ప్రజా యుద్ధంలో ఉన్న ఆ కొడుక్కు తల్లి మరణవార్త ఎప్పటికో తెలిసింది. ఆ విషాదాన్ని, దాని చుట్టూ ఉన్న సొంత అనుభూతులను, విప్లవోద్యమ అనుభవాలను కలిసి ఆ కొడుకు ఈ వ్యాసం రాసి వసంత మేఘానికి పంపాడు. కానీ ఇది మాకు చేరి ప్రచురించేనాటికి ఆయన కూడా అమరుడయ్యాడు. ఆ తల్లి భీమరాజు. ఆ కొడుకు చీమల నర్సయ్య అలియాస్ జోగన్న. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బయ్యారం. ఆపరేషన్ కగార్‌లో ఏప్రిల్ 30, 2024 న అబూజ్‌మాడ్ (టేకెమెట) ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు.
నిరుపేద దళితురాలైన ఆ తల్లి కన్నగచాట్లుపడి పెంచి పెద్ద చేసుకున్న కొడుకు విప్లవంలోకి వెళ్లాక ఆమె తీరని దు:ఖానికి లోతైనా, దయనీయ జీవితాన్ని ఎదుర్కొన్నా ఆయన ఎంచుకున్న మార్గాన్ని గౌరవించింది. విప్లవాన్ని ప్రేమించడమంటే కొడుకు కోసం దారుణ నిర్బంధాన్ని అనుభవించడమే అని అర్థం చేసుకున్న సగటు అమ్మ భీమరాజు. నూనుగు మీసాల వయసులో ఉద్యమంలోకి వెళ్ళిన 42 ఏళ్ల తరువాత మళ్లీ అమరుడై తిరిగి ఊరు చేరుకున్నాడు. బయ్యారంలో అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆయన అంత్యక్రియల్లో ఆ తల్లీ కొడుకులను గ్రామస్తులు, విప్లవాభిమానులు కన్నీటితో గుర్తు చేసుకున్నారు.
విప్లవోద్యమంలో ఉన్న ఆయనకు ఇప్పుడో 29 సంవత్సరాల తరువాత తల్లి గురించి తెలిసింది ఆమె క్షేమం గురుంచి కాదు.. ఆమె మరణం గురించి. అది కూడా ఆమె మరణించిన మూడేళ్లకు. ప్రజాయుద్ధంలో ఎందరో తల్లుల ప్రేమానురాగాలను అనుభవిస్తూ కన్న తల్లి గురించి ఆలోచించే సమయం రాలేదనీ, కానీ తల్లి మరణ వార్త కలచివేసిందని రాస్తూ ఆ తల్లి కొడుకుగా చివరింటా విప్లవంలో కొనసాగుతా అని ప్రతిజ్ఞ చేస్తూ ఈ వ్యాసం రాశాడు. ఆయన అన్నట్లే పాలకవర్గం విప్లవోద్యమం మీద చేపట్టిన అంతిమ యుద్ధాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలను సమాయత్తం చేస్తూ, ప్రతిఘటనా వ్యూహానికి నాయకత్వం వహిస్తూ అమరుడయ్యాడు. ఆ తల్లీ బిడ్డల స్మృతిలో ఈ వ్యాసాన్ని ప్రచురిస్తున్నాం.
ఈ వ్యాసాన్ని పంపిస్తూ అమరుడు జోగన్న వసంతమేఘానికి ఇలా రాశాడు
*పత్రికా మిత్రులకు వందనాలు…
ప్రపంచ అమ్మల దినం సందర్భంగా మా అమ్మ గురించి ఈ వ్యాసం రాశాను. మీకు పంపాలని ఎంతో ఆరాటపడ్డాను. కానీ, డ్రోన్ దాడుల మధ్య వంపలేకపోయాను. ఆన్‌లైన్ వార్తలు ఎప్పటికప్పుసడు ప్రపంచాన్ని కమ్మేస్తున్న ఈ రోజులలో ఇది
అవుట్ డేటెడ్ వార్తవుతుందనీ తెలుసు. అయినా, మీ వద్ద భద్రంగా వుంటుందని, ఈ జ్ఞాపకాలు మీకు అందిస్తున్నా. సహృదయంతో స్వీకరించగలరు*
– వసంత మేఘం టీం
మా అమ్మ చీమల భీమరాజు. మా ప్రాంత దళితులలో ఈ పేరు చాలా సాధారణం. అమ్మ కన్ను మూసేనాటికి ఆమె వయసు 80-85 సంవత్సరాలు వుండవచ్చు! నేను పుట్టిన తేదే నాకు తెలవదంటే, అమ్మది తెలిసే అవకాశం ఎక్కడిది? అందులో దళితులలో! నాకు గుర్తున్నమేరకు 1963 జూన్ నాటికి మా అమ్మకు కలిగిన ముగ్గురు సంతానంలో నేనే చివరి వాడిని . నేను పుట్టిన తరువాత ఐదేళ్ల లోపే మా నాయిన చీమల లింగయ్య అనారోగ్యంతో చనిపోయాడు. దానితో ఇంట్లో మిగిలింది నేను, నా ఇద్దరక్కలు, రాజమ్మ, లక్ష్మి , అమ్మ. ఇంటి పెద్దలేకుండపోయిన ఇంట్లో అన్ని విధాల మా అమ్మే మము పోషించింది.
మా అమ్మ జీవితం కూడ నిరుపేదల జీవితాలలాంటిదే. అమె తన తల్లి, తండ్రికి ఒకే ఒకబిడ్డ. అమ్మకు తోడు బుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను నా చిన్న తనంలో మా నాయిననే కోల్పోయాను. కానీ మా అమ్మ తన చిన్న తనంలోనే తల్లీ తండ్రి ఇద్దరినీ కోల్పోయింది. తల్లి చనిపోయినామేనమామలు వుండాలన్నట్టు, అమ్మకు తన నస్పూర్ మేనమామలే పెళ్లి చేశారు.
మా పెద్ద అక్కకు చిన్నతనంలోనే పెళైంది. కానీ, దురదృష్టవశాత్తు అమెకు కొద్దిసంవత్సరాలలోనే 1967-68లో భర్త చనిపోవడంతో అమ్మ ఎంతో బాధపడింది. కానీచేసేదేముంది? ఇంటి దగ్గర అమ్మ మా చిన్న అక్కను, నన్ను పట్టుకొని ఉంటూ నాన్న వదిలివెళ్లినఇల్లు భూమినీ వదలకుండా కష్టపడుతూ రోజులు గడపసాగింది. కానీ, పల్లెల్లో అస్తుల కోసం వుండే పాలిపగలు నిర్దాక్షిణ్యమైనవి. అస్తుల కోసం కుత్తుకలు క త్తరించుకోవడం వర్గ సమాజ లక్షణమే. మా కుటుంబంలో కూడ నాన్న మరణం తరువాత పాలి పగలు ముందుకు వచ్చాయి. మన దేశపు నికృష్ణ కుల వ్యవస్థలో దళితులకు ఒకవైపు భూమి సమస్య, మరోవైపు అత్మ గౌరవ సమస్య. పోట్లాటకు దిగింది మాపాలివాళ్లే కాబట్టి వాళ్లకు భూమి కావాలి. ఏ లాగైనా మా అమ్మను ఊళ్లో నుండి వెల్లగొట్టిమాకున్న అతి కొద్ది భూమిని స్వాధీనం చేసుకోవాలనే కుట్రలతో మా కుటుంబంపై కత్తికట్టారు. నా కళ్ల ముందే అమ్మను ఒకటి, రెండు సార్లు కొట్టారు. అప్పటికి నావయసు 10 సంవత్సరాలలేత ప్రాయమే. అమ్మ వాళ్లను బాధతో దూషిస్తుంటే నేను కంటనీరు పెట్టడం తప్ప ఏంచేయను!
అమ్మ నను తీసుకొని యధావిధిగా ఊరి పెద్దల వద్దకి పోయి తనకు జరిగిన అన్యాయంచెప్పుకునేది. కానీ, అప్పటికి ఊళ్లల్లోకి, దళితుల గూడాల్లోకి అన్నల సంఘాలు రాలేదు.పెద్దమనుషులు ఎన్నిసార్లు పంచాయతీ చేసినా సమస్యను శాశ్వతంగా పరిష్కరించేవాళ్లు కాదు. రెండు వైపులా డబ్బులు తిని ఏదో హితవు పలికి వారి పబ్బం గడుపుకునేవారు.
మా అమ్మ మాత్రం పట్టు వదలకుండా నా కోసం అ భూమి దక్కాలనే పట్టుదలతోపాలివాళ్ల ఆగడాలు సాగనివ్వకూడదనీ మా ఏరియాలో పేరున్న ఎగలాసపురం దొరలనుతీసుకువచ్చి పెద్ద పంచాయతీ చేయించింది. దానితో గొడవలు కొంత సద్దుమణిగాయి, కానీ లోలోపలి కుట్రలు రూపుమాసి పోలేదు. రెందేళ్ల తరువాత మా ఊళ్లో పోచమ్మ కొల్పు నడుస్తున్నవేళ రాత్రి ఊరంతా ముఖ్యంగా దళితులంగా ఉత్సాహంగా అందులో పాల్గొనడానికి పోయారు. అమ్మ కూడా పోయింది. నేనూ, నాతో నాదోస్తు ఒకతను ఇద్దరం మా ఇంట్లోనే పడుకున్నాం.ఒక నిద్ర తీసి మధ్య రాత్రి కొలుపు వినపోదామని ఫ్లాన్ చేసుకున్నాం. కానీ, నడి రాత్రి వేళఊరు ఊరంతా కొలుపు దగ్గర వుండగా మా ఇంటికి వెనుక వైపు నుండి నిప్పంటించారు. ఆ మంటల వెలుతురుకు, చప్పుడుకూ నాకు వెంటనే తెలివైంది. ఇద్దరం బయిటికి ఉరికొచ్చిబతికిపోయినం. రెండేళ్లుగా తగువులు సర్దుకున్నాయనుకున్న దాని ఫలితం మరింత దారుణంగా అనుభవించాల్సి వచ్చింది. మగ దిక్కు లేని అమ్మకు నేనొక్కడినే దిక్కయి గూడు లేని బతుకైంది మాది. నా సొదరికి పెళ్లి చేయడంతో ఆమె అప్పటికే అత్తారింటికి వెళ్లింది. ఇంట్లో వున్నకొద్దిపాటి డబ్బులు, ధాన్యం తగులపడిపోయాయి. ఊరి పెద్దలకు కుట్రకు కారకులు ఎవరోస్పష్టమే. కానీ వారు నేరస్థులను పట్టుకోవడం వదిలి మాకు చందాలు జమచేసి బతుకుతెరువుకంటూ అమ్మ చేతిలో పెట్టారు. కానీ, తీరని వెతకు, ఆగని కన్నీటికి అ రూకలు బదులుతీర్చలేవు కదా!
మా అమ్మ తన భర్తను కోల్పోయిన తర్వాత నాకు తండ్రిగా, తల్లిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తూ అష్టకష్టాలు పడుతూ ఎన్ని ఇబ్బందులనైనా ఎదిరిస్తూ తన కూతుళ్ల వివాహాలు జరిపించి ఓ పెంకుటిల్లు కట్టింది. ఇందులో మా పెద్ద సోదరి, తన భర్త పాత్ర విడదీయలేనిది. అమ్మకు మిగిలిన కోరికలలో నా కోసం ఇల్లు కట్టడం పూర్తయింది, మిగిలిందల్లా నన్ను ఒకఇంటి వాడ్ని చేయాలన్నదే బలంగా వ్యక్తమయేది. కానీ, నా క్రమం మారో రూపం తీసుకుంది.
నేను ఎదుగుతుండడంతో అమ్మ కష్టాలలో నేను పాలుపంచుకోవడంతో మాకు కొంతపంట రావడంతో పాటు కూలీ నాలీ చేసి నాలుగు డబ్బులు కూడగట్టుకున్నాం. అమ్మ ఇల్లు కట్టనీకి చేసిన అప్పులు తీరినవి. ఇల్లు కాలిపోయిన తరువాత ఇక పాలివాల్ల గొడవలు కూడలేకుండా పోయాయి. అందుకు నేను పెరగడం కూడ ఒక కారణం అయివుంటుంది. అంతకన్నాముఖ్య కారణం మా ప్రాంతంలో సంఘాలు నెలకొనడం మొదలైంది.
1977 నుండి 1981 వరకు మా అమ్మకు పెద్దగా ఏ రంధి లేని కాలంగా చెప్పుకోవచ్చు.1981 ఫిబ్రవరిలో నాకు ఓటు హక్కు వచ్చింది. సర్పంచ్ ఎన్నికలలో మొదటిసారి ఓటువేశాను. తర్వాత అక్టోబర్, నవంబర్‌లో పక్క గ్రామాల సంఘం వాల్లు మా ఊరికి కేంపెయినుకు వస్తే వారి పోగ్రాముకు పోయినం. అందులో వాల్లు చెప్పిన మాటలు, పాడిన పాటలకు నేనుచాలా అకర్షితు డ్ని అయ్యాను. నాతో మరో ఇద్దరు చాలా స్పందించారు. దానితో, గ్రామంలోసంఘ నిర్మాణం జరిగి, నన్ను సంఘ నాయకత్వ కమిటీలోకి తీసుకున్నరు. తర్వాత నాకు మాప్రాంత ఆర్గనైజర్ కలవడం, రాజకీయాలు చెప్పి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని ప్రోత్సహించడంతో నాలో ఉత్సాహం పొంగి పోతూ అన్ని కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవా డ్ని . దీనితో నిర్బంధం పెరిగి పోలీసులకు నేను టార్గెట్ కావడంతో నవంబర్1981 నుండి 1982 జనవరి మధ్య నేను ఊరిలో ఉండలేని ఇంట్లో పడుకోలేని పరిస్థితి ముందుకు వచ్చింది. దీంతో అమ్మకు గతం కన్నా అనేక రెట్ల బాధ పెరిగింది. నా కోసం పరితపించే అమ్మకు నేను దూరమవుతున్నాననీ, నాకేమవుతుందోననే బెంగ పట్టుకుంది.
1982 జూన్ నాడు పక్కూరి సంఘం వారిని కలవడానికి పోయి వాపసు వస్తున్న క్రమంలోనే భూస్వాముల గుండాల దాడిలో చిక్కుకొని తప్పుకొని బతికి బయట పడ్డా. కానీ నేను ఆ దాడిలో బతికాననే విషయం అమ్మకు వారం రోజుల వరకు అందనే లేదు. ఈ లోపునా కోసం తన్లాడే మా అమ్మను ఓదార్చడం పక్కన పెట్టి ఇరుగు పొరుగు వాళ్లు దొరలతో గొడవలెందుకు నీ కొడుక్కు అని అంటుంటే, వ్యతిరేకులు ఎత్తిపోడుపుల మాటలతో హింసించారు. పోలీసుల బెదిరింపులు తప్పేవి కావు. ఇన్ని రకాల ఇబ్బందులను ఎదిరించిన మా అమ్మ అనుభవం అక్షరాలలోకి నేను మలచలేను. అప్పటికే పోలీసుల దాడులతో సంఘాలు సరెండరవుతున్న రోజులు. అమ్మకు అండగా నిలవడానికి కూడ ఎవరూ సాహసించని పరిస్థితులు ముందుకు వచ్చాయి.
మరో పక్క తన కొడుకు రాత్రో, పగలో వచ్చి కనపడి పోవడం కూడా లేకుండా పోయింది.అప్పటికే నేను అడవితల్లి ఒడిలో చేరిపోయిన వాస్తవం అమ్మకు తెలువదు. ఒక సాధారణ దళిత, పేద మహిళ చీమల భీమరాజు ఊళ్లో శతృవులకు అదురక బెదురకా తన నివాసాన్నిపోలీసులు కూల్చి వేసినా లొంగలేదు. నా కోసం నా తల్లి వర్గ పోరాటం వైపు దృఢంగా నిలిచింది. 1982 జూన్-డిసెంబర్ మధ్య నా కోసం కరీంనగర్ జైలు ములాకతుకు వచ్చినపుడుతన కొడుకుతో ఏమి చెప్పాలనుకున్నదో కానీ, అ అవకాశం లేని కటకటాల గేటు బయట 15నిమిషాలు కంటనీరు పెడుతూ మళ్లీ మళ్లీ నా వైపు చూస్తు నన్ను వదలిన మా అమ్మ నాగుండెల్లో చిరస్థాయిగా నిలవడమే కాదు, పట్టుదలగా శతృవర్గాలతో పోరాడే కర్తవ్యోన్ముఖుడిని చేసింది.
1988 జనవరిలో నేను జైలు నుండి బయటికొచ్చి మార్చిలో అడవి బాట పట్టాను. జనజీవన స్రవంతిలో కలువాలనీ పోలీసుల ప్రచారం జోరుగా మొదలైంది. పోలీసులు అమ్మవద్దకు చేరి కౌన్సిలింగు ప్రారంభించారు. వున్న ఒక్క కొడుకును లొంగదీస్తవా చంపుకుంటావా తేల్చుకొమ్మని పోలీసుల హెచ్చరికలతో కూడిన కౌన్సిలింగు!
మరోపక్క నాకు జమానతు పడ్డ మా బావను అరెస్టు చేసి తీసుకపోయి చెప్పనలవి కానిచిత్రహింసలకు గురి చేస్తే అమ్మ చావడమా, బతకడమా అనే దిక్కు తోచని పరిస్థితిని ఎదురుకున్నది. ఇన్ని ఇబ్బందులు పాలైన మా అమ్మకు కలుసుకునే అవకాశం వచ్చింది. అది1990 సెప్టెంబర్. మా చిన్న అక్కనూ, తన కొడుకును తీసుకొని వచ్చి పక్కూరిలో కలసింది. అప్పుడు కొంత లీగల్ పరిస్థితులు ఏర్పడినా మా ఊరికి మాత్రం నేను పోలేని పరిస్థితే వున్నది.
దాదాపు ఒక దశాబ్దం తరువాత నేను కల్వడంతో అమ్మ కన్నీరు పెట్టింది తప్ప గతంలో తను అనుభవించిన బాధలేవీ నాతో చెప్పలేదు. నేనున్నంత సేపు గతాన్ని మరిచిపోయి నాతో పూర్తి సంతోషంగా గడిపింది. చివరికి మాత్రం మరిచిపోకుండా “పెళ్లి చేసుకున్నావా తండ్రీ” అంటుతల నిమురుతూ అడిగింది. నేను అయిందే అనడంతో ఎంతో సంబురపడిపోయింది. ఇకతనకు కావలసింది మనుమలు, మనుమరాళ్లే. అదే అడిగింది. కానీ, మా పోరాట పరిస్థితులలోమేం పాటించక తప్పని విషయాలు చెప్పేసరికి పెదవి విరిచింది. తల్లి మనసు నిరాశపడింది. పోలీసుల చిత్రహింసలనుభవించిన ఫలితంగా బావ మాత్రం మనసు ఎంత తన్లాడినా నన్నుచూడడానికి రాలేకపోయాడు. మళ్లీ ఏమవుతుందోననే భయం ఆయన ప్రేమను బంధించింది .
2000 డిసెంబర్‌లో మా అమ్మకు మతిస్థిమితం కోల్పోయిందనే ఓ చిన్న పేపర్ వార్తా నాచేతికి దొరికింది. అడవిలో మేము ఎంతో మంది పేద తల్లుల తలలో నాలుకై వారి బాధలు తీరుస్తున్నామని సంబురపడుతూ మా పార్టీని కడుపున పెట్టుకొని సాదుతుంటే నాకు జన్మనిచ్చిననా తల్లి మతి స్థిమితం కోల్పోవడం బాధ అయింది . ఇక అ తరువాత దాదాపు రెండు దశాబ్దాలు అమ్మ గురించి ఏ వార్తా లేదు. పెద్దపల్లి పెద్దవ్వగా మన్ననలు పొందిన మధురమ్మ మరణవార్త సందర్భంగా మా తల్లి మరణ వార్త విన్నాను. కానీ, అది వివరంగా లేకపోవడంతో వార్తకోసం ప్రయత్నించగా పాత్రికేయ మితృలు చాలా శ్రమపడి మా అమ్మ మరణవార్తను నాకు చేర్చారు. నా తల్లి మరణవార్త నాకు చేర్చడానికి శ్రమించిన పాత్రికేయులకు నేను రుణపడి ఉంటాను . మా అమ్మ 2019 ఆగస్టులో మా సోదరి వద్ద తుదిశ్వాస విడిచిందనీ, ఆ క్షణాననన్ను పలవరించిందనీ తెలుపడంతో నా కన్నీరు కట్టలు తెంచుకుంది.
అమ్మను చివరిసారి 1990లో కలిశాక 29 ఏళ్లకు అమె మరణవార్త విన్నాను. నిజానికి నేను అమ్మ గురించి ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఆలోచించనే లేదు. మా ఉద్యమంలో అనేక తల్లుల మధ్య నేను నా తల్లిని గుర్తు చేసుకునే అవసరం, అవకాశం రాలేదు. అమ్మలాగే నాకువాళ్ల ప్రేమ లభించింది. కానీ, అమె మరణవార్త మాత్రం నన్ను కొద్ది వారాల వరకు వెంటాడింది. అమె పడ్డ బాధలకన్నాఆమె అనుభవించిన కష్టాల కన్నా అమె పట్టుదల, తన బిడ్డల పట్లఆమె ప్రేమ, నా కోసం నా వెంట మా ఇంటికి సంఘపోల్లు వస్తే తన కొడుకుల్లాగే చూసుకున్నతీరు ఎన్నిసార్లు నెమరువేసుకున్నానో! అ పట్టుదల నాకు నా తల్లి రొమ్ముపాలతోనే అబ్బిందనుకుంటున్నాను. నేను ఆ తల్లి కొడుకుగా వర్గపోరులో ఆమె పట్టుదలను ప్రదర్శిస్తూ నా సహచరుల త్యాగాలను గానం చేస్తూ తుదివరకు నిలుస్తాననీ అమ్మలందరికి అమ్మల దినంసందర్భంగా హామీ ఇస్తున్నాను.
SALUTES SIR
=========
BUCHI REDDY GANGULA
బాగా చెప్పారు