అసమ సమాజంలో జీవితం బరువు మోసే వాళ్ళే దేన్నైనా అర్థం చేసుకోగలరు. కొన్ని కొన్ని సార్లు అపార్ధం చేసుకోనూవచ్చు. అలా అపార్థం చేసుకోవడం కూడా ఒక రకంగా అర్థం చేసుకునే క్రమమే.కనుక అపార్థం చేసుకున్నవాళ్ళకే ఎప్పటికైనా సరిగ్గా  అర్థం చేసుకోగలిగే అవకాశాన్ని (చారిత్రిక)జీవితానుభవాలే అందిస్తాయి. అలా సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళే నిర్భయంగా ప్రశ్నిస్తారు. బలంగా ప్రతిఘటిస్తారు. రాజీ లేకుండా పోరాడుతారు. వాళ్లే ప్రజలు.

అలాంటి ప్రజల్లో సహజంగానే సహజీవన సంస్కృతి(తెహ్ జీబ్) ఉంటుంది. స్పష్టాస్పష్టంగానే కావొచ్చు ఎన్నో ప్రజాస్వామిక విలువలు ఉంటాయి. వారికి విభిన్న మతాల పట్ల తమవైన లౌకిక వైఖరులు ఉంటాయి. తమవైన ప్రత్యేక భక్తి విశ్వాసాలు ఉంటాయి. సాంఘిక (సంబంధాల) జీవులుగా ప్రజలు పరస్పరం సంఘీభావాన్ని ప్రోది చేసుకుంటారు. ప్రేమానుబంధాలను పెంచి పోషించుకుంటారు. కష్టసుఖాలను పరస్పరం పంచుకుంటారు. అయితే ప్రజల యీ సహజీవన సంస్కృతిని పాలక శక్తులు ఎప్పుడూ సహించవు. ప్రజల విశ్వాసాలను వివేచన దిశగా ఎదగనీయకుండా వాటిని ఉన్మాద స్థాయికి ప్రేరేపించి తమ స్వ(వర్గ) ప్రయోజనాలను ఈడేర్చుకుంటాయి.

అందుకే చరిత్రలో భూసురులుగా పేరుమోసిన ప్రజల పాలిట ఆది పాలకులైన బ్రాహ్మణులు మొదటగా వర్ణ వ్యవస్థను సృష్టించి ప్రజలను విభజన చేశారు. కాలక్రమంలో ఆస్తి సంచయనం జరిగిన నేపథ్యంలో ప్రజలను దోపిడీచేసి ఆ ఆస్తిని సొంతం చేసుకునేందుకు అట్టి వర్ణవిభజనే వర్గవిభజనకు మార్గాన్ని సుగమం చేసింది. ఆద్యంతరహితుడు, సర్వాంతర్యామి అయిన దేవుడిని సృష్టించి, ‘చతుర్వర్ణ వ్యవస్థను నేనే సృష్టించాను’ అని మొదట పురుషసూక్తం(ఋగ్వేదం)లో, ఆ తర్వాత భగవద్గీతలో చెప్పించారు. దేవుడి ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులూ పుట్టారని చెప్పారు. దీన్నే ఆ తర్వాత మనువు వివరిస్తూ సృష్టికర్త బ్రహ్మే ఆయా వర్ణాలకు స్వధర్మాలను నిర్దేశించాడని చెప్పాడు. స్వ(వర్ణ) ధర్మాన్ని ఉల్లంఘించి పర(వర్ణ)ధర్మాన్ని అనుసరిస్తే నరకం తథ్యం అని, మోక్షప్రాప్తి లేనే లేదని భయపెట్టాడు. ఆ విధంగా వేరే ఏ మతమూ చేయని విధంగా శ్రమ చేసే ప్రజల స్వీయస్పృహను, ఆత్మగౌరవాన్ని నాశనం చేసే దుర్మార్గమైన పనిని హిందూమతం తన ధర్మనిర్వహణలో భాగంగా నిర్వహించింది. ప్రజల (శూద్రుల) శ్రమను దోచుకునేందుకు అనువుగా కౌటిల్యుడు లాంటి ‘శాస్త్ర’కారుడేమో వర్ణ పక్షపాత శిక్షాస్మృతిని రూపొందించాడు.

ఆ తర్వాత కాలంలో ఆధునిక సనాతనవాద పాలకులు (సంఘపరివారీయులు మాత్రమే కాదు) ఆ పాత పరిభాష మార్చి మోక్షం స్థానంలోకి దేశభక్తిని తీసుకొచ్చారు. పాపానికి బదులుగా దేశద్రోహాన్ని ప్రవేశపెట్టారు. నరకానికి నకళ్ళుగా దేశపు జైళ్లను తయారుచేశారు, చేస్తున్నారు. పైగా సామ్రాజ్యవాదానికి దాసోహమై భూస్వామ్య దళారీ బూర్జువాలుగా, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పాలకులుగా కొత్త అవతారమెత్తి రాజ్యపాలన చేస్తున్నారు. అలా పార్లమెంటరీ ‘ప్రజాస్వామ్యం’ ద్వారా మన దేశంలో పుట్టిన హిందుత్వ ఫాసిజంపై వరవరరావు గారు 1984 నుండి 2015 దాకా మూడు దశాబ్దాల కాలంలో రాసిన 18 వ్యాసాలు, చేసిన రెండు ప్రసంగాలతో కూడిన యీ 20 విశ్లేషణా వ్యాసాలను ప్రచురించిన విరసం పుస్తకమే యిది.

ఒకనాడు ప్రజల మదిలో ఉన్న భక్తి విశ్వాసాలు సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రభావంవల్ల అవి ఈనాడు వీధికెక్కి వీరంగం వేస్తున్న వైనాన్ని వివి వివరిస్తాడు. అలాగే భక్తి ఎంత పెద్ద వ్యాపార  సరుకు అయిందో, పెట్టుబడిదారీ పరిశ్రమ అయిందో అతిగా విస్తరిస్తున్న వెంకటేశ్వర ‘మహాత్మ్యం’ కన్న మరొక నిదర్శనం అక్కరలేదంటాడు. గతంలో నక్సలైట్లే దేశభక్తులని, తెలుగు జాతిని ఉద్ధరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ ఖాకీ నుంచి కాషాయాంబరాల వేషాల్లోనే కాదు, విశ్వాసాల్లో కూడా అతని ప్రజావ్యతిరేక వర్గ స్వభావమేమిటో అప్పటి తెలుగుదేశం పాలనే రుజువు చేసిందని చెబుతాడు.

అయితే రాజ్యాంగం నిర్దేశాల మేరకు పాలకులు తమ తమ వ్యక్తిగత విశ్వాసాలను నియంత్రించుకునే బదులుగా ఎలా తమ వ్యక్తిగత విశ్వాసాలనే  ప్రభుత్వ విధానాలుగా అమలు చేస్తారనే విషయాన్ని  తెలియజేస్తాడు. సామ్రాజ్యవాద, భూస్వామ్య పాలకులు ఎలా తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసి పెంచి పోషించి ఆ తప్పుడు భావజాల చైతన్యంతోనే ప్రజలు(ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వారు) ప్రవర్తించేలా వారిని కండిషన్ చేస్తారు. ఆ స్థితినే రాజ్యం ప్రజలు ఇచ్చిన  లైసెన్స్ గా  ఎలా వాడుకుంటుందో రచయిత వివరిస్తాడు.

ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డలను కూడా ఇవ్వలేని ప్రభుత్వాలు కులమతాలను పెట్టుబడులుగా పెట్టి ఎలా ఎన్నికల పరిహాస నాటకాలు ఆడుతూ అధికార పీఠం ఎక్కుతారో  చెబుతాడు. ప్రజలకు అవసరం లేని అలవాట్లను కృత్రిమంగా సృష్టించి, ఆ అలవాట్లను వ్యసన స్థాయికి పెంచి దోచుకునే సామ్రాజ్యవాదమే, ప్రజల మత విశ్వాసాలను కూడా ఉన్మాద స్థాయికి  పెంచి తన ఆయుధాల వ్యాపారం ఎలా చేస్తుందో చెబుతాడు. సామ్రాజ్యవాదం ఆ ఆయుధాలను ఎలా సంస్కృతి రూపంలో అందించి ఉత్సవాలు, మేళాల ప్రదర్శనలకు ప్రజలను ఎలా పురికొలుపుతుందో, మతం మత్తులో ప్రజలు కత్తులు దూసి తమ కుత్తుకలను కూడా ఎలా కోసేసుకుంటారో దేశ విభజన(1947) కాలం నాటి నుండి నేటి దాకా ఢిల్లీ, ఒరిస్సా, బెంగాల్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన అనేక మత కల్లోలాల,లక్షలాది ప్రజల నిర్వాసిత సంఘటనలను గుర్తు చేస్తాడు. పైకిచూడ ఇవన్నీ మతకల్లోలాలుగా, వైరి బృందాల సామాజిక కలహాలుగా  కనిపించినప్పటికీ, అవి పాలకుల ప్రచ్ఛన్న రాజకీయాలే అని వివి ఘంటాపథంగా ప్రకటిస్తాడు.

ఇక భారత ఉపఖండంలోని వివిధ జాతులకు చెందిన ప్రజలను వారి మత విశ్వాసాల ప్రాతిపదికగా ఒక ‘అఖండ భారతజాతి’గా రూపొందిస్తామనడం సాంస్కృతిక వైవిధ్యాన్ని హరించడమే అవుతుంది. అలాగే చారిత్రిక క్రమాన్ని పట్టించుకోకుండా వాస్తవికతా పునాదిలేని విశ్వాసాలనే చరిత్రగా చలామణీ చేస్తూ సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వాల పెత్తనాన్ని ప్రశ్నిస్తే అది ‘జాతీయ సమైక్యత’కు భంగకరం అయినట్టుగా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లినట్టుగా భావించడం నిరంకుశత్వమే అవుతుంది. దేశవిభజన కాలం నుండి సుమారు నాలుగు దశాబ్దాలుగా ఆయా జాతుల స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న ప్రజలను అణచివేసే దుర్మార్గ పాలనకు వివి  చెప్పినట్టు నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ లలో కొనసాగుతున్న మిలిటరీ పాలనలను  నిదర్శనాలుగా చెప్పవచ్చు. అలాగే ఆ తర్వాత కాలంలో ఉత్తరప్రదేశ్ లోని  ముజఫర్ నగర్ లో  ముస్లింలపై దాడులు, మహారాష్ట్రలో నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారేల హత్యలను, కర్ణాటకలో కల్బుర్గి హత్యను, రచయిత పెరుమాళ్ మురుగన్ ‘సాహిత్య’హత్యను, పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ‘ఆత్మ’హత్య లాంటివెన్నింటినో కూడా కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. ఈ మొత్తం నియంతృత్వ పాలనా ప్రక్రియలో పాలకులు సృష్టించిన తప్పుడు భావజాల చైతన్యం పాత్ర కీలకమైనదని, ముఖ్యంగా మధ్యతరగతిని  ఒక మార్పు నిరోధక బఫ్ఫర్ గా  పాలకులు ఎలా ఉపయోగించుకుంటున్నారో  వివి విశ్లేషిస్తాడు.

కనుక వాస్తవిక పరిస్థితులపై,  బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం పై  పోరాడుతూనే, ఆ పోరాటాన్ని పదునెక్కించడంలో కీలకపాత్ర పోషించే (సరైన) భావజాలాన్ని ఉపేక్షించరాదని, అందుకు సాంఘిక, సాంస్కృతిక, భావజాల రంగాల్లోనూ ప్రజలు పోరాడాలనే అవగాహనను వివి  వ్యక్తపరుస్తాడు. అయితే సాంఘికాది రంగాల్లోని సమస్యలతో అనివార్యంగా రాజకీయ శక్తులకు  ప్రమేయం ఉన్నదనే వాస్తవాన్ని గుర్తించాలని, వాటి ప్రమేయం ఉన్న మేరకు ఆర్థిక రాజకీయ శక్తు  లపై కూడా ప్రజల పోరాటాలను ఎక్కుపెట్టాల్సి ఉంటుందని, అప్పుడే ఆయా పోరాటాలు ఫలవంతం అవుతాయనే అవగాహనను మనం వివి విశ్లేషణ నుంచి గ్రహించవచ్చు.

మనదేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం రూప పరంగా పార్లమెంటరీ ‘ప్రజాస్వామ్యం’ నుంచే వచ్చినప్పటికీ, దాని సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి దేశీయ మూలాల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. మత(కుల)సంస్కృతుల మూలాల్లోకి పునాదుల్లోకి వెళ్లి చరిత్రను పరిశీలించాల్సి వుంటుంది. పాలకుల పీడన, అణచివేతలకు, దోపిడీవివక్షలకు వ్యతిరేకంగా ప్రజల ప్రతిక్రియలను, ప్రతిఘటనలను, ప్రత్యామ్నాయ పోరాటాల చరిత్రను పునర్ నిర్మించుకొని, దాన్ని వర్తమానంలోనూ కొనసాగించడం ద్వారా సరికొత్త పునాదులపై భవిష్యత్ చరిత్ర నిర్మాణమవుతుందని  వివి భావిస్తాడు. మొత్తానికి ‘ప్రజాప్రాతినిధ్య’ పార్లమెంటరీ ‘ప్రజాస్వామ్యం’లో ప్రజాప్రాతినిధ్యం, ప్రజాస్వామ్యాలు  ఏనాడో లుప్తమై పోయి, రిపబ్లిక్ అనే మాట పాలకవర్గాల నియంతృత్వానికి, సోషలిజం అనే మాట అర్ధ వలస, అర్థ భూస్వామ్య దళారీ నిరంకుశ పాలనకు, సెక్యులరిజం అనే మాట హిందూ మతోన్మాదానికి (ఇప్పటి పాలకులకైతే సోషలిజం, సెక్యులరిజం అనేవి నిషిద్ధ పదాలైనవి), రాజ్యాంగం అనే మాట అణచివేతకు పర్యాయపదాలైనవని వివి అంటాడు. తత్ఫలితంగా, మనుధర్మం ఒకప్పటి రాజ్యాంగమైతే, హిందూత్వ నేటి రాజ్యాంగం అయిందని ఒక్క మాటలో చెప్పవచ్చునంటాడు.

జగత్తు మిథ్య, జీవుడు మిథ్య అని చెప్పే హిందూమతమే ఇటీవలికాలంలో రాజ్యంతో చెట్టపట్టాలేసుకుని చెలరేగే చందాన్ని ఎవరైనా ‘తిలకించవచ్చు’. రాజ పదవి కోసం,రాజ్య రక్షణ కోసం హిందూమతం ఎప్పుడూ హింసనే(ఫాసిజాన్నే) ఒక ధర్మంగా ఎలా ఆచరించిందో నాటి రామాయణ, భారతాల నుంచి ఇటీవలి సంఘటనలను ఎన్నింటినైనా ఉదాహరణలుగా ఇవ్వవచ్చు.

ఇంతకుముందే ప్రస్తావించిన ఆధునిక సనాతనవాద పాలక పార్టీలలో ఒక్క బీజేపీ తప్ప మిగిలిన పార్టీలేవీ హిందూ మతప్రాతిపదికను ప్రకటించుకున్నవి కావు. ఒక్క బిజెపినే హిందూ మతోద్ధరణను, ‘అఖండ భారతజాతి’ నిర్మాణమనే లక్ష్యాన్ని బాహాటంగా ప్రకటించుకుని బయలుదేరిన పార్టీ. అది పాత జనసంఘ్ అవశేషాల నుండి 1980లో ఏర్పడి రాజకీయ ముఖాన్ని తగిలించుకున్నది. అది మొదలు రాజకీయేతర రంగాల్లో తనదైన భావజాలాన్ని వ్యాప్తిజేస్తూ మూడున్నర దశాబ్దాల కాలంలోనే రాజకీయ అధికారానికి రాగలిగింది. రాజకీయంగా అధికారంలో లేని కాలంలోనే 1992లోనే కర సేవకులతో బాబ్రీ మసీదును విధ్వంసం చేయించి తన కరాలను  కడిగేసుకుంది. అలాంటిది 2014 లో,2019 లో రెండుసార్లు రాజకీయ అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపికి ఎదురేముంటుంది!?  దేశ విభజనానంతరం ఏ కేంద్ర ప్రభుత్వమూ చేయ  సాహసించని అతి తిరోగమన రాజకీయ నిర్ణయాలను అత్యంత దూకుడుగా, ధూర్తంగా తీసుకుంది. వాటిలో పౌర సవరణ చట్టం, కశ్మీర్ స్వయంప్రతిపత్తి లాంటివి ముఖ్యమైనవి.

అంటే, ఒక తప్పుడు భావజాలానికే  ప్రజలపై ఇంత శక్తివంతమైన ప్రభావం వేయగలిగే అవకాశం ఉంటే, ఒక సరైన భావజాలానికి ఎంత శక్తి ఉండగలదో మనం ఊహించవచ్చు. ఊహించడం కాదు ఆ భావజాల చైతన్యపు శక్తిని మనం చరిత్రలో (ఉదా: చైనా సాంస్కృతిక విప్లవంలో) చూశాం. కనుక మతవర్గతత్వ రాజ్యంతో పాటు వర్తమాన పరిస్థితులకు తగిన విధంగా ప్రజల మానసికతను పరిగణనలోకి తీసుకుంటూ  మనం సరైందనుకుంటున్న భావజాలాన్ని మనసుకు పట్టించే రీతిలో ప్రజలకు అందిస్తూ సామాజిక సాంస్కృతిక రంగాల్లోనూ  పోరాడాలి. అప్పుడే వివి చెప్పిన సామాజిక పరివర్తనలో భావజాల చైతన్యానికి గల కీలక పాత్రను మనం గుర్తించినట్టవుతుంది.

ఇక చివరగా సెక్యులరిజం గురించి—ఇంగ్లండ్ లో మొట్టమొదటి పెట్టుబడిదారీ విధానానికి అవసరంగా లౌకికవాదం(సెక్యులరిజం) అనేది తొలిసారిగా పుట్టింది. దాని పుట్టుకే  రాజకీయపరమైన అధికారిక పుట్టుక. భూస్వామ్యాన్ని సమూలంగా నిర్మూలించి పుట్టిన పెట్టుబడి దారీ దేశాల్లో మాదిరిగా మన దేశంలో లౌకికవాదం పుట్టి మనగలగడానికి అవకాశం లేనేలేదు. ఎందుకంటే, మన దేశంలో భూస్వామ్యానికి, సామ్రాజ్యవాద పెట్టుబడికి కుదిరిన మిలాఖతు వల్ల నిజమైన లౌకికవాదం అమలు కావడం సాధ్యం కాదు. మరిక్కడి రాజ్యాంగంలోనూ లౌకికవాద పదం చేర్చడం వల్ల దాని పుట్టుక కూడా ఇక్కడ అధికారికమైందే.(ఇప్పటి బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం లోనుంచే లౌకికవాదం,సామ్యవాదం అనే పదాలను తొలగించే కుట్ర చేస్తోంది) కానీ రాజకీయంగా సామ్రాజ్యవాదానికి భారత పాలకులు దాసోహమవడం వల్ల ఆర్ ఎస్ రావు గారన్నట్టు ఇక్కడి లౌకికవాదం లౌక్యం అయింది. ఇంకా బాగా చెప్పాలంటే భారత పాలకులకు లౌకికవాదం లౌక్యవాదం అయింది. కాని ఆరంభంలోనే చెప్పినట్టుగా ఇక్కడి ప్రజల్లో అనాదిగా లౌకిక(వాద) వైఖరులు  బలంగా నాటుకుని ఉన్నాయి. అందువల్లనే భిన్న మతాల ప్రజల మధ్య సహజీవన సంస్కృతి ‘తెహ్ జీబ్’  సజీవంగా నిలిచివున్నది. ఆ విశిష్ట ప్రజా సాంస్కృతిక కోణంలోనే మన దేశంలోని హిందుత్వ ఫాసిజంపై వివి తన లౌకికవాద విశ్లేషణను యీ వ్యాసాల్లో కొనసాగించాడు. ఆ ప్రజల సహజీవన సంస్కృతి ‘తెహ్ జీబ్’   జిందాబాద్! ప్రజల సంస్కృతిని నాశనం చేసే పాలకవర్గాల ‘బర్బాదీ’ ముర్దాబాద్!!

Leave a Reply