“సంస్కృతి-మార్క్సిస్టు సాంస్కృతిక సిద్ధాంతం” అనే విరసం 28వ మహా సభల సందర్భంగా పాణి రాసిన కీనోట్ పేపర్ ఒక అవసరమైన చర్చలోకి ప్రగతిశీల శక్తులను ఆహ్వానిస్తున్నది. ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతీ నిర్మాణం గురించి ఆలోచించేవాళ్లందరూ దీన్ని చదవాలి. ఇందులోని విషయాలను పట్టించుకోవాలి. ఇందులో ప్రతిపాదిస్తున్నవిషయాల మంచి చెడ్డలను పరిశీలించడానికి, వాటి శాస్త్రీయతను అంచనా వేయడానికి, వాటిని ముందుకు తీసికెళ్లడానికి తప్పక చదవాల్సిన పేపర్ ఇది. సకల ప్రగతిశీల పోరాటాల సమన్వయానికి సాంస్కృతిక కోణం అవసరం. దానికి సంబంధించిన అనేక సరళమైన ప్రతిపాదనలు ఈ పత్రంలో ఉన్నాయి. కొన్ని ప్రతిపాదలనకు వివరణలు కూడా ఉన్నాయి.
సామాజిక ఉత్పత్తి అయిన సంస్కృతిని చాలా సీరియస్ గా పట్టించుకోవాలి. ఇప్పడు అలాంటి సందర్భంలో మనమున్నాం. సంస్కృతి కేవలం మనిషి మానసికత లోంచి ఉద్భవించేది కాదు. సామాజిక సంబంధాల్లో నుంచి నిరంతరం ఉత్పత్తి అయ్యే భౌతిక వాస్తవం. అంటే, సమాజం లాగే సంస్కృతి కూడా మారుతూ ఉంటుంది. దీన్ని పట్టించుకోకుంటే ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించడం సాధ్యం కాదు. సమాజాన్ని చైతన్యయుతంగా మార్చడమంటే సంస్కృతిని కూడా మార్చడం.
సంస్కృతిని మార్చాలన్నప్పుడు సంస్కృతికి గల చరిత్రను అధ్యయనం చేయాలి. వివిధ చారిత్రక దశలలో సంస్కృతీ పరిణామాలను కూడా అధ్యయనం చేయాలి. సంస్కృతి గల అంతర్గత నిర్మాణ వ్యవస్థను, దానికి బైటి సామాజిక వ్యవస్థలతో ఉండే సంబంధాలను పరిశీలించాలి. ఈ గతితార్కిక ప్రభావాల నుంచే సంస్కృతీ పరిణామాలను సమగ్రంగా అర్థం చేసుకోగలం.
స్పష్టమైన రాజ్యాధికార స్పృహతో దోపిడీ రాజకీయార్థిక పునాదిని మార్చే వర్గ పోరాటంతో సహా కుల, పితృ స్వామ్యాల వంటి సకల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా సాగే ప్రజా(స్వామిక) పోరాటాలను అధ్యయనం చేయాలి. అవి సృష్టించే ప్రత్యామ్నాయ )సంస్కృతులను, చరిత్ర క్రమంలో వాటి పరిణామాలను శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. గతంలో ప్రత్యామ్నాయ సంస్కృతికి దోహదపడ్డ పోరాటాలు కాలక్రమంలో ఎలా మారాయో, లేదా ఎలా కనుమరుయ్యాయో, ఆధిక్య సంస్కృతిలో కలిసిపోయాయో పరిశీలించాలి. ప్రగతి వ్యతిరేక పాలకవర్గ సంస్కృతే ఎందుకు పైచేయి సాధిస్తున్నదో కూడా మనం పరీక్షించాలి. సకల సామాజిక రంగాల్లోని శాస్త్ర విజ్ఞానాల సారాన్ని క్రోడీకరించుకొని ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని నిర్మించుకునే పోరాటాలన్నింటినీ సమన్వయ పరుచుకోవాలి. దానికి అవసరమైన శాస్త్రీయ పునాదిని పటిష్టపరచుకోవాలి.
సంస్కృతి అధ్యయనంలో సామాజిక అస్తిత్వం, మానవ చైతన్యాల మధ్య సంబంధం చాలా కీలకం. అదే దృక్పథాన్ని నిర్నయిస్తుంది. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో నక్సల్బరీ విస్పోటనం వర్గ పోరాటాన్ని మరింత నిర్దిష్టతలోకి నడిపించాక దృక్పథంలో మార్పు వచ్చింది. గ్రామం కేంద్రంగా, గ్రామంలో అత్యంత పీడితులు, శోషితులైన (దళిత) ప్రజలే కేంద్రంగా వర్గపోరాటం మొదలైంది. ఇది మన సామాజిక అస్తిత్వానికి, చైతన్యానికి ఉన్న సంబంధంలోంచి కొత్త సంస్కృతి నిర్మాణానికి దోహదం చేసింది. అయితే ఈ పోరాట ఆచరణను ఎప్పటికప్పుడు సిద్ధాంతీకరించలేకపోవడం ఒక వెలితి. దీని వల్ల పాత సైద్ధాంతిక అవగాహనలే చలామణి అయ్యాయి. ఈ సమస్య ఇటీవలి దాకా ఉన్నది.
ఈ నేపథ్యంలోంచి విరసం సంస్కృతీ కీ నోట్ పత్రాన్ని చూడాలి. మానవ జీవితంలోని సాంస్కృతీ ఆచరణ కోణాన్ని అంటిపెట్టుకొని ఈ పత్రం సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసింది. అందువల్ల అటు సిద్ధాంత రంగానికే పరిమితమైన వాళ్లు, ఆచరణలో ఉంటూ సిద్ధాంత కృషి చేస్తున్నవాళ్లు కూడా ఈ చర్చలో పాల్గొనడం వల్ల మన సంస్కృతీ అధ్యయనానికి మేలు చేస్తుంది.