కరోనా కాదుగాని బడీ లేక బయట ఆడుకోవడానికీ లేక పొద్దస్తమానమూ ఇంట్లో టీవీ చూస్తూ కాలం గడిపేస్తుంటే పరీక్షా కాలం కాస్తా వచ్చేసింది!
“భారతదేశానికి సరిహద్దులు తెలపండి?” ప్రశ్నపత్రంలోని ప్రశ్న!
“భారతదేశానికి తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, ఉత్తరాన హిమాలయా పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి” జవాబు రాసిన విద్యార్థికి జీరో మార్కులు వేశారు మాస్టారు!
చదివి రాసిన విద్యార్థి డంగైపోయాడు!
“టిక్రి, సింఘు, గాజీబోర్డర్” అని జవాబు రాసిన మిగతా విద్యార్థులను మాస్టారు మెచ్చుకొని ఎన్నికి అన్ని మార్కులూ వేసేశారు!
టీవీలూ పేపర్లూ చూసి రాసిన విద్యార్థులు పొంగిపోయారు!
“దేశ సరిహద్దులు మారిపోతాయా?” ఆశ్చర్యపోతూ అడిగాడు జీరో మార్కుల విద్యార్థి!
“ఎందుకు మారవు?, దేశాలు మారినప్పుడు దేశ సరిహద్దులు కూడా మారుతాయి!” మార్కులు కొట్టేసిన ఓ విద్యార్థి చాలా నమ్మకంగా గొప్ప ఆత్మవిశ్వాసంతో చెప్పాడు!
మాస్టారు ఉబ్బితబ్బిబ్బయిపోయారు! ‘ఇలాంటి విద్యార్థులే దేశానికి శ్రీరామరక్ష’ అని టేబుల్ బల్ల గుద్ది మరీ చెప్పారు!
జీరో మార్కుల విద్యార్థి నీరుగారిపోవడం చూసి “దేశ సరిహద్దుల గొప్పతనమును వివరింపుము?” అని మార్కులు పొందిన విద్యార్థుల వంక ముచ్చటగా చూసి తలెగరేశారు మాస్టారు!
పిల్లలు చెప్పడానికి పోటీ పడ్డారు!
“ఇనుప ముళ్ళ కంచెలూ… సిమ్మెంటు దిమ్మలూ… శత్రువులు అడుగుపెట్టకుండా మేకులూ… ఆర్మీ జవానులూ… తోడు పోలీసు జవానులూ… తుపాకులూ… కవాతులూ… టాంకర్లూ…” ఒక్కో విద్యార్థి ఒక్కోటి చెప్పాడు! “ఇవన్నీ మోహరించిన చోటునే సరిహద్దు అందురు…” అని విద్యార్థులందరూ ముక్తకంఠముతో వివరించేవారే కాని జీరో మార్కుల విద్యార్థి తన అనుమానంతో అడ్డుకున్నాడు!
“అలా అయితే సరిహద్దులకవతల శత్రువులు వుండాలి కదా?” చాలా జెన్యూనుగా అడిగాననుకున్నాడు!
మాస్టారు సహా మిగతా విద్యార్థులంతా పగలబడి నవ్వారు, జీరో మార్కుల విద్యార్థి అమాయకత్వానికి!
“యస్… సరిహద్దులకవతల ఎవరున్నారు?” మాస్టారు చెప్పమన్నట్టు ప్రాత్సాహమిస్తూ అడిగారు!
క్లాసులో అందరూ పాసై తను మాత్రమే ఫెయిల్ అయిపోతానని జీరో మార్కుల విద్యార్థికి బాగా భయం వేసింది! వెంటనే బాగా ఆలోచించాడు! కళ్ళు మూసుకున్నాడు! మూసిన కళ్ళు తెరిచాడు! ఆ విద్యార్థి కళ్ళముందు సరిహద్దు అవతల ఉన్నది ఎవరో కంటికి కనిపించినట్టే ఉంది!
ఊపిరి బిగబట్టుకొని విద్యార్థులంతా చెవొగ్గి చూస్తున్నారు!
“టెర్రరిస్టులు”
ఆ మాటతో క్లాసంతా చప్పట్లతో మార్మోగిపోయింది! మాస్టారు కూడా చప్పట్లు చరవకుండా ఉండలేకపోయారు!
బడి మధ్యలో ఎత్తుగా తలెత్తుకు ఎగురుతున్న మూడురంగుల జెండాలో ఒక్క రంగే మిగిలి తళతళా మెరిసి మురిసింది!!