చిలకమ్మా! చిలకమ్మా!
చైత్ర మాసపు వెన్నెలపండును
దోచుకుపోదామని వచ్చిందెవరే
ఉలుకమ్మా! పలుకమ్మా!

బుడి వడి నడకల
బుడతన్నా ఉడతన్నా
రాసుకొని దాచుకున్న
జనరూపకాలను దండుకుపోయినదెవరే

కూతలమ్మా క్రో యిలమ్మా
తెలవారు చల్లని సంధ్యలో
నీరెండతొడిగిన లేమావి చిగుళ్లను
పచ్చటి చెట్టుమీదే
చిదిమేసే ఆ మృగమెవరే

జాజిమల్లీ ప్రేమవల్లీ
నిండారా దాచుకున్న
పూలసుగంధాన్ని
మురికి కాలువలోకి
వొలిపిన మూర్ధుడెవరే

పట్నంపాలబడ్డ పాలపిట్టా
పసుల పిలగాని వకాల్తా
అడవిలిక్కుజిట్టల కేసు కట్టలు
మాయం చేసిందెవరే
ఎవరమ్మా? ఆ బూచొోళ్ళు

డమ డమా టమ టమా
టముకేసే నామాల పిట్టా
నీతప్పేటమూగదయ్యింది
చిర్రా, చిటికెనపుల్లా
ఇరిచేసిందెవరే

పద్మమ్మా పద్దమ్మా
జిట్రేగి చెట్లపై నువు గీసిన
అమరుల చిత్రాలు
దొంగిలించినదెవరే!
ఎవరమ్మా ఆ బూచోళ్ళు

నెత్తిన తురాయినెత్తిన
తురక పికిలి పిట్టా
నీ కలలను, కాంక్షలను
కొల్లగొట్ట వచ్చిందెవరే
పూలపట్టురెక్కలను
విరివజూసిందెవరే

మందార ఎరుపెరుపు
వెదురు జీనువాయీ
కాలం ముంచుకొస్తోంది
ఆడివంచుల నుంచి
ఆకురాయి తేగలవా

కంసాలి పిట్టనూ
వడ్రంగి పిట్టనూ పిలవండే
కాలం ఎట్టేడుస్తుందో యేమో
ఇంకమనమూ ముక్కులూ, గోళ్లు
సానబట్టుకోవాలి
పదునెక్కే వేళయ్యిందిLeave a Reply