ఇంట్లో క్యాలెండర్ లేదు
పొడిచే పొద్దు
నడి నెత్తిన పొద్దు
కుంగిన పొద్దు
ఇదే నా లెక్క
ఇదే నా రోజు

కూసే కోడి నా అలారం
మొరిగే కుక్క నా అప్రమత్తత కి ఆధారం
నిప్పు ఇచ్చే పొరుగు లేదు
సూరీడు తొలి కిరణం
గుడిసె తాటాకు లోనుండి నా ముఖం పై
నా మేలు కొలుపు

భుజాన కాడి
ముందు నడిచే ఎద్దులు
నేల దున్న నడక
కాళ్లకు చెప్పులు లేవు
పల్లేర్లు పక్కకి నా పై దయతో 

సాగే అరక
నేల నాది తరాలుగా
అడవి నాది
దుంప నాది
పండు నాది తేనె నాది
మచ్చిక లో జంతువు 
నేను నిలబడితే పులి వెనక్కి
హక్కుకై పోరు బాటలో మనిషిని  


వెలుతురు చీకటి ఇవే నాకు తెలుసు
దినం వారం నెల ఎరుగను
పండే పంట
దొరికే కాయ
వేటలో పడే జంతువు
ఇవే నాకు తీర్చే ఆకలి ప్రత్యామ్నాయాలు!

పోడు పట్టాల ఊసు ఎన్నికల వేళ
దండుకునే దళారీ
లాఠీ ల జోరు
నేను వున్నంత వరకు
నాదే ఈ నేల
ఎవడొచ్చినా చేతికి దొరికిందే ఆయుధం
ప్రకృతి నేర్పిన పాఠం

కొత్త ఏడాది అని ఎవరో చెప్పారు
కొత్త పంథాకై ఆలోచిస్తున్నా!

Leave a Reply