తాము కాలిపోతూ
వెలుతురిస్తాయి దీపాలు
సమస్త చీకటి విషాలను మ్రింగి
కాంతినిస్తాయి మిణుగుర్లు
మన గాయాల్ని వాళ్ళ దేహాల్లో నింపుకొని
మందు కనుగొంటారు శస్త్రచికిత్సా కారులు
వెలివేతలను తలరాతలుగా వ్రాయించుకొని
మైలపేరుతో మూలపడి
మూతులకు కుండలు కట్టించుకునే
బడుగుబతుకుల్లో ఆత్మగౌరవాన్ని తట్టి లేపుతారు
జ్ఞానవంతులు
కార్మీక కర్షక జనావళి
ఊపిరికి ప్రాణం ఉందని
రుజువుచేసి
సంఘటితస్పర్శ ఎంత శక్తివంతమైందో తెలియజేసి
నడవడానికో పోరుబాటని సిధ్ధం చేస్తారు
నాయకులు
వాళ్ళ
పాదాల్రాసిన కఠిన కాల చరిత్ర పుటలపై
తలలెత్తుకొని నిలబడబానికి ప్రయత్నిస్తాయి
గడ్డిపోచలు
గడ్డిపోచల నుదుర్లను ముద్దాడుతుంది
వసంతం
వసంతాన్ని కౌగిలించుకుంటుంది మేఘగర్జన
గూడెం పిల్లోడి చేతిలో విల్లంబులా సాయంత్రం
క్షితిజం పై ఒరుగుతుంది
రేపటికొక కొత్త సూర్యుణ్ణి కంటానని వాగ్ధానం చేస్తూ…