(ఈ క‌థ ఆంధ్ర‌ప్ర‌భ స‌చిత్ర‌వార ప‌త్రిక 10.4.74 సంచిక‌లో అచ్చ‌యింది. విర‌సం ప్ర‌చురించిన చెర‌బండ‌రాజు సాహిత్య స‌ర్వ‌స్వంలోని క‌థా సంపుటంలో ఇది చోటు చేసుకోలేదు. మిత్రుడు వంగ‌ల సంప‌త్‌రెడ్డి చెర‌బండ‌రాజు సాహిత్యంపై త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా దీన్ని గుర్తించారు. శ్రీ‌కాకుళం క‌థా నిలం నిర్వాహ‌కులు దీన్ని పంపించారు. సంప‌త్‌రెడ్డికి, క‌థానిల‌యం నిర్వాహ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు.- వ‌సంత‌మేఘం టీ)


చేను చచ్చిపోయింది. కాలువ ఎండిపోయింది. చెరువు ఇంకిపోయింది. ఊళ్ళో కూలి జనం నాలుకల మీది తడి ఆరిపోయింది. వాళ్ళ ఎముకల్లో గలగల. కళ్ళలో గరగర. విరగ్గొట్టిన వేపకొమ్మల్లా ఎండిపోయి, కాలు పెడితే పటపటా విరిగిపోయే దశలో ఎవరి గూళ్ళలో కాళ్ళు, ఎవరి వాకిళ్ళలో వాళ్ళు, ఎవరి దుఃఖాల్లో వాళ్ళు, ఎవరి ఆకలి మంటల్లో వాళ్ళు. ఇదేమిటని అడిగితే భళ్ళున‌ ఏడ్చేసే దీనమైన ముఖాలతో, హీనంగా, అమ్మకానికి కొచ్చిన కట్టెల్లా, ఎండుటాకుల్లా చావలేక, బతకనూలేక, బంగ్లా  కేసి అదేపనిగా చూడలేక, ఏడుస్తూ కూలిజనమంతా కాలూ కాలూ పట్టుకుంటున్నారు. కన్నీళ్ళతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. 

పొలాల డొక్కలు వేలాడేశాయి.పిడికెడు గడ్డి లేదు. ఎండు గడ్డి ఏనాడో అయిపోయింది. అగ్గిపుల్ల గీసేస్తే భగ్గున మండిపోయేటట్టుగా ఉంది ఊరు.

మధుసూదనరెడ్డి గారి ఇంట్లో వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళి. పట్నం నుంచి అరటి దూలాలు లారీల్లో దిగాయి ` మామిడాకులు తోరణాలుగా పందిళ్ళనిండా  అందంగా, పచ్చపచ్చగా కళకళలాడుతూ రెడ్డిగారి 

రెండంతస్తుల మేడకు కొత్త అందాన్ని తెచ్చి పెట్టాయి.

పెళ్ళి పందిట్లో, విడిదిళ్ళలో మూడు రంగుల‌ జండాలు ముచ్చటగా ఎగిరి పడుతున్నాయి.

ఊళ్ళో చచ్చిపోయిన పశువులకు లెక్క లేదు.

పసిపిల్లల ఏడ్పులకు అంతు లేదు. 

‘‘పని చూపించండి’’

ఒకరా, ఇద్దరా? పిల్లా మేకా కొన్ని వందల మందిదాకా వెళ్ళి మధుసూదన రెడ్డిగారి ఇంటి ముందు చిన్నపాటి ప్రదర్శన జరిపారు కూలీలు.

నా బిడ్డ పెండ్లి బెట్టుకున్న. అది అయిపోయినంక చూపిస్తాను. వెళ్ళండి.’’

‘‘పెండ్లి అయ్యేలోపల మా పీనుగులు లేస్తయి.’’

‘‘నన్నేం జెయ్యమంటరు?’’

‘‘పని కావాలి.’’

‘‘నాకు పెండ్లి పనుంది. ఒకరో ఇద్దరో వచ్చి తోరణాలు, జండాలు కట్టండి.’’

‘‘మిగిలిన వాళ్ళం ఏం గావాలి?’’

‘‘గంగలో దూకండి.’’

‘‘ఇన్నాళ్ళూ తమర్ని నమ్ముకొని బతికినం. ఈ మందిలో సగానికి పైగా మీ పొలాల్లో, చంకల్లో ఎక్కడబడితే అక్కడ పనిజేశారు. ఇప్పుడేమో వానలు లేకపాయె. ఇంత పని ఇప్పిస్తే ఈ నెల పది పూటలు కలో గంజో తాగుతం.’’

‘‘చూడండి, నాయనా, మీరందరూ నా బిడ్డల లాంటి వారు. కాదనను. మీరు కష్టపడి పనిచేస్తారు. ఏం చేస్తాం! మన అదృష్టంలో వానలు లేవు. మీరు చూస్తూనే ఉన్నారుగా? నా ఆవులకు గూడా గడ్డి కొనుక్కొచ్చే వేస్తున్నా. ఈ బాధ మీకూ, నాకూ ఒక్కటే. అర్థం చేసుకోవాలి.’’

‘‘మమ్మల్ని ఊరు విడిచి వెళ్ళిపొమ్మంటారా?’’

‘‘అది మీరు నిర్ణయించుకోవాలి.’’

‘‘మా నిర్ణయమల్లా ఒక్కటే. అందరం కలిసి ఇక్కడే పనిజేస్తం. మీరు కూళ్ళు ఇచ్చుకోవాలి. అంతే?’’

‘‘ఇండ్లు కట్టించండి.’’

‘‘ఎవరి కోసం?’’

‘‘పడి ఉంటై. పంతుల్లో, గిర్దవార్లో ఎవరో ఒకరు కిరాయి కుంటరు.’’

‘‘ఎంతమందికి పని దొరుకుతుంది?’’

‘‘మీ చెలకల్లో రెండు బావులు తవ్వించండి.’’

‘‘మన ఊరికి చెరువుంది.’’

‘‘చెరు విప్పుడు ఎండిపోయింది.’’

‘‘డబ్బెవరిస్తరు?’’

‘‘మీ దగ్గరుంది.’’

‘‘అని మీకేం తెలుసు?’’

‘‘పెండ్లి చేస్తున్నరు.’’

‘‘అది ఇక్కడ ఖర్చు పెడితే పెండ్లి అయ్యెదెట్ల?’’

‘‘ఇంతమంది బతుకుల కన్న మీ బిడ్డ పెండ్లి ఎక్కువగాదు`’’

‘‘అనవసరంగా నోరు జారుతున్నరు.’’

‘‘అవసరాలు మాట్లాడిస్తున్నయి.’’

‘‘పెండ్లి జరిగి తీరుతుంది. ఇది మా పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన విషయం.’’

‘‘ఊరంతా పీన్గుల పెంటయ్యాక మిమ్మల్ని గౌరవించేది ఎవరు?’’

‘‘దయ్యాల్లాగా ఏందిది? నోరు మూసుకొని వెళ్ళండి.’’

‘‘ఈ మేడా, మీ కారూ, మీ బిడ్డల చదువులూ అన్నీ మావల్లే వచ్చాయి.’’

‘‘సత్యం చెప్పారు. వెళ్ళండి, నాయనా, వెళ్ళండి.’’

‘‘రెడ్డిగారూ! ఒక్క జీతగాడూ మీ దగ్గర పనిచేయడు. పెండ్లి ఎట్లా అవుతుందో చూస్తాం.’’

‘‘నేనూ చూస్తాను.’’

‘‘కూలీల్తో తగువులాడి బతకలేరు. ఓపికపడుతున్నం.’’

‘‘ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గాని కెక్కుతుందంట. పొండ్రా, పొండి.’’

‘‘కూలిజనం కోపంతో వెనక్కి తిరిగింది.

‘‘సర్పంచ్‌గారూ! దండాలు.’’

‘‘దండాలు. ఏమో వచ్చింన్రు?’’

‘‘మా కష్టం, సుఖం చెప్పుకుందామని.’’

‘‘ఏమిటి మీ కష్టం?’’

‘‘ఆకలి.’’

‘‘నన్నేం జెయ్యమంటరు?’’

‘‘సర్కారుతో చెప్పి, మాకేదన్నా పని ఇప్పించండి.’’

‘‘అందరు కలసి విజ్ఞాపన పత్రం ఇవ్వండి. పైకి తీసుకెళ్ళి ఆలోచిద్దాం.’’

‘‘ఈపాటికి మీరు ఇచ్చిన్రే అనుకుంటున్నం.’’

‘‘మీరు చెప్పందే?’’

‘‘చూస్తున్నరుగా మా కష్టాలు? మీ ధరమం మీరు నెరవేర్చి ఉంటరనే అనుకుంటున్నం.’’

‘‘గవర్నమెంటంటే ఎవరు, నాయనా? ప్రజలే. మీరు చల్లగా ఉంటే ప్రభుత్వం చల్లగా ఉంటుంది. మీకు లేని సుఖం, శాంతి సర్కారు కెక్కడివి? మీ దగ్గర డబ్బు లేనట్టే దానిదగ్గరా డబ్బు లేదు.’’

‘‘ఇన్నాళ్ళ మా కష్టం ఎక్కడికి పోయినట్టు?’’

‘‘ఏమో అంటరు సూడు ` చేసుకున్నంత మహదేవా అని? చేసుకున్నరు తిన్నరు’’

‘‘మా శ్రమ ఫలితం మాకు న్యాయంగా ముడితే, మీరు పైకి ఎట్లా వస్తరు?’’

‘‘నేనేం పైకొచ్చాను?’’

‘‘మీ ఆస్తిని అడగండి.’’

‘‘నా దగ్గ రెక్కడుంది?’’

‘‘పది ఎకరాలు అరవై ఎకరాలు అయ్యింది. పెంకుటిల్లు మేడయ్యింది. బాంకులో నిలవుంది. బంగారం మూల్గుతూంది. మీ బిడ్డల చదువులు పెట్టుడులేగా?’’

‘‘నిజమని నమ్మమంటారా?’’

‘‘నమ్మకపోతే మీరొచ్చి మా జాగాలో నించోండి. మేం వెళ్ళి మీ ఇంట్లో చూసొస్తాం.’’

‘‘హద్దు మీరుతున్నారు.’’

‘‘న్యాయం మాట్లాడుతున్నం.’’

‘‘ఒకరిద్ద రొచ్చి ఏం కావాల్నో తీసుకు పోవచ్చుగా? ఇంత జనం ఎందుకు?’’

‘‘మాట్లాడుతుంది ఒకరిద్దరమేగా!’’

‘‘అంటే, ఇప్పుడేం చేయాలి?’’

‘‘మా ఆకలి తీరాలి. మాకు పనులు కావాలి.’’

‘‘పని దొరగ్గానే ఆకలి చల్లారి పోతుందా?’’

‘‘ఆకలికి మలమల మాడి చచ్చేవాళ్ళు ఏం చేస్తారో ముందు ముందు తెలుస్తుంది. మీకు ఓట్లిచ్చాం. రాత్రింబవళ్ళు కష్టపడుతున్నం. లాభాలు మీవి. అందుకవసరమైన నెత్తురోడ్చేది మేము.’’

‘‘నేను కాదన్నానా? కొన్నాళ్ళు ఓపిక పట్టాలి, నాయనా.’’

‘‘ఇప్పుడేమంటారో చెప్పండి.’’

‘‘మధుసూదనరెడ్డిగారి నడగండి. బాగా తెలిసినోడు గదా?’’

‘‘మీ తగవులు మీవి. రోజు కింత పెరుగుతున్నై.’’

‘‘మా శవాలు ఆ పెండ్లి పల్లకీ మోస్తాయి`’’

‘‘పిచ్చి నాయనాలారా! గాలిని బెదిరిస్తే ఏమొస్తుంది? పట్టుకుంటే కోటనే పట్టుకోవాలి.’’

‘‘చివరిసారి జెప్తున్నం. మాకు పనులు ఇప్పించండి.’’

‘‘పట్నం వెళ్ళి మాట్లాడి వస్తా. ప్రస్తుతం వెళ్ళండి.’’

‘‘అదీ చూస్తాం.’’

ఇది నిన్నటి కథ.

0             0                 0

ఏడాది గడిచింది. ఏరు బతికినట్టే బతికి చచ్చిపోయింది. కాలువ లెండిపోయే ఉన్నాయి. అన్ని ఊళ్ళలోనూ పాడు కొట్లాడుతూంది. అక్కడా అక్కడా తాకట్టు దుకాణాలు వెలిశాయి. ఆ దుకాణం యజమానులకు మధుసూదనరెడ్డిగారి ఇంట్లోంచి ప్రతి నెలా జీతం లెక్క ప్రకారం ముడుతుంది. రైతు కూలీలు ఆస్తులు, పుస్తెలు, బిందెలు` అన్నీ తాకట్ల దుకాణాలకు, అక్కడి నుంచి పట్నానికి చేరుకుంటున్నాయి.

గంజి కేంద్రాలు వెలిశాయి. ఈగలూ, కుక్కలూ, పిల్లులూ భూమి నాకి, మట్టి మింగి, ఏమీ లేకపోతే ఒకటి కొకటి కరుచుకొని, పీక్కుతిని, పిచ్చెత్తి నాల్కలు వేలాడేసుకొని భయంకరంగా తిరుగుతున్నాయి ఊళ్ళో.

గంజి కేంద్రాల కంట్రాక్టరు సర్పంచ్‌గారు అందరి మధ్యా నిలబడి అక్కడే గంజి తాగి, ఇంటికొచ్చి రాత్రి పొద్దుపోయాక నిమ్మళంగా డబ్బు లెక్క పెట్టి, తలగడ కింద పెట్టుకొని నిద్ర పోతున్నాడు.

ప్రభుత్వం పత్రికల ద్వారా, రేడియో ద్వారా, ఉపన్యాసాల ద్వారా, ఊళ్ళలో ఉండే ఏజంట్ల ద్వారా కరువు నివారణ పథకాల గురించి జోరుగా ప్రచారం చేసుకుంటూంది. అందుకు సంబంధించిన కాగితాలు గుట్టలు గుట్టలుగా పేర్చుకుంటూంది.

తమ ఊళ్ళో ప్రజలు ధాన్యం కోసం ఇంటిమీద పడితే, మధుసూదనరెడ్డిగారి అల్లుడు వారిని తుపాకీతో కాల్చితే, గొడ్డలితో ప్రజలు అతని తల నరికేశారు. 

రెడ్డిగారి కూతురు విధవరాలై పుట్టింటి కొచ్చేసింది.

ఆ రోజు సాయంత్రం ఆమె తండ్రిగారి మేడ మీద నించుని ఊళ్ళోకి చూస్తూంది. బిడ్డను ఓదార్చాలని ప్రేమతో, బాధతో, దయతో మధుసూదనరెడ్డిగారు తానూ మేడమీదికొచ్చారు. 

‘‘ఏం చేస్తున్నావమ్మా?’’

కింద ఓ గోడమీద నలుగురు విద్యార్థులు అప్పుడే వ్రాసి పోయిన అక్షరాలు చదువుకుంటూంది ఆమె.

‘ఆకలితో మలమల మాడి చచ్చేకన్నా పోరాటంలో చావడం మేలు!’  

‘‘ఏం చూస్తున్నావమ్మా?’’

‘‘…….  …………’’

‘‘బళ్ళాలు, బరిసెలు, గొడ్డళ్ళు` ఆ వచ్చేది ఎవరమ్మా’’

‘‘ప్రజలు.’’

‘‘ఇప్పుడు ఏం చేద్దామంటావు?’’

‘‘ఉంటే రెండు తుపాకులు తీసుకురా.’’

Leave a Reply