నాగరిక సమాజంలో రాజ్యాలు చేసే యుద్దాలన్నీ నేరాలే. అయితే యుద్ధాలు ఒక్కసారిగా అనుకోకుండానో, అకస్మాత్తుగానో జరిగే సంఘటనలు కావు. వాటికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. వాటిని ప్రేరేపించే, కుట్రలు చేసే సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉంటాయి. సొంత లాభాల కోసం నరమేధానికి వెనుకాడని శక్తులుంటాయి. వాటికి వత్తాసుగా మొసలి కన్నీళ్లు కారుస్తూ అర్థసత్యాలను, అబద్ధాలను ప్రచారంచేసే రకరకాల మీడియా సాధనాలు ఉంటాయి. వీటన్నింటిని సుదూరం నుండి చూస్తూ దురాక్రమణలను ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపే ఉదారవాద, మానవీయ సమాజం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడి సందర్భంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ దురాక్రమణను కేవలం తెలుపు, నలుపులుగా విడదీసి మనం జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం లేదు. దాడి దుర్మార్గమే, కాని అసలు దోషులను గుర్తించాలంటే ఆ దాడి వెనుక జరిగిన, జరుగుతున్నకుట్రలను, వ్యూహాలను అర్థం చేసుకోవాలి.

రష్యా, ఉక్రెయిన్ల మధ్య 9వ శతాబ్దం నుండే ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలు జార్ సామ్రాజ్యంలో భాగమై దోపిడీ, పీడనకు గురైనాయి. 1917 అక్టోబర్ విప్లవం తర్వాత జార్ సామ్రాజ్యం కూలదోయపడి అందులో భాగమైన దేశాలు, జాతులు విముక్తి పొంది స్వతంత్ర సోషలిస్టు రిపబ్లిక్కులుగా ప్రకటించుకున్నాయి. అందులో భాగంగానే 1917లోనే “రష్యన్ సోవియట్ రిపబ్లిక్,” “ఉక్రెయిన్ పీపుల్స్ రిపబ్లిక్” అనే స్వతంత్ర దేశాలు ఉనికిలోకి వచ్చాయి. ఆతర్వాత రష్యా ఒక సమాఖ్యగా రూపాంతరం చెంది “రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్”గా మారింది. ఈసమాఖ్య 1917 నుండి 1922 వరకు ఉంది. అయితే బోల్షివిక్లు అధికారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత చిన్న రిపబ్లికన్లుగా విడిపోయిన రాజ్యాలని తిరిగి కలుపుకొని ఒక పెద్ద సోషలిస్టు రాజ్యావ్యవస్థను ఏర్పాటు చేసే పని మొదలుపెట్టారు.

ఆ ప్రయత్నానికి ముఖ్యకారణం ఒక విశాల సోషలిస్టు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోని దాని ద్వారా పెట్టుబడిదారి కుట్రలకు అవకాశం ఇవ్వకుండా ప్రపంచ కార్మికవర్గంలో విప్లవ ఆకాంక్షలను మొలకెత్తిస్తూ, విముక్తిని కోరుకునే జాతులకు, వలసవాద వ్యతిరేక పోరాటాలకు మద్దతునిస్తూ ప్రపంచ విప్లవాన్ని కాంక్షించడం. అయితే ఆ ప్రతి పాధనకు అన్ని రిపబ్లికన్లు అనుకూలంగా స్పందించలేదు ఎందుకంటే ఆ యూనియన్లో చేరితే తమ రాజకీయ, ఆర్థిక స్వతంత్రత, సాంస్కృతిక సంపద దెబ్బతినే పరిస్థితి వస్తుందేమో అనే అనుమానంతో. ఆ అనుమనాలను సహృదయంతో అర్థం చేసుకోవాలని, అపోహలను తొలిగించి వారికి భరోసా ఇవ్వాలని లెనిన్ గట్టిగా కోరుకున్నాడు. అంతే కాదు జాతులు స్వయం నిర్ణయాధికారం (right to self-determination) కోసం అవసరమైతే పీడించే జాతి నుండి విడిపోయే హక్కును (right to secession) కలిగివుండొచ్చు అనే సూత్రీకరణతో కమ్యునిస్టు పార్టీని నడిపించాడు.

పార్టీ నాయకత్వం ఇచ్చిన భరోసాతో చిన్న రిపబ్లికన్లు సోవియట్ రష్యాలో కలువడానికి ఒప్పుకున్నాయి. అందులో భాగంగానే 1922లో రష్యా, ఉక్రేయిన్, బెలరస్, ట్రాన్స్ కాకేసియన్ సోషలిస్టు ఫెడరేటివ్ సోవియట్ రిపబ్లిక్ (అందులో భాగమైన ఇప్పటి ఆర్మీనియ, అజెర్బైజన్, జార్జియ)తో కలుపుకోని యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ గా (USSR) ఏర్పడింది. తర్వాత కాలంలో మొత్తం రిపబ్లికన్ల సంఖ్య 15కు చేరింది, వీటితో పాటుగా అనేక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అనేక ప్రొవిన్సెస్ కూడా సోవియట్ యూనియన్ లో  భాగమయ్యాయి. రిపబ్లికన్లు యూనియన్ తో అనేక ఒప్పందాలు కుదుర్చుకోని తమ స్వయంప్రతిపత్తిని కాపాడుకోగలిగాయి. 

సోవియట్ యూనియన్ ఒక సోషలిస్టు రాజ్యాంగా ఎన్నో అధ్బుతాలు ఆవిష్కరించింది. మానవాళికి చేయదగిన మేలు ఎంతో చేసింది. తన ప్రయాణంలో రెండవ ప్రపంచ యుద్ధాన్ని, ఆ తర్వాత ప్రచ్చన్న యుద్దాన్ని ఎదురుకుంది. కాని 1980 చివరి భాగంలో గోర్బచేవ్ ప్రవేశపెట్టిన రాజకీయ, ఆర్థిక సంస్కరణల మూలంగా ఒక కమాండ్ ఎకానమీగా ఉన్నసోవియట్ యూనియన్ అతిత్వరలోనే (డిసెంబర్ 1991లో) కుప్పకూలిపోయింది. (వాస్తవానికి స్టాలిన్ మరణాంతరమే, 1953 నుండే రష్యా రివిజనిస్టు పంథాలోకి జారిపోయింది. ఆ తర్వాత కొనసాగిందల్లా “సోషల్ ఇంపీరియలిజమే” –మాటల్లో సామ్యవాదం, చేతల్లో సామ్రాజ్యవాదం). రాజకీయార్ధిక సంస్కరణల ప్రభావం ఒకవైపు, రష్యేతర భాషల, సంస్కృతుల మీద నిర్భంధం మరోవైపు సోవియట్ యూనియన్ విచ్చిన్నం కావడానికి దారులు వేశాయి.  

తాను ప్రవేశపెట్టిన సంస్కరణల మూలంగా జరుగుతున్న పెట్టుబడిదారీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 1988లోనె “టైం మాగజిన్” గోర్బచేవ్ కు “Man of the Year” అనే అవార్డ్ ప్రకటించింది. 1989లో “Man of the Decade” అనే అవార్డును ప్రకటించింది. ఇక 1990లో ఆయనకు నోబల్ శాంతి బహుమతి వచ్చింది. ఇవేవీ రాజకీయ శూన్యతలో జరగలేదు. ప్రపంచ గుత్తపెట్టుబడులకు రష్యా తలుపులు బార్లా తెరిసి మార్కెట్ శక్తులకు ప్రధాన్యత ఇచ్చి అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఎదురులేకుండా చేసిన కృషికి ఆయన పొందిన గుర్తింపు అది. మొత్తంగా సోవియట్ యూనియన్లో ఉన్న అన్ని రిపబ్లికన్లు విడిపోయి స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్నాయి. “కొత్త వ్యవస్థ జీవం పోసుకోకముందే, పాత వ్యవస్థ కుప్పకూలిపోయింది” అని విచారం వ్యక్తం చేస్తూ గోర్బచేవ్ తన అధ్యక్ష పదవికి రాజీనామచేశాడు.  

ఈ మొత్తం వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకోనే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంటున్నది ఏమంటే “ఉక్రెయిన్ అనే దేశాన్నితయారు చేసిందే రష్య. లెనిన్, స్టాలిన్లు దూరదృష్టి లేకుండ రిపబ్లికన్లకు విడిపోయే అవకాశం ఇవ్వడం మూలంగానే ఈరోజు పరిస్థితి ఇలా మారింది” అని గతాన్ని విమర్శించే పని చేస్తున్నాడు. ఇది వాస్తవానికి ఉక్రెయిన్ అస్తిత్వాన్ని మాత్రమే కాదు, సోవియట్ యూనియన్ రాజకీయ చరిత్రను కూడా రద్దుచేసే ప్రయత్నం. 

రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తుంది కాని ఆయుద్ధం ఆరెండు దేశాలకే పరిమితమయ్యింది కాదు. అందులో అమెరికా, యురోపియన్ యూనియన్, నాటో (NATO =North Atlantic Treaty Organization), రష్యా నుండి విడిపోయిన రిపబ్లికన్లు ఏదో ఒకరకంగా భాగస్వాములై ఉన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం  ముగిసిందని అమెరికా ప్రపంచాన్ని నమ్మబలికించింది కాని మొత్తం యూరప్ మీద తన పెత్తనం కొనసాగించడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేస్తూనే వుంది. ప్రతి దేశం అంతర్గత వ్యవహరాలలో ప్రత్యక్షంగానే జోక్యం చేసుకుంటుంది. తన పని చక్కపెట్టడానికి నాటోను తన జోబుసంస్థగా వాడుకుంటుంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ లేదా జెర్మనీ ఒకవేళ దాడిచేస్తే సిద్ధంగా ఉండటం కోసమని 1949లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా సారధ్యంలో మొత్తంగా పన్నెండు దేశాలతో ఒక రాజకీయ-మిలటరీ కూటమిగా ఏర్పడినాయి. నాటో చేసే మూడు ముఖ్యమైన పనులు ఏమంటే (1) తన కూటమిలోని ఏదేశం మీదైనా దాడి జరిగితే అది అన్ని దేశాల మీద దాడిగానే భావించి నాటో శక్తులు స్పంధిస్తాయి. అమెరికా మీద సెప్టెంబర్ 11 దాడి జరిగిన వెంటనే నాటో కూడా తన సైన్యాన్ని అఫ్ఘనిస్తాన్ మీదికి యుద్ధానికి పంపింది. అలాగే లిబియా మీద దాడి చేసి గడాఫీని చంపివేసింది. (2) తన సభ్యదేశాల రాజకీయ, మిలటరీ ప్రయోజనాల కోసం ఒక స్టాండింగ్ ఆర్మీని నాటో ఎప్పుడు సిద్దం చేసుకోని ఉంటుంది. ఆ సేనలను యుద్ధానికైనా, “శాంతి నిర్మాణానికైనా” ఎక్కడైనా వాడుకోవచ్చు. (3) తమ సభ్యుల మధ్య వచ్చే విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం. నాటో చేసే ఈ పనుల మూలంగానే అందులో ఎవరు సభ్యులు కావాలో, కావద్దో అనే అంశం చాలా కీలకమవుతుంది.

1991లో సోవియట్ యూనియన్ నుండి విడిపోతూ ఉక్రేయిన్, బెలరస్, రష్యా “మిన్స్క్ ఒప్పందం” (Minsk Agreement) మీద సంతకాలు చేశారు. దాని ప్రకారం సోవియట్ యూనియన్ లో  భాగమైన రిపబ్లికన్ల మీద ఎలాంటి కక్ష్య సాధింపు చర్యలు చేయరాదు, ప్రచ్చన్న యుద్దకాలంలో నాటోకు వ్యతిరేకంగా సోవియట్ యూనియన్ ఏర్పాటు చేసిన వార్సా ఒప్పందం (Warsaw Pact)లోని భాగస్వామ్య సభ్యులకు ఎవ్వరికి కూడా నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదు. వారి సరిహద్దుల్లో సైన్యాలను మొహరించకూడదు. కాని అమెరికా, నాటో ఆ ఒప్పందాన్ని లెక్కచేయకుండ 1999లో యుగోస్లోవియా మీద దాడిచేసి అదే అదునుగా అనేక వార్సాపాక్ట్ సభ్యులను తమ కూటమిలో చేర్చుకున్నారు. 1949 నుండి 1999 వరకు పదహారు సభ్యదేశాలు ఉన్న నాటో 1999-2020 మధ్యకాలంలో కొత్తగా పద్నాలుగు తూర్పుయూరప్ దేశాలకు సభ్యత్వం ఇచ్చారు. అందులో ఎక్కువగా సోవియట్ యూనియన్ నుండి విడిపోయిన దేశాలే.  

అమెరికా, రష్యాల మధ్య కొనసాగుతున్నఅధిపత్యపోరు 2013 నాటికి పతాకస్థాయికి చేరింది. అప్పటి రష్యా అనుకూల ఉక్రెయిన్ ప్రెసిడెంట్ విక్టర్ యనుకోవిచ్ ను అధికారం నుండి తొలిగించడానికి అమెరికా స్వయంగా National Endowment for Democracy, USAID ద్వారా “తిరుగుబాటుదారులకు” అన్నిరకాలుగా సహాయం చేసింది. ప్రపంచం మొత్తం అమెరికా నిఘా సంస్థ సీఐఏ గోప్యంగా చేసే పనులను, ఉక్రెయిన్లో బహిరంగగానే చేసింది.  1991 నుండి ఉక్రెయిన్లో అంతర్గత సంక్షోభాన్నితయారుచేయడానికి అమెరికా దాదాపు 5 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిందని ఒక అంచనా. ముఖ్యంగా2013 నుండి 2014 వరకు “తిరుగుబాటుదారులు” మొత్తం దేశాన్ని అల్లకల్లోలం చేశారు. వేలాదిమందిని చంపారు. వాళ్ళు బహిరంగంగా మేము నాజీ వారసులం అని ప్రకటించుకున్నారు. అలాంటి శక్తులు “మైదాన్ విప్లవం” (రాజధాని కియివ్ లో వున్న పెద్ద చతురస్రాకారంలో వుండే మైదానంలో వేలాదిగా గుమికూడి చేసిన తిరుగుబాటు) అనే చెప్పబడే దానితో విక్టర్ యనుకోవిచ్ ను 2014లో అధికారం నుండి తొలిగించి నయా-నాజీలు (నేషనల్ సోషలిస్ట్స్ ఆఫ్ ఉక్రెయిన్) అధికారం చేజిక్కించుకున్నారు.

అయితే విక్టర్ యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కేవలం అతని రష్యా అనుకూల దోరణి మాత్రమే కాదు. ప్రపంచాన్ని మర్కెట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేసే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (International Monetary Fund) నిర్ధేశించిన ప్రైవేటీకరణ పద్దతులకు, షరతులకు అతను అంగీకరించకపోవడం. ఇలాంటి పనులు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి సామ్రాజ్యవాద సంస్థలకు అలవాటయిన పనే. అది యెమన్లో అంతర్యుద్ధాన్నిపురిగొల్పడమైనా, బొలీవియాలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోల్చడమైనా. అయితే 2014లో తమ తోలుబొమ్మ ప్రభుత్వం ఉక్రెయిన్లో అధికారం చేపట్టగా నేఐఎంఎఫ్ 27 బిలియన్ల డాలర్ల లోన్ మంజూరు చేసింది. 

ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాలలో అమెరికా చేసుకుంటున్న జోక్యం తూర్పుయూరప్ లో రష్యా ప్రభావాన్ని కట్టడి చేయడం కోసమనే విషయం రష్యా పాలకవర్గాలకు అర్థమయ్యింది. అందుకే వెంటనే 2014లో తమకు వ్యాపారపరంగా, రక్షణపరంగా చాలా ముఖ్యమైన క్రైమియ అనే ఉక్రెయిన్ యొక్కఅటానమస్ ప్రాంతంపై రష్యా దాడిచేసి తనలో కలుపుకుంది. క్రైమియ తన ఆధీనంలో లేకపోతే రష్యాకు నల్లసముద్రంతో సంబంధం తెగిపోతుంది. అంతేకాదు రష్యాలో ఉన్న రెండు నావల్ బేస్ లలో ఒకటి క్రైమియలోనే వుంది. వాస్తవానికి 1954 వరకు క్రైమియ రష్యాలో భాగంగానే వుండేది కాని దానిని కృశ్చేవ్ ఉక్రెయిన్లో కలిపేశాడు. కలిసి వున్నప్పుడు సమస్యలు రాలేదు కాని, 1991లో విడిపోయినప్పుడు అది చాలా క్లిష్టమైన విషయం అయ్యింది. చివరకు ఉక్రెయిన్ దానిని అటానమస్ ప్రాంతంగా చేసి అక్కడ వున్న నావల్ బేస్ ను రష్యాకు లీజ్ ఇచ్చింది. కాని అమెరికా తోలుబొమ్మ ప్రభుత్వం ఆ లీజ్ కొనసాగించే అవకాశం లేకపోవడంతో క్రైమియ రష్యాలో కలువాలా లేక ఉక్రెయిన్లో వుండాలా అనే అంశం మీద ఒక రెఫరండం నిర్వహించారు. అక్కడ 82 శాతం పైగా రష్యన్లే వుండడం మూలంగా మెజారిటీ (92 శాతం) ప్రజల అభిప్రాయం రష్యాలో కలవాలనే వచ్చింది. కాని దానిని ఉక్రెయిన్ ఒప్పుకోలేదు. చివరికి రష్యా క్రైమియను బలవంతంగా తనలో కలుపుకుంది. 

2014 తర్వాత ఉక్రెయిన్లో ఉన్న రష్యన్ల మీద అణిచివేత ఎక్కువయ్యింది. ఉక్రెయిన్లో దాదాపు 22 శాతం మంది రష్యా జాతీయులు. వారు ఉక్రెయిన్ ప్రతీకార వేడిని చవిచూశారు. ముఖ్యంగా క్రైమియ రష్యాలో కలవగానే తూర్పు ఉక్రెయిన్లోని డాంబాస్ ప్రాంతంలో వున్నరష్యన్లు ఆప్రాంతాన్ని రెండు స్వతంత్ర రిపబ్లికన్లుగా (Donetsk, Luhansk) ప్రకటించుకున్నారు. దానితో ఆప్రాంతం యుద్ధభూమిగా మారిపోయింది.  డాంబాస్ ప్రాంతంలో గతఎనిమిది ఏండ్లలో దాదాపు 14,000 మంది రష్యన్లు చంపబడ్డారని, లక్షలాది మంది శరనార్ధి శిభిరాలలో బతుకుతున్నారని అనేక రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఈ మానవ హననం వెనుకాల అమెరికా, నాటో వుండి నయా-నాజీ ప్రభుత్వంతో చేయిస్తున్నాయని రష్యా ఆరోపణ చేస్తుంది. డాంబాస్ ప్రాంతంలో రష్యా ప్రాక్సీ యుద్ధం చేస్తుందని, తన సహకారంతోనే అక్కడి రష్యన్లు తిరగబడుతున్నారని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. అక్కడ రష్యన్లు ఉక్రెయిన్ ప్రజలను బ్రతకనివ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు.

మరి ఇప్పుడు రష్యా ఎందుకు ఉక్రెయిన్ మీద దాడి చేసింది? ఇప్పుడు ఉక్రెయిన్ నాటోలోను, యురోపియన్ యూనియన్లోను చేరేదిశగా అడుగులు వేస్తుంది. అదే జరిగితే రష్యా ఆదిపత్యానికి, బద్రతకు పెద్ద ప్రమాదమే. Minsk Agreement ప్రకారం ఉక్రెయిన్ ను చేర్చుకోమని తనకు మాట ఇవ్వాలని నాటోను కోరినప్పటికి, అక్కడి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో రష్యా తన బలాన్ని చూపించుకోవడం కోసం ఉక్రెయిన్ మీద మూడు వైపుల నుండి దాడిచేసింది. అయితే ఈ యుద్ధంలో పుతిన్ అంతిమ లక్ష్యం ఏమిటన్నది ఇంకా అస్పష్టమే. డాంబాస్ ప్రాంతంలోని రిపబ్లికన్లను విముక్తి చేస్తానని ప్రకటించి మొత్తం ఉక్రెయిన్ మీద దాడిచేశాడు. తర్వాత ఉక్రెయిన్ ను నయానాజీల నుండి విముక్తి (denazify) చేస్తానని ప్రకటించాడు. దీనర్థం ఇప్పుడు అక్కడున్న అమెరికన్ తోలుబొమ్మను తీసివేసి తన తోలుబొమ్మను పెడుతానని చెప్పడం. ఈ మొత్తం వ్యవహారంలో పుతిన్ ఒక నిరంకుశ పాలకుడని, రష్యా తన సామ్రాజ్యవాద పోకడలను వదులుకోలేదనే విషయాన్ని మరిచిపోవద్దు. అయితే మళ్ళీ తాను పాత సోవియట్ యూనియన్ను నిర్మాణం చేస్తానని ప్రకటించుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో అది పగటికలనే!

ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా పొందే లాభం ఏంటి? ఇలాంటి యుద్ధాల ద్వార యూరప్ మీద, నాటో మీద తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోగలదు. తాను ప్రపంచంలో తిరుగులేని శక్తిని అని నిరూపించుకోవచ్చు. అయితే మొత్తం యురోపియన్ దేశాలు అమెరికా వైపుగా నిలబడుతాయా అనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే యూరప్ 40 శాతం తన ఎనర్జీని రష్యా నుండే పొందుతుంది. జర్మనీ వాడే గ్యాస్ లో 32 శాతం రష్యా నుండే దిగుమతి చేసుకుంటుంది. తమ దిగుమతులను ఇంకా పెంచుకోవడానికి 11 బిలియన్ల డాలర్లతో పూర్తిచేసుకోని జర్మనీ, యురోపియన్ యూనియన్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్ననార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ న్ ప్రాజెక్ట్ ను ఈ యుద్ధం మూలంగా జర్మనీ నిలిపివేసింది. కాని పెట్రోల్, దాని అధారిత ఉత్పత్తుల ధర ఇప్పటికే ఆకాశానికి అంటుకుంటున్నాయి. కోవిడ్ దెబ్బకే చతికిలపడిన ఆర్థికవ్యవస్థలు ఈ యుద్ధభారాన్ని మోయగలుగుతాయా? ఈ యుద్ధం కొనసాగితే అది యూరపియన్ సమాజం మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం వుంది. అది యుద్ధవ్యతిరేక పోరాటాలుగా కూడా మారవచ్చు.

ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిలో 12 శాతం (మూడవస్థానం), సహజ వాయువు ఉత్పత్తిలో 17 శాతం (రెండవస్థానం) రష్యాలోనే జరుగుతుంది. కాని రష్యా మీద పెడుతున్న ఆంక్షల మూలంగా ఈ ఉత్పత్తులన్ని ప్రపంచ మార్కెట్ నుండి తీసివేయబడితే ఆ ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడుతుంది. తక్షణం ప్రభావం పడే తన యూరోపియన్ మిత్రదేశాలకు లిక్విడ్ సహజ వాయువును సరఫరా చేస్తానని అమెరికా హామీ ఇస్తుంది. ఇది కూడా తన అధిపత్య పట్టులో భాగమే, కాని అమెరికా నిలువలు కూడా యూరప్ అవసరాలను ఎక్కువ కాలం తీర్చలేవు. ఈ ప్రభావం అమెరికన్ సమాజం మీద కూడా పడుతుంది. ఇప్పటికే 7.5 శాతంకు ద్రవ్యోల్బణం (మనం నిత్యం వాడే వస్తువుల, సేవల ధరలు పెరిగే రేటు) పెరిగి అమెరికన్ నిత్యజీవితంలో ఒక సంక్షోభం పెరుగుతా వుంది. ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం యుద్ధం కొనసాగితే ఆ ద్రవ్యోల్బణం 10 శాతం పెరిగే పరిస్థితి వుందని అంచనా.

మొత్తంగా ఇది రూపంలోను, సారంలోను సామ్రాజ్యవాద ఆదిపత్య యుద్ధమే. ఈ యుద్దంలో రష్యన్, ఉక్రెయిన్ ప్రజలు తీవ్రంగానష్టపోతారు. ఆ ప్రజలకు మద్దతుగా యుద్ధవ్యతిరేక పోరాటాలు చేయడం ప్రపంచ ప్రజల ముందు, ముఖ్యంగా అభ్యుదయ, ప్రజాస్వామిక శక్తుల ముందున్న బాధ్యత.

– అశోక్

3 thoughts on “దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?

  1. U r right sir *****AMERICA police petthanam (SUPER POWER ) NEEDS TO GO
    ———————————————————————————————
    BUCHIREDDY gangula

    1. మా సత్యం
      28ఫిబ్రవరి 2022
      వసంత మేఘంలో
      అశోక్ గారు
      ‘దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?’వ్యాసంలో
      హిస్టారికల్ ఫాక్ట్స్ లోతో పాటు Minsk Agreement ను బహుముఖ కోణాలలో విశ్లేషిస్తూ వివరించారు.
      ఉద్యమాభి వందనాలు.✊

  2. మా సత్యం
    28ఫిబ్రవరి 2022
    వసంత మేఘంలో
    అశోక్ గారు
    ‘దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?’వ్యాసంలో
    హిస్టారికల్ ఫాక్ట్స్ లోతో పాటు Minsk Agreement ను బహుముఖ కోణాలలో విశ్లేషిస్తూ వివరించారు.
    ఉద్యమాభి వందనాలు.✊

Leave a Reply