దుక్కి దున్నిన
చేతులు
రహదార్ల పై ఏడాది గా
చలనం లేని
నిరంకుశ పాలన

పండిన పంట అమ్మకం
దళారీ కనుసన్నలలో
ఏ తీరానికి పయనం

వాడికి లాభార్జనే ఎరుక
నేల రకాలెరగడు
నేల సత్తువ ఎరుగడు
కాలం కాక ముందే రోహిణిలోనే
ఒప్పందాలంటూ ఎగేసుకొస్తే
రైతు ఒప్పుకోవాలా?!
వాడు చెప్పిన పంట పండక పోతే బాధ్యత ఎవరిది?

ఒక పల్లెల
ఎన్నో పంటలు
చిన్న కమతాల నుండి పెద్ద కమతాల దాకా
రైతు రైతు కి ఒప్పందం
ఆచరణ లో అసాధ్యం
పల్లె ఒక్క యూనిట్ గా
పల్లె ఒక పంటగా సాగుతుంది
అనుమానమే లేదు సుమీ!!

ఎరువులు పురుగు మందుల అప్పుల కోసం
అంది వచ్చిన ధర కాడికి తెగ నమ్మి
అప్పులు తీర్చే రైతు
బండ్లు కిరాయికి మాట్లాడుకుని
ప్రాంతం కానీ ప్రాంతానికి
భాష రాని అక్షరం ముక్క రాని
రైతెలా వెళ్తాడు?
పంటనెలా అమ్ముతాడు?!

సమీప మార్కెట్ యార్డ్ లోనే
దళారీలతో బెంబేలెత్తి పోతుంటే
దూరం పోతారా!!
అధిక ధర మాటేమో గానీ
ఇల్లు ఒళ్ళు గుల్ల ఖాయం!!

ప్రభుత్వ రంగం ఒకనాటి కల
ప్రైవేట్ రంగం చేతిలో పాలక వర్గం
సమ్మెలుండవ్ హక్కులుండవ్
వెట్టి చాకిరి పారా హుషార్
ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు
కల్పిత కథల పాత్రల స్మరిస్తే దేశభక్తి
బొందల గడ్డల మీద పేలాలు తినే గద్దలోలే
మనిషి ని పొడుచుకు తింటాయ్

ఏ పోరాటం చేయనోడు
ఎవరో చేసిన పోరాటాన్ని
వశం చేసుకోవాలనుకునే వాడు
వలసొచ్చి మూలాల్ని చిదిమెటోడు
వాడి డి ఎన్ ఎ అదే
గుర్తెరుగక పోతే
అతి పెద్ద ప్రజాస్వామ్యం పాడె పై తథ్యం
దింపుడుగల్లం ఆశలు సైతం ఆవిరే

Leave a Reply