తన మొదటి కథా  సంకలనమే ఇంత ప్రభావశీలంగా ఉండడానికి అసలు జీవితం పట్లనే  షాజహానా గారి దృక్పథానికి  లోతైన, బలమైన పునాదులు ఉండడమే ప్రధాన కారణం. తన జీవితానుభవాల్లోంచి మాత్రమే కాకుండా, తన లాంటి వివక్షితులైన  మైనార్టీ సమూహపు పీడిత  ముస్లిం ప్రజల జీవిత వాస్తవికతా సంపర్కంలోంచి ఏర్పడడం వల్ల ఆమె దృక్పథానికి ఎంతో శక్తి సమకూరింది. ఆ శక్తితో నవనవోన్మేషంగా, సాహసోపేతంగా జీవిస్తూ ఆమె సృజించిన కళాత్మక డాక్యుమెంటులే యీ 14 ‘లద్దాఫ్ని- ముస్లిం స్త్రీ కథలు’.  నిత్యం అణిచివేయబడి  ధ్వంసమవుతున్న జీవితాన్ని తిరిగి ప్రజలు ఎలా పునర్నిర్మించుకుంటారో ఆమె కథలు పాఠకులకు చక్కగా  దృశ్యమానం చేస్తాయి. పైగా, భౌతిక పునాది గలిగిన తన స్వీయ కాల్పనిక శక్తి వల్ల కంటికి కనిపించే వాస్తవాలే కాకుండా, వాటి వెనక ఉండే కఠోర సత్యాలను కూడా  కథకురాలు వెలికితీసి పాఠకుల ముందు బయలు పరిచింది.

లోగడ అస్తిత్వవాదాలు సంధించిన రాజకీయపరమైన విమర్శలపై ఎవరెవరి అభిప్రాయాలు, విశ్లేషణలు ఎలా ఉన్నప్పటికీ, అవి ఆయా నిర్దిష్ట అస్తిత్వాల మూలాలను లోతుగా తరచి చూసే దృష్టికోణాన్ని పెంపొందించాయని చెప్పక తప్పదు. ఆ లోచూపు వల్లనే నిర్దిష్ట వాస్తవికతకు సంబంధించిన సూక్ష్మ రూపాలు, అంతస్సారపు చలనాలు తెలిసి వచ్చాయి. అవి నిజానికి సామాజిక పరివర్తనా శక్తులకు ఎంతో దోహదపడ్డాయి, దోహదపడుతున్నాయి.

పడుగు పేకల్లా పెనవేసుకుపోయిన వర్గ, పితృస్వామ్యాల పడగ కింద అణిచివేయబడి మైనారిటీ మతపర, స్త్రీ   అస్తిత్వాలు ఎంత హింసా వేదనలకు గురవుతున్నాయో  ఈ కథలు  చిత్రించాయి. ముఖ్యంగా ‘సిల్ సిలా’ కథలోని  పేద కరింబీ జీవితంలోని హింసను చిత్రించడంలో, ’సండాస్’ కథలోని దుర్గంధాన్ని గురించి వర్ణించిన తీరులో కథకురాలి చూపు, అవగాహనలు  (పాక్షికంగా కాకుండా) ఎంత సమగ్రంగా ఉన్నాయో పాఠకులకు అవగతమవుతుంది. ’సండాస్’ కథయితే నానాటికీ శరవేగంగా విస్తరిస్తోన్న నాగరికతలోని ఆధునికతా  ముసుగును  చీల్చి అసలు సిసలైన జీవన చిత్రాన్ని బట్టబయలు చేస్తుంది. దుర్గంధం కేవలం సండాస్ లోనిదే  కాదు, అది మొత్తం పేద ముస్లిం జీవితంలో పేరుకపోయిన  దుర్గంధమనే ఒక  కొత్త ఎరుకను ఈ కథ పాఠకులకు అందిస్తుంది.

అసలు ఏమాత్రం పట్టించుకోని మామూలు విషయాల వెనుక ఎంతటి వివక్ష దాగున్నదో, తోటి మనుషులకే కాదు పిల్లుల లాంటి  పెంపుడు జంతువులకు  కూడా ఆహారానికి సంబంధించిన కుల/మత వివక్షను  అంటగట్టి హింసించే అతి సూక్ష్మ రూపాలను సైతం కథకురాలు పట్టుకుంటుంది (ఉదా: ‘టిఫిన్ బాక్స్’, ‘బిల్లి’ కథలు)

మందిని వీడకుండా మంద మనస్తత్వాన్ని మాత్రమే వీడి, స్త్రీ  ఒక స్వతంత్ర  వ్యక్తిగా నిలబడాలంటే పితృస్వామ్యం పై ఎంతో పోరాటం అవసరమౌతుంది. ఎటువంటి బాధ్యతా  లేని ‘ప్రేమ’ను ఒలకబోస్తూ స్త్రీ జీవితాన్ని దురాక్రమిం  చడమే పురుషుడి జీవితంగా ఉన్న చోట స్త్రీ పడే బాధ, ఆవేదన ఎంతో దుస్సహం. శరీరాన్నే తప్ప మనసును చూడలేని, శరీరంలో తప్ప ప్రేమను వేరుగా చూడలేని మగాంధత్వం చాలా ప్రమాదకరమైనది. ఎన్నింటినో మరిచిపోయేలా చేస్తున్న  మన విద్యావంతమైన సమాజంలో అటువంటి మగాంధున్ని మరిచిపోలేనా? అని కథకురాలు ప్రశ్నిస్తుంది. ఆధునిక విద్య లోని డొల్లతనాన్ని, బాధ్యతారాహిత్యపు ప్రేమలో దాగివున్న పురుష లైంగిక(మానసిక)తను  ఘాటుగా విమర్శిస్తుంది. అనాదిగా పితృస్వామ్యం పెంచి పోషించుకుంటూ వస్తున్న భావజాలం నుంచి విముక్తం కావాలని స్త్రీలకు బోధిస్తుంది. అప్పుడే స్త్రీ తనను తాను పూర్తిగా ఖాళీ చేసుకుని, తన్నుతాను సరిగ్గా గుర్తిం చుకుంటుందని, అది ఎంతో  ఆనందదాయకమైన ప్రక్రియని ‘నేను’ కథలో చెబుతుంది.

స్త్రీలలో భయంకరమైన ఒంటరితనం నాచుగా పేరుకపోయి అసలు ఆమె అస్తిత్వమే కనబడకుండా పోవడం ఎంత హింసో  ‘మనిషి పగిలిన రాత్రి’ లో రచయిత్రి చెబుతుంది. నిజానికి రచయిత్రి ఎన్ని ముక్కలై పగిలిపోతే ఈ కథతో పాటు మిగతా కథలు కూడా రూపుదిద్దుకున్నాయోనని  పాఠకులకూ  అనిపించకమానదు.

శ్రమకు ఎంత దూరమైతే మనిషి అంత అమానవీకరణ  చెందుతాడు. శ్రమ ఉన్నచోటే  ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. జీవితం నిజవిలువ అక్కడే తెలుస్తుంది. ఈ సత్యాన్ని’సిల్ సిలా’ కథ  ద్వారా పాఠకులు గ్రహించవచ్చు. అంతేకాదు, శరీరమంతా క్షతగాత్రమై, జీవితం సాంతం హింసాభరితమైనప్పటికీ, మనుషులు, ప్రత్యేకించి స్త్రీలు  ప్రేమ అనే ఇంధనంతో జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకుంటూ ముందుకు ఎలా సాగుతారో యీ కథ మనకు తెలియజేస్తుంది. నిజానికి జీవన పునరుత్పత్తి  సౌందర్యాన్ని చాటి చెప్పిన కథగా  కూడా ఈ ‘సిల్ సిలా’ కథ పాఠకుల మనసుల్లో ఎప్పుడూ నిలిచే ఉంటుంది.

2 thoughts on “జీవన పునరుత్పత్తి సౌందర్యాన్ని చాటి చెప్పే ‘లద్దాఫ్ని’ కథలు

  1. మా సత్యం
    (నోట్: లద్దాఫ్ని’ కథల పై సమీక్ష పొరపాటున పాణి గారి పేరు పేర్కొన్నాను, రాసింది మెట్టు రవీందర్ గారు.)
    డాక్టర్ షాజహానా గారు రాసిన ‘లద్దాఫ్ని’ కథల పై మెట్టు రవీందర్ గారు ‘వసంత మేఘం’సాహిత్య పేజీ లో జీవన పునరుత్పత్తి సౌందర్యాన్ని చాటి చెప్పే‘లద్దాఫ్ని’ కథల సమీక్ష చదివిన తర్వాత షాజహానా కథలను చదువని వారిని కూడా చదవాలనే ఇంట్రెస్ట్ ను కలిగిస్తుంది.
    అందుకు ఉదాహరణ ‘సిల్ సిలా’ కథ .
    “శ్రమకు ఎంత దూరమైతే మనిషి అంత అమానవీకరణ చెందుతాడు. శ్రమ ఉన్నచోటే ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. జీవితం నిజవిలువ అక్కడే తెలుస్తుంది.
    ఈ సత్యాన్ని’సిల్ సిలా’ కథ ద్వారా పాఠకులు గ్రహించవచ్చు”
    (కానీ రచయిత్రి ముస్లిం సామాజిక మూలాల లోని సమస్యలను వాస్తవికత దృష్టితో అస్తిత్వం మూలాలను పరిశీలించి రాజకీయ మూలాలను తమ పాత్రల చేత ప్రశ్నింప చేస్తే చాలా బాగుంటుంది.)
    ‘వసంత మేఘం’ లో వచ్చే ప్రతి రచన దేనికదే ఒక ప్రత్యేకత కలిగి చదివే పాఠకులలో జిజ్ఞాసను కలిగిస్తోంది.
    నిర్వాహకులకు
    ఉద్యమాభి వందనాలు తెలియజేస్తూ.

  2. ✊✊👍❤️
    8-01-2022*

    *సమీక్ష:
    Maa Satyam:
    కుమార స్వామి గారు రాసిన
    “పూల పరిమళాలు”.
    కుమార్ స్వామి వృత్తిరీత్యా అధ్యాపకుడు. అధ్యాపనం లో ఉన్న కవి. ‘పూలపరిమళాలు’
    శీర్షిక పేరు లోనే లోతైన తాత్విక అర్థాలతో నిర్మితమైన కవితా సంపుటి.
    కవియొక్క స్పష్టమైన దృక్పధాన్ని ప్రతీకాత్మకంగా వ్యక్తంచేస్తున్నాయి. చెరబండరాజు అన్నట్లు
    ” రాజకీయ స్పష్టత ఉంటే కవిత్వం
    తన రూపం తాను సంతరించు
    కుంటుంది”. అంటారు.
    మొదటి కవితా సంపుటితో ఆరంభం.
    కవిత్వంలో కొత్తదనాన్ని అన్వేషిస్తూ భాషలో, శిల్పములో, పదాలలో,
    పదప్రయోగంలో, రూపంలో (ఫామ్) నవ్యతను అభిలషించే లక్షణంతో కదం తొక్కుతూ వస్తున్న యువ కవి. వారిలోని భావావేశం, భావన
    (ఎమోషన్- ఇమేజినేషన్)
    కొత్త సృష్టికి తపన పడే తత్వముతో సమకాలీన వస్తువుకి
    ఊపిరిపోసి
    భావస్ఫోరకంగా
    ఉన్నవస్తూవునే నూతనార్థంలో ఇతరులను అనుసరించకుండా తనదైన శైలిలో ప్రతిపాదించే ప్రయత్నం తనకంటూ ఒక వినూత్న శైలిని ఏర్పరుచుకోవాలనే తపన కవిలో బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
    నూతన సమాజ అవసరాన్ని వారి కవితల్లో అంతర్లీనంగా లోతైన వాడైన ఆలోచనలతో రాజ్యహింసను ప్రతీకలతో సూచిస్తూ జనం గుండెలను తాకే సంకేతాలు వారి కవితలు. కవితలోని ఇతివృత్త యదార్థత పాఠకుడిని అత్యంత ఉత్సాహంతో చదవడానికి ప్రేరేపించడం అభినందనీయం. కవిత్వంలో ఎక్కడ అయోమయత్వం కనిపించదు, నిష్కర్షగా చెప్పగల ధైర్యం, స్పష్టత, సూటిదనం, నిర్భీకత,
    నిజాయితీ వ్యక్తమవుతోంది.
    ‘పూల పరిమళం’ లో మొత్తం 49 కవితలు.
    కవి తన జీవిత సమరంలో
    ఏమేరకు క్రియాశీలకంగా
    ప్రజా ఉద్యమాల్లో మమేకమైన తీరును కార్యాచరణను కవిత్వంలో దర్శించవచ్చు.
    ప్రకృతి నుంచి ప్రతీకాత్మకంగా స్వీకరించిన ప్రతీకలు కావడంతో కవిత్వానికి సామర్థ్యాన్ని కలిగించాయి.
    ఆధునిక కవితా రీతులు ఎల్లప్పుడూ మారుతూ ఉన్నప్పటికీ కుమార స్వామి విప్లవ కవిగా రూపొందిన తర్వాత పీడితుల భాషలో కవిత్వాన్ని పలికించక పోవడము బలమైనలోపం.
    సాహిత్యం జీవితానికి ప్రతీక కాబట్టి జీవితంలోని సాహిత్యములోని అర్థాన్ని ప్రతీకాత్మకంగా వివిధ కోణాలలో తను నమ్మిన విశ్వాసాలతో తన లోని ఇన్నర్ స్పిరిట్ తో కవితల్లో అక్కడక్కడ కనిపిస్తారు.
    రెండు కవితలను మాత్రమే సమీక్షిస్తాను. వి మిత్ర గారు రాసిన ముందుమాట ఈ కవితా సంపుటికి ఒక చరిత్రాత్మకమైన డాక్యుమెంట్ గా ఉంటుంది.
    మొత్తం కవితలను సమీక్షించడం సమంజసం కాదు కనుకపాఠకులు కొని చదివి కవి యొక్క ఉద్యమ నేపథ్యాన్ని,నిబద్ధతని
    తెలుసుకోవాల్సిందే.
    మొదటగా
    ‘పూల పరిమళం’ కవితలలో కవి యొక్క ఉపచేతన ములోని ఆలోచనలు, (Sub-conscious thoughts) గతితార్కిక దృష్టితో అర్థం చేసుకుని, వర్గ పోరాటాల సమాజంలో వర్గ చైతన్యముతో కవిత్వంతో క్రియాశీలకమై పాలకుల అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తనలోని భావాలను నిరసన రూపంలో, పీడిత ప్రజల ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ చారిత్రక మార్పును సృష్టించడానికి వర్గపోరాటం అవసరమని తన కవితలలో అంతర్లీనంగా వ్యక్తమవుతూ ఉంటుంది.
    ప్రజా ఉద్యమ పోరాటాల ప్రతిబింబమే
    ఈ ‘పూలపరిమళాలు’
    కవితా చరణాల
    లోని తాత్వికత పరిశీలిస్తే ప్రతీకాత్మకంగా
    “తిరగబడ్డ పొద్దు”
    మీద మొగ్గ
    తొడుగుతున్నఆశ
    రాలినపూలనువీడని
    త్యాగపరిమళం
    పిడికిట విశ్వాసమై
    పోరుగాలిపయనం
    కన్నీళ్లను శ్వాసిస్తూ కలల అలల్ని ప్రేమిస్తూ
    ఆశయాల దారుల్లో నడవాల్సింది విశ్వాసపు అడుగులే!” అంటూ విప్లవ
    ప్రజా యుద్ధ పంథానుంచి మధ్యలోనే అభిప్రాయ భేదాలతో బయటికి వచ్చిన వారిని,
    బలహీనతలను అధిగమించని వాళ్లని, అత్యంత సున్నితంగా హెచ్చరిస్తూ,
    పీడిత మానవాళి పట్ల ప్రేమతో రాజ్యహింసను ప్రతిఘటిస్తూ దృఢ సంకల్పముతో విప్లవ ఐక్య కార్యాచరణ ప్రాముఖ్యతను ఆవశ్యకతను అంతర్లీనంగా తెలియజేస్తుంది.
    ఈ’పూల పరిమళాల’ కవితా సంపుటికి ప్రజా ఉద్యమాల చైతన్యమే ప్రాణం.
    ఆ చైతన్యానికి స్పందించి వెలువడేదే ఆయన కవిత్వం. కుమారస్వామి కవిత్వంలో విప్లవ కాల్పనిక భాష ప్రయోగంతో విస్తృతార్థంలో రాజ్య నిర్బంధాన్ని ప్రతిఘటిస్తూ, దిక్కరిస్తూ తన కవిత్వం ద్వారా నిరసన రూపంలో ప్రయోగించారు.
    కల్పనా చమత్కృతితో స్వభావ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి ప్రతీకల్ని స్వీకరించి నిరర్థక పదప్రయోగంలేక, విప్లవ కాల్పనిక భాషతో
    ఒకబంధాన్ని ప్రయోగించారు.
    “నెమలికన్ను ” కవితలో చేనేత కార్మికుల అస్తవ్యస్త స్థితిగతులను
    సమాజంలోని జీవన యదార్థ స్థితిగతుల వెనకనున్న కారణాలను,
    వర్గ సంఘర్షణలకు గతి తార్కిక భౌతిక చారిత్రక దృక్పథంతో, దృష్టితో కారణాలను
    కవి ఎంతో నిష్టతో ప్రతిఫలింప చేశారు. ప్రశంసనీయం.
    ‘నెమలికన్ను’
    కవిత చరణాలను పరిశీలించి చూస్తే
    “చిక్కుబడ్డ బతుకు పోగులను
    సుతారంగా సక్కపెడుతది
    పాడుకాలం తెంపినపోగుపేగు
    బంధాలను గుండెతడిలో అద్ది
    పడుగుపేకలను
    సింగారస్తది.”
    ” ఆకలిదూపకు
    గంజి అమృతమై
    బొందిలో ప్రాణము నిలుపుకొని
    రేపటి సరికొత్త చీర పొద్దుకు
    అద్దమ రాత్రి ఆమె అందమైన
    కలగంటది.”
    బహుశా కవి ప్రతీకాత్మకంగా సమసమాజాన్ని కలగా చూపిస్తున్నారు.
    కవితలో చేనేత పనివారి ఇంటిని సహజ సుందరంగా వర్ణించినాడు.
    గ్రామీణ జీవన విధానాలకూ, గ్రామీణ ప్రకృతి సౌందర్యానికి సంబంధించిన అంశాలు కవితల్లో తటస్థించినప్పుడు, దర్శించినప్పుడు, కవికి పరిచితమైన ప్రకృతిని
    ఆ ప్రకృతిలోని ప్రతీకలను,
    కనుమరుగవుతున్న తెలంగాణ మాండలిక పదాలను సందర్భోచితంగా పదాలను వాడారు,
    ఏ రాష్ట్రం మాండలికాలైనా భాషకీ సజీవ చిహ్నాలు. నేటికీమాండలికంలోని చాలాపదాలు నిఘంటువులోకి ఎక్కలేదు.
    చేనేత వృత్తి పదాలను కవితలో ప్రయోగించారు.
    చివరగా మావో అన్న మాటలు గుర్తు చేసుకుంటూ
    ” సాహిత్యానికి మూలకందం మానవాళిపై ప్రేమ” అన్నారు.
    90 శాతం గా ఉన్న పీడిత ప్రజల పట్ల ప్రేమతో కుమారస్వామి విప్లవకారుడు కాకపోయినా, విప్లవ కవిగా జరుగుతున్న పోరాటంలో సమాజాన్ని ఒక అడుగు ముందుకు వేయించడానికి తన వంతు పాత్రను నిర్వహిస్తున్నాడు.
    విప్లవ కవిత్వం ప్రజలకు సన్నిహితం కావడానికి కొత్త కొత్త పదచిత్రాలతో విప్లవ ప్రతీకలతో విప్లవ కవులు అపారమైన విప్లవ సాహిత్యం సృష్టిస్తున్నారు వారందరికీ ఉద్యమాభి వందనాలు తెలియజేస్తూ.
    కామ్రేడ్ ఆర్కే అన్న మాటలు స్మరించుకుంటూ
    ” జీవిస్తాం జీవిస్తాం ప్రజల కొరకే జీవిస్తాం
    మరణిస్తాం మరణిస్తాం ప్రజల కొరకే మరణిస్తాం.”
    విప్లవ రచయితల సంఘం వర్ధిల్లాలి
    ప్రజా కలలు వర్ధిల్లాలి.

Leave a Reply