“కరోనా ఆయా౼ మౌలానా లాయా” అనే వ్యంగ్యపూరితమైన, అపహాస్యమైన, అవమానకరమైన, నేరారోపణతో కూడిన ఈ మాటలు గత సంవత్సరం సామాజిక మాధ్యమాలల్లో ప్రదానంగా ఉత్తర భారతంలో ఎక్కువగా వినిపించినవి. కరోనా చైనా సరిహద్దులు దాటి ప్రపంచాన్ని చుట్టేసే తరుణంలో అంతటా అలుముకున్న భయం భారతదేశం లోను విస్తరించింది. మునుపెన్నడూ చూడని ఒక మహా విపత్తు  అన్ని దేశాలను వణికించింది. యూరప్ లో అతి వేగంగా విస్తరించి, అమెరికాను ముంచెత్తిన కరోనా ఇండియా ను చేరడానికి పెద్దగా ఆలస్యమేమి చేయలేదు. ప్రపంచ వైద్య రంగం ఎన్నడూ ఎరుగని, అంతుపట్టని అదృశ్య జీవి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఆ వైరస్ ను అర్థం చేసుకొని, దాన్ని తుదముట్టించే బృహత్తర క్రతువులో ప్రపంచ శాస్త్ర పరిశోధనా రంగం తలమునకలైంది. చిట్టెడు పుట్టెడు అన్నట్టు ఒక్కో కేసులా మొదలయి వేలు, లక్షలు ఇవ్వాళ కోట్ల కోవిడ్ కేసులకు చేరుకున్నది భారతదేశం. అమెరికా తరువాత స్థానాన్ని ఆక్రమించి ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అయితే ఇది విదేశీ ప్రయాణాల వల్ల మన దేశానికి వచ్చిందని, మనల్ని మనం కాపాడుకోవాలని లాక్ డౌన్ లు , తప్పట్లు తాళాలు బాగానే మోగించాం. 21 రోజుల్లోనే కరోనా తోక ముగుస్తుందని, అందరూ మూతిని, ముక్కును కప్పేస్తూ ఇంట్లో ఉండి లాక్ డౌన్ ను అమలు చేస్తే కరోనా పై విజేతలు అవుతామని ప్రధాని మోదీ పదే పదే ఏం చెప్పినా, ఏది చేయమన్నా చేశారు ప్రజలు. దేశమంతా ఎవరికి కరోనా లక్షణాలు కనిపించినా మూల మూల గాలించి మరీ ఆసుపత్రుల్లో పడేసారు.

కరోనా కట్టడి పేరుతో దేశంలో ఏం చేసినా చెల్లుబాటయ్యింది. లాక్ డౌన్ ను  4 గంటల వ్యవధిలో ప్రకటించడంతో కోట్లాది మంది జనాలు చెప్పరాని ఇక్కట్లకు గురయ్యారు. వలస కూలీల బతుకు వర్ణనాతీతం. ఎంత వేదనను అనుభవించాలో అంతా అనుభవించారు. అంటువ్యాధులు నివారణా చట్టం, ప్రకృతి విపత్తుల నిర్వహణా చట్టాన్ని దేశమంతటా ప్రయోగించారు. ఆకస్మికంగా మీదపడ్డ లాక్ డౌన్ తో దేశం నలుమూలల్లో కోట్లాది మంది ఇరుక్కు పోయారు. ముందస్తుగా సిద్ధమైన అనేక కార్యక్రమాలు హఠాత్తుగా రద్దయి పోవడమో, మధ్యలోనే బందయి పోవడమో జరిగినవి. అట్లా చివరి అంకంలో ఉన్నది ఏటా ఢిల్లీ లోని మర్కజీ లో నిర్వహించే తబ్లగీ జమాత్ ఆధ్యాత్మిక సమ్మేళనం. ప్రతీ సంవత్సరం నిర్ణీత తేదీలల్లో అన్ని అనుమతులతో దేశ విదేశి ప్రతినిధులతో హంగూ ఆర్భాటం లేకుండా జరిపోయే ఇస్లాం మత సమావేశం. అట్లా 2020 మార్చ్ లో సమ్మేళన చివరి దశలో కరోనా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆ సమావేశ మందిరంలోనే అనేక మంది ఉండి పోవాల్సి వచ్చింది. ఇంతలో కరోనా ఉధృతి, దేశ వ్యాప్త ఆందోళన. అలా ఉండి పోయిన  కొద్ది మందిలో కరోనా లక్షణాలు బయట పడటం, అప్పటికే ఆ ప్రాంతం ఖాళీ చేసి దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయిన వాళ్లలో కూడా కరోనా సోకిన వాళ్ళున్నారు.  ఆ సమయానికి ఈ సమ్మేళనంతో సంబంధం ఉన్న వారిలో, వారి వల్ల ఎక్కువ మందికి కరోనా విస్తరించిన మాట నిజమే! అక్కడ మొదలయ్యింది వారి పైనా మొత్తంగా ముస్లిం సమాజం పైన హిందూత్వ శక్తుల ప్రచార దాడి. ఆ సందర్భంలో వచ్చిందే “కరోనా ఆయా-మౌలానా లాయా” అనే ఆకర్షణీయ, ఆక్షేపనీయ మాట. అక్కడ మొదలైన ఆ దాడి, ప్రచారం ఎక్కడి వరకు వెళ్లిందంటే అసలు ఈ దేశంలో ముస్లిలు “కరోనా జిహాద్” చేస్తున్నరనే దాకా.  ఆ సమయంలో ఏ ముస్లిం వ్యక్తిని చూసినా మిగతా మనుషులు భయపడి పోయేంతగా! కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళ వ్యాపార సముదాయాల సందర్శన కూడా చేయకూడదనేంత. అంతటా ఒక అప్రకటిత అంటరానితనం అమలయింది ఆనాడు. అంతో ఇంతో సూత్రబద్ధంగా వ్యవహరించే, లౌకిక విలువలను పాటించే వాళ్ళు కూడా అవునయా ‘గింత బాధ్యతా రాహిత్యమా’ అనే వ్యాఖ్యానాలు చేశారు. ఈ లోగా అనేక చట్టాల కింద తబ్లీగీ జమాత్ నిర్వాహకుల పైనా, దానికి హాజరైన స్వదేశీ,విదేశీయుల పైన కేసులు మోపారు.

భవిష్యత్ లో వాళ్ళను ఈ సమ్మేళనానికి రానివ్వకుండా వీసాలు రద్దు చేశారు. అనేక మందిని అరెస్టు చేశారు. దేశ ‘భక్తుల’ హడావుడి అంతాఇంతా కాదు అమ్మ దొరికార్ర దొంగలు అనుకున్నారేమో ప్రచార, ప్రసార మాధ్యమాలల్లో  ప్రదానంగా మో-షా మీడియాలో వీళ్ళు చేసిన దేశ ‘ద్రోహాన్ని’ బట్టబయలు చేసారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అయితే దేశ పరువును మంట గలిపిన జమాత్ ను ఎన్నడూ క్షమించగూడదు అని ప్రకటించాడు. హిమాచల్ ప్రదేశ్ బిజెపి నాయకుడు అయితే తబ్లీగీ జమాత్ కు హాజరయిన వాళ్ళందరిని మానవ బాంబులుగా అభివర్ణించాడు. జమాత్ జనులందరు కరోనా జిహాద్ చేస్తున్నారనే మాటలను ట్వీట్లుగా 3 లక్షల సార్లు పెడితే 16.5 కోట్ల మంది వీక్షించారు. 2020 మార్చ్ 20 నుండి ఏప్రిల్20 వరకు 271 మీడియా సంస్థలు 11074 సార్లు ఇదే తరహా స్టోరీలను ప్రసారం చేసినవి.వీటన్నికి పరాకాష్ట అన్నట్టు,ఈ ప్రచారానికి లెజిటిమసిని కల్పించేలా కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ జమాత్ వల్ల దేశంలో 7.4 రోజుల్లో నమోదవ్వాల్సిన కరోనా కేసులు 4.1 రోజుల్లోనే నమోదయ్యాయని అధికారికంగా ప్రకటించడం యాదృచ్చికం కాదు. ఈ దేశంలో ముస్లింలకు వేరే ఏ పనీ లేదు ఎప్పుడు ఎదో ఒక జిహాద్ లో ఉంటారని, లవ్ జిహాద్ అప్పటికే మొదలు పెట్టారని దేశ వ్యాప్తంగా ప్రచారాలు,కఠిన చట్టాలు. ఈ ప్రచారం, వారు రాజ్యాంగబద్ద హక్కును వినియోగించుకునే ప్రతి క్రమాన్ని నేరమయ చర్యగా చూపెట్టే దుర్మార్గం ఎప్పటి నుండో కొనసాగుతున్నదే ఇదొక కొత్త సందర్భం మాత్రమే. ఈ కరోనా జిహాద్ ప్రణాళిక ఏదో ముందస్తుగా వేసుకున్నట్టు, దేశంలో ఒక భయానక పరిస్థితులను సృష్టించే పనిలోనే ఉంటారని, ఈ దేశం మీద మమకారం, దేశ భక్తి లేని సమూహమని చెప్పే ప్రయత్నం ప్రతి సందర్భంలో చేస్తూనే ఉంది పరివార్. 2020 చివరి నాటికి తబ్లీగీ జమాత్ తో సంబంధం ఉన్నదన్న కేసులన్నింటిని కోర్టులు కొట్టివేయడం, అవన్నీ దురుద్దేశ్య పూరితంగా మోపబడ్డ కేసులని తీర్పులివ్వడంతో పరివార్ చెంప చెల్లుమన్నట్టయింది.

సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి అదే మార్చ్, ఏప్రిల్ నెలలు కరోనా రెండవ కెరటం ఎగిసి పడుతున్న వేళ మతం మారింది, దృశ్యం మారింది, స్థలమూ మారింది. సంఖ్య అయితే సంబంధమే లేదనేంతగా మారిపోయింది. దేశమంతా మూతులు, ముక్కులు మూసుకొని ఇళ్లకే పరిమితం అయ్యి దేశాన్ని కరోనా కాటు నుండి కాపాడు కోవాల్సిన తరుణం. మనుషుల సాధారణ కలయికే అవాంఛనీయమైన వేళ. నలుగురు నిలబడి నాలుగు మాటలు నాలుగు నిముషాలు మాట్లాడటమే నేరమైన సన్నివేశంలో లక్షలాదిగా, కుప్పలు తెప్పలుగా ఒకే చోట, దేహాలన్ని రాసుకుంటూ ఒకేసారి లక్షల మంత్ర పఠనాల హోరులో అర్దనగ్నoగా ‘పవిత్ర’ స్నానం ఆచరించగలమా? అవును ఆచరించగలం అధికారం మనదైతే, పెద్ద గుంపు  మనమే అయితే, చట్టాన్ని చుట్ట చుట్టేస్తే ప్రశ్నించే గొంతుల్ని నొక్కివేసి కాదు కాదు తొక్కివేసి దర్జాగా చేయగలం! మెజార్టీ మాది, అధిక సంఖ్యాకులం మేము, మేము ఏది చేసినా చెల్లుతుంది. మనోభావాలు, భక్తిభావనలు ఇవేవీ చట్టం, రాజ్యాంగం చట్రంలో లేనివి! విశ్వాసం ముందు శాస్త్రీయత, సైన్స్,కరోనా గిరోనా జాన్తా నహీ అంతా మా ఇష్టం అడిగేదెవడు?


బాధ్యతాయుతమైన ప్రభుత్వం బరితెగించి హరిద్వార్ కుంభమేళాకు పూర్ణకుంభంతో అనుమతినిచ్చింది. ఇంకేముంది రెండు నెలల్లోనే అర కోటి మందికి పైగా అర్ధ నగ్నంగా సామూహిక స్నానాలు. గంగా జలం పవిత్రమైనది,మహిమాన్వితమైనది గంగా మాత ఆశీర్వాదంతో అన్ని రోగాలు మటుమాయమవుతాయని స్వయంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ రావత్ గొప్పగా ప్రకటించాడు. ఇంకా ఆయన మాటల్లోనే ఈ కుంభమేళా కు వచ్చే వాళ్లంతా ఈ దేశ బిడ్డలని తబ్లీగీ కీ వచ్చింది పరాయి వాళ్ళని ‘వారు’ ‘మేము’ అనే అంశమన్నట్టు బహిరంగంగా చెప్పాడు. వి హెచ్ పి నాయకుడు తబ్లీగీ జమాత్, కుంభమేళా ను పోల్చడమంటే దుర్గంధ జలాన్ని గంగాతో పోల్చడమే అని సెలవిచ్చాడు. అసలు గంగానే దుర్గంధం కాకపోతే వందల కోట్లు ఖర్చు పెట్టి శుధ్ది పథకాన్ని ఎందుకు అమలు చేస్తున్నారో? ఇసుక వేస్తే రాలనంత జనమే జనం అని పరివార్ పాలకులు తెగ మురిసి పోతున్న వేళ ఉత్తర భారతం ఊర్లు ఉర్లన్ని కరోనా గుప్పిట్లోకి వెళ్లినయి. హరిద్వార్ కుంభమేళా సందర్శించి గంగా పవిత్ర జలాన్ని పట్టుకొస్తారంటే కరోనాను మోసుకెళ్లి ఊరు వాడ ఉదృతంగా వ్యాప్తి చేశారు. ఫలితం కోవిడ్ రోగులతో ఆసుపత్రుల కిట కిట, ప్రాణవాయువు లేక ప్రాణాలు విడుస్తూ ఆకుల్లా రాలిపోయిన జనం. యోగి ఆదిత్యానాధ్ రోగానికి చికిత్స చేయలేను,అందరికీ ఆక్సీజన్ ను ఇవ్వలేను చచ్చిపోతే మాత్రం ఉచితంగా దహన సంస్కారాలు మాత్రం ఘనంగా చేస్తామని ఘనంగా ప్రకటించాడు. ఇంత మంచి అవకాశం ఇస్తుంటే ప్రభుత్వం ఏమి చేయట్లేదంటారా అనుకున్నాడో ఏమో, ఆక్సీజన్ అందట్లేదని ఆదుకోండి మహాప్రభో అని సామాజిక మాధ్యమాలల్లో వేడుకున్నందుకు ఓ కుటుంబం పై NIA తోనే కేసు పెట్టించాడు. ప్రాణాలు కాపాడoడని ఆర్తనాదం చేయడమే పెద్ద నేరమైంది.

ఇది ఇలా ఉంటే దేశ పెద్ద నాయక గణం ఓట్ల,సీట్ల అధికార వేటలో, భారీ ర్యాలీలకు, మీటింగ్ లకు వచ్చిన జనాన్ని చూసి మైమరచిపోయారు. స్వయంగా సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ యే అన్నాడు కదా ప్రజల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యo ఉన్నదని. ప్రభుత్వ నిర్వాకం వల్లనే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసింది. అన్ని అనుమతులు ఉండి, ముందుగానే నిర్ణితమైన తబ్లీగీ జమాత్ ను కరోనా జిహాద్ గా వర్ణించిన వాళ్ళు మరి గంగా నది శవాలతో నిండిపోవడానికి కారణమైన కుంభమేళాను ఎలా వర్ణిస్తారు? దేశంలో రెండవ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టి కుంభమేళాకు అనుమతి ఎలా ఇచ్చారు? ఎవరి నేరపూరిత నిర్లక్ష్యం,ఇన్ని చావులకు, ఇంత దుఃఖానికి కారణమైంది? వీళ్లపై ఏ ఏ చట్టాల కింద కేసులు నమోదు చేయాలి? రోగ ప్రమాదం కంటే విశ్వాసం గొప్పదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ముద్దుగా చెబుతున్నాడు. ఆ భావన అధిక సంఖ్యాక వర్గ విశ్వాసానికే పరిమితమా మరో విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళకి వర్తించదా? దేశ భద్రత, దేశ సమైక్యత గురించి తెగ మాట్లాడే వాళ్ళు, తమకే ఆ విషయం మీద పేటెంట్ ఉన్నదన్నట్టు వ్యవహరించే వాళ్ళకి దేశ ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడేసే పని చేసినప్పుడు గుర్తుకు రాలేదేమో! ఎక్కడో ఒక చిన్న ఆడిటోరియంలో  అన్ని అనుమతులతో 3 వేల లోపు మంది హాజరైన ఒక సమూహపు చర్య నేరపూరితంగా కనిపించి అనుకున్న కేసల్లా పెట్టగలిగిన వారు అర కోటి మందిని అధికారికంగా స్వాగతించి అన్ని నియమాలను ‘గంగ’ లో తొక్కి దాని ఫలితంగా లక్షలాది కేసులు నమోదు కావడానికి కారణమైన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నపుడు చట్టబద్ధ పాలన ఏమయినట్టు? తబ్లీగీ జమాత్ కి హాజరైన వారిని అందరిని ఏదో పెద్ద నేరం చేసిన వారి కోసం గాలించి నట్టు గాలించి మరీ పట్టుకున్నారు. మరి అదే న్యాయం ఇక్కడ ఎందుకు వర్తించదు? అది నాలుగు గదుల మధ్య జరిగింది కుంభమేళా ఆరుబయట జరిగింది కాబట్టి ప్రమాదం లేదని సమర్దించుకోవడం వెనుకాల ఆధిపత్య భావన తప్ప మరొకటి లేదు.

ఒక సమూహపు సమ్మేళనాన్ని నేరపూరితం చేయడం ప్రజల ఆరోగ్యాన్ని అత్యంత ప్రమాదంలోకి నెట్టిన మరో మత కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకోవడం ఏమిటి? చట్టం ముందు అందరూ సమానులే అనే ఒక అత్యున్నత న్యాయ శాస్త్ర విలువను సంఖ్యా బలంతో తొక్కివేయడం ఫాసిస్టు చర్య తప్ప మరొకటి కాదు. మోహన్ భగవత్ గారే సెలవిచ్చినట్టు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహించాలి? వ్యాక్సిన్ విషయంలో  గందరగోళం చెలరేగగడం మోడీ అర్థం పర్థం లేని విధానాన్నే సూచిస్తుంది తప్ప మరొకటి కాదు. అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని అన్నీ తానే అంతా తానే చేయాలనుకునే మోడీ ఇంతటి భారీ ప్రాణ నష్టానికి, అసంఖ్యాక గుండె కోతలకు బాధ్యత వహించాల్సిందే. తమ వైఫల్యాన్ని, జవాబుదారీతనం లేని ఒంటెద్దు పోకడలను మార్చుకొని ఎప్పుడు ఎవర్ని బాద్యుల్ని చెయ్యాలా, నేరస్తులుగా నమ్మించాలా అనే పన్నాగాలు, సొంత ప్రచార ఆర్భాటాలు ఇకనైనా ఆపి ప్రజారోగ్యం పై దృష్టి పెడితే మరో వేవ్ రాకుండా, మరింత మృత్యుఘోష వినిపించకుండా ఉంటదేమో!

Leave a Reply