20 జులై 2023 నుండి వర్తమాన లోకసభ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాలలో అటవీ సంరక్షణ చట్టం, 1980కి గత సంవత్సరం 2022 జూన్ 28 నాడు ఆర్దినెన్స్ రూపంలో రూపొందించిన అటవీ నియమాలకు చట్ట రూపం ఇవ్వడానికి ఆ బిల్లును మొదట లోకసభలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఆగస్టు 2నాడు రాజ్యసభలో ఆమోదం పొందడంతో చట్టం ఉనికిలోకి వచ్చింది.
చట్టం పూర్వాపరాలు:
మన దేశంలో బ్రిటిష్ వారి హయాంలో రూపొందిన అటవీ సంరక్షణ చట్టం 1927ను ఆధారం చేసుకొని అధికార మార్పిడి తరువాత అటవీ సంరక్షణ చట్టం, 1980 ఉనికిలోకి వచ్చింది. ఆ చట్టం అడవులను రెండు రకాలుగా రిజర్వు, ప్రొటెక్టివ్ అడవులుగా విభజించి, అడవుల వినియోగంలో అనేక నియమాలను రూపొందించింది. అంతేకాదు, ఆ చట్టం దేశం లోని అడవులను సంయుక్త జాబితాలోకి మార్చింది. అప్పటి వరకు మన దేశ అడవులు రాష్ట్రాల జాబితాలో వుండేవి. నిజానికి ఈ చర్య కేంద్ర ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దేశంలో వల్లెవేసే ఫెడరల్ విధానాలపై గొడ్డలిపెట్టులా పని చేసింది. ఆ చట్టం అమలులోకి వచ్చిన దశాబ్ద కాలానికి మన దేశంలో సామ్రాజ్యవాద నూతన ఆర్జిక విధానాల అమలు ప్రారంభమై అడవుల విధ్వంసాన్ని అవి వేగవంతం, తీవ్రతరం చేశాయి. ఆ క్రమంలో 2014లో భాజపా నాయకత్వం లో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన మోదీ ప్రభుత్వం అత్యంత దూకుడుగా సామ్రాజ్యవాద ప్రాయోజిత ఆర్జిక విధానాల అమలుకు పూనుకుంది. మోదీ ముందుకు తెచ్చిన “మేక్ ఇన్ ఇండియా” స్టాగ్ షిప్ ప్రోగ్రాంకు ఆటంకంగా వున్న ముందరి ప్రతీ చట్టాన్ని, నియమాలను, పద్ధతులను, సంప్రదాయాలను “సులభతర వ్యాపారాన్ని” ప్రోత్సహించడంలో భాగంగా తుంగ లో తొక్కుతూ విధ్వంసకర విధానాలతో పరుగులు పెడుతున్నాడు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ 28 నాడు “అటవీ సంరక్షణ చట్టం, 1980” కి సవరణల రూపంలో అనేక నియమాలను రూపొందిస్తూ ఆర్దినెన్స్ ను ముందుకు తెచ్చింది.
బిల్లు రూపొందడం వెనుకగల శక్తులు:
మన దేశంలో జరుగుతున్న ప్రతీ మార్పును అర్థం చేసుకోవడానికి ముందుగా దేశ పాలకవర్గాల స్వభావాన్ని అర్ధం చేసుకోవాలి. దానిని నిశితంగా అర్థం చేసుకోకుండా ఏ మార్పూను, మార్పుల వెనుక పని చేస్తున్న శక్తులను, వాటి ప్రయోజనాలను అర్ధం చేసుకోలేరు. వర్తమాన చట్టాన్ని అర్ధం చేసుకోవడానికి కూడ ఆ పని చేయాల్సిందే. మన దేశంలోని అడవులను హస్తగతం చేసుకోవడానికి, అడవులలోని అపార, అమూల్య ప్రాకృతిక సంపదలను, అనేక రకాల వనరులను కైవశం చేసుకోవడానికి దోపిడీ శక్తులు అటవీ మాఫియా, పూర్వ అటవీ శాఖ ఉన్నతాధికారులు, భారీ కార్పొరేట్ శక్తులు ఒక కూటమిగా కుమ్మక్కై తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నవి. మరోవైపు, ఏనాటికానాడు చైతన్యవంతులవుతున్న మూలవాసీ ప్రజలు ఆ శక్తులను వారి దోపిడీని తీవ్రంగా, సమరశీలంగా వ్యతిరేకిస్తున్నారు. అనుకూల, ప్రతికూల శక్తుల మధ్య సంఘర్శన కొనసాగుతోంది. కానీ, ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెడుతూ భారత రాజ్యంగ యంత్రం పాలకవర్గాల కొమ్ముకాస్తూంది. ప్రజా పోరాటాల ఫలితంగా ఉనికిలోకి రాకతప్పని 1996నాటి పెసా (షెడ్యూల్డ్ ప్రాంతాలలో పంచాయతీల విస్తరణ చట్టం), అటవీ హక్కుల (గుర్తింపు) చట్టం, 2006 మున్నగు చట్టాలు, వివిధ సందర్భాలలో ప్రభుత్వాలు విధిగా రూపొందించిన నియమాలు తుదకు పాలకవర్గాల ప్రయోజనాలకు బలై పోతున్నాయనడానికి వర్తమాన చట్టం ఒక ప్రబల ఉదాహరణ.
బిల్లుపై ప్రజా నృందన-జేపీసీ ప్రతిక్రియ:
కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిన నియమాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ప్రజల ముఖ్యంగా దేశ మూలవాసీ ప్రజల నిరసన వ్యక్తమైంది. మూలవాసీ ప్రజల సంఘాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు మాత్రమే కాకుండా నిజానికి ఈ నియమాలు రూపొందిన నాటి నుండే దేశభక్త పర్యావరణవాదులు, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజాస్వామిక వాదులు, అనేక సంఘాలు, ప్రజాహిత మేధావులు, ఆదివాసీ శ్రేయోభిలాషులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతేడు ప్రభుత్వం రూపొందించిన నిబంధనాలతో ఎదురవనున్న ప్రమాదాలను ఏకరువు పెడుతూ వాటిని పరిశీలించడానికి బిల్లును సంయుక్త పార్టమెంటరీ కమిటీకి పంపాలనీ, యూపీఏ పాలనలోని పర్యావరణ మంత్రి జైరాం రమేశ్ ప్రతిపాదించాడు. బీజేపీ ఎం.పీ. రాజేంద్ర అగర్వాల్ నేతృత్వంలో దానిపై ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దేశ ప్రజల నిరసనను, వారి నిరసనలలోని వాస్తవాలను నిరాకరిస్తూ బిల్లు ఆమోదానికి పచ్చజెండానూపుతూ ప్రజల ముఖ్యంగా మూలవాసుల ఆకాంక్షలను బుట్టదాఖలు చేసింది.
అభ్యంతీరాలు-ఆందోళనీలు:
విశాల భూఖండాలను అటవీయేతర ప్రయోజనాలకు వినియోగిస్తే జీవావరణం దెబ్బ తింటుందనీ 2019లోనే కేంద్ర ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వశాఖే అభ్యంతరాలు, ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లు రూపొందిన పిదప దేశ వ్యాప్తంగా వున్న మూలవాసీ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ బిల్లు చట్టబద్దతను సవాలు చేస్తూ రాజ్యాంగ నిపుణులు న్యాయాలయాలను ఆశ్రయించారు. ఈ బిల్లు రూపొందడంపై జాతీయ ఆదివాసీ కమిషనర్ హర్ష్ చౌహాన్ తన అభ్యంతరాన్ని తెలిపాడు. కానీ, అలాంటివారిని తమ దారిలోకి తెచ్చుకోవడానికి హిందుత్వ శక్తులు అనుసరించే చతురోపాయాలు చివరకు ఆయన రాజీనామాకు దారి తీశాయి. దేశ వ్యాప్తంగా ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలలోని అడవులలో నివసించే లక్షలాది మూలవాసీ ప్రజలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తమ గ్రామసభల హక్కులను ఎత్తిపడుతూ దీర్దకాల ప్రజాందోళనలకు దిగారు. వారు పోలీసుల అణచివేత చర్యలను తీవ్రంగా ఎదుర్కొంటూనే ఈ బిల్లును ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు.
చట్టంపై చర్చలు భిన్న పార్టీల వైఖరులు:
పర్యావరణం, అడవులు, జలవాయు కాలుష్య నివారణ మంత్రి భూపేంద్ర యాదవ్ అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు, 2023ను చట్ట సభలో ప్రవేశపెట్టాడు. కర్చన ఉద్గారాల తగ్గింపు, అటవీ విస్తరణ కోసం, పర్యావరణం మరియు సామాజిక-ఆర్జిక అభివృద్ధి మధ్య సమతుల్యతను నెల్పకొల్పడంలో ప్రస్తుత నిబంధనలు అడ్డుగా వున్నాయంటూ, దేశ సరిహద్దులలో, దేశ భద్రత కోసం నిలిచిన సైనికులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో 1980నాటి అటవీ చట్టం అడ్డుగా వుందంటూ, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులకు నిబంధనలు వీలు కల్పించడం లేదంటూ పాలకపక్ష వైఖరిని వినిపించాడు. వారు తలపెట్టిన చట్టంలో ఏ ఒక్కటీ ప్రజలకు, అడవులకు, పర్యావరణానికి, దేశ అభివృద్ధికి, అభ్యున్నతికి హాని కలిగించేదే కానరాదన్నంత సంబురంతో, “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస” వకాల్తాదారులు దేశ ప్రజలను మభ్య పెట్టడానికి ఎంతో కసరత్తు చేశారు. బిల్లు ముందు లోకసభలో ఆమోదం పొందగా పిదప రాజ్యసభలో ఆమోదం పొందింది. ఫలితంగా, అటవీ (సంరక్షణ) బిల్లు – 1980గా పేరు సంతరించుకున్న వర్తమాన చట్టం అడవుల అభివృద్ధి కాదు సరికదా, అడవుల వినాశనానికి దారి తీస్తుంది. పాత చట్టానికి కొత్తగా అనేక ప్రజా వ్యతిరేక సవరణలు చేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. ఈ బిల్లుపై చర్చలో పాల్గొంటూ బీజూ జనతా దళ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ ప్రశాంత్ నందా, వర్తమాన సవరణలతో సరిహద్దు ప్రాంతాలలో అభివృద్ధి చోటు చేసుకుంటుంది అన్నాడు. కర్బన ఉద్గారాల విడుదలను జీరోకు చేర్చవచ్చనీ డాక్టర్ నమ్మ బలికాడు. బీజేపీకి చెందిన సుశీల్ మోదీ అడవుల సంరక్షణ మరియు అభివృద్ధి మధ్య గొప్ప సమతుల్యత సాధించవచ్చని బిల్లును తెగ పొగిడాడు. వై.ఎస్.ఆర్.సీ.పీ కి చెందిన ఎస్. నిరంజన్ రెడ్డి ఈ బిల్లు ఆమోదం పొందితే ఏకంగా దేశమే ప్రగతి పథంలో పరుగులు పెడుతుందనీ రక్షణ సంస్థలకు మేలు జరుగుతుందన్నాడు. ఈ కోవకు చెందిన వారే మరికొంత మంది సభ్యులు తమ కార్పొరేట్ బాస్ ల ప్రయోజనాల పక్షం వహిస్తూ బిల్లుపై చర్చలో పాల్గొని దానిని సమర్జిస్తూ చట్టం రూపం ఇవ్వడానికి తోడ్పడ్డారు.
మోదీ ప్రాపకానికి అర్రులుచాచే వై.ఎస్సార్.సీ.పీ లాంటి అంటకాగే పార్టీలు మినహ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అత్యధిక ప్రతిపకాలు సభను బహిష్కరించాయి. ప్రతిపకాలన్నీ మే నుంచి మండుతున్న మణిపుర్ పై ప్రధానమంత్రి మాట్లాడాలనీ సభల ప్రారంభం నుండి డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రతిపక్షాల డిమాండ్ ను లెక్క చేయకుండా అధికార పక్షం, దాని కొమ్ముకాసే స్పీకర్ లోకసభ కార్యకలాపాలను కొనసాగించారు. వాస్తవానికి ఈ చట్టం జులై 26నాడు _ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చోటుచేసుకోని కాలంలోనే పురుడుపోసుకున్నందున చెల్లనేరదనీ ప్రతిపక్షాలు తేటతెల్లం చేస్తున్నవి. కానీ, ప్రతిపకాలను ఎంత మాత్రం గౌరవించని మోదీ నిరంకుశ పాలనలో ఏ అడ్డూ, అదుపు లేకుండానే, సమగ్ర చర్చకు తావివ్వకుండానే కాణాలలో బిల్లులు చట్టరూపం ధరిస్తున్నవి.
చట్టంతో ఎదురుకానున్న దుష్ఫరిణామాలు 100 హెక్టార్లు కాని ఆపై బడిన అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాల కోసం వినియోగించాలంటే ఇప్పటివరకు గ్రామసభల అనుమతి పొందడం అనివార్యం. కానీ ప్రస్తుత చట్టంతో ఇప్పటి వరకు వున్న “100 హెక్టార్లు లేద అంతకు మించి” అనే నిబంధనను సవరించి “1,000 హెక్టార్లు ఆ పైన” అని మార్చారు. అంటే అంత పెద్ద మొత్తంలో అటవీ భూములను హస్తగతం చేసుకోవడానికి ఈ చట్టం గ్రామసభలను కాదనీ ప్రభుత్వానికి అనుమతిని ఇచ్చింది. కానీ, మొదట విశాల అటవీ భూభాగాల విధ్వంసాన్ని వ్యతిరేకించిన కేంద్ర మంత్రిత్వ శాఖ, ఆ శాఖామాత్యులు అర్జున్ ముండా మౌనం మోదీ ముందు మౌనం వహించాడు. నిజానికి ఆయన ఒక ఆదివాసీ అయితే తక్షణం కేంద్ర మంత్రి పదవీ, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. కానీ, కార్పొరేట్ కాసుల ఆశలో మునిగిన, హిందుత్వ శక్తుల భయం నీడల్లో బతికే వారికి ప్రజల, దేశ ప్రయోజనాలు దిగతుడుపే అవుతాయి.
అటవీ ప్రాంతంలో చేపట్టే ఏదైనా ప్రాజెక్టుకు అనుమతి కావాలన్నా, తుది ఆమోదం పొందాలన్నా, గ్రామసభ నుంచి ముందస్తు సమ్మతి తీసుకోవడం తప్పనిసరి అని 2009ఆగస్టు 3న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఒక ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. కానీ, మోదీసర్కార్ ఈ సర్క్యులర్ ను కార్పొరేట్ ప్రయోజనాలను ఆశించి 2017లో వెనక్కి తీసుకుంది. కానీ, ఆనాడు ఆ సర్క్యులర్ లోని గ్రామసభ అనుమతి కావాలన్న నిబంధనను మాత్రం మిగిల్చింది. దానికి ఇపుడు ఈ చట్టంతో గోరి కట్టింది.
మోదీ హయాంలో 2015-2020 మధ్య మన దేశ అడవులలో అక్షరాల ఆరు లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల (6,68,400) హెక్టార్ల అడవులు నాశనమైనాయి. ప్రభుత్వ రికార్డులలో మాత్రమే దేశంలో 77 లక్షల హెక్టార్లలో అడవులున్నాయి. కానీ, వాస్తవానికి అవి 55 లక్షల హెక్టార్లకు మించిలేవనీ పర్యావరణవాదులు తమ పరిశోధనల ద్వార నిరూపిస్తున్నారు. కేవలం మధ్య ప్రదేశ్ లోనే (ఈ రాష్ట్రం బీజేపీ అధికారంలోనే వుంది) త్రీ లక్షల హెక్టార్లలో అడవులు అంతరించిపోయాయి.
ఈ చట్టంతో 1996నాటి పెసా బలహీనపడి పోతుంది . అటవీ హక్కుల (గుర్తింపు) చట్టం,2006 పని చేయకుండాపోతుంది. ప్రజా పోరాటాల ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ రెండు చట్టాలు ఇకపై హుళ్లక్కే అవుతాయి. మన దేశంలోని 5వ షెడ్యూల్ ప్రాంతాలలో మూలవాసీ ప్రజలు . పెసా అమలు కోసం అత్యంత సమరశీల పోరాటాలు కొనసాగిస్తున్నారు. 2006 చట్టం ప్రకారం తమ పంట భూములకు పట్టాలు కావాలనీ మూలవాసులు, అడవులలో నివసించే ఇతర ప్రజలు పోరాడుతుంటే, 2019 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు పట్టాలు లేనివారిని అడవుల నుండి గెంటెయ్యాలనీ ఆదేశించి తన వర్గ స్వభావాన్ని చాటుకుంది. నిజానికి 13 యేళ్లు గడిచినా రాష్ష ప్రభుత్వాలు మూలవాసులకు పట్టాలు ఇవ్వడం లేదేంటి, తక్షణమే ఇవ్వాలని
న్యాయం చెప్పాల్సిన అత్యున్నత న్యాయస్థానం అన్యాయమైన తీర్పును ఇచ్చింది. ఆ తీర్పుపై ప్రజలు ఆగ్రహించి వీధుల్లోకి రావడంతో ఎన్నికల వేళ విధిలేక మోదీ ప్రభుత్వం ఆ ఆదేశాన్ని వాయిదా వేయించక తప్పలేదు.
ఇపుడేం చేయాలి?:
ఇది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న సవాల్. ఇదొక జీవన్మరణ సమస్య. ఇది కేవలం మూలవాసుల సమస్యే కాదు. దేశ ప్రజలందరూ ఆలోచించాలి. పాలకులు ఎప్పుడైనా తమ ప్రయోజనాల కోసం చట్టాలను రూపొందించినా, సవరించినా, తిరిగి వాటిని ప్రజల పోరాటాలను బట్టి సవరిస్తుంటారు, పోరాటాల తీవ్రతను బట్టి రద్దు కూడ చేస్తారనీ రైతు వ్యతిరేక సాగు చట్టాలే తెలుపుతున్నాయి. కాబట్టి ఈ రోజు పోరాట ప్రజలు ముఖ్యంగా మూలవాసీ ప్రజలు ప్రభుత్వం నూతన అటవీ చట్టాన్ని రద్దు చేసేంతవరకు దృఢంగా రాజీలేని పోరాటాలను చేపట్టాలి. ఈ చట్టాన్ని సమర్ధించిన అన్ని రాజకీయపార్టీలను ఎన్నికల వేళ గ్రామాల నుండి తన్ని తరిమి బుద్ధి చెప్పాలి.
అనుభవం:
ఇక్కడ మనం గతాన్ని గుర్తు చేసుకుందాం. మా చిన్నతనంలో 1980ల ప్రారంభంలో మా ప్రాంతంలో అటవీ భూముల పట్టాల కోసం మా ముందు తరాల వారిని అన్ని రాజకీయ పార్టీల వాళ్లు పట్టణాలకు, రాజధాని నగరాలకు, అధికారుల వద్దకు తరచుగా తరలించి ఓట్లు సొమ్ము చేసుకునేవారు. ఆ సమయంలో మా ప్రాంతానికి విస్తరించిన విప్లవోద్యమం కూడ ఓట్ల రాజకీయాలను దూరంగా పెట్టి భూమి పట్టాల కోసం పట్టణాలకు, అధికారుల వద్దకు తరలించి ర్యాలీలు, మోర్బాలు తీయించింది. కానీ, వారికి అనతికాలంలోనే అటవీ సంరక్షణ చట్టం 1980 తో భూములకు పట్టాలు ఇవ్వడం నిలిచిపోయిందని అర్థమై వారు వెంటనే ప్రజలకు ఒక పోరాట నినాదాన్ని అందించారు. “భూమి పట్టాలు లేకున్నా, పంట భూములు వదిలేది లేదు”,“భూములు వదలం-పంటలు వదలం” నినాదాలతో దండకారణ్యం దద్ధరిల్లింది. పర్యవసానం గా పెసాలు, అటవీ హక్కుల (గుర్తింపు) చట్టం, 2006 వెలుగుచూశాయి. కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు, బాధలు తప్ప! ప్రజా పోరాటాల ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమనీ తమ ఆచరణ ద్వారా దారులు పరిచిన దండకారణ్య ప్రజా పోరాటాల మార్గాన్ననుసరించడం మినహ దోపిడీ చట్టాల రద్దుకు మరే దగ్గర దారి లేదనీ ఈ అనుభవం వెల్లడిస్తున్నది.