గత జూన్ నెలలో కడప జిల్లా పొద్దుటూర్ పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా మొదలు పెట్టిన తొలి దశ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అడ్డుకున్నది. ఇది కేవలం ముస్లింలను సంతృప్తి పరచడానికి ఉద్దేశించిన కార్యక్రమంగా ఆ పార్టీ పేర్కొన్నది. టిప్పు సుల్తాన్ హిందూ మత ద్వేషి అని, హిoదువులను ఊచకోత కోయించిన హంతకుడు, హిందు స్త్రీల పైన అత్యాచారాలు జరిపించిన దుర్మార్గుడు, అతనొక ఉన్మాది అని అసలు ఈ దేశ వాస్తవ్యుడే కాదనేది బీజేపీ వాదన. అలాంటి చారిత్రక చెడ్డ పురుషుని విగ్రహం నెలకొల్పడం జాతీయ స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తున్నది. నిజానికి బీజేపీ ఇవ్వాళ కొత్తగా దీన్ని లేవనెత్తడం లేదు. శ్రీరంగపట్టణం తన రాజధానిగా చేసుకొని మైసూరు సామ్రాజ్యాన్ని పాలించిన 18 వ శతాబ్దపు రాజైన టిప్పు సుల్తాన్ పై గత కొంత కాలం నుండే కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి ప్రచారం చేయడమే కాదు నిరసన, ఆందోళనా కార్యక్రమాలను చేపట్టింది. భారత ఉపఖండపు రాజరిక వ్యవస్థలను మత ప్రాతిపదికన చీల్చివేసి ఆ కాలపు నిర్ధిష్ట పరిస్థితులతో సంబంధం లేకుండా ఎంపిక చేసుకున్న కొన్ని ఘటనల ఆధారంగా చరిత్రను వ్యాఖ్యానించడం,తన హిందూత్వ రాజకీయ ప్రయోజనాల కనుగుణంగా మార్చుకోవడం బీజేపీ-సంఘ్ పరివార్ లు పనిగా పెట్టుకున్నాయి. రెండు వందల ఏళ్ల నాటి చరిత్రను వక్రీకరించి ఇవ్వాల్టి అల్ప సంఖ్యాక వర్గాల మీద ద్వేషం వెళ్లగక్కి అధికార పీఠం భద్రపర్చుకోవడమే తప్ప మరొకటి కాదు. ఆనాటి ముస్లిం పాలకులను ఈ దేశ వాసులు కారు అని చెప్పడం వెనుక  నేటి ముస్లిం సమాజానికి కూడా ఈ నేల వాసులు కాదనే హెచ్చరికనే ఉన్నది.

ఎలాంటి రాచరికపు చరిత్ర లేని హైదర్ అలీ(టిప్పు సుల్తాన్ తండ్రి) మైసూరు రాజ్యంలో ఒక సాధారణ సైనికాధికారి నుండి రాజ్యాధినేతగా ఎదగడం ఒక అసాధారణ చారిత్రక పరిణామం. ఆనాటి ఈస్టిండియా వలస పాలనకు వ్యతిరేకంగా నిలబడి స్వతంత్రతను నిలబెట్టుకున్న సాహసి. అలా తన రాజ్య సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలోనే యుద్ధ రంగంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ వారసత్వాన్ని నిలబెట్టి బ్రిటిష్ పెత్తనాన్ని తుదకంటూ దునుమాడిన వీరుడు టిప్పు సుల్తాన్. హైదర్ అలీ,టిప్పు సుల్తాన్ లా రాజరిక చరిత్ర, పాలనా చరిత్ర పైన రెండు రకాల చారిత్రక ఆధారాలే ఉన్నాయి. ఒకటి తన జీవిత కాలం ఎవరినైతే నిలవరించి తన స్వతంత్ర సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడో వాళ్ళు రాసిన చరిత్ర. వాటి ఆధారంగా అప్పటి చరిత్రను వక్రీకరించినన హిందూత్వ చారిత్రక రచనలు.ఈ రెండింటి ఆధారంగా నేడు ఆయనను హిందూ మత ద్వేషిగా నిలబెట్టి మెజారిటీ మత సమూహాన్ని రెచ్చగొట్టి రాజ్యాధికారం స్థిరపర్చుకునే పన్నాగమే పరివార్ ది. రాజులు ఎప్పుడు కూడా ప్రజల కొరకు యుద్ధం చేయరు. తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం ఎంతటి ఘోరాలకైనా తెగబడుతారనేది చరిత్ర తేట తెల్లం చేసిందే. ఇందులో మత విశ్వాసాలు, గుర్తింపుకు చోటులేదు. టిప్పు సుల్తాన్ అసలు భారతీయుడే కాదు అనడం అర్ధరహితం. ఆయన కాలానికి భారతదేశం అనే రాజకీయ చిత్రపటం అంటూ ఏమి లేదు. భారత ఉపఖండంలో ఎవరి శక్తి మేరకు వారు రాజ్యాలను పెంచుకుంటూపోయారు. ఆ క్రమంలో అడ్డువచ్చిన వారందరూ బాధితులయ్యారు. ఆ రోజు మత ప్రాతిపదికన రాజ్య నిర్మాణాలు జరగలేదు. ఒక రాజ్యంలో పాలకుడు ఒక మతం, పాలితులది ఇంకో మతంగా ఉండటం సాధారణమైన విషయమే. అయితే అఖండ హైందవ భారత నిర్మాణం గురించే మాట్లాడే వాళ్లే చరిత్రను ఈ కోణం నుండి అర్థం చేసుకొని మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని చూస్తారు. అది వారి నేటి అజెండాకు ఉపకరిస్తుంది కాబట్టి. వాళ్ళ దృష్టిలో ఒక మతానికి చెందిన పాలకులు అంతా పరమత ద్వేషులు. తనది కాని మత సమూహాల పై అనేక దుర్మార్గాలకు ఒడిగట్టారని చెప్పడం,ప్రచారం చేయడం సులభం. సహజంగా మత ప్రాతిపదికన బాధితులు కాకపోయినా బాధితులల్లో అధిక మత విశ్వాసాలు ఉండే వాళ్ళు అధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళ పైన ఈ ప్రచారం చేసి నమ్మించడం సులభం. సంఘ్ పరివార్ సరిగ్గా అదే చేస్తున్నది. రాజు ఏ మతస్తుడైనా బాధితులు అన్ని మతస్థులు అయి ఉంటారు. ముస్లిం పాలనకు వచ్చేసరికే బాధితుల మతం గుర్తుకువస్తున్నది కానీ హిందూ మత విశ్వాసం కలిగిన పాలకుడి చేతుల్లో బలైన బాధితుల మతం గుర్తుకురాదు.

టిప్పు సుల్తాన్ గొప్ప పాలకుడు అని చెప్పాల్సిన అవసరం లేకుండానే బీజేపీ-పరివార్ ప్రచారం చరిత్ర వక్రీకరణే అని చెప్పవచ్చు. వాళ్ళు చెబుతున్నది అబద్ధం అని చెప్పడమంటే టిప్పు సుల్తాన్ గొప్ప రాజు అని చెప్పడమూ కాదు. చరిత్రగా చెప్పబడుతున్నదంతా అంతా వాస్తవం కాకపోవచ్చు. వాస్తవ చరిత్ర వెలుగులోకి రాకపోవచ్చు. కానీ కొన్ని మౌలిక నిర్దారణలు చేయవీలైన పరిణామాలు అనేకం ఉంటాయి. మన పైత్యానికి అనుగుణంగా చరిత్రను వక్రీకరిస్తే చేదు ఫలితాలు ఉంటాయి. రెండవ కర్ణాటక యుద్ధంలో తండ్రి హైదర్ అలీని పోగొట్టుకున్నాక సింహాసనం మీద కూర్చున్న టిప్పు తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడు అనడానికి ఆయన బ్రిటిష్ వలస విస్తరణ వ్యతిరేక పోరాటమే నిదర్శనం.  ఒకవేళ ఆయన ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే మరాఠాల పై యుద్ధం చేయడానికి హైదరాబాద్ నిజాం రాజులతో జట్టు కట్టేవాడు. బ్రిటిష్ వారిని ఎదిరించడానికి మరాఠా రాజ్యంతో, నిజాం రాజ్యంతో ఐక్య సంఘటన ఏర్పాటుకు చేసిన తీవ్రమైన ప్రయత్నాలు చూస్తే టిప్పు సుల్తాన్ వలసాధిపత్య వైఖరేమిటో తేటతెల్లం అవుతున్నది. ఇటు హైదరాబాద్ రాజ్యం,అటు మరాఠా రాజ్య వ్యవస్థ రెండు బ్రిటీషు వారితో చేతులు కలిపి మైసూరు సామ్రాజ్యం మీద దండెత్తడమంటేనే ఎవరిది ద్రోహమో,మోసమొ ఎవరిది స్వతంత్ర కాంక్షనో స్పష్టమయిపోయింది. టిప్పు సుల్తాన్ ఈ క్రమంలో తన సామ్రాజ్య ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి పట్ల, బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసిన వారి పట్ల సహజంగానే కఠినంగా వ్యవహరిస్తాడు. అందులో ఏ విశ్వాసం కలిగిన వాళ్ళైన, ఏ సామాజిక సమూహమైనా,ఏ ప్రాంతమైన కావొచ్చు. అది అందరు రాజులు చేసేదే. అట్లా అనేక ప్రాంతాలు, సమూహాలు, మత విశ్వాసం కలిగిన వాళ్ళు బాధితులవుతారు. అయితే మొత్తంగా ఒక చారిత్రక పరిణామ క్రమంలో నుండి కాకుండా దాంట్లోంచి కొన్ని ఘటనలను ఎంపిక చేసుకుని నిర్దారణలకు రావడం  బీజేపీ-పరివార్ చేస్తున్నది. అలా చూసినప్పుడు హిందూ మత విశ్వాసం కలిగిన రాజాశ్రమoలో ముస్లిం ఉన్నతోద్యోగులు, ముస్లిం పాలకుల కాలంలో హిందూ ఉన్నతోద్యోగులు ఉండటం ఆ రోజున సర్వసాధారణంగా ఉన్నదే. టిప్పు సుల్తాన్ రాజ్య సలహాదారునిగా బ్రాహ్మణ వర్గానికి చెందిన పూర్ణయ్య వ్యవహరించాడు. శివాజీ రాజ్యంలో రుస్తలీ జవాన్, అఫ్జలీఖాన్ కార్యదర్శిగా కృష్ణాజి భాస్కర్ కులకర్ణి లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. నిజానికి ఆనాటి యుద్దాలేవి మత ప్రాతిపదికన జరగలేదు. ఒకే మతానికి చెందిన రాజులు యుద్ధాలు చేశారు,వేరు వేరు మతాలకు చెందిన వారు యుద్దాలు చేశారు. కానీ హిందు ముస్లిం రాజుల మధ్య జరిగిన యుద్దాలను మాత్రమే హిందువులపై దాడులుగా ప్రచారం చేస్తున్నారు. గుడుల పై దాడులు అన్ని మతాల రాజుల మధ్య జరిగిన యుద్ధంలో చోటుచేసుకున్నాయి. నిజానికి ఆ ఘటనలు మత విద్వేషంతో చేసినవి కాకుండా  దేవాలయాలు సంపద పొగుబడ్డ స్థావరాలుగా పేరు పోవడమే కారణం.మైసూరు టిప్పు సుల్తాన్ పై యుద్ధం చేసే క్రమంలో శ్రీరంగనాదస్వామి దేవాలయం పై దాడి చేసింది మరాఠా హిందూ రాజులే! దానికి మరమ్మతులు చేయించింది టిప్పు సుల్తానే కదా!

టిప్పు విలనెట్లా అయ్యాడు?

బ్రిటిష్ పాలనపై పోరాడిన ప్రతి వాళ్ళను హీరోలుగా ప్రచారం చేసే పరివార్ కి టిప్పు విలనెట్లా అయిండు? ఒక్క మతమే మరేమీ కాదు. ప్రతి నవంబర్ 20 న ‘మైసూర్ పులి’ గా పేరు గాంచిన టిప్పు సుల్తాన్ జయంతిని అన్ని పార్టీలు జరుపుతూనే ఉన్నాయి. అందుకు బీజేపీ మినహాయింపు కాదు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అధికారిక కార్యక్రమంగా చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు ఆందోళన జరిపింది. దక్షిణాదిన కర్ణాటక లో అధికార పీఠం మీద పాతుకుపోవాలంటే మత చిచ్చును రగిలిస్తే తప్పా సాధ్యం కాదనుకున్నది. సడెన్ గా టిప్పు హిందు ద్వేషి అని గుర్తుకొచ్చింది. కొడవ తెగను,క్రైస్తవులను వేధించిన’ సంగతిని వెంటనే ప్రచారంలో పెట్టింది. హైదర్ అలీ చిత్రదుర్గ కోటను ముట్టడి చేసే క్రమంలో ఆయన్ని ఎదిరించిన ఒనక ఓబవ్వా అనే దళిత పొరటయోధురాలు యుద్ధంలో చనిపోయింది. ఈ చారిత్రక సంఘటనను ఉపయోగించి దళితులను తమ వైపు తిప్పుకుని ప్రయత్నం చేసింది. అప్పటికీ తనకేదో క్రైస్తవులు,దళితుల మీద ప్రేమ ఉన్నట్టు. మరోవైపు ఇదే పరివార్ ఈ రెండు సమూహాల మీద దాడులు చేస్తున్నది. బీజేపీ 2012 లో అధికారంలో ఉన్నపుడు అధికారికంగా కన్నడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డా షేక్ అలీ “టిప్పు సుల్తాన్ -ఏ క్రూసేడర్ ఫర్ చేంజ్” అనే 338  పేజీల మోనోగ్రాఫ్ లో ఆనాటి బీజేపీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్  టిప్పు సాహస గాధలను, విజయాలను,బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని శ్లాఘిస్తు అధికారికంగా సందేశాన్ని రాసాడు. నేటి రాష్ట్రపతి ఒకప్పటి బీజేపీ నాయకుడు రాంనాద్ కోవింద్ టిప్పు ను గొప్ప హీరో అని కీర్తించాడు. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి గా ఉన్న యద్యూరప్ప బీజేపీ తో విభేదించి కర్నాటక జనపక్ష పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నపుడు టిప్పుసుల్తాన్ స్మారక చిహ్నాలను దర్శించి టిప్పు త్యాగాన్ని గొప్పగా కొనియాడాడు. ఇంతగా పొగిడిన బీజేపీ పరివార్ కి ఆంధ్రప్రదేశ్ లో ఒక పట్టణంలో టిప్పు విగ్రహాన్ని పెట్టడాన్ని యుద్ధప్రాతిపదికన ఎందుకు వ్యతిరేకిస్తున్నది? ఆంధ్రప్రదేశ్ లో ఎదగడానికి మరో అంశమే లేదా? గుళ్ళు,గోపురాలు,మతం తప్ప మనిషిని ఎందుకు ఎజెండాలో పెట్టుకోవడం లేదు? ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన సందర్భంలో ఆంధ్రా కు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజి మీద ఉద్యమం చేయొచ్చు. ఇంకా అనేక హామీలు కేంద్రం నెరవేర్చాల్సినవి ఉన్నవి. వాటి కోసం వాళ్ళ ప్రభుత్వం పైన కొట్లాడి సాధించుకోవచ్చు. అయినా ఇక్కడ విగ్రహం పెట్టొద్దు అంటూ లొల్లి చేసే వాళ్లంతా వాళ్లే అధికారంలో ఉన్న కర్ణాటక లో ఉన్న విగ్రహాలు కూల్చివేయవచ్చు కదా! బెంగుళూరు మైసూరు మధ్య నడిచే టిప్పు ఎక్స్ ప్రెస్  రైలును నిలిపివేయవచ్చు! నిజానికి టిప్పు సుల్తాన్ ముస్లిం అయి ఉండకపోతే ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి  ఛత్రపతి శివాజీ  పేరు పెట్టినట్టే బెంగుళూరు విమానాశ్రయానికి కూడా పెట్టేవాళ్లే…! అలా చేయరు. ఇదంతా టిప్పు పై ఉన్న ద్వేషం కంటే  ఒక మొత్తం సమూహం పట్ల వ్యతిరేకతనే కదా!

టిప్పు సుల్తాన్ ముమ్మాటికీ సెక్యులర్ పాలకుడే. వలస పాలన విస్తరణకు వ్యతిరేకంగా  తిరగబడి పోరాడి అసువులు బాసిన దేశభక్తుడు. ఆ కాలంలోని మిగతా రాజ్య వ్యవస్థల కంటే ముందుచూపు,ప్రగతిశీల భావనలు ఉన్నవాడే. ఉచిత నిర్బంధ విద్య అనే  భావన ఆయన కాలం నాటిదే. దేవదాసి వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. నరబలి, మద్యపాన పై నిషేధం విధించాడు. ఈస్టిండియా ఉత్పత్తులను బహిష్కరించి ఇప్పుడు పరివార్ మాట్లాడుతున్న స్వదేశీ వస్తు వినియోగాన్ని అప్పుడే ప్రోత్సహించాడు. ఆయన సమకాలికులు ఎవ్వరు నెరపని విదంగా ఫ్రాన్స్,టర్కీ లాంటి దేశాలతో విదేశాంగ విధానం రూపొందించాడు. 1783 లో బ్రిటన్ నుండి అమెరికా స్వాతంత్రం పొందినపుడు ఫిరంగులు పేల్చి మరీ స్వాగతించాడంటే దేశాల స్వాతంత్ర్య కాంక్షను ఎంతగా గుర్తించినట్టు.

నేరస్తులకు పరివర్తన కలిగేలా నేర శిక్షా వ్యవస్థను మార్చే ప్రయత్నం తనదే. హిందూ దేవాలయాలు కూల్చిన మతోన్మాద పాలకుడు అని పరివార్ ప్రచారం ఎంత చేస్తున్నా నజుండేశ్వరాలయం, లక్ష్మి నాధ స్వామి ఆలయం నిర్మించడమే కాదు ‘ముజరాయి’ పేరుతో హిందు ఎండోన్మెంట్ బోర్డ్ ను ఏర్పర్చాడు. ఆయన జారీ చేసిన ఫర్మానాలలో 150 పైగా దేవాలయాలకు సంబంధించినవే.

టిప్పు విగ్రహం కాకుండా  మిస్సైల్ మ్యాన్ గా గుర్తించబడ్డ అబ్దుల్ కలాం విగ్రహం పెట్టండి అని ఆంధ్రా బీజేపీ వారు సలహా ఇస్తున్నారు కానీ ఆ మిస్సైల్ వ్యవస్థకి ఆద్యుడు టిప్పు సుల్తానే అని ఆయనే నాకు స్ఫూర్తి అని స్వయంగా కలామే అన్న విషయాన్ని ఎందుకు మరిచారు? నావికా వ్యవస్థ కోసం తొలి అడుగుగా బటికల్ ప్రాంతంలో నేవల్ కాలేజీని ప్రారంభించాలక్నుకున్నాడు. బెంగుళూరు,చిత్రదుర్గ, బెద్నూర్ లాంటి ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కి పునాదులు వేసింది ఆయనే. యంగ్ ఇండియా పత్రికలో గాంధీ టిప్పు సుల్తాన్ ను ప్రస్తుతిస్తూ మత సామరస్యానికి ప్రతీక టిప్పు అని కొనియాడాడు. ది గ్రేటెస్ట్ ప్రిన్స్ ఆఫ్ ది ఈస్ట్ అని జే ఎస్ మిల్ అన్నాడు.పి ఎఫ్ ఫెర్నాండెజ్ రాసిన “స్టార్మ్ ఓవర్ ది శ్రీరంగపట్టణం”  అనే గ్రంధంలో ఆధునిక సూత్రాల ప్రాతిపదికన పాలన కొనసాగించిన వాడు టిప్పుసుల్తాన్ అని ప్రస్తుతించాడు. ఇంతటి చరిత్రను గుర్తించ నిరాకరించడం మత ద్వేషం కాక మరేమిటి? చరిత్ర వక్రీకరణలతో మైనారిటీల పైన ప్రత్యేకించి ముస్లింల పైన విద్వేషాన్ని వెళ్లగక్కే ఉన్మాద రాజకీయాలను అడ్డుకోవడం ఒక్క సెక్యులర్ సమాజాన్ని కోరుకునే వాళ్లది మాత్రమే కాదు. ఉన్నతమైన, ఉదాత్తమైన సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరిది.

Leave a Reply