“మేము తిజ్‌రాజా పిల్లలం, మా తిజిమాలిని తవ్వడానికి ఎలా అనుమతిస్తాం?

తిజిమాలి మా ఆత్మ, ఆత్మ లేకుండా ఎలా జీవించగలం?

వాగులను మాత్రమే కాదు మా గుర్తింపును కూడా నాశనం చేసే గనుల తవ్వకానికి ఎలా అనుమతినిస్తాం?

మేము మా మాలి కొండ కోసం, మా అడవుల కోసం, అన్ని విధాలుగా పోరాడుతామే కానీ మా ఆత్మను వేదాంత కంపెనీ తవ్వడాన్ని ఒప్పుకోం.”

అక్టోబర్ 16న ఒడిశాలోని రాయగడ, సుంగర్ పంచాయతీ, కాశీపూర్ బ్లాక్‌లో జరిగే బహిరంగ విచారణకు ముందు రోజు రాత్రి తిజిమాలి పర్వత ప్రాంతంలోని బంతేజీ గ్రామానికి చెందిన మహిళలు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలని ఏకగ్రీవంగా ఇలా తీర్మానించారు:

సుసంపన్నమైన జీవ-సాంస్కృతిక వైవిధ్యం పుష్కలంగా ఉన్న తిజిమాలిని తరతరాలుగా ఆదివాసీ, దళిత  సముదాయాలు సంరక్షిస్తున్నారు. తిజిమాలి కొండలకు ఆ పేరు స్థానిక పురాణ గాథా పురుషుడు తిజ్రాజా నుంచి వచ్చింది, తిజ్రాజాను అత్యున్నత దేవతగా వారు పూజిస్తారు.

తిజిమాలి (ప్రభుత్వ రికార్డులలో ‘సిజిమాలి’ అని వుంది) అనేది స్థానిక, ప్రాదేశిక తెగల ఆధ్యాత్మిక జీవనానికి – బయటి ప్రపంచానికి వున్న పరస్పర సంబంధానికి ఒక ఉదాహరణ.

1,000 చ.కి.మీ పొడవున్న తూర్పు కనుమల శ్రేణి దక్షిణ భాగంలో, కలహండిలోని థువాముల్ రాంపూర్ బ్లాక్, ఒడిషాలోని రాయగడ జిల్లాలోని కాశీపూర్ బ్లాక్ రెండింటిలోనూ తిజిమాలి కొండ వ్యాపించి ఉంది. కలహండిలోని థువాముల్ రాంపూర్ బ్లాక్, రాయగడ జిల్లా మొత్తంగా షెడ్యూల్ V ప్రాంతాల కిందికి వస్తాయి.

ఈ కొండకు పొరుగున సాసుబౌమాలి, బాటింగ్‌మాలి, మజింగ్‌మాలి, కుట్రుమాలి, ఖండువల్‌మాలి లాంటి అనేక పర్వత శిఖరాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో నివసించే స్థానిక ప్రజల జీవనప్రపంచంలో ఈ ప్రతి ఒక్క మాలి (పర్వతం)కి గొప్ప సామాజిక-జీవ-సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. కర్లపట్ వన్యప్రాణుల అభయారణ్యపు  ఇకో-సెన్సిటివ్ జోన్ (పర్యావరణ పరంగా సున్నితమైన ప్రదేశం), ఏనుగు, పులి, పాంగోలిన్‌ల(పాంగోలిన్‌లను , స్కేలీ యాంటియేటర్‌ అని కూడా పిలుస్తారు. ఇవి క్షీరదాలు, పొలుసులు వుండి ప్రమాదం అనుకున్నప్పుడు బంతిలా ముడుచుకు పోతాయి. భారతదేశంలో పాంగోలిన్‌లు ఈశాన్య ప్రాంతాన్ని మినహాయించి హిమాలయాలకు దక్షిణాన దేశం అంతటా కనబడతాయి. ఇవి క్రమంగా అంతరించిపోయే దశలో వున్నాయి) ఆవాసమని పేరు. ఈ ప్రతిపాదిత మైనింగ్ ప్రదేశం థుముల్ రాంపూర్ బ్లాక్‌లోని ఖండువల్‌మాలికి ఆనుకొని, తిజిమాలి కొండలకు సమీపంలో ఉంది.

తిజిమాలిలో 1549.022 హెక్టార్ల (దాదాపు 1880 ఫుట్‌బాల్ మైదానాలకు సమానం) విస్తీర్ణంలో బాక్సైట్ తవ్వకాల కోసం వేలం పాట పాడిన వేదాంత లిమిటెడ్‌కు మార్చి1న లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను ఒడిషా ప్రభుత్వం స్టీల్ & మైన్స్ డిపార్ట్‌ మెంట్ యిచ్చింది. అంచనా వేసిన 311 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వ నుండి సంవత్సరానికి 9 మిలియన్ టన్నులను వెలికితీస్తానని ఆ కంపెనీ ప్రతిపాదించింది.

ఆగష్టు 14న, పర్యావరణ, అటవీ, వాతావరణాల మంత్రిత్వ శాఖ (ఎమ్‌ఒఇఎఫ్‌సిసి)వేదాంతకు పర్యావరణ ప్రభావ అంచనా (EIA) నోటిఫికేషన్-2006 ప్రకారం నియమ నిబంధనలను (ToR) మంజూరు చేసింది. ఆ కంపెనీ పర్యావరణ అనుమతి కోసం రాయగడ- కలహండి జిల్లాల్లో – తప్పనిసరి ప్రక్రియ అయిన బహిరంగ విచారణను నిర్వహించడం కోసం ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (OSPCB) సెప్టెంబర్ 13న నోటీసులు ఇచ్చింది.

 “ఈ తప్పనిసరి ప్రక్రియలో భాగంగా వేదాంత తయారు చేసిన పర్యావరణంపై కలిగే ప్రభావ అంచనా ముసాయిదా నివేదిక, తిజిమాలి గురించిన కీలక సమాచారాన్ని కప్పిపుచ్చింది. ఈ నివేదిక కోసం తప్పుడు వాదనల ఆధారంగా అధ్యయనాలు నిర్వహించడం వల్ల వేదాంతకు జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికి తగినంత అవకాశం దొరుకుతుంది. ఈ నివేదిక  మైనింగ్ తవ్వకానికి ‘బాధ్యతతో’కట్టుబడివుంటానని వాగ్దానం చేస్తుంది. వేదాంత నివేదికను అధ్యయనం చేసిన, తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడని ఒక వన్యప్రాణి జీవశాస్త్రవేత్త “ఈ సందేహాస్పద వాదనకు చరిత్రలో ప్రాధాన్యత లేదు” అని అన్నారు.

నియమ నిబంధనలను జారీ చేయడానికి ముందు కాలంలో వివిధ పర్యావరణ అంశాలపై డేటా సేకరణకు జరిగింది. అయితే, వన్యప్రాణుల నివాసం, కదలికలకు సంబంధించి సరైన అంచనా కోసం ఈ సేకరణ మైనింగ్ లీజు ప్రాంతంలో ఒక సంవత్సరంలో అన్ని కాలాలలో కలిగే ప్రభావం గురించి కూడా తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సి వుంటుంది.

ప్రత్యేకించి వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 షెడ్యూల్ (I) ప్రకారం” ప్రతిపాదిత ప్రాంతం ఒక గొప్ప ఆవాసం, విభిన్న వన్యప్రాణుల జాతులకు ఒక రహదారి” అని పర్యావరణ ప్రభావ అంచనా ముసాయిదా నివేదికలో భాగంగా సమర్పించిన జీవసంబంధమైన అధ్యయనం స్పష్టంగా చూపిస్తోంది. “పర్యావరణానికి సంభావ్య ప్రమాదాలు లేదా దాని మైనింగ్ ప్రభావాల సంక్లిష్టతలను పర్యావరణంపైనే కాకుండా ఈ ప్రాంతంలో నివసించే ప్రజలపై కూడా విస్తరింపజేస్తుంది” అని ఆ జీవశాస్త్రవేత్త జోడించారు. 18 గ్రామాలను ప్రభావితం చేసే ప్రతిపాదిత ప్రాజెక్ట్ తన ముసాయిదా నివేదికలో చేసిన వాదనలకు విరుద్ధంగా, ప్రాంతం అంతటా అంటే50 కంటే ఎక్కువ గ్రామాలను ప్రభావితం చేస్తుందని స్థానిక ప్రజలు అంటున్నారు.

తిజిమాలి గని లీజు ప్రాంతం రాయగడ-కలహండి అనే రెండు జిల్లాల పరిపాలనా పరిధిలోకి వస్తుంది కాబట్టి, పర్యావరణ ప్రభావ అంచనా శాఖ నోటిఫికేషన్-2006 ప్రకారం ప్రతి జిల్లాలో ప్రత్యేక బహిరంగ విచారణలు జరపాలి. రాయగడ ప్రాంతం  కోసం మొదటి బహిరంగ విచారణ 2023అక్టోబరు 16 న కాశీపూర్ బ్లాక్‌లోని సుంగర్ పంచాయతీలో, రెండవది కలహండి కోసం 2023 అక్టోబర్ 18న థుముల్ రాంపూర్ బ్లాక్‌లోని కెర్పై పంచాయతీలోనూ జరపాలని నిర్ణయించారు.

టిఓఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ నిబంధనలు ప్రాజెక్ట్ పాలనా ఏర్పాట్లకు మద్దతు ఇచ్చే కీలక పత్రం. ప్రాజెక్ట్ బోర్డు కోసం టిఓఆర్ సాధారణంగా ప్రాజెక్ట్ సంక్షిప్త దశలో నిర్వచించబడుతుంది) రావడానికి ఒక వారం రోజుల ముందు వేదాంత తన గని అభివృద్ధి ఆపరేటర్ మైత్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్ ఇండియా సిబ్బందిని ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలకు పంపి, రాబోయే బహిరంగ విచారణలో మైనింగ్ ప్రాజెక్ట్‌కు మద్దతుగా ప్రజలను ఆకర్షించడానికి డబ్బు, ఉచిత సామాగ్రిని యిస్తానని వాగ్దానం చేసింది.

అనేక గ్రామాలకు చెందిన సుమారు 200 మంది మహిళలు, యువకులు, పురుషులు వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్‌కువ్యతిరేకంగా జూలై 30నాడు తమ నిరసనను తెలిపారు. మైత్రి అధికారులను ఎదుర్కొన్నారు, గ్రామసభ ఆమోదం లేకుండా తమ గ్రామాల్లోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఆ  తరువాత, వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్‌ను అనుమతించడానికి గ్రామస్తులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించినందుకు వందలాది మంది ప్రజలు లక్రిస్ గ్రామంలో కంపెనీ అధికారులను ఆగష్టు 4 నాడు మరోసారి అడ్డుకొన్నారు. అయినప్పటికీ, కంపెనీ అధికారులు గ్రామాల్లోకి ప్రవేశించి తిజిమాలి కొండపైకి వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేశారు.

మైనింగ్ ప్రాజెక్టుకు మద్దతునిస్తే రూ.1500 జమ చేస్తామని హామీ ఇచ్చి మైత్రి అధికారులు ప్రజల బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలను సేకరిస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. ఆగస్టు 12న, కంపెనీ ఏజెంట్లను అడ్డుకున్నప్పుడు ముందస్తు అనుమతి లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించం అని గ్రామస్తులకు హామీ ఇస్తూ లేఖ రాశారు.

అందుకు ప్రతీకారంగా, మైత్రి అధికారులు కాశీపూర్ పోలీస్ స్టేషన్‌లో వివిధ తేదీలలో గ్రామస్తులపై ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. తమను బెదిరించి, గొడ్డళ్లతో, లాఠీలతో, బందీలుగా పట్టుకున్నారని సుమారు 95 మంది ఆరోపించారు.

ఈ ఎఫ్‌ఐఆర్‌ల ఫలితంగా, ఆగస్టు 13 రాత్రి నుండి, ఆరు గ్రామాల నుండి 21 మందిని అరెస్టు చేసి రాయగడ సబ్ జైలుకు పంపారు. మిగిలిన వారిని 307 (హత్యా ప్రయత్నం, 364 (అల్లర్లు)వంటి అనేక ఐపిసి సెక్షన్ల కింద అభియోగాలు మోపి వేధిస్తూనే వున్నారు.

నిరంతర పోలీసు గస్తీ జరుగుతూండడం వల్ల ఏ సమయంలోనైనా పోలీసు అణిచివేత జరగవచ్చనే భయంతో తిజిమాలి సంరక్షకులు జీవిస్తున్నారు. ఇటీవలి బహిరంగ విచారణలు జరిగే వరకు రోడ్డు జంక్షన్‌లు, గ్రామంలోకి ప్రవేశించే దగ్గర పోలీసు, పారామిలటరీ చెక్‌పోస్టులు కొనసాగాయి.

చాలా మంది మహిళలు తిజిమాలి కొండపైన గంటల తరబడి అడ్డాకులను (సియాలీ, బౌహినియా వహ్లి) ఏరుకొని అలసతతో వచ్చిన వారిలో తన పేరు చెప్పడానికి ఇష్టపడని 52 ఏళ్ల కందా ఆదివాసీ మహిళా పెద్ద “మహిళలకు తిజిమాలికున్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసు.

బాగ్‌పర్, గుమెదపర్, రాణిపర్, జితాఝరన్‌పర్ (పర్ అంటే గుహ)లాంటి గుహలు తిజిమాలిలో 50 కంటే ఎక్కువ ఉన్నాయి, ఇవి మాకు పవిత్రమైనవి. మేము ఈ గుహలలో వివిధ కాలాలలో ఆచార, వ్యవహారాలను నిర్వహిస్తాము. గనులు తవ్వితే ఈ గుహలు నాశనమైపోవా?   

అంతేకాకుండా, తిజిమాలి మాకు ప్రధాన నీటి వనరు. మా పొలాలకు, గ్రామాలకు నీరునిచ్చే పనిచిడా, లేదా స్వద్గాడ్ అనేక వాగులకు ప్రధాన నీటి వనరు. గనుల తవ్వకం జరిగితే 200-ప్రాథమిక  వాగులు, వాటి మూలాలు నాశనమైపోతాయి. మనం, చెట్లు, జంతువులు ఎలా బతుకుతాం? తేనె, ఉసిరి, జామ, చింతపండు, నేరేడు, , లక్క, కొండ చీపుర్లు మొదలైంవాటిని సేకరించడానికి మేము కొండపైకి వెళ్తాము. వీటన్నింటికీ ఔషధ విలువలు ఉండడంతో జీవనోపాధి కోసం వీటిని అమ్ముకుంటాం. తిజిమాలిని తవ్వేస్తే ఇవి మిగులుతాయా?”

ఇద్దరు పిల్లలు వున్న బంతేజీకి చెందిన 24 ఏళ్ల దళిత మహిళా రైతు మంజులా నాయక్‌ “కొండలను మైనింగ్ నుండి రక్షించాలనే దృఢ సంకల్పంతో వున్నాం. నా భర్త కార్తీక నాయక్ కొండల తవ్వకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూండడంతో పోలీసులు వేటాడి వేధిస్తున్నారు. తరచూ అర్ధరాత్రి దాడులు జరుగుతుండటంతో ఊరి యువకులు, పెద్దలు అడవుల్లో తలదాచుకుంటున్నారు. వేదాంత-మైత్రి ఇక్కడికి వచ్చినప్పటి నుండి మాకు జీవితం దుర్భరంగా మారింది” అని వేదన వెళ్లబోసుకుంది.

బంతేజీకి చెందిన 45 ఏళ్ల కందా ఆదివాసీ రైతు రాణిదేయ్ మాఝీ, తిజిమాలితో తన సముదాయానికి ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతూ, “మేము కొండల్లో రాగులు, చిరు ధాన్యాలు, కొర్రలు, అలసందలు, మినుములు పండిస్తాము.  దాదాపు 15-20 రకాల దుంపలు కర్ర పెండలం, చిలగడదుంపతో పాటు వెదురు రెమ్మలు ఇంకా అనేక అటవీ ఆహారాలను కొండల నుండి సేకరిస్తాము. తిజిమాలిలో కడుపునొప్పి, జ్వరం, మలేరియా, సికిల్ సెల్ అనీమియా, మధుమేహం మొదలైన వాటికి కూడా ఔషధ మొక్కలు ఉన్నాయి. వీటన్నింటిని మేం ఎలా వదులుకోగలం? తిజిమాలికి మేము ప్రతి సంవత్సరం పూజలు చేస్తాము. తిజిమాలిని తవ్వేసి, వందలాది పాయల నీటి వనరు నాశనం చేస్తే అవి  లేకుండా మేం ఎలా జీవించగలం? ” అని ప్రశ్నిస్తుంది.

అక్టోబర్ 16నాడు విచారణ వేదిక వరకు అంతర్-జిల్లా సరిహద్దులో అనేక పోలీసు, పారామిలటరీ చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. అడవుల గుండా వేర్వేరు  మార్గాల్లో కాలినడకన వేదిక వద్దకు వచ్చినట్లు పలువురు సముదాయ పెద్దలు తెలిపారు.

కలహండిలోని ఖాకేస్ గ్రామానికి చెందిన మలయా నాయక్ అనే దళిత రైతు తన ఆధార్ కార్డు తీసుకెళ్లడం మరిచిపోవడం వల్ల  జిల్లా సరిహద్దు నుండి ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అతను కోపంతో పోలీసు సిబ్బందిని అడిగాడు, “తిజిమాలి కొండల్లో పుట్టే మా ప్రాంతానికి ప్రవహించే నీరు, రాయగడ లేదా కలహండిలోకి ప్రవేశించే ముందు అధికారుల నుండి అనుమతి తీసుకుంటుందా? తిజిమాలి నుండి పుట్టే నీరు కలహండికి చేరుకుని, నాగబలివైపు ముందుకు సాగే ప్రవాహం ఎవరి అనుమతి తీసుకుంది?” మలయా లాగానే అనేక మందిని సరిహద్దులు దాటకుండా ఆపేసారు. ఆధార్ కార్డులను తీసుకువెళ్లనందుకు వివిధ చెక్ పాయింట్ల వద్ద నుంచి తిరిగి రావాల్సి వచ్చింది.

భారీ అణచివేత, అరెస్టుల బెదిరింపు ఉన్నప్పటికీ, తిజిమాలి అంతటా ఉన్న గ్రామాల నుండి వందలాది మంది ప్రజలు సుంగర్ వద్ద బహిరంగ విచారణ వేదిక దగ్గరకు చేరుకొని ‘వేదాంత-మైత్రి కంపెనీ, గో బ్యాక్’ అంటూ చేసిన నినాదాలు హోరెత్తించాయి. ‘తిజిమాలి మాది, ఎవరి స్వంత ఆస్తి కాదు’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసుల భారీ మోహరింపు, ఎనిమిది ప్లాటూన్ల పారామిలటరీ సిబ్బంది మధ్య జరిగిన బహిరంగ విచారణలో దాదాపు 2,000 మంది ప్రజలు ఐక్యంగా తమ అసమ్మతిని ప్రదర్శించారు.

దళిత యువ నాయకురాలు భారతి నాయక్ (25), కాంతమాల్‌కు చెందిన ఆదివాసీ యువ నాయకురాలు నమితా మాఝీ (24) సగర్వంగా ‘వేదాంత గో బ్యాక్’ అని రాసి ఉన్న బ్యాడ్జీలను ధరించారు. అక్టోబర్ 16న జరిగిన విచారణలో మాట్లాడిన 20 మంది వక్తలలో భారతి, నమిత ఉన్నారు.

 “ఇంతకుముందు ఎప్పుడైనా తిజిమాలి గ్రామాలకు వచ్చారా” అని అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ను భారతి ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ V జిల్లా రాయగడకు  (దీనిలో 58.5% ఆదివాసీ జనాభా ఉంది) షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ పొడిగింపు చట్టం- 1996 (పెసా)వర్తిస్తుంది. అలాంటప్పుడు  “తిజిమాలిని వేదాంతకు వేలం వేసే ముందు జిల్లా పరిపాలన గ్రామసభలను సంప్రదించిందా?” అని భారతి అధికారులకు సవాలు విసిరారు, తిజిమాలిలోని భూములు, అడవులు, కొండలను తమ పూర్వీకులు ఎలా పెంచుకున్నారో అనే విషయాన్ని నమిత మనసుకు హత్తుకొనేట్లుగా చెప్పింది. “మమ్మల్ని పోషించే మా తల్లులైన కొండలు, భూములను మేము ఎప్పటికీ వదిలిపెట్టం. కొండలను తవ్వి మా తల్లిని నాశనం చేయడాన్ని ఎలా అనుమతిస్తాం? ఇది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. మన భూములు, జీవనోపాధి నుండి మనల్ని దూరం చేస్తుంది.” “ఎవరి రక్షణ కోసం మీరు ఉన్నారు? మా కోసం, ప్రజల కోసమా, లేక వేదాంత లాంటి ప్రైవేట్ సంస్థల కోసమా?” అని నమిత ఒడిశా పోలీసులను ప్రశ్నించింది కూడా.

బంతేజీకి చెందిన లక్ష్మీ నాయక్ (45) కూడా వేదిక గేటు దగ్గర పోలీసులను ప్రశ్నించాలనుకుంది. తన దుఃఖాన్ని, ఆందోళనలను పంచుకోవాలనుకుంది, కానీ మాట్లాడే అవకాశమే రాలేదు. గనులను వ్యతిరేకించినందుకు ఆమె జీవన భాగస్వామి, తిజిమాలి పెద్దమనిషి టంకధర్ నాయక్‌ను పోలీసులు వేటాడుతున్నారు. పోలీసుల నుంచి  తప్పించుకోడానికి టంకధర్ అనేకసార్లు తోటి గ్రామస్థులతో కలిసి అడవిలోకి పారిపోవాల్సి వచ్చింది.

అక్టోబరు 7న, సాయంత్రం 5 గంటల సమయంలో, పోలీసులు తన వద్దకు రావడంచూసిన లక్ష్మి అరెస్ట్‌ చేస్తారేమో, అడవిలోకి పారిపోవాలనుకుంటూ హడావిడిగా ఇంటికి తాళం వేసింది. కానీ పోలీసులు ఆమె నుంచి తాళాలు లాక్కోవడంతో చాకచక్యంగా తప్పించుకుని అడవుల్లోకి పారిపోయింది. ఇంటికి తాళం వేసి ఉన్నప్పటికీ, పోలీసులు తాళం విరగ్గొట్టి, ఇంట్లోని విలువైన వస్తువులను దొంగతనం చేసారు.

“పోలీసులు బంగారు, వెండి నగలు, అత్యవసరాల కోసం దాచిన సుమారు రూ. 5,000 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులే దొంగతనం చేస్తే ఏం చేస్తాం? నేను ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను, కానీ భయమేస్తోంది. పోలీస్ స్టేషన్‌కి వెళ్లినప్పుడు పోలీసులు నన్ను లేదా నా భర్తను అరెస్టు చేస్తే?” లక్ష్మి ఉద్రేకంతో అన్నది.

కెర్పాయ్ గ్రామ పంచాయితీలో కలహండికి సంబంధించి రెండవ బహిరంగ విచారణ అక్టోబర్ 18న పోలీసులు, పారామిలటరీ సిబ్బంది భారీ మోహరింపు మధ్య జరిగింది. ఆ ప్రదేశమంతా ముళ్ళకంచె వేశారు. తిజిమాలి అంతటి నుంచి  2,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు, ‘వేదాంత-మైత్రి కంపెనీ గో బ్యాక్’ వంటి నినాదాలు ఆగకుండా చేస్తూనే వున్నారు. వేదికకు వెళ్లే ప్రధాన జంక్షన్‌ల దగ్గర పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో అటవీ మార్గాల గుండా నడుచుకుంటూ వచ్చామని ఎంతోమంది తెలిపారు.

కెర్పాయ్ విచారణలో మాట్లాడే 15 మందిలో తాడదేయ్ గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు లిలెన్ మాఝీ(32) ఒకరు. “మాతృభూమిని మనం ఎలా నాశనం చేయగలం? గత కొన్ని నెలలుగా మేమంతా నిజంగా ఆందోళన చెందుతున్నాం. ఈ అడవులు, పర్వతాలను మన పూర్వీకులు కాపాడారు. ఈ కొండలు ప్రభుత్వానికి లేదా కంపెనీకి చెందినవి కావు. మీరు (అధికారులను చూపుతూ) అభివృద్ధి పేరుతో బలవంతంగా విధ్వంసంలోకి  నెడుతుంటే మేము ఏడుస్తున్నాం. ఈ రోజు, తన స్వార్థ ప్రయోజనాల కోసం కలెక్టర్, పోలీసు, ప్రభుత్వ అధికారులను కంపెనీ కొనేసి ఉండచ్చు, కానీ యిక్కడి ప్రజలకు, భవిష్యత్తు తరాలకు ఏమి జరుగుతుంది?” అని  లిలెన్ తన ఆందోళనను వ్యక్తం చేస్తూ, “ప్రభుత్వం కంపెనీ నుండి అంగీకరించిన డబ్బును వెంటనే తిరిగి ఇవ్వాలి, లీజును రద్దు చేయాలి” అని డిమాండ్ చేసారు.

బంతేజీకి చెందిన రుదునా నాయక్ (53) తన బాధను పంచుకునే అవకాశం దొరుకుతుందనే ఆశతో దాదాపు 45 కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన మనవడిని ఎత్తుకుని వచ్చింది. కానీ మాట్లాడేందుకు అనుమతి దొరకక పోగా పోలీసులు, కంపెనీ ఏజెంట్లు ఆమెను కొట్టారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో రుదున పెద్ద కుమారుడు ఉమాకాంత నాయక్‌ ఒకరు. అతను జైలులోనే ఉన్నాడు. “మైనింగ్‌ను వ్యతిరేకించినందుకు పోలీసులు నా కొడుకును తీసుకెళ్లి జైలులో పెట్టి మూడు నెలలకు పైగా అయ్యింది. అతని రాక కోసం  ఎదురుచూస్తూ రోజూ ఏడుస్తూనే ఉన్నాను. ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నదని నేను ప్రశ్నించాలనుకున్నాను, కాని వారు నన్ను మాట్లాడనివ్వలేదు.”

వేదాంత మైనింగ్ నుండి తిజిమాలిని రక్షించాలని ప్రజలు దృఢనిశ్చయంతో వున్నారు, వారు కేవలం జీవనోపాధి కోసం దానిపై ఆధారపడటం వల్ల కాదు, అది వారి జ్ఞానం, గుర్తింపు, ఆత్మ గౌరవాలతో కూడా పెనవేసుకొని ఉంది.

https://thewire.in/rights/photo-essay-dalits-adivasis-in-odishas-tijimali-fight-back-vedantas-mining-bid

Leave a Reply