సాయంత్రం లాకప్ అయ్యే ముందు గిన్తీ కోసం అందరినీ వరుసలుగా కూర్చోబెట్టారు. సాయంత్రం డ్యూటీలో ఉన్న ఒక వార్డర్ వచ్చింది.

 “డిటెన్యూ లు పక్కకు నిలబడండి” అన్నది. ఇద్దరు పక్కకు నిలబడ్డారు. ఆమె ఒకసారి తాను తెచ్చుకున్న కాగితాలు చూసుకొని “ఇంకొకరు ఉండాలే” అని తలెత్తి కమల వైపు చూసింది. “నువ్వు కూడా!”

నేను కూడా అప్పుడే ఆమెను చూశాను. అందరినీ లెక్కబెట్టుకొని వార్డర్ బయటికి నడిచింది. ఆమెతో పాటుగా వచ్చిన ఖైదీల ఇంచార్జ్ (శిక్షపడిన వాళ్ళని నియమిస్తారు) తాళాలు వేసి వార్డరు వెనకనే వెళ్ళిపోయింది.

నేను చేతిలోకి వార్తా పత్రిక తీసుకొని చదవడం మొదలుపెట్టాను. కమల నా దగ్గరకు వచ్చింది.

“డిటెన్యూ అంటే ఏంటమ్మ” అని అడిగింది. బహుశా నా చేతిలో పేపరు ఉండడం వల్ల నన్ను అడిగితే తెలుస్తుంది అనుకొని ఉంటుంది. నేను నేరుగా ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా “నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను చూడలేదే నిన్ను” అన్నాను.

“మధ్యాహ్నం వచ్చానమ్మా.”

“అదేంటి?” అన్నాను ఆశ్చర్యంగా. సాధారణంగా అరెస్టయిన వెంటనే కోర్టుకి తీసుకుపోయి ఆ తతంగమంతా అయ్యేవరకూ సాయంత్రం అయిపోతుంది.

“మా వూరు నుండి తీసుకొచ్చారమ్మా మాది ఇక్కడ కాదు” అంది.

“అవునా? ఏం కేసు?”

“దొంగతనం కేసు. మా వూళ్ళో ఉన్నప్పుడే కేసులు పెట్టారు. అన్నిట్లో బెయిలొచ్చింది. రిలీజయినాకా ఇంటికాడ ఉంటే స్టేషన్ లో సంతకాలు పెట్టాలి అని పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు.” కళ్ళనుండి జారిపోతున్న కన్నీళ్ళను చీర చెంగుతో తుడుచుకొంది.

“బాధపడకు కూర్చో” అని పక్కన చోటు చూపించాను.

ఆమె ఆతృతగా మళ్ళీ అదే ప్రశ్న వేసింది.  నేను జవాబు చెప్పేలోపు “నా మీద ఇక్కడ కూడా కేసు పెట్టారామ్మా?” అని అడిగింది. ఆమె “ఖైదీ కార్డు” అడిగి తీసుకొని చూశాను. “ఇక్కడ కేసేమీ లేదు” అని నేను చెప్పగానే ఆమె కళ్ళలో ఒక్క క్షణం రిలీఫ్ కనిపించింది. కానీ అది ఎక్కువ సేపు నిలబడలేదు.

“నీ మీద పి.‌డి (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్టు పెట్టారు. అంటే ఎవరి మీదనయినా ఈ యాక్టు ఎందుకు పెడతారంటే పదే పదే అరెస్టయ్యేవాళ్ళు లేదా ఎక్కువ కేసులు ఉన్నవాళ్ళు బయట ఉంటే మళ్ళీ అవే నేరాలు చేస్తారని నమ్మితే ఒక యేడాది పాటు జైల్లో ఉంచుతారు. ఒకవేళ కేసులున్నా బెయిల్ ఇవ్వరు. అయితే …..”

నా మాట పూర్తి కాకముందే అందుకొని, “యేడాది పాటు ఇక్కడనే ఉంచుతారా?” నిర్ఘాంతపోయి కొంగుతో మొహం కప్పుకొని యేడవటం మొదలుపెట్టింది.  ఆ ఉదృతి తగ్గేవరకూ ఆమెను సముదాయించటం తప్ప ఏం చేయలేకపోయాను.

ఆ తరవాత బలవంతంగా ఆమెను వూరుకోబెట్టి, “పూర్తిగా విను. నిన్ను పిలిచి హై కోర్టులో జడ్జీలు మాట్లాడతారు. అప్పుడు నువ్వు చెప్పింది విన్నాకా కేసు వివరాలు చూసాకా నీ మీద పెట్టిన డిటెన్షన్ కొట్టెయ్యవచ్చు. అలా కొట్టెయ్యకపోతే నీవు లాయరును పెట్టుకోవచ్చు. ఆయన దానిని కొట్టెయ్యాలని వాదిస్తాడు. సాధారణంగా కొట్టేస్తారు.”

అలా వదిలేస్తే ఏడుస్తూ కూర్చుంటుందని మెల్లగా మాటలు మొదలుపెట్టాను.

“అసలేమయ్యింది?”

“ఏం చెప్పాలమ్మా? ఎంత మంచిగా బతుకుతుంటిమి? అంతా నాశనం జేసిన్రు. పువ్వులాంటి పిల్లలు. స్కూలు కి పోతుండేవాళ్లు. ఇప్పుడు ఇక్కడా అక్కడా కూలి పనికి పోవాల్సి వస్తుంది. అంతా ఈ మనిషి చేయబట్టి. పోలీసులతోని మనకి దందాలొద్దు అన్న. నా మాట పట్టిచ్చుకుంటేగా! ఇప్పుడు అనుభవిస్తన్నం.” మళ్ళీ కెరటం లాగా దుఃఖం.

“పోలీసులతోనా? ఏం చేసిండు?”

“అసలు కరెంటు పని చేసేటోడు. కాంట్రాక్టరు దగ్గర. బానే పైసలు వస్తుండే. నేను పని చేస్తానన్న వద్దనేటోడు. పిల్లల్ని మంచిగా చూసుకో సాలు అనేటోడు. మనిషి గూడా ఎట్టుండేవాడు! పీనుగు లెక్క అయ్యిండు. మంచి చేసేటోనికి రోజులు గావయ్యా అన్నా ఇనకుండా ఆ పని చేసిండు.”

ఏపని అని నేను అడగలేదు. అలాగే ఉంటుంది. వరుస క్రమంలో చెప్పడానికి ఇది కథ కాదు కదా. ఓపికగా వినాలి అంతే.

“ఈన ఒక సారి పని నుండి వస్తుంటే వూరి చివర ఒక పాడు పడిన బిల్డింగు కాడ ఎవరో కూర్చుని మాటాడుకోంగా చూసిండు. మళ్ళా కూడా కనపడితే అక్కడ రహస్యంగా ఏదో నడుస్తోందని అని ఈయనకు అనుమానం వచ్చింది. ఒకసారి అర్థరాత్రి పూట అటువైపు నుండి వస్తూ పోయి చూస్తే దొంగ సొత్తు పంచుకొంటూ బందిపోట్లు కనపడ్డరంటా. వూకే ఉండకుండా పోయి పోలీసులకు చెప్పిండు. ఆళ్ళు పోయి మొత్తం చూస్తే ఏం కనపడలేదంట. ఈన పోయి, లేదు కచ్చితంగా ఈడనే దాసిన్రు అని  అందరి ముంగట పోయి చెప్పిండు. ఆళ్ళు మొత్తం బూవి తవ్విన్రు. అక్కడ ఇగ ఎన్ని దొరికినయ్యనుకొన్నవ్! నగలు, డబ్బులు, ఎండియ్యి, బంగారవ్వి, ఓ మస్తు! ఆళ్ళు ఎంత కాలం బట్టి ఆడ దాసిన్రో గాని, వూరు వూరంతా పోయి చూసిన్రు. ఇక వూకొంటరామ్మా, పగబట్టిన్రు. మీది కెల్లి పోలీసులు ఈనను ఇన్ఫారుమరుగా పనిచేయమని అడిగిన్రు. వద్దు మొర్రో అని నెత్తి, నోరు కొట్టుకొన్నా. సెవిన బెట్టలే. ఆళ్ళు పైసలు బాగా ఇస్తన్నరని పనికి కూడా ఎల్లడం మానేసిండు. ఇగ ఇదే దంద. ఆల్లు వచ్చుడు ఈనను తీసుకుపోవుడు. బాగా తాగబోసెటోళ్ళు. దాంతో బాగా అలవాటయ్యింది. సంపాయిచ్చిందంతా తాగుడుకి పెడుతుండే. రాను రాను తాగ బోయించి పనులు జేపిచ్చుకొంటుండే. అటు ఈన వల్ల జైలుకి పోయినోళ్ళు పగబట్టిరి. రాబడి తగ్గిపోయే. పిల్లలు పెద్దగయితున్నరు. నా కొడుక్కి ఇప్పుడు పదేను నడుస్తున్నయ్. బిడ్డకు పదమూడు పడ్డయ్. ఇగ ఇట్ల కాదని నేను బాసండ్ల పనికి పొవ్వుడు మొదలుబెట్టిన. ఈన తాగుడు బంద్ జేయలే. ఎన్నాళ్ళ బట్టి పగ బట్టిన్రో ఒకనాడు ఈనను శివార్ల బట్టుకొని బాగా కొట్టిన్రు.”

“ఎవరు? పోలీసులా?” పక్కనే కూర్చుని వింటున్న మరోకామె అడిగింది. 

కమల కళ్ళు తుడుచుకొంటూ, “బందిపోట్లు!” అంది. “ఆనాడు మంచం పడితే ఇగ లెయ్యలేదమ్మ. ఏ పనీ చేయలేడు. అయినా ఇడవకుండా పరేశాన్ జేస్తురు. నేను ఇగ గట్టిగ జెప్పిన. నువ్వు ఈ పని మానేయి, నేను ఇంకో నాలుగు ఇండ్లల్ల జేస్తగాని అన్నా. ఆయనకు కూడా ఇక సేతగాలే. సార్లు, ఇగ నన్ను వదిలిపెట్టుండ్రి అని జెప్పిండు. అయినా ఇడువలే. మొదలు, మొదలు బతిమాలి, బామాలి చెప్తుండే. ఇనట్లేదని బెదిరించబట్టిన్రు…..”

“అద్సరే! నువ్వెట్లచ్చినవ్ ఈడికి, అది జెప్పు. అని ఇంకొకామే అంది. కమలకి అప్పుడు పూర్తిగా తెలివొచ్చినట్టు అయ్యింది. తాను చెప్తున్నది చాలా మంది కూర్చుని వింటున్నారని అప్పుడే గమనించి ఇబ్బంది పడిపోయింది. పైగా అందరూ పక్కలు వేసుకొంటున్నారు. వార్డు ఇంచార్జ్ ఆమెని పిలిచి ఆమెకు కేటాయించిన చోటు చూపించింది. వార్డు కి చివర వైపు ఉన్న గోడ కి మధ్యలో బాత్రూమ్ కి వెళ్ళేందుకు చిన్నదారి ఉంటుంది. అది వదిలిపెట్టి మిగతా గోడలో పై నుండి కిందకు సామాన్లు పెట్టుకోడానికి అరలు ఉన్నాయి. అక్కడే కొందరి సామాన్లు అటూ ఇటూ జరిపి ఆమెకు కాస్త చోటు చేసి ఇచ్చింది. అలా ఆ రోజు మధ్యలో వదిలిపెట్టిన తరవాత ఇంక చాలా రోజుల వరకూ ఆమె గురించి తెలుసుకోడానికి వీలు కాలేదు.

కమల బాసండ్ల పనికి వెళ్ళేదని తెలుసో ఏమో మొత్తానికి ఆమెను కిచెన్ లో అంట్లు తోమే పనికి తీసుకుపోయేవారు. ఆమెను ఆ పనులన్నీ పూర్తి చేసుకొని ఎప్పుడో గిన్తీ కూడా అయిపోయాకా మరో రెండుగంటలకి తీసుకువచ్చేవారు. అప్పటికి ఆమె ఆ పెద్ద పెద్ద గిన్నెలు తోమి అలిసిపోయి వచ్చి అన్నం తిని పడుకునేది. నిజానికి సాయంత్రం అందరికీ 4.30 కే అన్నం పెడతారు. అప్పుడే అందరూ తినేసి లాకప్ అవ్వడానికి వార్డులకి వెళ్లిపోవాలి. ఇలా పనులు ఉన్నవాళ్ళు మాత్రమే ఆలస్యంగా వచ్చేవాళ్ళు. పైగా కిచెన్ డ్యూటీ ఉన్నవాళ్ళు అందరికీ వండిపెట్టి తమకి కొంచెం మంచిగా విడిగా వండుకొనేవాళ్ళు. అది బహిరంగ రహస్యం. కిచెన్ డ్యూటీ ఉండేది శిక్షపడినవాళ్ళకి మాత్రమే. అయినా వాళ్ళు తమకి సాయంగా ఇలా విచారణలో ఉన్న ఖైదీలను తీసుకుపోతారు. దానికి అధికారుల మద్దతు పూర్తిగా ఉంటుంది. ముఖ్యంగా దొంగతనం కేసుల్లో వచ్చినవాళ్ళని తప్పక పనుల్లోకి తీసుకుపోతారు. కిచెన్ లో సాయపడేవాళ్ళకి స్పెషల్ గా వండుకున్న వాటిలో కొంచెం భాగం దొరికేది. కమల కూడా అలా వాళ్ళిచ్చినవి గిన్నెల్లో తెచ్చుకొని వార్డులో తిని పడుకొనేది. జీతం బత్తెం లేని ఉద్యోగం! నిజానికి డిటెన్యూలకు ప్రత్యేక ఆహారం, సౌకర్యాలు ఇవ్వాలని చట్టం ఉంది. విషాదంగా ఆ విషయం నాకు విడుదలయిన తరవాత మాత్రమే తెలిసింది. లేకపోతే ఆ విషయం డిటెన్యూలకు చెప్పి ఉండేదాన్ని. ఇలాంటి విషయం అధికారులు సహజంగానే చెప్పరు.

ఇక్కడ కేసేమీ లేకుండా ఆమెని ఇక్కడికి ఎందుకు తెచ్చారో అర్థం కాలేదు. హైకోర్టులో పిలిచినపుడు కూడా ఏ జైల్లో ఉన్నా తీసుకురావాలి కాబట్టి అది కూడా కారణం కాదు. ఆమె వూరులో కూడా జిల్లా జైలు ఉంది. అయినా ఇక్కడికి ఎందుకు తెచ్చారో తెలీలేదు. అయితే కోర్టులో హాజరు కావల్సిన తేదీల్లో ఆమెను అప్పుడప్పుడూ వాళ్ళ వూరికి తీసుకుపోయేవాళ్ళు.  అలాంటప్పుడు లాయరు ద్వారా కబురు తెలుసుకొని ఆమె భర్తా, పిల్లలు కోర్టుకి వచ్చి కలిసివెళ్ళేవాళ్ళు.

                                         ****              *****            ****

ఒకరోజు కమల ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చింది. ఇంటికి ఫోన్ చేస్తే బిడ్డ మాట్లాడిందట. ముగ్గురూ కూలి పన్లకు వెళ్ళవలసివస్తోందట. చాతకావడం లేదట. నేను స్కూలుకి పోతానే అమ్మా అని ఏడ్చిందట. పిల్లలని తలుచుకొని, తలుచుకొని కుమిలిపోయింది. కిచెన్ లో పనికి పిలిస్తే నాకు చాతకావడం లేదు రానని చెప్పింది. వాళ్ళు ఏదో గట్టిగా అంటే పిచ్చి కోపం వచ్చింది కమలకు. “ఏం చేస్తారు రాకపోతే? ‘పెద్దమ్మ’కు చెప్తారా? పదండి నేను చెప్పుకొంట. ఉరి ఏస్తరా? ఎయ్యండి.”  అని గయ్యిమంది. దాంతో వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు.

ఇలా ఉందంటే అంతకు మించి కూడా ఏదో ఉందనిపించింది. మెల్లగా అవి ఇవీ మాట్లాడాకా,చెప్పడం మొదలుపెట్టింది.  “మా ఆయన లాయరుతో మాట్లాడిండట అమ్మా. ఇక్కడ హైకోర్టు లాయరు వాదించాలట. 50 వేలు అడిగిండట.” ఆపై దుఃఖంతో మాట్లాడలేకపోయింది. నాకు నోటమాట రాలేదు. ఎక్కడి నుండి తెస్తారు?

“నా కేసుల కోసం ఇల్లు కూడా కుదవ పెట్టాం. చివరికి ఇంక ఇడిపించుకోడం కష్టం అని అమ్మేసినం. దాంతోనే ఇన్నాళ్లూ ఎలాగో గడుస్తోంది. అదీ అయిపోయి పిల్లలని స్కూలు కూడా మానిపించాల్సి వచ్చింది.  ఇప్పుడు కూలి పనులకు కూడా పోతున్నారు.”

“ఏం కేసులు? ఎన్ని కేసులు? ఇల్లు అమ్మాల్సినంత ఏమి ఉన్నాయి?” ఆశ్చర్యంగా అడిగాను.

కాస్త ఏకాంతంగా మాట్లాడే చోటు చూసుకొని వెళ్ళి కూచున్నాం.

“ దొంగతనం కేసులే నమ్మా. 15 కేసులున్నయ్.” మళ్ళీ మొదలుపెట్టి ఆమె భర్త ఇన్ఫార్మర్ గా పనిచేయడం దగ్గర నుండీ చెప్తున్నా నేను వారించలేదు. చివరికి నాకు తెలిసిన విషయాలు అయిపోయి కొత్త విషయాల దగ్గరికి వచ్చింది.

“నేను మరో నాలుగు ఇళ్ళు చూసుకుందం అనుకున్నపుడు వాళ్ళకి వీళ్ళకి చెప్పాను. అప్పుడు ఎం‌ఎల్‌ఏ ఇంట్ల పనిజేస్తావా? అని ఎవరో అడిగారు. ఇంటి పనంతా చేసి అమ్మ గారికి కూరగాయలు అవీ తరిగిపెట్టాలంట. రెండు పూట్ల చేయాలి. ఎవరన్నా శుభ్రంగా ఉండి శుభ్రంగా చేసేవాళ్ళని చూడు, అన్నందుకు నీకు చెప్తన్నం అన్నారమ్మా. పైసలు గూడా బాగానే ఇస్తరు అంటే పోయినా. కొన్నాళ్ళు బానే చేసినా. ఒకరోజు ఆడు పక్కలోకి రమ్మన్నాడు. మస్తు కోపం వచ్చింది కానీ, పెద్దోళ్ళతో ఎందుకు అని, నేను అట్టాంటి దాన్ని కాదు సార్ అని వచ్చేస్తుంటే ఆని పెళ్ళాం పిలిచి పైసలిస్తానంటే సార్ చెప్పిన పని చెయ్యనీకి ఏంది రోగం అన్నది. కడుపు మండి సిగ్గుశరం లేదా అని ఏడ్చుకొంటూ ఇంటికి ఉరికొచ్చిన. ఆయన, నా కొడుకు ఇద్దరూ అడిగితే జరిగింది చెప్పినా. మా ఆయన పోనియ్ తియ్యి. పనికి పోమాక. అని వూరుకొన్నాడు. పిలగాడు ఆవేశంగా ఆనింటికి  పోయి నీ పెళ్ళాన్ని నా పక్కలోకి పంపుతావా మా అమ్మని పంపనీకి? అన్నడంట. ఆ చిన్నపిల్లడు తెలిసీ తెలియక అన్నాడు అంటే కూడా వూరుకోకుండా విపరీతంగా కొట్టిన్రు. బిడ్డకు దెబ్బలకి జ్వరం వచ్చేసింది. నేను పనిమానేసిన రెండురోజులకి నామీద బంగారు గొలుసు, 50వేలు దొంగతనం చేసిన అని కేసుపెట్టి జైలుకి పంపారు. ఆ తరవాత బెయిల్ యేసుకోగానే ఇంకొక కేసు పెట్టారు. అట్లా మొత్తం 15 కేసులుపెట్టారమ్మా. అన్నిట్లో బెయిల్ తీసుకొని బయట పడ్డా. లాయరుకి పెట్టనీకి ఇల్లు కుదువ పెట్టాం. అయినా సరిపోక అమ్మేయ్యాల్సివచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఉన్నదాన్ని పట్టుకొచ్చి ఈడపడేశారు. నేను బయటనుంటే కనీసం పిల్లలని ఎట్లగన్న పోషించుకొంటుంటి.”

వికలమయిన మనసులతో ఇద్దరం వార్డువైపు నడిచాం.

                               ****                        ****

ఆరోజు పేపర్లో ఒక వార్త వచ్చింది. తన పై పెట్టిన పి.డి యాక్టు కొట్టేయ్యాలని సుప్రీం కోర్టు దాకా పోయిన ఒక కేసుని విచారిస్తూ,  తెలంగాణా ప్రభుత్వం విచ్చలవిడిగా పి.డి యాక్టుని ప్రయోగించడం తగదని, వేల సంఖ్యలో ఖైదీల మీద పి‌డి యాక్టుని ప్రయోగించిందని, చేయబోయే నేరానికి శిక్షించడం అంటే అది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అని, విచక్షణాపూరితంగా వ్యవహరించాలని తెలంగాణా ప్రభుత్వానికి చీవాట్లు వేస్తూ ఇచ్చిన తీర్పు గురించి రాశారు.  

నేను కమలని పిలిచి చదివి వినిపించాను. “కాబట్టి తప్పక నీమీద డిటెన్షన్ ఎత్తేస్తారులే”, అని ధైర్యం చెప్పాను.

ఒకరోజు ఆమె ఇంటికి ఫోన్ చేసినపుడు వాళ్ళాయన ఒక విషయం చెప్పాడు. లాయరుతో మాట్లాడి తన దగ్గర మిగిలిన మోటార్ సైకిల్ దగ్గర పెట్టుకొని ఎలాగైనా ఈ కేసు చేయమని బతిమిలాడాడట. ఆయన సరే అన్నాడట.

“ఒకవేళ  కొట్టెయ్యకపోతే?” అంది అనుమానంగా.

“కొట్టేస్తారనే అనిపిస్తోంది. లేకపోతే యేడాది పూర్తయ్యాక విడుదల చేస్తారు.” అన్నాను.

“మళ్ళీ కూడా పెట్టొచ్చమ్మా?” భయంగా అడిగింది.

“లేదు. లేదు. ఈ కేసుల మీద అయితే మళ్ళీ పెట్టలేరు.” అన్నాను. కాస్త ప్రశాంతంగా అయిన ఆమె మొహం చూసి కొట్టేస్తారులే అనుకున్నా. కానీ లాయర్లను పెట్టుకోలేకపోయి ఉంటే…అనే ఆలోచనతో గగుర్పాటు కలిగింది.

కమల కి వచ్చిన కష్టాలు తీరిపోయినా కూడా ఆమె జీవితం ఇక ఎప్పటికీ మునుపటి మాదిరిగా చింత లేకుండా ఉండదు. 15 కేసుల్లో విచారణ అయ్యే వరకూ ఆమె కోర్టుల చుట్టూ తిరగాలి. ఒక సారి దొంగ అని ముద్ర పడిపోయాకా పోలీసులు ఎప్పుడైనా ఎక్కడ దొంగతనం జరిగినా మొదలు పాత కేసులున్న వాళ్ళ దగ్గరికే వస్తారు. కనీసం ఇప్పటికి కష్టాలు తీరినట్టే అనుకున్నాను. డిటెన్షన్ కొట్టేస్తారని ఎందుకో బలంగా నమ్మాను. అయితే ఆమెకు కష్టాలు అయిపోలేదు.

          వారం కూడా గడవకుండానే ఆమె ఇంటికి ఫోన్ చేసి వచ్చి, గుండెలు బాదుకుంటూ పెద్దగా ఏడ్చుకుంటూ ఆవరణ మధ్యలో కూలబడిపోయి దొర్లి దొర్లి ఏడ్చింది. ఆమెను సముదాయించడం ఎవరివల్లా కాలేదు.

ఆమె కొడుకు హోటల్లో పనికి కుదిరాడట. గల్లా పెట్టెలో చేయిపెట్టాడని అరెస్టు చేసి జైలుకి పంపారంట. ఆరాత్రి ఆమె నిద్రపోలేదు. చాలాసేపు మాట్లాడుతూనే ఉంది. “నిజంగా పెట్టాడో లేదో తెలియదు. నిజం అయినా అబద్దం అయినా ఇప్పుడు ముద్ర పడిపోయింది. నిజంగా పెట్టి ఉంటే నాలుగు తన్ని వదిలిపెట్టచ్చు. పనిలో నుండి తీసెయ్యచ్చు. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా జైలుకి పంపినారమ్మా……నేనేం జేతు!”

నాకు ఆ పిల్లవాడు ఎం‌ఎల్‌ఏ ని అన్నదే గుర్తుకువచ్చింది. మరీ ఇంత కక్ష సాధింపా!!!

 నాకు ఇప్పటికీ ఆ రోదన వినపడుతూనే ఉంది.

                                                   *****

Leave a Reply