ఆగస్టు 1, 2022న మేడ్చల్ జిల్లా కౌకూర్‌లో ఓ ఇంటి వద్ద సిపిఐ (ఎం- ఎల్‌) జనశక్తి నాయకులు కామేడ్‌ కూర రాజన్నను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారన్న విషయం విధితమే. ఈ అరెస్టు విప్లవ సంస్థలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించారు. అలాగే ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. కామ్రేడ్‌ కూర రాజన్న అరెస్టును ఖండిస్తూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 17న రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలందరు రాజన్న అక్రమ అరెస్టును ముక్త కంఠంతో ఖండిస్తూ, రాజకీయ ఖైదీలందరిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేయడం జరిగింది. రాజన్న 76 యేండ్ల వయస్సులో కూడా తాను ప్రత్యామ్నాయ రాజకీయాలను విశ్వసిస్తూ జీవిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు కలిగి ఉండడం నేరం కాదని కేరళ హైకోర్టు గతంలో చెప్పింది. కామ్రేడ్‌ రాజన్న పీడిత వర్గ జనసమూహం కోసం పని చేస్తున్నారు. అరెస్టు చేసిన రోజునే రాత్రిరి 11:30 గంటలకు జడ్జి ముందు హాజరుపర్చి కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు. అక్కడ మూడు, నాలుగు రోజుల తర్వాత చంచల్‌గూడకు తరలించారు. రెండుసార్లు కామ్రేడ్ రాజన్నను ములాఖాత్‌ ద్వారా విమలక్క కలిసి మాట్లాడారు. తన ఆరోగ్యం బాగా క్షీణించిందని, నడవలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే 23 ఆగస్టు నాడు సిద్దిపేట కోర్టుకు వాయిదా మీద తీసుకువస్తున్నారని విషయం అడ్వకేట్‌ ద్వారా మాకు తెలిసింది. కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళాము. రాజన్న వస్తె కలుద్దామని ప్రజా సంఘాల నాయకులమంతా అక్కడ ఉన్నాం. చాలాసేపటికి రాజన్నను కోర్టుకు తీసుకువచ్చారు. దూరం నుండి చూస్తూనే ఉన్నాం. రాజన్నతో మాట్లాడుదామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక వలయంలాగా రాజన్న చుట్టూ పోలీస్‌ ఎస్‌కార్ట్‌ నిలబడి ఉన్నది. ఎవరు రాజన్నతో మాట్లాడుదాం అని అనుకున్న మీరు ఎవరు.? ఏమౌతారు? మాట్లాడనివ్వము అని చెప్పారు. ఇంతలో నేను చొరవ తీసుకొని అడ్వకేట్‌ ద్వారా మాట్లాడుదామని ప్రయత్నం చేశాను. కానీ ఫలితం లేదు. రెండే విషయాలు అది నాలుగు అడుగుల దూరం నుండి మాట్లాడమన్నారు. ఒకటి మందులు లేవు, రెండు ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నది అని. ఈ మాటలు కూడా తడబడుతూనే చెప్పారు. కర్ర చేతిలో లేనిది నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ లోపు కోర్టు హాల్‌ నుండి పిలుపు. వాయిదా కోసం హాల్‌లోకి వెళ్ళారు. రాజన్న తాను జైలు నుండి రాసుకున్న పిటీషన్‌ ఇచ్చారు. ఆరోగ్య కారణాల రీత్యా జడ్జి గారు మెరుగైన వైద్యం అందించాలని ఆర్డర్ ఇస్తూ, మళ్ళీ వచ్చే వాయిదా తేదీని కూడా ఇచ్చారు. తిరిగి వెళుతున్న రాజన్నను కలిసి పండ్లు ఇద్దామని వెళితే జైలు ఎస్మార్ట్‌ ఇవ్వానివ్వ లేదు, కలవనివ్వలేదు. పైగా ఎదురు ప్రశ్నలు, మీరంతా ఎవరు, ఏం అవుతారంటు.

ఎందుకు రాజ్యానికి ఇంత భయం.? ప్రత్యామ్నాయ రాజకీయాలంటే మరింతగా భయం ఎందుకు.? ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలే కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా మద్దతు నిచ్చింది. ఈరోజు ఆ రాజకీయాల మీదనే దమనకాండ. ఎందుకు ఇంతలా నిర్భంధం.!?

దేని కోసం. ఇవ్వన్నింటికి సమాధానం ఒక్కటే. ప్రశ్నకు తావు ఇవ్వకూడదని. ప్రశ్న మొదలైతే పాలకుల అధికారం చేజారుతుందని. ప్రజల తిరుగుబాటు మొదలయి రాజ్యం హస్తగతం అవుతుందని. అందుకే ప్రశ్నను రేకెత్తించే ప్రజా సంఘాలు, ప్రత్యామ్నాయ రాజకీయల విశ్వాసాలు వాళ్ళను బంధీలుగా మార్చుతున్నది. ఇది ఒక పరంపరగా కొనసాగిస్తున్నది. దీనికే అర్బన్‌ నక్సలైట్‌లని పేరు. ఇది రాజ్య హింసలో భాగమే.

కామ్రేడ్‌ రాజన్న 58 ఏండ్లుగా విప్లవ రాజకీయాల్లో ఉన్నారు. తన విద్యార్థి దశ నుండి మొదలయిన విప్లవ ప్రస్థాన జీవితం అజ్ఞాతం వైపు అడుగులు సాగించాయి. ఏ రాజకీయాలను విశ్వసిస్తున్నారో, వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రాజ్యాంగం  ప్రకారంగా అసమ్మతి (dissent) కలిగి ఉండడం నేర మెట్ల అవుతుంది. రాజ్యాంగం పై వాళ్లకు విశ్వాసం లేకపోవచ్చు. అయిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న వాళ్లు, దాని మీద ప్రమాణం చేస్తున్న వాళ్లు రాజ్యాంగాన్ని విస్మరించరాదు. ఎందుకంటే కామ్రేడ్‌ రాజన్న విప్లవ రాజకీయాలు విశ్వసిస్తున్నారు. ఇదే రాజకీయాల్లో 1999 ములుగు ఎన్‌కౌంటర్‌లో తన జీవిత సహచరిని కోల్పోయారు. అయితే తెలంగాణలో ఎక్కడయిన ఏ ఘటన జరిగినా ఆ కేసులో రాజన్నను మొదటి ముద్దాయిగా చేరుస్తున్నారు. మరీ ముఖ్యంగా సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో వరుసగా కేసులను నమోదు చేస్తున్నారు. ప్రజల పక్షం నిలబడడం నేరమెట్ల అవుతుంది.? ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకోవడం కూడా దానికదే నేరమై పోతుందా? రాజన్న రాజ్యం దృష్టిలో ఒక ముద్దాయి. అయితే, తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను చాటడంలో రాజన్న ముఖ్య భూమిక పోషించాడు. అయితే తెలంగాణ పోరాటం నేరపూరితమవుతుందా..? పోరాటాలు నేరం కాదని రాజ్యం తెలుసుకోవాలి.

కామ్రేడ్‌ రాజన్న (76) హృద్రోగ వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడు కరోనా వచ్చింది. సిద్దిపేట సేషన్‌ కోర్టు ఉత్తర్వులతో రాజన్న రెగ్యులర్‌గా చూయించుకునే ఆసుపత్రికి మార్చారు. మల్టిపుల్‌ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి తరుణంలో కూడా కక్ష సాధింపుకు ప్రభుత్వాలు పోవద్దు. “జైలు మినహాయింపు-బెయిల్‌ తప్పని సరి” అనే నియమాన్ని పరిగణలోకి తీసుకొని అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కామ్రేడ్‌ రాజన్నను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నాం.

2 thoughts on “జనశక్తి నాయకులు కామ్రేడ్ కూర రాజన్న అరెస్టు – కోర్టు వాయిదాలు- అనారోగ్యం  

Leave a Reply