(వర్తమాన కథా సందర్భంలో వసంతమేఘం తెలుగు కథకులు, సాహిత్య విమర్శకులతో ఒక సంభాషణ జరపాలనుకుంది. మానవ జీవితానుభవం, దానికి అవతల ఉండే సంక్లిష్ట వాస్తవికత, అనుభవానికి దృక్పథానికి ఉండే ఉమ్మడి ప్రాంతం, కళగా మారే అనుభవంలో ప్రయోగం పాత్ర.. వంటి అంశాలపై కొన్ని ప్రశ్నలను వసంతమేఘం టీం వారికి పంపించింది. ఇదొక సంభాషణా క్రమం. తెలుగు కాల్పనిక, విమర్శరంగాలకు దోహదం చేస్తుందనే ఆశతో ఆరంభించాం. గత సంచికలో ఇద్దరు సాహిత్యకారుల అభిప్రాయాలు ప్రచురించాం. ఈ సంచికలో మరో ఇద్దరి స్పందనలు మీ కోసం.. వసంతమేఘం టీ)
1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా?
జ. కథారచనలో అనుభవం మౌలిక వనరు అనేది కొంతవరకూ మాత్రమే నిజం. వ్యక్తిగత అనుభవానికీ సామూహిక అనుభవానికీ వ్యత్యాసాలు వుంటాయి. రచయిత తన వ్యక్తిగత అనుభవాలు రాయడానికి కథ డైరీ కాదు. కథ కళారూపం. సామూహిక అనుభవాన్ని వ్యక్తిగత చలనం గా మార్చగలిగినప్పుడు కళానుభవం పాఠకుడికి కలుగుతుంది. ఈ అనుభవం దాని ద్వారా అందించే చైతన్యమే చేరాల్సిన తీరం.
2. ఈ కోణంలో వర్తమాన కథను మీరు ఎలా చూస్తారు?
జ. వర్తమాన కథ వైయక్తిక అనుభవం చుట్టూనే వుందని నా అభిప్రాయం. చాలా కథలలో సమాచారం వుంటుంది కానీ కథ వుంటం లేదు.
3. ఇవాళ మన చుట్టూ ఒక కొత్త కథా ఆవరణ ఉన్నది. చాలా మంచి కథలు వస్తున్నాయి. అందులోని అనుభవం వల్ల మనకు కొత్త కథలని అనిపిస్తోందా? లేక దృక్పథం వల్ల కొత్త కథలని అనిపిస్తోందా?
జ. అనుభవమూ దృక్పథమూ మరీ అంత వేరువేరు విషయాలు కాదు. అనేక జీవితానుభవాల పర్యవసానంగానే దృక్పథం రూపొందుతుంది. జీవితానుభవానికి తాత్విక స్థాయిలో దృక్పథం చలనాన్ని కలిగించినట్లే కళలో కూడా కలిగి స్తుంది.ఈ రెంటినీ వేరుగా చూడడం వల్ల రచయితలు, విమర్శకులు, పాఠకులూ తప్పుడు సూత్రీకరణలకి వస్తున్నారు.
4. అసలు జీవితానుభవానికి, దృక్పథానికి ఉమ్మడి క్షేత్రం ఎలా ఉంటుంది? తేడా ఎలా ఉంటుంది?
జ. జీవితానుభవంలో యాదృచ్ఛికత వుంటుంది.అది మన వ్యక్తిగత చైతన్యం తో నిమిత్తం లేకుండా మనకి లభించేది. కానీ దృక్పథం మనం చైతన్యం తో అలవర్చుకునేది. అనుభవంలోని యాదృచ్ఛికత దృక్పథం లోని తాత్వికత లే ఉమ్మడి క్షేత్రం.
5. అనుభవానికి, కళకు ఉన్న సంబంధాన్ని వర్తమాన కథల ఆధారంగా ఎలా చెప్పవచ్చు?
జ. కళగా రూపాంతరం చెందే అనుభవం స్వీయ అనుభవమే కానక్కరలేదు. ప్రతి వ్యక్తిగత అనుభవం వెనుక ఒక సామాజిక చలనం, మానవ చరిత్రా వుంటాయి. అనుభవాన్ని వ్యక్తిగతంగా కుచించడం కాకుండా దాన్ని కళగా మార్చి నప్పుడు అది పాఠకుడి చైతన్యాన్ని పెంచుతుంది.
6. ప్రయోగం వల్ల కథ అనేక అర్థాలను సంతరించుకుంటుంది. అయితే ఇటీవలి కథల్లో దృక్పథం వల్లనే మంచి ప్రయోగంగా మారిన కథలకు, ప్రయోగం వల్లనే దృక్పథ సమస్య వచ్చిన కథలకు ఏమైనా ఉదాహరణలు ఇవ్వగలరా?
జ.నిజానికి ఇది చాలా పెద్ద అంశం. దీనికి జవాబు కన్నా పరిశోధన కావాలి. దృక్పథం వల్ల ప్రయోగానికి గానీ ప్రయోగం వల్ల దృక్పథానికి గానీ సమస్య వచ్చింది అంటే అది మంచిదే. అది కొత్త ఆవిష్కరణ లకి దారితీస్తుంది. కానీ దీనికి కేంద్రం పాఠకుడు కావాలి. పాఠకుడు అంటే మరో రచయిత కాదు. రచన వల్ల చైతన్యం పొందాల్సిన వ్యక్తి. మనకి అటువంటి కథలు వున్నాయి గాని ఉదాహరణ అంటే కష్టమే..
7. ఒక కథ ప్రభావం పాఠకుల మీద శిల్పం వల్ల మిగిలి(గుర్తు ఉండటం) ఉంటుందా? లేక దృక్పథం అందించే ఎరుక వల్ల మిగిలి ఉంటుందా?
జ. దృక్పథం అందించే ఎరుక వల్ల నే మిగిలి వుంటుంది. శిల్పం అనేది రచయిత కి సంబంధించిన పనివాడితనం. అది పూర్తిగా రచయిత లేదా కళాకారుడి కి సంబంధించింది. పాఠకుడు శిల్పం కోసం చదవడు. శిల్ప విశ్లేషణ విమర్శ కుడికీ రచయిత కీ అవసరం తప్ప పాఠకుడికి కాదు. పాఠకుడికి ఎరుక మాత్రమే కావలిసింది.
8. ఈ ప్రభావం వైపు నుంచి వర్తమాన కథను ఎలా చూడవచ్చు?
జ. దృక్పథం అందించే ఎరుక అనేది చైతన్యం అని అనుకుంటే వర్తమాన కథలో ఇది చాలా వరకూ లోపించింది అనే అనుకుంటాను. చాలా కథలు సమస్యల్ని చూపించడం తప్ప చైతన్యం, ఎరుక ఇవ్వడం లేదు. దీనికి కారణం ఆచరణకి సంబంధించిన సంక్షోభం.