నా జ్ఞాపకాలు
నీ రెక్కలు
నీ రెక్కలు
నా జ్ఞాపకాలు
ఎగరు సీతాకోక
నింగి అందేదాకా
ఎంత సున్నితంగా
తాకుతాయో కదా నీ రెక్కలు
గాలిని
నీ రెక్కల కుంచెతో
గాలి కాన్వాస్ మీద
ఎన్ని వర్ణచిత్రాలు వర్షిస్తావో కదా
రుతువుల మోములన్నీ
మోహపు వీణలౌతాయి
కవితలేవో నేను అల్లడానికి
కుట్ర పన్నుతాయి
నీ రెక్కలు కదిలినప్పుడంతా
నాలో స్ళేఛ్ఛా కాంక్ష పురి విప్పిన నెమలి అవుతుంది
అరణ్యం పై పరుచుకునే కెంజాయరంగౌతుంది
అపుడు
నా ఏకాంతాన్నీ,
నా భావాలనూ
నీ భుజాలు నొప్పెట్టెలా
మోస్తావు
నా ఊహల స్పర్శతో
నీ రెక్కలు పులికిస్తాయో
నీ రెక్కల స్పర్ళతో
నా ఊహలు అలలై కదులుతాయో
తెలియదు కానీ
నీ రెక్కలు కదిలేప్పుడంతా
నేనూ కదులుతాను
నా గుండెకొక లయ ఉన్నట్టనిపిస్తూ
నాకు నేను కొత్త కావ్యాన్నై పరిచయమౌతాను