రాజేంద్రబాబు అర్విణి

అది అక్టోబర్‌ 6 2021. రాంమోహన్‌ కు రోజూ 6, 7 కిలోమీటర్లకు తక్కువకాకుండా మార్నింగ్‌ వాక్‌ చేసే అలవాటు. వనస్థలిపురం లో పార్కులు, రోడ్లు అన్నీ కలగలిపి తిరిగేవాడు. ఆ రోజు కూడా మార్నింగ్‌ వాక్‌ లో భాగంగా దాదాపు 6 కిలోమీటర్ల నడక పూర్తి చేసాడు. ఎప్పటి లాగా దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. అనారోగ్య లక్షణాలు చూచాయగా కూడా ఏమీ లేవు. ఆ రోజు… ఆ క్షణాలు… ఆ కాలం అలాగే ఘనీభవించి పోయి ఉంటే ఎంత బాగుండేది!

ఆ తర్వాత మూడవ రోజు… అది అక్టోబర్‌ 9 – ఆ నాడు పాలమూరు అధ్యయన వేదిక హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో ‘కృష్ణా నదీ జలాల   పునఃపంపిణి’ అన్న అంశం పై విస్తృత స్థాయిలో రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. రామ్మోహన్‌ పాలమూరు అధ్యయన వేదిక లో ముఖ్య కార్యకర్త. ప్రతి సమావేశం లో ఆయన హాజరు తప్పనిసరి. హాజరవడం మాత్రమే కాదు, నిర్వహణా బాధ్యతల్లో కూడా భాగం పంచుకొనే వాడు. హైదరాబాద్‌ లో జరిగిన ఏ సమావేశమయినా ఆయన మిస్సయింది లేదు. ఆ రోజు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ కు రావలిసిన రాంమోహన్‌ హైద్రాబాద్‌ పొలిమేరల్లో ఉన్న ఓ ఆసుపత్రి కెళ్లవలసి వచ్చింది. అక్కడ ఆయనకు శస్త్రచికిత్స చేసి కడుపు లో కాన్సర్‌ కణాన్ని తొలగించారు. చాల అపాయకారమయిన ఆపరేషన్‌. అయినా మా కెవరికీ చెప్పొద్దని తన పిల్లలకు స్ట్రిక్ట్‌ గా చెప్పాడు రాంమోహన్‌. ‘‘వాళ్ళు మంచి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. అదీ కృష్ణ నదీ జలాల గురించి. ఈ విషయం తెలిస్తే వారు డిస్టర్బ్‌ అవుతారు. మీటింగ్‌ నిర్వహణ పై ఏకాగ్రత తగ్గుతుంది. ఇప్పుడే ఎవరికీ చెప్పొద్దు’’. అదీ రాంమోహన్‌ ఆలోచనా ధోరణి. తనకేమయినా పర్వాలేదు, కానీ తన వల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ కలగ కూడదు. ఏ పనీ ఆగకూడదు.

రాంమోహన్‌ తో నా అనుబంధం ఏభయ్యేళ్ళ నాటిది. అవి 1969 తెలంగాణా ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులు. నేను జడ్చర్ల కాలేజీ లో స్టూడెంట్‌ ను. నా రోజువారీ కార్యక్రమం ఉదయమే ఇంట్లో తయారయ్యి, పాత బస్‌ స్టాండ్‌ దగ్గరో, గంజ్‌ దగ్గరో, మార్కెట్‌ కమీటీ ఆఫీసు దగ్గరో విద్యార్థుల మంతా చేరి ర్యాలీ తీసి ఊరంతా తిరిగే వాళ్ళం. గంటా రెండు గంటలు మమ్మల్ని అలా తిరగనిచ్చి, తర్వాత వ్యాన్‌ లలో కుక్కి పోలీసులు మమ్మల్ని ఉరి పొలిమేరల్లో వదిలేసే వారు. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇంట్లో భోంచేసి సాయంత్రం రైల్లో ‘జై తెలంగాణా’ నినాదాలిచ్చి మహబూబ్‌ నగర్‌ వెళ్లే వాళ్ళం. మహబూబ్‌ నగర్‌ ప్రక్క స్టేషనే! జిల్లా కేంద్రం. మహబూబ్‌ నగర్‌ లో విద్యార్ధి నాయకులను కలిసి ఉద్యమ వార్తలు తెలుసుకోవడమో, మీటింగ్‌ లకు హాజరవడమో చేసి మళ్ళీ రాత్రి 8 గంటలకు వచ్చే రైల్లో తిరుగు ప్రయాణం. అలాంటి ఓ రోజు అప్పటి ఉద్యమ నాయకుడు మల్లికార్జున్‌ మహబూబ్‌నగర్‌ వచ్చాడు. మీటింగ్‌ జరుగుతూ ఉంది. ఆవేశాలు మిన్నంటుతూ ఉన్నాయి. స్టేజి పైనుండి ఓ టి పి ఎఫ్‌ (తెలంగాణా ప్రజా సమితి) నాయకుడు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ని బూతు మాటలతో విమర్శించాడు. అంతే…సభలో కలకలం రేగింది. ఆగ్రహం తో ఓ యువకుడు స్టేజి వైపు దూసుకు వస్తున్నాడు. సన్నగా, బక్కగా    ఉన్నాడు. ఆయన కళ్ళద్దాలలోంచి కళ్ళు మెరిసిపోతున్నాయి. మొహం వర్చస్సు తో వెలుగుతోంది. ఆయనలో ధర్మాగ్రహం వెల్లివిరుస్తున్నది. ఆయనతో ఉన్న వాళ్ళు ఆయన్ను అనునయంతో ఆపుతున్నారు. ఎవరాయన అని ప్రక్కనున్న వారినడిగాను. ‘‘ఆయన పేరు రాంమోహన్‌. ఆయన ఒక టీచర్‌. తెలంగాణా వాది. కానీ స్త్రీ లను కించ పరిస్తే, మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడితే సహించలేడు.’’ అని చెప్పారు. అప్పటికే చలం, శ్రీశ్రీ, వివి ల ప్రభావం తో  భావావేశంలో  ఉన్న నేను ఆయన ఆగ్రహావేశానికి సమ్మోహితుడనయి, కొంత సద్దు మణిగాక వెళ్లి పరిచయం చేసుకున్నాను. అప్పుడు అలా కలిసిన స్నేహంలో రోజులు, సంవత్సరాలు కరిగిపోయాయి.  

               ఎంత ఫలప్రదమయిన స్నేహితం మనది రాంమోహన్‌! ఓ దశాబ్దకాలం పాటు మనం మహబూబ్‌నగర్‌ చరిత్ర నిర్మాణానికి ఎంతో కొంత మన పరిధుల్లో మనం తోడ్పడ్డాము కదా! అవన్నీ ఎంత స్ఫూర్తి వంతమయిన జ్ఞాపకాలు! జలజం సత్యనారాయణ, నువ్వు, నేను కలిసి ఏర్పాటు చేసిన ‘న్యూ థింకర్స్‌ ఫోరమ్‌’ ను ఆలోచనా స్ఫోరకమయిన ఉపన్యాసాల వేదికగా రూపు దిద్దాము. నార్ల వేంకటేశ్వరరావు, కన్నబిరాన్‌, బాలగోపాల్‌, స్వామి అగ్నివేశ్‌, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి ఆ తరాన్ని ప్రభావితం చేసిన ఎంతో మంది ప్రముఖుల సందేశాలను విద్యార్థులకు, యువతరానికి చేరవేసే ప్రయత్నం చేసాము కదా!  జూరాల ప్రాజెక్ట్‌ కు ఆనాటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య శంకుస్థాపన జరిపిన సందర్భం లో కృష్ణా నదీ జలాల కేటాయింపుల గురించి జిల్లా పరిషత్‌ హాల్‌ లో న్యూ థింకర్స్‌ ఫోరమ్‌ తరఫున మనం ఓ  చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, బచావత్‌ ట్రిబ్యునల్‌ ముందు మన జిల్లా గోడు వినిపించాడు కదా అన్న భావన తో ముఖ్య అతిథిగా పాగ పుల్లారెడ్డి ని పిలిపిస్తే, ‘నీళ్లు పైకెట్లా ఎక్కుతాయి, మనది ఎత్తున ఉండే ప్రాంతం. వున్న నీళ్లతోనే సర్దుకోవాలి’ అని ఆయన లెక్చరిచ్చినప్పుడు మనం ఎంత రభస చేసామో, ఎంత నిరాశ కు గురయ్యామో గుర్తుందా రామ్మోహన్‌! ‘‘ఈ మహబూబ్‌ నగర్‌ టౌన్‌ హాల్‌ కు న్యూ థింకర్స్‌ ఫోరమ్‌ మీటింగ్స్‌ వల్లే సార్థకత చేకూరింది’’ అని ఓ మితృడు (డిగ్రీ కాలేజీ లో క్లర్క్‌ గా పని చేస్తూ ఉండిన వెంకటయ్య గౌడ్‌ అని గుర్తు) కామెంట్‌ చేసాడంటే ఆ ఫోరమ్‌ ఎంత ప్రతిభావంతంగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. న్యూ థింకర్స్‌ ఫోరమ్‌ పేరు గుర్తుకు వస్తే చాలు ఇలా ఎన్నో జ్ఞాపకాల కవాటాలు తెరుచుకుంటాయి. నీతో ఎన్నో సంగతులు నెమరు వేసుకోవాలి. అన్నింటికీ ఈ స్థలం సరిపోతుందా?

లెక్చరర్‌ రాజగోపాల్‌ గౌడ్‌ ప్రారంభం చేసిన ‘క్లాసికల్‌ ఫిలిం సొసైటీ’ లో మనమూ పాత్ర వహించి సమాజంలో అభ్యుదయ భావాలు పెంపొందడానికి ఉపకరించే ఎన్నో సృజనాత్మక కళాఖండాలను పాలమూరు ప్రేక్షకులు వీక్షించేలా మనం ప్రయత్నించాము. నీకు గుర్తుందా! ‘మా భూమి’ సినిమా విజయవంతంగా నడుస్తున్న సందర్భంలో దర్శకుడు బి. నర్సింగ్‌ రావు, గద్దర్‌, సినీ నటుడు సాయిచంద్‌, ఇంకా ఆ సినిమా బృందం మొత్తాన్ని మహబూబ్‌నగర్‌ పిలిపించి కళ గురించి విలక్షణమయిన గోష్టి నిర్వహించాము. ఆ గోష్టి లో నీవు చాలా బాగా మాట్లాడావు. అసలు నీ వక్తృత్వపు కళ గురించి ఎంత చెప్పినా తక్కువే. సభికులను సమ్మోహితులను చేసే వాగ్ధాటి నీది. శ్రీశ్రీ కవిత్వమో శివసాగర్‌ పాటనో వింటూ వుంటే ఏ అనుభూతి కలుగుతుందో నీ ఉపన్యాసం కూడా అదే అనుభూతిని కలగజేస్తుంది.

విరసం ప్రతి సంవత్సరం నిర్వహించే సాహిత్య పాఠశాలలన్నిటి లోకి 1985 లో మనమంతా పూనుకొని గద్వాల లో నిర్వహించిన సాహిత్య పాఠశాలకో విశిష్ఠత ఉంది. అది సాహిత్యానికుండే దిశ ను నిర్వచించిన పాఠశాల. ఆ సాహిత్య పాఠశాలలో నీవు సమర్పించిన పరిశోధనా పత్రం వల్ల దానికా విశిష్టత చేకూరింది. సాహిత్య పాఠశాలల్లో సాహిత్య ధోరణులు, దృక్పథాల గురించి చర్చిండం మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కు సంబంధించి సాహిత్య శోధన జరగాలి అన్న చూపుతో నిర్వహించబడ్డ పాఠశాల అది. ఆనాడు మహబూబ్‌నగర్‌ జిల్లా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వలసలు. కడుపేదరికంలో జీవిస్తున్న లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు పొట్ట చేతబట్టుకొని లేబర్‌ రూపంలో దేశం లోని పలు ప్రాంతాలకు వలస పోవడం ఆనాడు గ్రామాలలో కనిపించే సాధారణ దృశ్యం. పాలమూరు లేబర్‌ సమస్య మూలాలు శోధించి, వాళ్ళ జీవితాలలోంచి పెల్లుబికిన బాధల గాధలను సాహిత్య సింహావలోకనం చేసిన నీ పరిశోధనా పత్రం చరిత్రాత్మకం. పాలమూరు లో మళ్ళీ 2018 లో నిర్వహించిన 26 వ విరసం సాహిత్య పాఠశాలలో నీవు ఆహ్వాన సంఘం లో ఉండి నిర్వహణ కు ఎంతగానో తోడ్పడ్డావు.

ఆ కాలంలో ఎంత చురుగ్గా ఉండేవాళ్ళం. జిల్లాలో అభ్యుదయ రంగంలో ఏ పరిణామం సంభవించినా నీవు, నేను అలర్ట్‌ అయ్యే వాళ్ళం. వివిధ ప్రాంతాలనుంచి యాదగిరి గుండోజు సారు, అంపయ్య, హిమజ్వాల సాయంత్రానికల్లా మహబూబ్‌ నగర్‌ చేరుకునే వారు. విషయాన్ని అన్ని కోణాల నుంచి చర్చించే వాళ్ళం. కిరణ్‌ (సుదర్శన్‌ రెడ్డి), సిసి,డాక్టర్‌ వేణు  (బహుశా రిటైర్‌ అయివుంటాడు), అమరచింత రామచంద్ర రెడ్డి, సాయిరెడ్డి – ఇలా ఎన్ని పేర్లని చెప్పను. అందరినీ సంప్రదించే వాళ్ళం. ఉదాహరణగా నీకు ఓ సంగతి చెప్తాను. అప్పుడు అబ్దుల్‌ ఖాదర్‌ బస్‌ సర్వీసెస్‌ అని ప్రయివేట్‌ రంగంలో రవాణా సంస్థ ఒకటి ఉండేది కదా! ఆ సంస్థలో కార్మికులకు, యాజమాన్యానికి వేతనాల పెంపు విషయంలో ఘర్షణ ఏర్పడిరది. ఉద్యమంలో ఉన్న కార్మికులకు మనం మన వంతు సహకారం అందించాము. కార్మికుల, ఉద్యోగుల వైపు నుండి చాంద్‌పాషా, మొల్గర హనుమంత రెడ్డి నాయకత్వం వహించారు. ఆ పోరాటం తర్వాత వారిద్దరూ మనం చేపట్టిన ప్రతి కార్యక్రమం లో భాగస్వామ్యులయ్యారు. ఆ సందర్బంగా ‘‘ఖబర్దార్‌ అబ్దుల్‌ ఖాదర్‌ …’’ అని  హెచ్చరికతో నేను వ్రాసిన కరపత్రం కార్మికులను సమీకరించడంలో బాగా పని చేసిందన్న నీ ప్రశంసా వాక్యాలు నాకింకా గుర్తున్నాయి. మధ్యతరగతి వర్గంలో ఆనాటి కదలికల సంగతి ప్రస్తావనకువస్తే నాకు ఎ పి టి ఎఫ్‌ గుర్తుకు వస్తున్నది. అప్పటికింకా డి టి ఎఫ్‌ ఏర్పడలేదు. ఎ పి టి ఎఫ్‌ ను తెలంగాణా కు విస్తరింపజేయాలని ఆ సంస్థ కార్యవర్గం నిర్ణయం తీసుకున్నది. నీ వేమో రాష్ట్రోపాధ్యాయ సంఘం లో ఉన్నావు. నీవు, నేను, రాఘవాచారి, అంపయ్య, వెంకటేష్‌ (ఉదయ్‌), ఇక్బల్‌ ఇంకా కొంతమంది మిత్రులం కలిసి ‘ఉపాధ్యాయులు ఎ పి టి ఎఫ్‌ సంస్థను బలపరచాలని, పటిష్టం చెయ్యాలని’ పిలుపు నిస్తూ నా పేరు మీద ఓ కరపత్రం వేయాలని నిర్ణయించాం. నీకు ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు శ్యామసుందర్‌రావు (ఎం ఎల్‌ సి), సుజీవన్‌ రావు గారల తో ఉన్న అనుబంధం దృష్ట్యా  ఎ పి టి ఎఫ్‌ లో పని చెయ్యడానికి ముందు మానసికంగా ఘర్షణకు గురి అయ్యావు. చివరికి నీ సిద్ధాంత బలము, కమిట్మెంట్‌ నెగ్గాయి. ఆ తదుపరి,  ఎ పి టి ఎఫ్‌ సంస్థ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలు, సెమినార్‌ లలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విద్యా సంబంధమయిన అనేక సమావేశాలలో ఉసన్యసించావు.

మహా కవి శ్రీశ్రీ కి పాలమూరు జిల్లా అంటే ప్రత్యేకమయిన అభిమానం ఉండిరది. ప్రజావైద్యుడు డా: బాలకిష్టయ్య శ్రీశ్రీ ని వనపర్తి కి రెండు సార్లు, కొల్లాపూర్‌ కు ఒకసారి ఆహ్వానించాడు. బాలకిష్టయ్య గారు మనల్నందరినీ అభిమానించే వాడు, కానీ నీ వంటే ఓ ప్రత్యేకమయిన ఇష్టము, గౌరవము ఉండేది. శ్రీ శ్రీ అప్పుల్లో మునిగి ఇల్లు తాకట్టు లో ఉన్నప్పుడు డా: బాలకిష్టయ్య గారి నేతృత్వం లో పాలమూరు జిల్లా యే ఆయనకు అండగా నిలబడిరది. శ్రీశ్రీ ని ఆర్థికంగా ఆదుకోవాలని డాక్టర్‌ గారు నిర్ణయించినప్పుడు అందులో మనం కూడా మన వంతు బాధ్యత గా మహబూబ్‌ నగర్‌ లో, ఇతర చోట్ల, నీవు, నేను, శ్రీహరి స్కూళ్ళు, కాలేజీలు తిరిగి డబ్బు సేకరించాము గుర్తుందా! భారత చైనా మిత్ర మండలి సమావేశాలకు కొత్తకోట బస్‌ స్టాండ్‌ నుండి కొల్లాపూర్‌ దాకా శ్రీశ్రీ ని జీపు లో  నేను సుదర్శన్‌ తోడ్కొని వచ్చాము. నువ్వు, బలరాం, కిట్టు డాక్టర్‌ గారికి తోడుగా ఉండి మీటింగ్‌ ఏర్పాట్లు చూసారు. కిట్టు అద్భుతమయిన పాటలు, చైనా విప్లవం గురించి నీ  ఇంట్ర‌డ‌క్ట‌రీ స్పీచ్ కొల్లాపూర్‌ సమావేశాన్ని మరిచిపోనివ్వవు. ‘‘విప్లవం  యాడుందిరా, ఆడనే నీ కూడుంది రా, ఆడనే నీ గూడుంది రా’’ అన్న శ్రీ శ్రీ కవిత అప్పటికి కొత్త కవిత. అంతవరకూ  ఏ పత్రిక లో రాలేదు, ఏ మీటింగ్‌ లోను ఆయన చదవ లేదు. మొట్టమొదటి సారి మన కొల్లాపూర్‌ సమావేశాల్లోనే ఆ కవితను వినిపించారు. ఆర్‌ ఎస్‌ యు ప్రథమ జిల్లా మహాసభలకు చెరబండరాజు ను ముఖ్య అతిథి గా పిలిచాం. నువ్వేమో పి డి ఎస్‌ యు సానుభూతి పరుడివి. అయినా చెరబండరాజు కోసం సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షించావు. అమరుడయిన చెరబండరాజు స్మృతిలో గద్వాల లో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు అక్కడి విద్యార్థులు, యువత. ఆ సమావేశానికి మహబూబ్‌ నగర్‌ నుండి నువ్వు, నేను, రాఘవాచారి వెళ్ళాము. ఆ సభ లో నువ్వు గాద్గదిక స్వరం తో ఉపన్యసించావు. సభికుల కళ్ళల్లో కూడా నీళ్లు తెప్పించావు. చెరబండరాజు పాట పాడుతూ రాఘవాచారి స్పృహతప్పి పడిపోయాడు. ఆ సన్నివేశం గురించి రాస్తూ ఉంటే నా కళ్ళల్లో కూడా నీళ్లు ఆగడం లేదు. ఇలా ఎన్ని సంఘటనలని చెప్పను! ఆ కాలం లో నేను వెలువరించిన ‘మార్పు’, ‘తీర్పు’ బులెటిన్‌లో కూడా ‘సామాన్యుడు’ పేరుతో కొన్ని రచనలు చేశావు. నీ సహకారం, హిమజ్వాల సహకారం ఎప్పుడూ ఉండేది. అవి అలాగే కొనసాగి, పత్రికల రూపం లో వచ్చింటే బాగుండేది అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. విప్లవ రాజకీయాలలో నీకొక  firm commitment   ఉండేది. విప్లవ రచయితల సంఘం లో ఒకప్పుడు కార్యవర్గ సభ్యుడుగా విధాన నిర్ణయాలలో భాగస్వామ్యం వహించావు కూడా. కానీ, నీ కమిట్మెంట్‌ కు, నీ మేధస్సు కు, నీ అధ్యయనానికి అగ్రశ్రేణి నాయకుడివి కావలిసిన వాడివి. విప్లవ పార్టీలో చీలికలు, కుల ప్రస్తావనలు నిన్ను విచలితుణ్ణి చేశాయి. దానికి తోడు నీ సహచరి, నీ తోడూ నీడా భారతమ్మ అనారోగ్యం తో నీవు బాగా క్రుంగి పోయావు.

భారతమ్మ అంటే నీలో సగం. ఓర్పు, సహనం, శాంతి మూర్తీభవించిన స్త్రీమూర్తి. అంత సంయమన శక్తి, సంస్కారం ఎలా అలవడ్డాయామెకు. నీనుండి ఆమె నేర్చుకుందా లేక నీవే ఆమె నుండి నేర్చుకున్నావా? భారతమ్మను నీ గుండెల్లో దాచుకొని కాపాడుకొన్నావు కదా! చివరికి ఈ కర్కశ కాన్సర్‌ కు తానూ బలి అయిపొయింది. ఆ ఏడేళ్లు … తాను కాన్సర్‌ తో కొట్టుమిట్టాడిన ఆ ఏడేళ్లు .. తన బాధను నీ బాధగా నీ పళ్ళను బిగపట్టి భరించావు. ఇన్నినాళ్ళు ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన కోసం నీ మదిలో జ్ఞాపకాల గుడి కట్టుకొని అందులోనే జీవించావు. నీది ఆమె పట్ల బాధ్యత తో కూడిన ప్రేమ.

ఉక్రెయిన్‌ సమస్య ఏమవుతుంది రాంమోహన్‌? 1991  లో సోవియట్‌ విచ్ఛినం కావడం చట్టవిరుద్ధం, అనైతికం అంటున్నాడు పుతిన్‌. నీ విశ్లేషణలు ఎన్ని మిస్సవుతున్నాను. రోజు రోజూ ఎన్ని సంగతులు చెప్పేవాడివి. సుధాకిరణ్‌ వ్యాసాల గురించి, విమల కవిత్వం గురించి. మేం వనస్థలిపురానికి మకాం మారినప్పటినుండి మహబూబ్‌నగర్‌ లో ముత్యాల ప్రకాష్‌ బుక్‌ స్టాల్‌ లో వాడి వేడి చర్చలతో గడిపిన ఎన్నో సాయంత్రాలు గుర్తుకువచ్చాయి. సాయంత్రం కాగానే క్లాక్‌టవర్‌ దగ్గర ప్రకాష్‌ బుక్‌షాప్‌ దగ్గరకు చేరుకునే వాళ్ళం. అప్పుడప్పుడే నల్ల కోటు తొడుక్కుంటున్న ఇప్పటి సీనియర్‌ వకీల్‌ జి.వేణుగోపాల్‌, కొత్తగా ఉద్యోగాల్లోకి ప్రవేశించిన నేను, శ్రీహరి (కమర్షియల్‌ టాక్స్‌), సి పి యం జిల్లా బాధ్యుడు బాలకిష్టయ్య గౌడ్‌, అసలయిన కార్మిక వర్గ చైతన్యం తో అలరారిన ఎలెక్ట్రీషియన్‌ గుండు యాదగిరి, ఆర్టీసీ ఉద్యోగి ఎల్లయ్య, కాంట్రాక్ట్‌ రంగం లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సుధాకర్‌ రెడ్డి, బాంక్‌ ఉద్యోగి నారాయణ గౌడ్‌, మనం ప్రేమ గా ‘చిచ్చా’ అని పిలుచుకున్న సత్తూరి రాములు గౌడ్‌, తర్వాత పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ అయి రిటైర్‌ అయిన సత్యనారాయణ, పద్మనాభ గౌడ్‌, ఇంకా అప్పుడప్పుడు వచ్చి పోయే మిత్రులు అందరం సాయంత్రానికి అక్కడ గుమిగూడే వాళ్ళం. ఆ సమూహం లో ఎంత భిన్నత్వం ఉండేది! ఆనాటి పాలమూరు సమాజంలోని మెజారిటీ వర్గాలకు మన సమూహం లో ప్రాతినిధ్యం ఉన్నట్టుగా ఉండేది. అందరికీ నీవంటే గౌరవంతో కూడిన అభిమానం. జిల్లా రాజకీయాలనుండి, అంతర్జాతీయ పరిణామాల వరకు మాట్లాడుకునే వాళ్ళం. నీవు హాస్యపూరిత రాజకీయ విశ్లేషణతో అందరినీ అలరించేవాడివి. నీ పదునైన చురకలతో అందరినీ ఆహ్లాదపరిచే వాడివి. ఆ తర్వాత మన మీటింగ్‌ ప్లేస్‌ న్యూ టవున్‌ రాజేంద్రనగర్‌ లోని మా ఇంటికి మారింది. మహబూబ్‌నగర్‌ లో బ్రాహ్మణవాడి నుండి రాజేంద్రనగర్‌ దాకా రోజూ నీవు నడిచి వచ్చే సాయంత్రాలు పదునైనవిగా ఉండేవి. భావ ఐక్యత ఉన్నవాళ్ళం చాలా మందిమి కలిసే వాళ్ళం. జర్నలిస్ట్‌ లు రఘురామ్‌ (ఆంధ్రప్రభ), పరుశురాం (ఆంధ్రజ్యోతి), పురుషోత్తం (ఈనాడు) మనతో కలవక పోయినా, మన కలయిక పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచేవారు.

నీకు గుర్తుందా రాంమోహన్‌, ఓసారి ఓ నలుగురం కలిసి ధరల పెరుగుదల కు నిరసనగా ఒకరోజు నిరాహార దీక్ష చేసాము – నీవు, నేను, సిపిఎం బాలకిష్టయ్య గౌడ్‌, టీచర్‌ లక్ష్మారెడ్డి ‘పోలీసులు వచ్చి మీ వెనక ఏ ఆర్గనైజేషన్‌ ఉంది? ఏ సంస్థ లేకుండా మీరు ఎట్లా కలిశారు?’’ అని అడిగితే ‘‘మేము వినియోగదారులం. ఇంటికి కావలిసిన సామాన్లు కొందామని బజారుకు వెళితే, అక్కడ దుకాణం దగ్గర అందరమూ కలిసాము. మాటల్లో ఈ పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఏదయినా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమయింది. ఈ విషయం లో ఏ రాజకీయ పార్టీ ఏమీ చెయ్యట్లేదు. మనమే ఏదయినా చేద్దాము అని నిరాహార దీక్షకు కూచున్నాము’’ అని చెప్పాము. ఏ మనుకున్నారో ఏమో పోలీసులు పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఇంకో సంగతి నాకు గుర్తుకు వస్తుంది – పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలన్న ఉద్దేశ్యం తో నువ్వు, నేను, శ్రీహరి, సుదర్శన్‌, ఇంకా కొంతమంది మిత్రులం కలిసి నెల నెలా చందాలు వేసుకొని అడ్వొకేట్‌ వేణుగోపాల్‌ ప్రిన్సిపాల్‌ గా ‘‘ప్రగతి స్కూల్‌’’ ప్రారంభించాం. మొదట సాయంత్రం క్లాసులు నడిచేవి. కొంత కాలానికి రెగ్యులర్‌ స్కూల్‌ అయ్యింది. ఆదివారాలు మీటింగులు పెట్టుకునే వాళ్ళం. అప్పుడు హరగోపాల్‌ సారు వరంగల్‌లో లెక్చరర్‌ గా పనిచేస్తుండే వారు. విద్యావిషయకంగా అమెరికా వెళ్లి వచ్చారు. అమెరికా లో విద్యా విధానం గురించి ప్రగతి స్కూల్‌ లోనే సారు ఉపన్యాసం ఏర్పాటు చేసాం. మరోసారి న్యూ థింకర్స్‌ ఫోరమ్‌ తరఫున ఏర్పాటు చేసిన సమావేశం లో ‘సమాజం పై సినిమాల ప్రభావం’ అన్న అంశం పై హరగోపాల్‌ సారు అద్భుతమయిన  ఉపన్యాసం ఇచ్చారు. నేను హైదరాబాదు రాజేంద్రనగర్‌ జూనియర్‌ కాలేజీ కి బదిలీ పై, నీవు మెదక్‌ కు పదోన్నతి పై వెళ్లిన తర్వాత మన మహబూబ్‌ నగర్‌ మజిలీ ముగిసింది.

చివరగా ఓ విషయం చెప్పనా! 1983 లో నేను, నాగమణి సాంఘిక వివాహం చేసుకున్నప్పుడు నీవు, జలజం సత్యనారాయణ – మీ ఇద్దరే కదా సభా కార్యక్రమాలు నిర్వహించింది. ఎన్నో కుటుంబాలు నిన్ను ఆప్తునిగా భావించాయి. అందులో మా కుటుంబం ఒకటి. మనిద్దరి మధ్య ఎంత స్నేహం ఉందో, నీకు నాగమణి కి అంత స్నేహం ఉంది. అంత ఆప్యాయత ఉంది. నా అన్నయ్యలు, తమ్ముడు, వారి జీవిత  సహచరి లు, మా అమ్మాయిలు స్వప్న, స్వేచ్ఛలు నిన్ను ఎంతగానో అభిమానిస్తారు. అందరినీ ప్రేమిస్తావు, గౌరవిస్తావు, తప్పులేమయినా ఉంటేె సున్నితంగా హాస్యపూరితంగా ఎత్తి చూపుతావు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీవు ఆచరణలో చూపిస్తావు. నీ వ్యక్తిత్వం నుంచి ఈ సమాజం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సమాజం మన్ననలు పొందావు.  ఎందరివో ఆదరాభిమానాలు సంపాదించుకొన్నావు. హరి, సృజన్‌, శ్రీకాంత్‌ లు నీ లాగే సౌమ్యులు, సంస్కారవంతులు. మీ అమ్మను, నాన్నను వారి వారి చివరి క్షణాల వరకు గుండెల నిండా ప్రేమను నింపుకొని నీవు చూసుకున్న తీరు, ఉమ్మడి కుటుంబానికి పెద్దలుగా నీవు, భారతమ్మ నిర్వహించిన బాధ్యతలు చాలా మందికి ఆదర్శం.  మీ అక్కయ్య- మా అందరి అక్కయ్య – వీణమ్మ ను గురించి ప్రస్తావించకుండా ఉండలేక పోతున్నాను. ప్రపంచాన్ని ఆమె పూర్తిగా అర్థం చేసుకోవడానికి ముందే ఆమె కు ముగ్గురు పిల్లలు. కాలం ఆమె ను కాటేసింది. మీ తమ్ముళ్లతో పాటే ఆమె, ఆమె పిల్లలు అనుకున్నావు. చదువుకునే అవకాశం కల్పించావు. తన కాళ్ళ మీద తాను నిలువ గలిగే మార్గాలు అన్వేషించావు. ఆమె ధీమంతమయిన వ్యక్తిత్వం అలవరచుకోవాటినికి నీ వైపు నుండి అన్ని అవకాశాలు కల్పించావు. ఇందులో ఆమె ప్రయత్నమూ, ఆమె కృషి ఉంది. అయినా నీ మద్దతు, నీ మార్గదర్శకత్వం లేకుండా ఉండిఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహకు కూడా అందని విషయం. మీ ఇంకో అక్కయ్య – చంద్రమ్మ. పితృస్వామ్య వ్యవస్థ విషపు కోరలకు బలి అయిపోయిన స్త్రీ. గురజాడ ‘పుత్తడి బొమ్మా, పూర్ణమ్మా’ గేయం చదుతున్నప్పుడు, శివసాగర్‌ వ్రాసిన ‘చెల్లీ చంద్రమ్మ’ పాట వింటున్నప్పుడు నీ కళ్ళల్లో నీటి బిందువులతో పాటు మీ అక్కయ్య ‘చంద్ర’ రూపం కదలాడేది. నీకు ప్రపంచ జ్ఞానం తెలిసిన తర్వాత మీ కుటుంబం లో జరిగిన ఆ విషాద సంఘటన నీ భవిష్యత్‌ జీవితాన్ని, నీ ఆలోచనా క్రమాన్ని ప్రభావితం చేసిందని నా అంచనా. కదా రాంమోహన్‌!

ఈ ప్రపంచం లో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాలు చాలా వాటిల్లో మనం కలిసి నడిచాము. ఎంతగా అంటే మహబూబ్‌నగర్‌ లో విద్యార్థులు, సాంఘిక కార్యక్రమాలలో అభిరుచి, అభినివేశం ఉన్నవాళ్లు మనిద్దరిని RR (రాంమోహన్‌, రాజేంద్ర బాబు) అని పిలిచేవారట నీకు తెలుసా? ఆ తర్వాత మరో R ఒక ప్రభంజనం లాగా మనతో కలిసి RRR అయ్యాము (రాంమోహన్‌, రాజేంద్ర బాబు, రాఘవాచారి).

ఉపసంహారం : రాంమోహన్‌ స్వరం లో సృజనాత్మకత ఉంది. ఆయన మెదడులో అపారమయిన సమాచారం ఉంది.సమాజంలో జరిగే సంఘటనల పూర్వాపరాలను అన్వేషించి శాస్త్రీయ విశ్లేషణ చేసే శక్తి ఉంది. రామ్మోహన్‌ మాటలలో జీవం ఉంది, చేతల్లో జీవం ఉంది. రామ్మోహన్‌ లోని మనిషితనం ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. మానవ సంబంధాలను సజీవంగా ఉంచడం లో రాంమోహన్‌ కు రాంమోహన్‌ యే సాటి అన్నది మన స్నేహానుభవం తేల్చి చెప్పిన సత్యం.

(త్వ‌ర‌లో విడుద‌ల కానున్న *మాన‌వ‌తా ప‌తాక సి. రామ్మోహ‌న్‌* పుస్త‌కం నుంచి)

Leave a Reply