మనుషుల  కష్టాలను, సమస్యలను, దుఃఖాలను తీర్చాల్సిన బాధ్యత ఎవరిది?

ఈ అసమ సమాజంలో  వివిధ సామాజిక ఆర్థిక స్థితిగతుల మధ్య పూడ్చలేని అగాధాలను, అంతరాలను సృష్టించింది ఎవరు? ఈ హద్దులు అంతరాలు అగాధాలను అధిగమించడానికి ఎవరు  ఏం చేయాలి? శ్రామిక వర్గాల శ్రమను నిరంతరం  నామమాత్రపు వేతనాలతో  నిలువు దోపిడి చేస్తున్న  బూర్జువా పెట్టుబడిదారి ఉన్నత తరగతుల వర్గాలు ఆ శ్రామిక వర్గాల కోసం, కనీసం కృతజ్ఞత చూపించకపోవడాన్ని, ప్రాణాపాయ పరిస్థితులలో సైతం ఎంత మాత్రము డబ్బు సహాయం చేయడానికి ముందుకు రాని వైనాన్ని , మనుషుల కోసం ఏమీ చేయలేని మనుషులు దేవుడి కోసం మాత్రం దేవుడి పేరుతో జరిగే పూజలు, వ్రతాలు, నోములు,భజనలకు ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టటాన్ని వ్యంగ్యంగా ప్రశ్నించిన కథ పి. సత్యవతి రాసిన ” శ్రీరామా ఎన్ క్లేవ్ “.  నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక 2017లో ఈ కథ ప్రచురితం.

*

ఇంటినిండా దేవుళ్ళు. వీధి వీధికి గుళ్ళు. లేని వాళ్ళకి ఆకలి, అవసరాలు తీరడమే పండుగ.ఉన్నవాళ్లకి  అట్లా కాదు. వాళ్లకి సంవత్సరం పొడుగునా ఏవేవో పండుగలు, పర్వదినాలు, వేడుకలు, వైభవాలు. ఊరంతా ఉత్సవాలు,భజనలు, జాతరలు, వ్రతాలు, హోమాలు, యాగాలు.. నైవేద్యాలు, ప్రసాదాలు, అన్నదానాలు. దేవుని చూడడం కోసమో, దేవుడు వాళ్ళని చూడటం కోసమో నిద్ర లేచిన దగ్గర్నుంచి నిద్రపోయే దాకా నిరంతరం తాపత్రయపడే జనం. దేవుడి దృష్టిలో పడాలనేది ఒకటే వాళ్ళ తాపత్రయం. దేవుడి దృష్టి వాళ్ల పైన ఉండాలనే వాళ్ల నిరంతర ప్రయత్నం.

భక్తిభావంతో,  దేవుళ్ళ పైన గౌరవంతో బిడ్డలకు చాలామంది దేవుళ్ళ పేర్లు పెడుతుంటారు. దేవుళ్లను కొలుస్తారు, దేవుళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కానీ,  మనుషులు ఎప్పటికీ ఎదురుగా కనిపించే మనుషుల దుఃఖాలను తీర్చడం కోసం వాళ్ళ గాయాలను నయం చేయడం కోసం వాళ్ళ ప్రాణాలను నిలపడం కోసం మాత్రం ముందుకు రారు. దేవుళ్ళను పూజించటానికి మాత్రమే ముందుకు వచ్చే చేతులు, కొబ్బరికాయలు కొట్టడానికి రకరకాల రంగురంగుల పూలు కొనటానికి, ఏవో పూజలు వైభవంగా చేయడానికి, ఎంతైనా ఖర్చు పెట్టడానికి మాత్రమే ముందుకు వచ్చే జనం సాటి మనుషుల కష్టానికి ఎంతమాత్రం చలించకపోవడం నిరంతరం ప్రశ్నార్థకం. ప్రేమ దయ కరుణ లేని మనుషులు, మనుషుల పట్ల సమభావం ఆపేక్షత కనపరచలేని మనుషులు దేవుళ్ళ కోసం ఎంతైనా ఖర్చుపెట్టి వాళ్ల హోదాను బట్టి ఘనంగా భోజనాలు ఏర్పాటు చేసి పదిమందిలో తమ గొప్పని చాటుకునే జనం.. మనుషుల కనీస అవసరాలకు కనీస మాత్రం సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం సమాజంలో, నగరాల్లో పట్టణాల్లో, ఊర్లల్లో , గ్రామాల్లో ప్రతి వీధుల్లో ప్రతి అపార్ట్మెంట్లలో నిత్యం చూస్తున్న  విషాదకర దృశ్యం ఇదే!ఇదే నేటి భారతీయం!.

*

మహానగరం అయిపోవాలని ఉవ్విళ్లూరుతున్న ఒక నగరంలో, ఒకప్పుడు ఊరి చివర ఉన్న ప్రస్తుతం ఊరి మధ్యకు జరుగుతున్న ఒక కాలనీలో ఆ మధ్య కట్టిన ఒక ఇరవై అరల భవనం. ఒక అరకి మూడు పడక గదులు మూడు స్నానాల గదులు మూడు వసారాలు, ఎవరు వచ్చింది చూడకుండా గబాల్నతలుపు తీయకుండా సురక్షితంగా ఉండటానికి ముందో ఒక ఇనుప గ్రిల్లూ, దానికో తలుపు తలుపుకో తాళం. వసారాలకి అట్లాగే ఇనుప కవచాలూ, ఎండకు ఎండకు ఉండా వానకు తడవకుండా పకడ్బందీ ఏర్పాట్లతో ముందు వాకిట్లో చిన్న రాముల వారి గుడితో అలరాలే ఆ భవనం పేరు” శ్రీరామా ఎన్ క్లేవ్”. కథ పేరు కూడా ఇదే.

*

కడుపు నిండా తిండి లేని జనం ఒకవైపు, తినింది అరిగించుకోలేని  జనం మరొకవైపు. తినింది కరిగించుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, జబ్బుల్ని తగ్గించుకోవటానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడానికి కార్లలో స్కూటర్ లలో వచ్చి ఉదయ సాయంత్రాల్లో నడిచే సమూహాలు చాలా ఉంటాయి. ఈ నడక వాళ్ల ఆరోగ్యం కోసం. అయితే అలాంటి నడకల్లో కూడా పేద ధనిక తేడాలు ఉంటాయి అంటారు రచయిత్రి. 

అపార్ట్మెంట్లలో అరల్లో, ఉదయ సాయంత్రపు నడకల్లో పెద్దవాళ్ళు ఉన్నత మధ్యతరగతి వాళ్ళు ఉంటారు.కానీ ఆ సమూహాలలో పేదలు, నిరుపేదలు, నిర్భాగ్యులు అసలు ఉండరు. వాళ్ల నడకలు వేరే ఉంటాయి. కడుపాత్రం కోసం జీవనోపాదుల కోసం వాళ్లు మైళ్లకు మైళ్లు రోజులకు రోజులు నెలల తరబడి నడుస్తూనే ఉంటారు. పడి పోతూ ఉంటారు.పడిలేస్తూ ఉంటారు, అయినా వాళ్ళు  గాయాలను లెక్కచేయరు. గాయాలను లెక్క చేసినా నడక ఆపినా వాళ్ళ జీవితాలు కొనసాగవనే విషయం వాళ్ళకు బాగా తెలుసు. అందుకే వాళ్ల నడకలు పరుగులు అవుతాయి, ప్రవాహాలవుతాయి. వాళ్లట్లా మంచినీళ్ల కోసం, తిండి కోసం బట్టల కోసం, ఆశ్రయం కోసం,అవసరాలు కోసం పరుగులు తీస్తూ ఉంటారు. నడక వాళ్లకు వ్యాయామం కాదు. రోజు గడవటమే  వాళ్లకు ఒక పెద్ద వ్యాయామం.!

సమాజంలో పేద ధనిక రెండు వర్గాలే కాదు.. చాలా చాలా వర్గాలు ఉన్నాయి. పేదల్లోనూ పెద్దల్లోనూ రకరకాల వర్గాలు, రకరకాల సమూహాలు.

విదేశాల్లో బిడ్డలు ఉన్నవాళ్లు ఒక వర్గం. సాఫ్ట్వేర్ వాళ్లది మరొక వర్గం. వ్యాపారస్తులు, ఉద్యోగులు కులాల వారీగా వర్గాలే వర్గాలు.

మతం కులం సంపద మనుషుల్ని వేరువేరు అరల్లో ఉంచుతుంది. అలాంటి అరల సమూహంలో, దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న గుంపులో, శ్రీరాముడే కొలువైన ఆ భవనంలో,

కాపలాదారు కూతురుకి కడుపు నొప్పి వస్తుంది.

అక్కడ ఉన్నది అందరూ శ్రీమంతులే. అందరూ దేవుళ్ళంటే భయం భక్తీ ఉన్నవాళ్లే. దేవుళ్ళ కోసం పూజల కోసం వేలు లక్షలు ఖర్చు పెట్టే వాళ్లే. అయితే వాళ్లకు కూడా కష్టం వచ్చింది. 

నోట్ల రద్దుతో వాళ్లు డబ్బు కోసం కాదు చిల్లర కోసం కష్ట పడతారు. అదీ వాళ్ల కష్టం. ఏటీఎం లలో డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళ సేవలను వినియోగించుకోగలరు. ప్లాస్టిక్ మనీతో రోజులను గడపేయగలరు.

*

మతం కులం సామాజిక ఆర్థిక సాంఘిక రాజకీయ స్థితిగతుల  ప్రభావం సమాజంలోని మైనారిటీ వర్గాల పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయం పి. సత్యవతి గారి కథల్లో చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఆమె కథలలోని పాత్రలకు విచక్షణా రహితమైన ఆవేశాలు ఆగ్రహాలు ఉండవు. కథల్లో ఎక్కడా నాటకీయత ఉండదు. ప్రత్యేకమైన వైవిధ్యభరితమైన ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకోవటం, చెప్పదలుచుకున్న విషయాన్ని కథాంశం ద్వారా ,పాత్రల ద్వారా వ్యక్తం చేయడం, విభిన్న మనస్తత్వాలను, పాత్రల అంతరంగాలను ప్రతిబింబించే  విధంగా సంభాషణలు సహజంగా కొనసాగించడం ఆమె ప్రత్యేకత.

ఈ కథలోని బలమైన అంశాలు కూడా ఇవే.

కథా ప్రారంభంలోనే రచయిత్రి అరల రక్షిత సముదాయంలో అభద్రతలకు లోనయ్యే మనుషుల జీవితాలు..ఇవీ అని సూచించటం గమనార్హం.

అక్కడ ఎవరి హడావుడిలో వాళ్ళు ఉంటారు. కింద ఏదో గోల అరగంటగా రణగొణ ధ్వని.

స్వరాజ్యం గారు సాయిబాబా భజన ఏర్పాటుకోసం కంగారు పడుతూ ఉంటే ఇదొకటా అని విసుక్కుంటారు. ఎల్లుండి రెండో అంతస్తులో ఉండే ఝాన్సీ గారింట్లో విష్ణుసహస్రనామ పారాయణం.

పది సంవత్సరాలకు పైగా ఈ అరలకు కాపలాదారుడుగా ఉన్న శ్రీనివాసులు కూతురు పదైదు ఏళ్ల దానికి రాత్రి నుంచి ఒకటే కడుపునొప్పి వాంతులు.

తెలిసిన ఆర్ఎంపీ దగ్గరకి పోతే అప్పిండిసైటిస్ లాగా వుంది పెద్దాసుపత్రికి తీసుకుపోదాం. కనీసం ఒక పదివేలన్నా పట్రమ్మన్నాడట. ముందుగా పదివేలు తెస్తే తరువాత బిల్లు నెమ్మదిగా కట్టేలాగా తనకి తెలిసిన డాక్టర్ తో మాట్లాడతానన్నాడట…  శ్రీనివాసులు పిల్లని ప్రభుత్వాస్పత్రికి తీసుకు పోదాం అన్నాడట. అతని భార్య భాగ్యలక్ష్మికి ప్రభుత్వాసుపత్రికి పిల్లని అప్పగించడానికి సుతరామూ ఇష్టంలేదు. ప్రయివేటాస్పత్రి వాళ్ళు ముందుగా డబ్బు కట్టకపోతే చేర్చుకోరు.. కొంతైనా కట్టాలి. పోనీ పాత నోట్లయినా సరే… పాతవైనా కొత్తవైనా ఏవో ఒక నోట్లేవీ వాళ్ళ దగ్గర లేవు. డెబిట్లు క్రెడిట్లూ ఏ కార్డులూ లేవు. ఉన్నట్లుండి ఒక పదివేలైనా ఎవరు అప్పు ఇస్తారు? ఇప్పుడెవరూ డబ్బు బయట పెట్టట్లేదే! ఇప్పటికే కడుపు నొప్పి వచ్చి పది గంటల పైనే అయింది…

 శ్రీనివాసులు భార్య శోకాలు పెడుతోంది. ఒకళ్ళిద్దరు అప్పుడే లిఫ్ట్ ఎక్కేసి వారి వారి స్వంత అరల్లోకి పోయారు. అరెమ్పీ గార్ని పట్టుకుని గవర్మెంటాస్పత్రికి పోదాం అంటే అక్కడ ఆయనకి పలుకుబడి లేదట. ప్రయివేటు డాక్టర్లే తెలుసట. నొప్పి! తెరలు తెరలుగా…

శోకం పొరలి పొరలి వచ్చే శోకం. “మనం తలా వెయ్యి వేసుకున్నా ఇరవై వేలవుతాయి” అంది శ్రీబాల ధైర్యం తెచ్చుకుని. ఎవరూ నోరెత్తలేదు.

“ఇరవై నాలుగు వేలిస్తాం అన్నారు మొన్న.. ఆరుగంటలు నిలబడితే పదివేలు చేతిలో పెట్టి క్యాష్ అయిపోయిందన్నారు.. బ్యాంకులో బ్యాలన్సున్నా మనచేతికొచ్చేది సున్నా… ఒక వెయ్యి ఇవ్వడం పెద్ద లేక్కేం కాదు కానీ ఎట్లా తెద్దాం? ఏటీఎం ఎప్పుడూ నోరుమూసుకునే వుంటుంది. ఒక వేళ నోరుతెరిచినా ఒక కాయితం ఉమ్మేస్తుంది..” అన్నాడు రామచంద్ర రావు,

“శ్రీనివాసులు పదేళ్ళ కాడి నించీ పంజేస్తున్నాడు.. ఆడికామాత్తరం చెయ్యద్దా మనం?” అంది సత్యనారాయణ తల్లి సౌభాగ్యమ్మ.. ఆమె వంక కోపంగా. చూసాడు ఆయన.

“ప్రయివేటాస్పత్రి అంటే మాటలనుకున్నావా? దోపిడే దోపిడీ. ఎక్కడి నించీ తెస్తావు అంత డబ్బు. పదివేలిస్తే ఎక్కడ చాలతాయి? గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకుపో! అక్కడే మంచి డాక్టర్లు వుంటారు” అన్నాడు రామచంద్రరావే మళ్ళీ.

 పిల్ల నొప్పితో మెలికలు తిరిగిపోతోంది. మరొక ఇద్దరు వెళ్ళిపోయారు.

వెళ్ళిపోయిన రామచంద్ర రావు వెనక్కి వచ్చాడు. “ఇదిగో నేను రెండు వేల కాగితం ఇస్తున్నాను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి” అనేసి విసురుగా వెళ్ళిపోయాడు.

మీనాకుమారి, మరో ఇద్దరూ మిగిలారు. “ఇది మహా పాపం. ఆపిల్ల చచ్చిపోతే బాధ్యులం మనమే… ఏదో ఒకటి చెయ్యండి నా దగ్గర ఇప్పటికిప్పుడు అయిదు వేలున్నాయి తెస్తాను” అంది శ్రీబాల.

“ఏం జరుగుతోందిక్కడ” అని ఇంగ్లీష్ లో అడుగుతూ అప్పుడే వచ్చాడు ఉజ్వల్ కుమార్

అందరూ కోరస్ లాగా ఏకరువు పెట్టారు తెలుగులో…..

“నాన్సెన్స్… ముందాపిల్లని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోండి. ట్రీట్ మెంట్ ఇవ్వడం వాళ్ళ డ్యూటీ.. ఇవ్వకపోతే కేసు పెట్టండి. కంప్లయింట్ ఇవ్వండి అంతేకానీ ప్రయివేట్ ఆస్పత్రికి వెళ్ళడానికి డబ్బుల్లేవని ఆలస్యం చేస్తారేమిటి?”. అన్నాడు ఆవేశ పడుతూ.

“నేను నా బిడ్డని ఆ ఆస్పత్రికి చచ్చినా తీసుకుపోను. పెద్ద పిల్ల పురుడు పోసి చావు తప్పి కన్ను లోట్టపోయి బయట పడ్డాను. ఒకమంచం మీద అటూ ఇటూ ఇద్దరు బాలింతరాళ్లని పడుకో బెట్టారు. అక్కడి నర్సులు ఒకటే కసురు కోడం మమ్మల్ని. దీనికి పెద్దాపరేషన్ చెయ్యాలంట. అమ్మో! అక్కడనేను చేయించను.” శ్రీనివాసులు భార్య భాగ్యలక్ష్మి.

“నీ బిడ్డకి సరైన వైద్యం చెయ్యాల్సిన డ్యూటీ వాళ్ళది… వెంటనే వెళ్ళు. నువ్వు ప్రయివేటాస్పత్రి ఖర్చు భరించలేవు” ఉజ్వల్ కుమార్.

“బాబ్బాబు కాస్త నా ఎంట మీరు రండి. మా మాట ఆల్లు వినుకోరు. కాస్త ఇంగ్లీషులో రూల్సు మాట్లాడి అమ్మాయికి ఆపరేషన్ చేపించండి. పున్యముంటాది” అని దండం పెట్టాడు శ్రీనివాసులు.

ఉజ్వల్కుమార్ ఒక్క నిమిషం కంగారుపడి “వద్దును కానీ నాకిప్పుడు పదింటికి నోట్లరద్దు మీద రౌండ్ టేబిల్ మీటింగ్ వుంది అర్జంటుగా తయారై వెళ్ళాలి. అందులో మాట్లాడతానని ప్రామిస్ చేసాను” అంటూ పైకి వెళ్ళిపోయాడు.

ముక్కు మీద వేలువేసుకున్న శ్రీబాలతో పాటు మరి ఇద్దరు మాత్రమేవుండి పోయారక్కడ..

శ్రీనివాసులు భార్య దుఃఖం క్రమంగా కోపంలోకి మారుతున్నది. ఐదో అంతస్తుతో మొదలుపెట్టి ఎప్పుడెవరెవరు తామింటిల్లపాది చేత ఎంతెంత పని చేయించు కున్నదీ ఏకరువు పెట్టి ఇప్పుడలా మొండి చెయ్యి చూపించడం లోని

న్యాయం గురించి మాట్లాడుతోంది. క్రింద ఇలా జరుగుతుండగా పైన హేమా హేమీలతో చిన్న స్థాయి సమావేశం మరొకటి మొదలైంది. అదీ కొనసాగుతూనే వుంది. పిల్ల నొప్పితో గింగిర్లు తిరుగుతూనే వుంది. స్వరాజ్యం గారు భర్త గారితో కలిసి సాయిబాబా భజనకి పూల కోసం పూల మార్కెట్ కి బయల్దేరారు…. అటునించి ఆటే కూరగాయలకి కొబ్బరి కాయలకి వెడుతూ వెడుతూ “మీరంతా ఎట్లా అంటే అట్లాగే నేనూ ఇస్తాను. పైన రామచంద్రరావుగారు మీటింగ్ పెట్టారు. ఎదో తేలుస్తారు” అంది శ్రీబాలతో.

“ఆరు తేల్చేదాకా దీని ప్రాణాలుండాలి గందా! పదయ్యా! ఒక ఆటో పిల్చుకురా! ఆరెమ్పీ గారి కాడికే పోదాం. శ్రీబాలమ్మ అయిదు వేలిస్తానంది గందా ఇందాక సెక్రెట్రీ గారిచ్చిన రెండేలు తీసుకుని ఆయన కాళ్ళు పట్టుకుందాం. “ముందు ఆపరేషన్ అయిపోతే ఆనక ఆ రాములోరే వున్నాడు” అంటోంది భాగ్యలక్ష్మి….

*

ఇదీ కథ ముగింపు. లేదా కథ మలుపు. 

వీళ్ళ వైఖరిని చూసి విరక్తి చెందిన శ్రీనివాసులు భార్య భాగ్యలక్ష్మి చైతన్యంతో  తెగిస్తుంది.

అక్కడినుండి కదులుతుంది. బానిస మనస్తత్వం లోనుంచి ఆమె బయటపడటం,‌ ఆమెలోని తెగింపు చొరవ చైతన్యం  ఈ కథలోని కొస మెరుపు, కొస మలుపు.

చారిత్రక పరిణామాలను తెలియజెప్పిన కథలకు భవిష్యత్తు ఉంటుంది. నిర్దిష్ట స్థల కాలాలను సూచించే కథలు కాబట్టి ఆయా కథలోని సంఘటనలు దృశ్యాలు సందర్భాలు సన్నివేశాలు సంభాషణలు కథా కథనం ఆసక్తికరంగా ఉంటాయి.

నోట్ల రద్దు సృష్టించిన సంచలనం, సంక్షోభం, అలజడి అంతా ఇంతా కాదు. అన్ని భాషల్లోనూ కథలు కవితలు నవలలు నోట్ల రద్దు ను నేపథ్యంగా తీసుకుని చాలా రచనలు వచ్చాయి. ఈ కథ కూడా నోట్ల రద్దు నేపథ్యంలో కొనసాగుతుంది. నోట రద్దు ధనిక పేద వర్గాల పై చూపిన ప్రభావం లోని వైవిధ్యం ఈ కథలో స్పష్టంగా ఉంది.

మనుషుల అనైతిక ప్రవర్తన, స్వార్థం ప్రలోభాల గురించి కథలో నేరుగా చెప్పకుండా, విభిన్న మనస్తత్వాలను సూచనా ప్రాయంగా తెలియజెప్పటం, సిద్ధాంతాలను మాత్రమే చెప్పి ఆచరణకు ఆమడ దూరంగా నిలిచిపోయే వ్యక్తిని, అవసరమైతే తన దగ్గర ఉన్నదంతా ఇచ్చి మనిషి ప్రాణాన్ని కాపాడాలనే తపన ఉన్న మనిషి వ్యక్తిత్వాన్ని ,  అనేకానేక అభద్రతల నడుమ  ఇనుప గ్రిల్, ఇనుప కంచె, తలుపు తలుపుకో తాళం, ఇనుప కవచాల మధ్య అరలు అరలుగా విడిపోయిన మనుషుల గురించి ఈకథ చెపుతుంది.చైతన్యం వచ్చింది అనుకున్న భాగ్యలక్ష్మి సైతం కథ చివరలో ‘ముందు ఆపరేషన్ అయిపోతే ఆ తర్వాత ఆ రాములోరే ఉన్నారు’ అని ఆమె అనటం.. ఆమెలో ఇంకా రావాల్సిన మార్పుకు సంకేతం.

ఈ కథలోని ఉజ్వల్ కుమార్ సమాజంలోని మేధావి వర్గానికి ప్రతీక. సిద్ధాంతానికి ఆచరణకి మధ్య ఉన్న వైవిధ్యానికి అతడు ఒక ఉదాహరణ.  అతడు తన ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం అవుతాడు. ఇలాంటి వాళ్లు ప్రతి ఇంట్లో ఉంటారు, వీధిలో ఉంటారు, సమాజం మొత్తం ఉంటారు. కేవలం ఉపన్యాసాలకే వీళ్ళు పరిమితం. సామాజిక చైతన్యం పూర్తిగా లోపించిన మేధావులు వీళ్ళు. వీళ్ళు అట్ట బొమ్మలు.!

గుళ్ళకి గోపురాలకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ప్రజాధనం, యాత్రల పేరిట చేస్తున్న వ్యయం, పండగలకి పర్వదినాలకు ఉత్సవాలకి జనం ఖర్చు పెడుతున్న విధానం, ఉన్న దేవాలయాలు చాలక, ఎక్కడికక్కడ  నిర్మిస్తున్న అనేకానేక దేవాలయాలు, మనుషుల విగ్రహాల కి ఖర్చు పెడుతున్న వేలకోట్ల రూపాయలు ఇదంతా మనుషుల కోసం మనుషుల ప్రాణాలను నిలపడం కోసం ఖర్చు పెడితే ఎంత బాగుంటుంది అని -అనిపించక తప్పదు ఈ కథ చదివాక.

ఆలోచనలను, అభిప్రాయాలను, అవగాహనను సమీక్షించడం, సవరించడం, మెరుగుపరచడమే కదా మంచి కథా లక్షణం.

నోట్ల రద్దు అయినా ఎలాంటి కష్టాలు లేని జీవితాలు వాళ్లవి. గంటలు గంటలు క్యూలో నిలబడి, వాళ్ల కోసం ఏటీఎం నుండి డబ్బులు తీసుకుని రావటానికి వాళ్ళకు వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు.అయినా వాళ్ళ ఇండ్ల నిండా డబ్బులే డబ్బులు. చిల్లర కుప్పలుతెప్పలుగా ఉంటుంది. నోట్ల రద్దుకు పూర్వమే  నెల మొదట్లోనే వాళ్ల గృహలక్ష్ములు హోల్సేల్ బజార్ లలో బోలెడు బోలెడు సరుకులు తెచ్చి పెట్టుకుంటారు.పాలబూత్ లలో ముందుగానే అడ్వాన్సులు కట్టేసుకుంటారు. నోట్లు రద్దు అయినా దేనికి లోటు లేని జీవితాలు వాళ్లవి. ఏ కాలంలో అయినా అసలు నోట్లే లేని జీవితాలు కాపలాదారు శ్రీనివాసులు లాంటి వాళ్ళది. అతడి చేత, అతని కుటుంబం చేత పదేళ్లకు పైగా ఎంతో చాకిరీ చేయించుకున్నా – అతనికి కష్టం వచ్చిన సమయంలో అతని బిడ్డ ప్రాణాలు పోతూ ఉంటే  ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తించిన వాళ్ళను ఏమనాలి?

వాళ్లను కూడా  మనుషులనే అందామా? ఓమానవుడా..దేవుడా ?:మనిషా?ఎవరు ముఖ్యం నీకు?

దుఖం కోపంగా మారటమే, జడత్వం నుండి బయటపడి చైతన్యం కావటమే జీవిత వాస్తవికత. ఇదే కథ ఇలాంటి కథే రోజు ప్రతి ఊర్లో జరుగుతూనే ఉంటుంది. 

ఎక్కడా రెండు వర్గాలే. దేవుళ్ళు ఒకవైపు, మనుషులు మరొకవైపు.

ఓ మనిషీ.. నువ్వు ఎటు వైపు??

One thought on “దేవుడా ? మనిషా? ఓ మనిషీ.. నువ్వు ఎటు వైపు?

  1. సత్యవతి గారూ రాసిన “రామా ఎంక్లేవ్” ని చాలా బాగా సమీక్షించారు బాలాజి గారు . ముఖ్యంగా వారు తన సమీక్షలో రాసినట్టు “భక్తిభావంతో, దేవుళ్ళ పైన గౌరవంతో బిడ్డలకు చాలామంది దేవుళ్ళ పేర్లు పెడుతుంటారు. దేవుళ్లను కొలుస్తారు, దేవుళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కానీ, మనుషులు ఎప్పటికీ ఎదురుగా కనిపించే మనుషుల దుఃఖాలను తీర్చడం కోసం వాళ్ళ గాయాలను నయం చేయడం కోసం వాళ్ళ ప్రాణాలను నిలపడం కోసం మాత్రం ముందుకు రారు. దేవుళ్ళను పూజించటానికి మాత్రమే ముందుకు వచ్చే చేతులు, కొబ్బరికాయలు కొట్టడానికి రకరకాల రంగురంగుల పూలు కొనటానికి, ఏవో పూజలు వైభవంగా చేయడానికి, ఎంతైనా ఖర్చు పెట్టడానికి మాత్రమే ముందుకు వచ్చే జనం సాటి మనుషుల కష్టానికి ఎంతమాత్రం చలించకపోవడం నిరంతరం ప్రశ్నార్థకం. ప్రేమ దయ కరుణ లేని మనుషులు, మనుషుల పట్ల సమభావం ఆపేక్షత కనపరచలేని మనుషులు దేవుళ్ళ కోసం ఎంతైనా ఖర్చుపెట్టి వాళ్ల హోదాను బట్టి ఘనంగా భోజనాలు ఏర్పాటు చేసి పదిమందిలో తమ గొప్పని చాటుకునే జనం.. మనుషుల కనీస అవసరాలకు కనీస మాత్రం సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం సమాజంలో, నగరాల్లో పట్టణాల్లో, ఊర్లల్లో , గ్రామాల్లో ప్రతి వీధుల్లో ప్రతి అపార్ట్మెంట్లలో నిత్యం చూస్తున్న విషాదకర దృశ్యం ఇదే!ఇదే నేటి భారతీయం!.

Leave a Reply