ఇవాళ దేశంలో జ్ఞానం అన్నిటికన్నా ప్రమాదకరమైనది. దానిని మోసే పుస్తకం, ఆ పుస్తకాన్ని రాసే, చదివే వ్యక్తులు ప్రమాదాకారులు. ఎలాగో మూడు ఉదాహరణలు మాత్రం చెప్తాను.

మావోయిస్టు నాయకుడు ఆర్. కె. జ్ఞాపకాలతో ప్రచురించిన సాయుధ శాంతి స్వప్నం పుస్తకాలను ప్రెస్ నుండి విడుదల కాక ముందే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుస్తకాలను నిషేధించిన హీనమైన చరిత్ర కూడా మనకుంది కానీ అందులో ఏముందో కూడా చూడకుండా ఎత్తుకుపోవడం బహుశా ఇప్పుడే చూస్తున్నాం. వెయ్యి కాపీల పుస్తకాల కోసం వంద మంది ప్రెస్ మీద దాడి చేసి భీభత్సం సృష్టించి, వాళ్ళ ప్రాపర్టీ ఎత్తుకుపోయి వాళ్ళ మీదే కేసులు పెట్టి పబ్లిక్ సెక్యూరిటీ చట్టం కింద నోటీసులు ఇచ్చారు. నిజానికి పుస్తకాన్ని నిషేధించడానికి కూడా ఒక పద్దతి ఉంటుంది. అందులో ఉండే విషయం ఏ విధంగా ప్రజాభద్రతకు ముప్పో నిరూపించాల్సి ఉంటుంది. కానీ ఒక విషయాన్ని గురించి ఆలోచించడమే నేరంగా ప్రకటిస్తున్నారు. చర్చించడమే తీవ్రవాదం అంటున్నారు. అసలు దానితో ఏ మాత్రం సంబంధం లేని ప్రింటింగ్ ప్రెస్ ను ఇందులో ఇరికించారు. ఎందుకింత ఉలికిపాటు?

2004 లో ప్రభుత్వానికి రెండు నక్సలైట్ పార్టీలకు చర్చలు జరిగినప్పుడు రామకృష్ణ వెలుగులోకి వచ్చాడు. ఎప్పుడూ అజ్ఞాతంలో ఉండే నక్సలైట్లు మొదటిసారిగా బహిరంగంగా వేదికల మాట్లాడారు. చర్చల సందర్భంగా భూమి సమస్య, ప్రజాస్వామిక హక్కుల సమస్య, ప్రత్యేక తెలంగాణ -ప్రభుత్వంతో చర్చించాలనుకున్న ఇవి మాత్రమే కాదు, అనేక సమూహాల ఆకాంక్షలు సమాజంలో చర్చకు వచ్చాయి. సాధారణ ప్రజల దగ్గరి నుండి, వివిధ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు ఎంతో మంది ఆ చర్చల బృందాన్ని కలిశారు. చర్చనీయాంశాలు కావలసిన, పరిష్కారం ఎదురుచూస్తున్న అనేక ప్రజా సమస్యలు చర్చించారు. వారూ, వీరూ పత్రికల్లో చాలా వ్యాసాలు రాశారు. మీడియా ఇంటర్వ్యూలు సరేసరి. రామకృష్ణ చనిపోయినప్పుడు ఆనాటి విషయాలను చాలా మంది గుర్తు చేసుకున్నారు. ఆ కొద్ది నెలల ప్రజాస్వామిక చర్చల వాతావరణం మన సమాజానికి ఒక తియ్యని జ్ఞాపకం.

ఆనాడు ప్రజల కోసమే జీవిస్తాం, ప్రజల కోసమే మరణిస్తామని ఆర్కే బహిరంగ వేదిక మీద ప్రకటించాడు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. ఆయన కొడుకు మున్నా అదే ఉద్యమంలో చనిపోవడం, భార్య శిరీష తీరని దుఃఖం, ఈ ముగ్గురి జీవితం గురించి సమాజం మాట్లాడుకుంటోంది. అడుగడుగునా స్వార్థం నిండిపోయిన లోకాన్ని చూసి చూసి ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అనుకోవడం, ఆశ్చర్యంగా, అపురూపంగా మాట్లాడుకోవడం సహజం. ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ ప్రత్యర్థి కావొచ్చు, శత్రువు కావొచ్చు. దానిని బహిష్కరించవచ్చు, నిషేధించవచ్చు. వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడకూడదు అంటే ఎలా? ఒకప్పుడు ప్రభుత్వమే చర్చలకు పిలిచింది కదా! పైగా అది వాళ్ళతో చర్చలు జరుపుతాం అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరీ అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి స్వయంగా ఏం హామీ ఇచ్చిందో చెప్పనవసరం లేదు.

ఇప్పుడు వాళ్ళ గురించిన తలపోతలే ఎందుకు కంటగింపయ్యాయి? కాస్త విచక్షణ ఉన్నవాళ్లయితే ఈ జ్ఞాపకాల ద్వారా ప్రజాలేమి కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. హక్కుల సంఘాలైనా, ప్రజాస్వామికవాదులైనా మావోయిస్టు ఉద్యమకారులతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఎందుకు కోరుకుంటారు? వారితో ప్రజాలున్నారు కాబట్టి. అది తుపాకులతో తిరిగే ఒక చిన్న గుంపు అయితే ఇంత చర్చ ఉండేదే కాదు. వారి పంథాతో ఏకీభావం లేకపోయినా ఇది కాదనలేని సత్యం. వారితో ఉన్న ప్రజలు, ఆ ఆదివాసులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాల్సింది పోయి, వారితో ఉంటేనే తీవ్రవాదులనడం, ఆ ఉద్యమం గురించిన ఆలోచనలే ప్రమాదకరం అని ప్రకటిస్తున్నారు అంటే ప్రజలను శత్రువులుగా చూస్తున్నారనేగా అర్థం.

ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి హిందువులు, అందులోనూ తమను సమర్థించేవారే ప్రజలు. తక్కినవాళ్ళంతా ప్రతిపక్షాలో, మావోయిస్టులో రెచ్చగొడితే దారితప్పే వాళ్ళు. నిన్నటిదాకా ఢిల్లీ రైతుల ఉద్యమంతో వాళ్ళు అలాగే సంభాషించారు. తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దాని కనుసన్నలను దాటి పనిచేసే శక్తీ, ఆసక్తీ లేనివే.

రెండో ఉదాహరణ- నిన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 14 మంది ప్రజాసంఘాల ఇళ్ల మీద దాడి చేసి కేంద్ర దర్యాప్తు బృందం (ఎన్. ఐ. ఎ.) వారి ఇళ్ళలో పుస్తకాలను, ఫోన్లూ, కంప్యూటర్ హార్డ్ డిస్కులనూ స్వాధీనం చేసుకుంది. అంతకు ముందు మార్చి 31-ఏప్రిల్ 1 మధ్య రాత్రి ముప్పై మంది ఇళ్లలోనూ ఇటువంటి దాడే జరిగింది. ఈ పుస్తకాలలో, ఫోన్లూ, కంప్యూటర్ హార్డ్ డిస్కుల్లో ఏమున్నాయని చెప్తున్నారు? ప్రమాదకరమైన సాహిత్యం, డాక్యుమెంట్లు. ఇందులో వాళ్ళు పనిగట్టుకొని పెడితే గాని మావోయిస్టులతో సంబంధాలను సూచించే ఉత్తరాల వంటివి ఉండవు. అవి దొంగ సాక్షాలని తేలిపోతాయి. ఇక ఆడగటానికి ఏముంటుంది? ‘ఈ పుస్తకం నీ దగ్గర ఎందుకుంది’ అని.  పోయిన సంవత్సరం హైదరాబాద్ లో ఒక ఇంటి నిండా పుస్తకాలు చూపించి ఇన్ని పుస్తకాలున్నాయంటే వీళ్ళు ఎంత కరడుగట్టిన మావోయిస్టులో అన్నారట పోలీసులు!

మూడో ఉదాహరణ- వరవరరావు కవిత్వాన్ని ప్రచురించబోతున్నట్లు పెంగ్విన్ ఇండియా వాళ్ళు ప్రకటించారు. ఆయన జైల్లో ఉన్నప్పుడే వాళ్లీ ప్రకటన చేశారు. గతంలో ఆయన జైలు రచన ‘సహచరులు’ పుస్తకాన్ని పెంగ్విన్ వాళ్ళే captive imagination పేరుతో ఇంగ్లీష్ లో ప్రచురించారు. ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో అనువాదమైన వివి కవిత్వం తాజా జైలు జీవితం, అనారోగ్యం నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా ఇటాలియన్, స్వీడిష్, పోర్చుగీస్ వంటి యూరోపియన్ భాషలలోకి కూడా అనువాదమైంది. భారతదేశ సాహిత్య ప్రపంచంలో ఇది చాలా అరుదైన విషయం. అయితే పెంగ్విన్ వాళ్ళు ఇప్పుడీ ప్రచురణ విషయంలో పునరాలోచనలో పడినట్లు వార్తలొచ్చాయి. ఆయన కవిత్వాన్ని ప్రచురిస్తే ఎక్కడ ఎన్. ఐ. ఎ. తమ మీదికొస్తుదో అని జాంకుతున్నట్లు క్వింట్ పత్రిక రాసింది. వాళ్ళ ఆందోళన సహేతుకం కాదనగలమా?

పుస్తకం ప్రచురించాక అల్లరి జరిగి పబ్లికేషన్ వెనక్కి తీసుకున్న సంఘటనలూ ఇటీవలి కాలంలోనే ఉన్నాయి. ఎన్నో ప్రశంసలు పొందిన ‘జై భీమ్’ సినిమా మీద ఇప్పుడు నడుస్తున్న వివాదాలు వాస్తవాలను ఎత్తి చూపితే ఎంత ఆధిపత్య వర్గాలకు ఎంత అసహనం కలుగుతుందో చూపిస్తున్నాయి. పుస్తకాల మీద, సినిమాల మీద, పాటల మీద, నాటకాల మీద, సోషల్ మీడియా పోస్టుల మీద నిషేధాలు, నిర్బంధాలు దేనిని సూచిస్తున్నాయి?

ఇంతగా ఆలోచనలను సహించలేనితనం వచ్చిందంటే ఈ వ్యవస్థ ఎంతగా పతనమైనట్లు!  

Leave a Reply