కణ కణ మండే నిప్పు కణిక ఆ బాలిక
తన సమస్యలన్నింటికీ నిప్పెలాబెట్టాలో తెలుసు ఆమెకు
తల్లికెలా సాయపడాలో
తన కలలసౌధం ఎలా నిర్మించుకోవాలో తెలుసు ఆ చిన్నారికి
ప్రమోదం కన్నా ప్రమాదమే
తనకోసం ఎదురు చూస్తూ ఉన్నా
నిప్పు, ఉప్పు తానై
నలుగురి కోసం వండడం తెలుసు
తన భవిష్యత్తు కోసం
కాలాన్ని తన చేతుల్లో బంధించటం తెలుసు
ఏడు దశాబ్దాల ఎదురు చూపుల్లో
కాల్చి బూడిద చేయాల్సినవేమిటో తెలుసు
ఓటుకు నోట్లతో పిట్టకథలు చెప్పే
మహా మాంత్రికుల పని పట్టటం ఎలాగో తెలుసు
ప్రామిసింగ్ పాలన పునాది
ఆ బాలిక భవిష్యత్ కాలాన్ని తన గుప్పిట బిగించిన ఆధునిక అనుసంధానకర్త
తన తల్లి కలల లోకంలో
విహరించే సుందర జగత్తు ఆమె
ఇంటి నుంచి బడికి
బడి నుంచి ఇంటికి
తన లేత పాదాల ముద్రలతో
సరికొత్త బాటలేస్తు తన ఊపిరితో ఆ ఇంటికి
వెలుతురు నద్దుతుంది
తన లాంటి వాళ్ళందరికీ కావాల్సిందేమిటో
తమను తామెలా వెలిగించుకోవాలో తెలుసుకుంటూ కొత్త పాఠాలు
అపోసన పడుతున్న నేల తారక ఆ బాలిక…