1
కుటిలమేధయాగం
--------------------------
కంటిలో నలుసట్టా పడితేనే
కళ్లు రుద్దుకునే మనం
పొరకముల్లు గుచ్చుకుంటేనే
వెదికి మరీ తీసిపారేసే మనం
*
బతుకుదారుల్లో
బలిజముళ్లను చల్లుతుంటే
బర్రిమీద వానకురిసినట్లుండమే
అర్థంగావట్లేదు.!?
*
మనిషితనానికే శత్రువయినోడు
మనుషుల బాగెట్టా ఆలోసిస్తాడు
మనిషి మెదడు ప్రాణంతో కదలటం సహించలేనోడు
మనిషి బుర్రకు పదునుపెట్టే సదువెట్టా వుండనిస్తాడు
*
కాయని కాయని
పండుని పండని
ఉన్నదున్నట్టు కంటితో చూడలేని కుంటిచూపులోడు
మురికిని మురికని చెబితే ఒప్పుకుంటాడా.?

అజ్ఞానాన్ని కడుక్కోమన్న ప్రతిసారి
అంధకారపుగెవుల్లో తోయడానికే ఎత్తులేస్తాడు గాని
ఇదిగో మరకని వేలెత్తి చూపనిస్తాడా?!
చూపుడు వేలుపై ప్రశ్నను మొలవనిస్తాడా??
*
దీపాలు వెలిగే దారుల్ని తప్పించి
మళ్లీ..ముళ్ళూ ముడకల దారుల్లో
పొర్లుదండాలు పెట్టమంటుంటే
కళ్ళప్పగించి చూట్టానికి ఇదేమన్నా 'కంగుంది
నాటకమా'..?
*
కుట్రల తాంబూలం నములుతూ కులికేటోన్ని
మనకుర్చీ మీదనుంచి తొలిగించనంత కాలం
సత్యాన్ని
సత్యాన్ని మాట్లాడే చరిత్రని తొలిగిస్తూ
సంకలెగరేస్తూనే గదా వుంటాడు.
*
ఊళ్లనుంచి
బతుకులనుంచి
వెలుగుని తొలగిస్తున్న కుటిలమేధయాగానికి
ఏ పేరు పెడదాం.?
కూర్చున్న తావు నుంచి కుతంత్రాలు ఎప్పుడు తొలగిద్దాం??
*

 2
ఖాళీగా లేను
-----------------
నేనేమీ ఖాళీగా లేను
ఒకమాటైనా మాట్లాడని కుర్చీ ఒడిలో
నడుం వాల్చి
కాళ్ళు నేలకు సాచి 
నీ ఆలోచనలతో బరువెక్కిన తలను
కుర్చీ అంచుమీద వెనక్కు వాల్చి
కళ్ళు మూసుకున్నాను
*
కళ్ళెంత గట్టిగా మూసుకుంటే
మనసంత వేగంగా తలుపులు తెరుచుకుంటూ ఉంది
*
ఎదురుగా తెల్లకాగితాలు
ఎప్పటినుంచో దాచుకున్న నల్లింకు పెన్నులు
ఎప్పుడో కొన్న రైటింగ్ ప్యాడ్
ఇష్టంగా తినే పచ్చి వేరుశెనక్కాయలు
ఇష్టమైన ఊదారంగు నీళ్లబాటిలు
అన్నీ నువ్వు ప్రేమగా కూర్చినవే
ఏది ముట్టుకున్నా నువ్వే
*
ఫ్యాన్ తిరుగుతున్నట్టే మనసుతిరుగుతోంది
గాలికి కిటికీ కొట్టుకున్నట్టే గుండె కొట్టుకుంటోంది
నిన్ను ప్రేమించే క్షణాల్లో కొన్నింటిని
మనం ప్రేమించే సమూహం కోసం 
వెలుగువాక్యమయ్యే సమయమిమ్మన్నాను
*
నేనేమీ ఖాళీగా నేను
నువ్వలా బుంగమూతి పెట్టికెళ్లినప్పటినుంచి
కళ్ళను తలుపుకు అతికించి
చెవులను నీ మువ్వల సడికి రిక్కించి
గుండె గడియారమై
మన ప్రేమగోడకు వేలాడుతున్నాను
దేశభక్తి మేకులు గుచ్చుకుని
చిల్లులు పడ్డ దేశపటాన్ని చూస్తూ
*
నేనేమి ఖాళీగా లేను
నీ అలక సముద్రాన అలలలుపై తేలే
ప్రేమ పడవనయ్యాను
నీ పాదాలు ముద్దాడి
ముగ్గుపోసుకున్న వాకిటివైపు పదే పదే చూస్తూ
దేశంనిండా
బుగ్గిపాలైపోయిన వాకిళ్ళను తలుచుకుంటూ
*
నేనేమి ఖాళీగా లేను
నువ్వటెళ్లినప్పటినుంచి
నేనేమి ఖాళీగా లేను.
*

3
తరగతిగదిలో చీమలు
------------------------------
ఉదయం తగతిగదిలోకి
చీమలుకొన్ని బారులుకట్టి వచ్చాయి
చెప్పే పాఠమంత తియ్యగా ఉందో
పాఠం వింటూ ప్రశ్నలవుతున్న
పిల్లల మాటలంత మధురంగా ఉన్నాయో?
*
తరగతి గదిలోకి చీమల బారు
ప్రతిపూటా నవ్వుపొద్దులై వచ్చే మా పిల్లల్లా.!
*
పిల్లలు
చీమల్ని కన్నార్పకుండా చూస్తున్నారు
చీమలు పిల్లల్ని తలలు పైకెత్తి చూస్తున్నాయి
కులం వదిలి
కుళ్లు వదిలి
కలిసికట్టుగా ఉంటే
ప్రపంచంముందు తలెత్తుకు బతకవచ్చని 
పాఠం చెబుతున్నట్టు
అందమైన మైనబొమ్మను చిత్రించిన నిమిషాలవి.!
*
చీమల గుంపు ఎంత సుందరమైనది
చీమల కూటమి ఎంత శక్తివంతమైనది
*
ఒక్కొక్క చీమ లోపలికివస్తుంటే
ఒక్కోమిత్రుడు
మమ్మల్ని పలకరించడానికొచ్చినట్టుంది
తలా ఒక దిక్కునుంచి
కొన్ని దుఃఖపు రేణువులని మోసుకొచ్చినట్టుంది
విద్వేషాల్లో దేశమెలా కుమిలిపోతుందో
నిశ్శబ్దపుగొంతుతో వినిపించినట్టుంది.!
*
చీమలెందుకు ఇలా బేరిగట్టి వచ్చాయి.?

స్వేచ్ఛగా పిల్లలు నవ్వుతుండే చోటు
చల్లని నీడలా ఉంటుందని వచ్చాయా.!
పిల్లలకోసం కూర్చిన సత్యవాక్యాలు చెరిపేస్తుంటే
గొంతు కదపనోళ్ళను కుట్టిపోదామని వచ్చయా?

కనీసం పిల్లలనైనా మాట్లాడితే-
గొంతు కలుపుదామని వచ్చాయా..!
*
దొర్లిపోతున్న క్షణాల సందుల్లో
చీమలూ తరలిపోతున్నాయి
పిల్లల చూపులు చీమలవెంట నడుస్తున్నాయి
చీమలవెనక నడిచే చేతుల్లో పుస్తకాలున్నాయి

పుస్తకాలుపట్టిన చేతులే
కాలాన్ని కాపుగాస్తాయని
పిల్లలపుస్తకాల్లో అక్షరాలచీమలు
గొంతెత్తి పాడుతున్నాయి.!

*
 

2 thoughts on “పల్లిపట్టు నాగరాజుమూడు కవితలు

 1. మా సత్యం
  నాగరాజు గారు నూతన దృష్టితో నూతన కవిత్వాన్ని, నూతన పద ప్రయోగాలు, కొత్తదనంతో నూతన ఉత్సాహం అన్వేషణతోముందుకు సాగుతున్నాయి.
  ” చీమల గుంపు ఎంత సుందరమైనది చీమల కూటమి ఎంత శక్తివంతమైనది”
  ప్రతి కాత్మకమైన భావవ్యక్తీకరణతో సమకాలీనతకి అనుగుణంగా చైతన్య పరుస్తుంది. వ్యక్తికరణ అద్భుతం.❤️🤝

 2. మా సత్యం
  నాగరాజు గారు నూతన దృష్టితో నూతన కవిత్వాన్ని, నూతన పద ప్రయోగాలు, కొత్తదనంతో నూతన ఉత్సాహం అన్వేషణతోముందుకు సాగుతున్నాయి.
  ” చీమల గుంపు ఎంత సుందరమైనది చీమల కూటమి ఎంత శక్తివంతమైనది”
  ప్రతి కాత్మకమైన భావవ్యక్తీకరణతో సమకాలీనతకి అనుగుణంగా చైతన్య పరుస్తుంది. వ్యక్తికరణ అద్భుతం.❤️🤝

Leave a Reply