చారిత్రక కారణాలు ఏవైనా ఫాసిజం మన సామాజిక సాంస్కృతిక నేలలోనే మొలిచే విషపు కలుపు మొక్క. దానిని సకాలంలో గుర్తించి పెరికి వేయకపోతే పచ్చని పంట నాశనం అవుతుంది. సాధారణ కలుపు మొక్కలను ఏరివేయకపోతే పంట ఏపుగా పెరగదు గానీ, విషపు కలుపు మొక్క(ల)ను ఏరివేయకపోతే పంట నాశనం అవ్వడమే కాకుండా, నేల కూడా విషపూరితమై భవిష్యత్తులో ఏ పంటా పండని ప్రమాదం తలెత్తుతుంది.
అటువంటి మనిషి మౌలిక మనుగడకే ప్రమాదకరమైన ఫాసిస్ట్ ఆక్టోపస్ తన విషపు కోరలతో మన దేశాన్ని కబళిస్తోంది. నిజమైన సంస్కరణోద్యమ పోరాటాలు, లౌకిక, ప్రజాస్వామిక, సమూల పరివర్తనా(విప్లవ) పోరాటాలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నప్పటికీ, ప్రజల మానసికతను ‘గెలుచుకొని’ ఫాసిజం అధికార పీఠాన్నెక్కింది. గత పది సంవత్సరాలుగా కనీ విని ఎరుగని పరమ బీభత్సాన్ని సృష్టించి ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.కనుక ఫాసిస్ట్ ప్రమాదానికి కారణాలు ఎంత బైటివో అంతకన్నా ఎక్కువ లోపలివి. అంటే ‘మన బంగారంలోనే ఏదో లోపం’ ఉందని అర్థం. ఆ లోపాన్ని గుర్తించి తొలగించుకోవాలంటే మిత్రులు ఎన్. వేణుగోపాల్ ఇటీవల రాసిన “కాషాయ సారం- సంఘ్ పరివార్ సిద్ధాంతం- నిర్మాణం- ఆచరణ” అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిందే.
ఈ పుస్తకంలో ఏముంది?
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఒక వేయి పడగల విషనాగు. అది తన కోరలను చాచి విషాన్ని ఎలా చిమ్ముతున్నదో తెలుసుకోవడానికి దాని చరిత్రను, సిద్ధాంతాన్ని, నిర్మాణాన్ని, ఆచరణను చాలా సరళంగా, సాధికారతతో రచయిత వేణుగోపాల్ ఇందులో వివరించారు. అయితే నేనిక్కడ సంఘ్ సిద్ధాంతం, ఆచరణకు సంబంధించిన ముఖ్య లక్షణాలను మాత్రమే వివరించి, కాషాయ విషానికి విరుగుడు ఏమిటో చర్చిస్తాను.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంత నిర్మాత వినాయక దామోదర్ సావర్కర్(1883-1966).
ఆయన 1923 లో ప్రచురించిన “హిందుత్వ -హు ఈజ్ ఎ హిందూ? ” అనే పుస్తకంలో ‘హిందుత్వ’ అనే మాటను తాను హిందూ మతాన్ని సూచించడానికి వాడడం లేదని, విశాల సాంస్కృతిక అర్థంలో వాడుతున్నానని అన్నాడు. అయితే హిందూ మతాన్ని మతేతర లక్ష్యాల కోసం వాడుకునే వైఖరి అంతకన్నా ముందే మొదలైంది. బ్రిటిష్ వలసవాదాన్ని వ్యతిరేకించడానికి తిలక్, మాలవీయ,లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే వంటి వాళ్లు హిందూ మత ప్రాధాన్యతలను ముందుకు తెచ్చారు. ఇంకా గతంలోకి వెళ్లి చూస్తే- 1857 లో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీయడానికి బ్రిటిష్ పాలకులు మొట్టమొదటిసారి ప్రజల మధ్య మతవిభజనను ఎగదోశారు. ఆ మత విభజనకు మరింత బలాన్ని చేకూర్చడంలో ఇటు హిందూ మతవాదులు, అటు ముస్లిం మతవాదులు చేసిన ప్రయత్నాలు కూడా తోడ్పడ్డాయి. బ్రిటిష్ వలస పాలకులు కూడా దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా దేశప్రజల మధ్య మత విభజనను పెద్దది చేశారు. వారు 1905 లో బెంగాల్ విభజనను ముందుకు తేవడాన్ని ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.
ఆ దశాబ్దిలోనే 1910 లో జరిగిన ఒక బ్రిటిష్ అధికారి హత్యలో భాగం ఉందనే ఆరోపణపై వి.డి.సావర్కర్ ను అరెస్టు చేసి అండమాన్ జైల్లో వేశారు. అక్కడ ఆయన హిందుత్వ పుస్తకం రాయాలనుకొని, జైలు గోడల మీద రాయితో చెక్కుతూ రాశాడని చెప్పబడుతున్న దాని అక్షర రూపమే 1923లో ప్రచురించబడిన “హిందుత్వ -హు ఈజ్ ఎ హిందూ?” అనే పుస్తకం. అంతకుముందే 1921 లో వలసవాద వ్యతిరేక జాతీయ ఉద్యమంలో భాగంగా ముందుకు వచ్చిన ఖిలాఫత్ ఉద్యమం మరోసారి హిందూ ముస్లిం ఐక్యతను చాటి చెప్పిన సందర్భంలోనే ఈ సావర్కర్ పుస్తకం వెలువడిందని మనం గమనించాలి. అంటే ముస్లిం ప్రజల ఐక్యతను దెబ్బతీసి దేశ ప్రజల మెదళ్ళలో మత విభజన విద్వేషాన్ని నాటాలనే కుట్రలో భాగంగానే ఈ పుస్తకం వచ్చిందని మనం సులభంగా గ్రహించవచ్చు.
సావర్కర్ పుస్తకం తో ప్రభావితుడైన వాళ్లలో కేశవ బలిరాం హెడ్గేవార్(1889-1940) ఒకడు.1931 లోనే ఇటలీ వెళ్లి ముస్సోలినీని కలిసి అక్కడి ఫాసిస్టు పార్టీ సైనిక, భావజాల శిక్షణ గురించి తెలుసుకొని వచ్చిన హిందూ మహాసభ నాయకుడు బి. ఎస్.మూంజే(1872-1948) అప్పటికే హిందూ మత భావాలతో ఉన్న హెడ్గే వార్ ను ప్రోత్సహించి కలకత్తాకు పంపాడు. అక్కడ హెడ్గేవార్ అనుశీలన్ సమితిలో చేరి ఆయుధ శిక్షణ పొంది వచ్చాడు.ఆ తర్వాత మూంజే, సావర్కర్ల దీవెనలతో హెడ్గేవార్ 1925లో స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థను స్థాపించాడు.
ఒకవైపు విశాల ప్రజానీకమంతా బ్రిటిష్ వలస వాదంతో పోరాటం చేస్తుండగా, హెడ్గేవార్ ప్రారంభించిన సంఘ్ యుద్ధం మాత్రం బ్రిటిష్ వలసవాదుల మీద కాదు. ‘శత్రువు ఎవరంటే వలసవాదులు కాదు. మన దేశీయ ఆత్మ ఐక్యంగా లేకపోవడమే శత్రువు….కనుక మొదట ఆ బానిస మనస్తత్వాన్ని ఓడించి మనను మనం హిందూజాతిగా పునర్నిర్మించుకోవాలి’ అని హెడ్గేవార్ ప్రబోధించాడు. హిందూమతంతో సంబంధం లేదని, మాది కేవలం సాంస్కృతిక సంస్థ మాత్రమే అని చెప్పుకున్న వాళ్లే ఇలా ప్రబో ధించడం వెనుక ఏ పరమార్థం ఉన్నదో మనం గ్రహించాలి.
ఆ తర్వాత వచ్చిన హెడ్గేవార్ శిష్యుడు ఎమ్. ఎస్. గోల్వాల్కర్(1906-1973) సంస్కృతి అంటే ఏమిటో స్పష్టంగా ఇలా జవాబు చెప్పాడు. “సంస్కృతి అంటే రాజకీయాలు,ఆర్థిక వ్యవస్థ, మతం, నిత్య జీవన వ్యవహారాలు అన్నీ కలిసినది. అంటే మొత్తం జీవితం” అని చెప్పాడు. అంటే సంఘ్ చెప్పేది మతం గురించి కాదని, మతసామరస్యం గురించి కాదని ఇస్లాం లాంటి ఇతర మతాలపై విద్వేష రాజకీయాలని ఎవరికైనా సులువుగానే అర్థమవుతుంది.
ఇవాళ సంఘ్, దాని పరివార్ సంస్థలు చేసే పనులన్నింటికీ వెనుక ఉండే భావజాలం, నిర్మాణం,ఆచరణల గురించి రాసింది గోల్వాల్కరే. ఆయన రెండు పుస్తకాలు రాశాడు.(1) వి అండ్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్(1939) (2) బంచ్ ఆఫ్ థాట్స్(1966). మొదటి పుస్తకాన్ని సావర్కర్ రాసిన పుస్తకానికి పునరుక్తిగానే మనం చూడవచ్చు. ఇక ఆయన ఆలోచనలను ఉపన్యాస భాగాలను వ్యాసాలను కలిపి చేసిన సంకలనమే ‘బంచ్ ఆఫ్ థాట్స్’అనే పుస్తకం. ఈ రెండు పుస్తకాలలో పచ్చి అబద్దాలే నిండి పోయి, ప్రజలను రెచ్చగొట్టే పిలుపులు, అన్య మతస్థులైన ముస్లింలపై క్రైస్తవులపై, ఇంకా కమ్యూనిస్టులపై నిందలు, దాడులకు పిలుపులే ఉంటాయి.
సంఘ్ వాళ్లను ఎవరిని కదిపినా, అందరూ ‘1200 ఏళ్ల విదేశీ దురాక్రమణ’ అనే పచ్చి అబద్ధాన్ని వల్లె వేస్తుంటారు. 7 వ శతాబ్దంలో పుట్టిన ఇస్లాం 8 వ శతాబ్దిలో భారతదేశంలోకి వచ్చిందని, ఆ తర్వాత 1200 ఏళ్లుగా అది భారతదేశాన్ని దురాక్రమించిందనేదే దాని సిద్ధాంతం. కానీ ఎంత పచ్చి అబద్ధమో ఏ మాత్రం చారిత్రక అవగాహన ఉన్న వాళ్లకైనా సులువుగానే అర్థమవుతుంది. ఎందుకంటే 8 వ శతాబ్ది నాటి ‘భారతదేశం’ అనేది ఏకైక పాలనా ప్రాంతం కానే కాదు. దానికి ఏకైక రాజకీయ భౌగోళిక రూపం లేనే లేదు. వందలాది చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. ఉదాహరణకు క్రీ.శ. 711 లో కేవలం ఒక చిన్న ప్రాంతమైన సింధ్ ను మాత్రమే మహమ్మద్ బిన్ ఖాసిం అనే అరబ్ సేనాని ఆక్రమించుకున్నాడు. అలాగే అప్పటినుండి 14 వ శతాబ్ది మధ్యకాలంలో వేర్వేరు సమయాలలో వేర్వేరు చిన్నచిన్న ప్రాంతాలను మాత్రమేకొందరు ముస్లిం పాలకులు ఆక్రమించుకొని పాలించారు. ఇవాల్టి భారతదేశంలోని అనేక ప్రాంతాలు చరిత్రలో ఎన్నడూ ముస్లిం పాలకుల పాలనలో లేనే లేవు. కనుక సంఘ్ చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు తప్ప నిజమైన చరిత్ర కాదు.1947 కన్న ముందు గత చరిత్రలో ‘భారతదేశం’ ఎన్నడూ ఒకే దేశంగా లేదు. అది వందలాది చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలతో కూడుకున్న ఉపఖండంగానే ఉన్నది. అయితే గత 2000 వేల ఏళ్లలో పెద్ద రాజ్యాలేవీ లేవా అనంటే -ఉన్నాయనే చెప్పాలి. అవి మౌర్య, గుప్త, మొఘల్, బ్రిటిష్ అనే పెద్ద సామ్రాజ్యాలు. వాటిలో ఏ ఒక్కటి కూడా ఇవాళ ఉన్నంత విశాలమైన ‘భారతదేశం’ అనేదాన్ని ఒకే పాలన ప్రాంతంగా పాలించలేదు. ‘జంబూ ద్వీపే, భరతవర్షె, భరత ఖండే ‘అని బ్రాహ్మణులు పదేపదే జపించే మంత్రాలలో కూడా ఉన్నది నిజం కాదు. అలాగే ఆర్యావర్తం, భరత ఖండం, అఖండ భారత్ అనే నినాదాలన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడైనా ఉన్న భౌగోళిక వాస్తవికతకు సంబంధించినవి కానే కావు. అసలు మనుషులను మైనస్ చేసి దేశాన్ని కేవలం మట్టిగా,ఒక భౌగోళిక ప్రాంతంగా చెప్పేది ఏదైనా ఆధిపత్య, విస్తరణవాద,దురాక్రమణ భావన మాత్రమే అవుతుంది తప్ప మరేమీ కాదు.
ఇక సంఘ్ ఆచరణ విషయానికొస్తే- ఈ పుస్తక రచయిత వేణుగోపాల్ అన్నట్లు భావజాల రంగంలో సంఘ్ ది మనువాద, బ్రాహ్మణీయ, అసమాన, విష, విద్వేష మానసికతను నిర్మించి, నెలకొల్పే, బలపరిచే, విస్తరించే ఆచరణ. రాజకీయ ఆర్ధిక రంగంలో దానిది భూస్వామ్య, సామ్రాజ్యవాద,కార్పొరేట్, దళారీ వర్గాల ప్రయోజనాలను కాపాడే నిరంకుశ అధికార యంత్రాంగాన్ని తయారుచేసే క్రూరమైన ఆచరణ. మొత్తంగానే సమాజపు నిత్య జీవితాచరణ రంగంలో దానిది అసహనం ద్వారా, ఫాసిస్టు దౌర్జన్యం ద్వారా భయానక, అప్రజాస్వామిక దుస్థితిని కల్పించే ఆచరణ.
వందల వేల ఏళ్ల మానవీయ, లౌకిక, సహన, సహజీవన సంస్కృతులను సంఘ్ విధ్వంసం చేస్తుంది. అబద్దాలను చరిత్రగా రూపొందిస్తూ, నిజ చరిత్రను అబద్ధంగా మారుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ అధికారంలో ఉన్నందువల్ల విద్యా రంగంతో సహా ఇతర అన్ని రంగాలకు సంబంధించిన నిర్ణయాధికార సంస్థలలో తమ సంఘ్ సభ్యులను నింపి వాటి స్వతంత్రతను దెబ్బతీస్తున్నారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్ ల పదవులలో సంఘీలను నియమించి వాటి స్వయం ప్రతిపత్తిని,స్వతంత్ర పరిశోధనా లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రస్తుత నూతన విద్యా విధానం ద్వారా మొత్తం విద్యారంగాన్ని ప్రయివేటీకరించడానికి, కార్పొరేటీకరించడానికి సకల ప్రయత్నాలూ చేస్తున్నారు.
అలాగే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రచార, ప్రసార, వార్తా మాధ్యమాల మీద తమ పట్టును నెలకొల్పుకుని వాస్తవ సమాచారం ప్రజలకు అందకుండా, తామనుకున్న దాన్నే సమాచారంగా ప్రజలకు అందజేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన సమాఖ్య విధానాన్ని ధ్వంసం చేస్తూ, అన్ని రంగాలలో మౌలిక ప్రజాసామిక విలువలకు చోటు లేకుండా పచ్చి నియంతృత్వ పాలనను అమలు చేస్తున్నారు.
ఒకవైపు తాము మాత్రమే అసలు సిసలైన దేశభక్తులమంటూ, మరో వైపు విదేశీ సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థలకు, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి దాసోహం అంటూ తన కపటత్వాన్ని నగ్నంగా బయట పెట్టుకుంటోంది.దేశీయంగా తమ ప్రగతి నిరోధక, అచారిత్రక, భూస్వామ్య, మనుధర్మ భావజాలాన్ని నెలకొల్పుతూ అతి పెద్ద ప్రజాస్వామ్యానికి తామే నాయకులమని బుకాయిస్తున్నారు. పై రెండు దుష్టశక్తులు ఎటువంటి వైరుధ్యం లేకుండా మిలాఖతయి దేశప్రజలపై అనంతమైన హింసను, పీడనను ప్రయోగిస్తున్నాయి. నూతన ఆర్థిక విధానాల శకం ఆరంభమైన తర్వాత, ముఖ్యంగా గడచిన పదేళ్లలో అత్యంత ప్రమాదకరమైన, ప్రజా వ్యతిరేకమైన ప్రపంచీకరణ చర్యలు అమలయ్యాయి. వాటిలో ఆస్తుల ద్రవ్యకరణ, పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను చట్టం, వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్స్, విండ్ ఫాల్ టాక్స్ వంటి పన్నుల తగ్గింపు, బ్యాంకుల ఏకీకరణ, పౌరసత్వ సవరణ చట్టం లాంటివి ముఖ్యమైనవి.
పాలనా రంగంలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయి. రాజ్యాంగ పరమైన వివిధ అధికారిక వ్యవస్థలలో సంఘ్ భావజాలపు మనుషులను నింపేస్తూ, మొత్తంగా అత్యంత నిరంకుశ పాలనను బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇంకా న్యాయవ్యవస్థ,ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికార యంత్రాంగాలలో, ఇతర అనేక ప్రభుత్వ విభాగాలలో, చివరికి సైన్యంలోనూ సంఘ్ భావజాలాన్ని నింపుతున్నారు. అలాగే 70 వేల కు పైగా ఆర్ఎస్ఎస్ శాఖలను నడుపుతూ మొత్తం సమాజాన్ని అంతా కాషాయ మూక సైన్యంగా మారుస్తున్నారు. సావర్కర్ చెప్పినట్టుగా రాజకీయాలను( ప్రజాస్వామికీకరించే బదులుగా) మతీ(హైందవీ)కరిస్తున్నారు. (హిందూ) మతాన్ని సైనికీకరిస్తున్నారు. గోల్వాల్కర్ చెప్పినట్టుగా ‘నాజీ జర్మన్ తరహా’ హిందుత్వ స్థాపనే లక్ష్యంగా నేటి దేశ రాజకీయాలు నడుస్తున్నాయనేది ప్రత్యక్షరసత్యం.
ఆర్ఎస్ఎస్ లేదా బిజెపి శక్తులు ఎంత సనాతన మనువాదాన్ని తలకెత్తుకున్నప్పటికీ, వాటికి ఆధునిక సామాజిక పోకడలపై, సమాజంలో ఎప్పటికప్పుడు ఏర్పడుతున్న వర్గాల పొందికపై అంత్యంత నిశితమైన దృష్టి ఉన్నదని, నవీకరించబడిన సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నదని ప్రగతిశీల శక్తులందరూ తప్పక గుర్తించాలి. అందువల్లనే తామనుకున్నట్లుగా అత్యంత ప్రభావవంతంగా ప్రజల(మానసికత)ను కాషాయీకరించడం సాధ్యవుతున్నదని కూడా గుర్తించాలి. లేకపోతే హిందూ బ్రాహ్మణీయ ఫాసిజంపై నిశ్చయాత్మకమైన, ఆచరణాత్మకమైన పోరాట విధానాలను ప్రగతిశీల శక్తులెప్పుడూ రూపొందించుకోలేవు.
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, ఆచరణల గురించి నేనిక్కడ అత్యంత సంక్షిప్తంగా వివరించాను గానీ, రచయిత వేణుగోపాల్ సంఘ్ పరివార్ చరిత్ర, సిద్ధాంతం, నిర్మాణం, ఆచరణల గురించి కాలక్రమానుగుణమైన ఎన్నో వివరాలతో చాలా ప్రభావవంతంగా ఈ పుస్తకంలో వివరించాడు. ఆయన ఈ కాషాయ విషానికి విరుగుడు చారిత్రక అవసరం అని సరిగ్గానే చెప్పాడు. కానీ చిరకాల మిత్రుడిగానే గాక ఆయన రచనలకు ఒక ప్రేమాభిమానిగా ఉంటున్న నేను ఒకింత నిరాశ చెందాననే చెప్పాలి. ఎందుకంటే- ఒక మార్క్సిస్ట్ విశ్లేషకుడిగా ఏ విషయాన్నైనా అనేక చారిత్రక వివరాలతో అత్యంత సాధికారికంగా చర్చకు పెట్టి, చివరకు సైద్ధాంతిక పరిష్కారాన్ని సూచిస్తాడు వేణుగోపాల్. కానీ ఈ కాషాయ విషం ఎందువల్ల వ్యాపించిందో, దానికి విరుగుడు మందు ఏమిటని సూచించడంలో మాత్రం ఆయన సైద్ధాంతిక ముగింపును ఎందుకు ఇవ్వలేదని నాకనిపించింది.
అయితే కాషాయ విషం గురించి, దాని విరుగుడు గురించి నా దృష్టి కోణంలో చాలా క్లుప్తంగా నేనిక్కడ చర్చించి, కొన్ని ప్రతిపాదనలతో ముగిస్తాను.
ప్రగతిశీల శక్తులుగా మనం కాషాయ సిద్ధాంతాన్ని ప్రజల పాలిట విషం అని సరిగ్గానే అంటున్నప్పటికీ, ఈ కాషాయ ఫాసిజం నేటి ఆధునిక కాలం నాటిదిగా, ఇక్కడి దేశపు స్థలకాలాలకు చెందినదని మనం గుర్తించాలి. దాని విషంలో ఏ ఆధునిక మూల పదార్థాలున్నాయో గ్రహించి, ఆ విషవ్యాధిని నిర్మూలించడానికి ఆధునిక ఔషధాలతో, ఆధునిక చికిత్సను చేపట్టాల్సి ఉంటుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే- రాజకీయాలు ప్రజాస్వా మికీకరించబడకుండా వ్యాధిగ్రస్తమయితే ఫాసిజం తలెత్తుతుంది. అంటే వ్యాధిగ్రస్త ఆధునిక రాజకీయార్థిక విధానమే నేటి ఫాసిజం అని చెప్పవచ్చు.
చాలా కాలంగా మనదేశంలో ప్రజా పోరాటాలెన్నో అనేక రూపాలలో అనేక స్థాయిలలో జరుగుతున్నప్పటికీ, ఆధునికపూర్వ సామాజిక పునాది మాత్రం సమూలంగా మారలేదన్నది అక్షరాలా నిజం. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలు యావత్ వలసవాద పాలనా సంపర్కంతో ప్రవేశించిన ఆధునికతా భావాలు ఎంతో కొంత వ్యాప్తి చెంది సంఘ సంస్కరణోద్యమాలకు, వలసవాద వ్యతిరేక జాతీయోద్యమానికి దారితీశాయి.1947 లో ప్రత్యక్ష బ్రిటిష్ వలస పాలన అంతమై, కేవలం రూపంలో స్వదేశీ పాలన మొదలైంది. భారతదేశాన్ని ఎంతో కొంత ఆధునికరించుకోవడానికి పైన రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, హేతుచింతన, సామాజిక న్యాయం వంటి ఆధునికతా విలువలను పొందుపరచడమే గాకుండా, లౌకికవాదం, సామ్యవాదం అనే లక్ష్యాలు కూడా ప్రకటించబడ్డాయి. కానీ కింద భూస్వామిక పునాది మారకుండానే పైనుండి ప్రవేశపెట్టబడిన సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానాలన్నింటి ఫలితంగా మనది అర్థవలస, అర్థభూస్వామ్య దేశంగా పరిణమించింది. భూస్వామ్య పునాది సమూలంగా మారకపోవడం వల్ల స్వతంత్ర పెట్టుబడి ఇక్కడ అభివృద్ధి చెందలేదు. నాగరికతపరంగా చూస్తే- ఇక్కడి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థలు నిరాటంకంగా పునరుత్పత్తి అవుతూ, వాటి పునాదులు మౌలికంగా మారకుండానే అనేక రూపపరమైన మార్పులకు గురయ్యాయి. అసంపూర్ణమైన, అసమానమైన పెట్టుబడిదారీ అభివృద్ధి విధానాల వల్ల ఇక్కడి భూస్వామ్య వర్గాల పొందికలు, వివిధ కులసమూహాల పొందికలు అనేక రకాల మార్పులకు లోనయ్యాయి. ఫలితంగా వివిధ కులాల ఆధిపత్య కేంద్రాలు తారుమారయి మన సమాజం ఒక విచిత్ర సంక్లిష్ట వ్యవస్థగా రూపొందింది. అంటే ప్రజల మధ్య వివిధ సామాజిక విభజనలకు తోడుగా నానాటికీ తీవ్రతరవుతున్న శ్రమ దోపిడీ కారణంగా ప్రజల మధ్య ఆర్థిక విభజనలు/ వ్యత్యాసాలు పెచ్చు మీరాయి. పైగా, పైన రాజ్యాంగపరమైన ఆధునికతా విలువలను గతం నుంచి నేటి వరకు పాలించిన పాలకులందరూ లోపలి నుంచే తొలుచుకుంటూ వస్తున్నందువల్ల ఒకప్పుడు ఉపరితలంలోనైనా మనుగడలో ఉన్న ప్రజాస్వామ్య వాతావరణం క్రమంగా కనుమరుగయింది. మరోపక్క అంతకంతకూ వివిధ ప్రజాశ్రేణులన్నీ రాజకీయీకరించబడుతున్నందువల్ల ప్రజల (వర్గ)పోరాట క్షేత్రం విస్తరిస్తోంది. అయితే ప్రగతిశీల శక్తుల నుండి సరైన సైద్ధాంతిక నాయకత్వం కొరవడినందువల్ల భారత ప్రధాన స్రవంతి రాజకీయ క్షేత్రం ఆర్ఎస్ఎస్ లాంటి మితవాదుల కబంధ హస్తాల్లోకి జారిపోయింది. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా సామాజిక సాంస్కృతిక క్షేత్రంలో అనేకానేక ఆచరణా చర్యలతో తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటూ వస్తున్న ఆర్ఎస్ఎస్ శక్తులకు ప్రభుత్వ అధికారం కైవసం చేసుకోవడం సులువయింది. ఒక్కసారి ఆ మతవాద శక్తుల చేతుల్లోకి రాజకీయ అధికారం వస్తే ఏమవుతుందో గత పదేళ్లుగా వాళ్ల పాలనను మనం చవిచూస్తున్నాం. రాజకీయ ఆర్థిక రంగంలోనే కాదు సామాజిక నిర్ణయాధికార సంస్థలనూ బలహీనపరిచి, వాటిని కాషాయీకరించారు. ఒకపక్క సమాజాన్ని మతపరంగా నిట్ట నిలువునా విభజిస్తూనే, ప్రజల వ్యక్తిగత మానసికతను, సామాజిక మానసికతను కాషాయీకరిస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో వైరి వర్గాలను సృష్టిస్తూ అంతర్గత యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణగా నేటి మణిపూర్ ను పేర్కొనవచ్చు. ఒకప్పుడున్న కనీస బూర్జువా ప్రజాసామిక వాతావరణం కూడా నేడు అదృశ్యమై, రాజకీయ నిరంకుశత్వం విజరుంభిస్తోంది. అదే నేటి ఫాసిజంగా మన కళ్ళ ముందు నిలిచి ఉంది.
ఫాసిజానికి విరుగుడు: మరి ఫాసిజానికి విరుగుడు ఏమిటి? మన సమాజంలో వివిధ ప్రజా పోరాటాల ద్వారా ఆధునికతను ప్రతిష్టించుకోవడమే దీనికి సరైన విరుగుడు. అయితే ప్రగతిశీల శక్తులకు ఆధునికత పట్ల స్పష్టత ఉండకపోతే పాలకుల ఫాసిస్ట్ వ్యూహానికి దీటుగా అవి సరైన ప్రతివ్యూహాన్ని రూపొందించుకోలేవు.
అయితే ఆధునికమైందంతా ఆధునికత కాదు. ఆధునికతకు ప్రమాణాలు వ్యక్తి స్వేచ్ఛ,సమానత్వం, లౌకిక ప్రజాస్వామ్యం, హేతుచింతన, శాస్త్రీయ ఆలోచనా విధానం మొదలైనవి. కుల వ్యవస్థ, పితృస్వామ్యాలపై రాజీలేని పోరాటాలకు ప్రజలను సమాయత్తం చేయడం ద్వారానే ఈ ఆధునికతా విలువలకు సంబంధించిన భావజాలం సమాజంలో వ్యాప్తి చెందుతుంది. ప్రజల మత విశ్వాసాలను వారి వ్యక్తిగత, ప్రైవేటు ఆవరణకు పరిమితం చేసి, పబ్లిక్ /సామాజిక ఆవరణలో హేతుబద్ధమైన తార్కిక ఆలోచనలను, ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తూ పరిశీలించి, పరిశోధించి, సత్యాన్నిఆవిష్కరించుకునే పద్ధతుల కోసం పోరాడాలి. రాజ్యాంగబద్ధమైన ఆధునికత విలువల కోసం పోరాడుతూ కనీస ప్రజాసామిక విలువలను తిరిగి నెలకొల్పుకునేలా మన పోరాట పద్ధతులు ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే- సైద్దాంతికంగా ఆధునికతను కేంద్రం చేసుకొని ప్రగతిశీల శక్తులన్నీ కనీసపు ఉమ్మడి అవగాహనను రూపొందించుకుని ఐక్యంగా పోరాడుతూ వివిధ ప్రజా శ్రేణుల పోరాటాలను సమన్వయ పరచాలి. అవి అంతిమంగా ఆధునిక పూర్వ పునాదిని మార్చే ఏకీకృత పోరాటంగా పరిణమించేలా ప్రగతిశీల శక్తులన్నీ రాజీలేని కృషి చేయాలి.