నెత్తురు కక్కుతున్న కాలాన్ని
తన నగ్న పాదాలతోనే
అధిగమించాడతను
పూసే పొద్దుకు అభిముఖంగా
అనివార్యపు యుద్ధంలా పర్చుకొని
చరిత్రను విస్తృతం చేశాడు
అతను కేవలం అస్తమించాడు
ఈ ముసురు యుద్ధపు విచ్ఛిత్తిలో
అనునయంగా మనతో సంభాషిస్తూనే ఉంటాడు
కాళ్ల కిందికి విస్తరిస్తున్న మృత్యువును
శతృ కల్పిత వేల వేల సందిగ్ధాలను
నిరంతరంగా తిరగ రాసుకుంటూ
ఆయువును ద్విగుణీకృతం చేసుకున్నాడు
0 0 0
ఒక్కడిగా పేరుకుపోయిన మానవుడ్ని
శుభ్రం చేస్తూ నగరానికొచ్చినా
సమూహాల నిస్సత్తువకు
మందుగుండు దట్టించినా
కల్పన కానిది..
కత్తుల అంచున రొమ్ము విరిచిన
యుద్ధ ప్రియుడి సారాంశం
కథకాదది
గుండె విప్పిన దుక్కిలా
రేపటిని ధ్వనిస్తున్న
నక్సల్బరీ నావికుడి బతుకు ముద్ర.