నాలో తప్పిపోయిన
నీవు నీకు ఇంక ఎప్పటికీ దొరకవు!
ప్రేమ భావన,
గొప్ప ఆకర్షణ!!
* * *
నాకే తెలియదు నాలో ఇంత
లోతు ఉందని!
నా లోంచి నువ్వు ఎప్పుడు
బయటపడదామనీ!?
* * *
నీ నవ్వు
ఓ పరిమళపు లోయ!
అందులో దిగాను కాబట్టే
నేను పూవునైపోయా!!
* * * *
ఎవరు పారబోసుకున్న
మోహ స్వప్నమో, కదా ఈ రాత్రి!
నింగి ఊయలలో,
చీకటి-వెన్నెల రెండూ పెనవేసుకున్నాయి!
***
ఈ కాలానిదెంత నిర్దయ!
కాకలుతీరిన యోధులను,
ఆకలి తీరని దీనులను,
ఎదురెదురు నిలబెడుతోంది!!
***
ఇక్కడ కొంత
స్వేచ్ఛని వొదిలి,
ఆ పక్షి రెక్కలు విచ్చుకునే
చనిపోయింది!
***
ఈ కష్టకాలం సుదీర్ఘమైనదనీ,
అనుకుంటాం కానీ
చరిత్ర పుటల్లోకి ఇంకిపోయిన
మానవ సంఘర్షణతో పోల్చుకుంటే క్షణభంగురం!!
****
యుధ్ధం ముగించాలని
వాడికి లేదు!
కానీ వాడికి తెలియదు
ఏదో ఒక నాడు వాడూ దిగిపోక తప్పదు!!
***
యుధ్ధం ముగిసాక,
శిధిలాల్లో వాళ్ళు శవాలకోసం
వెతుకుతున్నారు!కానీ,
దొరికింది ముక్కలైన పసివాళ్ళ స్వప్నాలు!
***
యుధ్ధం ముగిసాక,
దేశాధినేతలు చేతులు కలుపుకుంటారు!
ఆయా దేశాల ప్రజల నెత్తుటి తడి
స్పర్శ తో!!
***
కాందిశీకుల్లా
ఒక్క రోజైనా బతకగలమా?
యుధ్ధమా!
విధ్వంసం నీ చిరునామా!!
***
యుద్ధంతో యుధ్ధ నష్టం
పూడ్చుకోలేం
ఆయుధాల కర్ఖానాలకు
వేయాలి తాళం
****
ఆ రాత్రి ,ఈ పగలు-
నిండా పొగల సెగలు!
ఆయుధాలు విరజిమ్మేది
చీకటి తెరలు!!
***

4 thoughts on “నాలుగు పిట్టలు

Leave a Reply