పర్స్ పెక్టివ్స్ సంస్థ ప్రచురించిన అనువాద వ్యాసాల సంకలనం ‘భిన్న దృక్పథాలు’ భారత విప్లవోద్యమం చేస్తున్న ప్రజాయుద్ధం గురించి అసమగ్రమైన, స్వీయాత్మకమైన, ప్రజా వ్యతిరేకమైన, వర్గ సామరస్యపూరితమైన వ్యాఖ్యలు చేసింది. కొన్ని వ్యాసాలు, కొన్ని అంశాలు మినహాయిస్తే, ప్రధానంగా, దేశ విశాల పీడిత ప్రజల దృష్టికోణంతో విప్లవోద్యమం కార్యాచరణను చూడలేకపోయింది. ప్రజల విముక్తి కోసం తప్పనిసరి అయిన విప్లవ దృక్పథం నుంచి అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు. సామాజిక మార్పు కోసం జరుగుతున్న లోతైన విప్లవ క్రమం గురించి చర్చించేందుకు అవసరమయిన వర్గ దృష్టితో విషయాలను విశ్లేషించలేదు. ఇది వర్గాల మధ్య సాగుతున్న యుద్ధంగా కాకుండా, మనుషుల మధ్య సాగుతున్న యుద్ధంగా చూసింది. దాంతో విప్లవానికి, ప్రతీఘాతుక విప్లవానికీ మధ్య తేడా చూడలేకపోయింది.
మౌలికంగా ఈ పుస్తకంలో అత్యధిక వ్యాసాలు ‘విప్లవ హింస’ గురించి చర్చించాయి. ఈ వ్యాసాలు చదివితే, వ్యాసకర్తలకు ప్రస్తుత వ్యవస్థలో ‘హింస’ గురించే కాకుండా ‘ప్రజాస్వామ్యం’ గురించి ఉన్న అవగాహన పట్ల కూడా మనకు అనుమానాలు కలుగుతాయి. భారతదేశంలో ప్రజలపై బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం హింసాత్మక ఉక్కుపాదం మరింతగా బిగుసుకుంటూ ప్రజలకు విప్లవం తప్ప మరో దారి లేదని మరింత స్పష్టమవుతున్న ప్రస్తుత పరిస్థితిని ఎంత మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా చేసిన ఈ సూత్రీకరణలు ప్రజలకు గానీ నిజమైన ప్రజాస్వామ్యానికి గానీ ఎంత మాత్రం ఉపయోగపడవు. పైగా పాలక వర్గాలకే ఉపయోగపడతాయని చెప్పక తప్పదు.
ఈ పుస్తకంలో ముఖ్యమైన అంశాల గురించి చర్చించే ముందు, ఏ దేశానికయినా విప్లవ పార్టీ ప్రాముఖ్యత ఏంటనేది చూద్దాం.
ఇది వర్గ సమాజం. ఇందులో ఎవ్వరికీ సందేహం ఉండదు. వర్గ సమాజం అంటేనే, ఒక వర్గం మరో వర్గంపై దోపిడీ, పీడన, అణచివేత అధికారం నెరపడం. అందుకోసం రాజ్యహింస (బలం)ను ప్రయోగించడం. ఈ రాజ్యాంగ యంత్రం చేసే బలప్రయోగం ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలన్నింటిలోనూ ఉంటుంది. దీనిని ‘హింస’ అనడంలో ఎవరికీ అభ్యంతరం ఉండనక్కరలేదు. ఈ మౌలిక అవగాహనతో ఏకీభవించినప్పుడు, దోపిడీని రూపుమాపి, తమ బతకులు తాము బతకాలంటే, దోపిడీకి గురి అయ్యే వర్గం ‘హింస’ ప్రయోగించక తప్పదు. దీనికి ఏం పేరు పెట్టుకున్నా గానీ ఇది మాత్రం అనివార్యం. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ ‘హింస’ లేకుండా ఏ సమాజ పరివర్తన జరగలేదన్నది చారిత్రక సత్యం.
“Freeman and slave, patrician and plebeian, lord and serf, guild-master and journeyman, in a word, oppressor and oppressed, stood in constant opposition to one another, carried on an uninterrupted, now hidden, now open fight, a fight that each time ended, either in a revolutionary reconstitution of society at large, or in the common ruin of the contending classes.” అన్నారు మార్క్స్, ఎంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళికలో.
ప్రజలకు నిజమైన సమానత్వాన్ని, జీవితాన్ని అందించే నిజమైన ప్రజాస్వామిక సమాజం ఏర్పడేందుకు స్పష్టమైన విప్లవ నిర్మాణాలు చేసే ‘హింస’ విధానపరమైనది. ఇది సాధారణ అర్థంలో ‘హింస’ కాదు. సామాజిక మార్పు అవసరం లేదని భావించే వారి మాట పక్కన పెడితే, అవసరం అని భావించి, సమాజం గురించి ఆలోచించి, విశ్లేషించే ఈ వ్యాసకర్తలు ఈ ప్రాథమిక, మౌలిక అంశాన్ని గుర్తించాలి. లేదంటే, ఈ విశ్లేషణలు సాధారణ అకడమిక్ అధ్యయనాలుగా మిగిలిపోతాయి.
‘…హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉన్న అంశాలను కుల వ్యవస్థ తనలో ఇముడ్చుకుంది…’ అన్న అవగాహనతో ఉన్న గుడవర్తి అజయ్, ‘ఆస్తి కలిగిన వర్గాలు, కులాలపై ప్రత్యక్ష దాడి కాకుండా సామాజిక స్వరూపాన్ని మార్చడానికి మరేదయినా మార్గం ఉందా?’ అన్న ఫ్రాంకెల్ ప్రశ్నకు జవాబు ఇంకా దొరకలేదని భావిస్తున్నారు. ప్రస్తుతం కులం పేరునా, మతం పేరునా జరుగుతున్న పాలక వర్గాల హింసను చారిత్రకంగా, రాజకీయంగా అర్థం చేసుకుంటే, మరో మార్గం లేదన్నది అర్థమవుతుంది. ‘‘…సమగ్రమైన సామాజిక స్వరూపం’ మొత్తాన్ని మార్చడం అంటే ఏమిటో మనకు నిజంగానే బోధపడిందా అన్న ప్రశ్న…’’కు జవాబు స్పష్టమవుతుంది. ప్రపంచంలో అనేక దేశాలలో వివిధ స్థాయిలలో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. వీటిల్లో కొన్ని తాత్కాలిక డిమాండ్ లతో జరిగేవి. మరి కొన్ని సమాజాన్ని మూలాల నుంచి మార్చివేసి నూతన సమాజాన్ని నెలకొల్పడం కోసం జరిగేవి. ఒక సామాజిక వ్యవస్థ ఉత్పత్తి సంబంధాల అభివృద్ధిపై ఆధారపడి ఉన్నదన్న మార్క్సిస్టు మౌలిక అవగాహనతో ఏకీభవిస్తే, దాని ఆర్ధిక పునాదిపైననే మానవ సంబంధాలు, రాజకీయాలు, విజ్ఞానం, సంస్కృతి, సమాజ యావత్తు అంశాలూ ఏర్పడి ఉంటాయన్నది అర్ధం చేసుకుంటాం. ‘సమగ్రమైన సామాజిక స్వరూపం’ అంటే ఇదే. దీనిని మార్చడం అంటే, మొత్తం సమాజాన్ని, అంటే, సమాజ పునాదిని వేళ్లతో సహా పెకిలించడమే, ప్రజల చేతుల్లో రాజ్యాధికారం నెలకొల్పడమే. ఇది మనిషి బుర్రలో నుంచి వచ్చిన ఆలోచన కాదు. సమాజ వర్గ పోరాట ఆచరణ నుంచి, ప్రపంచవ్యాప్తంగా వివిధ కాలాలలో, సామాజిక వ్యవస్థలలో ప్రజలు చేసిన పోరాటాల నుంచి వచ్చిన అనుభవం, అవగాహన. ఈ అవగాహనను అంగీకరించినప్పుడు, ఆస్తి కలిగిన వర్గాల పునాదిని, ఈ వర్గాలు ఒక దోపిడీ సాధనంగా ఉపయోగించుకుంటున్న కులాన్ని నిర్మూలించడానికి బల ప్రయోగం తప్పనిసరనేది అంగీకరిస్తాం.
‘ప్రజాస్వామ్యబద్ధమైన మార్పు’, ‘ప్రజాస్వామ్యబద్ధమైన మార్పుకు శ్రీకారం చుట్టిన చరిత్ర, ప్రజాస్వామిక ప్రక్రియలో చొరవతో ప్రారంభించబడిన మార్పులు’ అంటే ఏవి? ప్రస్తుత అధికార చట్రం ప్రజలకు ఉపకరించే విధంగా ఉన్న ‘ప్రజాస్వామ్య’మని భావించడం వాస్తవ విరుద్ధం. ఈ అస్పష్టత వల్లనే ‘సమగ్రమయిన సామాజిక స్వరూపంలో తప్పనిసరిగా మార్పు తీసుకురావలసిన అవసరం గుర్తించకుండా అసమగ్రంగా వచ్చిన మార్పును ఎత్తి చూపడమా?’ అన్న ప్రశ్న ఉత్పన్నమయింది. ఉన్న వ్యవస్థను ప్రశ్నించకుండా, దానిపై పోరాటం చేయకుండా నూతన వ్యవస్థ నిర్మాణం అసాధ్యమన్నది చరిత్ర పదే పదే రుజువు చేసిన సత్యం. సమగ్రమయిన సామాజిక స్వరూపంలో తప్పనిసరి మార్పు అంటే ఉన్న దానిని ధ్వంసం చేసి నూతన సమాజాన్ని నిర్మించడం. ఇటువంటి విధ్వంసం లేకుండా నూతన నిర్మాణం గురించి ఆలోచించడం ఊహాజనితం అవుతుంది. నూతన వ్యవస్థ ఏర్పడే క్రమంలో ఒక్కోసారి కూలిపోతుంది, తిరిగి నిలబడుతుంది, అంతిమంగా ప్రపంచమంతా నూతన వ్యవస్థ ఏర్పడినప్పుడే పూర్తి విజయం సిద్ధిస్తుంది. ఈ విషయాన్ని రాజకీయంగా అర్థం చేసుకున్నప్పుడు, ‘దేశం పరివర్తన చెందే ప్రక్రియలో భాగంగా ప్రజాస్వామ్యము, విప్లవ హింస ఒక దానిని ఒకటి అడ్డుకోకుండా పరస్పరం స్వీయ ప్రతిబింబాలుగా ఉంటూ ఒకదానికొకటి సహాయకారిగా ఉంటాయి అన్న వాదనకు కూడా తావుందా?’ అన్న ప్రశ్నకు తావుండదు. అలాగే, కార్మిక, కర్షక, పీడిత ‘ప్రజల’ను కేంద్ర స్థానంలో ఉంచి అర్థం చేసుకున్నప్పుడు, ‘సమాజ పరివర్తనకు సంబంధించి కీలకమయిన స్థానాన్ని గుర్తించడం, దానిపై దృష్టి కేంద్రీకరించడం ఎలా?’ అన్న ప్రశ్న ఉదయించదు. సమాజ పరివర్తనకు కీలకమైన స్థానం ఏంటో, దానిపై దృష్టి కేంద్రీకరించడం ఎలాగో ఇప్పుడు ఎవరూ కొత్తగా కనిపెట్టనవసరం లేదు. సామాజిక అభివృద్ధి క్రమంలో జరిగిన అనేక విప్లవాలు ఈ విషయంలో కావలసినంత అనుభవాన్ని, అవగాహనను మన ముందు ఉంచాయి. సమాజ పరివర్తనకు కీలకమయిన అంశం ‘అధికారం’. అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారిదే రాజ్యం. దోపిడీ వర్గాల చేతుల్లో ఉంటే వారి ప్రయోజనాలతోనే పాలన ఉంటుంది. శ్రమ చేసే ప్రజల చేతుల్లో ఉంటే ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది.
‘సంస్థాగతమైన మార్గాలకు మించి దృఢమయిన దారులను ఎన్నుకుంటే తప్ప విప్లవాత్మక మార్పు సంభవం కాదని ఈ ఎగిసిపడుతున్న అలలు చాలా నిస్సహాయంగా జ్ఞాపకం చేస్తున్నాయా?’ అన్న ప్రశ్నలో ‘సంస్థాగత మార్గాలు’ అంటే, విప్లవేతర మార్గాలు అనుకున్నా, వాటికి, విప్లవానికీ మధ్య సారూప్యతను చూడడం, ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమాన్ని, విప్లవోద్యమాన్ని ఒకే గాటన కట్టడం అర్థం లేనిది. సంస్థాగతమైన హింస కారణంగా స్పాంటేనియస్ గా పుట్టే ఆక్యుపై వంటి ఉద్యమాలకు, సైద్ధాంతిక అవగాహనతో జరిగే విప్లవానికీ మధ్య పోలిక లేదు. అయితే అటువంటి స్పాంటేనియస్ ఉద్యమాలన్నీ క్రమంగా, ఒక పద్ధతిలో అంతిమంగా విప్లవ రూపం తీసుకుంటాయి. దోపిడీ సంస్థాగతమైనదని అర్థం చేసుకున్నప్పుడు సంస్థాగత మార్గాలకు, విప్లవ మార్గానికీ మధ్య తేడా అర్థం చేసుకోవడం కష్టం కాదు. అలాగే విప్లవాత్మక మార్పు కోసం దృఢమయిన దారులే మార్గమని రుజువు చేస్తున్న పోరాటాలు గుర్తు చేస్తున్నది ‘నిస్సహాయంగా’ కాదు, బలమైన ‘విశ్వాసం’, ‘ఉత్సాహం’, ‘ధైర్యం’తో అని అర్ధం చేసుకోగలుగుతారు.
‘భారత రాజకీయ వ్యవస్థలో వివిధ రూపాలలో పాదుకొని ఉన్న హింసను కప్పి పుచ్చటానికి మావోయిస్టులను ఒక ప్రతీకగా ప్రజల ముందు నిలబెట్టడానికి ఉపయోగించుకుంది’ అని అంటూనే, ‘జాతివ్యాప్తంగా ‘పరిపాలన ఎదుర్కొంటున్న సంక్షోభం’పై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలను మావోయిస్టుల వలన జరుగుతున్న హింస అడ్డుకుంటున్నద’నడం ప్రస్తుత వ్యవస్థపై నమ్మకం ఉంచడము, ప్రత్యామ్నాయ మార్గాలను వస్తుగతంగా అర్థం చేసుకోలేకపోవడమూ. పరిపాలన ఎదుర్కొంటున్న సంక్షోభం ఏంటి? ఎందువల్ల వచ్చింది? వీటికి సమాధానం ఒకటే. దోపిడీ వ్యవస్థను నిలిపి ఉంచుకోవడానికి వచ్చిన సంక్షోభం. అందుకు అడ్డంగా ఉన్న ప్రజాయుద్ధాన్ని నిర్మూలించాలనుకున్నా సఫలం కాలేకపోవడం కూడా ఒక రకంగా దానికి సంక్షోభమే. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం కాదు, ఈ సంక్షోభం కారణంగా తమ జీవితాలలో ఇంకా ఇంకా పెరుగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించుకోవడం ప్రజల సమస్య. ఇది ఆచరణకు మార్గం. అదే విప్లవం. ఇదే విప్లవ దృక్పథం.
ఒక పక్క మావోయిస్టుల హింస కంటే ఎన్నో రెట్లు అధికంగా కులం, మతం ఆధారంగా హింస జరిగిందని అంటూనే ‘మావోయిస్టులు చేసే హింస ఇతర రకాలయిన హింస మరుగున పడేట్టు చేసింది’ అనడం ప్రతీఘాతుక రాజ్య స్వభావాన్ని స్పష్టంగా అర్థం చేసుకోకపోవడమే. విప్లవానికి, ప్రతీఘాత విప్లవానికి మధ్య తేడాను స్పష్టంగా అర్ధం చేసుకోకపోవడమే. ‘హింసకు ప్రజాస్వామ్యానికీ మధ్య ఉన్న సంబంధం అంతర్లీనంగా పరస్పరం వ్యతిరేకమయినప్పటికీ ఒకదానికొకటి తోడ్పాటునందించే విధంగా అవకాశం కల్పించింద’నడం హింసను, ప్రజాస్వామ్యాన్ని కలిపి ముద్ద చేసే ఒక అసంబద్ధమయిన విఫల, వ్యతిరేక యత్నం. ఇటీవల మణిపూర్ లో జరిగిన పరిణామాలు ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాకు, భాజపా దానిని అమలు చేస్తున్న విధానానికి స్పష్టమైన నిదర్శనం. ఇప్పుడు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు, ఫ్యూడల్ దృక్పథంతో జరుగుతున్న అమానవీయ ఘటనలు, వాటిలో ఇమిడి ఉన్న మానసిక, సామాజిక వికృతత్వం కేవలం ఒక రాజకీయ విధానం కాదు. అది ఒక భావజాలం. నేటి పాలక వర్గాలు అమలు చేస్తున్న హింసకు పునాదిగా ఉన్న ఈ భావజాలం రెండున్నర వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన బ్రాహ్మణీయ హిందుత్వ చాతుర్వర్ణ వ్యవస్థలో ఉంది. దీనిని సమూలంగా పెకిలించకుండా కనీస మార్పునయినా ఆశించడంలో అర్థం లేదు.
ఈ పుస్తకంలో ఉన్న మరొక ముఖ్యమైన అంశం ‘పార్టీ సాయుధ మార్గమే ప్రధానమని నమ్ముతుంది, దాని కారణంగా ప్రజాదరణ పొందిన ఆ కార్యక్రమాలను కొనసాగించలేకపోయారు’ అన్నది. అమెరికాలో ఆర్.సీ.పీ., యూఎస్ఏ నుంచి విడివడి ఏర్పడ్డ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ యూనియన్ (ఎంసీయూ) పత్రిక ‘రెడ్ పేజెస్’ 3వ సంచికలో గొంజాలోయిజం గురించిన వ్యాసంలో పెరూ కమ్యూనిస్టు పార్టీ సైనికానికి ఇచ్చిన ప్రాధాన్యతను విమర్శిస్తూ, భారత మావోయిస్టు పార్టీకి సరైన అవగాహన ఉన్నదంటూ ఇలా రాసారు –
“…around 80% of the work done by the Party and the Peoples Liberation Guerrilla Army (PLGA) is non-military. These including the PLGA engaging in productive activity (e.g. helping to reclaim wasteland, harvesting forest produce, etc.) as well as mobilizing the masses, doing educational work, distributing goods to the masses displaced by the counterrevolution, and more. During their trip to Dandakaranya, Gautam Navlakha and Jan Myrdal were told that without these activities, military action would cease to carry much weight or be able to sustain popular support…”
పార్టీ పట్ల వారి అధ్యయనానికి, అవగాహనకు వారికి ఉన్న వనరు పార్టీ బహిరంగ డాక్యుమెంట్ లు, పార్టీపై వారు ఉల్లేఖించిన వారి వంటి మేధావుల రిపోర్టులు, అధ్యయనాలే.
నీరా చందోక్ వ్యాసంలో మావోను ఉల్లేఖిస్తూ, సాయుధ పోరాటంలో ఆయుధాలు నిర్ణయాత్మకమైనవి కాదు, ప్రజలే ముఖ్యం అని అన్నారు. ‘గెరిల్లా యుద్ధ కార్యక్రమాలు వాటికవే స్వతంత్రమైన పోరాట రూపాలు కావు. అవి మొత్తం యుద్ధంలో ఒక దశ మాత్రమే. అవి విప్లవ పోరాటంలో ఒక పార్శ్వం మాత్రమే’ అన్నారు. పార్టీ అవగాహన ఇదే. ‘క్షేత్ర స్థాయి కార్యకలాపాలు నిర్వహించిన బేలా బాటియా’ను ఉల్లేఖిస్తూ, ‘విముక్తిని వాగ్దానం చేసిన పోరాటం స్వాతంత్ర్యం పూర్తిగా అనుభవించలేని స్థితికి ప్రజలను నెట్టివేయడమేమిటని…వాపోయారం’టున్నారు. ‘అజ్ఞాతంలో ఉన్న పార్టీ కార్యకర్తలు చేపట్టే చర్యలకు చట్టబద్ధంగా బయట పని చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు మూల్యం చెల్లించి రావడం కూడా పలు సమస్యలకు దారి తీస్తున్నది. వారు చేపట్టే చర్యలు ప్రజల తరఫున చేస్తున్నట్టు చెబుతున్నారు. కానీ ప్రజలకు తెలిసి గానీ, ప్రజల అంగీకారంతో గాని ఆ పనులు చెయ్యడం లేదు. హింసను ఉపయోగించడం వల్ల భారీ నష్టం వాటిల్లిందని బేలా బాటియా తన బాధను వ్యక్తపరిచారం’టున్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. వాటి మాట ఎలా ఉన్నా, తాను భావించిన విధంగా ఆదివాసులకు అండగా నిలుస్తున్న బేలా వంటి సామాజిక కార్యకర్తలు, ఒక లోతైన రాజకీయ కార్యాచరణను విశ్లేషించే ఆసక్తి కలిగిన నీరా చందోక్ వంటి మేధావులు, మావోయిస్టు పార్టీ కార్యాచరణను మరింత లోతుగా తరచి చూస్తే బాగుంటుంది.
నీరా చందోక్ రాసిన మొత్తం వ్యాసం కూడా వాస్తవాలు తెలియకుండా, తెలుసుకోకుండా రాసినదే. విముక్తి కోసం పోరాటం చేస్తున్నందునే ప్రజలకు ఈ మాత్రమన్నా ఊపిరి ఆడుతున్నది. వారి పోరాటానికి తగినంత స్వాతంత్ర్యం అనుభవించలేకపోవడానికి కారణం రాజ్యమే. అలాగే ప్రజలు లేకుండా పార్టీ లేదు, వారి ఆదరణ లేకుండానే కాదు, వారి భాగస్వామ్యం లేకుండా పార్టీ గానీ, పీఎల్ జీఏ కానీ, ప్రజా సంఘాలు గానీ, విప్లవ ప్రజా ప్రభుత్వాలు గానీ లేవు. ఈ వాస్తవం నీరా గారు తెలుసుకోవాలి. పార్టీ చేసే ఏ పనీ కూడా ప్రజలకు తెలియకుండా, వారి ఆమోదం, అభిప్రాయం లేకుండా చేయడం లేదు. కాబట్టి, ఈ అభిప్రాయాలు తప్పు. వాస్తవాలపై ఆధారపడి చేసే సూత్రబద్ధ విమర్శలు విప్లవోద్యమానికి ఎంతో దోహదం చేస్తాయి. అలా చేయడం ద్వారా సమాజంలో ‘ప్రజాస్వామ్యం’, ‘హింస’ గురించిన అవగాహన కూడా పెంపొందుతుంది. ప్రభుత్వం ఆదివాసుల కోసం ఏం చేస్తే బాగుండేదని చర్చిస్తూ, విద్యా, నీటి పారుదల సౌకర్యాలు, మహిళల సమస్యలు చేపట్టడం, భాషాభివృద్ధి గురించి రాసారు. ప్రభుత్వం ఈ పనులు చేస్తుందా? చెయ్యదు. నిజానికి, ప్రభుత్వం ప్రజా దృక్పధం కలిగి ఉండి, ఈ పనులన్నీ చేసే విధంగా ఉంటే మావోయిస్టు ఉద్యమ అవసరమే రాదు కదా. పార్లమెంటరీ మార్గం ద్వారా కాలం చెల్లిన భారత అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థలో ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మినప్పుడు, విప్లవ మార్గంలో అన్నీ తప్పులే కనిపించడం సహజం. ప్రజల ప్రజాస్వామ్యం అవసరం అంటూనే, ‘ప్రజాస్వామిక ప్రభుత్వం, విప్లవకారులు ప్రజలను అందుకు దూరం చేసాయ’నడం అసలు ప్రజల ప్రజాస్వామ్యం అంటే ఏంటో, దానికి మార్గం ఏంటో అన్న విషయంలో అస్పష్టత నుంచి వచ్చినదే. ఈ అస్పష్టత విశ్లేషణా పద్ధతి, అందుకు వనరుల ఎంపికలో ఉంది.
హింస లేకుండా సామాజిక మార్పు వస్తే బాగుండునన్నది ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాలలో ప్రధానమైన అంశం. ఇలా ఆశించే ముందు సమాజంలో ఉన్న హింసకు పునాదిని గుర్తించాలి. ఆ పునాదిని ధ్వంసం చేయకుండా హింస ఆగదు. హింస ఆగకుండా ప్రజలకు శాంతి లభించదు. హింసను రూపుమాపగలిగేది ప్రజా దృక్పథం నుంచి చేసే హింసనే. యుద్ధాన్ని యుద్ధంతోనే నివారించగలం, హింసను ప్రతిహింసతోనే ధ్వంసం చేయగలం.
విప్లవపార్టీ స్పష్టమైన సిద్ధాంతం, కార్యక్రమం, రాజకీయ పంథా, లక్ష్యం, నిర్మాణాలతో ప్రజలలో పని చేస్తున్నది. ఈ విశాల దేశంలో ప్రస్తుతం విప్లవోద్యమ రాజకీయ ప్రభావంలో ఉన్న ప్రాంతం భౌతికంగా తక్కువే. అయితే దీని అర్థం విప్లవోద్యమం ఎప్పటికీ ఇతర ప్రాంతాలలో వేళ్లూనుకోదని కాదు. నిజానికి విప్లవ పార్టీ శత్రువుకు రహస్యంగా ఉంటేనే తన లక్ష్యం సాధించగలుగుతుంది. పార్టీ కార్యక్రమాలలో బహిరంగంగా అర్థమయ్యే వాటి కంటే అర్థం కానివే ఎక్కువ ఉంటాయి. కాబట్టి పైకి కనిపించే వాటిని బట్టి మాత్రమే విప్లవోద్యమం బలాన్ని, బలహీనతనూ నిర్థారించడం తప్పవుతుంది. నిర్బంధం కారణంగా కొన్ని ప్రాంతాలలో బలహీనపడినా, తిరిగి వేరే పద్ధతులలో పనిని కొనసాగిస్తుంది. వ్యవసాయ సంబంధాలలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఎత్తుగడలలో చేసుకోవలసిన మార్పుల గురించి విప్లవోద్యమం ఇటీవలి సంవత్సరాలలో ‘భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలలో మార్పు-మన రాజకీయ కార్యక్రమం’ అన్న డాక్యుమెంట్ ను రూపొందించుకుంది. ఆయా ప్రాంతాలలో ఆయా మార్పులకు అనుగుణంగా సృజనాత్మకంగా కార్యక్రమాలు చేపట్టే క్రమం మరింతగా పురోగమిస్తున్నది. భూమి సరుకుగా మారి, వ్యవసాయేతర పనులు అధికం అయినప్పటికీ భూసంబంధాలలో మౌలిక మార్పు రాలేదని, భారతదేశంలో గణనీయమైన మార్పులు జరిగినప్పటికీ, ఇప్పటికీ అర్ధవలస, అర్ధభూస్వామ్య దేశంగానే ఉన్నదని స్పష్టమైన అవగాహన. దోపిడీ వ్యవస్థను కూల్చివేసి నూతన ప్రజాస్వామిక, విప్లవ ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పే క్రమంలో ఓటమి, విజయం, మళ్లీ ఓటమి, మళ్లీ విజయం…, అంతిమంగా విజయం పొందుతామని విప్లవోద్యమం విశ్వసిస్తుంది. సమాజంలో, మనిషి జీవితంలో ఉండే ఎగుడు దిగుడులు, ఒడిదుడుకులూ విప్లవ కార్యాచరణలోనూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ పురోగమించే శక్తి విప్లవోద్యమానికి ఉండాలి, ఉంటుంది.
విప్లవోద్యమం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించిన సమాచారం ప్రపంచమంతటికీ అందడం లేదన్నది నిజమే. మీడియా ద్వారా గెరిల్లా సైనిక చర్యలు మాత్రమే ప్రచారం అవుతున్నాయి. ప్రజలకు ప్రత్యామ్నాయ జీవన మార్గం చూపిస్తూ, నడిపిస్తున్న విప్లవోద్యమం పట్ల గురించి తప్పుడు ప్రచారాలు చేయడం పాలక వర్గాలకు, వాటికి కొమ్ము కాసే మీడియాకు అవసరం. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ప్రచార హోరులో కొట్టుకుపోయినవాళ్లు నిజాలు తెలుసుకోలేరు. మరో పక్క, అటవీ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ వనరులను సామ్రాజ్యవాదులకు కట్టబెట్టేందుకు చేసుకున్న ఒప్పందాలను అమలు పరచడం కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై, వారికి నాయకత్వం వహిస్తున్న విప్లవ పార్టీపై సైనిక నిర్బంధ దాడి అమలు చేస్తున్నాయని దేశ, విదేశాలలో అనేక మంది ప్రజల శ్రేయోభిలాషులు మాట్లాడుతున్నారు. ఇది ‘ప్రజలపై యుద్ధం’ అని స్పష్టంగా చెబుతున్నారు. అయితే, విప్లవోద్యమం వైపు నుంచి జరుగుతున్న సిద్ధాంత, రాజకీయ, సాంస్కృతిక, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దాంతో పాటుగా విప్లవోద్యమ విమర్శకులు అందుబాటులో ఉన్న సాహిత్యం నుంచి విప్లవోద్యమ కార్యాచరణను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నం చేయడం అవసరం. భూమిపై గట్టిగా నిలబడితేనే గాలి తాకిడికి తట్టుకుని భూపరిమళాన్ని ఆస్వాదించగలుగుతారు. వస్తుగత వాస్తవాలను అర్ధం చేసుకుంటేనే జరుగుతున్న పరిణామాలను అర్ధం చేసుకోగలుగుతారు. ‘ప్రజాకర్షక ప్రజాస్వామ్యాలకు, విప్లవ కార్యాచరణకు మధ్య భవిష్యత్తులోనయినా కలయిక ఉంటుందని ఆలోచించడం విప్లవోద్యమాలలో, జనజీవన స్రవంతి ప్రజాస్వామ్య వ్యవస్థలో నిమగ్నమైన రాజకీయ విశ్లేషకులకు, సిద్ధాంతకర్తలకు, కార్యకర్తలకు ఊరట కలిగిస్తుంది’ అన్నది అంతిమంగా ఈ పుస్తకం వ్యక్తం చేసిన ఆకాంక్ష. ‘ప్రజాకర్షక ప్రజాస్వామ్యం’ అంటే బూర్జువా ప్రజాస్వామ్యమే అయితే ఈ కలయికను ఆశించడం తప్పు. సంస్కరణ, విప్లవం పరస్పరం భిన్నమైనవి. సంస్కరణ సంస్కరణగానే మిగిలిపోతుంది. ప్రజలకు తాత్కాలిక ఉపశమనం ద్వారా జీవితంలో మౌలిక మార్పు రాదు. చాలా సందర్భాలలో అది ఉపశమనంగా కూడా ఉండదు. తమ భూమి మీద, తమ ఉత్పత్తి సాధనాల మీద, తమ జీవితాల మీద తమకు హక్కు ఉన్నప్పుడే ప్రజలు సంతోషంగా ఉండగలుగుతారు. అందువల్ల విప్లవోద్యమం ప్రజలకు హక్కులు లేని, దోపిడీ, పీడనలు మాత్రమే ఉన్న ఈ వ్యవస్థను మార్చాలంటుంది. ఎన్నికల బహిష్కరణ విప్లవ వ్యూహంలో ఒకానొక ప్రాధాన్యతా అంశమన్నది విప్లవోద్యమ అవగాహన. ప్రజల ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. రష్యా, చైనా విప్లవాలు, కొన్ని దేశాల్లో సోషలిజం విఫలం అయినంత మాత్రాన ప్రజా రాజ్యాధికారం ‘ఉటోపియా’ అయిపోదు. ఇది సుదీర్ఘ, చారిత్రక, భౌతిక క్రమం. దీనిని కాదని, మధ్యేమార్గం గురించి మాట్లాడుకోవడం ఆచరణ సాధ్యం కానిది, ఊహాజనితమైనదే కాదు, ప్రజా వ్యతిరేకమైనది, తిరోగమనపూరితమైనది.
మా సత్యం
ప్రజా దృక్పథం లేని ‘భిన్న దృక్పథాలు’—-నర్మద
సమీక్ష వ్యాసం లోతైన విశ్లేషణాత్మకమైన సమీక్ష వ్యాసం.
“యుద్ధాన్ని యుద్ధంతోనే నివారించగలం, హింసను ప్రతి హింసతోనే ధ్వంసం చేయగలం.” అనే అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తూ….