మణిపూర్ దుఃఖం 
1 
ఈ నొప్పికి బాధ ఉంది 

మనుషులమేనా మనమసలు 
ఈశాన్య మహిళలు మనకు ఏమీకారా 

భారత మాత విగ్రహానికి 
మువ్వన్నెల చీర కట్టి మురిసిపోయే మనం 
ఇపుడు ఏమి మాట్లాడాలి 

నగ్నంగా ఊరేగించి 
అత్యాచార హింసను అమ్మలపై చేస్తోన్న 
రాజకీయ అంగాలు చెద పట్టవా 

ఆకుల్ని రాల్చినట్టు 
ప్రాణాల్ని మంటల్లో విసిరే కిరాతక 
హంతకుల్ని ఎన్ని వందలసార్లు ఉరి తీయాలి 

కసాయి హింసకు మన నిశ్శబ్దం 
తరాల ధృతరాష్ట్ర మౌనమేనా 

పూలను ప్రేమించని 
ఈ రాతి మనుషులకు 
నొప్పి గురించి ఎవరు పాఠాలు చెబుతారు 

ఈ ముళ్ళచెట్లను నడిమికి విరిచే 
కొడవళ్లు ఎపుడు మొలుస్తాయి 

ఒక గొప్ప సూర్యోదయం 
మణిపురిలో వెలిగే క్షణానికై 
కాలం కళ్ళతోఎదురుచూస్తున్నాను .

2 
ఆదిమ గోస 

అమ్మలురా వాళ్ళు 
నీ హింసకు ఆదివాసి అమ్మలే బొమ్మలా 

నీవు గుడ్డలూడదీసింది 
మణిపురి మహిళలల్ని కాదు
మీ ఇంటి ఆడపడుల గౌరవాన్ని 

మీ కామ హింసకు 
హద్దులు చెరిగిపోయాయి 

మేక మాంసాన్ని పంచుకుని తిన్నట్టు 
ఒక్క ఆడతాన్ని అందరు ఆబగా 
హింసిస్తారా 

ఆ రొమ్ముల పాలు తాగి
ఆ రొమ్ములనే కోసి 
పైశాచిక ఆనందాన్ని పొందే 
పీతిపురుగుల్లారా 

ఉచ్చ పోస్తారు 
మలం తినిపిస్తారు 
కుటుంబాలనే మాయం చేస్తారు 

ఠాణాలే కొమ్ము కాస్తున్నపుడు 
న్యాయం దూలానికి 
ఊరి వేయబడుతోంది

ప్రతి చరిత్రలో ఒలుకుతున్న 
అణగారిన జాతి రక్తం 
తెగిపడుతోన్న నిమ్నకుల దేహాలు 

ఎన్నడురా ఈ నరమేధం ఆగేది 
ఎవడురా మళ్ళీ ఆయుధంతో అవతరించి 
క్షాళన చేసే నాయకుడయ్యేది .

3
కొండపూలు దున్న కొమ్ములు 

చేను మీద పోతుకు
కాపలానే దారి ఇచ్చింది 
లేత కంకులు విరిగాయి 

చిన్ని వెలుగును 
చీకటి మేసింది 
గోరంత దీపం ఆరిపోయింది 

పిట్టల్ని పట్టి
గుండెల్లో ముళ్ళకర్రను పొడిచి
నిప్పుల మీద కాల్చి 
మాంసాన్ని తలా ఇంత తిన్నారు 

పూలరేకుల మీద 
మేకును గుచ్చి 
పుప్పొడిని రాల్చి 
దయ్యాలు ఊరేగాయి

అడవికి నిప్పు పెట్టి 
వన్యప్రాణుల ప్రాణభీతిని 
పైశాచికంగా వేడుక చూశారు 

చెట్టును విరిచి
ఊయలను తెంచి
తల్లులను శిలువ వేశారు .

4 
తేరుకొనే దుఃఖమా ?

కాగితం మీద వాలిన 
గాయాల సీతాకోకలకు 
ఫోర్త్ ఎస్టేట్ చికిత్స ఎపుడు 

ఊరు వల్లకాడు అయ్యాక 
శవాలకు కాపలా ఎందుకో

స్వేచ్ఛ గుండెలో 
భయం మేకును దించారు 
గాయాలు నిజంగా కోలుకుంటాయా 

ఊరు నొప్పి పలవరిస్తోంది 
కలల్లో వెంటాడుతోన్న 
పిశాచాల నీడల్ని చూసి 

గిరి తల్లుల గోడు 
పెద్దల మైకులకు వినబడుతుందా 

శ్వాస వెంటిలేటరుపై ఉంది
ఏ న్యాయస్థానాలు కాపాడుతాయో

5 
ఈశాన్యగాయం 

దుఃఖం గూడు కట్టుకున్న
ఊరును చూడు 
ప్రాణాలు, మానాలు తెగిన గాలిపటాలై 
పీలికలైన హింస వేడుకను చూడు 

కొమ్మకు వేలాడుతోన్న 
రక్త గాయాల్ని చూడు 

నిప్పుల్లో కాలుతోన్న 
మనషుల ఆశలను చూడు 

శ్వాసలను ఉక్కుపాదంతో అణగదొక్కుతొన్న 
అహంకార పిశాచాల నవ్వుల్ని చూడు 

బతుకుల్ని లాగేసుకుని 
జనాభా లెక్కల్లో మరణాలను పోగేస్తోన్న 
పూలముసుగులు ఆయుధాలను చూడు 

కపోతాలను బాణాలతో గుచ్చి 
వేడుక చేసుకునే అసుర గణాల్ని చూడు 

రక్తపుటేర్లను పారించి 
వాసన్ని బయటకు పొక్కకుండా 
రాక్షస కాపలాను ఉంచిన 
రాబందులను చూడు

దేశమా తిరగబడు 
చీమలను తింటోన్న 
పాముల పొట్టలు పగిలే ప్రతిఘటించు 

సామాన్యులు 
సాధారణంగా బతికే 
స్వేచ్ఛ కొరకు ఒక నినాదమై 
ఒక కవితై ,ఒక నిప్పు నిరసనై 
గొంతు కలుపు 

2 thoughts on “తెలుగు వెంకటేష్ ఐదు కవితలు

 1. నిప్పు కణo లా ఉబుకుతుంది రక్తం
  ఏ విధంగా నిరసన తెలుపాలని
  ఆన్న

 2. మా సత్యం
  తెలుగు వెంకటేష్ గారు “మానిషాద ప్రతిష్టాం త్వ మగమ శాశ్వతీస్సమా:
  యత్ క్రౌంచ మిధు నాదేక మవధీ: కామ మోహితమ్”. వాల్మీకి కాలం నుంచి ఉన్న వేదన. ‘ఈశాన్యగాయం’ కవిత లోని ఇతివృత్తం విశ్వ మానవునికి సంబంధించిన వేదన అంతర్లీనంగా వ్యక్తం అవుతుంది. భారతీయ జనతా పార్టీ 2002లో జరిగిన గుజరాత్ మారణకాండకు కొనసాగింపుగా తమ రాజకీయ లక్ష్యాలను సాధించడానికి జరుపుతున్న విధ్వంసం.
  మానవ హక్కుల ఉల్లంఘన. ఇతర రాష్ట్రాలకు ఒక హెచ్చరిక లా కేంద్ర ప్రభుత్వ పథకం.

Leave a Reply