‘కన్న కొడుకునే చంపేందుకు ఎందుకు తెగబడ్డావు?’ గురిపెట్టిన తుపాకీలా తన కళ్లలోకే చూస్తున్నపోలీసు అధికారి ముఖం మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా భగభగమండిపోతోంది. మండే సూర్యుడి దిక్కు నిలువలేక వాడిన గడ్డిపువ్వులా ఆ తల్లి నేలచూపు చూసింది.

‘నిన్నే అడిగేది?’ అంటూ పోలీస్‌ ఆవేశం గదులు ప్రతిధ్వనించింది. పులి గర్జనకు లేడి భయంతో చెంగుచెంగున ఉరికినట్టే.. అధికారి ఆవేశానికి తిరుపత్త గజగజా వణికిపోతూ నాలుగడుగుల వెనక్కి వేసింది. ఏదో మాట్లాడాలని నోరు విప్పబోతోంది. మనసులోని మాటను బయటపెట్టడానికి ఆగిపోతోంది. ఏమి చేయాలో తెలియక, ఏం చెప్పాలో తోచక ఆమె సతమతవుతోంది. ఒకవైపు భయం వణికిస్తోంది. గుండె వేగం పెరిగిపోతోంది. చెమటలు కారిపోతున్నాయి. వణికే కాళ్లు పట్టుతప్పుతున్నాయి. తూలుతానేమోన్న భయంతో గోడను ఆసరా చేసుకుని నిలబడాలని చూస్తోంది. కానీ, ఆ చేతులు కూడా వణికిపోతున్నాయి. నేర పరిశోధన తన సహనానికి పరీక్షలాగా ఉందని ఇన్స్‌పెక్టర్‌కి కోపం కట్టలు తెంచుకున్నది. 

‘మర్యాదగా అడిగితే చెప్పేట్టు లేవు? పోలీసు వాళ్లు నిజం ఎట్ల చెప్పిస్తరో తెలుసుకుందమనుకుంటున్నవా? చెప్పు.. కొడుకుని చంపాలనుకునేంత కసి ఎందుకు పెంచుకున్నవ్‌? పోలీసు మర్యాదలు ఎట్లుంటయో తెలుసుకోవాల్ననుకుంటన్నవా? ఆడదాన్ని కదా, కొట్టరనుకుంటున్నవేమో. ఖాకీ చొక్కా ఏసుకున్నాక దయ ఉండదు. చంపేస్తా. రిస్క్‌ ఎందుకనే అడిగిన. అయినా రిస్క్‌ తప్పట్లే. మాటతోపోయేదాన్ని లాఠీ దాకా తీసుకొస్తున్నవ్‌. ఆడ జాతికే అవమానం నువ్వు. నీలాంటి తల్లిని నాలుగు కొట్టినా ఎవురూ తప్పనరు. ఇంట్లోవాళ్లు కూడ ఏడ్వరు. నిన్ను జూసి ఇంకే తల్లీ ఇంతకు తెగించడానికి భయపడేలా బాధమనే అంటరు’ పోలీస్‌ అధికారి ఆగకుండా తిడుతనే ఉన్నడు.

‘ఎప్పుడో సచ్చిన. బతికి వున్నా సచ్చినట్టే లెక్క సారూ. ఇన్ని మాటలు పడుకుంట. ఇంత పాపం మోయడం నాతోని కాదు. ఈ సచ్చిన దాని గొంతు పిసికి అసలే సంపేయండి సారు. సచ్చిన దానిని సంపినా కేసేమీ ఉండదు. ఆ పని జేసి పుణ్యం కట్టుకోండి సారు’ అనుకుంట రెండు చేతులు జోడించి ఆమె బోరున ఏడుస్తుంది. ఆమె గుండెలు పగిలేట్టు ఏడ్చినా ఆ పోలీసు మనసు కరగట్లేదు.

‘ఆపు నీ నాటకాలు. నీ దొంగ ఏడ్పులకి కరిగిపోయి వదిలిపెడతాననుకుంటన్నవా? ఏడిస్తే జాలి చూపిస్తడు. కన్నీళ్లతో పాపం కడిగేసుకోవచ్చనుకుంటన్నవేమో. ఈ లాఠీ పట్టుకున్నోడి ముందు అయ్యి పనిజెయ్యవు. ఎర్కేనా? మర్యాదగా ఎందుకు కొట్టినవో చెప్పు? ఎవరు సంపాలనుకున్నవో చెప్పు? లేకుంటే సావక ముందే నరకం చూపిస్త. అర్థమైందా?’ అంటూ పోలీసాయన గట్టిగా అరుస్తున్నడు. ఆమె భయంతో బిక్కుబిక్కుమనుకుంట ఉంది.

‘నోరు విప్పు’ పోలీస్‌ మళ్లీ గట్టిగ అనంగనే.. ‘నేనే కొట్టిన. నా కొడుకుని నేనే కొట్టి వాడి సావుదాకా తెచ్చిన. పాపిష్టిదాన్ని వాడిని కొట్టే బదులు నా నెత్తిన నేనే రెండు దెబ్బలు బాదుకుని ఉంటే ఇంత బాధే లేకుండేదయ్యా’ అంటూ ఏడుస్తుందామె.

‘నువ్వు నిజం చెప్పకుంటె ఇప్పుడా దెబ్బలు నేను బాధుత’ అంటూ చేతిలో లాఠీ ఊపుతా దగ్గరకొచ్చిండు పోలీస్‌.

‘కొడుక నేను నీ కాళ్లు పట్టుకుంట. నన్ను సంపు’ అంటూ దగ్గరకొచ్చిన ఆ ఇన్స్‌పెక్టర్‌ కాళ్ల మీద పడిందామె.

‘లే. కొడుకా అంటున్నవ్‌. కొంపదీసి నన్ను గూడ కొడుతవా? ఏంది! ఈ కన్నీళ్లకు కరిగిపోయేదేం లేదు. నిజం చెప్పు. ఇంకేమీ చెప్పొద్దంటూ జుట్టుపట్టి పైకి లేపాడు. అయినా మౌనమే ఆమె సమాధానం.

‘కానిస్టేబుల్స్‌’ అంటూ కేక వేశాడు విసుగొచ్చిన ఇన్స్‌పెక్టర్‌. వెంటనే ముగ్గురు ఆడ కానిస్టేబుళ్లు ‘సార్‌’ అంటూ ఉరికొచ్చారు.

‘ఈమె నోరు విప్పట్లేదు. నిజం రావట్లేదు. కొంచెం మర్యాదలు చేయండి’ అంటూ సెల్‌ నుంచి బయటికి పోయిండు. కుర్చీలో కూర్చున్నడు. టేబుల్‌ మీద ఆ కేసు ఎఫ్‌.ఐ.ఆర్‌. కనిపించింది. దానిని తెరిచి చేసి చూస్తున్నడు. అప్పుడే ఒకామె వచ్చి ఆయన ఎదురుంగ నిలబడ్డది. ఆమె వచ్చిన అలికిడి కని, కళ్లు పైకెత్తి చూసిండు.

‘నమస్తే సార్‌. నేను తిరుపతమ్మ కోడల్ని. ఆమెకు బువ్వ తెచ్చిన. ఇచ్చి పోత’ అంటుంటే.. ఆమె మాటల్ని ఆపుతూ ‘కన్న కొడుకుని సచ్చేట్టు కొట్టిన తల్లికి సద్ది తెచ్చినవా? దొంగలకు సద్దులు మోయడం అనే మాట విన్న. నువ్వు విన్నవా?’ అనడిగిండు ఆ ఇన్స్‌పెక్టర్‌.

‘అంతమాట అనకండి సార్‌’ అన్నదామె. ‘హంతకులకు సద్దులు మోయడం అనాలా?’ ఆమె మాటకు మల్లా అడ్డు తగులుతూ అన్నాడాయన.

‘సార్‌.. మీరు కొంచెం బయటికి వస్తరా? అని దీనంగా అడిగింది.

‘ఎందుకు? లంచం ఇస్తావా? ఇక్కడే ఇయ్యి. తీసుకునే నాకు ఇబ్బంది లేనప్పుడు, నువ్వెందుకు ఇబ్బంది పడటం. ఎంత తెచ్చావ్‌? ఈ మధ్యన ధరలు పెరిగాయి. తెలుసా?’ అంటూ పోలీసాయన ఆశతో ఆమె చేతులు సాయగ చూస్తున్నడు.

‘అది కాదు సార్‌. మీకో మాట చెప్పాలె. ఈడ చెప్పలేను’ అన్నది. ఆ మాట ఇనంగనె.. ఏదో తేడా ఉన్నట్టుంది. వింటే కేసు కొత్త మలుపు తిరిగిద్దేమోనని మనసులో అనుకుంటూ పోలీసాయన లేచాడు. ఆమె నడుస్తుంటే ఆమె వెనకే పోయిండు. పోలీస్‌ స్టేషన్‌ మెట్లు దిగినంక పక్కనే ఉన్న వేప చెట్టుకిందికి పోయి, ఆగింది.

‘ఇప్పుడు చెప్పు’ అన్నడు వెనకనే వచ్చిన పోలీస్‌ అధికారి.

‘మొన్న మా ఇంట్ల నాకూ, నా మొగుడికీ చిన్న తగువైంది. ఆయన తాగొచ్చి దాన్ని పెద్దది చేసిండు. ఊకె ఇంట్ల గొడవలు చేస్తనే ఉంటడు. ఎదురు చెప్పకుంటె ఆగడు. మాటంటే పరువు పోయిందని నా మొగుడికి మా అత్త తోడు వస్తది. వాళ్లిద్దరితోని వారానికి ఒక్కపాలైనా తగువుంటది. అప్పుడప్పుడు ఇంట్ల కొట్లాటయితది. ఈపాలి దెబ్బ తగలరాని సోట తగిలింది. అది నేను కొట్టిన దెబ్బే. మా అత్త కొట్టలే. తగువప్పుడు నా మొగుడినే వెనకేసుకొస్తది. మరి ఎందుకో నా తప్పుని మీదేసుకుంది. ఆమెనేమీ అనకండి సారూ’ అంటూ దండం పెట్టింది.

క్షణం ఆలస్యం చేయకుండా ఆ పోలీసాఫీర్‌ చకచకా లోపలికి పోయాడు. సెల్‌లో తిరుపతమ్మని విచారిస్తున్న ఆడపోలీసుల్ని ‘ఆపండి’ అన్నాడు. ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు ఆయన్ని చూస్త ఉండిపోయారు. వాళ్లకేం అర్థం కాలే. ‘ఆమెతో నేను నిజం చెప్పిస్త. వదిలేయండి’ అని ఆ పోలీస్‌ అధికారి అనగానే వాళ్లు లాఠీలు కింద పడేసి పోయారు. దెబ్బలు చూసుకుంట, కుమిలి కుమిలి ఏడుస్తున్న తిరుపతమ్మ ఆ ఇన్స్‌పెక్టర్‌ కెల్లి తలెత్తి చూసింది. ఆయన వెనకే ఉన్న తన కోడల్ని చూసి ఆమెకు ఇంకా భయమెక్కువైంది.

‘నీ పసుపు కుంకుమలు తుడిచేయాలనుకున్న పాపిష్టిది ఎట్లున్నదో సూడనీకి వచ్చివనా?’ అంటూ బొంగరుపోయిన గొంతుతో ఏడ్చింది.

‘మీ ఏడ్పులు తర్వాత.. ముందు నాకు నిజం చెప్పండి’ అంటూ ఆ అత్తా కోడళ్లను తన కూర్చీ దగ్గరకు తీసుకుపోయి, ఎదురుగా ఉన్న బల్లపై వాళ్లిద్దరినీ కూర్చోమన్నడు పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌.

‘ఇప్పుడు చెప్పండి’ అని ఇన్స్‌పెక్టర్‌ అడిగిండు. వాళ్లిద్దరూ మౌనంగా ఉన్నరు.

‘అడిగేది మిమ్మల్నే’ అని గట్టిగా అరిచిండు. నేను కొట్టినని పద్మ, కాదు నేను కొట్టినని తిరుపతమ్మ వాదులాడుకుంటున్నరు. వాళ్ల గొడవ ఆ ఇన్స్‌పెక్టర్‌ని చికాకు పెట్టింది.

‘షటప్‌. ఏందిది. మీ ఇల్లనుకుంటున్నరా? మర్యాదగా మాట్లాడితె పోలీస్‌ స్టేషన్‌ అన్న సంగతే మర్చిపోతున్నరే’ అంటూ గుడ్లురిమిండు.

‘సార్‌, నా ఇద్దరు బిడ్డల మీద ఒట్టేసి చెబుతున్న. నాకు, నా మొగుడికి గొడవయ్యింది. కొట్టుకున్నం. ఆ కొట్లాటల దెబ్బ గట్టిగనె తగిలింది. సంపాలనుకోలె. తాగొచ్చి బూతు మాటలంటడు. బజార్ల పరువు తీస్తడు. జీతం పైసలు జేబులేసుకుంటడు. గాని, రూపాయి ఇంట్ల ఇయ్యడు. ఎట్ల బతకాలె. బిడ్డల్నిఎట్ల సాకాలె. ఇదేందని అడిగితే పెండ్లాం ఎదురు చెప్సిందని నలుగురనుకుంటరని నన్నే కొడతడు. అన్ని మాటలు వింటది, కొడితే సూస్తది కానీ మా అత్త కొడుకుని ఒక్క మాట అనకపాయె. కొడుతుంటే అడ్డు రాకపాయె. వస్తే ఈ బాధ వచ్చేదే కాదు. నేను కావాల్నని కొట్టలే సార్‌. నన్ను సావగొడుతంటే నేను కాపాడుకున్న. ఆయన లేకపోతె మాకు బతుకేది? కొట్టినా, తిట్టినా ఆయన పెడితేనే ఇంత తినేది. అందరూ నవ్వుతున్నరు అంటడే గాని, ఎవలన్నా నా బిడ్డలకు రూపాయి సాయం జేసినోళ్లు లేరు. నేనూ నా బిడ్డలే బాధలుపడ్డం. ఇప్పుడాయన సావు బతుకుల్ల ఉన్నడు. బతికి మంచిగుంటే సాలు. నా కోరిక అదొక్కటే. ఏమయితదో?’ అంటూ ఆమె ధారాళంగా మాట్లాడతున్నట్టె ఆమె కంటి నుంచి ధారాపాతంగా కన్నీరు కారుతోంది. చెంగుతో ఆ కన్నీళ్లు తుడుచుకుంటూ ఆగిపోయింది.

‘అది చెప్పేదంతా అబద్దం సారూ. వాడు తాగొచ్చి అరిస్తే నేనే కొట్టిన’ అన్నది తిరుపతమ్మ.

‘నా కోడలు సంపుతుంది. నా కొడుకు సస్తున్నడు. వచ్చి ఆపండని సుట్టుపక్కలోళ్లని నువ్వే పిలిచినవంట’ అని మధ్యలో కలుగజేసుకుని ఇన్స్‌పెక్టర్‌ అడిగిండు.

‘ఏదో భయంతో అన్న. నలుగురు ఏమంటరోనని అట్ల జేసిన సారు’ అని చెప్పింది తిరుపతమ్మ.

‘నీ కోడలు బిడ్డల మీద ప్రమాణం చేసినట్టు, నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు’ అని తిరుపతమ్మని ఇన్స్‌పెక్టర్‌ అడిగిండు.

‘దేవుడా.. నన్నెందుకు తీస్కపోలే. నేనేమన్నా ఆస్తులు కావాల్నని అడిగినా? ఇంకెవరినైనా జైల్ల పెట్టమన్ననా? నన్నే జైల్ల పెట్టమంటున్నగదా? అసలే దవాఖానల సావుబతుకుల్ల ఉన్నోని మీద ఒట్టేస్తే వాడికేమన్నా అయితే? నేనట్ల ఒట్టెయ్యాలె సారు’ అని ఏడ్చింది.

‘నువ్వు నిజం చెబితే ఏమీ కాదు’ అన్నడు.

‘నా మీద ఒట్టేసి చెబుతున్న సారు’ అంటూ నెత్తిన చెయ్యి పెట్టుకుని తిరుపతమ్మ ప్రమాణం చేసింది. ఆ ఇన్స్‌పెక్టర్‌ మౌనంగ ఉన్నడు.

ఈ కేసుని ఏం చేయాల్నో ఆలోచించుకున్నడు. కాసేపైన తర్వాత తిరుపతమ్మను సెల్‌లోకి పొమ్మనడు. ఆమె లోపలికి పోయింది.

‘బిడ్డల మీద ప్రమాణం చేసినవంటే నువ్వే కొట్టావని నమ్మతున్న. ఎందుకు కొట్టినవని అడగను. కానీ, మీ అత్త తప్పుని ఆమె మీద ఎందుకేసుకుంటుంది? నువ్వు ఆమెకు దగ్గరి బంధువా?’ అనడిగిండు ఇన్స్‌పెక్టర్‌.

‘కాదు సార్‌’ అని ఆమె సమాధానం చెప్పింది. 

‘మరెందుకు ఆమె తప్పుని మీదేసుకుంటున్నది? తప్పు చేసిన నిన్ను వెనకేసుకొస్తున్నది?’ అని ఇన్స్‌పెక్టర్‌ అడిగిండు.

‘ఇన్నేళ్ల సంసారంలో ఒక్కనాడన్నా నా తరుపు మాట్లాడలే. ఎప్పుడు తగువైనా ఆమె కొడుకునే వెనకేసుకొస్తది. ఆమెకు చెప్పుకున్నా లాభం లేదని బయటివాళ్లకు చెప్పుకుంటే నా పరువు తీస్తున్నవని నా మొగుడు కొడతడు. అప్పుడూ అత్త అడ్డురాదు. ఇప్పుడేం బుద్ది పుట్టిందో? నా తప్పుని మీదేసుకుంది? నాకూ అర్థమయితలే సార్‌’ అన్నది పద్మ.

‘ఇగ నువ్వు ఇంటికి పో. అవసరముంటే పిలిపిస్త’ అన్నడు ఇన్స్‌పెక్టర్‌. ఆయన ఆలోచనలో పడ్డడు. తిరుపతమ్మను మళ్లీ పిలిచిండు.

‘నువ్వు అబద్దం చెబుతున్నవని నీ కళ్లు చెబుతున్నయ్‌. నిజం చెప్పు. నీకు మేలే జరుగుతది. చేతనైన సాయం జేస్త’ అన్నడు ఇన్స్‌పెక్టర్‌. ఆ మాట వినంగనె పోలీస్‌ భయం పోయినట్టుగా వాడిన ఆమె ముఖం మారిపోయింది.

‘నా కోడలు చెప్పిందే నిజం సారు’ అని తిరుపతమ్మ ఒప్పుకున్నది.

‘మరి నువ్వెందుకు? తప్పుని మీదేసుకుంటున్నవ్‌? ఇన్స్‌పెక్టర్‌ అడిగిండు.

‘తాగొస్తడు. అరుస్తడు. వేగలేక ఆ పొల్ల ఏదో ఒకటి అంటది. అప్పుడప్పుడూ ఆ మాటలు బయటికినబడుతయ్‌. వాడన్న వంద మాటలు ఇననట్టే ఉంటది లోకం. విసుగొచ్చి ఒక్కమాటంటే లోకం ఆ మాటనే పట్టుకుని చెప్పుకుంటది. పెండ్లామే వీడి మాట వినదని చెప్పుకుంటది. ఒక్కోపాలి నలుగురిలో వాదులాటైతే దెప్పి పొడుస్తరు. దొంగన్నా ఎవనికీ సిగ్గురాదు. ఇంకెన్నన్నా బాధపడరు. పెండ్లామే నీ మాటినదంటే మాత్రం పరువంత పోయిందనుకుంటరు. ఆ పరువంతా పెళ్లాం పడింటేనే ఉంటదంట. పెండ్లాం నోరెత్తితే పోతదంట. ముసలయ్య ఉన్నన్నాళ్లూ నేనూ అట్టనే బాధలువడ్డ. అయ్యే బాధలు వడుతున్నది. అదేమీ నా తమ్ముని బిడ్డ గాదు. దగ్గరి సుట్టం గాదు. కొడుకు పెండ్లామే అయినా నా లాంటి ఆడదే గదా. నాకు తెల్వదా దాని బాధ. ఎప్పుడూ నేను మాటసాయం రాలేదని, అడ్డం పడలేదని అంటదే. గాని, ఇంట్లో ఆడోళ్లందరూ గలిసి తన్నిండ్రని లోకం అంటదని దానికి తెల్వదు. అత్తా ఒకింటి కోడలేనని నాకెర్కలేదనుకుంటది. పిచ్చిది ఎన్ని బాధలు వడ్డదో?’ అంటూ తిరుపతమ్మ గతాన్ని గుర్తుచేసుకుంది.

‘అయిందేదో అయింది. కొట్టింది నీ కోడలే. ఇప్పుడామెను ఎందుకు వెనకేసుకొస్తున్నవ్‌?’ ఇన్స్‌పెక్టర్‌ ప్రశ్న.

‘సారు.. వాడికి పెండ్లి జేసేప్పుడు సంబంధానికి పోయి వచ్చిన రోజే లొల్లి అయింది. అమ్మాయి ఒక ఇంచు ఎత్తున్నదని వద్దంటున్నడు. ఒకించు ఎత్తుంటె ఏంది? ఒకించు తక్కువైతే ఏంది? కన్నొంకరా? కాలొంకరా? పిల్ల సక్కంగుంది! నువ్వేం ఏడూళ్ల అందగానివా? నచ్చినట్టుండే అమ్మాయి దొరకనీకని వాళ్లయ్య వాదులాడి పెండ్లికి ఒప్పించిండు. ఊళ్లోవాళ్లేమనుకుంటరోని పెండ్లాన్ని పక్కనబెట్టుకుని బయటికే పోకపోయేది. ఇగ వాళ్లిద్దరికీ అప్పుడప్పుడు గొడవయ్యేది. కోపం ఆపుకోలేక ఆ పిల్ల ఒక మాటనేది. అది విన్నోళ్లు ఫలానోడి పెండ్లం ఇట్లంది? అట్లందని వంద మాటలనుకుంటరు. వాడన్న పది మాటలు విననట్టే ఉంటరు. ఆడోళ్లను పొడుసుకుతినె లోకంల మగోడు గూడ బలైతడు. అట్లాంటి మాటలు పడి వాడు బాధపడేది. ఇట్ల అనుకునే మాటలు విని తోడబుట్టిన అక్కచెల్లెండ్లే నీ పెళ్లాం నీ మాటినదు. పెండ్లామంటే ఎంట్లుండాలె మగడు చెప్పినట్టు జెయ్యాలని అనేటోళ్లు. ఏదైనా తగువొస్తే నీ పెండ్లమే నీమాటినదు, నాకు జెబుతున్నవా? అనేటోళ్లు. అయినోళ్ల కాడ ముఖం లేక మనాదివడ్డడు. పెండ్లికి పేరంటానికి గూడ పోకపోయేది. ఏడికన్నా కోడలు పిల్లనే పంపేది. వాడెందుకు పోకపోయేదో పెంచిన నాకు తెల్వదా? బాధపడతని ఎన్నడూ అడగలె. ఇట్లంటే కొడుకుని ఏమయితడో రంది పడ్డ. నిమిషాల్ల వచ్చి పోయే భూకంపం జీవితకాలం కష్టపడి కట్టుకున్న కొంపల్ని కూల్చిపోతది. మొగడూ పెళ్లాల తగువు గూడ నిమిషాల్ల సంసారానికి అగ్గి పెడతది. అట్లయితదనే నాకు భయం. అనుకున్నట్టే అయింది’ మాటలాపిన తిరుపమత్మ ముఖాన్ని కొంగుచాటు పెట్టుకుని వలవలా ఏడ్చింది.

‘నీ బాధ, భయం నేను అర్థం చేసుకుంట. కానీ, జైలుకు పోయ నేరాన్ని నువ్వెందుకు మోస్తున్నవ్‌?’ అనడిగిండు ఇన్స్‌పెక్టర్‌.

‘పెండ్లాం ఒక్క మాటంటేనే అన్ని మాటలనే ఈ కాకులు ఊరుకుంటాయా? వీడిని పెండ్లాం కొట్టిందట. ఆడతానితో తన్నులు తిన్నోడని తీసి పడేయరు. మాట చెల్లక, ముఖం చాలక వాడెంత నలిగిపోవాలె. బతికొచ్చిన కొడుకు బతుకుతడా? నేను జైలుకు పోయినా బాధలే సారు. నా కొడుకు దవాఖాన నుంచి వచ్చి మంచిగ బతకాలె. అంతే’ అని ఇన్స్‌పెక్టర్‌ కాళ్ల మీద పడ్డది.

+             +                  +

‘నీ కొడుకుని నువ్వే కొట్టావని ఒప్పుకుంటున్నవా? న్యాయమూర్తి అడిగిండు.

‘నేను కొట్లలే సారు’ అన్నది తిరుపతమ్మ.

‘యువర్‌ హానర్‌.. ఆమె చెబుతున్నది అబద్దం. ఈ నేరంతో ఆమెకు సంబంధం ఉంది. ఘటన జరిగిన రోజున బాధితుడుని దవాఖానకు చేర్చింది కూడా ఆమే. కాబట్టి ఆమె అక్కడ ఉంది. ఆవేశంలో కొడుకుని కొట్టింది. కొడుకు ప్రాణం కాపాడేందుకు తనే దవాఖానలో చేర్చింది. కోర్టుని తప్పుదారి పట్టిస్తోంది’ అంటూ ఇన్స్‌పెక్టర్‌ అనుమానం వ్యక్తం చేశాడు.

‘చూడమ్మా నేరం నువ్వు చేశావని అంగీకరించినా, కోర్టు అంగీకరించదు. నువ్వు చేసినవని పోలీసులు చెప్పినా ఒప్పుకోదు. అప్పుడు చూసినవాళ్లెవరైనా ఉన్నారా?’ అని జడ్జి లాయర్‌ని అడిగాడు.

‘ఎవరూ లేరు’ అని లాయర్‌ చెప్పిండు.

‘ఎవరూ లేరు సారు. ఆస్తి రాసియ్యాల్నని తగువుపెట్టుకున్నడు. ఎవరికీ రాసియ్య. ఉన్నన్నాళ్లు నాదే, నా తర్వాత నీదేనంటే వాడు ఊకోలే. మీది మీదికి వస్తుంటె తగువు పెట్టుకున్న. అయినా కొట్టలే. వాడే అటూ ఇటూ ఉరుకులు పెట్టి కిందపడ్డడు. అంతె సారు’ అన్నది.

‘నా కొడుకు సచ్చేట్టున్నడు. కోడలు సంపుతందని పరుగులు పెట్టినవని పోలీసులు చెబుతున్నరు?’ జడ్డీ ఇంకో ప్రశ్న వేసిండు.

‘మీ అమ్మే నిన్ను కొట్టిందా? లేకపోతే ఇంకొకళ్లు కొట్టినరా?’ అని జడ్జి కొడుకును అడిగిండు.

అప్పుడు నేను సోయిల లేను. ఈ దెబ్బలెట్ల తగిలినయో గుర్తే లేదు’ అన్నడు.

పోలీసులు సరైన సాక్ష్యాలు పెట్టలేదని కోర్టు కేసు కొట్టివేసింది. కోర్టు మెట్లు దిగి అందరూ బయటికి వచ్చారు.  గాయాలతో ఉన్న కొడుకుని జూసి తల్లి కన్నీరు పెట్టుకుంది. తన కోసం తన తల్లి పడ్డ బాధలు తెలిసి ఆ తల్లికన్నా ఎక్కువగా ఏడ్చిండు. కొడుకా నా నెత్తురు తాపి పెంచిన. నీకోసం చిన్న దెబ్బ తినలేనా? బిడ్డా నువ్వు బతికుంటే సాలని తల్లి గుండెలకత్తుకుంది. అడ్డాలనాటి బిడ్డలా తల్లి గుండెలకు అతుక్కుపోయిండు కొడుకు. ‘ఇంకెన్నడూ నీకు కష్టం తేనమ్మా’అని అమ్మ భుజం మీన తలవాల్చి మనసులో ఒట్టేసుకున్నడు కొడుకు.

Leave a Reply