1. కథలోకి ఎలా వచ్చారు?

జ. మాది ఏ నీటి అదరుపూ లేని మారుమూలన ఉండే మెట్ట ప్రాంతం. నిత్యం కరువుతో పోరాడుతూనే. కథలతో కాలక్షేపం చేస్తూ ఎప్పటికప్పుడు జీవితేచ్ఛను రగిలించుకోవడం మా ప్రాంత లక్షణం. అందుకే నాకు చిన్నప్పటి నుంచి కథలంటే ఇష్టం, మా అమ్మ ఈశ్వరమ్మ అద్భుతమైన కథలు చెబుతుంది. నా చిన్నప్పుడు రోజూ రాత్రిపూట మా అమ్మ కథతోనే నిద్రపోయేవాడిని. నాన్న రెడ్డెప్పాచారి కూడా కథలు చెప్పేవాడు. మా మేనమామలు రాజగోపాలాచారి, బ్రహ్మయ్యాచారి, మా పెద్దమ్మ లక్ష్మీదేవి మంచి కథకులు. మా ఊళ్లో కాదరిల్లి తాత, బడేసాబ్ వారంలో మూడునాలుగు రోజులైనా మా ఇంటికి వచ్చేవాళ్లు. ఇంటి ముందు అరుగుమీద కూర్చుని వారి జీవితానుభవాలను కథలుగా చెప్పేవాళ్లు. బడేసాబ్ భార్య ముగ్గురు మరాఠీలు, సాసవల చిన్నమ్మ, మాయలఫకీరు కథలు పిల్లలకు చెప్పేది. కాదరిల్లి తాత కొడుకు పీరాంసాబ్ మంచి జానపద కథలు చెప్పేవాడు. పొలంలో వేరుశనగ కాయలు ఒలిచేదానికి వెళ్లామంటే రోజంతా కథ చెప్పేవాడు. తరచూ మా ఇంటికి రాత్రి వేళ మా వీధిలో ఉండేవాళ్లంతా వచ్చేవాళ్లు. అర్ధరాత్రి దాకా కథలతో సందడిగా ఉండేది. అందరూచేరారంటే కథలు చెప్పేది మాత్రం మా నాన్నే.

చిన్నప్పటి నుంచి ఇలాంటి వాతావరణంలో పెరగడం వలనేమో నాకు బాల్యంలోనే కథలంటే ఆసక్తి ఏర్పడింది. రాత్రి ఇంటి దగ్గర విన్న కథలను .. నేను పగలు నా తోటి పిల్లలకు చెప్పేవాడిని. దీంతో నాకు పదేళ్ల వయసుకే.. దాదాపు వందకు పైగా కథలు వచ్చేటివి. మా పక్కన ఇంటిలో సురేంద్రరెడ్డి అనే అతను ఉండేవాడు. నా కంటేఏడెనిమిదేళ్లుపెద్దవాడు. తన వద్ద ట్రంకు పెట్టె నిండుకు పుస్తకాలుండేవి. నేను తరచూ వాటిని చదివేవాడిని. అతని దగ్గరే ‘అసమర్థుని జీవయాత్ర’ నవల మొదటిసారి చదివాను. ఇంట్లో బడిపుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు చదివితే నాన్న అరిచేవాడు.

ఇలా అసమర్థుని జీవయాత్ర చదువుతూ నాన్నకు దొరికిపోయి దెబ్బలు తిన్నా. నేను రెండో తరగతి సెలవుల్లో చదివిన మొట్టమొదటి నవల బాటసారి. ఆ వయసులో అర్థం కాకపోయినా.. నన్నెందుకో అక్షరాలు పిచ్చెక్కించేవి. పుస్తకాల వెంట పరుగులు తీయించేవి. నేను ఆరో తరగతి చదివే రోజుల్లో మా కేవీపల్లెలో లైబ్రరీ ఏర్పాటు చేశారు. అందులోని పుస్తకాలను చూడగానే నాకు పెద్ద నిధి దొరికినట్టు అయింది. 15 రూపాయలు మెంబర్ షిప్ కడితే ఇంటికి పుస్తకాలు ఇచ్చేవాళ్లు. మెంబర్ షిప్ కట్టే పరిస్థితి మాకు లేదు. దీంతో సెలవు ఉందంటే చాలు.. లైబ్రరీనే. మాకు సాయంకాలం

గంటసేపు ఇంటర్వెల్ ఉండేది. పీఈటీ లేరు. దీంతో రోజూ ఆ గంట సేపు లైబ్రరీలో గడిపేవాడిని. వారం వారం మ్యాగజైన్లలో వచ్చే కథలను, సీరియళ్లను విడవకుండా చదివేవాడిని. ఇలాంటి పుస్తకాలు చదవాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అని మార్గనిర్దేశనం చేసేవారెవ్వరూ లేరు. దీంతో లైబ్రరీలోని అన్ని పుస్తకాలను ఒకటికి రెండుసార్లు చదివాను. మా ఇంటివాతావరణం, లైబ్రరీ నాకు తెలీకుండానే నాలో కథా రచనకు బీజం వేశాయి..

2. మీ తొలి కథా రచన ఎలా జరిగింది?

జ. నాకు చిన్నప్పటి నుంచి కథలంటేనే ఆసక్తి నేను ఐదో తరగతిలో ఉండగా ‘గడ్డిపరక’ అనే కథ రాసి చందమామకు పంపాను. మొదట అచ్చయిన కథ ‘బంగారు పంజరం’. ఇది వార్త దినపత్రిక చెలి పేజీలో 17 నవంబరు 1997న అచ్చయింది. ఈ కథను రాసి పంపిన పది రోజులకే పేపర్లో వచ్చింది. అయితే దీనికి ముందే ‘భూమి గుండ్రంగా ఉంది’ అనే కథ రాశాను. ఇది స్వాతి వారపత్రికలో ప్రచురణకు ఎంపికై నాకు పారితోషికం కూడా పంపారు. తర్వాత ఆ కథ 1998 మార్చి నెలలో అచ్చయింది. నేను మొదట రాసిన కథ ఇదే. అవి నేను తిరుపతిలో కార్పెంటర్గా పనిచేస్తున్న రోజులు. మాధవ నాయర్ అనే మేస్త్రీ దగ్గర దినకూలికి పనిచేసేవాడిని. మొత్తం ఐదుమందిమి తిరుమలలో ఒక గెస్ట్ హవుస్ లో (ఆది సీనియర్ సినీ హీరోది) వుడ్ వర్క్ కోసం 1995లో వెళ్లాము. నెలకు పైగా అక్కడే ఉన్నాము. తిరుమల ఆలయం వెనుక వైపున స్థానికులుండే వీధి అది. ఆ వీధి చివరలో ఈ గెస్ట్ హవున్. ఆ వీధిలోని మొదటి ఇంట్లో ఓ వృద్ధ జంట హోటల్ నడిపేది. మేము అక్కడ పొద్దున్నే టిఫను, మధ్యాహ్నం భోజనం తినేవాళ్లం. ఒక్కోసారి కాఫీ తాగేవాళ్లం. ఆ ఇంట్లో అద్దరే ఉండేవాళ్లు. ఇంటిగోడకు పెయింటింగ్స్ ఉండేవి. ఫొటోలుండేవి. కొడుకు కోడలు వేరే ఊరిలో ఉన్నారని అప్పుడప్పుడు వచ్చిపోతారని దంపతులు చెప్పారు. మేమున్న నెలలోనే వాళ్లు ఒకసారి వచ్చారు. అప్పుడు ఆ ముసలివాళ్ల సంతోషం మాటల్లో చెప్పలేం. వాళ్లు తిరిగి పోగానే.. తిరిగి యాంత్రికంగా.. బతికున్నాం కాబట్టి ఏదో ఒక పనిచేయాలి.. పనిచేయాలి కాబట్టి తినాలి అనే ధోరణిలో ఉండేవారు. వీరిని జాగ్రత్తగా గమనించిన నేను అక్కడ ఉండగానే పార్కులో కూర్చుని రాత్రిపూట రోజుకు కొంచెం కొంచెంగా ‘భూమి గుండ్రంగా ఉంది’ కథ రాశాను. తర్వాత రెండేళ్లకు స్వాతి వారపత్రికలో కథల పోటీకి పంపాను. అది మరో ఏడాదికి అచ్చయింది.

3. మీ జీవితానుభవ వ్యక్తీకరణలో కథ పాత్ర ఏంటి?

జ. కవిత్వంతో సాహితీ ప్రస్థానం మొదలైనా.. కథకుడిగానే గుర్తింపు తెచ్చుకున్నాను. కథల్లో జీవితాన్ని ఆవిష్కరించేదానికి అవకాశం ఉంది. పది పేజీల కథలో చెప్పే విషయాలను పది లేదా ఇరవై పంక్తుల కవితలో చెప్పడం కష్టం. చాలా సార్లు అసాధ్యం కూడా. అందుకనే నేను కథను ఆశ్రయించాను. నేను చూసిన జీవితాలను అనుభవించిన సంఘర్షణను.. కథల్లోకి తెచ్చాను. నా కథల్లో కొన్నిటిలో ‘సురేంద్ర’ అనే పేరు ఉంటుంది. అది నా జీవితమే. కంటికెదురుగా అన్యాయం జరుగుతుంటుంది. అయితే.. ఇది మామూలే అనే ధోరణిలో అందరూ ఉంటారు. అది వారి జీవితంలో భాగమై ఉంటుంది. ఇది మామూలు కాదు.. అన్యాయం అని చాలా కథల్లో చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పటి వరకూ నా జీవనపోరాటంలోని చాలా దశలను కథల్లోకి తెచ్చాను. మధురాంతకం నరేంద్రగారి లాంటి మిత్రులు నాతో అంటుంటారు. ‘నీ జీవితం నీ రచనలు వేరువేరు కాదు బాబూ’ అని. ‘అంత యాతనామయ జీవితాన్ని ఎలా రాస్తావు?” అని కూడా అడుగుతుంటారు. అనుభవిస్తున్న యాతనను ఆవిష్కరించుకోలేక పోతే ఎలా.. నా బాధను నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు..?

4. కథలు రాసే క్రమంలో జీవితానుభవాన్ని వివరించుకునే దృక్పథం ఎలా పదునెక్కింది?

జ. నేను బాల్యం నుంచి లేమి కారణంగా చాలా వివక్షను ఎదుర్కొన్నాను. హేళనలను భరించాను. మేము బీసీలమే అయినా మా ప్రాంతంలో అగ్రవర్ణాల దృష్టిలో మేము మనుషులం కాదు. చాలా చిన్నప్పుడే ఈ విషయాలు నాకు ఎరుకలోకి వచ్చాయి. బహుశా నేను చదువుకున్న పుస్తకాల నుంచి నాకా ఎరుక వచ్చిందేమో. అలాంటి ఎరుక వచ్చాక.. ఆ మనుషుల మధ్య కలిసిపోయి జీవించడం కష్టం. బహుశా.. నాకందుకేనేమో.. మా పల్లెలో బాల్యమిత్రులు లేరు. బతుకు తెరువుకోసం పల్లెనుంచి పట్టణానికి వచ్చాక.. నా పరిధి పెరిగింది. చదివిన పుస్తకాలు.. కలుసుకున్న మనుషులు నాలో మరింత మార్పునకు కారణం. సంపద, హెూదా కాకుండా మనిషిని మనిషిగా గుర్తించాలి అనేది నాలో చిన్నప్పటి నుంచి ఉన్న భావన. దీనికి భిన్నంగా ఉండే మనుషులు నాతో బాగున్నప్పటికీ ఇలాంటి వారితో ఎక్కువ కాలం స్నేహం సాగించలేకపోయాను. కథలు రాయడం మొదలు పెట్టిన తొలినాళ్లలో పాపులర్ సాహిత్యం ఎక్కువగా ఉండేది. ఓ సమావేశంలో మధురాంతకం నరేంద్రగారిని అడిగాను, నేను ఎలాంటి కథలు కాయాలి అని. వారన్నారు ‘పాపులర్ సాహిత్యంలో ఎప్పుడూ పోటీ ఉంటుంది. సీరియస్ సాహిత్యంలో ఎవరి స్థానం వారికుంటుంది. ఎవరి ఖాళీని వారు పూరించుకుంటూ పోవడమే’ అని. అది నాపై చాలా ప్రభావం చూపింది. అప్పుడు

రాసిన కథే ‘అంటరానోడు’. తర్వాత ఆర్.ఎం. ఉమామహేశ్వరరావుగారి పరిచయం అయింది. రాయాలనుకున్న కథల్లోకి జీవితాన్ని ఎలా తీసుకురావాలో వారు చెప్పారు. మనం ఏ కథ రాసినా, అందులో ఏ పాత్రను సృష్టించినా మన జీవితంలోంచే తీసుకోవాలని, మనం సృష్టించే పాత్రకు మన జీవితంలో పరిచయం ఉన్న వ్యక్తులను ఊహించుకుంటే దానికి సహజత్వం వస్తుందని అన్నారు. తీసుకునే వస్తువు ఒకటే అయినా.. రాసేవారి జీవితం, చదివిన పుస్తకాలు, ఆలోచనలు చూసే దృష్టికోణం కారణంగా కథ కొత్తగా వస్తుందని చెప్పారు. అప్పుడు రాసిన కథ ‘నీడ’. నా

జీవితానుభవాన్నే కథలుగా రాయొచ్చని, ఎందుకు రాయాలో కూడా చెప్పిన వ్యక్తి బండి నారాయణస్వామిగారు. అప్పుడు రాసిన కథే ‘అన్నంగుడ్డ. కథ-2002 పుస్తకం ఆవిష్కరణ 2003లో ఒంగోలులో జరిగింది. అక్కడికి అల్లం రాజయ్యగారు వచ్చారు. జీవితాన్ని జీవితంలా మాత్రమే రాయకూడదని, మనం చెప్పాలనుకున్న విషయానికి కాస్త

కల్పన కూడా జోడించాలని చెప్పారు. తర్వాత తర్వాత ఎందరో సాహితీవేత్తలు పరిచయం అయ్యారు. గొప్పగొప్ప అనువాద పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి.. ఇవన్నీ కూడా నా జీవితానుభవ వ్యక్తీకరణకు మెరుగులు దిద్దాయి.

5. ఇంతవరకు రాసిన మీ కథల మీద మీ విమర్శనాత్మక అంచనా ఏమిటి?

జ. కథకుడిగా గుర్తింపు వస్తున్న రోజుల్లో.. విమర్శకులు, సీనియర్ రచయితలు చెప్పిన మాటలు విని నేనూ కథలు కొత్తగా రాయాలని ప్రయత్నించేవాడిని. కడగొట్టోళ్లు,  అభివృద్ధి, నిలకడమీద తెలిసేది, పెళ్లి, ఆకాశం అంచులదాకా.. ఇవి కొంచెం భిన్నమైన కథలు. అప్పట్లో ఓ ప్రముఖ విమర్శకులు వివిధలో రాసిన వ్యాసంలో ‘ఇప్పుడు రాస్తున్న రచయితల్లో సుంకోజి దేవేంద్రాచారి కొత్తగా రాసే ప్రయత్నం చేస్తున్నారు’ అన్నారు. తర్వాత తర్వాత నేను కథను సంక్లిష్టంగా రాయడం మానేశాను. అతి కొద్దిమంది మెప్పుకోసం కథలు రాయను. దీని వలన ఆ కొద్దిమంది మెచ్చుకోకపోవడంతో నాకథల్లో గాఢత లోపించిందని విమర్శ వచ్చింది. నేను నా కథల మెప్పుకోసం ఏ విమర్శకుడి వెంటా పడలేదు. నా కథల గురించి వ్యాసాలు రాయమని అడగలేదు. నేను ఎలా రాయాలనుకున్నానో అలానే రాస్తున్నాను. కాకపోతే.. ఇంతకంటే ఇంకొంచెం  సూటిగా.. నిలదీసేలా కథలు రాయాల్సిన అవసరం ఉంది.

6. స్వీయానుభవ పరిధిని దాటి ఎంచుకున్న వస్తువులు ఏమైనా ఉన్నాయా? అలాంటివి రాస్తున్నప్పుడు ఏమనిపించింది..?

జ. స్వీయానుభవ పరిధిని దాటి రాసిన కథలు చాలా తక్కువ. అలా రాసినప్పుడు కూడా నా అనుభవంలోని విషయాలను వాటిల్లో కూరుస్తాను. దీంతో మొత్తంగా ఆ కథ నా అనుభవం కాకపోయినా స్వీయానుభవం లాంటిదైపోతుంది. ఇలాంటి కథల్లో ఒకటి  ‘నిప్పుల కుంపటి’. ఇది చిత్తూరు జిల్లా సత్యవేడు దగ్గర సెజ్ పరిధిలోని ఓ గ్రామంలో నిర్వాసిత కుటుంబం కథ. అవి సెజ్ ఏర్పాటు చేస్తున్న తొలిరోజులు. ఆర్.ఎం.ఉమామహేశ్వరరావుగారు, తుమ్మేటి రఘోత్తమరెడ్డిగారు, గంటా చక్రపాణిగారు, నేను ఒకసారి సెజ్ నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాం. అక్కడి ఓ గుడిలో  అర్చకత్వంతో జీవనం సాగిస్తున్న యాదవ కుటుంబం సెజ్ రాకతో జీవన భృతి కోల్పోయింది. ఆ కుటుంబం జీవన ఘర్షణ ‘నిప్పుల కుంపటి’ కథలో రాశాను. మా ఊరిలో నా సహాధ్యాయి ఉన్నాడు. వీరు యాదవులు. యల్లమ్మ గుడిలో వంశపారంపర్యంగా పూజారులు. వీరికి ఆ అర్చకత్వం లేకుండా పోతే..? సెజ్ గ్రామంలో నేను చూసిన కుటుంబాన్ని మా ఊరి కుటుంబంలో ఊహించుకున్నా.. అంటే, ఆ జీవితం నాకళ్లముందున్నట్లే..

‘గాలి’ పేరుతో 2004లో ఒక కథ దాశాను. రిజర్వేషన్తో ఎస్సీ, ఎస్టీలు సర్పంచులు గానో ఎంపీటీసీలుగానో గెల్చినా వారి జీవితాలేం మారిపోవు. వారు కూడా పనులు చేసుకోవడమో, గొర్రెలు కాచుకోవడమో చేయాల్సిందే. రిజర్వేషన్ కింద పోటీచేసి అప్పులైపోయి, చివరకు ఆ అప్పులు తీర్చే మార్గం లేక ఎంపీటీసీగా గెల్చిన ఓ మహిళ కువైత్ వెళ్లారు. ఇది జరిగింది రాయచోటి దగ్గర.. మా ఊరి దగ్గర తూర్పుమాలపల్లె ఉంది. మా పొలానికి దగ్గరలో ఉంటుందా పల్లె, ఆ పల్లెలోని వాళ్లంతా నాకు చిన్నప్పటి నుంచీ పరిచితులే. వారి జీవితాలూ తెలిసినవే. అలా రిజర్వేషన్ కింద సర్పంచ్ గా గెలిచిన ఒకతను మా చిన్నప్పుడు గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. మరొకతను రెడ్డి ఇంట్లో జీతానికి ఉండేవాడు. రాయచోటి ఎస్సీ మహిళ గురించి రాసినా.. ఇది కూడా నా కళ్లముందరి జీవితమే.. బహుశా నేను రాయలేని వస్తువులను దాదాపు కథలుగా తీసుకోలేదు. నాకు తెలిసిన జీవితాలనే తీసుకోవడంతో రాయడానికి ఇబ్బంది ఎదురుకాలేదు. నేను కథలు రాసే తొలినాళ్లలో ఆర్ఎంగారు చెప్పిన సలహా నాలో బలంగా నాటుకు పోయిందనుకుంటా. నేను చూసిన, వాకు బాగా తెలిసిన మనుషుల జీవితం ఇమిడే వస్తువులను మాత్రమే కథలుగా ఎంచుకున్నానని ఇప్పుడనిపిస్తోంది.

7. మీ కథల మీద మీ అంచనాలకు భిన్నమైన పరిశీలనలు (గుణదోషాలు) బైటినుంచి వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది..?

జ. కథలో గుణదోషాలు నిజంగా చెబుతున్నారా.. లేదా కావాలనే లేని దోషాలను ఉన్నాయని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారా.. అనేది ఎదుటి మనిషి మాటలను బట్టి మనకు తెలిసిపోతుంది. 2006లో ‘దృశ్యాలు మూడు.. ఒక ఆవిష్కరణ’ కథ రాశాను. అప్పట్లో ముగ్గురు మంత్రులు రైతులకు సంబంధించి మూడు వ్యాఖ్యలు చేశారు. 1. వరి పండిస్తే తల్లి నెత్తురు తాగినట్టే. 2. తినింది అరక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 3. రైతులు ఒకరోజు టౌనుకు పోయి బిర్యానీ తిని, బీరు తాగి సినిమా చూసేది మానేస్తే మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవచ్చు.. అన్నారు. బాధ్యతగల స్థానంలో ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా ముగ్గురు మంత్రులు మాట్లాడిన మాటలు నాకు చాలా బాధకలిగించాయి. వెంటనే నేను ‘దృశ్యాలు మూడు.. ఒక ఆవిష్కరణ’ కథ రాశాను. అరుణతారలో వచ్చింది. ‘కథ – 2005’ ఆవిష్కరణ 2006లో కర్నూలులో జరిగింది. ఆ కార్యక్రమానికి నేను వెళ్లాను. పుస్తకావిష్కరణ అయిపోయాక రాత్రి భోజనాల దగ్గర ఓ రచయిత నాతో వాదనకు దిగారు. “రైతుల పట్ల నువ్వేమన్నా వకాల్తా పుచ్చుకున్నావా.. ఎవరో ఏదో అంటే ఎందుకు ఆ కథ రాశావు.. అలాంటి కథలు రాయొద్దు” అన్నారు.

అతను కథలో గుణదోషాలు కాకుండా అలాంటి కథలే రాయొద్దనడం సరికాదనిపించింది.  “ఔను.. నేను రైతుల పక్షాన వకాల్తా పుచ్చుకున్నాను. అలాంటి కథలు రాస్తాను, రైతులను ఎవ్వరు అన్యాయంగా మాట్లాడినా ఊరుకోను” అన్నాను. ఆ రచయిత మాట్లాడుతూ “అదేమన్నా కథా.. ఆ మూడు విషయాలకు అంత రాయాల్నా..  నా చేతికిస్తే ఆ కథను నేను రెండు పేజీలు తగ్గేలా ఎడిట్ చేస్తా” అన్నారు. నాతో వాదనకు దిగిన రచయిత అప్పట్లో 25 పేజీల కథ రాశారు. నేను వెంటనే “నువ్వు మాత్రం ఎందుకు అంత పెద్ద కథ రాశావు. నా చేతికి ఇచ్చావంటే సగం తగ్గించేస్తా.. ముందు నిన్ను నువ్వు ఎడిట్ చేసుకో” అన్నాను. అప్పట్లో అయితే అతనితో వాదించానే కానీ.. ఇప్పుడయితే వాదించను. విని ఊరుకుంటానంతే.

కథను రాశాక అందరికీ ఒకేలా అనిపించాలని లేదు. ఒకే వస్తువును కథగా రాసినా.. రచయితను బట్టి ఆ కథ మారిపోయినట్టే.. ఒకే కథను చదివినా పాఠకుడి స్థాయిని బట్టి వారికి అర్థమవుతుంది. రచయిత అనుకున్న దానికన్నా భిన్నంగా అభిప్రాయాలు వచ్చినా స్వీకరించాల్సిందే.

8. కథా ప్రక్రియకు, మీ వ్యక్తిత్వానికి ఉన్న లంకె గురించి చెప్పండి

జ. ప్రత్యేకించి ఒక సాహిత్యప్రక్రియతో వ్యక్తిత్వం ముడిపడి ఉంటుందని నేననుకోను. జీవితంలో అన్ని సాహిత్య ప్రక్రియలూ ఉంటాయి. కథ, కవిత, నవల, వ్యాసం, నాటకం.. ఏదిరాసినా అందులో రచయిత వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంటుంది. కొంతమంది సాధన ద్వారా తమ నిజస్వరూపం బయటపడకుండా ‘గొప్ప’వారు మెచ్చుకునే సాహిత్య సృజన చేస్తుంటారు. అయినప్పటికీ వారి దొంగవేషాలు ఆ రచనల్లో ఎక్కడో ఓచోట ఏదో రూపంలో తెలిసిపోతుంటాయి. తెలివైన పాఠకుడు రచయిత వ్యక్తిత్వాన్ని కనిపెట్టేస్తాడు. నేను రాసే రచనల్లో నా వ్యక్తిత్వం స్పష్టంగా కనిపిస్తుంటుంది.

ఆడవాళ్ల పనులు, మగవాళ్ల పనులు అంటూ లేవు. అన్ని పనులూ అందరూ చేయాల్సిందే. మా అమ్మాయిని అలాగే పెంచాం. ఇంట్లో నాన్ వెజ్ దాదాపు నేనే వండుతాను. వారంలో ఒకటిరెండు రోజులు వంట బాధ్యత నాదే. నేను దేవున్ని నమ్మను. నా సహచరి, మా అమ్మాయి కూడా అంతే. నా రచనల్లో పాత్రలు ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకోవు. దేవుని ముందు సాగిలపడవు.అలా సాగిలపడినట్టు కథలో చూపినా.. వారి సమస్య పరిష్కారం అయినట్టు చూపను. మానవ ప్రయత్నమే అన్నిటికన్నా అల్టిమేట్. నా పాత్రలు కూడా ఇవే నమ్ముతాయి. గుడికి పోయి పూజ చేసినా పని కాలేదు అనడానికి పూజను, దేవుడిని వాడుకుంటానే కానీ.. పూజలతో సమస్య పరిష్కారం అయినట్టు ఎక్కడా నా కథల్లో చెప్పలేదు.

9. కథనానికి, శిల్పానికి మీరు ప్రత్యేకంగా చేసిన సాధన గురించి కొంత చెప్పండి ?

జ. కేతు విశ్వనాథరెడ్డిగారి సంపాదకత్వంలో వచ్చిన ‘మన భూమి’ అనే పత్రికలో 2006 డిసెంబర్ సంచికలో నా కథ ‘ఎంతెంత దూరం’ వచ్చింది. ఓ ప్రముఖ రచయిత చదివి.. “కథను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు ఇంత సరళంగా రాస్తే ఎలా..? కథన్నాక సంక్లిష్టత ఉండాలి. పాఠకుడికి ఫజిల్లా ఉండాలి” అన్నారు. పాఠకుడికి పజిల్ పెట్టడం నా కథ ఉద్దేశం కాదు. నేను చెప్పాలనుకున్న విషయం సూటిగా పారకుడి బుర్రలోకి పోవాలి. నాకథలు ఎక్కువ భాగం అలానే ఉన్నాయి. కొన్ని కథలు మాత్రం ప్రత్యేక శిల్పంతో రాశాను. దీనికి విస్తృతంగా కథలు చదవడం, సీనియర్ రచయితల ప్రభావమే కారణం.

10. కథా రచనలో మీరు అందుకోవాల్సిన జీవనవాస్తవికత ఏమైనా ఉన్నదని అనుకుంటున్నారా..?

జ. నా రచనలన్నీ జీవనవాస్తవికతలోంచి వచ్చినవే. అయితే తెలుసుకున్న వాస్తవికత కంటే తెలియనిదే ఇంకా ఎక్కువ ఉంది. పొరల్లా ఒలిచి చూసుకుంటూ పోతే.. మనకు కనిపించే వాస్తవికత వెనక చాలా విషయాలు దాగుంటాయి. జీవన వాస్తవికత మొత్తం తెలుసు అనుకుంటే.. మానసికంగా అప్పుడే మరణించినట్టు. నిత్య చలనశీలి అయిన ఈ సమాజంలో చివరి ఘడియవరకూ జీవన వాస్తవికతను తెలుసుకునే, అందుకునే ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే.

Leave a Reply