నేషనల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) 18వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూకుమ్మడిగా ముస్లింల ఇండ్ల మీద దాడి చేసింది. దేశద్రోహ నేరారోపణ చేసి అరెస్టులు చేసింది.  హైదరాబాదులోని  తమ కార్యాలయంలో విచారణకు రావాలని కొన్ని డజన్ల మంది ముస్లింలకు  నోటీసులు ఇచ్చింది. వీళ్లందరూ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ నాయకులని, సభ్యులని, వీళ్లంతా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనుల్లో ఉన్నారని, దేశద్రోహ కార్యకలాపాలు నడుపుతున్నారని ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది.

నిజామాబాద్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ముస్లింలకు లీగర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం పేరుతో కర్రసాము, కత్తిసాము నేర్పిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతోందనే ఒక కేసు స్థానిక పోలీసులు నమోదు చేశారు. దీని కోసం డైరీలను వెతికి ఆధారాలు బైటికి తీశారు. ఈ కేసును  తీసుకొని ఢిల్లీ నుంచి ఎన్‌ఐఏ అధికారులు 18వ తేదీ తెల్లవారుజాము నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని డజన్ల ముస్లింల ఇండ్ల మీద దాడులు చేసింది.   19వ తేదీ కూడా  అరెస్టులు జరిగాయి.

దీని మీద రెండు రోజులుగా ఎటువైపు నుంచీ ఏ అభిప్రాయం వినిపించడం లేదు. గంభీరమైన నిశ్శబ్దం ఆవరించి ఉన్నది. ముస్లింలు ఎంత ఒంటరివారో ఈ మౌనం సూచిస్తోంది. పత్రికల లెక్క ప్రకారమే దాదాపు నలభై చోట్ల సోదాలు జరిగాయి. ఈ నెంబర్‌ చిన్నదేమీ కాదు. ఇదే వేరే ఎవరి విషయంలోనే జరిగి ఉంటే మీడియా, సోషల్‌ మీడియా ఎంత రద్దీగా  ఉండేవి?  ఎంతో కొంత అవసరమైన చర్చలు జరిగేవి. చిలువలు పలువలుగా వాదోపవాదాలు సాగేవి.   కానీ రెండు రోజులుగా జరుగుతున్న ఈ దాడుల పరంపరను  ఎవ్వరూ పట్టించుకోలేదు.

మామూలుగా మన సమాజంలో ఏదైనా ఘటన జరిగినప్పుడు వచ్చే సాధారణ ప్రతిస్పందన ముస్లింల విషయంలో ఉండదు. అది ఎంత తీవ్రమైనదైనా,  అన్యాయమైనదైనా  సరే  పట్టించుకోదు. ఏమీ జరగనట్లు నటించే ఈ  మౌనంలో లోతైన అర్థం ఉంది. వాళ్లు ముస్లింలు కావడమే దీనికి కారణం.  అంతకుమించి ఏమీ లేదు.  దీనికి తగినట్లు ప్రభుత్వం వాళ్లను ఒక ‘ప్రమాదకర’మైన గుంపు అని ‘అందరూ’ నమ్మే మోతాదులో ముందుస్తుగా ఒక ఆరోపణ చేస్తుంది.  ‘ముస్లింలు కదా.. మనకెందుకులే..ఏం చేసి ఉంటారో ఏమో.. నెత్తి మీదికి తెచ్చుకోవడం దేనికి?’ అనే  మెజారిటీ సగటు  మన:స్థితిని హిందుత్వ శక్తులు తయారు చేశాయి.   

పిఎఫ్‌ఐ అవగాహన మీద, కార్యకలాపాలపై ఎవరికి ఏ అభిప్రాయాలైనా ఉండవచ్చు. అవేవైనా రాజకీయంగా చర్చించాల్సిందే. ఇట్లా అనేక రాజకీయ సంస్థల మీద భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉంది.   కానీ ముస్లిం అస్తిత్వం ఉన్నందు వల్ల పిఎఫ్‌ఐతో సంబంధాలు ఆపాదించడమంటే దేశద్రోహమనే ఆరోపణ ప్రభుత్వం సునాయాసంగా చేయగలదు.  ఎన్నికల రాజకీయాల పరిధిలో ఉన్న ఏ సంస్థ విషయంలో అయినా ఈ మాట అనగలదా? కులాలకు, మతాలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు, పార్టీలు చాలానే ఉన్నాయి.   కానీ ముస్లిం అస్తిత్వం ఉన్న సంస్థ చుట్టూ ఉగ్రవాద ఆరోపణ చేయడం, ఆపేరుతో భయోత్పాతం సృష్టించడం,  దాడులు చేయడం  వెనుక ఆంతర్యం ఏమిటి? నిజంగానే ఎన్‌ఐఏ ఆరోపించినట్లు నిజామాబాదులో పిఎఫ్‌ఐ నిర్వహించిన శిబిరంలో కర్రసాము, కత్తి సాము నేర్పించి ఉంటే ఈ నేరం సుమారు నూరేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నదే కదా. ఇలాంటి ‘సంప్రదాయక’ కసరత్తులు మానేసి బహరంగంగా రోడ్ల మీద ఆధునిక తుపాకులతో కవాతులు చేయడం ఆ సంస్థకు అలవాటే కదా. అవన్నీ దేశభక్తియుత చర్యలైపోయి వేరే వాళ్లు చేస్తే దేశద్రోహం ఎందుకు అయింది? ఈ తార్కిక ప్రశ్న తలెత్తని ఒక భావజాల వాతావరణాన్ని హిందుత్వ శక్తులు కొన్ని దశాబ్దాలుగా తయారు చేసి పెట్టాయి. మొదట ముస్లింల ఉనికే ప్రమాదకరమని ప్రచారం చేశారు.  ఇక వాళ్ల ఏ పనులైనా తేలిగ్గానే ఉగ్రవాద కార్యకలాపాలు అవుతాయి. నిజంగా ఏ సంస్థ పనులైనా చట్టం పరిధికి అవతల ఉంటే ఏం చేయాలనే కనీస చట్టబద్ధ సంస్కృతి లేని సమాజంలో సులభంగా  చేయగల పనులు  ఇవే కదా.   ఇక చట్టం లేదు, రాజకీయ తార్కిక చర్చలు లేవు, వాటి మంచి చెడ్డలు తేల్చగల  హేతుబద్ధ ప్రమాణాలు లేవు. ఉన్నదల్లా మెజారిటీ మనస్తత్వాన్ని మూక సంస్కృతిలో ముంచెత్తడం. ఇతరులందరి మీద  దేశద్రోహులని ముద్ర వేయడం.

ఈ భావజాల ఆవరణకు తగిన ఆపరేషన్‌ పార్ట్‌ను ఎన్‌ఐఏ అధికారికంగా చేపట్టింది. ఇది కాంగ్రెస్‌ హయాంలో పుట్టినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జేబు సంస్థగా ఇది మారిపోయింది. మామూలుగా ఎన్‌ఐఏను ఆధునిక పద్ధతుల్లో ‘నేర పరిశోధన’ చేసే సంస్థ అనుకొనే అవకాశం ఉంది. అందులో ఈ ఆధునికత ఎంత ఉన్నదోగాని నూరు శాతం సంఫ్‌ుపరివార్‌ మనస్తత్వంతో, భావజాలంతో అది పని చేస్తూ ఉంటుంది. అందులో ఉండే వాళ్లకు పుష్కలంగా ఈ భావజాల శిక్షణ ఉంది. దేనికంటే  మావోయిస్టుల, ముస్లింల ‘నేరాల’ను   అదుపు చేయడమే తన ప్రధాన రంగమని ఈ సంస్థ చెప్పుకుంటుంది.

దాని పనులపట్ల మౌనం వహించడం కూడా ఇక భావజాల వ్యూహమే. ప్రస్తుత దాడుల పట్ల దేశంలోని ఏ రాజకీయ పార్టీ నోరు విప్పలేదు. బహుశా ఇందులో ఎన్నికల ఎత్తుగడ కూడా ఉండవచ్చు. ఇప్పటికే సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఇక్కడ కూడా దేవాలయాల కసరత్తు చేసింది. అదేమీ ఫలించలేదు. దీంతో ఈ ఎత్తుగడ వేసిందని ఊహించవచ్చు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో  బీజేపీని కాదనే  ప్రభుత్వాలేమీ లేవు. కాబట్టి ముస్లింలపై ఈ మూకుమ్మడి దాడులు  ఎన్నికల వ్యూహంలో భాగమైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్లే.

దేశాన్ని నిస్సిగ్గుగా అమ్మేస్తూ, దేశ ప్రజల శ్రమశక్తిని, సహజ  వనరులను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతూ, వందల వేల ఏళ్ల నుంచి ఈ దేశ శ్రమజీవులు నిర్మించుకున్న మానవీయ, లౌకిక, సహజీవన పద్ధతిని, చర్చ సంప్రదాయాలను ధ్వంసం చేస్తూ హిందుత్వ, నియంతృత్వ రాజకీయార్థిక సాంస్కృతిక విధానాలు అమలు చేస్తున్న బీజేపీ అనుంగు ఆయుధం ఎన్‌ఐఏ. ఇది ముస్లింల విషయంలో ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు.

కానీ ఈ ఎన్‌ఐఏ దాడులపట్ల  మైనారిటీ  అస్తిత్వం గురించి మధనపడే ముస్లిం రచయితలు, మేధావులు,   హిందుత్వ ఫాసిజం గురించి నిత్యం సోషల్‌ మీడియాలో రాసే ప్రజాస్వామిక వాదుల మౌనాన్ని అర్థం చేసుకోవడం మాత్రం కష్టమే. 

Leave a Reply