మా నాయిన  చేసింది ఫారెస్ట్ గార్డు, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలే  కానీ, ఆయనకి ఎందుకో ప్రభుత్వ ఉద్యోగస్తుల లక్షణాలు ఏవీ  రాలేదు. ఆయన తనను తాను ఒక ఉద్యోగి అని కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక అధికారి అని కానీ  ఎప్పుడూ అనుకోనేలేదు.

ఆ కాలంలో అడవుల్లో మేకలు, ఆవులు మేపే వాళ్ళ దగ్గర అడవిలో కట్టెలు కొట్టే వాళ్ళ దగ్గర అపరాధ రుసుము   వసూలు చేసి ఆ డబ్బులు ప్రభుత్వానికి కట్టాల్సిన టార్గెట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగస్తులు అందరికీ  ఉండేవి.

చాలామంది అటవీశాఖ ఉద్యోగస్తులు కట్టెలుకొట్టేవాళ్ళ దగ్గర వాళ్ళ కత్తులు తీసుకుని ,తమ వద్దే ఉంచుకుంటారు. కట్టెలవాళ్లు ఫైన్ లు  కట్టిన తరువాతనే ఆ కత్తుల్ని.  ఆ కట్టెల్ని విడిపించుకోవాల్సి ఉండేది.అప్పుడు కూడా అటవీశాఖ ఉద్యోగస్తులు తాము పట్టుకున్న ఆ కట్టెలమోపులని తిరిగీ  ఇచ్చే వాళ్ళు కాదు. దబాయింపుగా ఆ కట్టెల్ని తమ స్వంతానికి వాడుకునే వాళ్ళు. అయినా మా నాయన  ఆ విధంగా  ఏ రోజు మా ఇంట్లో వాడుకోవడానికి అని  ఉచితంగా కట్టెలను  తీసుకుంది లేదు. అటవీశాఖ ఉద్యోగి  కుటుంబ సభ్యులమే అయినా, మేం సిగ్గుపడకుండా కట్టెలు కొనేవాళ్ళం. మేము కట్టెలు కొనటాన్ని డిపార్ట్మెంట్ లో మా నాయన ముందే  ఎగతాళిగా మాట్లాడుకునేవాళ్ళు కానీ అయన దాన్ని ఎప్పుడు పట్టించుకునింది లేదు. ఒకరి కష్టార్జితం మనకు వూరికే వొద్దు, అది మహా పాపం..  మనకోద్దురా అనే వాడు.

 నేను చిన్నప్పుడు  అడవిలో కట్టెలు కొట్టలేదు గానీ, సెలవు రోజుల్లో , పండుగ సెలవుల్లో  సైకిల్ పైన అడవికి వెళ్లి, ఎండిపోయిన కట్టెలని తాడుతో కట్టి ఇంటికి కట్టెలపొయ్యి కోసం తెచ్చే వాడిని.

అలాంటి రోజుల్లో ఒకరోజు.. ఏం జరిగిందంటే?.. “మేయ్ జయా.. ఇంకో గ్లాసు బియ్యం పెట్టు  పొయ్యి పైన” అన్నాడు మా నాయన. అయన ఆ మాట అనడం మాకు మామూలే.ఎప్పుడూ ఎవరికో ఒకరికి అన్నం పెట్టనిదే ఆయనకు అన్నం సహించదేమో అని మాకో అనుమానం ఉండేది.మాలో మేం ఎన్నయినా మాట్లాడుకుంటాం కానీ , అయన ముందు మేము ఎవరం  ఎప్పుడూ నోరు ఎత్తే వాళ్ళం కాదు.

అప్పుడు సాయంత్రం నాలుగు గంటలు అవుతోంది.

“ఇప్పుడా.. ఎటూ కాని పొద్దులో బియ్యం ఏంది, పెట్టేది ఏంది , ఇంతకీ ఎవరికోసం ? ఇంటికి మళ్లింకా ఎవరైనా పిలిచినావా ఏంది “అని కసురుకుంది జయమ్మ ..ఆమె  మా అమ్మ. ఆమె అంతే ముందు అట్లే అంటుంది. విసురుగా మాట్లాడేస్తుంది..ఆ మాటలకంటే ముందే ఆమె పొయ్యిలోకి ఒక చేత్తో కట్టెలు తీసి పెడుతూణే ఇంకో చేత్హో అన్నం వందే గిన్నె వెతికి పొయ్యిముందు పెడుతుంది. అదీ ఆమె అమ్మ  మనసు.

“తెల్లారి నుంచి సాయంత్రం దాకా ఆ పల్లెటూరి మనుషులని.ఫారెస్ట్ ఆఫీస్ లో పస్తు  కూర్చుని పెట్టేసినారు మే…పాపం. తిండీ నీళ్లు లేవు వాళ్ళకి.జేబులో  రూపాయి ఉంటే టీ ఇప్పించినా.. పోనీలే పాపం అని. అయినా‌ పాపం వాళ్లకు ఆకలి కాకుండా  ఉంటుందా. హోటల్లో తిండి పెట్టేదానికి నా దగ్గర డబ్బులు యాడుండాది? ఎట్లో ఒగట్లా నువ్వు ఏదో ఒకటి చేస్తావనే మన  ఇంటికి  పిలుచుకుని వచ్చినా. వాళ్ళు వీధిలో కూర్చుని ఉంటారు.” చేతులు పిసుక్కుంటా నంగి నంగిగా భయపడుతున్నట్లు నటిస్తున్నట్లు వినయంగా మా నాయన కనికరంగానే అంటాడు గాని, మా అమ్మకి ఆ మాటలు వింటే ఎప్పుడూ ముందు కోపం  ముంచుకు వచ్చేస్తుంది.

“మా యబ్బ కానీ మీయబ్బ గాని నా దగ్గర లబ్బి  ఏమైనా పెట్టిండారా? ఇట్లా దారిలో పోయే వాళ్లకంతా అన్నం పెట్టాలంటే  కొంపా గోడూ అమ్ముకోవాల్సిందే. ఇంట్లో  బియ్యం ఏడుండాయి? నాకు తెలియదు నువ్వు ఏమైనా చేసుకో ఫో..”

“మేయ్ నువ్వే అట్లంటే ఎట్లమ్మే? ఎక్కడో చోట అడిగి తీసుకు  రా బో  మనం చేసే మంచి మన బిడ్డలకే కదా వస్తుంది .. “

“అంతే అంతే లే. దారిలో పోయే వాళ్లకంతా అన్నం వండిపెట్టతా ,టీ నీళ్లు పెట్టిస్తా ఉంటే.. నేను నా బిడ్డలు అడుక్క తినాల్సిందేలే. మాకు ఆగతే  రాసిపెట్టినట్లే ఉంది చూస్తా ఉంటే..”

ఆ మాట నిష్టూరంగా మాట్లాడతానే వంట గదిలోకిపోయి, ఒక పెద్ద ఖాళీ గ్లాస్ తీసుకొని, పక్కింట్లోకో,ఎదురు ఇంట్లోకో పోతుంది అక్కడా పని కాలేదంటే , వీధి చివర దాకా వెళ్ళిపోతుంది, ఒక్కోసారి  పక్క వీధిలోకి అయినా వెళ్ళిపోయి వుంటుంది..మా నాయన ముసిముసిగా నవ్వుకుంటా ఆమె వెళ్ళిన వైపే మురిపంగా చూసుకుంటా గణేష్ బీడీనో, అశోకా బీడీనో ముట్టించుకుంటాడు.

అప్పుడు కిరసనాయిలు ఉండదు. ఉన్నా.. స్టవ్వు పని చేయదు. కిరోసిన్ ఉంటే కదా పని చేసే దానికి. ఇంక  కట్టెల పొయ్యి పైనే అన్నీ..

“ఈ కట్టెల పొయ్యి  ఊదీ ఊదీ… నాకు ఊపిరితిత్తులు పోతా ఉండాయి. ఆ నవ్వు చూడు.. అంతా ముండమోపి నవ్వు.” ఆ మాట అనేటప్పడు చూడాలి మా అమ్మ మొహం.!

అప్పుడు ఆమె మొహంలో కోపం ఉంటుంది ,బాధ ఉంటుంది కానీ మొగుడి పైన ప్రేమ కూడా ఉంటుంది.

బీడీ పొగల మధ్య మా నాయిన  దగ్గుతా కొన్ని క్షణాలు విరామం తీసుకుని ” మేయ్ జయా..టీ పెట్టు ముందు.. స్ట్రాంగ్ గా పెట్టు మే..” అని అనకుండా వుండడు.

మా నాయన ఆయన జీవిత కాలంలో మాట్లాడిండే అన్ని మాటల్లోకి లక్ష సార్లో, కోటి సార్లో చెప్పిన మాట ఏదైనా ఉందంటే ఆ మాట అదొక్కటే.

మా నాయన ఇప్పుడు లేడు, మా అమ్మా ఇప్పుడు లేదు. కానీ, మా ఇంట్లో ముఖ్యంగా మా వంట ఇంట్లో ఆ మాట ఎప్పుడు ప్రతిధ్వనిస్తూ ఉంటుందంటే అది అబద్ధం కాదు.

“మేయ్ జయా టీ పెట్టుమే …. స్ట్రాంగ్ గా వేడిగా .. వుండాలి “

అదే ఆ మాట.!

నాకు మా పాత పెంకుటిల్లు అంటే చాలా ఇష్టం.

అందుకే మా పాతఇల్లు కట్టిన  ఆరు దశాబ్దాలు అయిన తర్వాత, పడిపోయే దశకు చేరుకున్నప్పుడు, మా నాయన చనిపోయిన పదైదు  సంవత్సరాల తర్వాత, బ్యాంకు లోను తీసుకుని ఎట్లాగైనా ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు, ఆ పాత పెంకుటిల్లు కొట్టేస్తున్నప్పుడు మురిపెంగా ఫోటోలు తీసి పెట్టుకున్నాను. ఆ పాత ఇంటికి ఉన్న తలుపులు  కిటికీలు,పెంకులు, ఇటుకలు ఇతర సామగ్రి అమ్మగా వచ్చిన డబ్బే, మా కొత్త ఇంటి పునాదికి ఖర్చు పెట్టుకున్నాను. ఈ రోజు ఈ ఇంటి పునాది ఏంది అంటే, అది మా నాయన కష్టార్జితం తప్ప మరొకటి కాదు.  వాళ్ళు లేకున్నా , ఇంట్లో  అమ్మ నాన్న ప్రేమలు  అట్లాగే ఉంటాయోమో  ఇంటికి పునాదుల్లాగా పైకి ఎప్పుడూ ఎవరికీ కనబడవు కానీ అవి చాలా బలంగా ఉంటాయి. అవి బలంగా ఉంటాయి కాబట్టే , అంతో ఇంతో మనం కూడా ఎదుగుతా ఉంటామేమో ..

 ఈ కథలన్నీ ఇంతే.

ఒక మనిషి గురించి నిజాలు మాట్లాడాలనుకుంటే ఒక వరుస క్రమంలో ఏమి మాట్లాడలేం. ఒకదాని తర్వాత ఒకటిగా ఏవేవో గుర్తుకు వస్తాయి. అన్నీ కలవర పెడతాయి. కన్నీళ్లు తెప్పిస్తాయి. ఊహించినవో,కల్పించినవో  అయితే ఆ కథలు  రచయిత చెప్పినట్లే ఉంటాయి. కానీ ఇవి కల్పితాలు కాదు కదా. ఇవి జీవితాలు కదా, మనం చెప్పినట్లు అవి ఉండవు. మా  ఎరుకల జీవితాలు ఎట్లా ఉంటాయో ఎట్లా కొనసాగాయో, మా తాత గాడిదల పైన ఉప్పు అమ్మే కాడ్నుంచి, మా నాయన ఎట్లా ఉద్యోగస్తుడు అయినాడో, అటవీశాఖలో గుర్రం పైన తిరిగే ఫారెస్టరు  చిన్నయ్య పెద్ద కూతురు జయమ్మను, కాబోయే మామ గారి ఇంటికి తిరిగి తిరిగి ప్రాధేయపడి, ఫారెస్టర్ చిన్నయ్య ను ఒప్పించి మరీ ఎట్లా పెళ్లి చేసుకున్నాడో అదంతా ఓ పెద్ద కథ.!

ఎరుకల కుటుంబాల్లో ఒక్కొక్కరివి ఒక్కో కత. అన్ని కతలూ ఒకేలా వుండవు, ఎన్నో మలుపులు, ఎన్నో చిత్ర విచిత్రాలు, మరెన్నో విషాదాలూ..

ఎరుకల ఇళ్లల్లో పంచాయితీలు ఎలా జరుగుతాయో, ఎన్ని బాధలు పడి,ఆ  తల్లులు తమ పిల్లల్ని స్కూలుకి పంపి చదివించుకున్నారో, అటవీశాఖ లో ఉద్యోగి అయి ఉండి కూడా, ఎప్పుడు కట్టెలమోపు వాళ్లకు ఫైన్  వేయకుండా, మేకల వాళ్ళ దగ్గర సంవత్సరానికోసారి ఈనామ్ గా మేకపిల్లనో, గొర్రె పిల్లనో తీసుకోకుండా, సంవత్సరం మొత్తంలో ప్రభుత్వానికి వసూలు చేసిన అపరాధ రుసుం చెల్లించే సమయంలో, ఆ అపరాధ రుసుం ని అడవుల్లో పల్లెల్లో ఎవరి దగ్గర వసూలు చేయకుండా, ఆ నెల జీతం డబ్బుతో ప్రభుత్వానికి అపరాధ రుసుం చెల్లించి, ‘ఈ నెల జీతం లేదు మే. మొత్తం సీ ఫీస్ కట్టేశా.’ అని అమాయకంగా అపరాధిగా మాయమ్మ ముందు నిలుచుండిపోయిన కనికరం గుండె కలిగిన మా నాయన కథ ఇది.

ఏ  పొద్దు ఎవరికి  ఏం అవసరం వచ్చినా, తన చెవిలో కమ్మలు, ముక్కుపుల్ల వూడ్చి ఎక్కడో ఒక చోట కుదువపెట్టి, మా నాయనను  మాట మాత్రం అడగకుండా, తనకు తానుగా ఎన్నో కుటుంబాల్ని  తనకు తానుగా వడ్డీలు కట్టి ఆదుకున్న కనికరం గుండె కల మా అమ్మ కత ఇది. కొంచెం ముందు వెనక ఉండవచ్చు, సందర్భాలు అటూ ఇటూ ఉండవచ్చు. కానీ వాళ్ల ప్రేమలు నిజం, వాళ్ల పేదరికాలు నిజం, వాళ్ల కనికరాలు  నిజం.

ఇంటిముందు దూరంగా పల్లెటూరి వాళ్ళు కూర్చుని ఉంటారు. అమ్మ ఉడుకుడుకుగా అన్నం చేసి  చెనిగి గింజల చెట్నీ నో, పచ్చిపులుసో, గొజ్జో, రసమో ఏదో ఒకటి చేసి వాళ్లకు పెడుతుంది.

“ఆయన ధర్మ ప్రభువు తల్లీ. నువ్వు కనికరంగల తల్లివి తల్లీ. మీరు సల్లగా ఉండాల్ల. మీ పిలకాయలు సల్లగా ఉండల్ల” అని వాళ్లు మా అమ్మకు  నమస్కారం పెట్టి,  పెట్టింది అంతా ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేసి వెళ్ళిపోతారు వాళ్ళు .

అప్పటికి మా నాయన ఖాకీ యూనిఫామ్ వదిలిపెట్టి, బనియన్,  పంచ తో కూర్చుని ఉంటాడు.

“ఎన్నిసార్లు అబ్బా నీకు చెప్పేది ఆ బనీను  చూడు ఎంత బొక్కలు పడి పోయి ఉన్నాయో?. రెండు బనియన్ లు కొనుక్కోని  రమ్మని చెప్పినాను కదా “అని తల పట్టుకుంటుంది మా అమ్మ.

తాను చెప్పింది ఏదీ  ఏ పొద్దూ వినడని మా నాయన పైన మా అమ్మకు భలే కోపం.ఒక్కోసారి ఎడం చేత్తో ఖర్మ ఖర్మ అని కోపంతో నొప్పి వచ్చేలా , చాలా బలంగా నుదుటి  పైన కొట్టుకుంటుంది కూడా.

మా నాయన అప్పటికే వేడివేడి టీ తాగి గ్లాసు పక్కన పెట్టి, ఇంకోసారి బీడీ ముట్టించుకుని ఉంటాడు. బీడీ పొగల మధ్యలో ఆయన నల్లటి ముఖంలో తెల్లటి పండ్లు స్పష్టంగా కనపడతాయి. మా అమ్మ కోపం ఉందని తెలిసినా,  అయినా నవ్వుతాడు.

మా అమ్మకు కోపం వచ్చినప్పుడు నేను, మా తమ్ముడు భయపడతాం కానీ, మా నాయన ఎందుకో భయపడడు. మా నాయనకు కోపం వచ్చినా కూడా అంతే. ఆయన కోపంతో పండ్లు కొరుకుతాడు. ఆవేశంతో ఊగిపోతాడు. అప్పుడు కూడా మా అమ్మ భయపడినట్లు నటిస్తుంది కానీ, నిజానికి అస్సలు భయపడదు. ఆయన కోపం నిమిషాల పాటే అని ఆమెకు బాగా తెలుసు. ఆ తర్వాత మళ్లీ మామూలే. ప్రశాంతంగా నెమ్మదిగా ఈ ప్రపంచంలోని బాధలు ఏవీతనకు పట్టనట్లు, తన కుటుంబంలోని ఆర్థిక సమస్యలు ఏవి తనవి కానట్లు, ఏ బాధలు ఏ కన్నీళ్లు లేనట్లు, ఆయన ప్రశాంతంగా నవ్వుతాడు. ముఖ్యంగా మా అమ్మకు నిజంగా బాగా కోపం వచ్చినప్పుడు కూడా ఆయన అట్లాగే ప్రశాంతంగా నవ్వుతూనే ఉంటాడు. ఆ ప్రశాంతమైన నువ్వు చూసేకొద్దీ మా అమ్మకి ఇంకా ఇంకా  కోపం బాగా పెరిగిపోతుంది.

ఆరోజు కూడా అట్లాగే బాగా కోపం వచ్చేసింది మా అమ్మకు.

ఉద్యోగం చేసే వాడివి నీకు గౌరవం ఉండాల్సిన పని లేదా? చినిగిపోయిన బనియన్ వేసుకొని యెట్లా తిరుగుతావు? సిగ్గు అనిపించదా నీకు?  నీ జన్మకు ఎన్ని సార్లు చెప్పిoటాను..ఈరోజు కచ్చితంగా బనీను కొనుక్కొని రావాల్సిందే అని చెప్పినాను కదా. నా మాటంటే లెక్కేలేదు. నేనంటే విలువే లేదు.ధూ.. నాదీ ఒక బతుకేనా “

మా నాయన మెల్లగా లేచి వెళ్ళి, తను తీసుకు వచ్చిన ప్లాస్టిక్ కవర్లో ఉంచిన, పేపర్లో భద్రంగా చుట్టిన ప్యాకెట్ విప్పుతాడు .

“ఇది ఏందో తెలుసా? చాలా గొప్ప పుస్తకాలు. పెద్దపెద్ద ఆఫీసర్ల పిల్లకాయలు చదివేది. మన  ఎరికిలోల్ల ఇళ్ళల్లో ఎవరి పిల్లల వద్దా ఈ పుస్తకాలు ఉండవు.  ఇలాంటి పుస్తకాలు చదవతా వుంటే చాలు, పిలకాయలు చాలా గొప్పోళ్లు అయిపోతారు చూస్తా ఉండు..” అంటాడు.

ఆయన దేన్నయినా చాలా భద్రంగా తెస్తాడు.

ఎంత చిన్న వస్తువు అయినా సరే అత్యంత  విలువైన వస్తువులాగా చాలా  జాగ్రత్తగా, భద్రంగా తీసుకొస్తాడు. ఇంట్లో పిల్లలకు ఏదైనా తీసుకురావడం అంటే ఆయనకు లోకంలోకెల్లా చాలా ఇష్టమైన విషయం. అప్పుడు చూడాలి.. ఆయన మొహం! ఆయన మోహంలో  ఏదో గొప్ప తేజస్సు కనబడుతుంది. అప్పుడు ఆయన ఎందుకో నల్లగా అనిపించడు.  ఎందుకో ఆ క్షణాల్లో ఆయన చాలా గొప్ప అందగాడుగా కనిపిస్తాడు. చూడండి ఆ ప్యాకెట్ విప్పేటప్పుడు ఆయన ముఖంలో ఎంత చిరునవ్వు ఉంటుoదో, ఎంత సంతోషం కనబడతావుంటుoదో..

 రెండు పుస్తకాలను అపురూపంగా బయటకు తీశాడు. నా చేతుల్లో  ఒక పుస్తకాన్ని మా తమ్ముడు చేతుల్లో ఒక పుస్తకాన్ని ఉంచాడు. చిల్డ్రన్స్ నాలెడ్జ్ బ్యాంక్ పుస్తకాలవి.

నేనూ మా తమ్ముడు గబగబా పేజీలు తిప్పుతూ బొమ్మలు చూస్తూ అందులో ఉన్న సమాచారాన్ని చాలా ఆత్రంగా చదివే ప్రయత్నం చేశాం. అప్పుడు మాకు ఎట్లా ఉందంటే ఆ రాత్రికి రాత్రే మొత్తం పుస్తకాన్ని చదివేయాలి అన్నంత ఉత్సాహం కలిగింది. మొత్తం మీద అవి  చాలా విలువైన పుస్తకాలని అర్థం చేసుకున్నాం.ధర చూసి మా అమ్మ ఆశ్చర్యపోయింది.

 ఇంత రేటా?  ఎట్లబ్బా అని మాత్రం గొనుక్కుoటున్నట్లు తలలు వంచి ఆ కొత్త పుస్తకాల పండగలో మేం ఇద్దరం నిండా మునిగి ఉన్నప్పుడు, మా అమ్మ అంతకు ముందు అన్నదే మళ్ళీ అనేది. అయితే ఈసారి మాత్రం ఆమె గొంతులో అస్సలు కోపం  ఉండేది కాదు.

“ఏమబ్బా.. ఇప్పుడీ పుస్తకాలు ఈ పిలకాయలకి అంత అవసరమా? వాళ్లు ఏమైనా ఇప్పుడు అర్జెంటుగా పరీక్షలు రాసి కలెక్టర్లు అయిపోవాలా.. ఏంది.?”

బీడీ తర్వాత బీడీ తాగడం మా నాయనకు అలవాటు. బీడీకి  బీడీకి  మధ్యలో కొన్నిసార్లు  కొన్ని క్షణాలు, ఇంకొన్నిసార్లు కొన్ని నిమిషాల విరామం ఉంటుంది అంతే.

“ఎన్ని తూర్లు చెప్పినా ఇంట్లో బీడీ తాగవద్దని.  ఏదైనా ఒకసారి చెబితే అర్థం కాదా నీకు?. ఇంట్లో ఇంత కంపు కొడతా ఉంటే పిల్లకాయలు ఎట్లా చదువుతారు? ఎట్లా బాగుపడతారు.”అని కసురుకుంది గట్టిగా.

“బయట వాన లో చలిలో తిరుగతావుంటా కదా. ఒంట్లో చలి ఎక్కువ ఉంటుంది కదమ్మే. అయినా పిల్లోల చదువు పాడవుతుందంటే ఇంట్లో ఇంక ఎప్పటికీ తాగనులే.”

అంతే!.   ఒకే ఒక మాటే మా అమ్మ అనింది.

కొన్ని ఏళ్లుగా మా నాయనకు ఉన్న ఆ అలవాటు ..ఇంట్లో బీడీ తాగే అలవాటును ఆ క్షణం మానేశాడు.

ఆ రోజు నుండి మా నాయన చనిపోయేంత వరకూ , ఏ రోజూ  ఇంట్లో బీడీ ముట్టించింది లేదు. వర్షం పడుతుంటే గొడుగు తీసుకొని, ఇంటి బయటకు వెళ్లి బీడీ తాగి వచ్చేవాడు.అదీ ఆయన నిక్కచ్చితనం. చలికి తట్టుకోలేడని, స్వెటర్ కొనుక్కోమని మా అమ్మ మా నాయనకు కనీసం లక్ష సార్లయినా చెప్పి వుంటుంది. రెండు మూడు ఏళ్లకు మాకు తప్పకుండా  కొత్త స్వెటర్లు తెచ్చేవాడే కానీ, అయినా ఆయన  స్వెటర్ కొనుక్కునే వాడు కాదు. చాలా కాలం  స్వెటర్ కొనుక్కోకుండానే ఆయన – చూద్దాం లే దానికేం తొందర , నిదానంగా కొందాం లే అంటూ  చాలా కాలం  అట్లాగే గడిపేశాడు.

“బస్సులో కూర్చున్నప్పుడు కిటికీ అద్దాలు మూసేస్తే చలి రాకుండా ఉంటుంది కదా డాడీ” అని అమాయకంగా అడిగానlఆయన తన సహజ ధోరణిలో నవ్వినాడు కానీ ఒక్క మాట కూడా బదులు మాట్లాడలేదు.

మా అమ్మ మొహం నిండా ఆ నాటి వెలుతురు ఇప్పటికీ గుర్తే నాకు.ఆ మాటలు నాలో రక్తం ప్రవహిoచేoత కాలం నా లోపలే  ఉంటాయి

” మీ నాయన లారీ లో వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్  యూనిఫాంలో ఉంటాడు కాబట్టి చార్జీలు ఇచ్చే పని లేదు కదరా .అట్లా చేసి  ఆ బస్సు ఛార్జీలు మిగిలిస్తేనే  కదా,మీకు ఏదో ఒకటి తినటానికో , చదువుకోవడానికో   తెచ్చేదానికి  కుదురుతుంది. ఎక్కడా ఎవరిదగ్గరా చెయ్యి చాపకుండా జీతo తోనే బతికే వాడు, కాబట్టే  “.

నేను కథలు రాయడం మొదలయ్యాక, నా మొదటి కథా సంపుటిని ఆయనకు అంకితమిస్తూ ముందు పేజిలో  ఒక మాట అన్నాను. కనీసం వందమందికి పైగానే నాకు ఫోన్ చేసి ఆ మాట గురించి కళ్ళనిండా నీళ్ళతో  మాట్లాడి ఉంటారు.

కొట్టీ, తిట్టీ…

బలవంతంగా నా చేత

యాపిల్ తినిపించిన నాన్నా.. నువ్వెప్పుడైనా – ఒక్క పండైనా తిన్నావా తండ్రీ….?

5 thoughts on ““పదకొండు నెలల జీతగాడి కత”

  1. చదివాను. ఇకపై మీరీ శీర్షికలో రాసేవీ చదువుతాను. ముందస్తుగా మీకు మీ ప్రయత్నానికీ అభినందనలు

  2. చాలా గొప్పగా వుంది. మా అమ్మా నాన్న కనులముందే వున్నారు. వాళ్ల చిర్రుబుర్రులు ప్రేమలు ఎదనిండా మరోసారి నిండాయి. తప్పక తెలుసుకోవాల్సిన జీవితాలివి. రాయండి సార్.

    1. జీవితం కతగా చెప్పిన కత.. బావుంది సర్.శుభాకాంక్షలు

  3. చాలా బావుంది.తెలియని జీవితాలని తెలియజెప్పడం రచయితల పని.బాలాజీ గారు..మీ జీవితానుభవాలని పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు.. మిగతా కథల కోసం ఎదురుచూస్తాం..అన్నట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అలాంటి హానెస్ట్ ఉద్యోగిని చూడటం ఇదే మొదటి సారి…

  4. ఉన్నతమైన విలువ కట్టలేని బాధ్యత గల తండ్రి ప్రేమను చాలా ఉన్నతంగా రాశారు బ్రదర్ అభినందనలు

Leave a Reply