పాతవి పోతాయి. కొత్తవి వస్తాయి. ఇండియాలో ఇది చాలా విచిత్రంగా జరుగుతుంది. వికృతంగా ఉంటుంది. మన సామాజిక మార్పు అంతా ఇట్లాగే జరిగింది. అందులో ఈ ధోరణి ప్రధానమైనది. అది తెలుసుకోలేక చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ఇన్ని దశాబ్దాలలో ఏ మార్పూ రాలేదా?..అంటే వచ్చింది. చాలానే మారింది. కానీ పాతదానితో తెగతెంపులు జరగని మార్పులు ఇవి. ప్రతి మార్పూ వెనుకటిదాన్ని వెంటేసుకొని కొత్తగా వస్తుంటాయి. ఇది సామాజిక సాంస్కృతిక రంగాల్లో కనిపించినంతగా చట్ట, పాలనా రూపాల్లో కనిపించకపోవచ్చు. కానీ స్థూలంగా పాతది కొత్తగా మారే ఈ చట్రంలోనే అన్నీ భాగం. జూలై 20 నుంచి ఆగస్టు 11 దాకా జరిగిన పార్లమెంటర్ సమావేశాల్లో ఇండియన్ పీనల్ కోడ్, ప్రొసీజర్ కోడ్ మార్పుల్లో ఈ లక్షణం చాలా స్పష్టంగా చూడవచ్చు.
ఈ వానాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ మారణకాండ మీద మంటలు చెలరేగాయి. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ముందే అనుకున్నట్లు అది వీగిపోయింది. ఆ సందర్భంగా మోదీ గంటలకొద్దీ రసవత్తర ప్రసంగం చేశాడు. మణిపూర్ మారణకాండకు నిరసనగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అట్లయినా సభలో దాన్ని చర్చనీయాంశం చేయాలనుకున్నారు. అదెంత నెరవేరిందోగాని మోదీ నిస్సిగ్గుగా, జుగుప్సాకరంగా తన ఢంకా బజాయించుకున్నాడు.
ప్రభుత్వం ఇక్కడితో ఆగలేదు. ఎన్నికల రుతువుతోకి ప్రవేశించినందు వల్ల ఈ సమావేశాలను మాగ్జిమం వాడుకోదల్చింది. మణిపూర్ ఆక్రందనలు వినిపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ రణగొణ ధ్వనుల మధ్యనే ఇరవై మూడు చట్టాలు చేసింది. సభలో బిల్లులు ప్రవేశపెట్టేముందు పాటించాల్సిన కనీస పద్ధతులేవీ పాటించలేదు. ప్రజలకు కనీస సమాచారం ఇవ్వలేదు. సమాజంలో చర్చకు టైం ఇవ్వలేదు. చివరికి ప్రతిపక్షాలకే మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి చట్టాలు చేస్తున్నట్లు కూడా ప్రజలకు తెలియనీయకుండా పని కానిచ్చేసింది. అధికార పక్షం ఇట్లా వ్యవహరించడం కొత్తేమీ కాదు. గతంలో ఒక్కో ప్రభుత్వం ఒక్కో చట్టం విషయంలో ఈ పద్ధతిని ఎక్కువో తక్కువో అనుసరించి ఉంటాయి. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టాలు తయారయ్యే పద్ధతే ఇది.
ఇందులో కూడా బీజేపీ వ్యవహారశైలి మరింత దుర్మార్గం. దాని స్వభావంలోనే సంభాషణకు అవకాశం లేదు. దేన్నయినా దేశం మీదికి నిరంకుశంగా బుల్డోజ్ చేయడమే. ప్రజల మాటలంటేనే ఫాసిస్టు పార్టీకి కంటగింపు. ఇక పార్లమెంట్లో ప్రతిపక్షాల మాటలు వింటుందా? పార్లమెంటరీ దుస్సంప్రదాయాలకు ఫాసిజం తోడైతే ఎట్లా ఉంటుందో బీజేపీ పూర్తి స్థాయిలో అనుభవంలోకి తెస్తోంది. కాబట్టి ఈ విడత చట్టాల తయారీ వెనుక కూడా సంఫ్‌ుపరివార్ లక్ష్యాలు తప్ప ప్రతిపక్షాలకు లాంఛనంగా అయినా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అసమ్మతిదారులను బైటికి తోసేసి బిల్లుల్లో ఏముందో చదవకుండా, చెప్పకుండా టకటకా పని కానిచ్చేసింది.
చట్టబద్ధంగానే ఫాసిస్టు పాలనను కొనసాగిస్తున్నవాళ్లకు చట్టాల తయారీలోని నిర్దిష్ట పద్ధతులపట్ల కనీస గౌరవం ఉండదు. ఎలాగైనా తాము అనుకున్న వాటికి చట్ట రూపం ఇవ్వాలి.. ఎన్నికలు దగ్గర పడుతున్నందు వల్ల ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలి.. ఈ వ్యూహం సమావేశాల్లో స్పష్టంగా కనిపించింది.
వలస పాలనా కాలంలోని చట్టాల మీద సమాజంలో వస్తున్న విమర్శను కూడా సంఫ్‌ు ప్రభుత్వం వాడుకోదల్చింది. కాంగ్రెస్ ఇంత కాలం వలస చట్టాలను కొనసాగించిందనీ, వాటిని మార్చేస్తామని మోదీ ప్రభుత్వం గత కొద్దికాలంగా మాట్లాడుతోంది. ఇది మంచిదే కదా అని ఎవరికైనా అనిపించవచ్చు. అలాంటి భ్రమల్లో ఉన్నవాళ్లకు కనువిప్పు కలిగిస్తూ అమిత్‌షా పార్లమెంట్లో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు ప్రవేశపెట్టాడు. ఇవి బ్రిటీష్ పాలకులు మన దేశ ప్రజల మీద చట్టపరమైన, న్యాయపరమైన అధికారాన్ని స్థాపించుకోడానికి తెచ్చిన ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ వంటివాటికి ప్రత్యామ్నాయం కాదు. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకరాలేదు. వలస చట్టాలకు ఉన్న ఇంగ్లీషు పేర్లకు బీజేపీ సంస్కృత పేర్లు తగిలించింది. తద్వారా బ్రిటీష్ చట్టాలను ‘అవశేషాలు’గా కాక ‘సరికొత్త’ సంప్రదాయక నగిషీలతో దేశీయం చేయాలని. పటిష్టం చేయాలని ప్రయత్నిస్తున్నది. దీని కోసం వలస పాలకులు భారత ప్రజలను అణచివేయడానికి ఐపీసీలో తెచ్చిన సెషన్లలో కొన్ని మార్చింది. చాలా వరకు యథాతథంగా ఉంచింది. కొన్నిటిలో పదాలను మార్చింది. కొన్ని కొత్తగా చేర్చింది.
సారాంశంలో పరాయి పాలకులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికి, స్థానికులను అణచి ఉంచడానికి, వాళ్ల పోరాటాలను దెబ్బతీయడానికి తయారై చిన్న చిన్న మార్పులతో ఇప్పటికీ యథాతధంగా కొనసాగుతున్న ఇండియన్ పీనల్ కోడ్‌ను ఇప్పుడు సంఫ్‌ుపరివార్ భారతీయ న్యాయ సంహిత అని వ్యవహరించబోతోంది. అంతే తేడా. పాలకులు చట్టాలను సవరించిన ప్రతిసారీ మరింత కఠినతరం చేస్తారని ఈసారి కూడా స్పష్టమైంది. పనిలోపనిగా ఆనాటి ఐపీసీలో లేని కొత్త క్లాజ్‌లను ఇప్పుడు చేర్చారు. అవి అత్యంత ప్రజా వ్యతిరేకమైనవని, ప్రమాదకరమైనవని నిపుణులు అంటున్నారు. ఆ రకంగా మోషాకంటే మెకాలే నయం అనుకొనే పరిస్థితి తెచ్చారు.
ఇండియాలో ఏ రంగంలో అయినా పాతవి పోయి కొత్తవి ఎలా వస్తాయో ఇది తాజా ఉదాహరణ. పేరు మార్చుకొని, రూపం మార్చుకొని, కొండొకచో వ్యక్తీకరణ మార్చుకొని పాతవే కొత్త వేషంలో వస్తాయి. వలసపాలనలోని సామాజిక రాజకీయార్థిక పరిస్థితులకు ఆనాటి పీనల్ కోడ్, ప్రొసీజర్ కోడ్ అవసరం అయ్యాయి. ఈ నూటాయాభై ఏళ్లలో మన రాజకీయార్థిక చారిత్రక పరిస్థితులు చాలా మారాయి. కానీ అవి ఇప్పటి పాలకులకు మరింత అవసరం అవుతున్నాయి. తమ ఫాసిస్టు పాలనను సుస్థిరం చేసుకోడానికి, హిందూ రాష్ట్ర స్థాపన దిశగా సాగడానికి బీజేపీ ప్రభుత్వం వీటిని సాధనం చేసుకుంటున్నది. అయితే తన పరిభాషకు తగినట్లు మార్చాలనుకుంది. ఇప్పుడు అదే పని చేసింది. నిజమే మరి. వలసపాలకులకంటే ఎక్కువగా ప్రజల బెడద ఫాసిస్టు పాలకులకు ఉన్నది. ఫాసిజానికి వ్యతిరేకంగా ఆరంభమైన ప్రజల నిరసన తీవ్ర రూపం దాల్చవచ్చు. ఫాసిస్టుల కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా వేర్వేరు జీవన క్షేత్రాలలో తలెత్తిన ఉద్యమాలు తలనొప్పిగా మారవచ్చు. ఇవన్నీ హిందుత్వ ఫాసిజానికి, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా విజృంభించవచ్చు. కాబట్టి అణచివేత ఒక్కటే పరిష్కారం. తన వర్గానికి అనుకూలంగా, ప్రజలకు వ్యతిరేకంగా పీనల్‌కోడ్‌ను మార్చేయాలి. దాని పేరు మార్చడంలో వాళ్ల సాంస్కృతిక ప్రయోజనం ఉంది. పీనల్ కోడ్‌లో, ప్రొసీజర్ కోడ్‌లో వలస పాలకులు ఆశించిన వాటిని యథాతధంగా ఉంచడం, మరింత క్రూరమైన క్లాజ్లు చేర్చడం వెనుక ఫాసిస్టుల రాజకీయార్థిక దోపిడీ ప్రయోజనం ఉంది.
బీజేపీ తెచ్చిన భారత నాగరిక సురక్షా సంహిత, న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు మీద లోతైన చర్చ జరగాలి. వాళ్లు ఏ చర్చకూ అవకాశం ఇవ్వపోవచ్చు. వాటికి సంబంధించిన ఏ సమాచారాన్ని ప్రజల ముందు పెట్టకపోవచ్చు. కానీ వాటిలోని ‘కొత్తదనం’ ఏమిటో బట్టబయలు చేయాలి.
ఫాసిజానికి సమాజంలో ఎలాంటి కొత్త మార్పులు ఇష్టం ఉండదు. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తిరోగమన మార్పులు వేగంగా జరుగుతున్నప్పటికీ రాజకీయార్థిక, పాలనా, న్యాయ రంగాల్లో యథాతధ స్థితిని ఫాసిజం కోరుకుంటుంది. దేనికంటే అది భారత దళారీ పెట్టుబడి లక్షణం. ఫాసిస్టులు ఆ వర్గంలోని ఒక ముఠా. కాబట్టి దోపిడీ సజావుగా సాగే మార్గాలను వెతుకుతుంది. ఫాసిస్టులు ఆర్థిక రాజకీయ, పాలనా రంగాల్లో ఏవైనా మార్పులు తేవడం అంటే దోపిడీని వేగవంతం చేయడమే. కార్పొరేట్లకు మరిన్ని రెట్లు దోచి పెట్టడానికి ప్రయత్నించడమే. ఈ బూర్జువా స్వభావాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పీనల్ కోడ్ వగైరాల మీద ‘భారతీయ’ అనే కాషాయ మేలిముసుగు వేసింది. ఇండియాలో పాతవన్నీ కొత్తగా మారిన తీరు ఇదే. ఇక్కడి ఆధునికతలో, ప్రజాస్వామ్యంలో, లౌకికవాదంలోని కొత్తదనం ఇట్లాంటిదే. భారత సామాజిక ప్రగతిశీలతను అంచనా వేయడానికి పీనల్‌కోడ్, ప్రొసీజర్ కోడ్ సవరణల ఉదంతం బాగా సరిపోతుంది.