కాలపు చరకలో కొంత గతాన్ని
వొదులుకున్నాను
బంగారుభవిష్యత్తీగను వొడికి
ఇస్తుందని వేచి చూస్తున్నాను
****
చెరువును అంగీలా
తొడిగిన నేల
చేపల్ని
నగిషీలు చేసుకుంది
***
వెన్నెల అద్దంలో
తన మోము చూసుకొని
చెరువు
మురుసిపోతోంది
***
ఎండ మగ్గం తో
మబ్బుల బట్టను అల్లుకొని
కప్పుకుంది
నింగి
***
ఈ మౌన రాత్రిలో
కొంత శబ్దాన్ని కోరుకున్నాను
వెన్నెల కొలనును
ముద్దాడింది
***
చేపలకు కొలను చెబుతున్న
కథలను
తారకలు కూడా
ఊ కొడుతూ వింటున్నాయి
***
కొలనును కాగితం చేసుకొని
కవిత్వం రాస్తున్నాడు
చందమామ
చేప పిల్లలు అక్షరాలు
***
సూఫీ పాడిన పాటను
విని
అలల చప్పట్లతో
ఆదరించింది చెరువు
***
16.11.22
Wonderful poetry
Congratulations
Thank you very much