పొలుమారు మీద కూలీకి పోయినోళ్ళు అడుగుల్లో అడుగులేస్తూ ఇల్లకు జేరుతున్నరు. ఊల్లే సాగల్లు తిరుగుతున్నరు. లచ్చవ్వ ఆయిల్ల గాసం కోసం పొయికింద కయితే ముండ్లకంప ఏరుకచ్చింది. పొయిమీద సంగతి యాదికచ్చేటాల్లకు గుండెల్ల రాయి పడ్డట్టయింది. పొద్దున్నే సోలెడు గట్కకోసం మాదిగిండ్లన్నీ తిరిగింది యాదికచ్చేటాల్లకు ఉన్న పాణం తుస్సు మన్నది. ‘‘కూలీకి పోయినకాడ పటేలు కూలిత్త డనుకుంటే నాలుగురోజులు ఆగల్నన్నడు, కూలోల్ల ఇండ్లల్ల మనులు మాన్యాలున్నట్టు. పూటగాసపోల్లం కూలియ్యమని పట్టుపడితే కావురాలచ్చినయని ఎగిరెగిరిపడ్డడు. మొన్నటిదాక సంఘం మాటని సెప్పినట్టిన్నరు. ఇప్పుడు పోలీసోళ్ళ బిప్రి జూసుకుని మల్ల సాగిచ్చుకుంటాండు’’ తనలోనే అనుకుంటా కాళ్ళు కడుక్కొని ఇంట్లకు వోయింది లచ్చవ్వ.
‘‘ఈ దిక్కుమాల్ల పోరి ఎప్పుడు ఇంట్ల సావది. ఓ నీలముండ యాడపోయినవే….’’ అని కేకేసింది కోపంగా. వత్తానే తిట్లకు జాగిన తల్లిని జూసి ‘‘ఏందే అవ్వ…’’ అనుకుంట గావురాలు పోయింది… నీల
‘‘నీ గావురాలు సాలుగాని గా సర్కారు బాయికాడికి పోయి కుండెడు నీళ్ళు తిస్కరాపో. గీ ఇంట్ల సాలమన్న జేయ్యకుంట తెగిడిన భూతమోలె దిరుగుతున్న వెందే’’ అని పోయి రాజేసుకుంటున్న లచ్చవ్వ కుండ సేతికిచ్చింది.
నీల కుండ తీసుకుని సర్కారు బాయివైపు సాగిపోయింది… ఉన్న నీల్లతోని ఎసరు వెట్టి కందుల్ల రాల్లేరుకుంట కుసున్నది. ఇప్పటికి పదిహేనొద్దులనుంచి ఇంటికి రాని కొడుకు యాదికచ్చేటాల్లకు కనుకొలుకుల్లా నీల్లు నిల్సినయి… జీతగాల్లందట్ల తన కొడుకు పెచ్చే… మొన్ననే పోలీసు లచ్చినపుడు నీ కొడుకును లెంకుకొని తీస్కరమ్మన్నరు. ‘‘నేను ఆడిముండను బాంచెన్ యాడికి పోవాలే….’’ సర్కిల్ సౌదరయ్య గుడ్లు మిటకరిచ్చి మీరు టైకులు జేసి పనులు బందు వెడితే భూస్వాములకు ఇబ్బంది గాదే అనుకుంట మీదపడి రైకలోని సన్నందుకుని, దండం పెడుతున్న పదిమందిల నొత్తన్నదే అనుకుంట వాని పాపిష్టి నోట బూతుకూతలు గూసిండు. గట్లనే సూసుకత్తనని జెప్పి బయట పడితి… ఎందుకో ఇదంత యాదికచ్చేటాల్లకు ఇంకా భయిమేసిన – కొడుకు సరైన తొవ్వల వోతున్నాడు… దొంగతనం జేసిండా… రండతనం జేసిండా… నాయంగ వచ్చేదాన్నె అడిగిండు… కొద్ది ధైర్న మనిపించింది. పోయిమీద కుండల నీళ్ళు కలపెల మనంగనే కందులు వోసింది… లచ్చవ్వ ఎనకకు తిరిగి సూసుకుంటే బతుకంతా ఉడికి పోయినట్టే అయింది… తన భర్త భూస్వామి రాజిరెడ్డి కొలువులో ఉండగ బండ వడ్డదాని బర్మాలు బెడుతాండ్లు, బర్మాలు అంటిచ్చి పై కెక్కుతుంటే? ఎక్కక ముందే బత్తులు వెలినయి. ఇగ గా లేసిన బండలతోటి ఇంటాయిన గూడ బండల్లపడి సచ్చిపోయిండు. సచ్చేడున్నుడో గని నన్ను చరల దోలి పోయిండు… కల్ల నీళ్ళు కారి… పొయ్యిల పడి చుర్రుమన్నయి…
నాకు దిక్కెవరు రాజిరెడ్డి పటేలా అని ఏడుత్తాంటె నేను లేనానే అని ఓరగ జూసిండు. వానింట్ల పీనిగెల్ల. బాకి కిందికి పోరన్ని గూడ పసుల గాయబెడితి. తూమెడు గొల్చెటానికి తంగెల్లు పీకిచ్చిండు. దేవుని గున్లె మన్నుబోత్తు నా యింట్ల దీప మార్పిండు, నా పాణ మసోంటి బిడ్డ ఆగమయిండు. రెక్కలున్నయి రెండురెక్కలు జేత్తె రెండు మూతుల కేడందుతది. ఉప్పు కారం లేక సప్పిడేనాయె, పోరికి పదేన్లు మీది కత్తన్నయి ఒక్కరైక పేగన్నాలేదు.
పొయ్యి కింద మంటలాగే లచ్చవ్వ మండిపోతంది. ఊల్లె కుక్కలు అరవడం ప్రారంభించాయి ఒక్కసారె. వచ్చెరో… పారో…. గడెబెడ తొక్కిడి సాకలి మంగల్ల వడ్ల కమ్మరోల్ల వాడకెయ్యి ఒక్కటే బబ్బ. ఊరుమీద వడ్డట్టున్నది. అక్కడినుంచి ప్రారంభమయింది నరమేధం. వచ్చిన యాభై మంది పోలీసులు వాడల్ని మరీ పంచుకొని పని ప్రారంభించిండ్లు –
నీల్లకు పోయిన నీలవ్వ కుండ బట్టుకొని ఎగబోసుకుంట ఉరికచ్చింది.
‘‘అవ్వో… అవ్వో… పోలీసులే మన మాదిగిండ్లల్లకు గూడత్తండ్లే.’’
‘‘అయితే పటేన్లు మల్ల పోలీసుల్ని ఊరుమీదొదిలిండ్లు. మొన్న జరిగింది చాలు బిడ్డో… వాళ్ళ తాల్లు దెంప నరరూప రాచ్చసులు, ఈసారి ఎంతమంది మానాలు దోత్తరో. పదిరోజుల కిందనే అయిపోయిందనుకున్న. ఎట్ల నీలవ్వ? నువ్వు నా ఎన్క ఉరికి రావాలె ఒంటి మిట్టకెయి పోదాము, ఆ బండలన్న దాసిపెడుతయి’’ అని నీలవ్వ సెయ్యి పట్టుకొని కడపల్ల కచ్చింది. అయిదుగురు జవాన్లను ఎంబడి బెట్టుకొని అప్పుడే వచ్చిన సౌదరయ్య.
ఓ సి.ఆర్.పి. జవాను నీలవ్వను గుంజి ఓ గుద్దు గుద్దనే గుద్దిండు. ఇగ తల్లి పిల్లని జూత్తె కలువది, వాడీపూట ఏమో జేద్దామనే వచ్చిండు. ఎన్కతడ్క తన్నుకొని పరుగు మొదలుబెట్టింది లచ్చవ్వ. నలుగురు జవాన్లు ఎంటబడ్డరు. వాళ్ళలో ముగ్గురు బాగెన్కుంటె ఒక్కడేమొ బాగా ముంగట కున్నడు. బలం జేసుకొని పొలుమారం దిప్పింది. ఎత్తుగా వచ్చిన ఒడ్డును దాటవోయి పడ్డది.
‘‘లంజె ఎంత బలమ్, నన్ను ఉరికిస్తావు’’ అంటూ అనుగబట్టి కస్సున సెంపలను గొర్కిండు….
‘‘బాబు…. నీ అక్కసుంటి దాన్ని’’
‘‘లంజె… నా అక్కవా మీకు మంచిగ జెప్తె ఏడిరటరే, ఏడే నీ కొడుకు దమ్ముంటే ఇప్పుడు రమ్మను’’ అంటూ రైకను చింపడం ప్రారంభించాడు.
‘‘పోలీసన్న నీ నోటికాడి బుక్కేమి గుంజుకోలేదు. సేతులెత్తి దండం బెడుతోన్న మా రెక్కలకట్టం అడిగినము’’ అంటూ చేతులెత్తింది.
‘‘లంజె మాటలు ఆడతన్నవా, నిన్నియాల సర్కిలు ఎట్లగైన పట్కరమ్మన్నడు. వానికన్న ముందు నేనే నీ పని వెడుత’’ అంటూ గుడ్డలన్ని ఊడదీసాడు.
మోడైన చెట్టు తీరుగ మొండి మొదలురిన లచ్చవ్వ రూపు – ఉన్న రెండు చేతుల్ని కప్పుకొని బోరున ఏడుస్తున్నది. మూర్తీభవించిన ఆంబోతు కుమ్మినట్టు జవాను ఎదపై ఒక్క గుద్దు గుద్దిండు, వెల్లకిల పడిపోయింది. కొరికిన గాటులోనుంచి కారుతున్న రక్తం కళ్ళలో నీళ్ళు, ప్రకృతి బోరుమంది. ఊల్లో ఎక్కడ అరుపులు లేవు. భయంకర నరమేధం జరిగింది. చెండ్లలో మనుషులు లేరు. ఎక్కడి వాళ్ళక్కడే కుములుతున్నరు. తాండవిస్తున్న నరమేధ కాండను జూసి ఆ వెన్నెల మబ్బుల్లోకి జారింది, సాక్షంగా ఉండాల్సి వస్తుందని. లచ్చవ్వ వివసురాలయింది. అప్పటికే రొండుసార్లు ఆ పోలీసు లచ్చవ్వను తిన్నాడు. అటుగా వస్తున్న పోలీసుల టార్చిలైటు వెలుగులలో… లచ్చవ్వ నగ్నరూపం. ఎవర్ని సూసి సిగ్గుపడాలో తెలియక పంటచేలు మూగబోయింది… పయింటేసుకున్న జవాను తుపాకి నందుకుని ‘‘మొన్న రాజిరెడ్డి జూప్పించిందిదేరా మొగుడు జచ్చింది, ఊు… కానియ్యిండ్లు నేను నిలబడుత.’’
ఒక్కరూ… ఇద్దరూ… ముగ్గురూ…
లచ్చవ్వ కండ్లు అచేతనంగా ఆకాశంకేసి జూస్తున్నాయి. కొరికిన స్తనాలలోనుంచి కారుతున్న రక్తం జివ్వుమని దరిణిని తడిపివేస్తున్నది. కొనప్రాణంతో లచ్చవ్వ పిడికెడు మట్టి తీసుకొని కన్ను మూసింది…
ఆ ఉదయం లచ్చవ్వను రేప్ చేసి సంపినట్టు పదేహేనుమంది రైతుకూలీలను జైలుకు పంపారు పోలీసులు. ఇంతకీ ఆ ఊరు సేసిన నేరం కూల్లు పెంచమనడం, బంజెర్లు దున్నుకోవటం, రైతుకూలీ సంఘాలు గట్టి ప్రజాపంచాయతీలు జరుపుకోవడం. ఆ నేరాలకే ఊల్లోనుంచి మూడువందలమంది పరారు. ఆ నేరాలకే యాభైమందిపై తప్పుడు కేసులు. ఆ నేరాలకే పదిమంది స్త్రీలను పోలీసులు చెరపట్టారు. లచ్చవ్వతోపాటు ముగ్గుర్ని స్వర్గలోకం పంపారు. తెలుగు ఆడపడుచుల మానప్రాణాలన్ని తుపాకి సన్నీలకు వేలాడగట్టి ఘన సన్మానం జేస్తున్నారు.
చర్చీ గంటలు మోగుతూనే ఉన్నాయి, దీనులు బలిపశువులు స్వర్గంలో సుఖాల్ని పొందుతారని. ఇది ఏ ఊరని అడగకండి, ఇది తెలంగాణలో సి.ఆర్.పి. కాంపులున్న ఏ పల్లెయినా కావచ్చు – అది భట్టుపెల్లో – కేశవాపూరో – కనుకులగిద్దో – మాదేశ్‌పూర్ ఏజన్సీలోని బర్గగూడెమో ఏదైనా కాల్చడం కూల్చడం.
ఈనాటి శాంతి – భద్రతలు.
అరుణతార – సంచిక : 50/51, జనవరి – మార్చి 1984
శనిగరం వెంకటేశ్వర్లు కలం పేరు సాహు