అమ్మను వదిలి ఒకరోజు అయిపోయింది. అయినా అమ్మ నాతో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తోంది. నా చుట్టూ జరుగుతున్న వాటిల్లో పడి అమ్మనూ, అమ్మ చుట్టూ తిరుగుతున్న ఆలోచనలనూ తాత్కాలికంగా దూరంపెడుతున్నానే తప్ప పూర్తిగా తనను గుర్తుచేసుకోకుండా ఒక గంట కూడా వుండలేకపోతున్నాను. నేను అనుకున్న గమ్యానికి చేరువలో వున్నానని నన్ను రిసీవ్ చేసుకున్న అన్నయ్య మాటల్లో అర్థమయ్యింది. ఇంతలో మా జీప్ ఒక ఊరి దగ్గర ఆగింది. చూసేసరికి అటు పూరి గుడిసే కాదూ, పెంకుటిల్లూ కాదు. ఏదో డిఫరెంట్ గా వుందే అని అనుకుంటూ చూస్తుంటే నల్లగా పొడుగ్గా వున్న ఒక అతను ” కామ్రేడ్ నీ కిట్టు ఇవ్వు” అన్నాడు ఆప్యాయంగా. ఇంతకు ముందు పరిచయం కూడా లేదు. అయినా బాగా తెలిసినవాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడడం, అందులోనూ మొదటిసారి ‘కామ్రేడ్’ అనే పదం వినడం భలే అనిపించింది. ఇంతలో తన తుపాకిని కుడి చేతి నుండి ఎడమ చేతికి వేసుకుంటూ నా బ్యాగును తన చేతిలోకి తీసుకున్నాడు. నేను నా బ్యాగును మర్చిపోయి తుపాకినే చూస్తున్నా. “అక్కా దిగు” అన్నాడు. మొదటిసారి వెపన్ ని చూడడంతో అడవిలో వెపన్ పట్టుకున్నారంటే వీళ్ళే నక్సలైట్స్ అనుకుంటా. లేదా సివిల్ డ్రస్ లో వున్న మిలీషియా అయ్యి వుండవచ్చు. ఏదైనా నేను పుస్తకంలో చదివిన నక్సలైట్సే. ఇంతవరకూ ఊహలకే పరిమితమైన అడవిలో అన్నలు, అక్కలు అన్న దృశ్యాలు నా కండ్ల ముందే ఉండేసరికి ఏదో కొత్త కొత్తగా మరో ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టు అనిపిస్తోంది.
ఇంతలో ఆ కామ్రేడ్ “అక్కా, జీప్ దిగు” అనడంతో దిగి ఎదురుగా వున్న ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాము. ఆ ఇంటి అక్క ఛాయ్ తీసుకుని వచ్చింది. వెంటనే శృతి మొఖం చూసాను. ఏంటీ ఏమైంది అన్నట్టు కళ్ళెగరేసింది.
“వీళ్ళు భలే ఫాస్ట్ గా వున్నారు కదా? మనం రావటంతోనే ఛాయ్ ఎలా వచ్చింది అసలు? ఇదంతా ముందే ప్లాన్ కదా” అన్నాను. వెంటనే శృతి “ప్లాన్ లు స్కెచ్ లు అని మాట్లాడకే తల్లీ, వాళ్ళకు అర్థం అయితే ఏమనుకుంటారో” అని అంది.
అయినా వీళ్ళకు తెలుగు రాదుగా అన్నాను. “మీరు వస్తారని మాకు ముందే తెలుసక్కా” అని అక్క తెలుగులో అనడంతో నేను, శృతి తెల్లమొఖం వేసుకుని చూసాం.
‘అంటే ఇంతకీ మేము ఎవరో నీకు తెలుసా అక్కా?’
‘తెలియదు కానీ దళం వాళ్ళు చెప్పడంతో మీరు మావాళ్ళే అని మాత్రం అర్థమైంది. అప్పుడప్పుడు ఇలా కొంత మంది వస్తూ పోతూ వుంటారు.” అని అన్నది.
ఇంతలో మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన కామ్రేడ్ ‘అక్కా చాయ్ సల్లారిపోతుంది తాగు’ అన్నాడు.
‘నేను చాయ్ తాగను కొన్ని మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి’ అన్నాను.
‘అక్క ఇప్పుడు మీరు నీళ్ళు అడుగుతున్నారు. కానీ తర్వాత చాయ్ అడుగుతారు’ అని అన్నాడు. ‘ఎందుకడుగుతాను’ అని అడిగా. ‘ఇక్కడ చలి ఎక్కువక్కా. సాయంత్రం ఐదు దాటిందంటే చలి, చలితోపాటు గాలులు వీస్తుంటాయి’.
‘అయితే అప్పుడే అడుగుతానులే’ అన్నాను. ‘ఇంతకీ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా’
అన్నాను. ‘ఆ అడుగక్కా దానికేముంది’ అన్నాడు. ‘ఆదివాసీ గ్రామాలంటేనూ, ప్రజలంటేను నాకొక ఊహా చిత్రం ఉంది. కానీ దానికి భిన్నంగా ఈ ఊరు కనిసిస్తుంది. కొంత అభివృద్ధి చెందింది కదా’ అన్నాను.
‘ఆ అక్కా అలా నీవు ఒక టీవీ చూసో, బైక్ చూసో అభివృద్ధి అనుకోకు. ఈ ఊరు, దీని చుట్టుపక్కల ఊర్ల ప్రజలు పట్టణాల్లోకి వెళ్ళి కూలి పనులు చేసి వచ్చిన డబ్బులతో ఇలాంటిని కొన్ని కొనుక్కొని ఇక్కడకు తెస్తారు. దానితో మిగతావాళ్ళు కూడా చూసి హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్ళి కూలీ పనులు చేస్తూ ఇలాంటి వస్తువులకు ఆకర్షితులవుతున్నారే తప్ప ఇక్కడ అభివృద్ధి అంటూ ఏమి లేదు. ఇప్పటికీ ఈ ఊర్లో స్కూల్ గానీ , హాస్పిటల్ గానీ లేవు. దాన్ని పట్టించుకునే నాధుడే లేడు. కాబట్టి ప్రజల బతుకుల్లో కొత్త అభివృద్ధి అంటూ ఏమి లేదు. వీటి కోసమే మన పార్టీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్స్ తీసుకోమని పిలుపునిచ్చింది. అయితే ఇంకా అది కింది వరకూ రాలేదు’.
‘అవునా! ఇక్కడి వరకు మనవాళ్ళు వస్తుంటారా’? అని అడిగాను.
లేదక్కా సివిల్‌లో ఒక్కరు, ఇద్దరు వచ్చి ప్రోగ్రామ్ ఇచ్చి వెళుతుంటారు.
‘అవునా అయితే మరి మనవాళ్ళను చూడ్డానికి ఇంకా ఎంత దూరం పోవాలి’ అని అడిగాను.
ఇంతలో శృతి మధ్యలో అడ్డుపడి ‘మీకు ఇంత బాగా తెలుగు ఎలా వచ్చు’ అని అడిగింది ఆ కామ్రేడ్‌ని.
‘నా భాష కోయే కాని ఇక్కడి ప్రజలు తెలుగు మాట్లాడుతుంటారు. అలా వాళ్ళతో మాట్లాడటంతో నేర్చుకున్నాను అన్నాడు. ‘సరే అక్క మనం బయలుదేరుదాం’ అని చెబుతూనే చెప్పులేసుకోవడానికి వెళ్ళాడు. నేను శృతి మా బ్యాగులు తీసుకొని జీపు వైపు బయలుదేరాం. ఇంతలో ఆ కామ్రేడ్ ‘అక్కా అటెందుకు వెళుతున్నారు, ఇక్కడ నుండి బండి రాదు. బండి పోవడానికి రోడ్డు ఉండదు’ అన్నాడు. దాదాపు రెండు మూడు గంటలు పట్టొచ్చు అని నా లోపల భయం వేసింది కానీ ఆ భయాన్ని బయటికి ఎక్కడా వ్యక్తం చేయకుండా పైకి నవ్వాను. ఎందుకుంటే ఇదొక్క చిన్న విషయంతోనే నేనిక్కడ పని చేయలేనేమోనని తేల్చేస్తరేమోనని. కానీ నాతో వచ్చిన శృతి మాత్రం ‘స్పూర్తి! నా ఫ్యాట్ కరగటానికి మొదటి స్టెప్ ఇదే కావచ్చు తెలుసా’ అని అంది. నేను తన మొహం చూసి నవ్వకుండా ఉండలేకపోయాను. నా నవ్వు చూసి ఆ కామ్రేడ్, శృతి కూడా నవ్వారు. అలా అక్కడి నుండి మేము బయలుదేరాం.
ఆ దారి మలుపు దగ్గర కొన్ని సెకండ్లు ఆగి చూసాను. అలా చూస్తుంటే శృతి ‘ఏమైంది’? అని అడిగింది. ‘బహుశా వెహికిల్ ని చూడడం ఇదే చివరిసారి కావచ్చు కదా’ అన్నాను. తను చిరునవ్వు నవ్వుతూ ‘ఇప్పటి నుండి నీవు నడవడం అలావాటు చేసుకోవాల్సిందే’ అంది.
మా నడక ప్రారంభమై గంట దాటినా ఎక్కడా దారి లేదు. దారి వెంట రాళ్ళు, రప్పలు, చుట్టూ పొదలు తప్ప ఏమి కనిపించడం లేదు.
అలా నడుస్తుంటే నాన్న గుర్తుకు వచ్చాడు. నా చిన్నప్పుడు ఒకసారి నాన్నమ్మ ఇంటికి వెళ్దాం రమ్మన్నాడు. ‘నేను రాను. అక్కడ రోడ్లు ఉండవు, టీవీలు ఉండవు. ఆ పల్లెటూరిలో కార్టూన్ నెట్వర్క్, సీరియల్స్ ఏమీ ఉండవు. నేను అవన్నీ మిస్ అయిపోతాను కదా. అందుకే నీవు తమ్ముడు వెళ్ళి రండి. అమ్మ, నేను ఇక్కడే ఉంటాము అన్నాను’. దాంతో నాన్న ‘అలా అనవద్దు. మనం ఎప్పుడు వస్తామా అని మీ నాన్నమ్మ ఎదురుచూస్తూ వుంటుంది. అసలు నీకు తెలుసా నీకు కొత్త డ్రస్ కూడా కొన్నదంట. మరి అలాంటి నాన్నమ్మను చూడకుండా బాధ పెట్టొచ్చా చెప్పు’ అని అన్నాడు.
‘సరే వస్తాను కానీ నేనైతే నడవను. నీ ఫోన్ ఇస్తానంటేనే వస్తాను’ అన్నాను. ‘నీకేంట్రా తిప్పలు నిన్ను నా భూజాలపై మోస్తాను’ అంటూ నా ముందు ఒంగాడు. నేను వెంటనే తన జేబులోని డబ్బులను తీసుకొని వెళ్లాను.
అలాంటి నాన్నతో వచ్చేముందు గొడవ పడ్డాను. మొదటిసారి నాన్నతో మాట్లడక మూడు నెలలు ఉండటం. అదీ అమ్మ కోసం. నాలాగే నాన్నకు కూడా పల్లెటూరులన్నా అందులోనూ వ్యవసాయం అన్నా ఇష్టం ఉండదు. పట్టణాలకు అలవాటు పడ్డాడు. పట్టణాలే కాదు పట్టణ లక్షణాలకు అలవాటు పడ్డాడు. ఆటో దందాలంటూ దాంట్లో లాభం రాదని రియలెస్టేట్ వ్యాపారమని దేంట్లో సరిగా పని చేయక అమ్మతో గొడవ పడేవాడు. కారణం తనే అయినప్పటికీ అమ్మను నిందిస్తుంటాడు. ఎలాగోలా హైదరాబాద్‌లో నాలుగు ఫ్లాట్లు సంపాదించాడు కానీ అవన్నీ ఇతరులను మోసం చేసినవే. ఆ మోసం నాన్నను మూడు రోజులు జైల్లో పడేటట్లు చేసింది. దాంతో ఫ్లాట్లు పోయాయి. అలా అమ్మకు, నాన్నకు ప్రతి రోజూ గొడవే. పోలీసులు అరెస్టు చేసారన్న కారణంలో రోజూ తాగడం, అమ్మతో గొడవ పడటం, దానితో అమ్మ ఏడవడం రోజూ ఒక తతంగం. దానితో నాన్నతో గొడవపడ్డా. ఎప్పుడూ నాన్నపై అరవలేదు. కానీ ఆరోజు బాగే కోప్పడ్డ.
దానితో నాన్న ‘నీవు కూడా అర్థం చేసుకోలేవురా’ అంటూ కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు. నిజమే నాన్నను అర్థం చేసుకోలేదేమో అనిపించింది. ఎందుకంటే ఈ సమాజంలో ఏ తండ్రి అయినా అందరికంటే నా కుటుంబం, పిల్లలు బాగుండాలని ఏ కష్టం రాకుండా ఉండాలని ఆశిస్తారు. అందులో భాగంగానే నాన్న ఏ పని దొరికితే ఆ పనే చేసాడు. అయితే దానిలో మోసగించబడ్డాడు. దానికి కారణం తన స్నేహితులే.
‘అక్కా’ అన్న పిలుపుతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. ‘డేరా కొచ్చేసాం అక్కా’. అబ్బా అని ఊపిరి పీల్చుకున్నా. రెండు గంటలు అన్న నడక నాలుగు గంటలు దాటింది. అంటే నాన్న గుర్తుకు రావడంతో ఇన్ని గంటలు నడిచానన్నదే గమనించలేదు. ‘ఇక్కడే ఉండండి. నేను కనుక్కొని వస్తాను’ అని తను అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
తను చూసొచ్చి పిలిచాడు. ‘రమ్మంటున్నారు’ అనగానే కాళ్ళు, చేతులూ ఆడటం లేదు. ఇది సంతోషమో, ఉద్విగ్నతో, మరింకొకటో కానీ దాన్ని నేను వర్ణించలేను. మేము ముగ్గురం ఇంటివైపు వెళుతుండగా ఒక చిన్న లైట్ కనిపించింది. ఆ లైట్ దాటుకొని చీకటివైపు వెళ్ళాము. ఒక పెద్ద చెట్టు నా ముందు కొంత దూరంలో ఉంది. అక్కడి నుండి ఎవరో కానీ, ‘ఎవరూ, ఎవరూ?’ అని అడుగుతున్నారు. నాతో వచ్చిన కామ్రేడ్ ‘మేమే’ అన్నాడు. ఇంతలో చెట్టు వెనకాల నుండి ఇద్దరు మా వైపు వస్తూ నవ్వుతూ లాల్ సలామ్ చెప్పారు.
మేము అటు అడుగులు వేసేసరికి అగ్గి చుట్టూ కొంతమంది కామ్రేడ్స్ మిలటరీ డ్రెస్సుల్లో తుపాకులు వేసుకొని వున్నారు. మమ్మల్ని చూసి ఒక చిన్నపాటి లైన్ కట్టారు. ‘లాల్ సలామ్ దీదీ’ అంటూ ఇంట్లో ఉన్నవాళ్ళని పిలిచారు. మొదటిసారి లాల్ సలామ్ అని మాట వినడం, ‘లోపలికి రండి అక్కా’ అన్నారు. నేను ముందుకు వెలుతుండగా మిలటరీ డ్రస్ లో ఉన్న ఒక కామ్రేడ్ నా వైపు వస్తూ ‘బాగా అలసిపోయారా కామ్రేడ్’ అంటూ ఎంతో ముందు నుంచే పరిచయమున్న వ్యక్తిలా ఆప్యాయంగా అడిగింది. తన మొఖం ఆ వెలుతురులో అంత స్పష్టంగా కనిపించలేదు కానీ తన ఆకారం మాత్రం అర్థమవుతోంది. ఏదో పొడవైన తుపాకిని భూజాన వేసుకొన్న చేతిలో ప్లేటు మాత్రమే కనిపిస్తోంది. తనతోపాటు మిగతా కామ్రేడ్స్ అందరూ వాళ్ళ ఆకారాలు తప్ప ముఖాలు మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. ఇంతలో ఆ ఇంటి నుండి ఎవరో పురుష కామ్రేడ్ అక్కా లోపలికి రండి అంటూ పిలిచాడు. నేను శృతి లోపలికి వెళ్ళగా నాతో వచ్చిన కామ్రేడ్ బయటే ఉండిపోయింది.
‘ఏంటీ బాగున్నారా’ అంటూ మా వైపు లాల్‌సలామ్ చేస్తూ ఒక కామ్రేడ్ మా ముందుకు వచ్చాడు. ఆ ఇంట్లో లైటు ఉండటంతో తనను మేము గుర్తు పట్టాము. రాంగూడ ఎన్కౌంటర్ జరిగినప్పుడు పదేపదే టీవీలో చూపిస్తుండేవారు. అయితే వాళ్లు ఎవరూ? వాళ్ళు ఏం చేస్తారు అనేది అప్పటికి నాకు తెలియదు. సంఘంలో పని చేస్తున్నప్పుడు అంతో ఇంతో వింటుండేదాన్ని. వార్తల్లో టీవీల్లో చూసేదాన్ని. నా స్నేహితురాలికి ఫోన్ చేసి అడిగాను. అయితే అప్పటికే తను ఏడుస్తున్న విషయం నాకు తెలియదు. ‘నీవు మొదట ఇంటికి రా’ అంటూ ఫోన్ పెట్టేసింది. నేను వెంటనే ఏదో జరిగినట్లుంది అనుకొని బ్యాగ్ తీసుకొని బయలుదేరా. అంతలో మరో ఫోన్. ‘నీవు న్యూస్ ఫాలో అవుతున్నావా?’ అని శుభ అడిగింది.
‘ఊ విన్నాను, కానీ పూర్తిగా చూడలేదు’ అన్నాను. ‘ఎందుకు”? అని అడిగింది. ‘రేపటి నుండీ ఎగ్జామ్స్ ఉన్నాయి’.
‘ఈ వార్త దాదాపు రెండు రోజుల నుండి వస్తూనే ఉంది. అసలు కనీసం దీన్ని ఫాలో కూడా కాకపోవడం నాకేం నచ్చలే’ అని కోపంగా అంది. ‘శుభా నాకు ఈ విషయాలపట్ల అంతగా అవగాహన లేదు. కాబట్టి ఇది నాకు ముఖ్యమైన విషయమని ఎలా తెలుస్తుంది?’ ఇంతలో తన ఫోన్ కట్ అయిపోయింది. బస్సులో కూర్చొని నేనెందుకు దీన్ని ఫాలో కాలేదు అని ఆలోచించి ఎగ్జామ్స్ అనే ఒక భయంతో నా చుట్టూ ఉన్న పరిస్థితులను పట్టించుకోకపోవడం గురించి నన్ను నేనే నిందించుకుంటూ గుగుల్ ఓపెన్ చేసా.
కిటికీ వైపు జరుగుతూ బయటకు చూస్తూ ఉంటే అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ రాంగూడ అనే అడవిలో తుపాకుల మోతే ఉందేమో, ఆ తూటాలకు బలిఅయిన వాళ్ళు ఎందరో ఉండి ఉంటారు. ప్రజల జీవితాల కోసం తమ ప్రాణాలను అడ్డు వేస్తున్నా ఆ అడవి తల్లి బిడ్డల ఆక్రోశం గురించి బయట ఉన్న మాకు తెలియదు. ఎంత విషాదం! పరిపరి విధాల నా ఆలోచనలు సాగుతున్నాయి.
రాంగూడ ఎన్కౌంటర్ జరిగిన మూడవ రోజే నాకు ఫోన్ వచ్చింది. నీవు వెంటనే సైదాబాద్ కు రావాలని అన్నారు. నేను కూడా అంతే తొందరగా బయలుదేరాను. సైదాబాద్ రోడ్డుకు చేరుకోగానే ఇంత ట్రాఫిక్ ఏంటా అని బస్సు దిగాను. నా ముందున్న అంకుల్ ని అడిగాను.
‘అరగంట నుండీ ఇలాగే ఉందమ్మా’ అన్నాడు.
‘ఏ ఎందుకు?’ అన్నాను. ‘పోలీసుల బందోబస్త్ నడుమ ఎవరో నక్సలైట్ శవాన్ని తీసుకువస్తున్నారంట అందుకే ఈ తిప్పలు’ అన్నాడు.
‘ఆ శవం నక్సలైట్ దే అయినా, మరెవరిదైనా కొంత గౌరవిస్తే బాగుంటుంది. మన పనుల మధ్యలో శవాలను కూడా తిప్పలు అనుకోవడం మానవత్వమే కాదు’ అంటూ సీరియస్ గా అనేసి అక్కడ నుండి బయలుదేరా. అలా మొదటిసారి రోడ్డుపై అరగంట పైన నడిచా. ఎంతకీ చేరలేకపోతున్నా. చివరకు ఎలాగోలాగ దగ్గరకు చేరుకున్నాను. అంబులెన్స్ శబ్దం రావడంతో అటువైపు నేను వెళుతుండగా నా వెనక నుండి శుభా వచ్చి ‘ఎందుకింత లేటయింది?’ అని అడిగింది. ‘ట్రాఫిక్ జాం అని చెప్పా’.
ఇంతకీ అంబులెన్స్ లో ఉన్న డెడ్‌బాడీ ఎవరిదో మాకు తెలియదు. అందరికంటే మేమే లేటని అనుకున్నాం, కానీ అక్కడికి ముందు చేరింది మేమే. అంబులెన్స్ ను కౌకూర్ దిశ వైపు మళ్ళించారు. నేను శుభా కూడా ఆటో ఎక్కి దాని వెనక ఫాలో అయ్యాము. ఊరి దగ్గరకు చేరుకోగానే అమరులకు జోహార్లు, అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం అంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. నాకొకటే ఆందోళన. ఇంతకీ చనిపోయింది ఎవరా అని. అంబులెన్స్ నుండి శవాన్ని బయటకు తీస్తున్నారు. కానీ స్పష్టంగా కనిపించడం లేదు. తనని చూసిన చుట్టుపక్కల వాళ్ళంతా భోరున ఏడవసాగారు. దగ్గరకి వెళ్ళి చూడటానికి నాకు ధైర్యం చాలట్లేదు. ఇంతలో నా వెనక నుండి లక్ష్మక్క ఆందోళనతో ముందుకు వచ్చింది. నేను తనతో ఆ శవం వైపు బయలుదేరాను. లక్ష్మక్క ఒక్కసారిగా గట్టిగా కేక వేస్తూ ఆ శవంపై పడింది. నేను ధైర్యం చేసి శవానికి దగ్గరిగా వెళ్ళాను. చూసేసరికి ప్రభాకరన్న!
ఆ రోజు ప్రభాకరన్న ముందు ఎంతో మంది సహచరులు తన జ్ఞాపకాలను పంచుకున్నారు. కొంత మంది పాటల రూపంలో వ్యక్తపరిచారు. ఇలాంటి సందర్భం నాకు ఇదే మొదటిది. అందరిలా నేను ఏడవట్లేదు, కానీ నా హృదయంలో ఎప్పుడూ లేని ఘర్షణ మొదలైంది. సమాజమార్పు కోసం తన వంతు కృషిని చేస్తూ ప్రాణాలర్పించిన ప్రభాకరన్న, తనతో అమరులైన ఇంకొంతమంది కామ్రేడ్ ఆదర్శాల ముందు నా జీవితం, నా కుటుంబానికి అంకితం అన్న నా ఫార్ములా మారుతోందనిపించింది.
శృతి పిలుపుతో నాకు తెలియకుండానే జోహార్లు అనే మాట బయటకు వచ్చింది.
‘ఏమంటున్నావ్?’ అనడంతో ఈ లోకంలోకొచ్చి పడ్డాను. అహా ఏమి లేదు అని తడబడ్డాను.
‘కామ్రేడ్స్ ఇక్కడ నుండి బయలుదేరుదాం’ అని అనడంతో అందరూ చకచక సామాన్లు సర్దుకుంటున్నారు. ఆ చీకట్లో పడుతూ లేస్తూ మేము చేరవలిసిన ప్రదేశానికి చేరుకున్నాం. నేను మాట్లాడుతుండగానే శృతి నిద్రలోకి వెళ్ళిందన్న విషయం తన గురకతో అర్థమైంది. నాకు చీకటీ, అందులో చలి. మామూలు చలికాదు, పేగులను మెలేస్తున్నట్లు, తలలో ఐస్ ముక్కలున్నట్లు అనిపిస్తోంది. టైం ఎంతయిందా అని చూస్తే పన్నెండు కావస్తుంది. అందరూ పడుకున్నారు నేనుతప్ప. నిద్ర మాత్రం రావడం లేదు. ఒక్కసారిగా ఇంటి వైపు ఆలోచనలు మళ్ళాయి. ఈ రోజు లాగే శివరాత్రి పండుగరోజు రాత్రంతా మేలుకుని ఉండేవాళ్ళం. అమ్మ ఒక్కతే ఉపవాసం ఉండేది. పాపం నన్ను, తమ్ముడిని ఉపవాసం ఉండమని ఎంత బ్రతిమాలినా ‘మేము నాస్తికులం. నీ ఉపాసానికీ, నీ పూజలకు కరిగిపోయి లేని శివుడే ప్రత్యక్షమైనా ఆ శివుడికి నాస్తికత్వాన్ని ఇచ్చేరకం మేము. అలాంటిది ఎలా ఉపవాసం ఉంటామని అనుకుంటున్నావమ్మా’. అని పాపం అమ్మను బాధపెట్టేవాళ్ళం. ‘నేను దేవుడు లేడని ఎంతో మందిని మార్చాను. కానీ నిన్ను మార్చడం మాత్రం నావల్ల కావట్లేదు. ఇంకా మాకేదో దెయ్యం పట్టిందనీ, అందుకే దేవుడు లేడని అంటున్నావని స్పెషల్ పూజలు, అదనపు ఖర్చులు చేస్తున్నావు. అయినా నీవు ఎలా మారుతావమ్మా’ అని కోప్పడేదాన్ని.
‘అసలు నీతో చదువుకుంటున్నవాళ్ళంతా ఎంచక్కా లంగఓణీలేసుకొని పూజలు చేస్తుంటే నీవేమో మగరాయిడిలా ఆ పాంట్లు, షర్టులు వేసుకుంటూ దేవుడు లేడని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అయినా నిన్ను కాదు అనాల్సింది నన్ను నేనే తిట్టుకోవాలి. నీవు వినకున్నా ఆ సంఘమేదో నేనే నీకు పరిచయం చేసాను. ఇప్పుడేమో నా మాట వినకపోగా దేవుడు లేడు, గీవుడు లేడని పండగ రోజు పాపం మూటగట్టుకుంటున్నావ్. ఇదంతా నేను చేసిన కర్మే’ అంటూ కోపంగా అమ్మ వెళ్ళిపోయింది.
తమ్ముడు ‘ఏంటే నీవుకూడా అమ్మతో అలా మాట్లడతావ్, పోనీలే అందరికంటే అమ్మ బెటరే, పూజల విషయంలో’ అన్నాడు. చెప్పడం మర్చిపోయా. ‘నేను కూడా ఉపవాసమే ఉన్నా’నని అన్నాడు. ‘ఏంట్రా నీవు కూడా మళ్ళీ దేవుడున్నాడని నమ్ముతున్నావా?’ ఆశ్చర్యంగా అన్నాను. లేదులే అమ్మ బాధపడుతుందని అంతే అన్నాడు. నాకు పండుగలంటే కొంత ఇష్టమే, చుట్టాలందరూ రావడం, స్నేహితులతో కొంత డాన్స్ ఆడటం, రాత్రంతా డీజే పాటలతో తెల్లవారేదాక అర్థమయ్యేదే కాదు. కానీ ఈ రోజు మాత్రం ఈ చలి, ఈ చీకటీ ప్రతి నిమిషాన్ని ఎప్పుడు తెల్లవారుతుందా అని గుర్తు చేస్తా ఉంది.
నా చుట్టు ఉన్నవాళ్ళు ఏదో సర్దుకున్నట్లు అనిపించడంతో లేచాను. ‘ఏమైంది’ అని అడిగాను.
‘వెళ్ళేటైం అయితుంది. లేవండీ’ అని అన్నారు. ‘టైం ఎంతవుతోంది?’ అన్నాను.
‘నాలుగున్నర’ అంటూ ఆ కామ్రేడ్ అక్కడి నుండి వెళ్ళింది. ఏంటీ ఇంత ఉదయానే లేవడమా? అది ఈ చీకట్లో. అసలు నేను రాత్రి పడుకున్నది ఎప్పుడా అని ఆలోచిస్తూనే మళ్ళీ నిద్ర పోయాను. ఐదు గంటలకనుకుంటా బహుశా, ‘కామ్రేడ్స్ బయలుదేరుదాం. రడీ కండీ’ అన్న కాషన్ విని హడావిడిగా లేచి సర్దుతూ శృతిని లేపాను. అందరం బయలుదేరాం. తెల్లతెల్లవారుతుండగా నా చుట్టూ ఉన్న పరిసరాలు కొంత అర్థం అవుతున్నాయి. మా ముందు ఒక పెద్ద కొండ కనిపించింది. బహుశా దీన్ని ఎక్కాలేమో అనుకుంటుండగానే ‘ఏంటీ? ఈ కొండను ఎక్కేదుంది రెడీయేనా?’ అని అడిగింది.
నేను వెంటనే శృతి దగ్గరకు వెళ్ళాను. ‘శృతి! కొండెక్కాలంటే పై నుండి తాళ్ళు వేస్తారు కదా! అలాంటిది ఏం లేకుండా ఎలా ఎక్కడం?’ అని అడిగాను. ‘తాళ్ళు లేకుండా కూడా ఎక్కొచ్చు. నీవు చూసిందంతా సినిమాల్లో కదా’ అంది. కొండవైపు బయలుదేరాం. ఇంతలో ‘శృతి, స్పూర్తిల కిట్లు పట్టుకొండి’ అన్నాడు రవన్న. మాతో నడుస్తున్న ఆ ఇద్దరు కామ్రేడ్స్ మావైపు బయలుదేరారు. శృతి కిట్టు ఇచ్చింది. ‘నేను ఇప్పుడే కిట్టు ఇవ్వను. నేనే మోస్తా అన్నాను’.
‘లేదు లేదు ఎక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇవ్వు’ అని రవన్న అన్నాడు. ‘ఇబ్బందైనా ఈ రోజు నుండే ప్రాక్టీస్ చేస్తా’నంటూ ఎక్కడం మొదలుపెట్టాం. నాకు ఎక్కుతున్నంతసేపు ఎక్కువ ఇబ్బంది ఏమి అనిపించలేదు. కానీ నా ముందున్న వాళ్ళు చకచక ఎక్కడంతో నేను వెనకబడుతున్నానని కొంత స్పీడును పెంచాను. అయినా వాళ్ళలా నడవలేక పోతున్నాను. దీన్ని గమనించిన రవన్న ‘స్పూర్తి! కొండను ఎక్కేటప్పుడు స్పీడుగా పోవాలనుకోవద్దు. కొంత నిదానంగా ఎక్కితే తొందరగా అలిసిపోవు’ అని చెబుతూ వెనక్కి తిరిగి చూసాడు. మేమున్న టీమ్ కీ శృతి టీమ్ కీ చాలా గ్యాప్ ఏర్పడింది. పాపం తను చాలా ఇబ్బంది పడుతున్నదన్న విషయం అందరికీ అర్థమైంది. అలా ఆగుకుంటూ ఆగుకుంటూ ఎక్కుతున్నాం. కానీ ఒక విచిత్రం రవన్న వయస్సు బహుశా మా నాన్న వయస్సు కంటే కొంత తక్కువే కావచ్చు. కానీ పెద్దవాడే. కానీ మేము నడుస్తున్నంతసేపు ఎక్కడా అలసిపోయినట్లు అనిపించలేదు. సమయానికి ఆగుతూ ఆగిన సమయంలో ఇతరుల అలసటను పోగొట్టే కొన్ని విషయాలను చర్చిస్తూ వస్తుంటాడు. అడవి ప్రాంతంలోని విప్లవోద్యమంలో వయస్సులతో సంబంధం లేకుండా విప్లవోద్యమాన్ని నిర్మిస్తూ కొనసాగిస్తూ ముందుకు సాగుతుంటారు.
కొండ అంచున చేరుకునేసరికి మంచు పొగతో కమ్ముకున్న కొండలు. పల్చగా ఆ పొగ మంచులో నుండి కనిపిస్తున్న మిగతా కొన్ని దట్టమైన కొండలు, ఆ కొండల మధ్య నుండి ప్రవహిస్తున్న నీళ్ళు, ఆ నీళ్ళపై ఉన్న తెల్లటి మెరుపుపై కమ్ముకున్న పొగమంచు అబ్బా ఏమైనా అందమా!
అమ్మ, నాన్నా మిగతా తల్లిదండ్రుల కంటే ఫ్రీగానే ఉండేవాళ్ళు. అందుకే నేమో మేము మా అమ్మ నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛనీ ఎప్పుడు మిస్ యూజ్ చేయలేదు. కాకపోతే తను అనుకున్నట్లు డాక్టర్ ని కాకుండా చెప్పకుండా ఇక్కడకు రావడమే నేను చేసిన పెద్ద పొరపాటు. అయినా ఎంత ఫ్రీడం ఇచ్చిన తల్లిదండ్రులైనా విప్లవంలోకి వెళతానంటే వింటారా? అందరికీ భగత్ సింగ్ లు కావాల్సిందే కానీ తన ఇంట్లోనే భగత్‌సింగ్ ఉండటమంటే కష్టమే. అందుకే ఆ పొరపాటు చేసాను. ఎప్పుడైనా ఆ పొరపాటుకు క్షమాపణ తెలియజేస్తానేమోనని ఆలోచించేలోగా ఏదో ఒక డేరాకు చేరుకున్నాం. అక్కడ ఎవరికి వాళ్ళు కొంత రెస్టు తీసుకున్నట్లు అనిపించింది. నేనుకూడా ఒక రాయిపై కూర్చున్నా.
శృతిని పిలిచి రవన్న ఏదో విషయం చెప్పాడు. ఇంతలో శృతి నా దగ్గరకు వచ్చి ‘మనం ఇక్కడే ఆగుతాం అంట. మనవాళ్ళు వచ్చి కలుస్తారంటా’ అంటూ మెల్లగా చెవిలో చెప్పింది. ‘వెన్నెల కూడా వస్తుందంటా’ అని అనగానే ఆ కామ్రేడ్ ను బయట కలిసిన జ్ఞాపకాలు. నాకు బాగా గుర్తొచ్చిన విషయం మా కాలేజ్ కి వచ్చి మహిళల పై జరుగుతున్న దాడులపై వాటిపై ఎలా స్పందిచాలో, ఎలా పోరాడాలో అని ఉపన్యాసాలిస్తూ మహిళలకు సంబంధించిన పాటలు పాడి ఫోన్ నంబర్ బోర్డుపై రాసి వెళ్ళేవాళ్ళు. నాకు ఆ సయయంలో సమాజం పట్ల ఏ మాత్రం అవగాహన లేని నాకు వాళ్ళ ఉపన్యాసాలు బోర్ గా అనిపించేవి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సినిమా పాటలు వినేదాన్ని. అలా ఎన్నోసార్లు కాలేజ్ కి వస్తుండేవాళ్ళు. నేను మాత్రం కొన్ని సార్లు వెనకడోర్ నుండి వెళ్ళిపోయేదాన్ని. అంతేకాదు కాలేజీలోనే కాక కొన్ని సార్లు మా బస్తి దగ్గర కూడా ప్రత్యక్షమయ్యేవాళ్ళు. ఒకసారి ఏకంగా మా ఇంటికే వచ్చేసారు. ‘వీళ్ళకు ఏం పని ఉండదా? ఎప్పుడు ఏదో ఒకటి చెప్పుకుంటూ రోడ్లపైనా, బస్టేషన్లలో, బస్తీలలో, కాలేజీలలో తిరుగుతుంటారు. అసలు వీళ్ళకు ఏం లాభం లేకుండానే ఇదంతా చేస్తున్నారా?’ అంటూ ఒకరోజు అమ్మతో గొడవ పడ్డాను. దానికి అమ్మ ‘అలా అనొద్దు. వాళ్ళు మంచి పనేగా చేస్తుంది. నీకు ఇష్టమైతే విను, లేకుండా సప్పుడుగాక ఉండు అంతేగానీ నోరుంది గదా అని ఎంతొస్తే అంత తిట్టొద్దు’.
మా అమ్మను మార్చారనిపించింది. ‘అమ్మా నీపైనా వాళ్ళు మాటల స్ర్పే చల్లుంటారు. అందుకే నీవు కూడా మారావు. కానీ నీ లాగా అంత ఈజీగా మారే రకం కాదు నేను’ అని ఈ అక్కవాళ్ళ గురించి గొడవ పడ్డాను. ఈ రోజు అదే అక్క కోసం నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఇలా ఆలోచిస్తుండగానే నా ముందు ఉన్న కామ్రేడ్స్ లేచి నిలబడటంతో వెనకకి తిరిగి చూసాను. కొంతమంది ఏవేవో బరువుల వేసుకొని మా వైపు వస్తున్నారు. మేము లేచి లైన్ లో నిలబడ్డాము. దానికి ముందే నా ముఖం అర్థం కావద్దనీ, తనకు కొంత సర్ ఫ్రైజ్ ఇద్దామని స్కార్ఫ్ ముఖానికి కట్టుకున్నాను. ఒకరి తర్వాత ఒకరు నా ముందు నుండి లాల్ సలామ్ చేస్తూ వెళుతున్నారు. ఇంతలో తను కనిపించింది. మాదగ్గరకి రాగానే మాస్క్ లో ఉన్న నన్ను గుర్తుపట్టి సంతోషంతో హగ్ చేసుకుంది.
కమాండర్ రోల్ కాల్ అని చెప్పడంతో అందరూ వెళ్ళి లైన్ లో నిలబడ్డారు. నేను మాత్రం వెళ్ళలేదు. ఒక కామ్రేడ్ వచ్చి ‘వెళ్ళి నిలబడు’ అని అన్నాడు. ‘నేను అక్కడ నిలబడి ఏం చేయాలి?’ ‘వాళ్ళు చెప్పేది విను అంతే’ అన్నాడు. ఆ రోజుకు సంబంధించిన వర్క్ డివిజన్ చేసి ‘విసర్జన్’ అని అన్నాడు. అదేమిటో నాకు అర్థం కాక తననే చూస్తూ ఉండిపోయాను.
అక్కడ నుండి వెళ్ళిన కామ్రేడ్స్ చకచకా అయిదు లీటర్ల నూనె డబ్బాలను పట్టుకొని వెళ్తున్నారు. ఇంకొంత మంది ఏదో వెతుకుతున్నట్లు అనిపించింది. తీరా చూసేసరికి కొంత మంది కర్రలు, ఇంకొంత మంది పొయిరాళ్ళు, మరో కామ్రేడ్ అగ్గి పెట్టడం ఇలా చకచక ఎవరికివాళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు. మేము బయట ఉన్నప్పుడు క్లాసుల సందర్భంగా ఒక దగ్గర చేరినప్పుడు ఇలాగే వర్క్ డివిజన్ చేసేవాళ్ళు. అయితే అది పట్టణ వర్క్ స్టైల్. ఇక్కడ ఏమి లేనిదగ్గర నుండి అన్నీ అడవిలోనుండి సేకరించాల్సిందే. నాకు కూడా ఎందుకో కర్రలు తేవాలని అనిపించి నా పక్కనే ఉన్న రెండు కర్రలను తీసుకొని కిచెన్ లో వేసి వస్తుంటే ఒక కామ్రేడ్ నన్ను చూసి నవ్వుతోంది. ఓహో నేను తక్కువ తెచ్చాను కదా అందుకే అనుకున్నాను. కానీ అది కాదు విషయం నేను తెచ్చింది పచ్చి కర్రలు అన్న విషయం తర్వాత చెప్పింది. దాంతో నేను కూడా నవ్వాను. అలా ఒక రాత్రి, ఒక పగలు దళం వాళ్ళతో గడిపితే నాకు నేనుగా కొన్ని పరీక్షలను నెగ్గుతున్నానేమో అనిపించింది. ముఖ్యంగా ఈ చలి, కొండలెక్కడం, వివిధ ప్రాంతాలకు చెందిన కామ్రేడ్స్ తో ఉండటం… ఇంక ఏదైనా చేయగలననే విశ్వాసం పెరుగుతోంది.
ఇంతలో చాయ్ విజిల్. అందరూ చాయ్ తెచ్చుకొని తాగుతుండగా నాకు, శృతికి కూడా తీసుకొని వచ్చారు. ‘నేను తాగను’ అని అనడంతో చాయ్ తెచ్చిన కామ్రేడ్ ‘ఏం కాదు తాగు. ఉదయాన్నే ఏమైనా జరిగినా ఇది ఆసరా ఉంటుంది.’ అని నా చేయికి గ్లాసు ఇచ్చి వెళ్ళిపోయింది. ‘మరి నువ్ ఏం తాగుతావ్? నాకు మాత్రం చాయ్ అంటే బాగా ఇష్టం’ అంది వెన్నెల. ‘ఎప్పుడో ఒకసారి తాగుతాను కానీ రెగ్యులర్ గా అలవాటు లేదు’ అన్నాను.
అలా అనడంతో నాకు మా కాలేజ్ డేస్ లో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. నా జూనియర్ విజయ్ ఒకసారి నా దగ్గరకు వచ్చి ‘క్యాంటిన్ కి వెళ్ళి చాయ్ తాగుదామా’ అన్నాడు. ‘అసలు నీవెవరూ’ అని అడగడంతో ‘నేనెవరో నీకు తర్వాత చెబుతాను ఫస్ట్ నీవు వస్తావా రావా?’ అని అన్నాడు. సరేలే ఎందుకో అని వెళ్ళాను. రెండు చాయ్ లు చెప్పి ‘బిస్కట్ తింటావా’ అని అడిగాడు. ‘అసలు నేను చాయే తాగను’ అన్నాను. ‘ఒకసారి తాగితే మళ్ళీసారి వదలవులే’ అన్నాడు. ‘అయినా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి కాఫీ తాగితే ఎక్సెట్రా ఎక్రెట్రా అనుకుంటారు’ అని అన్నాడు. ‘సరే గానీ అసలు విషయం ఏంట’ని అసహనంతో అడిగాను.
‘మొన్నటి సండే నేను, మా చెల్లి బైక్ మీద వెలుతుండగా దర్నా చౌక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడుతున్న పాట విని మా చెల్లి ఆ ధర్న వైపు మళ్ళించింది. ఆ పాట పాడింది ఎవరో తెలుసా’ అని అడిగాడు. నేను మౌనం వహించాను. ‘అది నువ్వే. ఎప్పుడు నీవు ఎదురుపడేదానివి కాదు, కానీ నా సీనియర్ వి కాబట్టి ఎలా మాట్లాడాలో అని అనుకునేవాళ్ళం. అయితే మొన్నటి ధర్నాలోని పాటతో అందరితో స్నేహంగా ఉంటావనే ఉద్దేశంతో మీతో ఈ రోజు ఇలా మాట్లడుదాం అనుకున్న’.
‘సరేగాని విషయం ఏంటి’ అని అడిగాను. ‘చూడటానికి హైదరాబాద్ అమ్మాయిలా స్టైల్ గా రెడీ అవుతారే గానీ ప్రజలకు ఏదో చేయలనే తపన మీలో కనిపిస్తుంటుంది. నాకెందుకో అది బాగా నచ్చింది. చదువులు, ఆ తర్వాత ఉద్యోగాలు ఇలా కెరియర్ గురించి ఆలోచించే ఈ సొసైటీలో నీ లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యమనిపించింది. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావాలి’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని రోజులు తనతో మాట్లాడుతుండగా మరో సారి క్యాంటిన్ కి పిలిచాడు. ‘ఏంటో చెప్పు’ అన్నాను.
‘ఇంతకీ మీది ఏ క్యాస్ట్’ అని అడిగాడు. ‘ఎందుకు?’ అని అన్నాను. దానికి సమాధానంగా తను నవ్వాడు. నాకు మాత్రం అర్థమయి అక్కడి నుండి వెళ్లిపోయాను. ఇంతలో తన ఫోన్ నుండి మెసేజ్ వచ్చింది. ‘ఐ లవ్ యూ’ అని. నేను పెద్దగా ఏమి ఆశ్చర్యపోలేదు కానీ ఒకసారి మా మీటింగ్ కి తీసుకువెళదామని మాత్రం అనుకున్న. ఇంతలో తను ఇంటికి రమ్మని చెప్పిన విషయం గుర్తొచ్చింది. వెంటనే అదే బస్ దిగి సీదా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ అనుకుంటా కూరగాయలు కట్ చేస్తూ కనిపించింది. వాళ్ళ అమ్మతో పరిచయం ఏర్పర్చుకొని విజయ్ చెప్పిన విషయాన్ని తనతో చెప్పాను. తను బాగా కోప్పడింది. అసలు మీది ఎంత వయస్సు? ఇలాంటి దందలోకి వెళతారా? అని చెడా మడా తిట్టింది. తన ఆవేశాన్ని అర్థం చేసుకొని నాకు అలాంటి ఉద్దేశం ఏమి లేదు. అయినా నేను స్టుడెంట్ ఆర్గనైజేషన్ లో పని చేస్తున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆర్గనైజేషన్ పరిచయంతో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా, చూస్తున్నా. నాకు ఇలాంటి సందర్భంలో ఇవన్నీ ఒక డిస్ర్టబెన్స్ గా ఫీల్ అయ్యాను. నేను చేసింది కరెక్టో కాదో తెలియదు కానీ అడ్డు మాత్రం వదిలించుకున్నాను అనుకున్నాను. ఇంతలో విజయ్ నుండి మెసెజ్ వచ్చింది. ‘నీ కెంత ధైర్యం. మా అమ్మకి చెబుతావా? నన్ను తన ముందు బ్యాడ్ ని చేస్తావా’ అని మెసెజ్ పెట్టాడు. అది చదివి మెసెజ్ ఇచ్చే లోపే మరో మెసేజ్ వచ్చింది. ‘ఎలాగైనా నీ అంతు చూస్తా’ అని మెసేజ్ రావడంతో నేను కూడా ఒక్కటే ఒక్క మెసెజ్ పెట్టాను. ‘నా ధైర్యం ఎంత అని చూడాలంటే నా ముందుకు రా’ అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసా. ఇలా విజయ్ లాంటి ఒకరిద్దరు ఈ విధంగా చేసినా ఒక మార్గాన్ని ఎంచుకున్న నా లాంటి వాళ్ళకు అవన్నీ అడ్డంకులుగానే అనిపించాయి.
రాత్రి యేడు గంటల సమయంలో శృతి నాతో కొద్దిసేపు మాట్లాడతానంది. ‘ఏంటో చెప్పు’ అన్నా.
‘ఏమైనా మిస్ అవుతున్నావా’ అని అడిగింది. ‘అవును నా ప్రియమైన ఫోన్, దానితోపాటు రోజు వినే పాటలు’ అని నవ్వుతూ అన్నాను. ‘అవును డియర్. మరి ఫోన్ లేకుండా ఎలా ఉండగలవు’ అని అడిగింది.
‘ఈ రెండు రోజులు ఉన్నాను కదా, అలాగే’ అన్నాను. ‘మరి నీవు వచ్చి టూడేస్ అవుతుంది కదా, ఉండగలుగుతావా? అందుకే నీకు ముందే చెప్పాను. ఒకసారి వెళ్ళొచ్చి చూడు అని’ అంది.
‘ఇదేమైన ఉద్యోగమా ఒకసారి చెక్ చేసుకొని మరోసారి జాయిన్ అయిపోవడానికి. ఇది విప్లవం కదా, దీనిలో టెస్టింగ్‌లు ఏమీ ఉండవు. ఏదైనా ముందుకు పోవాల్సిందే. పార్టీ గురించి పెద్దగా ఏమి తెలియదు నాకు. ఈ రెండు మూడు సంవత్సరాలలో ఏదో పరిచయం తప్ప. కానీ ఇది పీడిత ప్రజల కోసం వారి పక్షాన ఉంటుందని మాత్రం అర్థమైంది అంతే. ఏదైనా నేర్చుకుంటాను’. నా మాటకు శృతి కళ్లనీళ్ళు పెట్టుకుంది.
‘నాకు తెలుసు నీవు ఇలాంటి నిర్ణయమే తీసుకుంటావని’ అంది.