించకపోతే, మేధోపరంగా దాన్ని వ్యతిరేకించకపోతే, ఎలాంటి అడ్డూ అదుపూ లేకపోతే అలా జరుగుతుందనే భయం వుంటుంది. ఈ వక్రీకరణను సవాల్ చేయాలి, ప్రశ్నించాలి. అయితే కేవలం సవాల్ చేయడం, ప్రశ్నించడం మాత్రమే జరిగితే అది వాగాడంబరమే అవుతుంది. అందుచేత వివాదంలోకి వెళ్ళడం కంటే, గత 12వేల సంవత్సరాల గతాన్ని, చరిత్ర అనే సైన్సుమీద, తర్కం మీద, అర్థవంతమైన మేధో పరిజ్ఞానం మీదా ఆధారపడి పాఠ్యగ్రంథాలు రాయడం మంచిది.
చరిత్ర గురించిన నా దృష్టికోణమే సరైందని నేను అనడం లేదు. సాంస్కృతిక వ్యవహారాల శాఖను ప్రశ్నించాలనే ఆసక్తి నాకు లేదు. అది దాని శక్తికనుగుణంగా పనిచేస్తోంది. మరింత శాస్త్రీయమైన, మరింత వాస్తవమైన చరిత్రను ఎంచుకోవాలనే కోరిక వున్న ప్రజలకు అందుబాటులో వుండేందుకు ఒక ప్రత్యామ్నాయ చరిత్ర రూపొందాలన్నదే నా ఆసక్తి.
తంత్రాయ్ : ఆ కమిటీ మిమ్మల్ని సంప్రదించిందా?
దేవి : లేదు. నేను శిక్షణ పొందిన చరిత్రకారుణ్ణి కాదు. అయితే వాళ్ళు అలాంటి చరిత్రకారులను కూడా కలవడం లేదు. వివిధ ప్రభుత్వ సంస్థలలో పనిచేసిన మాజీ అధికారులను, లేదా (ఆర్.యస్.యస్. ప్రధాన కార్యాలయానికి) నాగపూర్‌కు అత్యంత సన్నిహితులైన వారిని మాత్రమే కలుస్తున్నారు.
తంత్రాయ్ : చరిత్ర రచనపై ఒక చర్చ నడుస్తోంది. ఇది భారతదేశ చరిత్రా? లేక ప్రజల చరిత్రా? లేక రాజ్య భావజాలమా?
దేవి : తొమ్మిది లేదా పది శతాబ్దాలలో రాజశేఖర్ అనే ఒక ఆలోచనాపరుడు వుండేవాడు. ఆయన అనేక నాటకాలు రాశారు. పద్యానికి సంబంధించిన ఒక సైద్ధాంతిక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకంలో ఆయన చరిత్రను రెండు భాగాలుగా విభజించారు. ఒకటి ఒక వ్యక్తి హీరోగా వున్న చరిత్ర. రెండోది, అనేకమంది వ్యక్తులు హీరోలుగా వున్న చరిత్ర. ఆయన ఉదాహరణలు కూడా ఇచ్చారు. రామాయణంలో హీరో ఒక్కడే. మహాభారతంలో హీరోలు అనేకమంది. ఒకేఒక్క మూసలో చారిత్రక సత్యాన్ని రూపొందించడం సాధ్యం కాదు కాబట్టి చరిత్రను అనేకమంది హీరోల చరిత్రగా, వైవిధ్యాల చరిత్రగా రాయడం అత్యుత్తమమైన పద్ధతి అని రాజశేఖర్ అభిప్రాయం. ఒక కారణం, దానికి ఒక ఫలితం వుంటుందని చరిత్ర చెప్తున్నప్పటికీ అందుకు అనేక మినహాయింపులు వుంటాయి. ఆ మినహాయింపులను కూడా తప్పనిసరిగా విశ్లేషించాలి, వివరించాలి. చరిత్ర ప్రవాహం సరళరేఖలో సాగదు. అది సట్లెజ్లాంటి నదిలాగా ప్రవహిస్తుంది. సట్లెజ్ అనే పేరు వంద గుర్రాలు అని అర్థం వచ్చే శతధృ అనే పదం నుండి వచ్చింది. చరిత్ర వంద గుర్రాల శక్తితో అనేకవైపుల ముందుకు సాగుతోంది. అనేకానేకమైన ఈ ప్రవాహాలలో ఏ ఒక్కదాన్నీ మర్చిపోకుండా వాటన్నింటినీ ఒకటిగా కలపడమే చరిత్రకారుల పని.
తంత్రాయ్ : భారతదేశ చరిత్రను తిరగరాస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే ఎందుకు అలా చేస్తున్నారు?
దేవి : చరిత్ర వర్తమానంలో రూపొందుతుంది. వర్తమానంలోని పరిస్థితులు దాన్ని ప్రభావితం చేస్తాయి. లిఖిత చరిత్ర అంతా ఆనాటి పరిస్థితుల నుండి సృష్టించబడిరదే. అందుచేత చరిత్రలన్నీ తిరగరాయబడడమనేది వాస్తవమే. అవును. భారతదేశ చరిత్ర కూడా తిరగరాయబడుతోంది. అయితే చరిత్రను తిరగరాయడానికి అనేక మార్గాలున్నాయి. గతానికి సంబంధించిన సున్నితమైన, సంక్లిష్టమైన అంశాలను వెలికి తీసుకురావడం ద్వారా మన అవగాహనను మరింత లోతుగా, విస్తృతంగా రూపొందించే పద్ధతి ఒకటి. వర్తమానంలోని ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసి వాళ్ళను ప్రశ్నలు అడిగే సామర్ధ్యం లేనివాళ్ళుగా తయారుచేయడానికి గతాన్ని తిరగరాయడం మరొక పద్ధతి. సాధారణంగా విద్యా సంబంధమైన చరిత్రకారులు చరిత్రకుండే చారిత్రిక దృష్టికోణాన్ని విస్తృతం చేస్తారు. అవగాహనను కూడా విస్తృతం చేస్తారు. కాని నియంతల పాలనలో చరిత్రను అర్థం చేసుకోవడంపై పరిమితులుంటాయి, దాన్ని కుదిస్తారు, పాలకుల పట్ల విధేయతను పెంచేటట్టుగా, మితిమీరిన జాతీయతను రూపొందించేటట్లుగా చరిత్రను తయారుచేస్తారు.
తంత్రాయ్ : ‘‘మితిమీరిన జాతీయత’’, ‘‘విధేయత’’ నేటి మనదేశంలోకి నెమ్మదిగా చొరబారాయని మీరనుకుంటున్నారా?
దేవి : సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడినవాళ్లు జాతి వ్యతిరేకులు అవుతున్నారు. వైవిధ్యం గురించి మాట్లాడితే దేశభక్తి లేని వాళ్ళు అవుతున్నారు. విరుద్ధ అభిప్రాయాల్ని వెల్లడిస్తే వాళ్ళపైన ఊపా చట్టం అమలవుతోంది. వాస్తవాలు చెప్పడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళను సోషల్ మీడియాలో వేటాడుతున్నారు. ఇదంతా జరుగుతుంది కాబట్టి, రాజ్యాంగంలో పొందుపరచబడిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి ఆదర్శాలు పరిమితం అయిపోతున్నాయి కాబట్టి , ఇది ఒక అధికారయుత ప్రభుత్వమని నిష్పక్షపాతంగా ఆలోచించే ఏ పరిశీలకుడైనా అనక తప్పదు. నా చుట్టూ నెలకొన్న పరిస్థితులే నన్ను ఈ ప్రశ్న వేసేటట్లు చేస్తున్నాయి. రాజ్యం నిరంకుశ రాజ్యంగా మారిందన్న ఆరోపణను ఖండిరచడానికి నాకు ఆధారాలేమీ లేవు.
తంత్రాయ్ : పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ బోధిస్తున్న చరిత్ర పాఠ్యాంశాలని కొన్ని రకాలుగా మారుస్తున్నారు. సీనియర్ పాఠ్యపుస్తకాల నుండి మొఘల్ చరిత్ర, గుజరాత్ మారణకాండ, గాంధీ హత్య తరవాత ఆర్యస్యస్పై నిషేధం వంటి వాటిని తొలగించారు. ఇది ఎందుకు జరుగుతోంది. దీని వెనుక వున్నది ఎవరు? వాళ్ళేం సాధించదల్చుకున్నారు?
దేవి : హిందూత్వవాదులకు మూలసిద్దాంత్తవేత్త వినాయక్ దామోదర్ సావర్కార్. ఆయన ‘‘భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగిన ఆరు పేజీలు’’ అనే పుస్తకం రాశారు. ఇప్పుడు చరిత్రను తిరగరాస్తున్న శక్తులు భారతదేశపు గతంలోని ఆ ఆరు బంగారు శకాలను చిత్రీకరించడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆయన రాసిన పుస్తకంలో మధ్యయుగాల చరిత్ర` అంటే ఇస్లామిక్ కళలు, ఇస్లామిక్ సామ్రాజ్యాలు, ఇస్లామిక్ పురోగతి జరిగిన కాలమంతా` అంధకార శకం. కేవలం మొఘల్ పాలనా కాలం మాత్రమే కాదు, క్రీ.శ. 11వందల నుండి వెయ్యి సంవత్సరాలపాటు వున్న కాలమంతా భారతదేశంలో గొప్ప అభ్యున్నతని, అభివృద్ధిని సాధించిన కాలం. అది ముస్లింలు లేక హిందువులు లేక జైనులు లేక బౌద్ధులు లేక సిక్కులు సాధించిన ఘనత కాదు. అది భారతదేశపు ఘనత. కళలు, సౌందర్యశాస్త్రం, శిల్పకళ, సంగీతం, ప్రణాళికాబద్ధమైన పట్టణాలు ఇలాంటి అనేక అంశాలలో ఆ వెయ్యి సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి జరిగింది. ఈ దేశంలో మొదటిసారి భూమి సర్వే చేయించినవాడు షేర్షా సూరి. ఆయన చేసిన ఆ సర్వే ఫలితంగా భూమి యాజమాన్యం హేతుబద్ధంగా నిర్ణయించబడిరది. దాని ఫలితంగా దోపిడీ తగ్గింది. మొత్తం ఆ వెయ్యిసంవత్సరాల కాలాన్ని చీకటి యుగంగా చిత్రించటం నేరపూరితమైన తప్పు.
మరో ఉదాహరణ. బహుశా తమిళం, కన్నడ మినహాయిస్తే మిగిలిన ఆధునిక భారతీయ భాషలన్నీ` బెంగాలీ, ఒరియా, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, మళయాళం, కాశ్మీరం` ఆ కాలంలోనే అభివృద్ధి చెందాయి. అందుచేత ఆధునిక భారతీయ భాషలు అభివృద్ధి చెందిన, గొప్పగొప్ప సాధువులు రూపొందిన, అద్భుతమైన సాహిత్య సాంప్రదాయాన్ని సృష్టించిన, సూఫీతత్వం, భక్తి ఉద్యమం లాంటివి అభివృద్ధి చెంది ప్రజల్లో గొప్ప మానవతావాదాన్ని ప్రచారం చేసిన, భూసంస్కరణలను ప్రవేశపెట్టిన ఆ కాలాన్ని చీకటి కాలమని ఎలా పిలుస్తారు. దేశం నుండి ముస్లిం పాలకుల జ్ఞాపకాలను చెరిపివేయాలనుకోవడం ఒక అసాధారణ ప్రవర్తన. అది చరిత్ర కాదు. అదేవిధంగా బౌద్ధానికి, సనాతన ధర్మానికి మధ్య జరిగిన ఘర్షణ కూడా మన చరిత్రలో భాగం. కాని బౌద్దాన్ని పక్కకు నెట్టేసి, కేవలం సనాతన ధర్మాన్ని మాత్రమే ఆకాశానికి ఎత్తితే అది కల్పిత చరిత్ర.
అదే విధంగా చరిత్రకు సంబంధించిన అనేక శాస్త్రీయ దృక్పథాలు, సింధూ నాగరికత క్షీణించడానికీ వేద నాగరికత తలెత్తడానికీ మధ్య నెలకొన్న ఖాళీలను చూపెడుతున్నాయి. ఆ 500 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఏమి జరిగిందో మనకు తెలియదు. సింధు నాగరికత మలిదశకు సంబంధించిన కొన్ని విషయాలు మనకు తెలుసు. దాన్నే మరొక రూపంలో గాంధార దశ అని పిలిచారు. అయితే భారతదేశానికి క్రీ.పూ.1400కు ముందు రాని సంస్కృతభాష అంతకంటే ముందునుండీ వుందనీ, అది సింధు నాగరికత కాలం నాటి భాష అనీ ఎవరైనా చెప్పడం ప్రారంభిస్తే అది అనూహ్యమైన విషయం. సింధు నాగరికత గురించి శాస్త్రీయంగా నిర్ధారించబడ్డ వాస్తవాలకు పూర్తిగా భిన్నమైన విషయం. అప్పటి విషయాలు గురించి మనకు చాలా తెలుసుగానీ, ఇప్పటికి అవసరమైనంత తెలియదు.
తమ ఇష్టాలను బట్టి తాము కోరుకున్న రీతిలో చరిత్రను రాయకూడదు. ఒక భావజాలం తీవ్ర జాతీయవాదాన్ని ఎత్తిపట్టాలని ప్రయత్నిస్తే అది గతానికి సంబంధించిన మహత్తరమైన అంశాలను మాత్రమే చిత్రించాలని కోరుకుంటుంది. ఆ మహత్తర సాంప్రదాయంలో ఉన్న ఖాళీలను గురించి అది పట్టించుకోదు. మన పూర్వీకుల వైఫల్యాల గురించి కూడా అది పట్టించుకోదు. అయితే ప్రతి తరమూ తన ముందటి తరం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం వుంది. మన పూర్వులు సాధించింది ఏమిటీ? వైఫల్యం చెందింది ఏమిటీ అనేవి రెండూ తెలుసుకోవాలి. అలా కాకుండా కేవలం పూర్వపు ఔన్నత్యాన్ని మాత్రమే (అదికూడా సరైన ఆధారాలు లేకుండా) విద్యార్థుల మెదళ్ళల్లోకి బలవంతంగా ఎక్కిస్తే యావత్ యువతరం ఒక తప్పుడు దృశ్యాన్ని మనసులో నిలుపుకుంటుంది. చరిత్రను విమర్శనాత్మకంగా చూసే శక్తిలేకుండా వాళ్ళు ఎదుగుతారు. తనను తాను విమర్శనాత్మకంగా ఎలా పరిశీలించుకోవాలో తెలియని జాతి, నాగరికత అభివృద్ధి చెందవు. కల్పితమైన ఘనతల గురించి ఆనందం పొందడమే ప్రజలకు మిగులుతుంది. అది వాళ్ళకు తప్పుడు స్వీయసంతృప్తిని ఇవ్వవచ్చు. కాని వాళ్ళల్లో నిర్లప్తత ప్రబలుతుంది.
ఎవరికి ఇష్టం వున్నా లేకపోయినా మహాత్మాగాంధీ పేరు చిరస్థాయిగా వుండక తప్పదు. ఆయన హత్య చేయబడ్డాడన్నది వాస్తవం. ఆయన్ను హత్యచేసిన వ్యక్తి పేరు, అతని ఉద్దేశాలు అందరికీ తెలుసు. అతడు ఎవరి తాత్వికతకు అనుగుణంగా గాంధీని చంపాడో అదికూడా ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈ వాస్తవాన్ని పిల్లల నుండి దాయాలనుకోవడం బాల్యచేష్ట. దానికి విద్యాసంబంధమైన న్యాయబద్ధత ఏమీలేదు.
చారిత్రక వాస్తవాలు తమ జ్ఞాపకాలను నిలబెట్టుకోవడానికి అనేక మాథ్యమాలను రూపొందించుకుంటాయి. అవి అలా ఎప్పుడూ ప్రజల గుర్తింపులోకి వస్తూనే వుంటాయి. రామాయణం, మహాభారతాలకు సంబంధించిన ప్రత్యామ్నాయ కథనాలు మౌఖిక సాంప్రదాయాల్లో ఇప్పటికీ సజీవంగానే వున్నాయి. గుజరాత్ మారణకాండ మూలంగా బాధలనుభవించిన వేలాది కుటుంబాలలో అనేక మంది కుటుంబసభ్యులు ఇప్పటికీ సజీవంగానే వున్నారు. సమీప భవిష్యత్తులో చరిత్రలో దీన్ని అంతటినీ తొక్కి పెట్టాలనుకుంటే అది హాస్యాస్పదంగా మారుతుంది. ఈ ప్రభుత్వం పోయి మరొక ప్రభుత్వం వచ్చినప్పుడు అది ఈ వాస్తవాలను మళ్ళీ వెలికి తీస్తుంది. దాన్ని జ్ఞాపకాల నుండి చెరిపివేయడం సాధ్యంకాదు. పాలకులు నమ్ముతున్నట్టుగా ప్రజల జ్ఞాపకాలు మరీ బలహీనమైనవి కావు. వాళ్ళు వ్యక్తం చేయలేకపోవచ్చుగానీ చాలాకాలంపాటు కళ్ళముందు జరిగిన విషయాలను గుర్తుంచుకునే వుంటారు.
తంత్రాయ్ : హిందూ చరిత్రకు ప్రాధాన్యత యిస్తున్నారని మీరనుకుంటున్నారా?
దేవి : క్రీ.పూ. 7వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు బౌద్ధం, జైనం వెల్లివిరిసాయి. అలానే భగవంతుడిపై విశ్వాసంలేని లోకాయత తాత్విక చింతన కూడా భారతదేశంలో వెల్లివిరిసింది. పరస్పర విరుద్ధమైన అనేక దృష్టికోణాలు అభివృద్ధి చెందాయి. వీటి మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. ప్రాచీన చరిత్రలో మొదటి సహస్రాబ్ధిలోనూ, రెండవ సహస్రాబ్ది ప్రారంభంలోనూ ఇది కొనసాగింది. క్రీ.శ 1100లో భక్తి ఉద్యమం అనే కొత్త ఉద్యమం ప్రారంభమైంది. అది సూఫీ తత్వం నుండి మహత్తర శక్తిని పొందింది. అలానే కేరళలోకి ప్రవేశించిన తొలి క్రైస్తవం నుంచి నూతన దృష్టికోణాన్ని సంతరించుకుంది. వివిధ శాఖలు, మత విశ్వాసాల నుండి అది బ్రహ్మాండమైన శక్తిని పుంజుకుంది. ఆ తరవాత కొన్ని శతాబ్దాలకు సిక్కిజం ఆవిర్భవించింది. క్రీ.శ 1100ల నుండి వంద సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలోని అడవుల్లో ఒక గొప్ప నూతన జీవితం ఆవిర్భవించడం ప్రారంభమైంది. ఆదివాసీలు తమ జీవన విధానాన్ని సృష్టించుకొని అడవుల మీద అజమాయిషీని అనుభవించారు. ఆ రోజుల్లో అనేకమంది పాలకులు ఆదివాసీల హక్కుల్ని గౌరవించారు, కాపాడారు.
ఇదంతా భారతదేశ చరిత్ర. హిందూ చరిత్ర అనేది ఏమీ లేదు. మాక్స్‌ముల్లర్ కాలంలోనే ` 19వ శతాబ్దపు చివర్లో ` హిందూ గతం అనేది ఒకటి వుందనే భావన మరింత బలపడిరది. హిందూ అనే పదం పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఫలితంగా 1920లలో ఆర్.యస్.యస్. జన్మించింది. ఆ సమయంలో ఆర్.యస్.యస్.కు హిందూ చరిత్ర దృష్టి లేదు. దాని దృష్టిలో వున్నదంతా గతం గురించి జర్మన్ నాజీ దృక్పథమే. అదే 1920లలో హిట్లర్‌ను జర్మనీలో అధికారంలోకి తెచ్చింది (అడాల్ఫ్ హిట్లర్ మొదట 1923లో తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తరవాత 1933లో జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు.) ఒక జాతి, జాతిగా గుర్తించబడాలంటే దానికొక భూభాగం వుండాలి. అంతేకాక స్వతసిద్ధమైన స్పూర్తి వుండాలి. ఇది నాజీ జర్మనీకి చరిత్ర పట్ల వున్న భావన. అందుకనే హిందూమహాసభ, ఆర్‌యస్‌యస్‌లు కూడా పితృభూమి, పుణ్యభూమి అనే పదాలను వాడడం ప్రారంభించాయి.
పవిత్ర భూమి అనే భావనకూ గౌతమబుద్ధుడు కాలం నుండి 18వ శతాబ్దంవరకూ జరిగిన ఘటనలకూ పొంతన లేదు. నూతనంగా రూపొందించబడిన గతానికి సంబంధించిన ఈ హిందూ దృక్పథం కల్పితమైనది. అది హిందూ దృక్పథమూ కాదు, భారతీయ దృక్పథమూ కాదు. భారతీయ దృక్పథం బహుళత్వంతో, వైవిధ్యంతో కూడుకున్నది. మనకు చరిత్ర చెప్పింది అదే. అశోకుడూ చెప్పిందీ అదే. అక్బర్ అనుసరించిన విధానాలు చెప్పిందీ అదే. అంబేద్కర్ కున్న జ్ఞానమూ అదే మనకు చెప్పింది.
హిందూ ఆలోచనాపరులుగా పిలవదగిన అనేకమంది ఉదాహరణలు నేను మీకు ఇవ్వగలను. ఉదాహరణకు 6, 7 శతాబ్దాల మధ్య కాలంలో ఆవిర్భవించిన, సౌందర్యశాస్త్రానికి సంబంధించిన ప్రముఖమైన సిద్ధాంతాలలో ఒకటి రీతి సిద్ధాంతం. రీతి అంటే ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఊహించవచ్చునో చెప్పడం. మాతంగుడు సంగీతం గురించి రాసిన పునాదిలాంటి పుస్తకం ఒకటి వున్నది. దాని పేరు బృహద్దేశి. బృహద్ అంటే అనేకం, దేశ్ అంటే స్థానికం అని అర్థం. అంటే మాతంగుని అభిప్రాయంలో ఇప్పుడు మనం భారతదేశ సంగీతం అని పిలుస్తున్నది అనేక రాష్ట్రాల సంగీతమన్నమాట. మాతంగుడు భారతదేశాన్ని అనేక జాతులుగా గుర్తించాడు. మన బహుళత్వంలోనే ఏకత్వం వున్నది. చరిత్ర పట్ల హిందూత్వ దృక్పథం దీన్ని వ్యతిరేకించింది. భారత రాజ్యాంగ స్ఫూర్తికూడా అనేకతలని, బహుళత్వాన్ని, సమాఖ్యను, భారతీయ వైవిధ్యాన్ని గుర్తించింది.
తంత్రాయ్ : పాఠ్యపుస్తకాల నుండి మొఘల్ చరిత్రను తొలగించడం భారతదేశం నుండి ముస్లిం చరిత్రను చెరిపివేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని మీరు భావిస్తున్నారా? ఒక నిర్దుష్టమైన కథనాన్ని రూపొందిస్తున్నారా?
దేవి : జాతీయత, జాతి` పితృభూమి, పుణ్యభూమి` ల గురించి వాళ్ళ అవగాహన ఫలితంగానే ఇది జరుగుతోంది. ఇతర ప్రాంతాలలో ఆవిర్భవించిన మత విశ్వాసాలకు చెందినవారు ఈ భూభాగంలో నివశిస్తుంటే ఈ జాతిపట్ల వాళ్ళ విధేయత అవసరమైనంతగా ఉండదని వాళ్ళ విశ్వాసం. ఇది ఒక గుడ్డి నమ్మకం. ఎందుకంటే హిందువులూ, పార్శీలూ, సిక్కులూ, జైనులూ, బౌద్ధులతోపాటు భారతీయ సమాజాన్ని ఆధునీకరించడంలో ముస్లింలూ యూదులూ కూడా అదే స్థాయిలో తోడ్పాటు అందించారని భారతదేశ చరిత్ర రుజువుచేస్తోంది. వాళ్ళ(ఆర్‌యస్‌యస్)కున్న జాతీయతా భావన రెండో ప్రపంచయుద్ధానికి ముందు జర్మనీలో వున్న జాతీయతా భావనకు దగ్గరగా వుంటుంది.
ఆర్.యస్.యస్. దృష్టిలో భారతదేశ చరిత్రలో బౌద్ధానికీ, హేతువాద తాత్వికులకు తగిన ప్రాధాన్యత వుండదు. అలానే ఇస్లామిక్ కాలానికి సంబంధించిన గుర్తింపు కూడా తగినంత వుండదు. వాళ్ళ ఉద్దేశంలో కేవలం వైదిక, సనాతన తాత్విక చింతనలే అన్నింటికీ మూలం. వాళ్ళు వలసవాద చారిత్రక రచనా పద్ధతిని కూడా తిరస్కరించారు. చివరకు, సూఫీజం లాంటి దాన్ని, గాంధీజీ ప్రతిపాదించిన ప్రేమ, అహింసల తాత్వికతను కూడా వాళ్ళు తిరస్కరించారు. ఎందుకంటే హిందూయిజాన్ని సైనికీకరణ చేయాలనేది వాళ్ళ నమ్మకం. తద్వారా మాత్రమే భారత్ ఒక ‘పురుషత్వ’ జాతి అవుతుంది. హిందూ రాజ్యం గురించి వాళ్ళ భావన అది. శాంతి, ప్రేమ, దయ, కరుణ వంటి తాత్విక చింతనలను వెలుపలకు నెట్టివేయాలని హిందూ రాజ్యం వుర్రూతలూగుతుంది. ప్రస్తుత భారతదేశంలోని భౌగోళిక ప్రాంతాలలో ప్రత్యక్షంగా ఆవిర్భవించని ఇతర మతాల సృజనాత్మకతను కూడా వాళ్ళు దూరం పెట్టదలచుకున్నారు. అది ఒక విచిత్రమైన భావజాలం. ఆధునిక కాలంలో అది ఒక ఛాందస భావజాలమని నిష్పక్షపాతంగా చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యం గురించి, జాతి గురించి, ప్రజల గురించి వాళ్ళకున్న భావజాలం రాజ్యాంగంలో వివరించిన విలువల మీద ఆధారపడిరది కాదు. అది ఆధునిక నాగరికతా ప్రపంచపు భావనలతో ఏ మాత్రం సంబంధంలేని ఒక రాజకీయ తాత్వికత.
తంత్రాయ్ : నరేంద్రమోడి ప్రభుత్వం భారత చరిత్రలో ప్రవేశపెట్టదలచుకున్న తప్పుడు సూత్రీకరణలలో అత్యంత ప్రమాదకరమైనవి ఏవి?
దేవి : అత్యంత ప్రమాదకరమైన ఒక ఆలోచన ఏమిటంటే, భారతదేశం గురించి తనకు బాగా తెలుసునని ఈ ప్రభుత్వం అనుకోవడం. నిజానికి వాళ్లకు ఏమీ తెలియదని నా అభిప్రాయం. ఆదివాసీలు ఎలా ఆలోచిస్తారో, మహిళలు ఎలా ఆలోచిస్తారో, వాళ్ళ అనుభూతులు ఎలా వుంటాయో వీళ్ళకు అర్థం కాదు. ఎందుకంటే ఇది పురుషహంకార స్వభావంగల పాలన. ఈ దేశంలో షెడ్యూల్డు కులాల ప్రజలు ఎలా జీవించారో, భగవద్గీతను, కర్మసిద్ధాంతాన్ని కాపాడిన పునర్జన్మ సిద్ధాంతం కారణంగా వాళ్ళు ఎన్ని బాధలు అనుభవించారో వీళ్ళకు అర్థం కాదు. భవిష్యత్తులోకి దృష్టి సారించే వాళ్ళెవరూ ఇలా ఆలోచించరు.
ఈ ప్రభుత్వానికి ప్రజల దురాశ అర్థమౌతుంది గాని, వాళ్ళ ఆకాంక్షలు అర్థం కావు. కొద్దిమంది వ్యక్తుల దురాశను సంతృప్తి పరచడమే దానికి తెలుస్తోంది. ఎందుకంటే దానికవసరమైన ప్రచారాన్ని కల్పించడానికి సహాయం చేసేది వీళ్ళే కాబట్టి. ప్రచారానికున్న శక్తి ఏమిటో ఈ పాలకులకు బాగా తెలుసు. అది ప్రచారాన్ని అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకుంటుంది. ప్రపంచంలో మన దేశానికి వున్న గుర్తింపు గురించి అసహ్యకరమైన అబద్ధాలు ప్రచారం చేస్తూ అది తన వీపును తానే చరుచుకుంటోంది. ఈ గుర్తింపంతా 2014 పూర్వం ఏమీ లేదనీ, నిన్నమొన్ననే ప్రపంచ దేశాల గుర్తింపు లభించినట్టుగా ప్రచారం చేస్తోంది. చివరికి దానికి రాజ్యాంగ స్ఫూర్తికూడా అర్థం కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు అది ఆ స్ఫూర్తిని ఉల్లంఘిస్తుంది కాబట్టి. నేను చెప్పేది చాలామందికి ఇష్టం వుండకపోవచ్చు. అయితే కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు గడిచిన తరవాత ప్రస్తుత పాలకుల గురించి నేను చెప్పేది వస్తుగత సత్యం అనేదాన్ని అందరూ గుర్తిస్తారు.
తంత్రాయ్ : అధికార భాషకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ అక్టోబర్ 2022న, హిందీ, ఐక్యరాజ్యసమితిలో ఒక అధికార భాషగా గుర్తించబడాలని సిఫారసు చేసింది. హిందీ మీద మాత్రమే ఎందుకు వక్కాణింపు వున్నది. మీరు చెప్పినట్టు ఇంకా 780 భాషలున్నాయి కదా?
దేవి : 2011 జనగణన ప్రకారం భారతదేశపు జనాభాలో 42శాతం మంది హిందీ మాట్లాడతారు. ఓట్ల కోణం నుండి చూస్తే అది చాలా పెద్ద సంఖ్య. అందుకే హిందీని ప్రోత్సహిస్తున్నారు. సుదూర భవిష్యత్తులో ఒకవేళ తమిళం మెజారిటీ ప్రజలు మాట్లాడే భాష అయితే వీళ్ళప్పుడు తమిళం మాత్రమే అధికార భాష అనవచ్చు. భాషా వైవిధ్యం మానవ పరిణామక్రమానికి ఉపయోగకరమని నా నమ్మకం. అది అందరికీ తెలిసిన సత్యం కూడా. వైవిధ్యం ఎప్పుడూ పరిణామక్రమం ముందుకు కొనసాగడానికి ఉపయోగపడుతుందని పరిణామక్రమాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు కూడా చెప్తారు. ఆ వైవిధ్యాన్ని అణచివేస్తే పరిణామక్రమం వేగం తగ్గిపోతుంది.
ఆర్‌యస్‌యస్ ఆలోచనలో ప్రస్తుతానికి హిందీ పట్ల అనుకూల దృక్పథం వున్నది. ఇంగ్లీషును శత్రుభాషగా వాళ్ళు భావిస్తారు. అదేగాక మరొక కారణం కూడా వున్నది. భారతదేశంలోకి ఇంగ్లీషు రావడానికి పూర్వం ఒక రకంగా పర్షియన్ భాష దేశవ్యాప్తపు భాష. కర్ణాటకలో, కాశ్మీర్లో, అస్సాంలో, గుజరాత్లో ప్రజలు అర్థం చేసుకున్న భాష అది. ఇంకోలా చెప్పాలంటే ఆ కాలంలో వున్నవాళ్ళెవరైనా ఇంగ్లీషుకు బదులు పర్షియన్ భాషను, లేదా గాంధీలాగా హిందుస్తానీని ప్రతిపాదించి వుండేవాళ్ళు.
తంత్రాయ్ : మీరు భాషా వైవిధ్యం మీద విస్తృతంగా పనిచేశారు కదా! హిందూత్వ చరిత్రను, హిందీ భాషను ప్రమోట్ చేయడంలో ఒక కొనసాగింపు ఉన్నట్లు మీకు అన్పిస్తోందా? చరిత్ర, భాష ఒకటైపోయాయని మీరు అనుకుంటున్నారా?
దేవి : హిందీ సంస్కృతం నుండి ఆవిర్భవించింది. చరిత్రకు సంబంధించిన హిందూత్వ దృష్టి` చరిత్రకు సంబంధించిన హిందూ దృష్టి అనేది ఏదీ లేదు` ఎక్కువగా సంస్కృతంమీద ఆధారపడి వుంది. భారతదేశపు ఆలోచనలు, భాషలు, నాగరికతలకు ప్రధానమైన పునాది సంస్కృతమని వాళ్ళ ఆలోచన. సంస్కృతం ప్రధాన పాత్ర పోషించింది. కాని ఆ ఒక్క భాష మాత్రమే ప్రధాన పాత్ర పోషించలేదు. పాళీ భాష కూడా అలాంటి పాత్రనే పోషించింది. గౌతమబుద్ధుడు పాళీ భాషనే ఉపయోగించారు. మహావీర జైనుడు, గురునానక్లు సంస్కృతాన్ని ఉపయోగించలేదు. కబీర్ సంస్కృతాన్ని ఉపయోగించలేదు. ఆఖరుకు తుకారామ్ కూడా ఉపయోగించలేదు. హిందూత్వ దృష్టిలో సంస్కృతానిది కీలకమైన పాత్ర. అది భాషాశాస్త్రపరంగా సరైన దృష్టి కాదు. అది రాజకీయ దుందుడుకు తనంతో కూడుకున్నది.
హిందీ భాష, చరిత్రల పట్ల హిందూత్వ దృక్పథం పరస్పర ఆధారితాలు కావు. ఆ రెండిరటి మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధమూ లేదు. భావ వినిమయ సౌలభ్యం కోసం హిందీని ప్రోత్సహించడం జాతీయవాదులకు ఇష్టం కావచ్చు. దేశమంతటా ఒకే భాష వుంటే జాతి ఐక్యత రక్షించబడుతుందని వాళ్ళ విశ్వాసం. అయితే చారిత్రకంగా చూస్తే అది వాస్తవం కాదు. ఇంగ్లీషు మాతృభాషగాగల అమెరికా, ఇంగ్లాడులు రెండు భిన్న జాతులుగా వున్నాయి. ఒకే భాషా ప్రజలు విభిన్న జాతులుగా కూడా వుండవచ్చు. విభిన్న భాషలు కలిగిన ప్రజలు ఒకే జాతిగానూ వుండవచ్చు. జాతి, భాషల పొందిక గురించిన జాతీయవాదుల భావన కేవలం ఊహాత్మకమైనది. అది రాజకీయంగానూ, భాషాపరంగానూ సరైంది కాదు.
తంత్రాయ్ : భారతదేశంలోని ఆదివాసీ సముదాయాల పట్ల ఆర్‌యస్‌యస్, భాజపాల వైఖరిని మీరెలా చూస్తున్నారు?
దేవి : వాళ్ళు ఈ ప్రజల్ని వనవాసీలు అని పిలుస్తారు. ఇతరులు వాళ్ళని ఆదివాసీలు అంటారు. ఆదివాసీలు అంటే మూలవాసులు అని అర్థం. వనవాసి అంటే అడవులలో నివసిస్తున్నవారు, లేదా బహిష్కృతులు అని అర్థం. ఆదివాసీలు హిందూ సంఘటనకు కొనసాగింపుగా వుండాలని ఆర్‌యస్‌యస్ కోరుకుంటుంది. అయితే ఆదివాసీలకు వాళ్ళవైన మతాలూ, నమ్మకాలూ, విశ్వాసాలూ వున్నాయి. వాళ్ళకు రాముడు, కృష్ణుడు, వేదాలు, ఉపనిషత్తులతో పనేమీ లేదు. హిందువులు తలుపులు మూసివుంచిన దేవాలయాలు నిర్మించి ఒక పీఠంమీద దేవుడ్ని ప్రతిష్ఠిస్తారు. ఆదివాసీల దేవుళ్ళు ఎప్పుడూ కొండప్రాంతాలలో ఆకాశం కింద బహిరంగంగా వుంటారు. జవహర్లాల్ నెహ్రూ ఆదివాసీల కోసం ఒక తాత్విక సిద్థాంతాన్ని ప్రతిపాదించారు. దాన్ని పంచశీల అంటారు. ఆదివాసీలను అధ్యయనం చేసిన ఆదివాసి కార్యకర్త, ఆంత్రొపాలజిస్టు వెర్రియర్ ఎల్విన్ (Verrier Elwin)3 అనే ఆయన ఈ పంచశీలను రూపొందించారు. ఎల్విన్ రూపొందించిన ఐదు సూత్రాలలో ఒకటి` నెహ్రూ కూడా దీన్ని ఆమోదించారు` ఆదివాసీలకు తమదైన జీవనరీతిని అభివృద్ధి చేసుకునే అవకాశం ఇవ్వటం.
కేంద్రంలో తొలి ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంతకుముందు ఉనికిలో లేని ఆదివాసీల మంత్రిత్వ శాఖను 1999 సెప్టెంబరులో ఏర్పాటు చేశారు. వాళ్ళకంటూ ఒక శాఖ వుండడం మంచిదే. కాని ఆ శాఖ ఆదివాసీలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది. మంచి విద్య, వైద్య సదుపాయాల వంటివి వాళ్ళకి అందుబాటులోకి రావడంలో ప్రమాదమేమీ లేదు. అయితే, వాళ్ళ సంస్కృతిని అణచివేయాలనే ఆలోచనకు నేను వ్యతిరేకిని. తమ సంస్కృతిని కోల్పోవాలని వాళ్ళు నిర్ణయించుకుంటే అదే వేరే విషయం. అయితే దాన్ని కోల్పోవాలని వాళ్ళను మనం పనిగట్టుకుని అడగకూడదు. అలా చేయడం యావత్తు సమాజానికి నష్టదాయకం. దానివల్ల అనుకున్న ఫలితాలు రావు. ప్రపంచంలోని మూలవాసీ జనాభాలో అతి ఎక్కువమంది భారతదేశంలో నివసిస్తున్నారు. వాళ్లకి తమ స్వంత సంప్రదాయాలున్నాయి. మనలో చాలామంది చూసినదానికంటే ఎక్కువగా వాళ్ళు ప్రపంచాన్ని చూశారు. వాళ్ళనుంచి నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఈ సమయంలో మనం చేయాల్సింది వాళ్ళను నాశనం చేయడం కాదు, వాళ్ళ నుంచి నేర్చుకోవడం. ప్రధాన స్రవంతిలో కలిసిపొమ్మని వత్తిడి తేవడంకంటే వాళ్ళలోని భిన్నత్వాన్ని గౌరవించడం నేటి అవసరం.
తంత్రాయ్ : మీరు ప్రత్యామ్నాయ జ్ఞానవ్యవస్థల గురించి ప్రస్తావించారు. దాని అర్థమేమిటి? అవి మనకు ఎలా ఉపయోగపడతాయి?
దేవి : స్థలం, సమయం, మానవుల అంతిమ లక్ష్యం, భూమితో మనకున్న సంబంధాల స్వభావం వంటి అంశాల గురించి కొన్ని ప్రాథమికమైన భావనలున్నాయి. ఇవి మారినప్పుడు ఆ మారిన భావనల నుండి రూపొందే జ్ఞానమే ప్రత్యామ్నాయ జ్ఞానవ్యవస్థ. ఉదాహరణకు, భూమి మనకు చెందుతుందని మనం భావిస్తే ఈ భూభాగం నాది, ఆ భూభాగం మరొక వ్యక్తిది అనుకుంటాం. భూమి మనకు చెందదు, మనం దానికి చెందినవాళ్ళం అనే ఆలోచన ప్రారంభమైతే భూమిని సజీవంగా వుంచడం కోసం మనం చేయాల్సిన కర్తవ్యాల గురించిన ఆలోచనలు మనలో ప్రారంభమౌతాయి. దాని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ స్వభావం, భూమితో, ఇతర జంతు జాలాలతో సంబంధాలు, చివరికి ఇరుగుపొరుగులతో సంబంధాలు కూడా మారతాయి. జాతులు, సరిహద్దులు అనే భావన కూడా మనకు అవసరం లేకపోవచ్చు. తల్లి భూదేవి అనే ఇంధ్ర ధనస్సులో మానవులందరూ ఒక భాగమని మనం ఆలోచించగలగవచ్చు. ఆదివాసీలకు భూమితో అలాంటి సంబంధం వున్నది. అంటే మనకు ఏమీ తెలియని గొప్ప ఆవిష్కరణలు వాళ్ల దగ్గర వున్నాయని అర్థం కాదు. జ్ఞానానికి అవసరమైన ప్రాథమిక చర్యలు, పునాదులు వేరుగా వుండటమే ప్రత్యామ్నాయ జ్ఞానం అంటే అర్థం.
తంత్రాయ్ : అసత్య వార్తలు, సమాచారం ప్రస్తుత కాలంలో మన ఎరుకను, మనల్ని ఎలా మారుస్తాయని మీరనుకుంటున్నారు?
దేవి : తొలి కాలం నుండి కూడా వార్తల్లో కొంత నిజం, వార్తలు సృష్టించినవారి లేదా ప్రచారం చేసేవారి వ్యక్తిగత అభిప్రాయాలు కొంత కలగలిసి వుంటాయి. వాస్తవాన్ని పునరుత్పత్తి చేసే క్రమంలో ఎంతో కొంత వక్రీకరణ ఎలా అయితే వుంటుందో అలానే వార్తలో నిజంతో కలిసి కొంతైనా కల్పన వుంటుంది. అయితే కల్పన, నిజం కంటే ఎక్కువైపోతే అది ప్రమాదకరం. ఎందుకంటే దాని కారణంగా వార్త ఉద్దేశమే దెబ్బతింటుంది. సుదూర ప్రాంతాలలో వుండే ప్రజలకు సంబంధించిన కథనాలను, వాస్తవాలను అందరికీ తెలిసేటట్లుగా చేయడం వార్త లక్ష్యం. కాని కల్పిత వార్తలు ప్రజలకు, నిజానికి మధ్య సరిహద్దులు సృష్టిస్తాయి. అసత్య వార్తలు వార్తకు పూర్తిగా వ్యతిరిక్తమైనవి. వార్త థీసిస్ అయితే అసత్య వార్త యాంటీథీసిస్.
ప్రజాస్వామికమైన నాగరిక సమాజంలో రాజ్యం కొన్ని నిరోధ సమతౌల్యాలను కలిగివుండాలని ప్రజలు కోరుకుంటారు. అందుకోసమే దేశాలకు రాజ్యాంగాలు వుంటాయి. రాజ్యాన్ని అజమాయిషీ చేసే సాంప్రదాయక వ్యవస్థల్లో మీడియా ఒకటి. అసత్య వార్తలు మీడియా అధికారం మీద అజమాయిషీ చేసే శక్తిని కోల్పోయేటట్లు చేస్తాయి. అసత్యపు వార్తలు, వాస్తవాల ఉల్లంఘన మాత్రమే కాదు, అంతకు మించి అది ప్రసారసాధనాలకుండే ప్రజాస్వామిక కర్తవ్యాల ఉల్లంఘన కూడా.
తంత్రాయ్ : మీరు మీ నివాసాన్ని ధార్వాడ్‌కు మార్చడం గురించి ఏమైనా చెప్తారా?
దేవి : డాక్టర్ కల్బుర్గి హత్య అనంతరం, దేశవ్యాప్తంగా రచయితల ఉద్యమం ప్రారంభమైన తరవాత నేను ధార్వాడ్ వెళ్ళాను. ఈ హేతువాద ఉద్యమం దక్షిణ భారతదేశంలో కొనసాగుతోంది. నేను దానికి నాయకత్వం వహస్తున్నాను. నా చేతలు నా మాటలకు అనుగుణంగా వుండాలని నేను ఆలోచించాను. డాక్టర్ దభోల్కర్, కామ్రేడ్ పన్సారే, గౌరీ లంకేష్‌ల కుటుంబాలను కలిస్తే మంచిదని నేను అనుకున్నాను. (వైద్యుడు, హేతువాది అయిన నరేంద్ర దభోల్కర్‌ను 2013 ఆగస్టు 20న హత్య చేశారు. సామాజిక కార్యకర్త, మార్క్సిస్టు రాజకీయనాయకుడు అయిన గోవింద్ పన్సారేను 2015 ఫిబ్రవరిలో హత్య చేశారు. సామాజిక కార్యకర్త, పత్రికా సంపాదకురాలైన గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబర్ 5న హత్య చేశారు. దభోల్కర్‌ను, కల్బుర్గీనీ, లంకేష్‌ను హత్య చేసిన అనుమానితులు ఒకళ్ళేనని పోలీసుల పరిశోధన వల్ల తెలుస్తోంది) డా॥ దభోల్కర్కు ఒక సంస్థ వుందని, కామ్రేడ్ పన్సారేకు ఒక రాజకీయపార్టీ వుందని నాకు తెలుసు. కాని డా॥ కల్బుర్గి కుటుంబం వంటరిగా వుంటుంది. అందుచేత నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఎలాగైనా ఉపయోగపడగలనా అని ఆలోచించాను. ఒకసారి ధార్వాడ్ వెళ్ళాక ఆ ప్రాంతం నాకు ఆకర్షణీయంగా కనిపించింది. ఆ నగరమంతటా సంగీత, సాహిత్య వాతావరణం వున్నది. పచ్చదనం వుంది. అది చిన్న పట్టణం. నేను తక్కువ ఖర్చుతో ప్రశాంతంగా జీవించగలనని అనుకున్నాను. అక్కడి ప్రజలు బాగా చదువుకున్నవాళ్ళు, నాగరికులు. కుహనా నైతిక విలువలకు, సౌందర్య విలువలకు వ్యతిరేకంగా గొప్ప ఉద్యమాలు వచ్చిన ప్రాంతం కూడా అదే.
తంత్రాయ్ : హేతువాద ఉద్యమం అంటే ఏమిటి? ప్రస్తుత సందర్భంలో అది ఎందుకు ప్రధానమైంది?
దేవి : భారతదేశంలో హేతువాద ఉద్యమం తొలి చారిత్రక కాలంలోనే ప్రారంభమైంది. లోకాయతుల వంటి నాస్తికులు దాన్ని ప్రారంభించారు. వాళ్ళు భౌతికవాదులు, హేతువాదులు. సనాతన ధర్మ తాత్విక చింతనలను ప్రశ్నించినవాళ్ళు. అయితే వాళ్ళ వాచకాలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. వాళ్ళకు సంబంధించిన కొన్ని ప్రస్తావనలు మాత్రమే దొరుకుతున్నాయి. అయితే ఆ నాస్తిక స్రవంతి అప్పటి నుండి ఇప్పటివరకు కొనసాగుతూనే వుంది. మధ్యయుగాల కాలంలో అనేకమంది సాధువులు మూఢనమ్మకాలను, దేవుడి గురించిన సనాతన, బ్రాహ్మణ వాద వ్యాఖ్యానాలను ప్రశ్నించారు. ఎరుక, జ్ఞానం వంటి అంశాలను హేతుబద్ధంగా చూడడంలో బౌద్ద ఆలోచనా పరులు చాలా సమీపానికి వచ్చారు. వాళ్ళు రూపొందించినదాన్ని మీమాంస అని అంటారు. అది తత్వశాస్త్రంలో విశ్లేషణాత్మక విభాగం. వాళ్ళని హేతువాదులు అని పిలవాల్సిన అవసరం లేదుగాని, వాళ్ళలో ప్రశ్నించే అంశ చాలా బలంగా వుంది.
ఆధునిక కాలంలో భారతదేశంలో హేతువాద ఆలోచనాపరుల , దృక్పథాల ఆవిర్భావాన్ని 19వ శతాబ్దంలో గమనించవచ్చు. 20వ శతాబ్దాపు మధ్యకాలంలో ఐరోపాలో డార్విన్ సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చాక అది భారతదేశంలో కూడా చాలామందిని ఆకట్టుకుంది. 20వ శతాబ్దం తొలి భాగంలో కలకత్తా, బొంబాయి, దక్షిణభారతదేశంలో చిన్న చిన్న బృందాలు అనేకం ఆవిర్భవించాయి. పెరియార్ లాంటి ఆలోచనాపరుల ప్రభావంతోనూ, ఒకమేరకు అంబేద్కర్ ప్రభావంతోనూ, స్థిరపడ్డ మత మూఢ విశ్వాసాలను ప్రశ్నించడం పదునెక్కింది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే వంటి ఆలోచనాపరుల కారణంగా హేతువాద పద్ధతిలో జవాబులను కనుగొనాలనే కుతూహలం నూతన తరానికి చెందిన పాఠకులలోనూ, ఆలోచనాపరులలోనూ బాగా పెరిగింది. దీనితోపాటు మార్క్సిస్టు, వామపక్ష ఆలోచనల ద్వారా మరొక భిన్నమైన స్రవంతి కూడా ఉనికిలోకి వచ్చింది. వాళ్ళు సత్యం, సారం వంటి భావనలు మానవ ఆవరణ వెలుపలి నుండి వచ్చాయనే అభిప్రాయాలను ప్రశ్నించారు. దేవుడి వంటి భావనలను తిరస్కరించారు. యమ్.యన్. రాయ్‌లాంటి వారు, ‘ది క్వెస్ట్’ వంటి పత్రికలు హేతుబద్ధ ఆలోచనలను ప్రోత్సహించాయి.
అయితే, సైన్సుకు, శాస్త్రీయ ఆలోచనా విధానానికి పునాది అయిన హేతువాదం ఒక అంశం. మరోపక్క హేతువాదం, సైన్సుల పేరిట, బయటకు శాస్త్రీయంగా కనపడుతున్న పద్ధతులను ఉపయోగించి ప్రపంచంలో చాలా విధ్వంసాన్ని సృష్టించటం కూడా జరిగింది. ఆధునిక కాలంలో యూరోప్‌లో, అడాల్ఫ్ హిట్లర్ మైనారిటీ జాతులను అంతం చేయడానికి సైన్సును ఉపయోగించడం దీనికి ఒక ప్రసిద్ది చెందిన ఉదాహరణ.
ప్రస్తుత భారతదేశ సందర్భంలో ఇది చాలా ప్రధానమైన అంశం. బహిరంగ వాదోపవాదాలలో అసత్యానికి పెద్ద పీట వున్నప్పుడు సత్యంకోసం ప్రశ్నించడానికి చాలా ప్రాముఖ్యత వుంటుంది. గతాన్ని పనిగట్టుకుని కువ్యాఖ్యానించడం ప్రారంభమైనప్పుడు, గతాన్ని వక్రంగా చిత్రీకరించే ధోరణి పెరుగుతూ, ఒక దృక్పథాన్ని సమర్థించుకోవడానికి అనుగుణంగా కావాలని సత్యాన్ని తారుమారు చేసే స్థితి వున్నప్పుడు చరిత్రను తిరిగి శాస్త్రీయపద్ధతుల్లో ప్రజలు ముందు వుంచడం తప్పనిసరి. ఆ కారణంగా చరిత్ర పట్ల హేతుబద్ధ దృక్పథానికి ప్రాధాన్యత సంతరించుకున్నది. మరొకటి, ప్రస్తుత పాలకులు దేశంలో సైన్సుపైనే పద్ధతి ప్రకారం దాడిచేస్తున్నారు. భారతదేశంలో గతంలో జరిగిన శాస్త్రీయ అభివృద్ధి గురించి అనేకమైన తప్పుడు సిద్ధాంతాలను ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. సైన్సుకున్న ప్రామాణికతను రక్షించుకోవడానికి, శాస్త్రీయ అధ్యయనాల అవసరాన్ని లోతుగా పట్టించుకోవడానికి, హేతుబద్ధతకు అంటిపెట్టుకుని వుండటం తప్పనిసరి.
తంత్రాయ్ : అంబేద్కర్‌ను తమలో కలిపివేసుకోవడానికి ఆర్‌యస్‌యస్ ప్రయత్నిస్తోందని మీరనుకుంటున్నారా? అలా అయితే అది ఎందుకు జరుగుతుంది?
దేవి : కొన్ని సాంప్రదాయాలు మేధోపరంగా బలహీన సాంప్రదాయాలుగా జన్మిస్తాయి. అయితే వాటికి ఆధిపత్య స్ధానం లభించినప్పుడు, అవి మేధో సాంప్రదాయాల మీద తమకే హక్కు వుండాలని కోరుకుంటాయి. అలాంటప్పుడే గతం నుండి కొందరు శిఖరాయమానమైన వ్యక్తులను తమకు చెందినవారిగా చెప్పుకోవడం వాటికి ఒక రాజకీయ అవసరం. ఇది బయటకు కన్పించే అంశం. అయితే భాజపా డా॥ అంబేద్కర్‌ను తమవాడిగా చెప్పుకోవడానికి ఒక రాజకీయ అవసరం వుండి వుండవచ్చు. ఆర్‌యస్‌యస్‌కు వున్న తాత్విక ఆలోచనా సారాంశం బ్రాహ్మణులు తప్ప ఇతర ప్రజల గురించి పెద్దగా పట్టించుకోదు. అయితే హిందూ సమాజంలోని వివిధ సెక్షన్ల మద్ధతు పొందడం భాజపాకు రాజకీయ అవసరం. అక్కడ అంబేద్కర్ తప్పనిసరి అవుతున్నాడు.
(గణేష్ నారాయణ్ దేవి, మహారాష్ట్రలో 1950 ఆగస్టు 1వ తేదీన జన్మించారు. పూణే జిల్లాలోని భోర్ ఆయన స్వగ్రామం. ఆయన విమర్శకుడు, ఆలోచనాపరుడు, సంపాదకుడు, విద్యావేత్త, సాంస్కృతిక కార్యకర్త. ‘‘భాషా పరిశోధన మరియు ప్రచురణల కేంద్రాన్ని’’ స్థాపించారు. మరాÄఠీ, గుజరాతీ, ఆంగ్ల భాషలలో రచనలు చేస్తారు. ఆదివాసీ అకాడమీ స్థాపకుడు కూడా ఆయనే. భారతదేశంలో ప్రజల భాషలకు సంబంధించిన సర్వేను చేపట్టడం ఆయన ప్రయత్నాలలో చాలా గొప్పది. మూడువేల మంది పరిశోధకుల సహాయంతో ఆయన ఆ సర్వేను పూర్తిచేశారు. సాహిత్య విమర్శ, ఆంథ్రోపాలజీ , విద్య, భాషాశాస్త్రం, తత్వశాస్త్రం వంటి అంశాలకు సంబంధించి పుస్తకాలు రాశారు. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న అసహనానికి, అనేకమంది మేధావుల హత్యలకు స్పందనగా ఆయన కళాకారులు, రచయితలు, మేధావులతో కూడిన ‘దక్షిణాయన’ ఉద్యమాన్ని ప్రారంభించారు. 2015లో ఇతర రచయితలతో కలిసి సంఫీుభావాన్ని ప్రదర్శిస్తూ సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డును వాపస్ చేశారు. భారతదేశంలోని మితవాద ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, భావవ్యక్తీకరణకు ప్రమాదకరంగా మారిందని ఆయన భావన. 2016 నుండి జి.యన్.దేవి కర్ణాటకలోని ధార్వాడ్‌లో నివాసం వుంటున్నారు. మహాత్మాగాంధీ, డా॥ బి.ఆర్. అంబేద్కరల భావాలను కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకుని ఆయన పనిచేస్తున్నారు.
ఆయన రచనలు :
Critical Thought 2) Of Many Heroes 3) Indian Literary Criticism : Theory and Interpretation
4) Painted Words : An Anthology of Tribal Literature 5) The Being of Bhasha 6) The Question of Silence 7)
India Between Tradition and Modernty
చరిత్రను తిరగరాసే ప్రయత్నాల గురించి షహీద్ తంత్రాయ్, దేవిని ఇంటర్య్వూ చేశారు. దానిని సంక్షిప్తం చేసి ‘కారవాన్’ పత్రికలో 9 ఏప్రిల్ 2023న ప్రచురించారు. – అను)
వివరణలు :
1. ప్రిన్స్ క్లాస్ బహుమతి : ఇది 1966లో ఏర్పాటయ్యింది. సంస్కృతి, అభివృద్ధి రంగాలలో శ్లాఘనీయమైన కృషి చేసినవారికి ఈ అవార్డు ఇస్తారు. ఆ రంగాలలో సృజనాత్మక కృషి చేసినందుకూ, నూతన భావనలను అభివృద్ధి చేసినందుకు గుర్తింపుగా ఈ అవార్డు లభిస్తుంది. ఇది నెదర్లాండ్ దేశంలో నెలకొల్పబడిన అవార్డు.
2. హోలోసెన్ నివేదిక : ఈ నివేదికను అక్టోబర్ 9, 2022న అనేకమంది ప్రముఖ పరిశోధకులు విడుదల చేశారు. ఈ నివేదికను ప్రపంచ వ్యాప్తంగా వున్న 80 మందికి పైగా మేధావులు కలిసి తయారుచేశారు. ఈ పథకానికంతటికీ రూపశిల్పి జి.యన్. దేవి. ఈ కమిటీలో జన్యుశాస్త్రవేత్తలూ, పురాతత్వశాస్త్రవేత్తలూ, ఆంథ్రపాలజిస్టులు, భాషాశాస్త్రవేత్తలూ, తత్వశాస్త్రవేత్తలు, చరిత్రకారులూ వున్నారు. భారతదేశ చరిత్ర ఏకరూప చరిత్ర అనే మితవాదుల అభిప్రాయాన్ని పూర్వపక్షం చేయడానికి ఈ నివేదిక తయారైంది. దీని రూపశిల్పి అయిన దేవి ఇలా అన్నారు : ‘‘చరిత్ర నిరంతరం పరిణామం చెందుతుంది. ఒక శాస్త్రంగా అది కేవలం 19వ శతాబ్దంలోనే పుట్టింది. ఒకే చరిత్ర అనేది లేదు. అనేక చరిత్రలుంటాయి. భారతదేశం చరిత్రల గణతంత్రం. ఒక అబద్ధాన్ని సత్యంగా చూపెట్టాలంటే, మన మెదళ్ళను గందరగోళ పరిచే స్థాయిలో ఆ అబద్ధం వుండాలి’’.
3. వెర్రియర్ ఎల్విన్ : (జననం 29-8-1902 , మరణం 22-2-1964) ఈయన పూర్తిపేరు హారీ వెర్రియర్ పోల్మాన్ ఎల్విన్ : ఈయన బ్రిటన్‌లో జన్మించిన భారతీయ ఆంథ్రపాలజిస్టు. ఈయన ఆదివాసి కార్యకర్త. క్రైస్తవ మిషనరీగా భారతదేశంలో తన జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలానికి మిషనరీ పదవి నుండి వైదొలగి మహాత్మాగాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. 1935లో హిందూ మతంలోకి మారారు. అనంతరం, ఆదివాసీలను ప్రధానస్రవంతిలోకి తీసుకురావడానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న కారణంగా జాతీయవాదుల నుండి విడిపోయారు. ఒరిస్సా, మధ్యప్రదేశ్‌లకు చెందిన బైగాలు, గోండులలతో పనిచేసిన కాలంలో గుర్తింపుకు వచ్చారు. ఆ తరవాత కొంతకాలం ఈశాన్య భారతంలోని ఆదివాసీలతో పనిచేశారు. ఈయన భారతీయ ఆదివాసీల జీవనశైలి, సంస్కృతి` ప్రత్యేకించి గోండీ ప్రజల` లకు సంబంధించి అధారిటీ.
ఆయన రాసుకున్న జీవిత చరిత్రThe Tribal World of Verrier Elwin కు 1965లో సాహిత్య అకాడమి బహుమతి వచ్చింది. ఈయన బహుగ్రంథ రచయిత. – అను)
అనువాదం : సిఎస్సార్ ప్రసాద్