నిషేధ కాంక్ష లేని సమాజాలు లేవు. అన్ని సమాజాలూ మనుషులపై పగ పూనినవే. ఏ సమాజంలోనూ మనుషులు తాము న్యాయం అనుకొన్నదానిని సాధించుకోలేకపోయారు. ఒక నమూనాగా కొంత నిడివితో నడిచిన సమాజాలు ఇందుకు మినహాయింపు కావచ్చు. నిరంకుశ పాలకవర్గ భావజాలాలన్నీ చరిత్రలో మనుషులను సమస్యగా చూసినవే. నేటి పాలకవర్గ భావజాలమైన ఫాసిజం ఈ చారిత్రక వాస్తవానికి విషాద ముగింపును ఇవ్వడానికి తొందర పడుతోంది. మరోవైపు, నేటి రాజకీయం మావోయిజం ఈ ప్రమాదాన్ని తప్పించి, మనిషిని ఏకైన పరిష్కారంగా ఎత్తిపట్టేందుకు ముందుకొచ్చింది. ఈ రెండు భావజాలాలకూ వేళ్లు రాజకీయార్థిక పునాదిలోనే ఉన్నాయి. ఆ విషయాల్లోకి వెళ్లే ముందు, ముందుగా మనుషులు తమ చైతన్యం, అవసరాలు, సాపేక్ష విలువల ఆచరణతో నిర్మించుకొన్న సమాజాలు వారికి ఎందుకు చెందకుండా పోతున్నాయనేది పరిశీలిద్దాం.
ఆధునిక సమాజాలు ప్రధానంగా వ్యాపార సమాజాలు. ఉత్పత్తి శక్తులుగా మనుషులది మౌలికంగా ఈ సమాజాల్లో గణనీయ పాత్ర. అయితే, వారికి న్యాయంగా దక్కాల్సిన ఈ స్థానం ఇవ్వడానికి వ్యాపార ప్రధానమైన పాలక రాజకీయాలు అంగీకరించవు. పైగా సమాజంలో వారి స్టాయిని కనిష్ట శ్రేణికి కుదించడానికి ప్రయత్నిస్తుంటాయి. అది ఆధిపత్య పాలక స్వభావమే కాదు, వ్యాపార అవసరం కూడా… ఉత్పత్తి శక్తులు ‘పెరుగుతూ పోతే వ్యాపార సమాజాలు సంక్షోభంలో పడిపోతాయి. సప్లయి- డిమాండ్ అనే మార్కెట్ ఎకానమీ గొలుసును పెరిగిన ఉత్పత్తి శక్తులు తెంచుతూఉంటే, ఆ గొలుసుకు అతుకులు వేసుకొంటూ-సంక్షోభాలను వాయిదా వేస్తూ- వ్యాపార వర్గాలు మనుగడ సాధిస్తూ ఉంటాయి. ఈ అతుకుల్లో భాగంగా తొలి దశలో డిమాండ్‌కు మించి తయారైన సరుకులను సముద్రంలో పారబోస్తుంటారు. వలసలను కనుగొనడం, వలసల పంపకాలు, వాటి పునుపంపకాల గొడవలు రెండో దశ, అయినా, ఉత్పత్తి శక్తుల ప్రజ్వలనం చారిత్రకంగా తథ్యం కాబట్టి… చివరిగా అత్యంత భారీస్టాయిలో సామూహిక వినాశకర, విధ్వంసకర వ్యూహాలతో ఈ శక్తుల నిర్మూలనకు తెగబడతారు. తెగలు, జాతులు, ప్రాంతాల మధ్య ఆధిపత్య అంతర్‌కలహాలు, మత దాడులు, కరువు కాటకాలు, దండయాత్రలు, యుద్ధాలు… తాజాగా కరోనా! ఇవన్నీ ఉత్పత్తి శక్తుల గతిశీలతను కనిష్టస్తాయికి తీసుకురావడానికి జరిగే పాలకవర్గ ప్రేరేపిత ప్రయత్నాలే.
కరోనా వంటి విపత్తులు పాలకవర్గాలు కోరుకొన్నవి కావనేది వాస్తవమే. అదే సమయంలో కరోనా వైరస్ నిరోధక వ్యవస్థలను నిర్వహించడంలో మాత్రం ప్రభుత్వాల దృష్టి ఖచ్చితంగా విధ్వంసపూరితమే. వీలైనంత జననష్టం జరగాలి. ఆక్సిజన్ అందక, అత్యవసర జౌషధాలు దొరక్క ఆస్పత్రుల్లో బెడ్డు అందక. మహా శక్తిస్వరూపుడైన మానవుడు. ఉత్పత్తిదాయక ప్రగతిగామి అయిన మానవుడు అత్యంత నికృష్ణస్థితిలో ప్రాణాల కోసం అడుక్కొంటూ…అడుక్కొంటూ కడతేరిపోవాలి. బాలీవుడ్ నటి కంగన రనౌత్ అన్నట్టు..అలా భూమికి భారం తగ్గాలి. ఇదీ ఫాసిస్టు పాలకుల నీతి!
వాస్తవానికి ఇలాంటి విపత్కాలాల్లోనే పాలకవర్గాలు అత్యంత చురుగ్గా కదులుతుంటాయి. ఎంత చురుగ్గా అంటే… శత్రు తలలు తెగి నేల రాలుతున్నప్పుడు అంతకంతకు ఉన్మత్తతతో గుండెలు ఎగసిపడేంత చురుగ్గా ఈ కాలంలో పాలకవర్గాలు నిర్ణయాలు తీసుకొంటూ ఉంటాయి. సహజంగానే నిషేధ కాంక్షలను తీర్చుకొనే తరుణం కూడా ఇదే. నిజానికి ఈ కరోనా కాలంలో నిషేధించాల్సి వస్తే వేటిని నిషేధించాలి? కుంభమేళాలను నిషేధించాలి..భారీ ఎన్నికల సన్నాహాలను నిషేధించాలి… జైళ్లను నిషేధించాలి… రైతులను రోడ్లమీదకు నెట్టి కరోనా నోటికి అందిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను నిషేధించాలి…దేశమంతా కదులుతున్న వలస కూలీలు, కాంట్రాక్టు కార్మికుల రవాణాకు అక్కరకురాని రైల్వేలను నిషేధించాలి… ఇంకా ఏమేమి నిషేధించాలి? జాబితా పెద్దదే. కానీ, ఇవేవీ నిషేధాలతో తీరి, మనుషులకు పరిష్కారంగా కలిసి వచ్చేవి కావు.
ముందుగా నిషేధ సంస్కృతిని అర్ధం చేసుకోవాలి. మనుషులను అణచిపెట్టడానికి మతం ఉంది… కులం ఉంది… వ్యక్తిగత ఆస్తి, వారసత్వం అంతః సూత్రంగా ఉన్న కుటుంబం ఉంది… రంగుబేధాలు, ప్రాంత అసమానతలు ఎన్నెన్నో. ఇన్ని ఉన్నా భౌతిక హింస చేయకుండా పాలకవర్గాలకు ఒక్కరోజూ నిద్రపట్టడం లేదు. కారణం ఏమిటి? ఇంత సాయుధ పోలీస్, ఇన్ని సైనిక పటాలాలు, చీకటి ఆర్డినెన్స్ చేసే చట్టసభలు చేతిలో ఉన్నా. తటస్థతను నటించే కోర్టులూ… ప్రభుత్వాలకు సాయం రావాల్సి వస్తోంది ఎందుకు? ఎందుకనంటే భావజాలాల కట్టడి అనేది అంత సులువు కాదు. అనేకనేక సామాజిక, సాంస్కృతిక, నైతిక శక్తులతో నిత్యం పాలకవర్గ రాజకీయాలు తలపడుతుంటాయి. అయితే, ఈ శక్తుల ఆధిక్యత అనేకానేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలన్నింటితోనూ పాలకవర్గాలు తలపడి, నిలబడలేవు. అందులో ఒకటి ఉత్పత్తి శక్తుల నిరంతర ప్రజ్వలనం. సామాజిక తలంలో సకల ఆధిపత్య భావజాలాలకు ఈ శక్తులు విసిరే సవాళ్లూ! విశాల జన రాసుల్లో రేకెత్తించేప్రత్యామ్నాయ దారుల జిజ్ఞాసా! దీంతో చివరి అస్త్రంగా ప్రభుత్వాలు నిషేధాన్ని ప్రయోగిస్తాయి. బహిరంగ ప్రజా కార్యాచరణలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వాలు నిషేధపు కత్తిని దూయవనే పిచ్చి భ్రమల్లో ఈ కారణాల వల్లే ప్రజాసంఘాలు ఉండవు. బహిరంగ ప్రజా కార్యాచరణలో భాగమైన సంఘాలు పెట్టుకోవడం, సభలు జరుపుకోవడం రాజ్యాంగం ప్రకారం చూసినా పౌరుల హక్కు. ప్రజలు పోరాడి తమ ఒత్తిడితో రాజ్యాంగంలో భాగం చేసిన ఇంకొన్ని హక్కులు. స్వేచ్చలు కూడా ఉన్నాయి. సాకు దొరికితేచాలు ఈ హక్కులను, స్వేచ్చలను ప్రజలకు రద్దు చేయడమే ఇన్నేళ్ల పాలకవర్గ రాజకీయాల సారాంశం. ఈ సారాంశం అర్ధమయితే, నిషేధ చీకట్లను చీల్చుకొని వెలుగులతో రావడం పెద్ద కష్టం కాబోదు.మరెన్ని సార్లయినా!