తెలంగాణ నేల  మీద నేను పుట్టి అడుగులు వేసే సమయానికి ఈ మట్టి మీద  ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. రైతుకూలి ఉద్యమాలు, కమ్యూనిష్టు పోరాటాలు, నక్సలైట్ ఉద్యమం, బతుకుదెరువులేక ఎడారి దేశాలకు, ముంబై, షోలాపూర్, సూరత్, బీవండి వంటి వస్త్ర పరిశ్రమ కేంద్రాలకు నేత కార్మికుల వలసలు ఇలా తెలంగాణ నేలంతా తనలో తాను తొక్కులాడుకుంటున్న కాలం. అలాంటి గడ్డుకాలంలో జన్మించి సర్కారు బడిలో చేరి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని ఇన్నాళ్ళకు నావైన కథలేవో కొన్ని రాసుకొని వాటిని ‘పుంజీతం’ పేర ఒక పుస్తకంగా తీసుకు వచ్చాను. ఈ ప్రయాణమంతా ఎన్నో గతుకులతో కూడినది. ఎన్నో గాయాలతో నిండినది. కొన్నిసార్లు పాఠ్య పుస్తకాలకంటే సాహిత్యమే నా గాయాలకు ‘నల్లాలం’గా పనిచేసిందనిపిస్తుంది.   

సాహిత్యంలో ఇన్ని ప్రక్రియలుండగా నేను ఈ కథల్లోకి ఎలా వచ్చి పడ్డాను? అందరిపిల్లల్లాగే నేను కూడా చిన్నప్పటి నుంచి కథలంటే చెవి కోసుకునేవాడిని. నేను విద్యార్థిగా ఉన్నప్పుడే మా అన్నయ్య తీసిచ్చిన లైబ్రరీ కార్డుతో మా ఊరి గ్రంథాలయంలోని చాలా పుస్తకా ల్ని చదివే వాడిని. చాలా పుస్తకాలు అర్థం అయ్యేవి కావు. కానీ మున్షీ ప్రేంచంద్ కథలు ఎందుకో నాకు బాగా నచ్చేవి. దాని తర్వాత రష్యన్ కథలు, నవలలు బాగా ఇష్టంగా చదివేవాడిని. మాక్సిం గోర్కీ – అమ్మ, చింగీజ్ ఐత్మతోవ్ – జమీల్యా లాంటి నవలలు అప్పుడే చదివేశాను. యౌవనపు తొలివాకిట్లో అడుగు పెట్టిన దశలో నేను కూడా ఏదైనా కథ రాసి అచ్చులో నా పేరు చూసుకోవాలనే ఉబలాటం బాగా ఉండేది. తొలి దశలో వారపత్రికల్లో వచ్చే కథల్ని అనుకరిస్తూ కొన్ని కథలు రాసి పత్రికలకు పంపేవాడిని. అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా నా అడ్రస్ కు  తిరిగి వచ్చేవి. కానీ ఆ పట్టుదల తగ్గలేదు. చివరికి పి. జి. ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు మా బ్యాచ్ (1995-1997) ఎం. ఏ. విద్యార్థులం అందరం కలసి తీసుకొచ్చిన ‘యువసాహితీ’ తెలుగు విద్యార్థుల సాహిత్య సంచికలో నేను రాసిన ‘అక్షరాలు ఏడుస్తున్నాయి!’ అనే గల్పిక ప్రచురింపబడింది. అదే నా మొదటి ముద్రిత రచన. దాని తరువాత కూడా నేను ఉద్యోగవేటలో పడిపోయి మరో పదేళ్ళు ఎలాంటి రచన చేయలేక పోయాను. ఉద్యోగ జీవితంలో భాగంగా నేను సిరిసిల్లకు పోవడం నా సాహిత్య జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. అక్కడ అప్పటికే లబ్ద ప్రతిష్టులైన జూకంటి జగన్నాథం, పెద్దింటి అశోక్ కుమార్, డా. పత్తిపాక మోహన్, జిందం  అశోక్, మద్దికుంట లక్ష్మణ్, ఆడెపు లక్ష్మణ్ మొదలైన రచయితల రచనలు చదవడం నా సాహిత్య జీవిత వికాసానికి ఎంతో తోడ్పడింది. 

కథే నా జీవితానుభవాన్ని వ్యక్తీకరించడానికి సరైన ప్రక్రియ అని ఎప్పుడూ  అనుకోలేదు. అప్పడప్పుడు కవిత్వం రాశాను. వ్యాసాలు కూడా రాశాను. వస్తువును బట్టి అది ఏ ప్రక్రియలో ఇముడుతుందో అందులో రాయడానికి ప్రయత్నిస్తాను. ఇలా కథలు రాసే క్రమంలోనే జీవితానుభవాన్ని వివరించుకునే దృక్పథం మరింత పదునెక్కింది. ఇప్పటిదాకా నేను ఎంచుకున్న వస్తువులన్నీ నాకు బాగా పరిచయం ఉన్న నా స్వీయనుభవంలో ఉన్నవే స్వీకరించాను. అలా రాసిన నా కథల నిండా నా దృక్పథం నేరుగా కానీ, నేపథ్యంలో కానీ ఉంటుంది. ఊహపోహలకు పోయి ఎప్పడూ స్వీయానుభవ పరిధిని దాటి కథా వస్తువును స్వీకరించలేదు. బహుశా అట్లా ఏ రచయితకూ  సాధ్యం కాదేమో! ఒకవేళ అలా రాసినవి జీవితం నుంచి పుట్టినవిగా కాకుండా నేల విడిచి సాము చేసే రచనలుగానే మిగిలిపోతాయేమో!

నేను రాసిన కథలను నేనే కొత్త చూపుతో మరోసారి చదువుకున్నప్పుడు వాటిని మళ్ళీ ఇప్పుడు రాసినా అంతకన్నా మెరుగ్గా రాయలేనేమోననిపిస్తుంది. ఆయా వస్తువులకు తగిన శైలీ శిల్పాలను అవే ఎంచుకొని రాయబడ్డాయి. పలాన కథను పలానా టెక్నిక్ లోనే రాయాలని ఎప్పుడూ అనుకోలేదు. పాఠకుడికి ఏ మాత్రం గందరగోళం లేకుండా ఎంత సున్నితంగా ప్రజెంట్ చేయగలను? అని ఆలోచించి రాసినవి. కాబట్టి రాయబడిన కాలానికి అవి సరైన పద్ధతిలోనే రాయబడ్డాయని అనిపిస్తుంది. 

కథ ఇలాగే ఉండాలని నిర్వచించడం ఎవరి వల్లా కాదు. కథా వస్తువు కేంద్ర బిందువైతే దాని చుట్టూ 360 కోణాలుంటాయి. ఎవరి కోణంలో వాళ్ళు కథ చెప్తారు. ఎవరి కోణంలో వాళ్ళు ఆ కథను చూస్తారు. అంటే ఎవరి పరిశీలన వారిది. కథ ఎవరి కోణంలో వాళ్ళకు అర్థం అవుతుంది. అప్పుడు భిన్నమైన పరిశీలనలు కచ్చితంగా ఉంటాయి. ఉండాలి కూడా. అట్లా వచ్చిన విభిన్నమైన పరిశీలనలను పాజిటీవ్ గా తీసుకున్నప్పుడే కథకుడు మరింత పదునెక్కుతాడు. రాబోయే కథ మరింత గొప్పగా వస్తుంది. నా మట్టుకు నేను నా కథల పైన సమ్యక్  విమర్శ   రావాలనే కోరుకుంటాను. అది నన్ను నేను మెరుగుపరచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. 

మనకు తెలియకుండానే మనం  రాసే కథల్లో, కవిత్వంలో మనం దొరికిపోతాం. అంటే మనం తీసుకునే కథా వస్తువు, దాన్ని కథగా మలుస్తున్న తీరు, వాడుతున్న ఉపమానాలు, ప్రతీకలు, ఇస్తున్న ముగింపు మన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. అటువంటప్పుడు కథకు, మన వ్యక్తిత్వానికి గల అవినాభావ సంబంధం అనిర్వచనీయం. కచ్చితంగా నా కథల్లో నేనుంటాను. నా వ్యక్తిత్వం ఉంటుంది. నా దృక్పథం ఉంటుంది. నా జీవితం యొక్క ఛాయ ఉంటుంది. నేను పడుతున్న పెనుగులాటేదో శకలాలు శకలాలుగా రికార్డు అవుతుంది. 

నేను రాసిన ఎక్కువ కథల్లో కాలక్రమానుసారం (Chronological Order), ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ తో రాసిన కథలే ఎక్కువ. ఎంచుకున్న కథావస్తువును విభిన్నమైన శిల్పాలలో రాయలేకపోవడానికి నా అధ్యయన లోపమే కారణమనుకుంటాను. అంతర్జాతీయ సాహిత్యాన్ని పెద్దగా చదువుకోకపోవడం, శిల్ప పరమైన సాధన చేయక పోవడం ఒక పెద్ద లోపం. దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే నా కథల్లో ‘నాలుగు కోట్ల పిడికిళ్లు’ కథ శిల్ప పరంగా ఒక ప్రయోగమని విమర్శకులు గుర్తించారు. మరిన్ని శిల్ప రీతులను అధ్యయనం చేయాల్సి ఉంది. 

ఎంతసేపటికీ మనం సినిమాకు రాసినట్లుగా దృశ్యాలు దృశ్యాలుగా కథని పేర్చుకుంటూ పోతున్నాం. కానీ జీవితం అలా పలకలు పలకలుగా ఉండదేమో! జీవితం నిండా పరచుకున్న తడిని ఆరిపోకుండా దాన్ని అంతే వాస్తవికంగా కథలలో చిత్రించాలి. దీనివల్ల సన్నివేశాలలోని  సినిమాటిక్ పోకడ, పాత్రలలోని పొడిపొడిగా స్వభావం తగ్గిపోతాయి. అంటే కథల్లో నేను అందుకోవాల్సిన జీవన వాస్తవికత ఇంకా ఎంతో ఉంది. దీనికోసం  మరింత పరిశీలన, సాధన అవసరమేమో!  

కథ రాయకుండా ఉండలేనితనం నన్ను ఆవహించ్చినపుడు, అది నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడే కథ రాస్తాను. అంతేకాని ఈ నెల ఈ కథ రాయాలి. ఈ సంవత్సరం ఇన్ని కథలు రాయాలనే టార్గెట్స్ ఏమీ పెట్టుకోను. కథంటే మనం చూస్తున్న సమాజాన్ని మన దృష్టికోణంలో ఆవిష్కరించడం. లేదా మనల్ని మనం ఈ వ్యవస్థ ముందు నిలబెట్టుకోవడం. అటువంటప్పుడు మన చుట్టూ జరుగుతున్న చలన సూత్రాలను మనం ఎలా అర్థం చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. కాలక్రమంలో అనేక వాదాలు వస్తుంటాయి, కూలిపోతుంటాయి. వాటిలో నేనెక్కడ నిలబడ్డాను అనేదే నా కథలు చెప్పడానికి ప్రయత్నిస్తాయి. 

Leave a Reply