ఇది, ‘ఒక పక్షి కత’. దీన్ని పి.వరలక్ష్మి రాసింది.అరుణతారలో సెప్టెంబర్ 2009లో అచ్చయ్యింది.
ఈకలు లేని తెల్లని బట్టతల.బలమైన బూడిదరంగు రెక్కలు , కుడిచివర నుండి ఎడమచివర దాకా ఏడడుగుల విశాలమైనవి.పొడువాటి మొనదేలిన , గుహద్వారంలా తెరుచుకొనే ముక్కు.’ఔచ్..’మని అరచిందంటే దడుసుకొని ఆమడదూరం ఎగిరపోయే బక్కప్రాణులు. ఇదీ యీ కథలోని రాబందు బీభత్స గంభీర సోందర్యం.ఎప్పటికైనా తన గుంపు నాయకుడిగా యెదగాలనుకుంది.ఎదిగింది. అది తన వొంపుదిరిగిన బలమైన ముక్కుతో , చచ్చినప్రాణుల కఠినమైన శరీరభాగాలను చీల్చేది.దాన్ని చూసి సాటి పక్షులు నోరెళ్ళబెట్టేవి. కాలక్రమంలో చచ్చినవాటినీ, బలహీనమైన వాటినీ వేటాడితే యేం గొప్పా? అనుకొని మన రాబందు, లేల్లనీ, గొర్లనీ చివరకు దుప్పుల్నీ, అడవిపందుల్నీ కూడా అమాంతం కళ్లుబొడిచి చంపేది.చీల్చుకు తినేది.తనకు పోటీగా ఎవర్నీ యెదగనీకుండా చూసుకొనీ , తను తినగా మిగిలిది తినడానికి అందర్నీ అలవాటు చేసేసింది.వినకుంటే బలాన్ని ప్రదర్శించి భయపెట్టేది.ఇక వొక్క కోరికే మిగిలిపోయింది పక్షికి , అది సింహాన్ని వేటాడాలని!
అలాంటి పక్షి , ఒక ఉదయం తీక్షణమైన చూపులతో సూర్యున్ని సవాలు చేస్తూ భూమ్మీద ఆకారాలే కన్పించనంత ఎత్తులో విహరిస్తోంది. అప్పుడు సూర్యుడూ పక్షీ సమానమైపోయారనిపించింది. గాలీవానా ఉరుములూమెరుపుల గురించి స్నేహితులు హెచ్చరించారు గానీ, మన పక్షి ఖాతరుచేయదు కదా. ఉన్నట్టుండి నల్లటి మేఘాలు వందలకొద్దీ సూర్యున్ని కప్పేసాయి. చిత్రమైన చీకటి.పక్షికళ్లు నీడలకు తికమకపడ్డాయి. ఏమిటాయిదీ ఆనుకొనేంతలో , మెరుపులూ వురుములతో ఆకాశం దద్ధరల్లింది. బ్రహ్మాండమైన వెలుతురు కళ్లను మండించింది.రెండు రెక్కలతో మొఖాన్ని కప్పుకొనేంతలో , మరో పెద్ద పేలుడు పక్షిగుండెను పిండేసింది. జీవితంలో మొదటిసారి భయపడింది మన పక్షి. రెక్కలు తడసిపోయాయీ , ఎక్కడ వాలుదామన్నా , వర్షధారలు తప్ప కాళ్లకు యేమీ తగలడం లేదు. అలాంటి గాలివాన వికృతిలో యింకొక పిడుగు దాని తలమీదనే పడింది. పక్షి కాలిన కట్టెలా నేలరాలింది.కేవలం దాని పొడుగాటి ముక్కు మాత్రమే మిత్రులు గుర్తుపట్టగల ఆనవాలైంది. అది చంపిన యెన్నో ప్రాణుల ఎముకల మధ్యా అది బూడిదైంది. ఇంత కథా పక్షి గురించే రాసిన రచయిత్రి చివరి పేరాలో , ‘ఎట్లా బతికాడు! ఎటువంటి వాడికి ఎటువంటి చావు అని ఏడ్చారట నేస్తాలు’ , అనడం ద్వారా, ఇంత దాకా చెప్పింది ఒక మనిషి కథ కూడా అనే సూచన యిస్తుంది.
రచయితలు కథలు వూరకే రాయరు. ప్రజలైనా సామెతల్ని వూరకే కట్టరు. ఏవో బలమైన వాస్తవాధారాలతో మాత్రమే కథలైనా సామెతలైనా అల్లుకుంటారు. పక్షి కథ చెప్తున్నట్టుగా కల్పించి మనిషి బండారం బయటపెడతారు. ఎంత మంది వీరులను బలిగొనకుంటే మనిషిని రాబందని అంటారు?ఇదీ అలాంటిదే. ప్రతీకాత్మకమైన కథ.ఇంగ్లీషులో అలెగరీ. 2009లో ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ లో ఒక పెద్ద గాలివాన వచ్చిందైతే నిజమే. బహుశా ఆ గాలివాన కు నల్లమలలో , వేయి గొడ్లు తిన్న రాబందేదైనా నేలకొరిగిందేమో నాకైతే తెలీదుగానీ , పాఠకులు ఆలోచించుకోవచ్చు.రచయిత్రి వుద్దేశ్యం అదే అయ్యుంటుంది.అట్లా యిది కథైంది.
రచయిత్రి రాసిన అసలు కథ ఇస్తే బాగుంటుంది. ఇలా వ్యాసం చదివితే అభిప్రాయం తెలుస్తుంది కానీ పూర్తి సారం అర్థం కాదు. వీలైతే కథ లింక్/పీడీఎఫ్ జత చేయండి.
దయచేసి మీరు విశ్లేషించే ప్రతి కథ యొక్క లింక్ పెట్టండి. మేము పూర్తి కథ చదవడం సాధ్యం అవుతుంది.లేనిచో వెలితిగా ఉంటున్నది.,వీలయితే pdf జత చేయండి.