‘ప్రజలు స్వేచ్ఛ కోరుతున్నారు’

పన్నెండేళ్ల పాలస్తీనియన్‌  బాలుడు పాడిన  పాట

(అబ్దుల్‌ రహ్మాన్‌ – ఇష్టంగా అందరూ పిలుచుకునే అబ్దుల్‌ 2021లో గాజాకు చెందిన 11 సంవత్సరాల పసిబాలుడు. ఇరవైలక్షలమంది పాలస్తీనియన్లు నివసించే గాజా స్ట్రిప్‌ ` (సముద్రతీరాన ఒక అంచువంటి భూఖండిక) చుట్టూ గాజాపై బ్లాకేడ్‌ విధించిన ఇజ్రాయిల్‌ భూభాగం చుట్టూ ఒక ఎత్తైన గోడ నిర్మించి గాజానొక బహిరంగజైలుగా మార్చింది. దశాబ్దాలుగా అత్యంత జనసమ్మర్ధం గల ఆ ప్రాంతంలో విమానదాడులు చేస్తూ ఇజ్రాయిల్‌ అలవిగాని హింసావిధ్వంసాలు సాగిస్తున్నది. ముఖ్యంగా 2007లో అక్కడ హమాస్‌ అనే మిలిటెంటు సంస్థ ఎన్నికలద్వారా  అధికారానికి వచ్చినప్పటి నుంచీ మొదలుకొని అమెరికా యూరపు అగ్రరాజ్యాలన్నీ హమాస్‌ను ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని సమర్థించే టెర్రరిస్టు సంస్థగా పేర్కొని ఈ దాడులను సమర్థిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్రమోడీ ప్రభుత్వం కూడ ` హమాస్‌ను ఒక టెర్రరిస్టు సంస్థగానే చూస్తున్నది. ఇజ్రాయిల్‌ గాజాపై విధించిన బ్లాక్‌డేను , దాడులను, విధ్వంసాన్ని సమర్థిస్తున్నది. తన బాల్యం నుంచీ ఈ దాడుల్లో, విధ్వంసంలో, శిథిలాల్లో నివసిస్తున్నది అబ్దుల్‌ రహ్మాన్‌ కుటుంబం.  అద్భుతమైన స్వరమున్న ఆ పిల్లవాడు మొదట అరబిక్‌లో ర్యాప్‌గాయకుడుగా 2021లో గాజాలోని పాలస్తీనా ప్రజలకు శాంతి ప్రేమ సందేశాలు వినిపించి  విశేషంగా వచ్చిన స్పందనతో ప్రేక్షకుల, శ్రోతల కోరికతో ప్రపంచానికంతా చేరగల ఇంగ్లిషుభాష ద్వారా తన పాటలు పాడి ర్యాప్‌ మ్యూజిక్‌ వీడియో విడుదల చేసాడు. ఇందులో ఆ బాలుడు పాడిన పాటలు చాల ఉన్నాయి గానీ అతని ఉచ్చారణా వేగం వల్లా, ఒక్క పాటకు తప్ప ఎక్కడా నాకు లిఖిత వాచకం లభించనందువల్ల ఒక్క పాట అనువాదం మాత్రం కింద ఇస్తున్నాను. లిఖిత వాచకం ఇంగ్లిషులో పాఠాంతరాలుగా కూడ ఉండవచ్చు. విని రికార్డు చేసిన శ్రోతల గ్రహణశక్తిలో కూడ వైవిధ్యం ఉండవచ్చు. ఆ పాటలను, ర్యాప్‌ గానాన్ని పరిచయం చేస్తూ, ఆ విధ్వంసం, శిథిలాలు చూపుతూ 2021లో ఆ బాలుడు ఉపోద్ఘాతంగా ఈ మాటలు చెప్పాడు.

‘‘నా పేరు అబ్దుల్‌ రహ్మాన్‌. నేను గాజా ప్రాంతంలోని 11 సంవత్సరాల బాలుణ్ని. నా కుటుంబ ప్రోత్సాహంతో ఈ ర్యాప్‌ సంగీతం  కూర్చాను. నేను శాంతిని వ్యాపింప చేయదల్చుకున్నాను. మేం కాన్‌ఫ్లిక్ట్‌ ఏరియా (సంఘర్షణాయుత ప్రాంతం)గా గుర్తింపబడిన ప్రాంతంలో నివసిస్తున్నాం. అయితే ఇక ముందు మా గాజా అట్లా పిలవబడకూడదని మా ఆకాంక్ష. మేము స్వేచ్ఛ కోరుతున్నాం.  నా మాతృభాష అరబిక్‌ ఐనా అందుకే నేను ప్రపంచానికంతా ప్రేమ, శాంతి సందేశాన్ని ర్యాప్‌ మ్యూజిక్‌ ద్వారా అందించడానికి ఇంగ్లిషును ఎంచుకున్నాను. నా అరబిక్‌ పాటలను గాజా ప్రజలు విని నన్ను ప్రోత్సహించారు. పాలస్తీనా ప్రజలు ప్రపంచం నుంచి శాంతిని, ప్రేమను కోరుతున్నారు. మా బయటి ప్రపంచంలో ప్రజలకున్న స్వేచ్ఛ, శాంతి మాకు కూడ కావాలని మేం కోరుతున్నాం. నేను ర్యాప్‌సింగర్‌ను. స్టార్‌ ర్యాప్‌ సింగర్స్‌ పాటలన్నీ విన్నాను. నేను కూడ ఒక స్టార్‌ ర్యాప్‌ సింగర్‌ నయి ప్రపంచానికి శాంతి ప్రేమ సందేశం వినిపించాలనుకుంటున్నాను.’’ అని రెండేండ్ల కింద ఆయన పాడిన వీడియో మన సామాజిక మాధ్యమాల్లో ఈ అక్టోబర్‌ 7 హమాస్‌ ఇజ్రాయిల్‌పై ఏరియల్‌ దాడి తర్వాత వైరల్‌ అయింది.

పాఠకులందరూ స్వయంగా ఆ బాలుడు ర్యాప్‌ మ్యూజిక్‌లో మనకిచ్చిన శాంతి ప్రేమసందేశాన్ని తప్పకుండా వింటారనే  ఆకాంక్షతో కేవలం పరిచయం కోసం ఈ ప్రయత్నం. అక్టోబర్‌ 7 తర్వాత ఇజ్రాయిల్‌ గాజాపై ప్రకటించిన యుద్ధంలో ఈ బాలుడు బతికే ఉన్నాడా అని ఊహించుకోవడానికే భయంగా ఉంది.)

నేను పూర్తిగా అలసిపోయాను
నిన్నరాత్రి నేను నిద్రపోలేకపోయాను
కాని నిద్రకు జోగినపుడు మాత్రం
నా కలల్లో బాంబులశబ్దాలు విన్నాను
ఒక పీడకల వంటి స్థితి

వాళ్లంత దుర్మార్గంగా ఎలా ఉండగలరు
పిల్లల్ని అమాయకప్రజల్ని అమరుల్ని చేస్తూ
బాంబులు పడతాయని అనుకుంటున్నాం
కాని ఈసారి ఎక్కడనో ఊహించలేక
నా గదిలో ఒకమూలకు నక్కి
కూలుతున్న భవనంలో
నా తమ్ముణ్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను
అణచివేయబడిన వారి సంకల్పం తప్ప
ఇప్పటిదాకా దీనిని కాపాడిరది ఏమీ లేదు
ఈ కాలంలో నివసిస్తూ
పాలస్తీనియన్‌ ప్రజల భావాలను
ఉత్తేజపరచడానికి
నా లయబద్ధ గేయాలతో
బాంబునెదుర్కుంటున్నాను
నా తలమీద మేఘాల్లో వేళ్లాడుతూ
దాగున్నదేమిటి?
మా తండ్రి (మాకోసం) రొట్టె కొనడానికి
ప్రాణాలకు తెగించి బయటికి పోయాడు
నా పన్నెండో ఏట ఇది నాలుగోయుద్ధం
ఈ దశలో నేను స్తబ్ధుణ్నయ్యాను
లేదు ` నేను భయపడలేదు
నేను క్షేమంగా ఉండడానికి
ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు
ఈ ఇల్లే నా బొందలగడ్డ అయినాసరే

నేను ధైర్యంగా ఉన్నాను
ప్రజలకు నేను స్వేచ్ఛ కోరుతున్నాను
ఈ స్థలంలో గోడలకీవల నిలబడి
ఇరవైలక్షలమంది (యుద్ధ) ఖైదీలు
బిగ్గరగా అరుస్తున్నారు
కాని ఏమీ మార్పు లేదు
ఆక్రమణలో ఉన్న జీవితం అటువంటిది
ఆవేదనతో భయభీతావహులై
తల్లులు రోదిస్తున్నారు
వీథుల్లో పడి ఉన్న దేహాల మీద
తెల్లని బట్టలు కప్పారు
భవనాలు బూడిదగా మారిపోయాయి
కాని నా మనసు ఉక్కుతో చేయబడిరది
అందుకని నా గాయం మానడానికి
ఎక్కువ సమయం పట్టదు
జీవించే సంకల్పాన్ని వదులుకోం
మతులు పోగొట్టుకోం

మా చిన్నమ్మ తన ఇల్లు పోగొట్టుకున్నది
అంటే ఆమె జీవితాశ్రయమే పోయింది
కాని ఆమె ఇంకా జీవించి ఉన్నది
బాంబుల మోతతో విభ్రాంతికి గురయింది
ఆ రాత్రి కురిసిన బాంబులతో
నా చెల్లెలు నిద్రపోలేకపోయింది
ఆమె కేకలను ఆపే ప్రయత్నంలో
బయట పటాకులు కాలుస్తున్నారని చెప్పాను నేను
ఆమెకు నేను అబద్దాలు చెప్తున్నాను
కారుణ్యం ఎక్కడుంది ఇది హృదయరాహిత్యం
వాళ్లు మమ్మల్ని అంధకారంలో ఉంచాలనుకుంటున్నారు
గంటలకొద్దీ నీళ్లు రాకుండా ఆపి
విద్యుత్తు రాకుండా ఆపి
వాళ్లు భవన శిఖరాలను గురిచూసి కొడుతున్నారు
కాని వాళ్లు నా కలంలో ఉన్న శక్తిని పడగొట్టలేరు
నేను రాస్తున్నపుడు నన్నెవరూ ఆపలేరు
మైక్రోఫోన్‌ ఒక్కటే తప్పించుకోవడం
సాధ్యమయ్యే మార్గం
ఎందుకంటే అదొక్కటే నేను
నా మనసులో ఉన్న విషయాలు చెప్పే సాధనం
పోరాటయోధుడు
ఈరాత్రి నిద్రిస్తున్నట్లు ఎట్లా నటించగలడు
అతనికి తెలుసు
అతడు అకస్మాత్తుగా ఈ నగరాన్ని
మీటనొక్కి తలకిందులు చేయగలడు
మీటనొక్కి కుటుంబాలను చంపేయగలడు
నేను ప్రజలకు స్వేచ్ఛ కోరుకుంటున్నాను
ఈ స్థలంలో ఇరవై లక్షలమంది
(యుద్ధ) ఖైదీలు 
గోడదగ్గర నిలబడి బిగ్గరగా అరుస్తున్నారు
కాని ఎంతకూ ఏమీ మారడం లేదు
ఆక్రమణలో ఉన్న జీవితం అటువంటిది
నేను ప్రజలకు స్వేచ్ఛ కోరుతున్నాను.

2 
హమాస్‌  సాహసం - పసివాని పాట

అక్టోబర్‌ 7 వేకువజామున్నే నరేంద్రమోడీకి
ఒక పీడకల వచ్చింది 
తాను తన జియోనిస్టు మిత్రుడు నెతాన్యాహు
మధ్యధరా సముద్ర తీరాన
పాదరక్షలు లేకుండా నడక యోగా చేస్తున్నారు
తాను నేర్పుతున్నాడు ఆయన నేర్చుకుంటున్నాడు
తనకంత అధునాతన సాంకేతిక జ్ఞానాన్ని ఇచ్చిన
ఆయనకు తనకు తెలిసిన యోగా ఒక్కటి
నేర్పకపోతే ఎట్లా
కాని ఒక్కసారిగా కాళ్లకింది ఇసుకను తొలుస్తూ
అది సముద్రం నీరేనా - చమురా
పాలస్తీనియన్‌ కార్మికుల రక్తంతో తడిసిన చమురు -
ఎంతో జిగటగా మొసలిలా లాగేసుకుంటున్నది
జారిపోతూ పడిపోతూ ఆకాశంలోకి చూస్తే
వేలకొద్ది పావురాలు వేటగాని వల కొరికి
విహాయసంలోకెగిరినట్లు
ప్రతి పావురం నోటా రెండాకుల ఆలివ్‌కొమ్మ
కాని తనకేమో
ఎవరో మృత్యువు గాజుపట్టీ నుదుట
కట్టుకొని నేలమీంచి సముద్రం మీంచి
ఆకాశంలో కెగిరి రాకెట్ల వలె దూసుకొస్తున్నట్లు
ముచ్చెమటలు పోసి మేలుక వచ్చింది
నిలువెల్లా తడిసిన మాట  నిజమే
కాని అది చమురు సముద్రపు ఉప్పన కాదు
ఆధిపత్య భావజాల విద్వేష వాసన -
అవును తాను భారత ప్రధాని కదా
భయమెందుకు ఎంత జనమేజయునంతటి
రక్షణలో ఉన్నాడు - పావురాలకు
ఆలివ్‌ ఆకులకు భయపడడమేమిటి?
కాని మెల్లగా స్పృహలోకి వస్తున్నాడు
పాలకవర్గ చైతన్యం లోకి వస్తున్నాడు
మనిషిగా తనకేమీ భయమక్కర్లేదు
అధికారం గానే భయంగా ఉంది -
తనకోసమే కాదు తనవాళ్లందరి కోసం -
యోగా ఇచ్చి మెగా రక్షణ ఆయుధాలు పొందిన
తన రాజ్యం ఇవుడేం కావాలి -
దండకారణ్యం లోకి పంపడానికి మానవరహిత
విమానాలు
అసమ్మతిని అనుమానించడానికి
పెగాసిస్‌ ప్రజ్ఞా పాటవాలు -
ఈ సముద్ర తీరాన్నేకదా దేశాధినేతలుగా
రహస్య ఒప్పందం చేసుకున్నది -
ఏమయింది ఈ ప్రపంచాన్నే పసిగట్టగలిగిన
ఇజ్రాయిల్‌ ఇంటెలిజెన్స్‌
అమెరికా యూరపు అండతో అరబ్బు దేశాల
పాలకులను లొంగదీసుకుంటున్న మిలిటరీ ఒప్పందాలు-
అమెరికాకు ఇజ్రాయిల్‌ భారత్‌ రెండుకళ్లనుకున్నానే
ఇంక నిన్నటిదాకా పాలస్తీనాతో ఉన్న ఇండియా కాదు
ఇపుడు భారత్‌ పూర్త్తిగా ఇజ్రాయిల్‌ పక్షం ఉంటుందని చెప్పాలి -
కాని ఇండియాలోని ప్రజలంతా ఇంకా భారతీయులు 
కాలేదు కదా - టుక్డే టుక్డే గ్యాంగులు -
ఈ ప్రజల్ని రద్దుచేసి మళ్లీ ప్రజల్ని ఎన్నుకునే దాకా
ఇజ్రాయిల్‌ను నేనే కాపాడుతాను -
పిరికితనానికి వాగాడంబరం అబ్బుతుంది
ప్రజల్ని ఎప్పుడూ అడగలేదు -
మూకఓటుతో కశ్మీరు అస్తిత్వాన్ని రద్దుచేసాడు
టెర్రరిస్టు గాజానెదుర్కోడానికి  భారత్‌
ఇజ్రాయిల్‌కు అండగా ఉంటుందని ఎక్స్‌ పై ట్వీట్‌ చేసాడు
మోడీ హామీపడ్డాడు
గోడీమీడియా గోల చేస్తున్నది-
రెండు రాజ్యాలకు అమృతోత్సవ వేళ
ఒక విషమ పరీక్ష అయింది -
ఇజ్రాయిల్‌ బాంబునెదుర్కుంటానన్న 
బాలుడు పాడుతున్నాడు వినండి
అణగారిన ప్రజల సంకల్పంకన్నా
శక్తివంతమైంది ఏదీ లేదు
నా లయబద్ధమైన గేయాలతో
ఈ కాలంలో జీవిస్తున్న పాలస్తీనియన్ల
భావాలనుత్తేజ పరచి
(ఇజ్రాయిలీ) బాంబుల్ని తిప్పికొడతాను
ఆ మేఘాల్లో దాగి నా నెత్తిమీద వేళ్లాడుతున్నదేమిటి?
నా ఈ పన్నెండో ఏట ఇది నాలుగవ యుద్ధం
మా ఇల్లే నా బొందలగడ్డ
అయినాసరే నేను సాహసిస్తాను
నా ప్రజలకు స్వేచ్ఛ కావాలి
ఇక్కడ ఇరవైలక్షల మంది
(యుద్ధ) ఖైదీలున్నారు
ఆక్రమణలో ఉన్న జీవితాల్లో మార్పేమీ ఉండదు
(అందుకే) నా ప్రజలకు స్వేచ్ఛ కావాలి
‘‘ఆక్రమణలో ఉన్న నా ప్రజలకు స్వేచ్ఛ కావాలి’’

 12.10.2023

Leave a Reply