కుటుంబం – సొంత ఆస్తి-రాజ్యాంగ‌యంత్రం-5

      ఇంత వరకూ చూసిన ప్రజా సమూహాలలో ఉదాహరణలతో గణ వ్యవస్థ ఏ విధంగా శిధిలమైపోయిందో చూసాం. ఇక ఆఖరున గణ వ్యవస్థను శిధిల పరచిన ఆర్ధిక పరిస్థితులను చూద్దాం. దీనికై మార్క్సు రాసిన ‘పెట్టుబడి’ పుస్తకం అవసరం. మోర్గాన్ పుస్తకం లాగే.

   గణ వ్యవస్థ అటవిక కాలపు నడిమిదశలో పుట్టింది. వున్నత దశలో అభివ్రుద్ధి చెందింది. ఈ దశకు అమెరికను ఇండియన్లను ఉదాహరణకి తీసుకుందాం. వీరిలో గణ వ్యవస్థ పూర్తిగా అభివ్రుద్ధి పొందింది. తెగ ఎన్నో గణాలతో ఏర్పడుతుంది. సాధారణంగా రెండే గణాలు వుంటాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ పిల్ల గణాలు ఏర్పడతాయి. మరింత జనాభా పెరుగుతున్న కొద్దీ, వేరే వేరే తెగలు ఏర్పడతాయి. వాటిలోపల ఆంతరంగిక ఘర్షణలను తెగ తీరుస్తుంది. బయట తెగలలో ఘర్షణలను యుద్ధం తీరుస్తుంది. (బయట తెగలతో యుద్ధం వనరుల కోసం జరుగుతాయి. యుద్ధంలో ఎవరు బలమైన వాళ్ళయితే వాళ్ళు నిలబడతారు.] ఒక్కోసారి యుద్ధంలో తెగ మొత్తం తుడుచు పెట్టుకుపోవచ్చు. అంతే గానీ, మరో తెగతో అణిగిమణిగి వుండదు. గణ నిర్మాణంలో పాలకులు వుండరు. అందరూ సమానమే. హక్కులూ, విధులూ అన్నీ సమానమే. తిండీ, నిద్రా, వేటా వీటిని హక్కులు అనాలా?  భాద్యతలు అనాలా? అనే ప్రశ్న లాగే ఇవి కూడా వారికి అసందర్భంగా తోస్తాయి. ఆనాడు వర్గాలు లేవు. ఎందుకో తెలుసుకోవాలంటే, ఆనాటి ఆర్ధిక పరిస్థితులను పరిశీలించవలసి వుంటుంది.

           జనాభా చాలా తక్కువ. వేటాడేందుకు అడవులుంటాయి. వాటికి వెలుపల తటస్థ ప్రాంతపు అడవి  వుంటుంది. ఆ బయట మరో తెగ. వేటాడే అడవి. శ్రమ విభజన చాలా ప్రాధమిక దశలో సరళంగా వుంటుంది. మగవాడు యుద్ధానికీ, వేటకీ, చేపలు పట్టడానికీ వెళతాడు. తిండికి ఉపయోగించే ముడి వస్తువుల్నీ వాటిని సంపాదించేటందుకు వినియోగించే పరికరాల్ని సంపాదించుకుంటాడు. ఆడది ఇల్లు చూసుకుంటుంది. తిండీ, బట్టా తయారు చేస్తుంది. వంటా, కుట్టుపనీ, నేత పనీ చూస్తుంది. ఇది స్త్రీ, పురుషుల మధ్యన శ్రమవిభజన. వారు తయారు చేసుకున్నవీ, వారు వాడుతున్నవీ వారి స్వంతం. చాలా కుటుంబాలు కలసి సమిష్టిగా గ్రుహ నిర్వహణ చూసుకుంటాయి. ముఖ్యంగా వాయువ్య అమెరికాలో, క్వీన్ చార్లెటీ ద్వీపాలలోని హైదా తెగల్లో ఏడువందల మంది కలసి ఉంటున్న ఇళ్ళున్నాయి. నూట్కాలలో తెగంతా ఒకే వెన్నువాసం కింద జీవిస్తారు. ఇల్లూ, తోటా, పడవా లాంటి వాటిని సమిష్టిగా తయారు చేసుకుంటారు. సమిష్టిగా అనుభవిస్తారు. అది సమిష్టి ఆస్తి. అందుచేత తన శ్రమతో స్వయంగా సంపాదించుకున్న ఆస్తిని స్వంతానికి కలిగి వుండడం ఈ కాలంలో మాత్రమే అమలులో వుంది. ప్రస్తుతం నాగరికపు కాలంలోనే ఇట్టి పద్ధతి అమలులో ఉందంటూ న్యాయ శాస్త్రగ్న్యులూ, ఆర్ధిక వేత్తలూ చెప్పే మాటలు వట్టి బూటకం. ఆధునిక పెట్టుబడిదారీ ఆస్తి ఈ చిట్టచివరి న్యాయ శాస్త్ర సంబంధమైన అబద్ధం మీద ఆధారపడి వుంది.(ఇందులో ఉదహరించిన కాలంలో మాత్రమే స్వంత ఆస్తి అనేదానికి అర్ధం వుంది. ఎందుకంటే, ఆ కాలంలో శ్రమదోపిడి లేదు. అందరూ శ్రమ చేసేవారు. అందరూ అనుభవించేవారు. వారి ఆస్తి వారి శ్రమే. శ్రమ దోపిడీ మొదలయిన తరవాత ఈనాటి వరకూ స్వంత ఆస్తి అనేమాటకు అర్ధం లేదు.}

         కానీ, మానవ సమాజం గణ వ్యవస్థతో ఆగిపోలేదు. జంతువుల్ని మచ్చిక చేసుకున్నారు. అడవి దున్నల్నీ, గేదేల్నీ అయితే వేటాడి పట్టుకోవాలి. అదే మచ్చికైన ఆవు అయితే రోజూ పాలు ఇస్తుంది. ఏటా ఒక దూడని పెడుతుంది. బాగా అభివృద్ధి చెందిన ఆర్యను, సెమైట్, బహుశా తురానియన్ మొదలయిన తెగల వాళ్ళంతా పశువుల్ని మచ్చిక చేయడం, మందల్ని పెంచడమే ప్రధాన వ్రుత్తిగా పెట్టుకున్నారు. అనాగరిక జన సామాన్యం నుండి గోపాలక తెగలు విడిపోయాయి. ఇదే మొట్ట మొదటి సామాజిక శ్రమ విభజన. గోపాలకులు ఇతర అనాగరిక జాతుల కన్నా జీవితావసర వస్తువుల్ని హెచ్చుగా సంపాదించుకోగలిగారు. కొత్త కొత్త వస్తువుల్ని కూడా తయారు చేసుకునే వారు.(వాళ్ళు కేవలం వేట. ప్రకృతిలో ఏది దొరికితే అదే జీవనం. వీళ్ళు అలా కాదు. పశువుల్ని మచ్చిక చేసుకున్నారు. } 

     పాలూ, పాలనుంచి తయారయిన వస్తువులూ, వున్నీ, గొర్రె బొచ్చు ద్వారా బట్టలూ – ముడి వస్తువులు అధికంగా లభ్యమయ్యే కొద్దీ ఈ వస్తువులు అందరికీ అందుబాటులోకి రాసాగాయి. దీనితో వస్తువుల క్రమబద్ధమైన మారకానికి మొట్ట మొదటిసారిగా అవకాశం ఏర్పడింది. (వస్తువులు పెరగడంతో మారకాలు పెరిగాయి.} ఆయుధాల్నీ, పరికరాల్నీ తయారు చెయ్యడం లో ప్రత్యేక నిపుణత ఏర్పడినప్పుడు తాత్కాలిక శ్రమ విభజన అమలు లోకి వచ్చి వుంటుంది. (ఇక్కడ ఒక విషయం గమనించాలి. అంతవరకూ శ్రమ పరికరాలు ఎవరికి వారే తయారు చేసుకునే వారు. కానీ, క్రమంగా కొంతమంది మనుషులు అవే తయారు చేసేవారు. దాంతో అవి తయారు చెయ్యడంలో నిపుణత ఏర్పడుతుంది. ఇంక వాళ్లకి అదే ప్రధాన వ్రుత్తి అయిపోతుంది. మన దేశంలో కులాలు అలాగే ఏర్పడివుంటాయి. సమాజంలోకి కొత్త వస్తువులు పరిచయం అవుతున్న కొద్ది ఈ విభజన మరింతగా పెరుగుతుంది.} రాతి పనిముట్లు తయారుచేసిన కర్మ శాలలు చాలా చోట్ల లభ్యమవుతున్నాయి. ఇవి కొత్త రాతియుగం నాటివనడం నిస్సందేహం.  వీటిల్లో పనిచేసిన వాళ్ళు గ్రామానికి అంతటికీ కావలసిన వస్తువుల్ని తయారు చేస్తుండి వుంటారు. ఏది ఎలా వున్నా ఆ దశలో మారకం తెగలోని వారి మధ్యనే జరుగుతూంది. అదీ అరుదు. కానీ, గోపాలక తెగలు స్థిరపడిన తర్వాత, వేరు వేరు తెగల మధ్య మారకాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అది ఇంకా అభివ్రుద్ధి పొంది, క్రమబద్ధమైన వ్యవస్థ గా స్థిరపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట్లో నాయకుల ద్వారా మారకాలు జరిగివుంటాయి.[ఇప్పుడు కూడా అంతే కదా! దేశాల మధ్య మారకాలు జరగాలంటే నాయకుల ద్వారానే కదా] క్రమంగా మనుషుల మధ్య మారకాలు జరిగి చివరకు అదే ఏకైక పద్దతి అయిపోయింది. గోపాలకులు తమ ఇరుగుపొరుగు వారితో మార్చుకునే ప్రధానమైన వస్తువు పశువు. ఇతర వస్తువుల విలువను సరి పోల్చుకునే వస్తువు పశువు. దానిని ప్రతివారూ అంగీకరించారు. సూక్ష్మం‌లో చెప్పాలంటే డబ్బు చేసే పనిని పశువు నెరవేర్చింది.[అందుకే ఈనాటికీ ఆవుల్ని ‘సొమ్ములు‘అంటారు] సరుకుల మార్పిడి ప్రాధమిక దశలో వున్న ఆరోజుల్లోనే ‘డబ్బు’అనే సరుకు యొక్క అవసరం అతి వేగంగా అభివ్రుద్ధి చెందింది.[డబ్బు కూడా సరుకే]     

        అనాగరికకాలపు మొదటి దశలో పళ్ళ తోటల పెంపకం గురించి ఆసియా వాసులు బహుశా ఎరగరు. కానీ, మధ్య దశ నాటికి దానిని నేర్చుకున్నారు. వ్యవసాయానికి అది నాంది. తురానియన్ పీఠభూముల్లో శీతా కాలం చాలా నెలలు వుంటుంది. ఆ వాతావరణంలో పశుగ్రాసం జాగ్రత్త చేసుకుంటే తప్ప పశువుల్ని పోషించు కోవడం సాధ్యం కాదు. అందుచేత పశువుల మేత కోసం ధాన్యం, గడ్డి సంపాదించడానికై భూమిని సేద్యం చేయవలసిన అవసరం ఏర్పడింది. [అవసరం కొన్ని పనులు నేర్పుతుంది.] చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఒకమారు పశువుల కోసం ధాన్యం పండించాక అది మనుష్యులకే ఆహరం అయింది. సేద్యంలో వున్న భూమి, తెగ అందరిదీ. ప్రారంభంలో గణాల వారిగా పంచేవారు. తర్వాత గణాలు సామూహిక గ్రుహాలకు పంచాయి. అటు పిమ్మట వ్యక్తుల ఉపయోగానికి ఇవ్వసాగారు. ఆ వ్యక్తులకు కొన్ని హక్కులు ఇచ్చారే గానీ, అంతకు మించి మరేమీ లేదు.

       ఈ దశలో పారిశ్రామికంగా సాధించిన రెండు విజయాలు ప్రధానమైనవి. ఒకటి మగ్గం. రెండు లోహాలను కరిగించి ఉపయోగించడము – వాటిలో రాగీ, తగరమూ, ఆ రెండింటి మిశ్రమం వలన తయారయిన కంచు. కంచుతో ఆయుధాలూ, పనిముట్లూ చేసుకున్నారు. కానీ, రాతి పనిముట్లు పూర్తిగా పోలేదు.  అప్పటికింకా  ఇనుము రాలేదు. నగలకూ, అలంకరణలకూ వెండీ, బంగారమూ రానారంభించాయి. వాటి విలువ రాగీ, కంచు కన్నా హెచ్చుగా వున్నదని భావించవచ్చు.[వెండి, బంగారాలకు ఎందుకు విలువ ఎక్కువ? అంటే, ఎక్కువ శ్రమతో తక్కువ దొరికేది. అందుకే విలువ హెచ్చు]

      పశువుల పెంపకం, వ్యవసాయం, గ్రుహ పరిశ్రమలు మొదలయిన అన్ని శాఖల్లోనూ ఉత్పత్తి హెచ్చింది. మానవుని శ్రమ అతని పోషణకు సరిపడే దానికన్నా హెచ్చు సంపదను ఉత్పత్తి చేయగలుతున్నది. అదే సమయంలో చేయవలసిన పని కూడా  పెరుగుతున్నది. ఈ దశలో అదనపు శక్తి అవసరమైనది. యుద్ధం ఆ కొరతను తీర్చింది. యుద్ధ ఖైదీలను బానిసలను చేయసాగారు. [పని పెరుతున్నది. జనాభా పెరుగుతున్నది. ఒకదానికొకటి సరిపోతున్నది. కానీ, యుద్ధంలో పట్టుబడిన బయట వారిని చంపేయ కుండా పనులు చేయించు కోవడం ప్రారంభించారు.] శ్రమ యొక్క ఉత్పాదక శక్తి పెరిగింది. [ఉత్పాదక శక్తి పెరగడం అంటే, యంత్రం వచ్చేసిందని కాదు. చిన్న చిన్న శ్రమ పరికరాలలో అభివ్రుద్ధి కూడా ఉత్పాదక శక్తిని పెంచుతుంది. ఉదాహరణకు కుట్టు. సూదిని కనిపెట్టడం కూడా ఉత్పాదక శక్తి పెరగడమే.] తత్ఫలితంగా సంపదలు పెరిగాయి. ఉత్పత్తి రంగాలు విస్తరించాయి. ఫలితంగా ఆనాటి చారిత్రక పరిస్థితుల్లో మొట్ట మొదటి సామాజిక శ్రమ విభజన బానిసత్వాన్ని అనివార్యం గా తీసుకొచ్చింది. సంఘంలోని శ్రమ యొక్క విభజనతో సంఘమే రెండు వర్గాలుగా విడిపోయింది. యజమానులూ-బానిసలూ, దోపిడీ చేసేవాళ్ళు-దోపిడీకి గురయ్యే వాళ్ళు.

    తెగల, గణాల వుమ్మడి సొత్తుగా వున్న మందలు, కుటుంబ పెద్దల స్వంత సొత్తుగా మారినదెప్పుడో, అది ఏవిధంగా జరిగిందో ఇప్పటికీ చెప్పడం కష్టమే. మొత్తం మీద ఈ కాలంలోనే ఇది జరిగి వుంటుంది. మందలూ, ఇతర సంపదలూ అభివ్రుద్ధి పొందడంతో కుటుంబ వ్యవస్థలో ఒక పెద్ద విప్లవమే వచ్చింది. జీవితావసరాల్ని సమకూర్చే పరికరాలు ఎప్పుడూ అతని స్వంత ఆస్తి గానే ఉండేవి. ఇప్పుడా జీవితావసరాల్ని సమకూర్చే పరికరాలూ, మందలూ, పశువుల్ని మచ్చిక చేసుకోవడమూ వాటిని కాచుకోవడమూ మగవాని పనులు. అందుచేత పశువులు అతనివి. వాటిని మార్చుకొని సంపాదించుకొన్న సరుకులూ, బానిసలూ అతని సొత్తు.[డబ్బు ప్రవేశిస్తే డబ్బు కూడా]ఈ జీవితావసర వస్తువుల్ని స్వంతం చేసుకోవడం వలన వచ్చిన అదనపు ఉత్పత్తి అంతా మగవాడిది. [అదనపు ఉత్పత్తి అంటే, తమ కుటుంబ అవసరాలు పోగా మిగిలినదంతా అదనపు ఉత్పత్తే. అది ఎలా వస్తుందంటే, బయట నున్న ఉత్పత్తి సాధనాల వలన. అవి ఏమిటి? పశువులూ, బానిసలూ. పశువులు పాలు ఇస్తాయి. అవి కుటుంబ అవసరాలకు పోనూ మిగతావి ఏం చేస్తారు? డబ్బుకి అమ్ముతారు. అదే వ్యవసాయం అయితే బానిసల చేత పనిచేయిస్తారు. వచ్చిన పంట లో స్త్రీ భాగస్వామ్యం లేదు. వాటి మీద అధికారం మగవాడిదే. అదే క్రమంగా సంపద అయింది. స్త్రీ కూడా ఇంటి పనీ, వంట పనీ చేస్తుంది. కానీ, అదంతా నాలుగు గోడల మధ్యనే ఖర్చు అయిపోతుంది. ఆ శ్రమ బయటకు వెళ్లి డబ్బుగా మారదు. కాబట్టి సంపద అనుకునేదంతా మగవాడిదే అన్నట్లు కనబడుతుంది.] ఆడది ఆ వస్తువులను వానితో కలసి అనుభవించగలదు. అంతే గానీ వాటిలో ఆమెకు వాటా లేదు. 

           శ్రమ విభజనలో ఇప్పుడు మార్పేమీ లేదు. కానీ, అది గ్రుహ సంబంధాల్ని తలక్రిందులు చేసింది. దీనికి కారణం కుటుంబానికి వెలుపల శ్రమ విభజనలో వచ్చిన మార్పే. [మొదటి శ్రమ విభజనకూ, దీనికీ చాలా తేడా వుంది. మొదటి శ్రమ విభజనలో అదనపు ఉత్పత్తి లేదు. ఇప్పుడు వుంది. ఎందువలన? ఒకటి: బానిసల వలన. రెండు: చిన్న స్థాయిలో నయినా ఉత్పత్తి శక్తుల అభివ్రుద్ధి వలన.మూడు: నిలవ సామర్ధ్యం కలిగిన  కొత్త ఉత్పత్తులు పరిచయం కావడం వలన.]

             దీనిని బట్టి మనకు ఏం బోధ పడుతుంది? స్త్రీ సామాజిక ఉత్పత్తి రంగానికి దూరమై స్వంత ఇంటి పనుల లోనే మునిగి ఉన్నంత కాలమూ ఆమె స్వతంత్రురాలు కాలేదు. మగవానితో సమాన హక్కుల్ని పొందలేదు. ఇనుము విశాల భూభాగాల్ని సేద్యం లోకి తెచ్చింది. అడవులు బయళ్ళుగా మారాయి. రాళ్ళనీ, ఇతర లోహల్నీ కూడా చేధించగలిగిన గట్టిదనం, వాడీ వున్నా పనిముట్లు అతనికి లభించాయి. అయితే, ఈ పనులన్నీ ఒక్క రోజులో జరిగిపోలేదు. మొదట తయారుచేసిన ఇనుము, కంచు కంటే మెత్తగా వుండేది. అందుచేతనే రాతి పనిముట్లు క్రమ క్రమంగా గాని అంతరించలేదు.

             ఆటంకాలనీ, అభ్యంతరాల్నీ దాటుకొని అభివ్రుద్ధి అతి వేగంగా జరిగింది. పట్టణాలు వెలిశాయి. రాళ్ళూ, ఇటికలతో ఇళ్ళు కట్టడం ప్రారంభమయింది. నగరాల్ని రక్షించుకునేందుకు రాతి గోడలూ, గోపురాలూ, కోటలూ బురుజులూ నిర్మించారు. దాడులూ, ప్రమాదాలూ ఎక్కువ అవుతున్నాయని వాటి నుండి ఆత్మ రక్షణ అవసరాన్ని ఇవి సూచిస్తున్నాయి.[ఎవరి నుండి ఆత్మ రక్షణ పేదలనుండీ, బానిసల నుండి] సంపద విశేషంగా పెరిగింది. కానీ, ఇప్పుడు అది విడి వ్యక్తుల స్వంతమైనది. నేతా, లోహ పరిశ్రమలూ, ఇతర పరిశ్రమలూ పెరిగి అనేక రకాల కొత్త వస్తువులు తయారవుతున్నాయి. వాటి తయారీలో ఎంతో వైవిధ్యమూ, కళాత్మకత వచ్చింది. [వాటిలో నైపుణ్యత వచ్చింది అంటే అర్ధం, వాటికి మాత్రమే పరిమిత మైన వ్రుత్తి పనివారలు తయారయ్యారని అర్ధం.] వ్యవసాయ ఫలితంగా ధాన్యమూ, పప్పులూ, పళ్ళూ మాత్రమే కాదు నూనె, సారాయి కూడా లభ్యమవుతున్నాయి. ఇన్ని రకాల పనుల్ని ఒకే మనిషి చెయ్యలేడు. రెండో సామాజిక శ్రమవిభజన జరిగింది. [రెండో సామాజిక విభజన అంటే, శ్రమలు విడిపోయాయి. వ్రుత్తి పనివారలు ప్రవేశించారు. ఉదాహరణకు నాగలి కావాలంటే, ఎవరికి వారే ఇంట్లో చేసుకునేవారు. చాలామందికి అది అవసరం కాబట్టి, కొన్నాళ్ళకు కేవలం అదే పనిగా [వ్రుత్తి గా]ఒక కుటుంబం విడిపోయి వుండాలి. అలాగే మిగతా వ్రుత్తులు] చేతిపనులు వ్యవసాయం నుండి విడిపోయాయి. శ్రమ ఉత్పాదకతా, వుత్పత్తీ నిరంతరాయంగా అభివ్రుద్ధి పొందడంతో మానవుని శ్రమ శక్తికి విలువ ఎంతగానో పెరిగింది. ఇంత వరకూ బానిసత్వం అక్కడా, అక్కడా అతి ప్రాధమిక దశలో వుండేది. నేడు అది సామాజిక వ్యవస్థలో ఒక భాగం అయింది. 

        బానిసలు ఉత్పత్తులకు సాయం చెయ్యడం మాత్రమేనా! పొలాలలో పనిచేసేది వారే అయ్యారు. [మొదట్లో సాయం లాగే ప్రారంభం అయి వుంటుంది. తరువాత మొత్తం పని బానిసల చేతే చేయించి ఉండ వచ్చు. చివరకు అదే స్థిరపడి పోయింది.] వ్యవసాయం, పరిశ్రమలూ అనే రెండు ప్రధాన విభాగాలుగా ఉత్పత్తి విధానంలో విభజన వచ్చాక కేవలం మారకం కోసమే ఉత్పత్తి జరగడం మొదలయ్యింది.[ఇది చాలా ప్రధాన మైన విషయం. ఉత్పత్తి విధానంలో విభజన వచ్చాక…..వచ్చాక ఏం జరిగిందంటే, గతంలో ఉత్పత్తులు అవసరం కోసమే. తమ గణంకోసం లేదా తమ తెగ కోసం. ఇప్పుడు అలా కాదు. పరిశ్రమలు వచ్చాయి. ఉత్పత్తి శక్తి పెరిగింది. చిన్నస్థాయి యంత్రాలు అనుకోవచ్చు. ఇప్పుడు ఉత్పత్తి తమ తెగ అవసరాలకు మించి అవుతోంది. దీన్ని అమ్మాలి. అమ్మితే డబ్బు వస్తుంది. ఈ డబ్బు అనేది నిలవ వున్న శ్రమ. దాన్ని ఇంట్లో భద్రంగా వుంచుకొని తరవాత కాలంలో తమ  విలాసాలూ, అవసరాలు  తీర్చుకోవచ్చు. కాకపోతే ఈ అమ్మకాల కోసం దూర ప్రదేశాలు వెళ్ళాలి. వెళ్లారు కూడా.]

         వర్తకపు సరుకులు ఉత్పత్తి అయ్యాయి.(సరుకులు అంటేనే, అమ్మకం కోసం సిద్దమైన వస్తువు అని. వర్తకపు సరుకులు కేవలం అమ్మకం కోసమే ఉత్పత్తులు. గతంలోలాగా గణ అవసరాల కోసం వస్తువులు అనే దశ దాటిపోయింది )  దానితో పాటు తెగ లోపలా, సరిహద్దుల లోపలా మాత్రమే కాకుండా సముద్రాంతర దేశాలలో కూడా వ్యాపారం ఆరంభమయింది. కానీ, ఇవన్నీ ఇంకా ప్రారంభ దశలోనే వున్నాయి. వెండీ, బంగారాలూ ప్రాముఖ్యానికి వస్తున్నాయి.[వర్తకపు సరుకులు అంటే, సరుకులు తీసుకు రావడానికీ, తీసుకు వెళ్ళడానికి అవసరమైన  సంచులూ, రవాణా చెయ్యడానికి వాహనం లాంటివి. ఆకాలంలో వాహనం అంటే గుర్రాలూ, ఒంటెలూ. వర్తకపు సరుకులతో గత కాలంలో పనిలేదు. వర్తకమే లేదు. అసలు దూర దేశాలు వెళ్ళవలసిన అవసరం లేదు. వెళ్ళినా అవి తెగ తాలుకా సహజ అవసరాల కోసమే.] అన్నిటితోనూ విలువ కట్టగల డబ్బు అప్పుడప్పుడే అమలులోకి వస్తున్నది. కానీ, నాణేలు ఇంకా పోత పోయ్యలేదు. తూకాన్ని బట్టి మాత్రమే వాటికి విలువ కడుతున్నారు. 

        ఈ కొత్త శ్రమవిభజన ఫలితంగా సమాజంలో వర్గాలు ఏర్పడ్డాయి. బానిసలూ- యజమానులూ. బీదలూ-ధనికులూ ఏర్పడ్డారు. ఇంటి పెద్దల స్వంత ఆస్తులలో ఏర్పడ్డ హెచ్చు తగ్గులు పూర్తిగా ఆ వ్యవస్థనే భగ్నం చెయ్యడానికి దారితీశాయి. సమిష్టి ప్రయోజనం కోసం ఏర్పడిన వుమ్మడి వ్యవసాయం అంతరించింది. సాగులోనున్న భూమిని మొదట ఇళ్ల వరసన ఏయేటి కాయేడు ఎప్పటికప్పుడు పంచి ఇచ్చేవారు.[వ్యక్తిగతంగా భూమిని పంచడం వలన ఒక్కోసారి పంటలు సరిగ్గా పండకపోవడంతో ఇతరులమీద ఆధార పడవలసి వస్తుంది.]   తర్వాత శాశ్వతంగా కేటాయించారు. అయితే, ఇది పూర్తిగా వ్యక్తిగత ఆస్తిగా మారిపోవడానికి  చాలా  కాలం పట్టింది. జంట పెళ్ళిళ్ళు, దంపతీ వివాహలుగా మారడంతో సమానం గానే ఈ మార్పు జరిగింది. ఇప్పుడు కుటుంబమే ఆర్ధిక యూనిట్ అయింది.

        జనాభా సాంద్రత బాగా పెరిగాక తెగలోని పనులూ, బయట పనులూ చేసుకోవడానికి మరింత ఏకీభావం అవసరమైంది. ఈ దశలోనే తెగలు సమాఖ్యలుగా [కాన్ఫెడరసీలు] ఏర్పడ్డాయి. అనేక వేరు వేరు తెగల భూములు కలసిపోయి ఒకే జాతి యొక్క ప్రాంతంగా ఏర్పడడం అవసరమైంది. సేనాపతి ఒకడు తప్పనిసరి అయ్యాడు. ఎక్కడెక్కడ ప్రజాసభలు లేవో అక్కడ అవి స్థాపించారు. సేనానాయకుడూ, కౌన్సిలూ, ప్రజాసభ ఇవి గణ వ్యవస్థ తాలుకా పరిపాలనాంగాలు.[సేనా నాయకుడు ఇతర తెగలతో యుద్ధం వచ్చినపుడు నాయకత్వం వహిస్తాడు. కౌన్సిలూ, ప్రజా సభ అంతా ప్రజాస్వామ్య బద్ధం గానే జరిగేది] ఇవి క్రమంగా సైనిక ప్రజాస్వామ్యం గా మారాయి.[ ఇప్పుడు వీటి పని ఇతర తెగలతో యుద్ధాలకే కాదు. బానిసలనీ, బీదలనీ అణిచి ఉంచడానికి కూడా.] యుద్ధం, యుద్ధ సన్నాహాలూ జాతీయ జీవనంలో ప్రధాన విధులైపోయాయి. అందుకే సైనిక ప్రజాస్వామ్యం అవసరమైంది. సంపదలు పోగుచేసుకునే వారికి ఇరుగుపొరుగుల ఐశ్వర్యాలమీద కన్నుకుట్టింది. వారు అనాగరికులు కదా! పనిచెయ్యడం ద్వారా కాకుండా, దోచుకోవడం ద్వారా సులువుగా, గౌరవప్రదం గా భావించారు.

      గతంలో యుద్ధాలు జరగడం వేరు. తమకి ఏదన్నా అపకారం జరిగినప్పుడు, తమలో జనాభా పెరిగి కొత్త భూమి కావలిసినప్పుడు మాత్రమే యుద్ధాలు జరిగాయి. ఇప్పుడవి ఒక వ్రుత్తిగా మారాయి. కేవలం దోపిడీ కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి. కోటల రక్షణ కింద నగరాలు పెరిగాయి. కోట గోడల మొదళ్ళలో తవ్విన కందకాలలో గణ వ్యవస్థ శిధిలమైపోయింది. కోట బురుజులు నాగరికత చిహ్నలయ్యాయి. ఈ దోపిడీ కోసం జరుగుతున్న యుద్ధాలలో సేనా నాయకులూ, ఉప సేనానాయకులూ బల పడ్డారు. కొత్త ఉద్యోగుల్ని ఎన్నుకునే టప్పుడు అంతకు ముందు పనిచేసే ఉద్యోగి కుటుంబం నుండే ఎన్నుకునేవారు. ఇప్పుడది మారిపోయింది. ముఖ్యంగా తండ్రి హక్కు ఏర్పడినాక పదవులు క్రమంగా వంశ క్రమానుగతం అయాయి. ఈ కొత్త పద్ధతిని ప్రజలు మొదట చూసీ చూడనట్లు వదిలేశారు. క్రమంగా ఆ పదవి మాదేనని అడిగే దశ వచ్చి, చివరకు అది హక్కుగా అనుభవించసాగారు. [మొదట్లో కుటుంబంలో ఎవరో ఒకరిని తీసుకునేవారు. క్రమంగా తండ్రి హక్కుగా కొడుక్కి  మాత్రమే ఇస్తున్నారు]

       తమ స్వంత వ్యవహారాలను తామే స్వేచ్ఛగా నిర్వహించుకునే తెగల వ్యవస్థ, ఇప్పుడు తమ పొరుగు తెగలను దోచుకొని అణచి వేసే వ్యవస్థగా తయారయింది. ఇది వరకు ప్రజాభిప్రాయాన్ని అమలు పరిచే సాధనాలుగా వున్న గణ వ్యవస్థ తాలూకా పరిపాలనాంగాలు, ఇప్పుడు ప్రజల మీద పెత్తనం వహించి వారిని అణచి పెట్టే స్వతంత్రమైన పరిపాలనాంగాలుగా పరిణామం పొందాయి.

         ఇప్పటికి మనం నాగరికత ఆరంభమయిన రోజుల్లోకి వచ్చేశాం. నాగరికత ఇంత వరకూ శ్రమ విభజనను స్థిర పరచడమే కాకుండా, మరో నూతన విభజనను కూడా స్రుష్టించింది. ఈ నూతన విభజన ఎంతో వింతైనదీ, ముఖ్యమైనదీ కూడా. ఉత్పత్తితో ఏ మాత్రమూ సంబంధం లేని ఒక వర్గాన్ని స్రుష్టించింది. వారే వర్తకులు.(ఇంత వరకూ వర్తకులు లేరు.) ఈ వర్తకులకు సంబంధం ఉత్పత్తితో కాదు, మారకంతో. ఇంత వరకూ వర్గాలనేవి ఉత్పత్తి రంగం లోనే ఏర్పడ్డాయి. ఆ రంగంలో పాల్గొంటున్న వ్యక్తులు పని చేయించేవారు గా కొందరూ, పని చేసేవారిగా కొందరుగా విడిపోయారు. ఇప్పుడు ఉత్పత్తిలో ఏ విధంగానూ పాల్గొనకుండా, ఉత్పత్తి విధానాన్ని అంతా చేతిలోకి తెచ్చుకొని, ఉత్పత్తిదారుల్ని ఆర్ధికంగా తన గుప్పిట్లో పెట్టుకొన్న వర్గం ఒకటి మొట్ట మొదట చరిత్ర రంగంలో ప్రత్యక్ష మైనది. ఇది ఇద్దరు ఉత్పత్తి దారుల మధ్య తప్పనిసరిగా అవసరమైన దళారి లాగ వ్యవహరించి, వుభయుల్ని దోచుకుంటుంది. వస్తువులను దూరపు మార్కెట్లకు అందిస్తూ ప్రజలకు మహోపకారం చేస్తున్నట్లు నటిస్తూ ఇతరుల కష్టాన్ని దోచుకునే వర్గం ఒకటి తయారయింది. సంఘంలో వీరు పరాన్నభుక్కులుగా తయారయ్యారు. వారు తాము చేస్తున్న స్వల్పమైన పనికి ప్రతి ఫలంగా స్వదేశంలోనూ, విదేశం లోనూ తయారవుతున్న దాంట్లో సారాన్నంత జుర్రేశారు. అశేషమైన సంపదలను పోగుచేసుకున్నారు. దానితో పాటు సంఘంలో పలుకుబడి సంపాదించుకున్నారు. ఈ పలుకుబడి తో వారు నాగరిక యుగంలో అధికంగా గౌరవాలూ, ఉత్పత్తి మీద ప్రాబల్యమూ సంపాదించుకున్నారు. 

      అభివ్రుద్ధి క్రమంలో మనం చర్చిస్తున్న దశ నాటికి ఈ వర్గం చిన్న వయసు లోనే వుంది. భవిషత్తులో ఈ వర్గం తను అంతగా ఎదుగుతానని కనీసం ఊహించి కూడా వుండదు. అయినా తను రూపొందుతోంది. తన అవసరం ఏమీ లేదని తోసేయ్యగల స్థితి ఆనాటికి లేదు. [మొదట్లో ఒక ప్రాంతం నుండి, మరొక ప్రాంతానికి అవసరాలూ, అందుకు అవసరమైన కొద్దిపాటి శ్రమ. దానికి తగ్గట్టుగా కొద్దిగా ప్రతిఫలం. ఈ విధంగా ప్రారంభమైన వర్తకం. ఇంతితై వటుడింతై అన్నట్లుగా ప్రపంచం అంతా కబంధుడిలా విస్తరించుకుంది. అసలు వర్తకం అంటే ఏమిటి? వస్తువుల ఉత్పత్తులతో ఏ మాత్రమూ సంబంధం లేని మీరు ఎందుకు? “అని తోసేయ్యగల స్థితి,” ఆనాడే కాదు, ఈనాడు లేదు] ఈ వర్గం తో పాటే లోహపు నాణేలు అమలులోకి వచ్చాయి. వర్తకపు సరుకులన్నిటినీ కొనగల వర్తకపు సరుకు, ఇతర వర్తకపు సరుకులన్నిటినీ తనలోనే ఇముడ్చుకోగల వర్తకపు సరుకు, కోరుకున్నంతనే తనకు కావలిసిన వస్తువును తీసుకురాగల అద్భుత శక్తి రూపొందింది. “అదే డబ్బు.” ఇది చేతిలో వున్నవాడు ఉత్పత్తిని చేతిలో పట్టుకోగలడు. ఇది అధికంగా ఎవరి వద్ద వుంది? వర్తకుల వద్ద. డబ్బు ముందు ఇతర సరుకులూ, వాటిని ఉత్పత్తి చేసేవారు కూడా సాష్టాంగం చేయవలసిందేననీ, దీనిముందు ఇతర సరుకులు దిగదుడుపేనని ప్రత్యక్షంగా నిరూపించాడు. 

       వర్తకపు సరుకులు డబ్బుకి అమ్ముడుపోవడం మొదలయ్యాక అప్పులివ్వడం అమలులోకి వచ్చింది. దానితో, వడ్డీలూ, వడ్డీ వ్యాపారమూ వచ్చాయి. ప్రాచీన కాలం నాటి ఏథెన్సు నగరం లోనూ, రోమ్ లోనూ అప్పులిచ్చే వాడి నుండి, అప్పులు తీసుకునే వాడి పట్ల చూపించే నిర్దయ మరే చట్టాలలోనూ లేదు. వర్తకపు సరుకులూ, బానిసలూ, డబ్బు సంపదతో పాటూ భూసంపద కూడా పెరిగింది. తాత్కాలిక ఉపయోగం కోసం గణాలూ, తెగలూ తమ సభ్యులకు పంచి ఇచ్చిన భూఖండాలు వారి వారి ఆస్తిగా మారిపోయాయి. ఇక ఎవరికి వారు తమ హక్కుల్నీ, అధికారాన్ని స్థిర పరచుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు.[గతంలో గణానికి అంతటికీ వున్న ఆస్తి వ్యక్తిగతం అయిపోయింది.] గణ సమాజానికి భూమి మీద హక్కు వుండడం వారి చేతులకు సంకెల వేసినట్లయింది. ఆ సంకెల బరువు తీరాక వారికి కొత్తగా లభించిన ఆ భూమి ఆస్తి బరువు తీరిపోయింది. భూమి మీద స్వేచ్చాయుతమైన పూర్తి హక్కు ఏర్పడడమంటే దానిని కలిగివుండేటందుకు నిషేధాలూ, నిర్భంధాలూ లేకపోవడమేనా? [గణం భూమిని కలిగి వుండడం సంకెల లాగా అనిపిస్తోంది. ఎలాగంటే, ఒకపక్క ఇతర తెగలలో కొంతమందికి స్వంత భూమి వుండగా, మొత్తం గణాలోని అందరికి వున్న భూమికి నాయకులు జవాబు దారిగా వుండడం వారికి సంకెల లాగ వుంది.] భూమిని అన్యాక్రాంతం చెయ్యగలగడం కూడా అందులో భాగమే. భూమి గణపు హక్కుగా ఉన్నంత కాలం అటువంటి హక్కు మనిషికి లేదు. [భూమి గణానికి చెందినది. వ్యక్తిగతంగా ఏ ఒక్కడికీ హక్కు లేదు.]  

        గణానికీ, తెగకూ భూమి మీద హక్కు వుండడం భూస్వామి కి పెద్ద సంకెల. ఆ సంకెళ్ళను తొలగించడంతో కొత్త యజమానులకు తమ భూములతో వున్న అవిభాధ్య సంబంధాలు[విభజించడానికి వీలుకాని సంబంధాలు]  తెగిపోయాయి. భూమి వ్యక్తిగత ఆస్తిగా మారిపోయిన కాలంలోనే డబ్బు కూడా కనిపెట్టబడింది. వ్యక్తిగత ఆస్తి అనే మాటకు అర్ధం ఏమిటో అది చూపించింది. భూమి కూడా ఒక వర్తకపు సరుకే. [ భూమి అంతవరకూ తెగలకు సంబంధించిన సమిష్టిది. ఇప్పుడు భూమికూడా ఒక వర్తకపు సరుకుగా మారిపోయింది.అంత క్రితం వరకూ భూమి సహజ వనరు. అది ఇప్పుడు ఒక వర్తకపు సరుకుగా మారిపోయింది. దానికి “ధర”వచ్చింది. దున్ని, దానిని వ్యవసాయ యోగ్యంగా చేసిన భూమికి ధర ఉండడం సహజమే. కానీ, బంజరు భూమికి కూడా ధర వచ్చింది. అది ఎంతలా మారిపోయిందంటే, భూమికి ధర లేదు అని ఎవరైనా అంటే, నమ్మలేనంత గా మారిపోయింది] దానిని అమ్మవచ్చు. కొనవచ్చు. తనఖా పెట్టుకోవచ్చు. అది వ్యక్తిగత ఆస్తిగా మారడంతోనే భూమి తనఖా వచ్చింది. దంపతీ వివాహంతో పాటూ హెటెరిజం, వ్యభిచారం వెన్నంటి వచ్చినట్టే, భూమి హక్కుతో పాటూ తనఖా కూడా వచ్చింది. మానవుడు భూమిమీద సంపూర్ణాధికారం కావాలనుకున్నాడు. దాన, దమన విక్రయాధికారాలు వుండాలనుకున్నాడు. అది లభించింది.       

         వ్యాపారం, డబ్బూ, వడ్డీ వ్యాపారమూ భూమి మీద వ్యక్తిగత యాజమాన్యం తనఖా ఇవి వ్రుద్ధి పొందే కొద్దీ ఒక చిన్న వర్గం చేతుల్లోకి సంపదలు పోగుపడి అతి వేగంగా కేంద్రీక్రుతమయ్యాయి. ప్రజాసామాన్యంలో దారిద్ర్యంలో మునిగివుండే ప్రజల సంఖ్య పెరగ సాగింది. ఆది నుండి ధనిక వర్గం, పాత తెగల ప్రభు వర్గం నుంచి భిన్నంగానే వ్రుద్ధి పొంది, క్రమంగా వారిని వెనక్కి నెట్టేసింది. సంపదల హెచ్చు తగ్గులను బట్టి పౌరులలో వర్గాలు ఏర్పడడంతో బానిసల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. బల ప్రయోగంతో పని చేయించారు. బానిస శ్రమ పునాది పై సమాజ ఉపరితల నిర్మాణం పోషింపబడింది. 

      ఇప్పుడు గణవ్యవస్థ ఏమైందో చూద్దాం. గణ వ్యవస్థ ప్రమేయం లేకుండానే, నూతన శక్తులు అభివృద్ధి చెందాయి. ఈ విషయంలో గణం నిస్సహాయమైపోయింది. గణం సజీవంగా గతంలో లాగే వుండాలంటే కొన్ని పరిస్థితులు వుండాలి. గణం గానీ, తెగ గానీ ఒకే నిర్ణీత ప్రదేశంలో వుండాలి. అ ప్రదేశంలో ఇతర తెగల ప్రజలు జీవించకూడదు. కానీ, ఆ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఏ ప్రదేశంలో చూసినా అనేక గణాలకు చెందిన వాళ్ళు వుంటున్నారు. వాళ్ళేకాక బానిసలూ, రక్షితులూ, విదేశీయులు అందరూ కలసిపోయారు. అనాగరిక కాలపు మధ్య దశ లోనే సంచార జీవితం వదిలేసి, స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. వ్రుత్తి, వ్యాపారాలు ఎక్కువయ్యాయి. గణ సభ్యులు వెనకటి లాగా ఒకే చోట వుండి వ్యవహారాలను చక్కబెట్టేందుకు కుదరదు.

     మత సంబంధమైన ఉత్సవాలవంటి అప్రధానమైన వాటి కోసం కేవలం మొక్కు తీర్చుకున్నట్టు సమావేశమయ్యే వారు, అంతే. శ్రమ విభజనతో పాటు అనేక చేతి వ్రుత్తుల వాళ్ళు బయలుదేరారు. ఒక్కొక్క తరహా వ్రుత్తి లోనే అనేక గణాలకూ, అనేక ఫ్రౌట్రీలకూ, అనేక తెగలకూ సంబంధించిన అనేకులు పనిచేస్తున్నారు. విదేశీయులు వచ్చి చేరారు. అందుచేత నూతనంగా ఏర్పడిన పరిపాలనా సంస్థలు గణ వ్యవస్థకు వెలుపల, దాని సరసన పోటీగా నిర్మించవలసి వుంటుంది. ప్రతి గణ వ్యవస్థ లోనూ వైరుధ్యం పనిచేస్తూనే వుంటుంది. పల్లెలకూ, పట్టణాలకూ మధ్య ప్రయోజనాల్లో వైరుధ్యం ఏర్పడింది. ఒకే గణంలో, ఒకే తెగలో ధనికులూ, దరిద్రులూ, రుణ దాతలూ, రుణ గ్రస్తులూ వుంటున్నారు. మరొకటి కూడా జరుగుతుండేది. బయట జనం ఎందరో వచ్చేసేవారు. వారు తమలో ఇముడ్చు కోలేనంత ఎక్కువ మంది వుండేవారు.

          ఇక చివరి విషయం. అంతర్ వైరుధ్యాలు లేని సమాజంలో గణ వ్యవస్థ ఏర్పడింది. అది ఆ సమాజానికే తగును. ప్రజాభిప్రాయం మినహా దానిచేతిలో మరొక నిర్భంధ పరికరంలేదు.[నిర్భంధ పరికరం ఉండాల్సిన అవసరం దానికి లేదు. గణ వ్యవస్థలో అందరూ సమానం గానే వున్నారు. ఓడిపోయిన బయట తెగల వారిని సోదరులు లాగే భావించేవారు. కాబట్టి నిర్భంధం లేదు. ఎప్పుడైతే వర్గాలు ఏర్పడ్డాయో నిర్భంధం అవసరమయ్యింది. ధనిక వర్గం, బానిసల చేత, బీదల చేత పనిచేయించు కోవలసిన అవసరం వచ్చింది.] ఈ వైరుధ్యాలు ఉత్తరోత్తరా తీవ్రమవుతాయే గానీ, సమన్వయం కావు.

         అందుచేత రాజ్యం అనేది పై నుంచి ఎవరో సమాజం మీద రుద్దిన శక్తి కాదు. రాజ్యం ఏర్పడింది అంటే, ఆ సమాజంలో సమన్వయించడానికి సాధ్య పడని ఆత్మ వైరుధ్యాలు వచ్చాయని అర్ధం. తనకు స్వాధీనంలో లేని, సర్దుబాటుకు సాధ్యంకాని శత్రు వైరుధ్యాలు దానిలో పుట్టాయన్నమాట. [ఏమిటా వైరుధ్యాలు? గణ వ్యవస్థ అలాగే వుండాలంటే… ఒకే చోట స్థిర నివాసం వుండాలి. జనాభా పెరగకూడదు. దానిని నియంత్రించే గ్న్యానం అప్పటికి లేదు. జనాభా పెరిగితే, తిండి సమస్య. వనరులు కావాలి. వనరులు ఉపయోగించు కోవాలంటే పరికరాలు కావాలి. అవి చెయ్యాలి. గతంలోలాగా కొద్దిగా కొద్దిగా కుదరదు. ఎంతగా వనరులను ఉపయోగించుకుంటే అంతగా శ్రమ పరికరాలు కావాలి. అవి చెయ్యడానికి వ్రుత్తి అనేది వేరుపడిపోయింది. ఇలాంటి అవసరాలు పెరుగుతున్న కొద్దీ ఇతర తెగల నుండి మారకాలు మొదలయ్యాయి. మారకాలకు డబ్బు అవసరం పడింది. డబ్బు ద్వారా శ్రమని నిల్వ చేసుకునే సౌకర్యం వచ్చింది. ఒక పక్క భూమి సాగు చేసి పంటలు పండించడం లాంటి పని చెయ్యడానికి పక్క తెగనుండి తీసుకువచ్చిన వారు బానిసలయ్యారు.[గతంలో సోదరులుగా భావించిన వాళ్ళే] అధికంగా వనరులను ఉపయోగించడం వలన అధికంగా ఉత్పత్తి వస్తుంది. అధిక ఉత్పత్తిని ఏం చెయ్యాలి. మరో తెగకు అమ్మేయ్యాలి.[బానిసలకు తిండి పడేస్తే చాలు] తద్వారా డబ్బు చేరుతుంది. డబ్బుతో అదనపు సౌకర్యాలు చేకూరతాయి. కొంత మంది బ్రతుకు తెరువును వెతుక్కుంటూ వలసలు వెళ్ళిపోయారు. గణాలు, తెగలూ, మనుషులూ అటునుండి ఇటూ, ఇటు నుండి అటూ వలసలు వెళ్ళిపోయారు. ఇలాంటి మార్పులు జరుగుతున్నప్పుడు గణ వ్యవస్థ నిలబడ్డం అసాధ్యం.]

        ఈ విభజనకు ఫలితంగా రాజ్యం తప్పనిసరి అయింది. ఉత్పత్తి పరిణామ క్రమంలో ఇప్పుడొక ప్రత్యేక దశను సమీపిస్తున్నాం. ఈ దశలో వర్గాలుండడం అనవసరమే కాదు, ఉత్పత్తికి ఆటంకం కూడాను. అవి ఎలా పుట్టాయో, అలాగే తప్పనిసరిగా అంతరిస్తాయి. వాటితోపాటు రాజ్యం కూడాను. ఉత్పత్తి దారులు సమానమూ, స్వతంత్రమైన హోదాలో ఉత్పత్తిని సాగించేటట్లు సమాజం పునర్నిర్మాణం అవుతుంది. అది ప్రాచీన రాజ్య యంత్రాన్ని వస్తు ప్రదర్సన శాలకు మార్చి రాట్నం, కంచు గొడ్డలి మొదలైన వాటి సరసన భద్ర పరుస్తుంది.  

[ఇది పరిచయమే కాబట్టి, మూలంలో వున్న అన్ని విషయాలు ఇందులో వుండవు. అయినా కొంత పెద్దదిగానే అనిపించింది. అసలు కుటుంబ వ్యవస్థ ఎలా ఏర్పడింది? వ్యక్తిగత ఆస్తికీ,రాజ్యాంగం ఏర్పడడానికి ఎలాంటి పరిణామాలు సంభవించాయో కనీసం అర్ధం చేసుకోవాలంటే  ఈ మాత్రం అవసరం అయింది. అయితే, మూలం చాలా అద్భుతంగా వుంటుంది. అది కూడా చదివితే అనేక విషయాలు తెలుస్తాయి. మూలం చదవడం కోసమే ఈ పరిచయం ]

(ముగిసింది )

Leave a Reply